పల్లెపదాలు/ఊడుపు

వికీసోర్స్ నుండి

3 ఊడుపు

—పొలము దుక్కి పూర్తి అయి నీటితో నిండి మొక్కల్ని కోరుతుంది. రంగు రంగుల చీరలు కట్టి వరుసతీర్చి మాలెతలు వంగి నాట్లు నాటుతారు. నాటుతూ సరదా కోసము పాటలు పాడతారు. దేనిని గురించి? ఊడుపును గురించే!

ఊడుపుడవం డమ్మలాలా మీ
రుడవండీ దమ్మూసేసిన నేలల్లో
ఊసులాడుకోని ఊరుకోబోకండి
ఇడదీసి వరిమొక్క లెడమెడముగ పాతండీ ౹౹ ఊడు ౹౹
బాడనక బందనక పాటుపడి నామంటే
మారాజు పనిసూసి మన కీనామిస్తాడు ౹౹ ఊడు ౹౹
ఆవూరి మారాజు ఐదణాలిస్తేను
ఈవూరి మారాజు ముప్పావలిస్తాడు ౹౹ ఊడు ౹౹

పాపము రెక్కాడినగాని డొక్కాడని ప్రాణులు. ఊరినుంచి ఊరుకి నడచి సాగిపోతూ ఏవూరి మహరాజైనా పని చేప్తాడా అని చూస్తుంటారు. వారి పని చూచి ఇనాము లిచ్చే మహరాజు లెందరో!