పుట:అనిరుద్ధచరిత్రము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మత్తకోకిల.

మత్తకోకిలశారికాశుకమంజుమోహననాదసం
పత్తికి న్మలయాచలానిలపద్మశాత్రవచంద్రికో
ద్వృత్తికి న్సుమవాసనాపదవీభ్రమద్భ్రమరస్వనో
పత్తికి న్మది నోర్వఁజాలక తల్లడిల్లుచునుండఁగాన్.

22


క.

వగ నొందుచుఁ జెలికత్తెలు, మృగమదఘనసారగంధమృదుకుసుమాదుల్,
తగఁదెచ్చి శిశిరవిధు లా, మగువకుఁ గావించి రపుడు మఱియు న్మఱియున్.

23


సీ.

విభునికౌఁగిటికినై వెతఁ జెందుమేనికిఁ జందనపంకం బలంద నేల
చందనంబునఁ గసుఁగందెఁగదా యని గ్రక్కున బన్నీటఁ గడుగ నేల
పన్నీటివలనఁ దాపంబు మించుటఁ జూచి చంద్రరజంబు పైఁజల్ల నేల
చంద్రరజంబుచే జనియించె సెకలంచు వెసఁ దాళవృంతము ల్విసర నేల
తాళవృంతములను వడదాఁకె ననుచు, వగవఁగా నేల నేరనివైద్యుకరణిఁ
దనుగుణ మెఱుంగఁజాలక తమరు సేయు, మందులకె మందు లొనరించి రిందుముఖులు.

24


తే.

ఎన్ని యుపచారములఁ చేసి రిందువదన, లన్నియును జూడ మునుపటికన్న మిగుల
బాధకము లయ్యె దయ లేనిప్రభువుతోడ, మందలించిన మనవులచందమునను.

25


వ.

ఇక్కరణి నక్కువలయాక్షి విరహాతిశయంబున నోర్వంజాలక పరితపించుటకు సఖీ
జనంబులు విచారమగ్నాంతరంగలై కుసుమసాయకు నుద్దేశించి యిట్లనిరి.

26


ఉ.

తల్లి సమస్తభాగ్యనిధి తండ్రి దయాపరమూర్తి నీచెలుల్
చల్లనివారు నీవు కడుఁజక్కనివాఁడవు పొంక మైననీ
విల్లు సమాధురిం బరిఢవిల్లు మృదుత్వము నీదువర్తనం
బెల్ల నయో వధూవధకు నేటికి రోయవు మీనకేతనా.

27


చ.

పురహరదేవునిం జెనకఁబోయి తదుగ్రలలాటనేత్రభీ
కరదహనార్చులం గలసి కాలితి నంతటనుండియైననుం
బరులను బీడ పెట్టని కృపాగుణ మేటికి లేదు నీకుఁ గా
పురుషులు రాజదండనముఁ బొందియు నైజము మానరే కదా.

28


వ.

అని పలికి సుధాకరు నుద్దేశించి.

29


సీ.

కువలయంబులను గన్గొన్న చల్లనిచూపు కమలబృందములందుఁ గలుగదయ్యె
నలచకోరములపైఁ గలుగు దాక్షిణ్యంబు జక్కవగములందుఁ దక్కువయ్యె
సప్రాణవిభు లైనసతులపై కూర్మి యనాథకాంతలయందు నాస్తియయ్యె
నిందూపలములపై నెనయు సౌహార్దంబు రవికాంతములయందు రహితమయ్యె
బక్షపాతంబు మాన వేపక్షమునను, రాజదోషాకరుఁడవు గా రామ రామ
దానఁ జేసి సుమీ నీదు మేనియందు, నంకమై నిల్చియున్న దయ్యపయశంబు.

30