పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

అనుభవసారము


ఉ.

పొచ్చెము లేక రిత్త వెడపొల్లులు పూనక కార్య మెయ్యెడన్
[1]గ్రుచ్చఁ దలంప కేమియును గోరక యెల్లెడ లోభి గాక ము
న్నిచ్చియు నిప్పు డిత్తు నన కిబ్బడివాదము లేక యెమ్మెయిన్
సచ్చరితుండు గావలదె సజ్జనభక్తుఁడు జంగమాశ్రితా!

210


చ.

మనము మనంబులోఁ గలిసి మాటలు మాటలు సొచ్చి యర్థముం
దనరఁ దదర్థ మై సమసి తథ్యముగాఁ దను వెన్నిభంగులన్
దనువున కొడ్డి వారిప్రమదంబును వారలదుఃఖవృత్తియుం
దనయవి గాఁ దలంచు మదిఁ దప్పక జంగమభక్తుఁ డేనియున్.

211


క.

క్రియగొన భక్తుం డై బం
టయి బానిస యై నిజాప్తుఁ డై [2]యెన్నఁగఁ బెం
టయి తుడువఁగఁ జీపురుఁ దా
నయి జంగమభక్తి సేయునతఁ డీశుఁ డిలన్.

212


క.

ఉపజీవికత్వమతియును
జపలత్వము నాస్తికతయు సందేహంబుం
గపటంబుఁ గంటకంబును
నుపమింపఁగ సహజభక్తియుక్తికిఁ గలదే?

213


క.

నయమును బ్రియమును నధికవి
నయమును బాయనిభయంబు నమ్మికయును ని
ర్ణయమును నిర్వంచకతయుఁ
గ్రియగొనఁగా సహజభక్తికిని హేతు వగున్.

214
  1. గుచ్చ
  2. యెక్కగ