పుట:ఆముక్తమాల్యద.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

క్షమఁ గుఱుమన్నెపుం గహనచారి జనంబెడ దోషదృష్టి కు
డ్యము గడుంగంగఁ బూన్కి; దెగ దల్గిన సర్వము; బాస నీగి వ
శ్యముగ నొనర్ప దాడి కగు; నౌ గడి కొల్లలకు; న్శతాపరా
ధమును సహస్రదండము నతర్క్యము సర్వము నేలువానికిన్.

257


తే.

సింధుర మహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
దీవి వణిజుల కూళ్ళు సద్గృహములు పురిఁ
గొలుపుఁ దేజంబు వెల మేలు గలుగఁ బ్రాఁత
వారిఁగాఁ జేయు మరి నవి చేరకుండ.

258


తే.

గడి నృపులరాయబారులయెడఁ గొలువున
సరసల్లావములు రాజు సలుపవలయుఁ;
గార్యఖడ్గము లనుచరు ల్గానఁ బలుక
వలయు; నవి మైత్రిఁ దాఁ దేలఁ బలుకవలయు.

259


తే.

తా నవంబుగ దొరఁజేయువాని మంత్ర
మునకు వేగమె లోఁజేయఁ జనదు; వాఁడు
క్రొత్తమన్నన రహి ననుఁగులకుఁ జెప్ప,
నయిన నది చెడు, మఱి వాఁడు నడఁగుఁ గాన.

260


సీ.

హితబహుశ్రుతధర్మరతశూరతాన్వపూ
                   ర్వతల మన్ద్విజుల దుర్గముల నిలిపి,
పులిజున్ను మొదలుగాఁ బురుషాయుషావధి
                   కం దుండ సవరణ ల్పొందుపఱిచి,
చీమంత యైనను సామంతకోటికి
                   మిత్రము దప్పక యుండ క్షితు లొసంగి,
యాయాధికవ్యయా నధికంబునుం బ్రజా
                   విరుజంబుఁ గాఁగ బండరువుఁ గూర్చి


తే.

క్షీణరిపుధాత్రిఁ జరదృష్టిచేతఁ జూచి,
బకహఠగతి గ్రహించి, తాఁ బ్రజయు నొవ్వ
కయ పగఱగాత్రములనె చీకాకుపఱుచు
నృపతి డెంచానఁ జేయిడి నిద్రవోవు.

261