Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

వినయంబుఁ జేకొని వినుతింపఁ దగుప్రయో
            జనము నందలి పతిచతురిమంబు
నాపదల్ చెందినయప్పుడు నేరని
            నడకలు విడువక నడచునపుడు
కార్యభారంబులు గడపునప్పుడు తన్ను
            నడిగిన శుభవాక్య మాడవలయు
నెపుడు పథ్యంబును హితవుగా నిజమాడ
            యుక్తంబు ధర్మోపయుక్తరీతి


తే. గీ.

నెట్టివేళల నమ్మనియట్టిమాట,
మఱియు సభ మెచ్చనటువంటి మాట, కర్ణ
కటువగుచునుండు మాట, యే కడలనైన
నాడఁగా రాదు సేవకుండైన యతఁడు.

18


సీ.

అధిపతి యేకాంత మతని రహస్యంపుఁ
             బనుల నెవ్వరితోను బలుకరాదు
ద్వేషంబు నాశంబు తెగులు నెవ్వేళలఁ
            దనమది నైనను దలఁపరాదు
సుదతులతో వారిఁ జూచువారలతోడఁ
            బాపకర్ములతోడఁ బరులదూత
జనులతో రాజుచేతను నిరాకృతిఁ గన్న
            వారితో నేకాంతవర్తనములు


ఆ.

వారితోడి పొందు వర్జింపఁగాఁ దగు
నధిపు వేషభాషలందు గలయఁ
బూని మెలఁగరాదు బుద్ధిచేఁ దనరెడు
సేవకులకు నెల్ల క్షితిఁ దలంప.

19