పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

మఱియు నందులలోనిభేదంబు లెనయం దగి శత్రురాజుల
యంతఃపురవార్త లెఱుంగఁజేయు వేగులవారివిధం బెట్లన్నను.

94


సీ.

కాననివారలకైవడి వినకుండు
            వానిరీతుల మూఁగవానికరణి
మెలఁగువారు నపుంసకులు జడవేషులు
            గూనుబోయినవారు గుఱుచవార
లటువంటిరీతుల యాకారములు గల్గు
            కాయలు పం డ్లమ్ముబోయవారు
చాకలవారు బిచ్చాలవారలు నట్టు
            వలు మఱి శిల్పముల్ గలుగువార


గీ.

లింటిబిడ్డలు బూదండ లిచ్చువారు
విమతరాజులయంతఃపురములలోని
వార్త లెల్లను దెలియంగ వలయు నెపుడు
వేగువారలు గుఱిఁగానివిధముతోడ.

95


గీ.

గొడుగులును గిండ్లు సురటులు గుఱ్ఱములును
బట్టువారలు పల్లకీ ల్వట్టువారు
నగుచు వేగులవారలు పొగడవార్త
వెలినిఁ గలవార్తఁ దెలుపఁగా వలయుఁ బతికి.

96


సీ.

వంటలవారలు వైద్యులు తపసులు
            జ్యౌతిషికుల్ వ్రతుల్ హాస్యపరులు
నాండ్రవారలు నీళ్ల నందించువారలు
            జెట్టులు భుజియింపఁ బెట్టువారు