Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశకవిజ్ఞప్తి

అప్పకవి రచించిన యీగ్రంథముపేరు 'ఆంధ్రశబ్దచింతామణి' అని యవతారికనుబట్టియు, ఆశ్వాసాంతగద్యలనుబట్టియుఁ దెలియుచున్నది. కాని 'అప్పకవీయ'మను నామమే దీనికిఁ బ్రసిద్ధము. కృతికర్త, యిది వ్యాకరణగ్రంథమని చెప్పేకొన్నను, ఇందు ఛందోవిషయములకే ఎక్కువ ప్రాధాన్య మీయఁబడినది. ఛందోగ్రంథముగానే దీనికి ప్రసిద్ధి కల్గినది. ఛందోవిషయపరిజ్ఞానమునకే దీనిని చదువుకుందురు. సాధారణముగా విశ్వవిద్యాలయములవారు తమపరీక్షలకు ఛందస్సునకు సంబంధించిన యిందలి తృతీయ, చతుర్థాశ్వాసములనే పాఠ్యములుగా నిర్ణయించుచుందురు.

అప్పకవీయమును పలువురు ముద్రించిరి. మేమును గతశతాబ్దమునందే తొలిసారి ముద్రించితిమి. పిదప 1910 సం. నుండియును ముద్రించుచునే యున్నాము. ఈ గ్రంథపరిష్కరణమునకు సుప్రసిద్ధవిద్వాంసులు శ్రీ పురాణం సూర్యనారాయణతీర్థులుగారు, శ్రీ ఉత్పల వేంకటనరసింహాచార్యులుగారు, శ్రీగిడుగ. వెంకట రామమూర్తిపంతులుగారు మున్నగువారు మిక్కిలి తోడ్పడిరి. శ్రీగిడుగువా రమూల్యమగు విమర్శనమును కూడ వ్రాసిరి. దానిని కూడ నీగ్రంథముతోఁ జేర్చి ముద్రించుచుంటిమి. 1961 వ సం. ముద్రణమును శ్రీ తిమ్మావజ్ఝల గోదండరామయ్యగారును, శ్రీ కం. అ. కృష్ణమాచార్యులుగారును సరిచూచిరి. దానికి శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు కూర్చిన 'అప్పకవీయ' విశేషప్రస్తావనము కలదు. అందు ఋ-రు ల యతి. ఉ-వు ల యతి మున్నగు విశేషములు, యవ్వనము, సింహ్వము మున్నగు శబ్దముల చర్చ కలదు. 6వ ముద్రణమును 1962 లో శ్రీ రావూరి దొరసామిశర్మగారు పరిష్కరించి విపులమగు సమీక్ష నొకదానిని వ్రాసిరి. శ్రీశర్మగారే 1966-వ సం. రపు ముద్రణములో కొన్ని క్రొత్త సవరణలను చేర్చియున్నారు.