పాండురంగవిజయము

వికీసోర్స్ నుండి

పాండురంగవిజయము

రామకృష్ణుడు పాండురంగమహాత్మ్యము కాక పాండురంగవిజయ మను మరొకగ్రంథమును రచించినట్లును అనుకొనుటకలదు. తమ చిన్నతనమున తమ తాతగారు పాండురంగవిజయములోనివని చెప్పుచు చాలపద్యములు చదివి వినిపించెడివారనియు, ఆ వినుకలి వలన తమకు వచ్చిన పద్యములలో ప్రస్తుత మొకటిమాత్రమే అసంపూర్ణముగా జ్ఞాపకమువచ్చుచున్నదనియు పూజ్యులు శ్రీ బి. రామరాజుగారు చెప్పుచున్నారు. ఆ పద్య మిది -

“మారామాజనకాంబుజాంబుజజరామారామ భూభృద్విరా
మారామార్త్య సరి త్కరిద్గణ విరామారామపోత్రిప్రియా
.....................................................
మారామాభయశస్కవిఠ్ఠలపురీక్ష్మాలోకరక్షామణీ!”

శ్రీ చాగంటి శేషయ్యగారు పాండురంగమాహాత్మమునే పాండురంగవిజయ మందురనియు, కొంద ఱీరెండుగ్రంథములును వేఱనిచెప్పు వాదము విశ్వాసార్హము కాదనియు చెప్పుచున్నారు. "దశావతారపద్యములు - సటీకములు" అను పేర నొక కాగితపువ్రాతప్రతి మద్రాసులోని ప్రభుత్వప్రాచ్యపుస్తక భాండాగారమున కలదు[1]. ఆ కాగితపుప్రతికి మూలమైన తాళపత్రప్రతి విశాఖపట్నముజిల్లా వీరవల్లి తాలూకా పాతనపూడి అగ్రహారవాస్తవ్యులయిన కోటి రామమూర్తిశాస్త్రులుగారిది. ఆ పద్యములకు టీక వ్రాసిన పండితుడు చివర తన “గద్య" వ్రాసికొనినాడు.

"ఇతి శ్రీవత్సగోత్రపవిత్ర శ్రీమదాపస్తంబసూత్ర శ్రీమద్రఘునాథభట్టరాచార్యకృపాపాత్ర శ్రీమత్కోదండ రామాచార్యవర్యపుత్ర దుర్వాదిగర్వలతాలవిత్ర శ్రీమద్భాష్యాదిగ్రంథప్రబంధాధ్యయనాధ్యాపనవిచిత కృష్ణమాచార్యగోత్రవిరచితాఖండపండితమండలదుర్విజేయతాత్పర్యపర్యాయపిచండిల పాండురంగవిజయప్రబంధమధ్యనిధేయ హృద్యతమదశావతారపద్యమాలికా టీకానిగూఢార్థ చంద్రికా శరద్రాకాసమాప్తా"— ఈగద్య పాండురంగవిజయప్రబంధ మున్నదనుటకు సాక్ష్యమేగాని అది తెనాలి రామకృష్ణుడు రచించినదే అనుటకు కాదు. క్యాటలాగులో దానినిగూర్చి ఆంధ్రాంగ్లములలో వ్రాయువారు మాత్రము "తెనాలి రామలింగకవికృత పాండురంగవిజయమందలి దశావతార పద్యములు" "These stanzas form part of the Pandurangavijaya composed by Tenali Ramalingakavi" అని స్పష్టముగా వ్రాసిరి. ఈ ఈ వ్రాతలో నింకొకవిశేషము కనిపించుచున్నది. రామకృష్ణుడు రామలింగడుగా నున్నప్పుడే పాండురంగవిజయమును రచించినాడా? తెలుగులో పాండురంగవిజయము ఆంగ్లములో పాండురాంగవిజయమనబడినదేమి? ఈ పాండురాంగ-పాండురంగవిషయము తరువాత రామకృష్ణుని వైష్ణవమునుగూర్చి వ్రాయుచోట మరికొంత వ్రాయబడును. — ఈ దశావతారపద్యములు పాండురంగమాహాత్మ్యమున లేవు గనుక , టీక వ్రాసినయతడు ఈ పద్యములు పాండురంగవిజయమధ్యమున నున్న వనుచున్నాడుగనుక, పాండురంగమాహాత్మ్యమునే పాండురంగ విజయమనుట కుదురదు- అవి రెండు వేఱు వేఱు గ్రంథములగు టయే నిజము. పాండురంగవిజయకర్తృత్వము తెనాలి రామ(లింగ)కృష్ణునిదని ప్రాచీనులసాక్ష్యముండుట చేతను, అందలి పద్యములు నోటికి వచ్చినవారు పాతికముప్పది సంవత్సరముల క్రితమ వరకు ఈ తెణంగాణమున నున్నట్లు చూచి యెరిగిన సాహిత్యోపాసకులు వచించుట చేతను, ఇంకను దేశము నలుమూలలనుగల తాళపత్రగ్రంథముల సేకరణము జరుగ లేదు గనుకను, తెనాలి రామకృష్ణుడు పాండురంగవిజయప్రబంధమును రచించియుండుననుట కేవల మనృతము గాజాలదనియు, ముఖ్యముగా తెలంగాణము నందలి తాళపత్రగ్రంథసేకరణము సంపూర్ణముగా జరిగినప్పు డది లభింపవచ్చు ననియు విశ్వాసముతోనుండుటయే మంచిది. అంతవరకు పాండురంగవిజయ ప్రబంధములోనివి రెండుపద్యములు మనకున్నవనియే తృప్తి చెందవలయును. అసంపూర్ణముగా నున్న పద్య మింతకుముం దుదాహరింపబడినది. రెండవది సంపూర్ణముగా నున్నది. ఈ క్రింద నీయబడుచున్నది.


సీ.⁠

ప్రౌఢ దీర్ఘ సమాసపదములగూర్చి శ్రీ
        నాథుండు కూలార్చె నైషధంబు
దానితల్లిగ నల్లసాని పెద్దన చెప్పె
        ముది మదిదప్పి యాముక్తమాల్య
దూహించి తెలియరాకుండ సూరపరాజు
        భ్రమఁ గళాపూర్ణోదయము రచించె
నతిశ్లేష శబ్దవాగాడంబరంబొప్పఁ
        బస ఘటించెను మూర్తి వసుచరిత్ర
నిట్టికవులకు నేను వాకట్టుకొఱకు
చెప్పినాఁడ మదీయ వైచిత్రి మెఱయ
పాండురంగవిజయమును పటిమదనర
విష్ణువర్దిష్ణుఁ డగు రామకృష్ణకవిని.

పాండురంగవిజయము లోనిదని మనము దీనిని గ్రహించుచున్నాము గాని దీని వలన చాల చిక్కులున్నవి. అందువల్లనే బ్రహ్మశ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు “రామకృష్ణకవి తన పాండురంగవిజయప్రబంధములోని కవిత్వపటుత్వమును గూర్చి చెప్పికొనినపద్యము" అని చెప్పుచునే "ఈ పద్యము శైలినిబట్టియు తెనాలి రామకృష్ణకవికి తరువాతివాడగు సూరనను పేర్కొనుటంబట్టియు నంత విశ్వసనీయముగ తోపదు" అని జ్ఞాపిక వ్రాసిపెట్టిరి. కాని ఈ పద్యమునందలి 'దానితల్లిగ' అన్నప్రయోగము రామకృష్ణునిదే కావలయు ననిపించుచున్నది. ఈ అర్థముననే ఘటికాచలమాహాత్మ్యమున "నిండుజాబిల్లి తల్లియై నిగ్గుదేరు మోము" (2-184) అని ప్రయోగించియున్నాడు. పాండురంగమాహాత్మ్యమునను "శైవాలవల్లికిం దల్లియై చెలువారు నూగారును" (3-179) అని ప్రయోగించినాడు. పుస్తకము లభింపలేదుగనుక చిక్కులున్న వనుకొనుచున్నాము. అది బయటపడినప్పుడు చిక్కు లెట్లో సవరింపబడును. మిగిలినకృతులతోపాటు ఈ పాండురంగవిజయప్రబంధరచనాకాలమును నిర్ణయింపబడును. అందుకు కాలము కలసిరావలయును.

(ఘటికాచలమాహాత్మ్యపీఠిక)

  1. A Triennial Catalogue of Manuscripts Volume III Part III. Telugu. R. No. 542.