పల్నాటి చరిత్ర/దృశ్యములు, పుణ్యక్షేత్రములు, తిరునాళ్ళలు
రెంటచింతల, మాచర్ల, రాయవరము, గోలి మొదలగుచోట్ల నాపరాయితీసి యితర జిల్లాలకు రైలుమీద నెగుమతి చేయుదురు. పిడుగురాళ్ల వద్ద సిమెంటుకు పనికివచ్చు రాయికలదు. దానిని తీసి రైలు మీద తాడేపల్లిలోని సిమెంటుఫాక్టరి యెగుమతి చేయుదురు. కారెమపూడిలోను దాచేపల్లిలోను ఆకుతోటలు, నారింజ మొదలగు ఫలవృక్షములు గల తోటలు నాగులేటి నీటిచే సాగగుచున్నవి. దండుబాటలో కృష్ణకీవలిగ్రామమగు పొందుగుల వఱకును, ఆవలి గ్రామమగు వాడపల్లి నుండి హైదరాబాదుకు మోటారు సర్వీసు కలదు. హైదరా బాదు వాడపల్లికి 100 మైళ్లుండును. కృష్ణను పడవలలో దాటెదరు. నాగార్జునకొండ ప్రాంతమున కొండపిండియని పిలువబడు చెట్టుపూత దొరకును. దూదికి బదులు పరుపులకు దిండ్లకు వాడిన చలువగానుండును. కారెంపూడి ప్రాంతమున నడవులలో నుండు కొరనాసియను జంతువునుండి క్రొవ్వుదీసి వాతనొప్పులకు నౌషధముగా వాడెదరు.
పిల్లుట్ల:- గుఱ్ఱం వీరారెడ్డిచే స్తాపింపబడిన అనాధశరణాలయ మున్నది. హైస్కూలు వసతి గృహము నున్నవి.
దృశ్యములు
ఎత్తిపోతల:- ఇది జలపాతము, చంద్రవంక వాగులోని నీరు 66 అడుగుల ఎత్తునుండి క్రిందికి దుముకుచుండును . చూచుటకు మనోహరముగా నుండును. మాచర్లకు 5 మైళ్ళ దూరమునను కృష్ణానదికి మూడు మైళ్ల దూరమున నిదికలకు. త్రికోణాకారముగల లోయలోనికి నీకు దుముకి యటనుండి కృష్ణలోకలియును. లోయలోనికిదిగి నీరు పడుచోటికి పోవ చ్చును. సడి వేసవిలోనైనను కొద్దిగానైనను నీరు దుముకుచుండును. గొట్టిపాళ్లవద్ద పెద్దదూకుడు, చిన్నదూకుడు అను రెండు జలపాతములును, దైదవద్ద బీనీలగుండమను చిన్న జలపాతమును కలవు.
నాగార్జునకొండ:- దీనివిషయము ప్రత్యేకముగా వ్రాయడమైనది.
నాయకురాలి కనుమ:- కారెంపూడికి దక్షిణమున నాల్గు మైళ్ల దూరమున రెండు కొండలమధ్య నాగులేరు ప్రవహించును. దానిని నాయకురాలికనుమ యందురు. ఇచ్చట చిన్న యడవికలదు. కారెంపూడినుండి వినుకొండకు పోవు రోడ్డు యాకనుమగుండ పోవును.
గుత్తికొండ బిలము:- గుత్తికొండయము గ్రామమునకు మూడు మైళ్ళ దూరమున నుండును. చిన్న అడవియు కొండలును కలవు. కొండకు నొక పెద్ద బిలము (పెద్దకన్నము) కలరు. బిలము రమారమి 160 గజములుండును. కొన్ని చోట్ల విశాలముగను కొన్ని చోట్ల నిరుకుగను నుండును. ఇరుకుగానున్న చోట్ల వంగి పోవలెను. త్రోవలో చీలని చిన్నబిలములు కొన్ని యుండును. చీకటిగానుండును. అందు మంచి నీరుండును .పొడి వంటి తెల్లని పదార్థము నీటిపై తేలచుండును. బిలము ముందర నొకకరణము సమాధియున్నది. కొండమీదకురిసిన వర్షపు నీటిలోని కొంతభాగము కొండలోనికిదిగి ప్రకృతిసిద్ధముగా నాకొండలో నేర్పడిన ఖాళీ స్థలములో నానీరు నిలిచినది. బయటినుండి యానీటివద్దకు బోవుటకు మార్గముగా బిలము పకృతిసిద్ధముగా యేర్పడినది. దైదవద్దకూడ నొక చిన్న బిలము కలదు. శివరాత్రినాడు యాత్రికులచ్చటకు పోయెదరు.
కారెమపూడి వీరులగుడులు:- నాగలేటియొడ్డున గంగధార మడుగునకు సమీపమున యుద్ధములో చనిపోయిన వీరుల పేర చిన్న గుడులు, విడి స్తంభములు, మండపములు కొన్ని కలవు. కొన్ని శాసనములుకూడ కలవు. దానికి సమీపముననే యుద్ధము జరిగిన ప్రదేశముకలదు. ఇప్పుడది రైత్వారీపొలముగా నున్నది.
పుణ్యక్షేత్రములు
మాచర్ల:- చెన్న కేశవాలయమున్నది. ఇది చాల పూర్వుల ప్రతిష్టయనియు ఈగుడిని బ్రహ్మనాయుడు పెద్దదిగా కట్టించి మండపప్రాకారాదులు నేర్పఱచెనందురు. ఆలయము పెద్దది, జమ్ములమడకయను నగ్రహార మీగుడికీనాముగానున్నది. ఇది H R E బోర్డు వారి పాలన క్రింద నున్నది. ఇందు ఆదిత్యేశ్వరాలయము (శివాలయము), శిథిలమయిన వేంకటేశ్వరాలయము కలవు. మండప స్తంభములమీ దను ఆలయప్రాకారపు గోడలమీదను శిల్పకళ చిత్రింపబడి యున్నది. వీరభద్రస్వామి గుడి మండపపు పైకప్పు యొక్క లోపలిభాగమందు పురాణకధలు చిత్రింపబడినవి. వేంకటేశ్వరాలయపు ద్వారబంధముల శిల్పకళ చాల రమ్యముగానుండును. ఆలయమునకు పెద్ద రధముకలదు. రధచక్రములు మూడు గజముల యెత్తుండును.
ఏలేశ్వరము:- మాచర్ల నుండి నాగార్జునకొండ మీదుగ పడమర మూడుమైళ్లుపోయి కృష్ణానదిని దాటిన యేలేశ్వరపు శివాలయ ముండును ఇది నైజాములోనిది. శివరాత్రికి యాత్రికులు పోయెదరు. బ్రహ్మనాయని విగ్రహముకలదు.
సత్రశాల:- కృష్ణానదియొగ్గున జెట్టిపాలెమను గ్రామమునకు మూడు మైళ్ల దూరమునగల శివక్షేత్రము, శివరాత్రికి తిరుణాళ్ల జరుగును. చాలమంది యాత్రికులు వచ్చెదరు. పడవనెక్కి కృష్ణానదిమీద విహారము చేయవచ్చును.
సంగమేశ్వరము:- పొందుగుల వద్ద కృష్ణానదిని దాటిన యావలి యొడ్డునగల వాడపల్లియను గ్రామము వద్ద నిదికలదు. ఇది శివక్షేత్రము. శివలింగముపైనగల గుంటలో నీరుండును. ఆనీటిని పాఱపోసినయెడల మరల నీరూరుచుండును. ఇది నైజాములోనిది.
మట్టపల్లి:- తంగెడ వద్ద కృష్ణనదాటిన యావలి యొడ్డున నిదికలదు. ఇందు నరసింహస్వామి యాలయముకలదు. ప్రతి సంవత్సరము వైశాఖ పూర్ణిమ నాకు యుత్సవము జరుగును. ఇది నైజాములోనిది. O గుత్తికొండ బిలము:- తొలి యేకాదశినాడు చాల మందివచ్చి బిలములో స్నానము చేసి దానికి దగ్గరగానున్న చేజెర్లలోని కపోతీశ్వరాలయమును దర్శింపపోయెదరు.
తేరాల:- మాచర్లకు అయిదు మైళ్ల దూరమున కలదు. ఇందు సిద్ధేశ్వరస్వామిగుడి గలదు. శివరాత్రికి యాత్రికులు వచ్చెదరు. అచ్చటగల యొక గుండములో స్నానము చేసి గుడి లోనికి పోయెదరు.
ఎత్తిపోతల:- లోయలోగల రంగనాయక స్వామియాల యమునకు వైకుంఠయేకాదశినాడు కొందఱు యాత్రికులు పోయెదరు
దైద:- గ్రామము వెలుపలనున్న శివాలయమునకును దానికి దగ్గరగానున్న బిలమునకును శివరాత్రికి యాత్రికులు పోయెదరు. ఇచ్చటకు రెండు మైళ్ల దూరమున కృష్ణానదికలదు. కొండలోనుండి శివలింగమునకు క్రిందుగా నీటిధార యన్ని ఋతువు లందును వచ్చుచుండును. వానిని బుగ్గలనియెదరు. బుగ్గనీరు కృష్ణలో కలియును. కొండపైనపడినవర్షపు నీటిలో కొంతభాగము కొండలోని కింకును. ఆ ఇంకుడు వలన బావిలో జలలవలె ధారగా నీకు కొండనుండి బయటికి వచ్చుచుండును. దుర్గి వద్దకూడ నిట్టిబుగ్గలు కలవు.
ముఖ్యమగు తిరుణాలలు
శివరాత్రికి సత్రశాల, తేరాల, దైద మొదలగు చోట్ల తిరుణాలలుజరుగును. చైత్రశుద్ధ పూర్ణిమ మొదలు మాచర్లలో లక్ష్మీచెన్నకేశవోత్సములు జరుగును. చైత్ర బ॥ పంచమినాడు రధోత్సవము జరుగును. అప్పుడు వేలకొలది జనులువచ్చెదరు. కార్తీక అమావాస్యనుండి కారెంపూడిలో వీరుల తిరుణాల జరుగును. మార్గశిర పూర్ణిమనాడు గురజాలలో పాతపాటమ్మ తిరుణాల జరుగును. పైమూడు తిరుణాలలకును పల్నాటివీరుల కధలు సుద్దులుగా చెప్పెదరు. క్రిసమసు పండుగకు రెంటచింతలలో క్రిస్టియనులతిరుణాల జరుగును.
పెందోట
పల్నాటిలో నాగార్జునకొండకు 8 మైళ్ల నైరుతి మూలన కృష్ణాతీరము పెందోటయను పట్టణము 16, 17 శతాబ్దము లలో నుండినది. ఇప్పుడా ప్రదేశమంతయు యడవులతో నిండి యున్నది అందలి దండపాణీశుని యాలయముకూడ యిప్పుడు లేదు. పెదోటవారిప్పు డచటచ్చట వలసవచ్చియున్నారు. పెందోటను పాలించిన మార్కండేయ భూపాలుడు క్రీ. శ. 1585 ప్రాంతముననుండెను. మహమ్మద్ ఖులీ ఖుతుబ్ రశాహీ యను తురుష్క - ప్రభువు క్రీ.శ 1580 మొదలు 1611 వఱకు గోలకొండ రాజ్యమును పాలించెను. అతనికీ మార్కండేయ ప్రభువు సామంతుడై దండయై యతని రాజ్యవిస్తరణకు తోడ్పడెను. తుర్కారాజకవి అయ్యంకి బాలసరస్వతి యను నిరువురు కవుల నీమార్కండేయ ప్రభువు పోషించెను. స్కాంద పురాణము లోని నాగరఖండమును వారిచే తెలుగు చేయించి తాను కృతి నొందెను, మార్కండేయ ప్రభువు విశ్వబ్రాహ్మణుడు. నాగర