పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఆంధ్రదేశ" మని పేరుపెట్టినపుడు అందు నివసించుచుండిన అన్ని కులములకు చెందిన ఆర్యులును, అందుండిన దస్యుజాతివారలును, బాహ్యశాఖీయు లాదిగాగల జనసమూహ మంతయు "ఆంధ్రజాతీయులు" లేక "ఆంధ్రులు" అని పిలువబడిరి. వారు మాట్లాడుచుండిన ప్రాచ్యకభాషలలో నొకటియగు తెలుగుభాష "ఆంధ్రము" లేక "ఆంధ్ర భాష" యని పిలువబడజొచ్చినది. వేదభాషయైన దేవనాగరిభాషనుండి సంస్కృతమును అందుండి ప్రాకృతభాషయు, ప్రాకృతమునుండి వికృతినొంది తెలుగు మొదలగుగాల వివిధ రాష్ట్రభాషలును ఉద్భవించినవి. ఈతెలుగే కాలక్రమమున ఉచ్చారణలోను, వ్రాయు లిపిలోను చాలమార్పులను చెంది చివరకు "ఆంధ్రము" అనెడి దేశనామమును కూడ గ్రహించినది. తెలుగు, ఆంధ్రము వేఱువేఱు భాష లనెడి వాదమునకు తావు లేదు.

ఆంధ్ర రాజు కాలము

ఇప్పడు జరుగుచుండిన సృష్టి ప్రారంభమై నేటికి (అనగా కలి 5054 సంవత్సరమునకు) నూటతొంబది యైదుకోట్ల యేబదియెనిమిది లక్షల యెనుబది యైదువేల యేబది నాలుగు సంవత్సరములు గడిచినవి. ఈ కాలములో అంతర్భాగములుగా ఆఱు "మనుకాలములు" గతించినవి. అందు మొదటిది 'స్వాయంభువ' మను కాలము. రెండవది 'స్వారోచిష' మూడవది 'ఉత్తమ' నాలుగు 'తామస' ఐదు 'రైవత' ఆఱు 'చాక్షుష' మనుకాలములను పేరుగలవి గతించినవి. ఏడవదగు వైవస్వత మనుకాలమున ఇప్పుడు మన ముండియుంటిమి. ఈవైవస్వత మను కాలములో ఇరువదియేడు మహాయుగములు గతించినవి. (ఒక్కొక్క మహాయుగము 43,20,000 సంవత్సరములకాలము) ఇరువది యెనిమిదవ మహాయుగములో కృత, త్రేతా, ద్వాపరయుగములు మూడు (38,88,000 సం) ను గతించినవి. మనమిప్పుడు ఇరువది ఎనిమిదవ కలియుగములో 5054 సంవత్సరములు గడచి 5055 సంవత్సరములో నుంటిమి. ఏడవ మనుకాలములోని ఇరువదినాలుగవ మహా