పుట:ఆముక్తమాల్యద.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సేయవలయు నను తలం పవ్విప్రకుమారునకుం బుట్టింప; నతం డేఁగి నానా
దేశాగతదీనానాథవృద్ధభూసురకుటుంబంబులకు ధాన్యాజినపటాదులు, వటువు
లకుం బెండ్లిండ్ల, కనుపనీతుల కుపనయనంబులకుఁ, బంగ్వంధబధిరాదులకు
సౌరభేయాదియానంబులు; మఱియుఁ జెఱువు గడమపడియె ననియు, బేద
గుడులకుఁ బూజ నడువ దనియు, నెడవునం జలిపంది రిడియెద మనియుఁ,
దిథి చిక్కు ననియుఁ, తీర్థయాత్రఁ జనియెద మనియను, వ్రతోద్యాపన కని
యును, వ్యాధి మన్పుకో ననియును, జెప్పి పంప, నారాణివాసంబు గుప్తాగుప్త
ప్రకారంబులం బంపుద్రవ్యంబుఁ దెచ్చి యిచ్చు ముదుస ళ్ళగువర్షధరులచేతు
లకుం గ్రందుకొని చే సాఁచిన సందిటితోరణంబులై తోఁచు నేకదండి త్రి
దండి బ్రహ్మచారుల యున్నమితదండంబుల నిండారు కాషాయకద్రువస్త్ర
కౌపీనపరంపరలం గ్రమ్మి, కావళ్ళవడగలజాడఁ గొని, కార్పణ్యంబ విద్యగాఁ
దక్కినవిద్య లెఱుంగక వేఁడు నీదృగ్విధానేకప్రాణుల కాధారంబగు పడ
మటిద్వారంబుఁ జేరి, ప్రతిదినాస్మత్పాదభజన కథాశ్రుతపూర్వ యగు నా
యుర్వీధవుదేవి కాశీర్వచనాక్షతంబులు దౌవారికమఖంబునం బంపి: 'వైదేశీ
కుండ, వైష్ణవవటుండ, వాది గలిగిన విష్ణుతత్త్వంబె పరతత్త్వం బని
వాదించి గెలిచెద, వసుధావరుండు విష్ణుభక్తివిముఖుండు, గావున వైష్ణ
వునిమనవి విన్నవింప నెవ్వారు వెఱతురు; నీవుభక్తిపరాయణవు, పతి
హితాచారవుం గావున నీకు విన్నవించి పంపితి; నీవిభుఁడు నీకు విధేయుండు,
విన్నవించి నన్ను రప్పించి వాదంబు సేయింప నోపుదేని వాదించి గెల్చి,
నీదుభర్తకు భగవద్భక్తి బుట్టించి కృతార్థుం గావించెద' నని విన్నవింపం
బంచిన.

53


తే.

గ్రీష్మసమయనిరుత్సాహకేకిరమణి
నవఘనధ్వని కలరుచందమున నలరి,
యేకతమ నర్మగోష్ఠిఁ బ్రాణేశుతోడ
నతని విధ మెఱిఁగింప, నిట్టట్టు వడుచు.

54


క.

భూవల్లభుఁ "డెట్టెట్టూ!
తా వాదము సేసి శివమతంబు జయింపం
గా వచ్చెనొ? చూతముగా,
రావింపు" మటన్న నాఁటిరాత్రి చనంగన్.

55