పుట:ఆముక్తమాల్యద.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గా వనమాలి సేవయెడఁ గాంక్ష నొదుంగక కల్లతెల్వితో
నే వలపంత దాఁగఁ జరియించిన దాఁగమిఁ జూచి నెవ్వగన్.

155


క.

పుత్త్రియుఁ దాఁ గామిని నొక
పుత్త్రియు నట్లుండుటకు నబుద్ధేక్షు ధనుః
పత్త్రియగు విష్ణుచిత్తుఁ డ
పత్త్రప లే కదియు నేతపంబో యనుచున్.

156


వ.

తలపోసి దినదినప్రవర్ధమానతనయాతనుగ్లాని కత్యంతదుఃఖితుండై
తత్కారణం బెఱుంగక వల దాని మౌగ్ధ్యంబున వారించి చూచి యంత కంత
కగ్గలం బగుడు గుడికిం జని పూజాంతిమనమస్కరణానంతరంబున, దన
మనోనిర్వేచనం బన్నగరి వెన్నునకు విన్నవింపం బునర్నమస్కృతిం జేసి
"దేవా దేవరదాసి యగు మదీయపుత్త్రి యేమి గుఱించియో విచిత్రంబగు
ప్రతిచర్యం గాత్రశోషంబు సేయుచున్నది. వల దన్న విన, దపుత్త్రకుండ
నగునాకుఁ బుత్త్రియైనను బుత్త్రకుఁడైనను దాన, యే నేమి సేయుదు; మఱి
తన తపశ్చర్యతెఱంగు మా తపశ్చర్యతెఱంగు గాదు, ఏము భవద్దివస భవ
జ్జనిదివస రాత్రులం దక్క గణరాత్రజాగరంబు లెఱుంగ, మేము బిసబీజాక్ష
వలయంబులు దక్క బిసవలయంబు లెఱుంగ, మేము ప్రసాదకుసుమంబుఁ
జెవిఁ జెరుపుటఁ దక్క నవి గప్పుకొన నందు శయనింప నెఱుంగ, మేము
చెంబుల భవత్తీర్థఁబు గ్రోలినఁ దా నంగంబులు దడిపికొను, మేము చాంద్రా
యజంబులఁ జంద్రవృద్ధిఁ బడిఁ గడియెక్కించినఁ దా డించు, నేము నిదిధ్యాన
నిశ్వాస నిరోధంబు నేవనం దాఁ దనదశ వెలికి నిగిడించు, నేను చిన్ముద్రకై
హృదయంబునం గేలు సేర్చినం దాఁ గపోలంబునం జేర్చు. వల్కలోత్త
రీయంబు లేము వహించినం దాఁ గిసలయోత్తరీయంబులు వహించు, నేము
సితపక్షనూత్నేందుఁ గీర్తించినం దాఁ బూర్ణేందు నుపాలంభించు; నిట్లుగా
బ్రవర్తిల్లుచున్నయది; యిది యేటితరం బున్మాదంబు గానోపు, నెంత భవదీయ
భక్తి గలిగిన మాదృశులకుఁ బ్రకృతిసంబంధంబు విడువ; దంతర్యామివి
నీ వెఱుంగని యది లేదు; దీని తెఱంగెఱింగింపవే;" యనపుడు, ననుకంపా
తిశయంబునఁ దచ్ఛాందసంబునకు మందస్మితంబు సేసి మందరధరుం
డిట్లనియె.

157