పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వలయుం జీతముకంటె నెక్కుడుగ నిర్వక్రంబుగా నియ్యఁగా
వలయుం బ్రాణము లిత్తు రీ విహితమౌ వాక్యంబుచేతన్ భటుల్.

60


చ.

కరుల రథంబులందుఁ దురగంబులయం దలయోడలందుఁ దా
నరుగఁగ నేర్చి వింట నెరయం జతురత్వముఁ జెంది కార్యముల్
నిరతము నభ్యసింపఁదగు నేర్పున నీగతి నభ్యసింప దు
ష్కరమగు కార్యమైనను సుఖంబునఁ జెందు నరేంద్రుఁ డున్నతిన్.

61


మ.

కడు సన్నాహము గల్గు సేన లిరువంకం గొల్వ సన్నాహముం
బొడవుం గల్గు గజంబు నెక్కి రిపులౌ భూపాలకు ల్వంప వెం
బడి నేతెంచిన దూతతో భటతతుల్ పై మాటుగానుండ నె
క్కుడు నేర్పొందెడు మంచివాక్యముల టెక్కు ల్మీఱఁ బోవందగున్

62


గీ.

బుద్ధిచే గుణములచేతఁ బొదలు గూఢ
చారిజనములచే దూతజనముచేత
వైరిచర్యలు దెలిసి పోవలయు వారు
లేనిపతి యెందును గన్నులు లేనివాఁడు.

63


చ.

ఘనత దలిర్ప శత్రు గడిఁగాచుదొరం దన మిత్రుఁ జేసికోఁ
జనునపు డించుకించుక యొసంగుచు నాశలు చాలఁజూపియై
నను మఱి బేరమాడునెడ న్యాయము దప్పక వైరిభూములం
బనుపడి వచ్చునెట్ల పరిపాలన మొప్పఁగ మెల్పఁగాఁదగున్.

64


చ.

అనువగుదూతఁ బంపి తనయందినకార్యము సంధిచేతఁ జ
య్యన నొనరింపఁగావలయు న ట్లొనరించిన సంధిగానిచో
దనరుచుఁ గార్యభేదమగు దాన నభేదము చెంది వారిలోఁ
గినుకలు బుట్టుచుండు నది కేవలముం బతికిన్ శుభంబగున్.

65


చ.

అడవులయందు దుర్గములయందు వసించినవారిఁ ద్రోవలుం
గడులును గాచువారల ఘనంబగుసామముచేత నీగిచే