పాంచాలీపరిణయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పాంచాలీపరిణయము

ప్రథమాశ్వాసము

శ్రీరంగేశుఁడు చంద్రపుష్కరిణికాభృంగీతసంగీతభం
గీరమ్యశ్రుతి కాత్మనాభిభవభూగీతాశ్రయత్కర్ణుఁ డ
ర్ణోరాశిప్రతిమానసహ్యగిరిసూనుక్రోడదృక్కర్ణశ
య్యారంగన్మకుటోపధానితభుజుం డర్పించు మా కిష్టముల్.


మ.

తనకోదండముఁ ద్రుంచెఁగా తనదొనన్ ధట్టించి కట్టించెఁ గా
తనచేతన్ వర మందు వానిశిరముల్ దండించెఁగా యిమ్మహీ
తనయేశుండన కారఘూత్తము గుణస్తౌత్యంబు గావించు భ
ర్గుని నిర్మత్సరు భక్తవత్సలు బేర్కోఁ జెల్లుఁగా యేరికిన్.


ఉ.

బంగరుబొజ్జ పల్కుబడిపైదలి పచ్చనిమేను తమ్మిపూ
సింగపుఁబీఁట తెల్లగరి చిన్నిపటాణి కడానివన్నె ముం
గొంగుల తండ్రి పాటబెళుకుం దొలుకానుపు చాలుమోము టె
క్కులుగల వేల్పుమాకుఁ దనకుంగల యేండ్లొదవించుఁ గావుతన్.


ఉ.

ఒండురదంబు పోవిఱిచి యుక్కునఁ జక్కని మొక్కలీఁడనన్
రెండవకొము తొండమున నేర్పునమాటి మతంగశృంగ వే
దండములన్ గ్రహించి తనదాసుల కీఁబరికించి హస్తివ
క్త్రుండయి మాయబోయదొరకుం గొడుకై తగువేల్పుఁ గొల్చెదన్.


సీ.

కాయలా యాచన్నుదోయి జోడనిపాదములవైచెనా వీణ చెలియనిల్ప
నిరుగరంబుల మ్రొక్కి యెత్తిమీటినమీఁదఁ జేవ్రేయసన్నుతుల్ చేసెననఁగ
వల్లకిప ల్కుల్లసిల్ల నిర్వుర మొక్కఁడైయున్న జోడెవ్వరన్నజాడ
తాగాత్రలాలనాభోగంబు గావింపఁ దానమానంబుల తేనెగురియ
డాలునకు డాలు చెల్లు గాఁ జాలుకంపి, తమునఁ గంపితమయ్యె విధాతృశిరము
రాగమున రాగమబ్బెఁగా స్రష్టకనఁగ, వీణ వాయించు కల్యాణి వాణిఁ గొల్తు.


క.

మాసఖులు వ్యాసనాకుజ, భాసశ్రీహర్షబాణభారవికాళీ
దాసభవభూతిమాఘమ, హాసంస్కృతకవి కవిత్రయాంధ్రకవుల్.


చ.

ప్రబలమతిన్ నుతింతుఁ బ్రతిభాకృతిభాషితభారతీశులన్
గబళితసర్వదర్శనులఁ గావ్యచమత్కృతి కాళిదాసులన్

నిబిడితపోవిలాసులఁ దృణీకృతవాదులఁ గాకమాని రా
మ బుధవిభున్ బ్రబోధసుధి మత్ప్రపితామహున్ బితామహున్.


క.

కుకవి తనకవిత సకలము, సుకరంబనుచుండు బుధులు శోధింపమిచే
ముకురము గన్నపుడె కదా, మొకము కురూపము సురూపమును నేర్పడుటన్.


వ.

అని యిష్టదేవతావినుతియు శిష్టకవినమస్కృతియు దుష్టకవినిరాకృతియు
గావించి పాంచాలీపరిణయప్రబంధనిబంధనంబునకు సమకట్టియున్న సమయంబున.


చ.

తలగడగా నమర్చుకొని దక్షిణపాణిని జానునంటఁగా
నలవడఁజాపుకొన్న పెఱహస్తముచే నితఁడింతనాఁడె నన్
బలుబడి బాడనేర్చెనని పాదములొత్తు రమాక్షమల్ వినన్
దలకడఁబాట మెచ్చుచును నారదుఁ దెల్పెడు వేల్పుపొల్పుగన్.


మ.

కలలోనం గరుణించి నన్నుఁ బలికెం గమ్రేక్షుకోదండహ
స్తలతాకృష్ణధనుఃప్రకాండవిగళద్ధారాళసారామృతో
జ్జ్వలమాధుర్యనిదానచూడ్కుడుతనాంచారూరదాచ్ఛాదనాం
చలవిచ్ఛేదనసాధుసీధుసముదంచద్దంతవాగ్వైఖరిన్.


క.

పాంచాలీపరిణయకవి, పంచాస్యభవత్ప్రబంధపదసంబంధ
ప్రాంచనము సుహృత్కవిరా, ట్కాంచనము సహృద్విరేభకాంచనము సుమీ.


గీ.

అల్లసానివాని యల్లికబిగిసొంపు, ముక్కుతిమ్మనార్యు ముద్దుఁబలుకుఁ
బాండురంగసుకవి పద్యంబుహరువును, గాకమానిరాయ నీకె కలదు.


క.

అంచితమతి కృతి వీవొన, రించినకృతి ద్రౌపదీపరిణయము మా క
ర్పించుము తెనుంగుఁగవిత వి, రించివిభువిఁ గాకమాని శ్రీమూర్తికవీ.


క.

అనినన్ మేల్కాంచి విరిం, చనజనకఘనాత్తకనకసంపాతవిలో
చనశంపాసంపాత, స్వనుకంపాకంపితాత్మసంతాపుఁడనై.


ఉ.

దొంగిలి యర్ధరాత్రమున దొండరడిప్పొడియాళువారికై
బంగరుగిన్నెఁ దెచ్చిన కృపానిధి యంత్యజు దాసరిన్ స్వకీ
యాంగమఁ జేర్చు రంగపతి యంగజుతండ్రి మదీయకావ్యసా
రంగవిలోచనామణికిఁ బ్రాణవిభుండఁట భాగ్య మెట్టిదో.


క.

అర్భకులభాతి నవరస, గర్భితసందర్భలహరిఁ గరఁగని భూభృ
న్నిర్భాగ్యుల కిత్తురె వై, దర్భీనిర్భీకపాకదర్పితకవితల్.


వ.

అని యుద్యోగించి యద్దేవతాపురందరునకుఁ గాపురంబై ధరాపురంధ్రికి నూ

పురంబై యసపుంగప్పురంబునకుఁ గొప్పెరయై యపరిమితఘనపురెంబైన శ్రీరంగ
పురం బభినుతించెద.


సీ.

వెలరాడితాసంజాత దేవపూజాగృహం బుభయసహ్యోద్భవాభ్యుదయభూమి
నక్తాంఘ్రీరమరాద్భుక్తిముక్తిప్రదంబు మునివాహనాభీష్టమోక్షదాయి
తిరుమన్నారుకృతసాధితసప్తపాలము చంద్రపుష్కరిణీనా జన్మనీరు
పద్మపద్మావిఘాధనతిరునిర్మలరాశి కాశీవసత్యభాగ్యస్మరణము
సంశితాన్యోపకంఠసోత్కంఠవన్యని, శుంఠకలకంఠ మపరవైకుంఠమనద
మొత్తపుబిడారుముంగిటిమొదటివేల్పు, గొంగదొరమ్రాఁకుతులత్యు శ్రీరంగ మమరు.


లయగ్రాహి.

అంగము త్రివేదికి మృదంగము కళానటికి సింగము మదాధికకురంగముల కెల్లన్
శృంగము శుభాద్రికిం దరంగము యశోబ్ధికిఁ బతంగము ప్రకిల్భిషభుజంగముల కెల్లన్
సంగము సుఖోన్నతికి భృంగము వనావనికి భంగము రిపుద్విసతురంగముల కెల్లన్
రంగము విభూతికి మతంగము గజాళికి శతాంగము మురారికి సిరంగము దలంపన్.


ఉ.

నింగిఁబొరల్ కవేరజి మునింగి సిరంగనిసేవ చేసి యా
పొంగలిముద్ద మ్రింగి విబుపుష్కరిణీజలమాని మానితో
త్తుంగతరూత్తమోపవని దూఱి సిరంగములోన నున్నవాఁ
డుంగను నాయుటంకు టకటొంకుపురంబుల కాపురంబులన్.


క.

ఆరంగమునకు నధిపతి, సారంగము రంగశాయి సారంగమద
శ్రీరంగన్నిటలాంగుఁడు, దోరంగద ఝణఝణకృతుల సిరు లొసఁగున్.


సీ.

శేషాచలాధీశ భీషణనిశ్వాస మాతరిశ్వగ్లాని మాన్పికొనఁగ
నాహోబలాహార్య కాహోకరస్తంభ సంభవోద్గత శిఖాశ్రమము వీట
సింహాద్రి దైతేయసంహార సమయోద్ధ దృష్టిదంష్ట్రానలసృష్టి తొలఁగ
హల్తిశైలాజి ప్రశస్తహోమహూతాశిజాతాపఘన ధునౌష్ణ్యంబు వీట
నుభయసహ్యోద్భవామధ్యమోర్వి చేరి, గాడ్పువలిదిండిపాన్పుపైఁ గడమ పడగ
పవ్వళించిన శ్రీరంగభర్తకర్త, చల్లఁగాఁ జూడఁ జెల్లదె యెల్లజనుల.


సీ.

అప్ప దిద్దినవాని యటులు వేగినదాఁక బొమ్మలాటలుగన్న భోగిపగిది
మధుమాసగమన తామ్యన్మానసునిమాడ్కి, వాసిగా నాకొన్నవానిపగిది
స్వపమాసుహృద్వినాశశ్రోతృవిధమున - - - - - - - - - -
బహుకాలకృతశిరోభ్యంగసంగతుభంగి బహుళధూమరాశి - - - -

నుభయసహ్యోద్భవామధ్య మొదవె నంచు నిదురవోయెదొ లేదొకన్ పెనుపును
పూర్ణకరుణామృతము చల్లు భోగిభోగభాగవిశ్రాంతు శ్రీరంగపతిఁ దలంతు.


మ.

కటిచక్రంబు గళంబుకంబువు ధనుఃకాండంబు భ్రూవల్లికా
తటి రోమానితలంబు ఖడ్గము భుజాద్వంద్వంబు దండంబు లె
ప్పటికిన్ బ్రోవఁగ వందిబృందముల నేర్పాటొప్పఁగాఁ జేయు ముం
గిటి రంగసన్నిధి రంగభర్త నితరుల్ కీర్తింపఁగా నేర్తురే.


ఉ.

ఎన్నఁడు సహ్యభూభవన మించుక గాంచుట తానమాడు టిం
కెన్నడు సప్తసాలగమనేప్సిత మెన్నఁడు గారుడధ్వజ
ప్రోన్నతిఁ జూచి యడ్డపడఁబోవుట యెన్నఁడు పన్నగేంద్రశా
యి న్నిను వేఁడు టెన్నఁడొకొ యిందిరమందిరు రంగమందిరున్.


ఉ.

ఉండిన శేషశైలమున నుండుట చక్కన కాకయున్న వే
దండనగప్రకాండపతిదండన యుండుట లెస్స యట్లు గా
కుండినఁ గుండలీంద్రశయనోపరిశాయి నినున్ భజించి నీ
యండన యుండుటల్ సుఖములండ్రు రమావిభు రంగవల్లభున్.


సీ.

రావణకుంభాకర్ణద్విపేంద్రములకు సింగంపువేయి మారంగశాయి
లెంకలపంకాంధ మింకింపఁదగు పొంకపుం గన్నుదోయి మారంగశాయి
కన్నబిడ్డలఠేవఁ గాందిశీకులఁ బ్రోవ బంగారుతాయి మారంగశాయి
నడపడిపిల్ల గీర్లడియనికిడ నాథునింగూడు రేయి మారంగశాయి
నింగితజ్ఞులహాయి మారంగశాయి, మంగయబలూఁతచేయి మారంగశాయి
యంగదభృతానుయాయి మారంగశాయి, భృంగసంకాశకాయి మారంగశాయి.


సీ.

పాదపపూపాన్పుపైఁ బవళింతగన్నవాఁ డడియని ప్రోల్మొగంబయినవాఁడు
తలగడసొంపుగా వల చేయిడినవాఁడు తొడఁజాచు నెడమకేల్కడిమివాఁడు
పుడమిలచ్చియు నొత్తు నడుగుదమ్ములవాఁడు పడమటితలయంపిఁ బరగువాఁడు
జేజేతపసిపాట చెవిసోఁక వినువాఁడు తాత పొక్కిటిచక్కిఁ దనరువాఁడు
మేటి గుడికోట లేడింట మెలఁగువాఁడు, గాడ్చుకడలికవాఁకయగడ్తవాఁడు
తొంటికబ్బరపు మొదటిపల్కింటివాఁడు, కలఁక గడకొత్తు మాపాలఁ గల్గినాఁడు.


క.

ఏతాదృక్ధృతికంబుధి, జాతాదృక్పంకజాత శాతద్యుకతికిన్
వాతాహతజాతాంబు, వ్రాతస్రోతస్వినీనివాసక్షితికిన్.


క.

పంకజగేహాగృహికిన్, గుంకుమసంకుమదపంకఘమఘుమితహిమై
ణాంకసుపరిమళితవిమా, నాంకబహిర్మహితమంటపాంగణమహికిన్.

క.

శ్వసవగ్రపనవ్యసనా, భ్యసనామితకిసలరసనపర్యంకునకున్
వసనాధ్యసవత్యసనా, ధ్యసనకృతస్థైర్యసూర్యదర్యంకునకున్.


క.

సంసారకరంసారస, హసారవమేఘునకు ఘృణామోఘునకున్
కంసాసురహింసాభర, శంసాభరణునకు భక్తజనశరణునకున్.


క.

కౌస్తుభమణి ఘృణిఘుసృణ ప, యస్తోమీకృతభుజాంతరాంతద్యునికిన్
వస్తుల తులసీభృతికిన్, గస్తూరీరంగపతికిఁ గమనాకృతికిన్.


వ.

అర్పితంబుగా నాయొనర్పంబూనిన పాంచాలీపరిణయంబునకుఁ గథాక్రమం
బెట్టిదనిన.


క.

ఆయాజ్ఞసేనతనయా, జాయాకళ్యాణకథలు జనమేజయ భూ
నాయకుఁ డడిగిన వైశం, పాయనుఁ డిట్లనియె సరసభాషాప్రౌఢిన్.


క.

పాంచాలదేశమున రా, ణించుం గాంపిల్యపురము నిజసౌధశిఖా
కాంచనఘనఘట్టనగళి, తాంచితరవినేమినిశ్చయదవస్రంబై.


క.

పాంచాలరాజధానీ, పంచజనుల్ ధీప్రపంచపంచేషుగురూ
దంచితమంచికలాహవ, పంచముఖుల్ భూతవిభవపంచాస్యులహా.


సీ.

అచటిప్రాజ్ఞుల కమర్త్యాచార్యుఁ డజ్ఞాతఫణితి పత్రిక వ్రాసి పంపి తెలియు
అచటి రాజనివాస మస్త్రాసనాభ్యాసభాగ్యంబునకుఁ గాచు భార్గవుండు
అచటి కోమటుల యక్షాధ్యక్షుఁ డవసరంబై యప్పు పదియైదు లడుగబంపు
ఆచళికి రెడ్డికొమాళ్ళ నల హలాయుధపాణి నాఁగునకడుగు ధాన్యంబు కొంత
అచటి యొకపాటిదొర మదహస్తులకును, నెత్తుగున్నలు దిక్కులమత్తకరులు
అచటి లేరాచలాయంపుటలఁతితేజి, కింత రెండవతరబడి యింద్రహయము.


ఉ.

కొండలు వ్రక్కలించుకొని కుండల వంచినజాడ జాఱఁగా
నుండుమదప్రకాండము పయోనిధి దాఁటి విరోధిఁదత్పయః
కాండము తొండముంగొని తగ న్నెగఁజిమ్ముచు బైటవైచు వే
దండము లుండుఁ గొండలవిధంబున నెప్పుడు నప్పురంబునన్.


మ.

కటకక్షోణితురంగసంఘములకున్ గంజాప్తుతేజీల కు
త్కటవాదం బొదవంగ మీకునడ మీకా నిబ్బరంపంగ మె
న్నటికిన్ వేరని పోరు దీర్ప నడుమం చాముండి యింద్రాశ్వముల్
నటనల్ నేరిచెఁ గానిచోఁ గను టెటుల్ ధారాధరత్వోన్నతుల్.


శా.

చూడంజూడ నొయారముల్ గులుకు రాజుల్ రాజమార్గంబులం
గూడంగూడ విరాళిఁ దేల్చిన లతాంగుల్ తల్లతాంగుల్ కడుం

బాడఁ బాడ మనంబులీఁదగిన సమ్యగ్గాయనగ్రామణుల్
వాడన్వాడ గణింపనొప్పుదురు కేవల్ గుప్పు నాప్రోలునన్.


శా.

కాంపిల్యప్రమదామణుల్ మణిశలాకారూపరేఖాకళల్
శంపావల్లిమతల్లికాతనుశిరీషల్ పూర్ణిమాసక్తన
క్తంసాకంపపరంపరాదవదనల్ కారుణ్యనైపుణ్యసూ
ర్యంపశ్యద్ధృతమధ్యకార్శ్య లఖిలశ్యామాభిరామాకృతుల్.


క.

అమ్మేటికోట పట్టుం, గొమ్మయగుం బొడవునకుఁ గొమ్మలపై లేఁ
గొమ్మల జేజేమ్రాఁకుల, కొమ్మలకొననున్న విరులకోఁతలె గుఱుతుల్.


క.

అప్రోలు చెప్పనొప్పగు, నప్రోలూఖలఖలారి వరధాన్యహతి
క్షిప్రకరముసలవిసరా, బ్జప్రద్యోతనకులాధిపప్రకరంబై.


చ.

ద్రుపదుఁడు రాజు తత్పురికిఁ దుందిలధృత్యధరీకృతామర
ద్రుపదుఁడు నమ్రదుర్మదవిరోధిశిరోధిమణీఘృణీస్ఫుర
ద్వపదుఁడు చక్రవాళపరివేష్టితభూభువనార్థిసైంధవ
ద్విపదుఁడు శాశ్వతాత్మశమభిద్విపదుండు నృపాలమాత్రుఁడే.


క.

ద్రోణాచార్యుల సమర, క్షోణిని నిర్జించునట్టి సుతు వాసవభూ
పాణిగ్రహణార్హం గ, ళ్యాణిఁ దనూజాతఁ గాంతునని యతఁడంతన్.


శా.

గంగాతీరము చేరి యాద్రుపదభూకాంతుండు కాంతారవా
సుం గళ్యాణగుణాఘృణాంబునిధి యాజుంగోరి యాచార్యవ
ర్యుం గావించి సమస్తసంయములు పేర్కోఁ బుత్రకామేష్టి చే
యంగా సాంగసమాహుతి గ్రహిళమౌ నాహెూమకుండంబునన్.


శా.

జ్వాలాభీలవిశాలదేహుఁడు మహాచాపాసిభాస్వత్కిరీ
టాలంకారుఁడు వర్మధారుఁడు శతాంగారూఢుఁడై పుత్రుఁ డ
క్కీలింబోలి జనించె వెంటనె మృగాక్షీరత్న మత్యుల్లస
ద్బాలేందూసమఫాల బాలనికసత్పద్మాస్య జన్మింపంగన్.


క.

ఇంచిన వేడుక నపు డుద, యించిన సుత కృష్ణ సుతుఁడు ధృష్టద్యుమ్నుం
డంచు నశరీరవాణి వి, రించిసముల్ మెచ్చ నుచ్చరించె నిజేచ్ఛన్.


గీ.

యజ్ఞహుతవహ్ని జనియించు యాజ్ఞసేని, సంజకడమబ్బు నడుచక్కిచంద్రలేఖ
చిగురుక్రొమ్మావి చేరిన చిన్నిచిలుక, నిచ్చలపుఁగెంపుతాళిలోఁ బచ్చవోలె.


క.

ఆక్షితిపతి యాజునకున్, దక్షిణ ధేనువుల లక్ష దయచేసి ప్రజన్
రక్షించి సుతుల నిద్దఱ, వీక్షించి ప్రమోదలహరి విహరించె రహిన్.

శా.

భూవిఖ్యాతముగా సుఖాగ్నిముఖి సంపూర్ణోదయా కోకిలా
దేవీగర్భసుధార్ణవామృతసముద్రీ నిద్ర వొమ్మంచు హే
లావైధూతలసౌధవీథి నల జోలల్పాడి యాడింతు రా
లావణ్యాంబునిధుల్ వధూమణులు తొట్లంబెట్టి రాజాత్మజన్.


గీ.

కోకిలామెత యనిపించు కుచము లించు, కోకిలాదేవి మధుమత్తకోకిలామ
లాస ద్రుపదవధూటీలలామ యొక్క, నాఁటఁ బెంచుకుమారులఁ బూటంచు చూవె.


క.

వ్రాయం జదువన్ గేయ మ, జేయతఁ జేయంగ సాము చేయన్ ఖండా
వ్రేయన్ హయ మెక్క నుపా, ధ్యాయులకడ బాల్యముననె ద్రౌపది నేర్చెన్.


ఉ.

వేయఁ గఠోరమార్గణము లివ్వలికవ్వలి కద్రదూయఁగా
వ్రేయు ధరాస్థలిన్ సబిళి వెంటనె గాంగఝరంబులేనఁగాఁ
జేయును నుగ్గునూఁచములు చెట్టును జట్టును గొట్టి బిట్టుగా
నాయనలాయనప్రభవుఁ డాయన యౌవనగర్వసంపదన్.


క.

అచ్చిన్నిచెలువ దాఁగన, మ్రుచ్చిళ్ళును నాల్గుకంబములయాటలు మే
ల్ముచ్చులును గచ్చకాయలు, నచ్చనగం డ్లాడు సరివయస్యలతోడన్.


గీ.

మూఁగుదేంట్లన ముంగురుల్ ముడికిఁ గూడ, రేగుబండ్లన ఱొమ్మున రేగునట్టి
లేఁగుచము లాఁడుపోఁడిమితోఁ గుమారి, గోఁగుఁగామవిధంబునఁ గొంతయెందె.


ఉ.

చొక్కపుఁగట్టు గట్టి పిరిచుట్టుగఁ బుట్టముఁ జుట్టి చూడి తా
గ్రక్కునఁ బైఁట వైచుఁ బ్రబగన్గొన ముంగిటి కేఁగి దాచ చా
టక్కడఁ గొను నాత్మపతి యర్జునుఁ డౌననఁబోయి శీర్షముం
జక్కగ వాంచు నిందుముఖి శైశవయౌవనసంధి సంధిలన్.


ఉ.

చొక్కపుమల్లెమొగ్గులయి చూపఱకున్ బదరీఫలంబులై
చెక్కని పోకలై విరులచెండ్లయి నిద్దపునిమ్మపండులై
చక్కని బొంగరమ్ములయి జక్కవలై యపరంజిబిందెలై
ముక్కులు నిక్కి పిక్కటిలె ముద్దియకుం జనుగబ్బిగుబ్బలున్.


క.

జిగిలో బిగి మొగమునకున్, బిగిలోబిగి చన్నుఁగవకుఁ బేదఱికములోఁ
దగుపేదఱికము నడుమున, కిగురుంబోడికి పవయోమహిమ వహి కెక్కెన్.


ఉ.

కన్నులు విప్పులై నగుమొగంబునకుం దగువన్నె దెచ్చె నున్
నున్నులు గొప్పలై యురము చక్కికి వన్నియ దెచ్చెఁ బెన్నరుల్
వన్నయ దెచ్చె సోగలయి వాటపువెన్నునకుం గటీతటం
బున్నతి గాంచి కౌనున కహో యన వన్నియ దెచ్చె నిచ్చలున్.

సీ.

కచపాళిరుచికేళి గప్పుగప్పినయప్పుడె పికిలి బిల్లి నట్టించుకొనియె
జఘనభారము కొంత జనియించినప్పుడె రథమున కలఘుచక్రం బమర్చె
మందయానప్రౌఢి సందుగొన్నప్పుడె యంచతేజీఁ గట్టె నరదమునకు
గొప్పలు గుబ్బలైనప్పుడె జైత్రయాత్రకుఁ బూర్ణఘటు లెదుర్పడియె ననియె
నింతిబొమతీరు గనిన విల్లెక్కువెట్టెె, జూపుక్రొవ్వాఁడిదేఱినఁ దూఁపుదొడిగె
బంచబాణున కెటువంటిబలిమి యెంత, జయము గలిగించెఁ బాంచాలి జవ్వనంబు


ఉ.

సింగము లెన్నిపుణ్యములు చేసెనొ యేమి తపంబు గాంచెనో
భృంగములుం గురంగములు నేసుకృతం బొనరించేనో నదీ
భంగములున్ భుజంగములు బాపురే ద్రౌపదియంగముల్ బలెన్
సంగతిగన్నవంకఁగద చాలఁబ్రసిద్ధము లయ్యె నిద్ధరన్.


శా.

కాంపిల్యంబున కెంతకీర్తి గలిగెన్ గాండీవి కెంతబ్బె నై
లింపప్రస్తుతబాహుతేజమల కీలిజ్వాల కెంతయ్యె ని
ష్కంపప్రాభవ మెంతవార్తఁదగెఁ బాంచాలోర్వి కెంతర్హతన్
సంపాదించెను యజ్ఞసేనుఁ డిలఁ బాంచాలీవిలాసంబులన్.


క.

ఈరీతి వయసువచ్చిన, నారీతిలకంబు శుభమునకుఁ గౌంతేయుల్
రారే వత్తురు దామని, రారే రాయఁడు స్వయంవరము చాటించెన్.


ఉ.

చాటినవార్త దిక్కులఁ బొసంగ వినంబడినం గళింగ క
ర్ణాటక లాట భోట కరహాట వరాట వసుంధరాది రా
డ్ఝాటము హాటకప్రకటశాటికిరీటవినూత్నరత్నముల్
పాటిలఁ దాల్చి రాఁదొడఁగెఁ బాటలగంధి వరించు నీటులన్.


సీ.

కటకంబు చేరి కీకటభర్త పనిచెక్కడపుఁ జొక్కటపు మకుటంబు దాల్చె
మకుటంబు గాదని మగధనాథుఁడు ధగద్ధగలీను కుళ్ళాయి తగధరించె
గుళ్ళాయి గాదని కొనచుంగుపిడుపుతో ధహళాధిపతి చుట్టెఁ దగడిపాగ
పాగ గాదనుచు లంపాకపాలుఁడు గట్టెఁ జెంగావి సరిగంచుజిగిరుమాలు
మఱి రుమాలువు గాదని మత్స్యనేత, చెంపసిగఁ గెంపుతాయెతు చేరుఁ బేర్చె
గోర సిగమాని నెరి సేసకొప్పుఁ బెట్టి, మొగిలి రకులు ముడిచెఁ గాంభోజివిభుఁడు.


సీ.

భోటభూభుజుఁ గాంచి లాటభర్త లలాటపట్టిఁ గప్రపుఁజుక్క బొట్టు పెట్టెఁ
జుక్కబొట్టందంబు చూచి కాదనిత్రోచి రేఖమీఱ విభూతిరేఖ దీర్చె
భూతి యేతిరంచుఁ బోనిచ్చి పన్నీట నామంబు పద నిచ్చి నాభిఁ దీర్చె
నాభినామము పుచ్చి శోభిల్లుమృగనాభి కలికపోలిక తిలకంబు దిద్దె
నీటుమీటాయెఁ బాంచాలి నిను వరించు, నంచురాకొట్టు దిట్టమో మట్టె చూచి
యట్టులైనను భట్ట నాకట్టువర్గ, మిక్కడనె యిత్తు ననుచు నీటెక్కనిలిగె.

శా.

ముష్టిగ్రాహ్య బహూపవీతకము దోర్మూలాచ్ఛపచ్ఛోటికం
బష్టాధ్యాయ సమస్తపుస్తక వృతవ్యాసమ్ము రుమ్లానిమ
త్కష్టాధోంశుక నాగవల్లి తురగస్థప్రాంజలి స్వస్తియౌ
కిష్టగ్రామ్యసుధీజనమ్ము చనుదెంచెం దత్పురీవీథికిన్.


సీ.

ఇప్పు డేతెంచితిరే లెస్సలా మీపురాణంబు విందు రా రాచవారు
రామనధానికి క్షేమమా సామమాద్యంతముల్ మావద్ద నభ్యసించె
మాష్యుఁడే వారిమాధ్వరి పిన్ననాఁడ మును చెప్పితిమి కాండత్రయంబు
హోహోహో హా కంటిమే హరిన్ మనజనార్దను సూత్రపాఠ మెందాఁక వచ్చె
నారసింహయపేరిటి నడిమివాని, వడుగు చేసితిరో లేదొ పడుచు పెండ్లి
వింటిమేకద యనుకొండ్రు వీథిఁ జేరి, యుత్సవముఁ జూడవచ్చిన యూళ్ళద్విజులు.


సీ.

గట్టంబుగ నిటలపట్టిఁ బట్టియలుగాఁబెట్టిన తిరుమణుల్ వేటులెగయ
గట్టిఁగాఁగఁ బ్రసన్నకట్టుగా గట్టిన శీర్షంపుదిరుముడి చేలలెగయ
మడతతోఁబట్టు పచ్చడపుఁ గప్పులలోన జగ తిరుమణిపొడల్ సందడింప
నొకచంకం దిరిపగూ డొకబుజంబునఁ దివాసానిన ముదిపిళ్ళ డంటినడువ
ననఘుసింగరి యుప్పళియప్పయాళు, వారుభట్టరు పాటరు వడఘనంబి
యుప్పగా రాదిగాఁగల యఖిలదేశ, వాసు లాచార్యపురుషులు వచ్చి రచట.


క.

పుడమి న్మోకారించిన, వడిలోఁ జేయూఁది శ్రీనివాసయగారే
యడియేనని యొండొరులుం, బడి రయగాం డ్రసలువెంటపట్టన కచటన్.


ఉ.

చేదలిరద్దమున్ గొనలఁజేరిన వెండికడెంబులున్ మెడల్
పాదములున్ నొసల్ పసపుపట్టెలు వీనుల లక్కయాకులున్
బాదుకొనంగఁ బుట్టములు భాసిలఁ బ్రోలిగుడువంగ నేర్పరుల్
వైదికజాతి ముత్తయిదువల్ చనుదెంచిరి ప్రోలు చేరఁగన్.


ఉ.

జెట్టియు బక్కగొల్లయును జేటికలిద్దఱు బంట్లు నెత్తిపైఁ
బెట్టిన బోనపుట్టికయుఁ బెంచినదాదియు మైలసంతఁగొ
న్నట్టిహయంబుపై యరుసునప్పుల బాపనవెచ్చగాఁడు రాఁ
జుట్టపు రాచపల్లకులు చూడఁగవచ్చె నృపాలువీటికిన్.


చ.

పసపిరుపూఁత మోమిరచ పట్టుపటంగము చీరగట్టి తాఁ
గసిబిసి యమ్ముకమ్మునకుఁ గానివిజాళ్ళు నమల్పొలంతితో
ససిమ భుజంబుపై నిసుపునాని కటీతటిఁ గూనలమ్మ కో
కెసఁగిన కట్టుగట్టి యొకయింతి నడంగని రూరఁ గోమటుల్.

ఉ.

ఎద్దులఁ జూచి మెచ్చుటల నిద్దఱుముగ్గురు నవ్వులాడుచో
గ్రుద్దుల గుంటుపోక కొఱకున్ బసయొట్టుల జొన్నదుక్కిలో
సుద్దుల సుద్దపుంబరువుఁ జూపుటలం బెడమూటచల్దులన్
గద్దఱికోడెరెడ్లు నడగాంచిరి గంజిమడుంగు రింగులన్.


ఉ.

కట్టిన పెద్దపుట్టములు కమ్మలతోఁ బడి కేల్ గళంబులం
కట్టిన పైఁడిపాదములు గన్పడ భర్తల నింటివద్దనే
పెట్టి తనూజుఁ డల్లుఁడును బెద్దఱికంబున కంటివెంటరా
దిట్టలు రెడ్డిసాను లరుదెంచిరి పుక్కిటి వీడియంబులన్.


ఉ.

నట్టువముట్టుకాండ్రు కెలనంబొరికుండలు పువ్వుదండలున్
బట్టిన బూదిగిన్నియలు పళ్ళెరముల్ పయిగంటమగ్గపుం
బట్టురువారమట్టు శివబాపనతండము దండఁ గోఁడెకాం
డ్రట్టునిటున్ బరాబరుల నగ్రమునం డలి దతికారు లేగఁగన్.


శా.

వీక్షానద్ధవిశుద్ధయాన మసకృద్వీటీదచేటీసుతాం
సక్షుణ్ణాత్మకరంబు పశ్చిమచరస్వస్వర్ణసంధాయకా
ధ్యక్షానీతభటార్భకంబు జననీతాలక్రియం బర్థ
వన్నిక్షేపంబు దిగంతదేవగృహరాణిక్యంబు చేరెం బురిన్.


శా.

లంకారాజ్యధురంధరాభిముఖ లీలాభాష్య కృద్భవ్య ప
ర్యంకాభోగశయా శయార్పిత గదాహంకార నిర్భిన్న ని
శృంకాతంక విశంకటాసుర శిరస్సంయుక్త ముక్తామణీ
పంకాసద్ధ కిరీటపాటన పటుత్వాశాయుధా శాంబరా.


క.

విట్కంఖాణఘృణీ ప్రా, వృట్కాల పయోదరచిత వేణువినోదా
చూట్కుడుత నాచమాముఖ, నిట్కాముక సకలసుకవినికర....


పంచచామరము.

మరుద్వృతా సుధాప్రవాహ మధ్యహృద్యమందిరా
మరుద్వృథా విరోధకృద్వి మర్దనాసికుర్దనా
గరుద్రుధాతుకార్థ బధ్ధగంధ వాహనా
గురుద్రుధార్మికాప్తగుప్త గోత్రజైత్రకీర్తికా.


గద్య.

ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత
సరససారస్వతలహరీపరిపాక కాకమాని ప్రబోధబుధకవిసార్వభౌమపౌత్ర
రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీతంబైన
పాంచాలీపరిణయంబను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము