పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఇలలోపల శకునంబులె
దెలుపును జయ మపజయంబుఁ దేటపడంగా
నిలఱేఁ డటుగన శాస్త్రము
తెలివిన్ శకునంబులెల్లఁ దెలియఁగవలయున్.

101


క.

మునుమున్ను మంచిశకునము
లనువుం గని విమలచిత్తుఁ డగుపురుషుఁడు పూ
నినకార్యము సఫలం బగు
ననుచుం బలుకుదురు ప్రాజ్ఞు లగువా రెందున్.

102


క.

బలమును దైవబలంబును
నలప్రజ్ఞయు నిశ్చయంబు యత్నమును సహా
యులకలిమి నెట్టివానికి
గలుగున్ ధర నట్టివాఁడు కడు జయ మందున్.

103


గీ.

కసవు దవసంబు నీళ్ళును గట్టియలును
జేకురకయుంట చుట్టముల్ రాకయుంట
రేలు బగలును లాచి కగ్గోలు పడుట
విడుదులకు మృత్యువగు వీని విడువవలయు.

104


క.

ఈరీతి దండు విడియుచు
సారె శుభాశుభము లిచ్చుశకునస్థితులుం
దా రెఱుఁగవలయు నృపతులు
వైరులయశుభములు దెలియవలయున్ వరుసన్.

105

ఉపాయవికల్పప్రకరణము

క.

ధృతి యుద్యోగము సత్త్వం
బతులితమతి దేవతాసహాయత గలభూ
పతి సప్తోపాయంబుల
గతు లెఱుఁగుచుఁ జొనుపవలయు గడిఁదిరిపులపైన్.

106