పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

పైరులు పండి పుంజగలపట్టున పైరులసీమమీఁదటన్
భూరమణుండు దండు చనఁబొల్పగు నీగతి దండువెళ్ళుచున్
బైరులు చూరఁబట్టి పరిపంథుల జీవనముల్ హరించినన్
సారబలంబుచేఁ దనరి శత్రుల గెల్చును నిర్భయస్థితిన్.

6


చ.

వెనుకటివైరులం దనదు వెన్కనురాఁ గడు మట్టుపెట్టి పెం
పునఁ బరిచర్యలం దెలిసి ముందరఁగల్గుభయప్రదేశముల్
గనిమలు లెస్సగా నెఱిఁగి కంటకశుద్ధి యొనర్చి రానుబో
ననువగుమార్గమందుఁ బతి యాత్ర సనందగు నప్రమత్తుఁడై.

7


చ.

సమమగుచోట్ల గుంటలును జాలఁగ మిట్టలునైనచోట్ల నె
య్యముగలసేన మున్నుగఁ బ్రయాణము వోవుట యొప్పు వైభవ
క్రమములయందుఁ దానెఱుఁక గల్గుచు నార్తుఁడుగాక యన్నపా
నముల సమృద్ధిఁ జెంది జతనంబుగ దండు చనంగఁ జెన్నగున్.

8


చ.

జలము వనంబునుం గలుగు చాయనె వేసవి వైరిమీఁదఁ వో
వలయు మదేభముల్ జలమువల్ల ఘటిల్లెడు సౌఖ్య మొందఁగా
జలములు లేకయుండినను సామజపంక్తులకెల్ల వేసవిం
గలుగుచునుండుఁ గుష్ఠములు గాటపుటెండలఁ బుట్టువెట్టచేన్.

9


క.

ఒక్కయెడ నిలుచునప్పుడు
గక్కసమగు వెట్టనొంచుఁ గరిబృందములన్
మిక్కిలిఁ బ్రయాణముల నిడి
వెక్కసమై నొంపకున్నె వేసవివేళన్.

10


క.

నీరములు లేని వేసవి
సారెకు దురవస్థఁ జెందు జంతువు లెల్లన్
వారణపంఙ్త్కుల కైనం
దీరనితాపముల నపుడె దేహము లెందున్.

11