పుట:అహల్యాసంక్రందనము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

67

     తారమునన్ జరించుట తృణంబులమీఁదఁ బరుండుటల్ మముం
     గోరెడువారలుం గలరె కోమలి, నీదువివేక మేమనన్.43
చ. మదనుని గుమ్మితీమొనలు మాటికి మర్మములంటఁ బాఱినన్
     వదలనికోరికల్ మొలిచి వర్థిలి డెందమునందె డిందినన్
     హృదయము ఱాయి చేసికొని యింపుఁ దలంపక యుండఁగాఁ దగున్
     గదలఁ దరంబె యొక్కనికిఁ గంఠము జూపిన కంబుకంఠికిన్.44
ఉ. అద్దములోనఁ దోఁచు ముడు పందనిమ్రానిఫలంబు కోపపున్
     గద్దరిచిల్వచేఁబడిన గందపుఁదీవె మహావిషంబులో
     నద్దినపణ్ణెరంబు మగనా లది కొంచెమునన్ లభించునే
     సుద్దులు వేయునేల బలసూదనుతోఁ దెలియంగఁబల్కవే.45
సీ. చక్కనివాఁ డింటిచాయకు వచ్చిన
                    మామగా రూరక మండిపడును
     పుట్టింటిలో నొక్కపూట యుండఁగరాదు
                    కత్తికోతఁగఁబోరు నత్తగారు
     నిమిషంబు పొరుగింట నిలిచియుండఁగరాదు
                    పటుకార్లఁ బట్టును వదినగారు
     కడకుఁబోయిన నొక్కకడ నుండఁగారాదు
                    మఱఁదలు కొండేలమారిబసివి
తే. తోడికోడండ్రు చూపోప కాడుకొండ్రు
     [1]పట్టపగ బట్టి పోరాడు బావగారు
     జారసంగతిఁ గాంక్షించు చంద్రముఖికి
     నత్తగారిల్లె కారాగృహంబు దలఁప.46
క. భావమున నేమికిటుకో
     నావంకనె చూచుచుండు నామగఁ డెపుడున్
     [2]రావశమో పోవశమో
     [3]యీవని కెవ్వానికైన నిందునిభాస్యా!47

  1. పంటపగ
  2. రావశమా పోవశమా
  3. యీపని