పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పాదాంగచూడామణియందు
చ.

గుణములకెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్నదు
ర్గుణగణదోషముల్ చెఱచుఁ గోరినవస్తువినూత్నరత్నభూ
షణముల నిచ్చుఁ గావున లసత్కవిశేఖరు లెంచు సర్వల
క్షణములు గల్గి యొప్పు బుధసన్నుతమైనగణంబు శంకరా.

98
కవిసర్పగారుడమున
మ.

పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ
జ్యరమాసంతతు లీగి లబ్ధము నిజోపాంతస్థదుష్టాక్షరో
త్కందోషాఢ్యగణౌఘధూర్తగుణముల్ ఖండించుటల్ శీల మె
వ్వరికిన్ గాదనరాదు నా నగణ మవ్యాజస్థితిన్ బొల్పగున్.

99


వ.

నగణము సర్వోత్తమము గనుక దానికి గ్రహతారాయోనిగణరసజాతులు చూడ
నక్కరలేదు.

100
చమత్కారచంద్రికయందు

“ధనాకర స్సర్వలఘు ర్నగణో బ్రాహ్మ్యదైవతః”.

101
సాహిత్యచంద్రోదయమున

“నగణస్య సమీపస్థో దుర్గణ శ్శుభదో భవేత్,
అయః కాంచనతా మేతి వివర్ణ స్స్పర్శవేదినః.”

102
కవికంఠపాశమున

“పర్వతానాం యథా మేరు స్సురాణాం శంకరో యథా
మృగాణాం చ యథా సింహో గణానాం నగణ స్తథా.”

103
భీమనచ్ఛందంబున
క.

ఏగణముఁ గదియు నగణం, బాగణము సమస్తమంగళావ్యాప్తం బై
రాగిల్లు నినుము పరుసపు, యోగంబునఁ బసిఁడివన్నె నూనినమాడ్కిన్.

104
ఉత్తమగండచ్ఛందంబున
క.

చందనతరుసంగతిఁ బిచు, మందంబును బరిమళించు మాడ్కి నమందా
నందకర మైననగణము, పొందున దుష్టగణవర్ణములు శుభ మొసఁగున్.

105
అథర్వణచ్ఛందంబున
గీ.

పర్వతములందు మేరువుభాతి యగుచు, సర్వసురలందు శంకరుచంద మగుచు
నరయ మృగములయందు సింహంబు కరణి, గణములం దెల్ల నగణంబు గరిమఁ గాంచు.

106


వ.

అని నగణ మన్నిగణములకు శ్రేష్ఠముగాఁ జెప్పఁబడినది.

107