పుట:ఆముక్తమాల్యద.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దికిఁ గయివ్రాలు తత్సలిలనిర్మలధార నధఃపరిస్ఫుర
త్ప్రకృతికి నీ యజాండమునె బంగరు ముంగఱఁగా నొనర్పవే!

21

నృసింహమూర్తి

మ.

అసురేంద్రాశయకుండికాచ్ఛరుధిరవ్యాప్తస్వకచ్ఛాయఁ గాం
చి, సముద్యత్ర్పతిసింహమత్సరమిళచ్చేష్టన్ దదుద్ధామదీ
ర్ఘసటాఝాటముఁ బెల్లగించుగతి నాంత్రశ్రేణిఁ గిన్కన్ వెరం
జు సితక్రూర భవన్నఖావళులు ప్రోచు న్మర్త్యపంచాననా!

22


ఉ.

మునుము న్దెల్పును, దూఱదూఱ మఱి కెంపు, న్వెండియుం దూఱఁ గం
దనగాయం గలనల్పుఁ, డోఁప నఖకోణశ్రేణిచే విక్రమం
బున వాఁ డుగ్రతఁ గొన్నయట్టి విలసన్మూర్తిత్రయీతేజముం
గొనులీల న్విదళింపవే యసురవక్షోభిత్తిమిథ్యాహరీ?

23

వామనమూర్తి

మ.

బలిదైతేయ భయాంధకారభరిత బ్రహ్మాండగేహంబులో
పలఁ బై మండెడి తత్ప్రతాపమయదీపజ్వాల డిందన్, గడుం
దలమై మింటికి గ్రక్కున న్నెగయు నుద్యత్తన్మహాచ్ఛాయ నాఁ
గల నీలాంగము శింశుమార మొరయంగాఁ బెంపవే వామనా!

24

పరశురామావతారము

మ.

శమితక్షత్త్రకళత్రనేత్రజలవర్షావేళ నీ కీర్తిహం
సము క్రౌంచస్ఫుటతావకాంబకసుషిం జాఁగంగ నీక్షించి, వ
ర్షము రా నంచలు నంద నేఁడుఁ జను నిచ్చ న్నాటి తచ్చేష్ట వా
యమిఁ; దిర్యక్తతి దా గతానుగతికం బౌఁగా కుఠారీ! హరీ!

25

శ్రీరామావతారము

మ.

పవిధారాపతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా
తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా, సప్త సా
ల విభేదం బొనరించి నిల్వక సలీలన్ జన్న యుష్మన్మరు
జ్జవనాస్త్రం బొసగున్ సిరుల్ రఘుకులస్వామీ! రమావల్లభా!

26