Jump to content

పల్నాటి చరిత్ర/శ్రీనాధుని చాటువులు

వికీసోర్స్ నుండి

శ్రీనాథుని చాటువులు

శ్రీనాధుడు పల్నాటిలో ననేక పర్యాయములు దిరిగి యనేక చాటుపద్యములు చెప్పెను.

ఆ॥ వె॥ చిన్నచిన్న గుళ్లు చిల్లర దేవుళ్లు |
        నాగులేటినీళ్లు నాపరాళ్లు।
        సజ్జజొన్న కూళ్లు సర్పంబులును దేళ్లు |
        పల్లెనాటిసీను పల్లెటూళ్లు
        
కం. జొన్నకలి జొన్నయంబలి,
        జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
        సన్నన్నము సున్న సుమీ
        పన్నుగ పలినాటిసీమ ప్రజలందఱకున్

కలియనగా తరవాణివలె బీదలు తయారుచేయు పదార్ధము. సన్నన్న మనగా వరియన్నము.

కం. రసికుడు పోవడు పల్నా !
     డెసగంగా రంభమైన యేకులెవడకున్ !
     వసుధేశుడైన దున్నును
     కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్
     
ఉ॥ అంగడి యూర లేదు వరియన్నము లేదు శుచిత్వమేమిలే !
    దంగవలింపు లేరు ప్రియమైన వనమ్ములులేవు నీటికై !
    భంగపడంగ బాల్పడు కృపాపరులెవ్వరు లేరు దాత |
    లెన్నంగను సున్నగాన పలినాటికి మాటికిబోవనేటికన్ |

పల్నాటిలోని కొన్ని గ్రామములగూర్చి చెప్పిన పద్యములు.

గురజాల:-(భోజనమూదొరకుట తేలుమందు దొరకునంతటి కస్టమాయెను)

కం॥ తేళులమందుగ బోనము ।
    పాలాయెను మంచినీరు, పడియుండుటకే
    నేలేకరువైపోయెను
    కాలిన గుర్జాల నిష్టకామేశహరా!
    

పులిపాడు:-

ఆ॥ వె॥ ఊరువ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
       కాపుకపివరుండు కసవునేడు |
       గుంపుగాగజేరి గురిజాల సీమలో !
       నోగులెల్ల గూడి రొక్క చోట!!

ఊరి పేరు వ్యాఘ్రనగరము (పులిపాడు) కరణము పాము (శేషయ్య) కాపుకోతి (హనుమయ్య) గ్రామాధికారి కసవు (పూరిపుల్లతోసమానము-పుల్లయ్య)

నెమలిపురి:-

కం॥ నెమలిపురి యమపురంబుగ,
    యముడాయెను బసివి రెడ్డి, యంతకు మిగులన్ |
    యమదూత లైరి కాపులు |
    క్రమమెఱుగని దున్న లైరి కరణాలెల్లన్

అడిగొప్పుల:- హోరుగాలివలన నిద్రపట్టక యొక గుడిలో పరుండెను. గుడిమీదనున్న కోతివలన నచటను నతనికి నిద్రపట్టలేదు. గుడిలోపలనున్న నంబివారి కోడలు దానికి తోడయి నిద్రపట్టనందున నడివీధిలో పరుండెను. నడివీధిలోనున్న యొకజారిణి కారణమున నచ్చటకూడ నిద్రపట్టలేదు. తెల్లవారగనే యాగ్రామమునుండి వెడలిపోవుచు చెప్పిన పద్యము.

కం॥ గుడిమీది కోతితోడను !
     గుడిలోపలి నంబివారి కోడలి తోడన్
     నడివీధి లంజతోడను।
     నడిగొప్పుల హోరుగాలి నణగితి ననుమా॥
     

కారెమపూడి:-

ఉ॥ వీరులు దివ్యలింగములు విష్ణుడుచెన్నుడు, కళ్లి పోతురా |
    జారయ కాలభైరవుడు, నంకమ శక్తియె యన్నపూర్ణగా |
    గేరెడు గంగధారమడుగే మణికర్ణికగా జెలంగు నీ |
    కారెమపూడి పట్టణము కాశీగదా పలినాటివారికిన్|
    

శ్రీనాధుడు భోగి, మరియన్నము దినుచు సన్నని వస్త్ర

ముల గట్టుచు నుద్యానవనములందు దిరుగుచు మృదు శయ్యల బవ్వళింపుచు విలాసముల దేలువాడు, పల్నాటిలోని గ్రామజీవితమును నందలిజొన్నన్నము రుచింపలేదు. అదియును గాక యాకాలమునాటి స్తితిని శ్రీనాధుడు వర్ణించియుండును. కాని యిప్పుడు మార్పు జెంది నాగరికతయందు పల్నాడు పురోగమించినది.

ప్రస్తుత స్థితి

____________

రెంటచింతలలో పెద్ద మిషన్ వైద్యాలయము కలదు. ఆ గ్రామమునందే గ్రుడ్డివారిలకు పాఠశాలకలదు. అక్షరముల నుబ్బెత్తుగా పెద్దవిగా ప్రత్యేక కాగితములమీద తయారు చేయుదురు. గ్రుడ్డివారలా యక్షరముల దడిమి చూచి స్పర్శ జ్ఞానముచే వారియాకారములు తెలిసికొని చదివెదరు. వారికై తయారుకాబడిన ప్రత్యేకపుస్తకములను మాత్రమే చదువ గలరుకాని యన్ని పుస్తకములను చదువలేరు. ఇచ్చట మంచి రాయిదొరకును, గచ్చుగోడలుకట్టుటకు రెంటచింతల రాయి ( శ్రేష్టమయినది. కాగితములమీద బరువునకై పెట్టు రాళ్లను (Paper-weights ) అందముగా తయారు చేయుదురు. దుర్గిలో పనితనముగల రాతివిగ్రహములను తయారుచేయుదురు. తాళ్లపల్లిలో పట్టంచు ఖద్దరు దోవతులను నవారును పరదాలను తయారుచేయుదురు. ఇండ్లకు పఱచు టకు పనికి వచ్చు నాపరాయి పల్నాటిలో విరివిగా కొరకును.