పరమయోగి విలాసము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పరమయోగివిలాసము.

షష్ఠాశ్వాసము.

హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూతసంకాశ! శ్రీవేంకటేశ!
మునిశాలికాసారముఖ్యభక్తాళి
వనమాలి! యవధారు వరదానశీలి!
దండిమైఁ గావేరి దండసంపదల
మండలం బగుచోళమండలంబునను
గడలేని యలపూర్వకడలికిం జక్కఁ
బడమటిదెస నొక్కపట్టణం బొప్పు
మునుపు నచ్చోట సన్మునిసేవ్యబిల్వ
వనభూమిలోన నవ్వనజాతనిలయ
హరిఁగూర్చి తపముసేయఁగ శౌరి వచ్చి
వరమిచ్చి ప్రేమ నివ్వటిలంగ మెచ్చి
పరిరంభణము సేసి పాలించుకతనఁ
బరిరంభపురినాఁగఁ బరఁగునప్పురమ

దొరయంగఁ గృతయుగాదులనుండి వరుస
హరిణాదివర్ణయుక్తాంగము ల్గలిగి
శ్రుతు లుద్ధరించి యచ్చోఁ గర్దమాది
వితతభక్తికి మెచ్చి వేల్పులు గొలువ
జలజలోచనుఁడు ప్రసన్నుఁడై యెపుడు
నెలకొనియుండు దానికి సమీపమున
ననుపమం బగుకమలాపూర్ణనగర
మననొప్పుపురవరం బాపట్టణమునఁ
గమలామనోహరు కార్ముకాంశంబు
కమలలోచను పాదకమలవంశమున
ఘనత కార్తికకృత్తికను జనియించి
యనుపమయోగవిద్యాసక్తుఁ డగుచు
జననవేళనె రమాస్వామికటాక్ష
మును జెంది తద్ధ్యానమున విలసిల్లి
కామినీమణులకుఁ గందర్పుఁ డర్థ
కామలోకమునకుఁ గల్పభూజంబు
పరులకుఁ గాలుండు పరమయోగులకుఁ
బరతత్త్వ మఖిలభూప్రజలకు రాజు
వివరింపఁగాఁ జతుర్విధకవిత్వములఁ
గవివరేణ్యులకెల్లఁ గర్తయు నగుచుమును రంగమున నొప్పు మురవైరికరణి
జనులెల్లఁ దనుఁ బెక్కు సరణులఁ బొగడఁ
బరకాలుఁ డనుపేరఁ బరఁగునాఘనుని
కరలాలితం బైన కరవాలవల్లి
యరివీరరక్తతోయంబుచేఁ బ్రబలి
పరఁగ సత్కీర్తి పుష్పంబుల నగుచుఁ
బరమయోగీంద్రుఁ డాపరకాలుఁ డఖిల
ధరఁ జతుర్విధకవిత్వస్వామి నాఁగ
బిరుదంబు నలరమాప్రియునిచే నంది
సిరిమించి వరకవిసేవ్యుఁడై మించె
నీరీతిఁ జోళరాజేంద్రునిరాజ్య
భారమంతయు భుజాబలముచేఁ బూని
జనులెల్లఁ దనుఁ గాంచి జయవెట్టుచుండ
ననుపముండగు మంత్రి యైయు౦డె నంత
బరిరంభపురసమీపంబున నాగ
పురి యన నొకమహాపురము శోభిల్లు
మదనునితండ్రిసద్మంబు లచ్చోట
బదునొకం డొప్పు నభంగవైఖరుల
రంజితకిన్న రీరత్నాంఘ్రికంజ
మంజీరశింజిత మంజుఝంకార

చలదలమకరందసంకీర్ణ విమల
నలిన కైరవకోకనదపుండరీక
కలకంఠ చక్రవాక క్రౌంచహంస
కులకలరావసంకుల మైనకొలను
అరయంగఁ దత్పురప్రాంతంబు నందుఁ
గర మొప్పు ధవళపుష్కరిణి యనంగఁ
గమలాక్షు నాజ్ఞ నక్కమలాకరమునఁ
గొమరొందు నొక దివ్యకుముదంబునందు
గడివోని పూముల్కి గతి వేల్పు జెలువ
పొడమి యవ్విరిసెజ్జఁ బొలు పొందునంతఁ
జంక మందులసంచి జగజంపువలువ
పొంకమై నిజకర్ణముల నొప్పుదూది
కునివడఁ జుట్టిన కుఱుమాపుపాగ
యనువంద పంచలోహంపుటుంగరము
నురుతరం బైనట్టి యూర్థ్వపుండ్రంబు
కరమొప్పు వలకేలికరకకాయలును
బెరయఁ బచ్చడముతోఁ బెనుపడసంది
నరగనుపట్టు బాహాటపుస్తకముఁ
బనుపడ లో గుణపాఠంబుఁ జదివి
కొనుచు మూలికలు దిక్కులఁ జూచికొనుచుఁగమలాక్షపాదపంకజభక్తినిరతుఁ
డమృతహస్తి యనంగ నలవడువాఁడు
నెన్న ధన్వంతరి కెనయైనవైద్యుఁ
డన్న గరన యుండునతఁ డేగుదెంచి
కొమరారు నెదుటి యాకొలను వీక్షించి
క్రమమునం దత్తటాంగణసీమఁ జేరి
స్నానంబు సేయంగఁ జని సరోవరము
లోనఁ బూవిల్తువాలును గేలిగొనుచు
నొకతెల్లగలువలో నున్నపూబోఁడి
సుకుమారి యగు వేల్పు జూలి నీక్షించి
యెలమితో రేయి ము న్నే తెంచి కలువ
నిలిచిపోకున్న వెన్నెల సోఁగ యనఁగ
నావనజాస్త్రుపుష్పాస్త్రమంత్రాధి
దేవతయో యనఁ దెలివొందఁ జూచి
తనయులు లేమి నాతరళాయతాక్షి
గొనకొన్నకూర్మి నక్కునఁ జేర్చికొనుచుఁ
దనరార నిజనిశాంతమున కేతెంచి
తనసాధ్విచేతి కాతన్వంగి నొసఁగి
యక్కన్యఁ గొనివచ్చినట్టియాచంద
మక్కజంబుగఁ దెల్పి యాత్మ నుప్పొంగియల్లిలో నుదయించె నని యెన్ని కుముద
వల్లినామం బిడి వారనిప్రేమఁ
బదివేలతెఱ గుల బాల నిర్వురును
ముదమున మిగుల గోమునఁ బెంపుచుండ
నానాఁటఁ బొదలి యానాళీకవదన
యేనాఁట వెఱఁగైన యెలమించువోలెఁ
జివురువిల్కాని తేజీకూన యనఁగ
నవకమై యపరంజినక్కు డెందమున
నెలజవ్వనం బను నెలదోఁటలోన
మెలఁగుచుండెడు కోడిమెక మొకో యనఁగ
వలనొప్పు శృంగారవాహినిలోన
బెలకెడు క్రొమ్మించు బేడస యనఁగఁ
గనుపట్టియున్న చక్కనిపట్టిఁ జూచి
జననియు జనకుండు సంతసం బెసఁగ
నివ్వాలుగంటికి నివ్వాలుమేన
జవ్వనం లొయ్యన ససులొత్తఁ దొడఁగెఁ
దగువరుఁ డెవ్వఁ డుద్వాహంబుసేయ
జగతి నాగతి వాఁడె సంభవించినను
గుఱిగ నేతత్కులగోత్రనామంబు
లెఱుఁగక యీకన్య నీనెట్లువచ్చునని యిట్లు చింతింప నంతఁ గందర్ప
వనవల్లి కైరవవల్లి నిచ్చలును
బరకాలుగుణము రూపము నుదారతయు
సరసత్వమును భువిజనులచే వినుచు
హరిరూపసంసక్త యైన వైదర్భి
సరవిఁ బరాంత కాసక్త యైయుండెఁ
కనకాంగవల్లియౌ కైరవవల్లి
యనుపమరూపరేఖాదిసంపదలు
జనులెల్లఁ బొగడ నాశాత్రవాంతకుఁడు
విని డెందమునఁ గడువిస్మయం బంది
యనపత్యుఁ డావైద్యుఁ డమ్మహాత్మునకుఁ
దనుజాత లెవ్వ రింతకుమున్ను లేరు
ఆరయ సకలలోకాద్భుతం బగుచు
నేరీతిఁ గల్గెనో యీకోమలాంగి
యని తదాసక్తుఁడై యతఁ డొక్కనాఁడు
తనసీమ కేగుచందంబునం గదలి
చనుదెంచి హితబంధుసహితుఁడై మోద
మున నాగపట్టణమ్మున కేగుదెంచి
యాపండితునియింటి కరిగి చుట్టరిక
మేపార నాతని నెలమిఁ గైకొనుచు

మెల్లనె యింటిలో మెలఁగెడుకుముద
వల్లి సౌదామినీవల్లీమతల్లి
యరవిందశరునియాఱవసాయకంబొ
వరయోగిదృష్టికవాటకుంచికయొ
యనుచు నంతంత రెప్పార్పక చూచి
యనియె నావైద్యుతో నాపరాంతకుఁడు
ఏరీతిఁ గాంచితి వీచంద్రవదన
నీరామ నీవు నా కిమ్ము వేవేగఁ
బలుమాట లేల తప్పదు విను తుదిని
నిలువెడుధనమైన నీకు నిచ్చెదను
అన విని మోది చి యాసుధాహస్తి
యనియెఁ గ్రమ్మఱ శాత్రవాంతకుఁ జూచి
రమణొందు నిన్నగరంబుచెంగటను
గమలినిలో నొక్కకలువ నీచెలువ
చెలువార నుదయించి చెన్నొందువేళ
నలకొలంకునకు నీరాడంగ నేగి
యచ్చటనున్న యీయరవిందనయన
మచ్చికఁ దెచ్చి యిమ్మాడ్కి నిర్వురము
కన్నబిడ్డలకన్నఁ గడువిశేషముగఁ
జెన్నార నెత్తి పెంచితి మింత గాఁగఁ

దలపోయ నీవంటిధవుఁడు కన్నియకుఁ
గలుగుటకంటె వెగ్గలమె యీపసిఁడి
కోరికె నీవంటిగుణనిధానంబు
చేరె నీచెలువ నిచ్చెద నైన నొకటి
పడుచువాఁడే పిన్నపడుచు మాతోడ
నొడఁబాటుఁ గావించె నొండుచెప్పెదను
సరసిజాక్షునిశంఖచక్రచిహ్నములు
భరియించి పరమప్రసన్నుఁడై యెపుడుఁ
జారువైష్ణవసహస్రమున కన్వహము
నారగిం పొనరింతు నని యొడఁబడిన
వానికిఁ గాని యీవలదని యనియెఁ
గాన నీ వారీతిఁ గావించితేని
వరియింపు మనిన నావైద్యు నీక్షించి
పరమానురక్తుఁడై పరకాలుఁ డనియె
శ్రీకాంతువరచక్రచిహ్నముల్ మున్న
నాకుఁ గల్గినవి వైష్ణవుఁడ నామీఁద
నతిభక్తి నీవన్నయట్ల వైష్ణవులఁ
బ్రతివార మారగింపఁగఁ జేసికాని
పునిగి యే ముందరభుజియింప నొల్ల
ననుచు నాడినమాట కంగీకరించిశ్రీమించ దివిజు లచ్చెరువంది పొగడ
రామాభిరామఁ గైరవవల్లి నపుడు
వరవైభవంబుల వైదర్భి శౌరి
వరియించు తెఱఁగున వరియించె నంతఁ
గుటిలకుంతలఁ దోడుకొని సంభ్రమమున
సటనమై సకలసన్నాహంబు మెఱసి
యగణితబంధుమిత్రాళి సేవింపఁ
బొగడొందు తనపురంబున కేగుదెంచి
ప్రతిలేనిప్రతిన దప్పక నెమ్మితోడ
సతతంబు వైష్ణవసాహస్రమునకు
నియమంబు వాటిల్ల నిజనివాసమునఁ
బ్రియమార షడ్రసోపేతంబు గాఁగ
నారగింపఁగఁ జేసి యటమీఁదఁ దాము
నారగింపుచు మఱి యంతటం బోక
కలధనం బెల్ల నీగతి వైష్ణవులకు
వలసిన వారి కవ్వారిగా నిడుచు
నతఁడు చోళాధీశుఁ డౌటయు మఱచి
యతనికిఁ దా మంత్రియగుటయు మఱచి
కడపట నెవ్వ రెక్కడఁ బోయిరేని
యెడపడకుండ నా కివ్విధంబుననుశ్రీవైష్ణవులసేవ సేయంగఁ గలిగె
నే వెఱవను సురానీక మెదుర్ప
వనమాలి జగదేకవల్లభుం డతని
తనయవర్గంబు తద్దాసవర్గంబు
వారలు తమసొమ్ము వారక తామ
యారగించెదరుగా కనియెడు తలఁపు
మదిలోన నిలిపె నెమ్మదిఁ బరాంతకుఁడు
పొదలి శంకాతంకములు లేకయుండ
జనులుచే నీతనిచందంబు చోళ
జనవల్లభుఁడు సవిస్తరముగా నెఱిఁగి
పడతాళ్ళచేతఁ దీర్పరుల మన్నీలఁ
దడయక పిలిపించి తద్వార్తఁ జెప్పి
పనిబూని ఘనరాజ్యభార మంతయును
దనమీఁద వైచి తద్దయు నమ్మియుండ
నేపున నాసొమ్ము హితుఁడునుబోలె
బాపురే దాసర్లపాలు సేయుచును
అకట! యెన్నాళ్ళాయె నౌరౌర! నగరి
కోకకాసు చెల్లింపకున్నాఁ డటంచుఁ
గరముల మీస లొక్కటఁ దీటికొనుచు
బెరయంగఁ గరణాలఁ బిలువుఁ డటన్నఁపసమించు తెలివలిపంపుబింజియలు
పొసఁగఁ జుట్టినయట్టి బోడకుల్లాలు
చింపికుప్పసములు చెవిదోరములును
సంపుటంబులతోడ జంపాడునొడలు
బిగువుగాఁ జెంపదోపినబలపములు
తగనలవడఁగ నత్తఱి గరణికులు
చనుదెంచి నిలిచి హస్తములు మోడ్చుటయుఁ
గని వారితోఁ జోళకాంతుఁ డిట్లనియె
నేమోయి! పరకాలుఁ డేలుచునున్న
సీమ దానెంత నేఁ జేసినయట్టి
యుమ్మడియును రాణె యుత్తరు వమర
మిమ్మెయి డింప మా కియ్యేటివఱకుఁ
బెల్లినధన మెంత చేసేత నతఁడు
చెల్లింపఁగా వలసిన ధన మెంత
యడరక మీర లున్నది యున్నయట్టు
తడయక చెప్పుఁ డాతనిచేత మీరు
లంచపంచంబులు లావుగా నంది
వంచన చేసి విశ్వాసంబుఁ దక్కి
తొడిబడ నెవ్వఁ డిందులలోన నేమి
యడఁచిన మీయాట లాడింతు ననినఁగరణముల్ తమపంచకరణముల్ బెగడఁ
జరణముల్ దొట్రిల జననాథుఁ జూచి
దేవర యిన్నాళ్ళుఁ దెగి విచారంబు
గావింపకుండ నీగతి యయ్యెఁ గాక
నీవచెప్పుమటన్న నిమిషంబులోన
నేవిన్నవింతుము నీపాదమాన
నెఱవుగాఁ బర కాలునికి ననిశంబు
వెఱచినగతి మీకు వెఱవ మెన్నఁడును
ఘనరాజ్యభార మొక్కట నావటించి
జనులకు రెండవస్వామి యైయుండు
కతన నాతనిమీఁదఁ గలిగినలెక్క
క్షితినాధ ! యేము దాఁచితి మింతదాఁక
నీలీల మీ రానతిచ్చిన నాతఁ
డే లెక్క చెప్పెద మేలెక్క యైనఁ
జెన్నుగా మీచేత సీమ దాకట్టు
కొన్నదిమొదలు మైకొని యొక్కకాసు
సెలవుసేయక తుది చెల్లింప లేదు
పలుమాట లేటికిఁ బలుమాఱు నింక
నన విని కసలి చోళాధినాయకుఁడు
కనుగవ విస్ఫులింగము లుట్టిపడఁగనోలగం బిరుమేల నొనరింపుచున్న
కాలకింకరభయంకరులఁ గింకరులఁ
గని మీరు చని పరకాలచోరకుని
ఘనరోషముస నొంటికాలనె యాఁగి
తరవిడివెనక ముందరిధనంబునకు
హరువుగైకొనుఁడు లేదనిన నాగడుసుఁ
గుదియంగఁ గట్టి తోకొని రండటన్న
ముదమునఁ గరములుమోడ్చి యాభటులు
పరువడి నేగి యాపర కాలునగరి
కరిగి లోపలనున్న యరిదండధరుని
జేరి కేల్మొగిచి వచ్చినరాకఁ దెలిపి
ధారుణీనాథునిధనము వేవేగ
లెక్కించి కలది చెల్లింపు కాదేని
గ్రక్కున పతిసముఖమున కేతెమ్ము
అమరంగఁ బజెప్పెద మని తలంపకుము
తమ కిది మిగుల నుత్తరువైన తరువు
అన విని తనయేలునట్టిరాజ్యంబు
ధనమెల్ల వైష్ణవార్థము వెచ్చబెట్టి
భూనాథుధనమెల్లఁ బొందుగా నొసఁగ
లేనివాఁడయ్యుఁ దాలిమి వోవనీకవెనుకద్రొక్కక గుట్టు విడువక భటులఁ
గనుఁగొని పలికె నుత్కంఠ దీపింప
నాసీమ [1]పసిఁడియంతయు నాఁడునాఁడె
చేసేత మునుపుగాఁ జెల్లించినాఁడ
నిలువ యేమాత్రము నిలిచియున్నదియొ
తలపోయ నదియు నుత్తరువు ళుమ్మళియుఁ
ద్రోయంగ మఱియు నందులకు నిందులకుఁ
బోయెఁ బొమ్మని వారిఁ బులిమిపుచ్చుటయుఁ
గనలిభూపతి బోడుకలు కొంగువట్టి
పెనచి రాఁ దిగిచి గుంపించి యీడ్చుటయుఁ
గుపితుఁడై పులి మేలుకొన్నచందమున
నపుడు వారలఁ జూచి యందంద కినిసి
గట్టులగతి నిరుగడల నున్నట్టి
జెట్టులఁ జూచి దర్జించి యాఘనుఁడు
పొట్టక్రొవ్వినవీండ్రఁ బోనీక వేగఁ
బట్టుకొ మ్మన విని భటులనందఱను
మొత్తి మోదరలాడి మొనసి గుండెలకు
నెత్తురు దిగఁదన్ని నీటెల్లఁ జెఱచి
శౌరికింకరులు నిచ్చలుఁ గాలదండ
ధారికింకరులఁ బోఁ దఱుముచందమున

మొగము క్రిందుగఁ దల మోసాలదనుకఁ
బగటెల్లఁ జెడఁ గాళ్ళుపట్టి యీడ్చుటయు
నవశులై తెలిసి చోళాధీశుభృత్యు
లవిరళ శోకార్తు లగుచు వేఁబోయి
యోలగం బొనరింపుచుండినయట్టి
చోళేంద్రుఁ గని మ్రొక్కి స్రుక్కి యిట్లనిరి
స్వామియానతి[2] జాడఁ జని పరకాలు
నేమందఱము ధన మిమ్మని యడుగఁ
జిడిముడిచే జెట్లచేత గుద్దించి
కడకాలు వట్టి దిగ్గన నీడిపించి
కనలి మీకును దిక్కు గలిగినవారి
కిని జెప్పికొండని గేలిబెట్టినను
ఇచ్చలో నెంతయ నీవె ది క్కనుచు
వచ్చితి మింక దేవరచిత్త మనుచుఁ
గడపటఁ దమమేనిగాయముల్ చూపఁ
గడునుగ్రుఁడై చోళకాంతుఁ డవ్వేళ
దళవాయి రావించి తడయక నీదు
దళములు నీవు నెంతయుఁ బ్రతాపించి
యరిగి నీసాహసం బంతయు మెఱసి
పరకాలు నిటకు వే పట్టితె మ్మనుచు

సెలవుపెట్టిన నంది సేనాధివిభుఁడు
బలిమిమైఁ జతురంగబలములతోడ
నరపాలునగరు గ్రన్నన వీడుకొనుచుఁ
బరకాలునగర ముద్భటవృత్తి జుట్టి
గవనులఁ బొడిపింపఁ గదలి జంకించి
తివిరి యేనుంగుల దీకొల్పువారు
తలకక వడి నగడ్తలుపూడ్చుకొఱకు
దళముగా నందంద తళివెట్టువారు
కెరలుచు నురుకుపక్కెరలగుఱ్ఱముల
నిరుమెలం బేరెంబు లెక్కువారలును
మదసాహసమునఁ బల్మఱు కత్తు లంది
పొదలుచుఁ గూఁతలార్పులు సేయువారు
నగుచు యాదవపురి యవనుండుచుట్టు
పగిది నిప్పగిది నిర్భయవృత్తిఁ దొడరి
కడఁకమైఁ గోట లగ్గలువట్టి గిట్టి
కడుభయంకరలీలఁ గదనంబు సేయఁ
బరకాలుఁ డాజి తత్పరకాలుఁ డపుడు
కరముఁ గోపంబునఁ గరవాల మంది
గరుడనిపై నొప్పు కంససంహారి
కరణి బంధురతురంగంబుపై నెక్కి

యరిమురి రేవంతునైనఁ గయ్యమున
నొరయ నుంకించు రావుతులతోఁగూడ
గవకులు దెరపించి ఘనవాద్యతతుల
రవము లెచ్చిలఁగ ధీరతఁ గోఁట వెడలి
కార్చిచ్చు మిడుతలగమి నేర్చుపగిదిఁ
బేర్చి లేళ్ళను డాయుబెబ్బులికరణి
నెఱి హరి కుంజరనికరంబుమీఁద
నుఱుకుచందంబున నురగాళిఁ బొదువు
గరుడనిగతి విశృంఖలగతి మెఱసి
తరవారి యంకించి దారుణార్భటుల
లగ్గలు డించి యుల్లముపల్లవింప
నగ్గరి కగ్గలం బగుమొగ్గరంబు
డిగ్గనం జొచ్చి యేడ్తెర వీరవరుల
ముగ్గునూచంబుగా నురుమాడఁ దలఁచి
యెడరు గైకొని యొక్కయెడల శాత్రవులఁ
గడికండలుగఁ దలల్ గత్తిరింపుచును
దోన నెత్తురు నేలఁ దొఱఁగకమున్నె
మేను లింతింతగా మెదుగఁగొట్టుచును
లలిమీఱ రౌతు బల్లంబు గుఱ్ఱంబుఁ
గలయంగ వ్రేటాఱుగాఁగ వేయుచును

దొడిబడ రెండువీధుల నేర్పఱించి
కడలకొత్తుచు గిట్టి కనుపుగొట్టుచును
గసిమసంగినశత్రుగణముల జముని
వసముచేయుచుఁ బరవసముఁ జూపుచును
లీలఁ జెండాడు కళింగభూవిభుని
పోలిక నిరిశిరంబులు నేర్పుమీఱఁ
దొలగక పజ్జ రౌతులుఁ దానుఁ గూడి
యిల వ్రాలకుండంగ నెగురఁగొట్టుచును
మిడుగులు ముడుగులు మెడలు లేదొడలుఁ
దొడలును నొడలును దొనలు కన్గొనలు
హరులును గరులును నరులు ముంగురులు
సరులును బరులును జడలు జల్లెడలుఁ
బడగలు వడఁగ నిష్పగిదిఁ జక్కాడి
పుడమియు మిన్ను నార్పుల [3] బీటలెగయఁ
దరమిడిలయదండధరునిచందమునఁ
బరదండధరుఁ డిట్లు బవరంబు సేయఁ
గలసైన్యముల నేలఁ గలియంగఁ జేసి
కలఁగి యొక్కెడ కంఠగతజీవుఁ డగుచు
బలువేది చోళభూపాలుసేనాని
తల మొల వీడ దుర్దశఁ బాఱిపోయి

తనపతిపాదపద్మములమై వ్రాలి
తనచేలువాటు నెంతయు విన్నవింపఁ
గడనుగ్రుఁడై కనుగవతామ్రరేఖ
లదరం గపోలంబు లడర నుంకించి
గద్దియ డిగి చోళకాంతుండు నగుచు
నద్దిరా! యిటు సేసెనా పరాంతకుఁడు
అని యుద్ధసన్నద్ధుఁ డగుచు సామంత
జనము వారణముఖ్యచతురంగబలము
నిరుమేలఁ గొలిచి రా నేపు రెట్టింపఁ
దురగాధిరూఢుఁడై తూర్యనిస్సాణ
భేరీమృదంగాదిబిరుదవాద్యములు
భోరుకలంగ నంబుధులు కలంగఁ
దురగఖురో ద్ధూతధూళి యంబరము
తరణిచంద్రులరీతిఁ దడబాటు గొలుపఁ
బురము వెల్వడి శత్రుపురముపైఁ గదలి
యరుగుచో దుర్నిమిత్తాళిఁ గన్గొనుచు
నరుదంది కోపంబు నలవు రెట్టింపఁ
బరకాలుపురవరప్రాంతంబుఁ గదియఁ
బ్రియురాలి, గనుఁగొన్న ప్రియునిచందమును
భయమేది యప్పు డాపరకాలుసేన

పదిలమై చోళభూపతి వరూథినికి
నెదురుగాఁ జనుదెంచి యెలగోలు సేయ
నిరువాగుఁ గదిసి రయ్యెడ మింటనుండి
సురలు నచ్చరులునుం జూచి యగ్గింపఁ
గరియంత కరియంత కరియునుం గరియు
హరిసాది హరిసాది హరియును హరియు
రథియును రధియు సారధియు సారథియు
రథమును రథమును రాజును రాజు
భటుఁడు భటుండు నుద్భటవృత్తి దిశలు
పెటలంగ మెఱసి యభేద్యమై పోర
నప్పుడు వివిధచిహ్నంబులతోడ
నొప్పారుబిరుదరాహత్తులు గొలువ
సాహసాటోపుఁ డై చతురంగతురగ
వాహుఁ డై పరిపంధి వైవస్వతుండు
అరుదెంచి విలయకాలార్కు చందమున
నరిసేన కుఱికి మిన్నగలఁ బెల్లార్చి
యుడివోసి పెనుమంట లుడువీథి గెంట
నడిదంబు ఝళిపించి హరులఁ జక్కాడి
శిరములఁ దెగటార్చి శిర లుత్తరించి
కరిబృందములఁ ద్రుంచి కరములఁ ద్రెంచి

గొడుగులఁ గెడపి ముక్కులు చక్కఁజేసి
పడగలు చించి భూపతుల గాలించి
రథుల ఖండించి సారథుల తుండించి
రథముల నుగ్గాడి రధ్యాళిఁ జదిపి
శరములు నురుమాడి చాపము ల్విఱచి
ధరణీశవరుల నెంతయుఁ బాఱఁ జమరి
కరవారలధార నీగతిఁ జిత్రగతులఁ
బరవీరబలములఁ బరిపె నవ్వేళ
దొఱఁగురక్తంబులు తోయపూరములు
శరము లండజను లాస్యములు తామరలు
కనుగవల్ తొగలు మీగాళ్ళు తాబేళ్ళు
మినుకారునెరికురుల్ మిండతుమ్మెదలు
కరటితుండములు నక్రములు కంఠములు
దరములు చామరల్ తరచైన నాచు
ఘనశతాంగములు వక్రములు చక్రములు
పునుకలు వరహంసములు గాఁగ నొప్పు
వడఁ జోళవిభుసైన్యవనజాకరంబుఁ
గడిమిమైఁ బరకాలగంధసింధురము
బలువిడిఁ జొచ్చి యుద్భటకరస్ఫూర్తి
గలఁచి పంకముసేసి కలగుండువఱప

మెత్తనిమాంసంబు మెదడునంజుచును
నెత్తురు పునుకగిన్నెల ముంచి త్రావి
పూని యాపరకాలుఁ బొగడుచుఁ ! బ్రేమ
నానంద మాడుచు నలరె భూతములు
కర ముగ్రముగఁ జోళకాంతుఁ డవ్వేళ
బరువడిఁ దనవెన్నుబలమును దాను
బొట్టమైఁ బరకాలుఁ బొదివి వేచుట్టు
ముట్టి యందఱు నొక్క మొగిని బెల్లార్చి
పరిఘగదాకుంతపట్టిసప్రాస
పరశుతోమరభిండి వాలముఖ్యముల
నొక్కట నిగుడింప నొకయింతయైన
లెక్క సేయక యవలీల నామేటి
తరవారిఁ బెరవారి తళుకుగైదవులఁ
బొరిఁబొరి నింతింతపొడులు గావించి
దనుజులమీఁద నందకపాణి గదియు
ననువున నాకొన్న హరికిశోరంబు
కరిసమూహములపైఁ గవలి లంఘించు
కరణిఁ దద్వైరిచక్రముమీఁది కుఱికి
శిరములు డెందముల్ చెవులు జెక్కులును
గరములు కంఠముల్ కౌనులు బరులుఁ

దొడలు జానువులు లేదొడలుఁ బాదములుఁ
దొడవులు శిరలుఁ గైదువులు నొక్కటను
దుత్తునియలు సేసి దుర్దాంతవృత్తిఁ
గత్తి కొక్కొకకండగాఁ జెండివైచి
కలివేళ వరతురంగము నెత్తి జగతి
ఖలులమై మిట్టించుకల్కి చందమున
గురుతరనిజవాహ ఖురపుటాగ్రముల
నరిబలంబులనెల్ల నణఁగఁ ద్రిక్కింప
మొనచెడి సంగ్రామమున నుండ వెఱచి
చనియెఁ జోళుండు యోజన మోహటించి
యీరీతి దెసచెడి యేతెంచి మదిని
గూరినలజ్జచే గుంది లోలోనె
యకట! యీజగతి నోవారిని సాహరిని
యొకఁడు నాతోఁ బోవనోపునే సోర
మఱి తనసరివోరుమాత్రంబె కాక
పఱచనిపాటులఁ బఱచె వెండియును
గెరలి క్రమ్మఱఁ బోయి గెలిచెదనన్న
దురమున వీఁడసాధ్యుఁడు దేవతలకు
నని కపటోపాయ మాత్మఁజింతించి
యనయంబు హితవరు లగువారిఁ బిలిచి

యని మొన నాతోడ నరిదండధరుఁడు
మొనసి చేసినకయ్యమునకు మెచ్చితిని
ఒకసీమ యేలుచునున్న తానెంత
సకలభూమియు నేకచక్రంబు గాఁగ
నేలుచునున్నట్టి యేనెంత తలఁప
నీలీల బవరాన నెదిరి నాతోడ
వడిగలబంటైనవాఁడు వో బంటు
కడపట నిలవీనిఁ గన్నది తల్లి
యని సంతసించువాఁడై వేగ మీరు
చని పరాంతకునకు సమ్మదం బొదవఁ
దనశౌర్యమునకు నెంతయును మెచ్చితిని
మును సేయు నపరాధమును దాళుకొంటి
నెన్న మున్నిటికంటె నినుమడి గాఁగ
మన్నింతు నని చెప్పి మఱియు నేమైన
నడిగినమాటన ట్టతనికి నిచ్చి
యెడపక తోడితెం డిపుడె నాకడకుఁ
బోఁడిమి నావీరపుంగవు నిటకు
నేఁడె తోతెచ్చువానికి మెచ్చుగలదు
అనుఁడు వా రాకమలాపూర్ణపురికి
జని కొల్వులో శత్రుశమను నీక్షించి

కరములు మొగిచి కొంకక చోళభూమి
వరుఁడు పల్కినసత్య వాక్యంబు లెల్ల
వినువారివీనుల విందులు గాఁగ
వినయంబులోఁ జిత్తవృత్తి యెఱింగి
మగఁటిమిఁ బరకాలుమనసు రంజిలఁగఁ
దగవు దీపింప నెంతయు నమ్మఁబలికి
నీసాహసములకు నృపుఁడు మోదించెఁ
జేసినచేఁతెల్లఁ జెల్లెను నీకుఁ
గనుగవ నినుఁ జూచుకాంక్షయేకాని
మనుజేశుతలఁపున మఱియొండు లేదు
నిచ్చలంబున నీవు నృపవరుకడకు
విచ్చేసి క్రమ్మఱ విచ్చేయు మనుఁడు
సమ్మదంబున శత్రుశమనుఁడామాట
నమ్మి వారికి కట్టణములు పాలించి
పరిమితపరివారపరివృతుం డగుచుఁ
గరమర్థిఁ జోళేంద్రుకడకు నేతెంచి
మునుకొన్నమై గాయములు లెస్సఁ గాంచు
కొనుమని యొసఁగులాగున నిమ్మపండ్లు
కానుక యొసఁగి ముంగిట నిల్వఁ జోళ
భూనాథుఁ డావీరపుంగవుం జూచి

సకలరాజ్యంబు నిశ్చలత నిన్నాళ్ళు
తెక తెరబుక్కాది దినియుండు నీవు
కడపట ననుఁ బొడఁగనవచ్చునప్పు
డుడుగరతరమైన యొకపచ్చడంబు
చెల్లఁబో తనకుఁ దెచ్చెడునంత లేదె
నల్లనిచేఁత మానకపోయి తెపుడు
తనసీమ వెనుకముందరిధనం బెల్లఁ
బునుగక యీక్షణంబునఁ బెట్టి పొమ్ము
అనుచు ధనాతురుండై చోళనృపతి
తనమంత్రివరుల కాతని నప్పగించి
యితనిపైఁ గలధనం బెల్ల నీక్షణమె
యతివేగమునఁ గొనుఁ డని నియోగించి
యరిగెఁ బురంబున కంత నాసచివు
లిదండధరుఁ జూచి యాత్మఁ జింతించి
యిప్పుడు మనచేతి కీతనిధనముఁ
దెప్పించుమంచుఁ బార్థివుఁ డిచ్చి యరిగె
నిట్టలంబుగ మన మీతని నడ్డ
పెట్టి మిక్కిలి గాసిపెట్టితిమేని
ధన మింతలోనె యీతనిచేత లేదు
పనివడి యీతఁడు పడుపాటు చూచి

ముప్పిరిఁ గొనుదైన్యమునఁ బూఁట దాఁట
చెప్పెడువారు చర్చించిన లేరు
ఇతనిఁ దోకొనిపోయి యితఁ డున్నపురిని
యితనిబంధువ్రాత మెల్ల నీక్షింప
నదర వైచినసొమ్ము హరునగు నిచటఁ
బదరిన నింతయుఁ బనికిరా దనుచు
దనుజులు మును వాయ తనయునిఁ బట్టి
కొనిపోవుగతిఁ జోళకులనాధుభటులు
పరకాలుఁ డేలెడుపట్టణంబునకుఁ
దిరుగఁ దోకొనివచ్చి ధిక్కరింపుదును
అచ్చటఁ గేశవుం డనుపేరఁ బరఁగు
పచ్చవిల్తునితండ్రి భవనంబునందు
నాఁగిన దివసత్రయంబు నొక్కింత
లోఁగక శత్రుకాలుండు డెందమున
నరయ ధనాతురుం డగుమానవునకు
గురువు బంధువులు నెక్కుడువారు గలరె
యీరానిమాటప ట్లెన్నేని నొసఁగి
రారమ్మటంచుఁ జేరఁగవచ్చినంతఁ
గల్లలాడుట నరకముత్రోవ యనక
చెల్లఁబో తనుఁ గాసిచేసి పట్టించే

మతిఁ దలంచిన మదోన్మత్తులౌ భూమి
పతులకు సత్య మెప్పట్టునం గలదె?
వివరింపఁగా భూమివిభులలోపలను
[4]చెవి బేద బిసిడి దుశ్శీలవర్తనుని
దుష్టు జూదరి ధనాతురు నవివేకిఁ
గష్టు వైష్ణవనిందఁ గావించువానిఁ
గన్నమాత్రనె దినకరు విలోకించి
వెన్నునినామంబు వినుతింపలయు
నిన్నియు నెఱిఁగి నే నీదురాచారి
యున్న చక్కటికి రా నుచితమే యనుచు
సారసోదరభక్త సాహస్రమునకు
నారగింపంగఁ జేయఁగ లేనికతన
నుపవాసనియతుఁడై యుండె నుండటయుఁ
గృపతోడ శ్రీహస్తిగిరిభూవరుండు
చనుదెంచి యారేయి స్వప్నంబునందుఁ,
దనఁదివ్యకరములఁ దను వొయ్య నివిరి
వలమురి యమృతంబు వారిచేసేత
జలజాతయుగళిమైఁ జల్లగాఁ దుడిచి
తనకటాక్షామృతధారలచేతఁ
దనివినొందించి యాదటముండ నేలఁ

జేకొని యేగడించినధనం బెల్ల
నీకుఁ గా కేరికి నిర్మలాచార!
సిరిమించ నీవలసినధనం బిత్తు
నరుదెమ్ము కాంచికి ననుమాన మెడలి
యన విని మేల్కాంచి యల వారిఁ గాంచి
వినుఁడు కాంచికి నాదు వెంట నేతెండు
ఏ తేర మీధనం బెంతయు నిత్తు
దైతేయరిపునాన తప్పదు వినుఁడు
అనుఁడు చోళామాత్యు లక్కజ మంది
యనయంబు హర్షించి యాత్మ నొండురులు
ఎప్పు డీఘనుఁ డిందిరేశుపై నాన
తప్పఁడు తలమీఁదఁ దారివచ్చినను
అనుచు నాత్మల నొచ్చి రట్లకా కనుచు
ననయంబు హర్షించి యతనిఁ దోకొనుచుఁ
జనిరి కాంచికి నంత శాత్రవాంతకుఁడు
తనదుముంగల నొప్పు దైతేయవరదు
వనమాలి గజరాజవరదు నావరదుఁ
గనికరములు మోడ్చి కనికరం బొదవ
వనజలోచన! భక్తవత్సల! శౌరి!
దనుజారి! హరి! తండ్రితండ్రి! నాతండ్రి!

యనఘశరణ్య! నీ వానతియొసఁగు
పనివింటి నిచటికిఁ బనివింటి నిన్నుఁ
గనుఁగొంటి లోఁ గలఁకలు వీడుకొంటి
వనజాక్ష! యిందిరావల్లభ! శౌరి!
జననాథువిత్త మేసరవిమైఁ దీర్తు?
ఘనమైన యీబాధ కడతేరు టెట్టు?
లానతి మ్మన విని యనుకంపతోడ
శ్రీనాథుఁ డతని వీక్షించి యిట్లనియె
వరవేగవతిచెంత వారును నీవు
సరియాఁక నుండెడుసమయంబునందుఁ
దనదు పేరరుళాలదాసనామమున
నొసరి యేఁ దగవరియునుఁ బోలె నటకు
హాళికుగతి వత్తు నప్పుడు నన్నుఁ
జాలింపు నిను నాఁకసలుపువారలకు
ధనధాన్యములకుఁ జిత్రంబుగా నేన
మనవారివళుకు సమ్మతినె తీర్చెదను
నావుఁడు మదిలోన నమ్మి యాయోగి
యావేగవతిచెంత కరిగి యట్లుండఁ
బరమప్రపన్నులపాలి యావేల్పు
పరకాలుమీఁదికృపారసం బొలయఁ

బసపుచుంగులతలపాగ నెట్టంబు
కసిబిసిమెసఁగు బాగాలవీడియము
మిన్న దేరెడుదొడ్డమెడనూలు మిగుల
వన్నియగల మాధవళిపచ్చడంబు
దళసరియగు దేవదారుగ ధ బు
వలకేలఁ గనుపట్టు వంకుటుంగరము
డొల్లుబోఁగులును గాటుకకప్పుదేరు
పిల్లిగడ్డము వడిబెట్టుమీసలును
నలవడ నాందోళి కారూఢుఁ డగుచు
నలనాఁటిపూర్వికుఁ డగుపెద్దిరెడ్డి
యనఁగఁ బేరరుళాలుఁ డనుపేరఁబరఁగి
చనుదెంచి వారున్న చక్కి కేతెంచి
యనుఁగుమల్లడిఁ గొన నాత్మబంధువులఁ
గనినకైవడిఁ బరకాలు నీక్షించి
వడి నందలము డిగ్గి వచ్చి డెందమున
నుడుగనిప్రేమతో నుప్పరం బెత్తి
కన్నీరు దొఱఁగ నీగతి నుండనేటి
కన్న! నీకని కూర్మి నందంద వగచి
మనుజేశుభటులు పల్మఱుఁ జోద్యపడుచుఁ
గనుఁగొన మున్నెఱుంగనివాఁడపోలెఁ

దవిలి యాతనిచెంతఁ దత్క్రమం బెల్ల
వివరించి యంతయు విని వారిఁ జూచి
యింతమాత్రమునకై యీవంశపతిని
ఇంతగాసింపంగ నేటికి వలదు
తొలఁగుమటన్న మంత్రులు కోపగించి
యలరెడ్డిఁ జూచి యిట్లని రొక్కమాట
బలువుగా విడుమంచుఁ బలికెడుభక్తి
గలవాఁడ వైన వెగ్గలమైన ధనము
గలవాఁడ వైన నీగడుసు మాకొసఁగ
వలయు సొమ్మెల్ల నివ్వల నొప్పఁ జెప్పి
తోకొనిపొ మ్మన్నఁ దొలఁగ కారెడ్డి
యాకాఁపువారితో ననియె వెండియును
గడపట మీకు నీగల్గుసొమ్మునకె
కడిఁదిసేయఁగ మీరు కర్తలుగాక
పనిలేనిమాటలఁ బని యేమి యెంత
ధన మెన్ని కొలుచెంత ధన మెన్నికొలుచు
వీసము నొకగింజ విడుమని యనక
చేసేత మీ కొప్పఁజెప్పెద ననుచు
వినఁజెప్పి పరకాలు వెనుకకుఁ దిగిచి
కొని చెంత భటుల వే కొనితె మ్మటంచుఁ

దనదైనమాయ నుద్భవమైన కొలుచు
ధనముఁ దెప్పించి యత్తఱిఁ దూము పూని
కొలఁదిమీఱినరాశిఁ గొనియున్నకొలుచుఁ
గొలుచునప్పుడు తేరకొనువారికెల్ల
రాఘవ కార్శుకప్రవిముక్తబాణ
లాఘవంబునఁ గరలాఘవం బెసఁగ
నిక్కుచు గోవిందునికి ననుమాట
యొక్కటి యందఱు నోలి నాలింప
సెలగని పలుమాఱుఁ జెప్పెడుపల్కు
లలవిమీఱంగ నాదారిక యుండఁ
గొలుచు ముంచుట పారఁగొలుచుట యొండు
దెలియఁగా రాక యెంతేచిత్రగతుల
భారంబు లేకయు భారంబు గాఁగ
వారికిఁ గొలువంగవలసిన కొల్చు
కొలిచి మాడలుకట్టు గుండులఁ దూఁచి
నిలువ పూజ్యముగ నన్నియును జెల్లించి
క్షితినాథుచే సొమ్ము చెల్లినందులకు
నితనికి నిప్పింపుఁ డిటఁ జెల్లుచీటి
యని చెప్పి పరకాలు నరకాలుముల్లు
గొనకుండ నతఁడుమైకొనుసొమ్ము దిద్ది

యతనిసమ్మతిఁ దొంటియావాసమునకు
నతులమోహనమూర్తి యై యేగె నంత
జననాథుమంత్రు లచ్చట నున్నయట్టి
ధనము ధాన్యము సమస్తము వేడ్కతోడఁ
గైకొని పరకాలు గారవం బెసఁగఁ
దోకొని మిగుల సంతుష్టులై యరిగి
ధరణీశునెదుటఁ దద్ధనము ధాన్యమును
నరిదండధరు నిడి యాక్రమం బెల్ల
వినిపింప నాశ్చర్యవివశుఁడై నృపతి
తనమదిలోన నెంతయు సంతసించి
తననిష్ఠఁ దప్పక తరవాత మనల
ధనము చెల్లించె నెంతటిఘనుం డనుచు
నపుడు భాగవతార్యుఁ డగుపరకాలుఁ
డుపవాసమున నాక నుండుట కలిగి
పారంబులేని తత్పాపంబు వాయ
ధారుణీసురులకు దానంబు లొసఁగి
పగటేది మఱి పట్టభద్రచిహ్నంబు
లగుచామరలు ధవళాతపత్రములు
మొదలైన తనచిహ్నముల నెల్ల నొసఁగి
తుద లేనిప్రేమ సంతోషింపఁజేసి

తమ కిడువెనక ముందరి ధనం బెల్ల
తమకు నొప్పయ్యె నుత్తరువు గా దనుచుఁ
జెల్లుచీటియు నిచ్చి చేచేత మేలు
కుళ్లాయి గబ్బాయిఁ గొమ్మంచు నొసఁగి
యిన్నాళ్ళకంటె ననేకవైఖరుల
మన్నింతు నని సీమ మఱియును నొసఁగి
యసిపినఁ బరకాలుఁ డనుమోద మెసఁగఁ
దనపురంబునకు నంతట నేగుదెంచెఁ
జోళుఁ డాధనముఁ గొల్చును సచివులకుఁ
గేలిమై నొప్పరికింప మాధవుఁడు
నాయెడ మాయామయం బైనవాని
మాయ గావింపుచు మగుడఁ గైకొనియె
నవ్వేళఁ జోళజనాధీశ్వరుండు
నివ్వెఱపడి మంత్రినికరంబుఁ జూచి
పరకాలుఁ డెటువంటి పరమమాయావి
ధర నెట్టివైష్ణవోత్తముఁడు జన్మించె
మనయాజ్ఞ కులికి నేమముతోడ మగిడి
చనుదెంచి మననిల్వసల్వలు మనకు
వాలాయ మొప్పించువాఁడునుం బోలె
జాలి నీగతి నింద్రజాలంబు సేసె

మాయాధనం బిచ్చి మగుడంగఁ దానె
మాయ గావించె నీమాయలవాని
నేరీతి నమ్మెద మిటువంటివాని
నేరీతి నాజ్ఞసేయింపంగ వచ్చు
ఇతఁ డిచ్చుధన మేల యితఁ డేల తుదిని
యితని కిచ్చినసీమయెల్లఁ గైకొనుఁడు
ఇతనిఁ దత్పురి నుండనీక మీ రరిగి
యతి వేగమున నెటకైనఁ బొమ్మనుఁడు
అనిన మంత్రులు తదీయాజ్ఞఁ దత్పురికిఁ
జని పరాంతకుని కీసరణిఁ దెల్పుటయుఁ
గొదుకక మీతోడికుసిగింపు చాలుఁ
బదివేలు వచ్చె మీపట్టణం బిదియె
యని వారి వీడ్కొని యనురాగవల్లి
ఘనతమై ననలొత్తఁ గైరవవల్లి
కడకేగి తమసేయుక్రమముఁ దత్క్రమముఁ
గడముట్టఁ దెలిపి భూకాంతు సెగ్గించి
యిచ్చోట నుండరా దిఁకమీఁదమనకు
నెచ్చోటికైన నిం కేగంగవలయు
మనుజాధినాథుఁడు మాటపట్టుడిగి
తనసీమయంతయుఁ దానెకైకొనియె

నజుతండ్రి భక్తసాహస్రంబు మున్ను
భుజియింప కటమున్ను భుజియింపమెపుడు
విష్ణుండు సాక్షిగా వెలయ నేఁ జేయు
వైష్ణవార్చన విడువఁగరానివ్రతము
వీరికిఁగా ధరావిభునిఁ గ్రమ్మఱను
జేరి కొల్చెద నన్నఁ జేపట్ట డతఁడు
చేపట్టి యతఁడట్లసేసినఁ దుదిని
భూపాలునర్థ మీపోఁడిమి నొసఁగ
హరిభక్తులకు నది యర్హంబు గాదు
హరినీలవేణి యెట్లంటేని వినుము
తుది రాజవిత్త మెందులకంటె దోష
మొదవించు ననుచు మున్నొగి సప్తమునులు
ననుపమక్షామంబునందుఁ బీనుంగుఁ
దినఁగోరి యది రాజు తెలిసి కాఁపిడిన
జడిసి వా రదియు రాజద్రవ్య మనుచు
విడిచి రాగమములు వివరించునట్లు
కావున నెన్నిసంగతుల వైష్ణవుల
కావిత్త మొసఁగుట యర్హంబు గాదు
తనుగూర్చి చేయు నధర్మంబు ధర్మ
మనికాదె మున్ను శ్రీహరి యానతిచ్చె

నెన్నంగఁ బాపంబు నెసఁగించు హింస
జన్నంబునందుల సత్కర్మమైన
వడువున నేనును వైష్ణవార్థముగఁ
దొడరి దొంగిలిన నేదోషంబు లేదు
ఈయుపాయము దక్క నీవ్రతంబునకు
నేయుపాయంబు లే దెలనాఁగ యేను
జోరత నవనీతచోరకింకరుల
కారగిం పొనరింతు నని నిశ్చయించి
తనుఁబోలు కోదండధారు లైనట్టి
యనుచరు లొకవేయి యందంద కొలువ
యెగదారి హరి గయుయెడ మొట్టిగుదియ
చిగురులు వెడల గీల్చినకోరసికయుఁ
జేయమ్ము నెకవారుచెప్పులు రాగి
చాయలుదేరు నచ్చపునీలిదట్టి
మొలవంకియును కొనముక్కుతో నొరయ
బలువుగాఁ బెట్టిన పట్టెనామములు
నిసుముఁ గన్నపుఁగత్తియెడదట్టిలోనఁ
బొసఁగిన దివ్వార్పుబ్రువ్వులకోవి
తులముళ్లు చొక్కునిద్దపుగద్దగోరు
బలపంబు బదనికల్ బంతికత్తెరయు

నలవడఁ దనప్రియురాలితోఁగూడ
వెలువడి వాహినీవిపినము ల్గడచి
శరధిచెంగట మత్తచమరసారంగ
శరభశంబరఖడ్గశార్దూలశల్య
గండభేరుండగోకర్ణభల్లూక
శుండాలగండకసూకరప్రముఖ
బహువిధవిహగసంభ్రమనాదసింహ
కహకహాద్భుతమహాగహనంబుఁ జేరి
ఘనమైన కోనలంకలపట్ల టెంకు
లొనరించి తనదు నెయ్యురుఁ దానుఁ గూడి
సరవిమై వైష్ణవసాహస్రమునకుఁ
గరమొప్పు పెనుమాళిగలు ఘుటింపించి
యటకు మిక్కిలిచేరు వగుపయోరాశి
తటసమీపమున నిత్యంబు నోడలను
బచ్చకప్పురమును బట్టుబట్టలును
బచ్చికస్తురి మేల్మిపసిఁడియిట్టికెలు
మణులుఁ జంద్రాననామణులుఁ బటీర
కణములు మొదలుగాఁగలసువస్తువులు
నిరవొంద నెన్నిక కెక్కు బేహరులు
హరులదంతులతోర హత్తుగాఁ దెచ్చి

యానించి బేహార మాడంగ నటకు
వానికై చనుదెంచువారల వానిఁ
బూని బేహరమాడి పోవువారలను
బోనీక మీఁద కాఁపులుపెట్టి కాచి
తెరు వడ్డగించి గద్దించి ధైర్యంబు
దెరలంగఁ గొట్టి చేతిని యాఁచికొనుచు
వరుస నొక్కెడఁ దెరువరుల చందమున
నరుగుచుం గనమసందరికట్టికొనుచుఁ
గిదుకక మొగమెఱింగినవారిఁ జేరి
పొదివిపట్టుచు నోళ్ల బొటుల [5]ముందరిగి
గొబ్బునఁ దొలఁగఁ దోకొనిపోయి చెట్టు
గబ్బువీలగఁ గట్టుకాసెలం గట్టి
యదయులై కలవెల్ల నపహరింపుచును
సదయులై వెండియు సాగనంపుచును
అరుదైన నగరంబులందు వెండియును
బరదేశముల సెట్లపగిది దిండుగను
బెల్లుచుట్టిన పెదపెదముడాసులును
డొల్లుబొంగులును నీటుగఁ బొందుపఱచి
పొదిగల్గు [6]నసిమల భుజములం బూని
వదలుగా రింటెముల్ వలెవాటువైచి

కొంకక జీనిపై [7]గోవరకంగు
లంక యయ్యోధ్య మలాక యీడాము
మొదలైనదీవులు మునుకొనివచ్చి
యదనబేహారంబు లాడంగఁ జూచి
మంచిరత్నములు హేమము లున్నయట్టి
సంచులు వారున్నసంచులు దెలిసి
సమరేయిమైఁ జొక్కు చల్లి సంధించి
తివుటమై దొంగిలితెచ్చుచు మఱియు
నునుపులు పెట్టుచు నొదిఁగి డాఁగుచును
గనుమలు గట్టుచుఁ గనుపుఁ గొట్టుచును
గబ్బునం బురములు గన్నపెట్టుచును
[8]సుబ్బికం బెరచోటఁ జొప్పువైచుచును
దెచ్చినధనమెల్ల దినదినంబునకు
వచ్చిన యలభాగవతులకు మఱియుఁ
జనుదెంచునట్టివైష్ణవులకు భక్తి
పెనుపొంద షడ్రసోపేతంబు గాఁగఁ
బొదలుచు నారగింపులు సేసికొనుచు
మదనమన్మథుఁ దనమైఁ బాదుకొల్పి
యీరీతి దొంగిలునెడ శంఖచక్ర
ధారులఁ దిరుమణి ధరియించువారిఁ

దడవక కన్న నెంతయు భక్తిసేసి
యుడివోనికూర్మిమై నుపచరింపుచును
బరమభాగవతసంభజనప్రియుండు
పరమయోగీంద్రుఁ డాపరకాలయోగి
తనసేయు వైష్ణవోత్తమపూజకొఱకు
ననయంబు నవసరమై యొక్కనాఁడు
గగనంబు భువి నీలికడవచందమున
మొగులుచేఁ గారుక్రమ్ముచునుండు రాత్రి
బనిబూని యొకమహాపట్టణంబునకుఁ
జని యందు నొక్కవైష్ణవునింటిపంచ
నొదిగి మ్రుచ్చిలఁ బొంచియున్న యావేళ
వదలక జడివట్టి వర్షించుచుండ
నావైష్ణవోత్తము నంగనారత్న
మావేళ పతిభోజనానంతరమున
లీలమై మగనిపళ్ళెరము కెంగేలఁ
గీలించి యపుడు వాకిటి కేగుదెంచి
తడియంగ నోడి యాతన్వంగి వంగి
కడపముంగిట నిల్చి కడిగి చల్లఁగను
గప్పినచీఁకటిగమి విచ్చిపాఱ
నప్పుడు ధళధళక్కన మెఱయుటయు

గని పరకాలుఁ డాకల్యాణిచేత
నొనరినపాత్రంబు నొడిసి కైకొనిన
నుదిరి యస్మద్గురుభ్యోన్నమో యనిన
సుదతివాక్యము చెవిసోఁకె సోఁకుటయు
నావాక్య మపుడు విన్నంత నీసొమ్ము
శ్రీవైష్ణవులది మ్రుచ్చిలితి నటంచుఁ
దలఁకి కెంగేలిపాత్రము వారికడప
దలకడఁ బెట్టి యెంతయు భయంపడుచు
నీవేళ వీరలహృదయంబులందు
నేవిధి నుండునో యెఱిఁగెద ననుచుఁ
బొంచి యాపంచఁ జప్పుడుసేయకున్నఁ
జంచరీకాలక చని లోననున్న
ప్రియున కీసరవిఁ జెప్పిన నాత్మఁ దెలిసి
ప్రియురాలి డగ్గరఁ బిల్చి యిట్లనియెఁ
బనుపడ వినఁగదే పరకాలనామ
ఘనుఁడు భాగవతకైంకర్యతత్పరుఁడు
శ్రీవైష్ణవార్ధమై చేసె నీరీతి
నావైష్ణవుఁడు మనమగు టెఱుంగమిని
కైంకర్యమునకు విఘ్నము సేయవలవ
దింక భాగ్యముఁ జేసి తీవు నావుడును

గొంచక తొంటిబాగున నావధూటి
సంచరింపుచు నలచక్కి కేతెంచి
తనదుముందరిదెసఁ దనరుప్రాతంబుఁ
గనుఁగొని యిటకు నేగతివచ్చె మగిడి
యనుచు నచ్చెరువంది యాత్మేశుకడకుఁ
జని పళ్ళెరం బున్నసరవిఁ దెల్పుటయు
నామహాత్ముఁడు పాత్ర మందెడునప్పు
డేమనియంటి నా కెఱిగింపు మనినఁ
నెలనాఁగ పలికె నయ్యెడఁ జోరుఁ డనుచుఁ
దలఁకి యాచార్యులఁ దలఁచితిఁ గాని
పదరి యే నెగ్గుగాఁ బలుకుట లేదు
ఇదియుఁ దప్పిద మౌట యెఱుఁగ లేనైతి
ననిన నాభాగవతాగ్రణియింతి
కనియె నీ వప్పు డ ట్లననేల యనుచుఁ
గనలి భాగవతకైంకర్యవిరోధ
మొనరించి తెనుచుఁ బెట్టురరంగఁ బలికె
బ్రహ్మాదిశాపముల్ వాపంగవచ్చు
బ్రహ్మహత్యాదులఁ బాపంగవచ్చు
నారయ శ్రీవైష్ణవాపచారంబు
నేరీతి నైన మాయింపఁగా వశమె?

యని యిట్లు కోపింప నావాక్యసరణి
విని పరాంతకుఁడు వేవేగ నేతెంచి
యామహాయోగీంద్రు నడుగుల కెరఁగి
వేమాఱు నుతులు గావించి కేల్మొగిచి
సమకూర్చు నాయపచార మీవేళ
క్షమియింపు మనిన నాసర్వజ్ఞమూర్తి
యాతనిఁ బరకాలుఁ డని యాత్మఁ దెలిసి
యాతతభక్తిచే నతనియంఘ్రులకు
వినతుఁడై నుతులు వేవేలచందముల
నొనరింపఁ బరకాలయోగిచంద్రుండు
నాపనికైవచ్చు నాతల్లి నేర
మేపారఁగా క్షమియింపవే యిప్పు
డని విన్నవించి చయ్యనఁ బాళెమునకుఁ
జని సంతతంబు వైష్ణవపూజనంబు
నెడఁబడకుండంగ నేకాగ్రబుద్ధి
నడుపుచునుండె వైష్ణవ[9]దేవుఁ డనుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి

నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళపాకన్నయార్య
తనయతిమ్మార్యనందనరత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్ధ సరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృతమైన పరమయోగివిలాసకృతిని
నతులితం బైన షష్ఠాశ్వాస మయ్యె.


Parama yaugi vilaasamu (1928).pdf
  1. పగిది, పగుది.
  2. గూడ.
  3. లుబిట్టులీల
  4. చెవిఁ బెద
  5. ముల్‌దురిగి
  6. నసిబలు
  7. గోవలెక్కంగు
  8. సుబ్బినం
  9. కల్పతరువు.