పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఈరీతి నీతియుతుఁడై
భూరమణవరుండు దండు పోయినయేనిన్
సారోదారతఁ బారా
వారావృతమైన ధరణివలయం బేలున్.

40

దండయాత్రాకాలదేశాదులు

చ.

జలములు మబ్బుగల్గుతఱి సామజపంఙ్క్తికి దండు పోఁదగున్
జలములు మబ్బులేనితఱి సైంధవరాజికి దండు పోఁదగున్
వెలువని జళ్ళు మంచుఁ గడువెట్టయు లేక చెలంగ నామనిం
గలయగ సర్వసైన్యములు గైకొని భూపతి దండు పోఁదగున్.

41


గీ.

గూబ రాతిరిఁ గాకులఁ గొట్టి నొంచు
కాకి పగలైన గూబల గడిమిఁ జించుఁ
గాన వేళ విచారించి కదలవలయుఁ
గాల మెఱుఁగుచుఁ గదలినఁ గలుగు జయము.

42


ఆ. వె.

కుక్కచేత మొసలి చిక్కును దరియందుఁ
గుక్క మొసలిచేతఁ జిక్కు నీట
నటులఁగానఁ దనకు ననువైన చో టొంది
చెలఁగు రాజు కార్యసిద్ధిఁ జెందు.

43


సీ.

సమములై కనుపట్టు చదురపునేలల
           నశ్వముల్ మున్నుగా నరుగవలయు
మిట్టలు గుట్టలు గట్టులు నై నచో
           నేనుఁగుల్ మున్నుగా నేఁగవలయుఁ
బొదలును మ్రాఁకులుఁ బొదలెడిచోటులఁ
           గాలాళి మున్నుగాఁ గదలవలయు
జలములు లోఁతుగాఁ గలిగినచోటులఁ
           దగిన యోడలమీఁద దాఁటవలయుఁ