పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాహ్మణునిహస్తమున మతవిద్య కెట్టి యాధ్యాత్మికపు తీర్పు కలిగెనో అట్లే కుటీరవాసియు, నిరుపేదయు, నమాయకుఁడు నైన పారిశ్రామికునిచేతిలో వృత్తివిద్యయు కళాకుసుమముగ వికసించి దశదిశలఁ దన నెత్తావిని విరఁజల్లి సర్వజనానంద సంధాయకమై విరాజిల్లెను. అంతటియౌన్నత్యదశ నందిన యీ రెండు విధములగు విజ్ఞానవల్లరులకు గ్రామమే యాలవాలము; ప్రాథమికక్రీడారంగము. పల్లెటూరి పారిశ్రామికుఁడు తన కర్మశాలలో వెలిఁగించిన యీ విజ్ఞానరత్నదీపము దేశాంతరములనుగూడ ప్రకాశవంతము చేసి, సౌందర్యరససృష్టికి పరమావధి యయినది. అట్టిది మన పూర్వపు వృత్తివిద్య. అంతటి నిరాండబరమైనది తద్‌విద్యావిధానము; అంతటి యుత్కృష్టమైనది దాని ఫలితము.