పాడనా తెనుగు పాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అమెరికా అమ్మాయి (1976) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


ప || పాడనా తెనుగు పాట (2) పరవశనై

నే పరవశనై మీ ఎదుట మీ పాట || పాడనా ||


చ || కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో (2)

మావులు పూవులు మోపులపైన మసలేగాలుల గుసగుసలో

మంచి ముత్యాల పేట, మధురామృతాల తేట, ఒకపాట || పాడనా ||


చ || త్యాగయ, క్షేత్రయ, రామదాసులు (2), తనివితీర వినిపించినది

నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది

చక్కెర మాటల మూట, చిక్కని తేనెల ఊట, ఒక పాట || పాడనా ||


చ || ఒళ్ళంత ఒయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ (2)

మెళ్ళో తాళి, కాళ్ళకు పారాణి, మెరిసే కుంకుమ బొట్టు

ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లనా నడయాడే

తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగు నాట ప్రతిచోట, ఒక పాట || పాడనా ||