Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెవికీ స్వామి

వికీపీడియా తొలితరం నిర్వాహకుల్లో బి.కె. విశ్వనాధ్ ఒకరు. వికీలో నిర్వహణతో పాటు వికీ బయట నిర్వహించిన కార్యక్రమాలకు విశ్వనాధ్ ప్రసిద్ధి. ఇంటి సంగతి తరువాత ముందు బయట గెలిచి వద్దాం అని వెళ్ళి గెలిచొచ్చిన వీరుడు. వికీపీడియా తరఫున బయట పలు కార్యక్రమాలను నిర్వహించాడు. కవి సమ్మేళనాల్లో, సమావేశాల్లో తల్లావజ్ఝల శివశంకరస్వామి గారు ఎక్కువగా అధ్యక్షుడుగా ఉండేవారట. అంచేత ఆయనను సభాపతి అనేవారు. అలాగే, వికీపీడియా బయట జరిపే కార్యక్రమాలకు విశ్వనాధ్ అధిపతిగా, తలలో నాలుకలా ఉంటూంటారు.

బెజవాడలో పదేళ్ళ దశాబ్ది ఉత్సవాలు జరపినపుడు విశ్వనాధ్, కార్యక్రమ నిర్వహణ బాధ్యతల్లో చాలావరకు తీసుకుని విజయవంతంగా నిర్వహించారు. తిరుపతిలో పదకొండేళ్ళ ఉత్సవం జరిగితే అక్కడా విశ్వనాధ్ ఉన్నారు. అంతేకాదు, చండీగఢ్‌లో జరిగిన వికీకాన్ఫరెన్స్ ఇండియా సదస్సుకు ఇతరులతో పాటు తెలుగు వికీపీడియా తరఫున హాజరయ్యారు. 2022 జనవరిలో భీమవరంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాలకూ హాజరయ్యారు. వికీమీడియా ఫౌండేషను నుండి వ్యక్తిగత గ్రాంటు పొంది, గ్రంథాలయాల వికీప్రాజెక్టును నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రముఖ గ్రంథాలయాలకు వెళ్ళి అక్కడి క్యాటలాగులను డిజిటైజు చేసారు. అయితే గత కొన్నేళ్ళుగా వికీ కార్యక్రమాలు తగ్గించేసారు.

ఎందరో వికీమీడియన్లు

37