పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. కాబట్టి ముమ్మరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించి, వివిధ స్థాయిల్లో కూలంకషంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు చెందిన ముఖ్య రంగాల్లో 7 మిషన్‌లను నెలకొల్పాలని నిర్ణయించింది. ఆ మిషన్లు వార్షిక ప్రణాళికల్లో స్వల్పకాలిక, మధ్యకాలిక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను మేళవించి, ఒక నవీన అభివృద్ధిశకానికి దారితీయనున్నాయి. ప్రతి ఒక్క మిషన్ కూ స్పష్టమైన తార్కికనిర్మాణం, నిర్దిష్ట ఫలితాల నిర్వచనం ఉంటాయి. ప్రతి మిషన్ కీ లక్ష్యాలు, కార్యక్రమాలు, కాలవ్యవధి, మైలు రాళ్లు, ఆశించిన ఫలితాలు స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఆ మిషన్లకు కొన్ని నిర్దిష్ట కార్యక్రమాల అమలుకోసం మరికొన్ని సబ్-మిషన్లు కూడా ఏర్పడనున్నాయి. అవి: 1) ప్రాథమిక రంగమిషన్, 2) సామాజిక సాధికారికతా మిషన్, 3)విజ్ఞానం-నైపుణ్యాల అభివృద్ధి మిషన్, 4) పట్టణాభివృద్ధి మిషన్, 5) పరిశ్రమలు/ వస్తూత్పత్తి మిషన్, 6) మౌలికసదుపాయాల మిషన్, 7) సేవారంగ మిషన్.


18. ప్రతిమిషన్ కూ గౌరవముఖ్యమంత్రి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ప్రతి మిషన్ కూ స్పష్టంగా నిర్వచించబడ్డ లక్ష్యాలు, నిర్వహణ విధానం, వనరుల సమీకరణ, శాఖాపరమైన సహకారం అమలు చేసే పద్దతి, జిల్లాస్థాయి విస్తరణ యంత్రాంగం, ప్రగతి నివేదికలు, సమీక్ష మరియు మూల్యాంకన విధానాలు, పనితీరును ప్రోత్సహించే అవార్డులుఉంటాయి.

జిల్లా అభివృద్ధి ప్రణాళిక

19. జిల్లాస్థాయిలోనూ, జిల్లాకన్నా దిగువస్థాయిలోనూ కార్యక్రమాల అమలును వికేంద్రీకరించడం ద్వారా వికేంద్రీకృతసంస్థలు మరింత శక్తివంతంగా తమ పాత్రను ఏ విధంగా నిర్వహించగలవన్న విషయాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది.

8