పుట:ఆముక్తమాల్యద.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

పురోహిత ప్రధానుల నప్రాప్తయౌవనుం డగు నతని వినీతుఁగా మెలసి
కొం డని నియోగించి; వారల దానసమ్మానాదులం బ్రోపు మని కుమారు
నకు నప్పగించి; గోవిందచరణారవిందవిన్యస్తమానసుండై ఖాండ్యిక్యుం
డుభయకర్మంబు లుడివి; యవ్వనంబ తపోవనంబుగాఁ గొంతకాలంబు
కేశిధ్వజోపదిష్టభక్తియోగాసంధానంబున మధుమథనసాధర్మ్యంబు నొందెఁ..
గేశిధ్వజుఁడును దత్పుత్త్రునిఁ దత్ప్రధానులఁ దదీయరాజ్యపరిపాలన కనిచి,
మగిడి మిథిలాపురంబు ప్రవేశించి, యోగాశ్రయుఁడై భోగంబులం బుణ్యం
బులు, తదితరంబులు దురితంబులు, ప్రక్షీణంబులుగా క్షోణితలం బేలుచుండెం;
గావున ముముక్షున కుపాశ్రయణీయుం డధోక్షజుండు; పాండ్యక్షితీశా, నీ
వతని భజియింపు, మిదియె భక్తియోగంబు. దీనియందు నొక్క కొఱఁతగల
దంతరాయంబు నొందినఁ బునర్భవంబుఁ బొందించి మఱి ముక్తిఁ జేర్చు.
నట్లగుట నింతకంటే సులభోపాయం బాయోధనంబున నయ్యధోక్షజుండు
గాండీవి కుపదేశించిన శరణాగతధర్మంబ నిరపాయధర్మం.” బని పరిణతాంతః
కరణుం డగు నతనికి మూలమంత్రపూర్వకంబుగా ద్వయము ప్రసాదించి
భాగవతప్రధానుం గావించిన.

89


మ.

వకుళాలంకృతయోగిహృల్నిలయ, భాస్వత్పాండుభాస్వన్మయాం
బక, నాభీజలజాతనూత విధి సంప్రాప్తస్మరారిష్ట, ము
ష్టికఠోరార్పణ కర్కటీఫలిత కేశి క్రూర రక్షోంగకా,
కృకవాకుధ్వజ దీర్షికాప్లవ తప క్రీడోత్సవాద్యత్సుకా.

90


క.

ఊరీకృతపాండవరథ
సారథ్య! సయూథ్యగోపశాబకసహ కే
లీరత! భక్తప్రహ్లా
దారచితస్తోత్రపులకితాంచితగాత్రా!

91


స్రగ్విణి.

ఆస్థితాహీంద్రశయ్యా, దవీయస్తర
ప్రస్థితాంఘ్రీ, శ్రితవ్రాతచేతోఘదా
కస్థలప్రస్పృశత్కాళియక్ష్వేళమూ
ర్ధస్థలీనృత్తమత్తల్లిహల్లీసకా!

92