పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీ మొదటి ధర్మబోధకు ధర్మచక్రప్రవర్తన మని పేరు. బుద్ధుని ధర్మబోధల ననుసరించువారు రెండు తెఱఁగులు: (1) సన్యాసులు - వీరిని భిక్షువు లందురు. స్త్రీలకు కూడ భిక్షుకులై బౌద్ధధర్మావలంబనమున కధికార మొసఁగఁబడుటవలన బౌద్ధభిక్షు సంఘమున పురుషులతో పాటు స్త్రీలు కూడ నుండిరి; (2) గృహస్థులయి బౌద్ధధర్మ మవలంబించువారి కుపాసకు లని పేరు. బుద్ధుఁడు చాలకాలము తన ధర్మమును లోకమునఁ బ్రవర్తింపఁజేసి, యెనుబది వత్సరముల ప్రాయమున మల్లరాజ్యమునకు రాజధాని యయిన కుశనగరమున (పాలి: కుసినార) వ్యాధిగ్రస్తుఁడయి యచ్చటి సాలవనమున నిర్వాణమునందెను. బౌద్ధులు దీనిని మహాపరి నిర్వాణ మందురు. కుశనగరమునకు వెలుపట నున్న మకుటచందన మనుచోట బుద్ధుని శరీరమునకు దహనసంస్కారము కావింపఁబడెను. దహనానంతరమున మిగిలిన బుద్ధ భగవానుని శరీరావశేషములకొఱ కిరుగు పొరుగు ప్రభువులకు మల్లులకు వివాదము కలిగెను కాని ద్రోణుఁడను బ్రాహ్మణుఁ డీ కలహ ముడిపి దగ్ధావశేషముల నందఱికి సమానముగఁ బంచి యిచ్చి సమాధానము గావించెను. ఆయవశేషముల నాయా ప్రభువులు తమ దేశములకుఁ గొనిపోయి వానిని దగిన స్థలముల భద్రపఱిచి వానిమీఁద స్తూపములను నిర్మించిరి. ఇట్టి