పరమయోగి విలాసము/చతుర్ధాశ్వాసము

వికీసోర్స్ నుండి

పరమయోగివిలాసము

చతుర్థాశ్వాసము.

హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూతసంకాశ! శ్రీవేంకటేశ!
మునిశాలికాసారముఖ్యభక్తాళి
వనమాలి! యవధారువరదానశీలి!
భావించి మన్నీటిపడ తులలోనఁ
గావేరిసరి యెన్నఁ గావేరి [1]యనఁగ
దీపించుపుణ్యవదీమణిచెంతఁ
జూపట్టు శుభలీలఁ జోళదేశమున
నలరు మండంగుడి యనుపేరు గలిగి
జలజాత[2]జాతుని జలజాక్షి యఱితి
యగ్రహారంబన ననువొంది యున్న
యగ్రహారం బొప్పు నమితసంపదల
నాసురరిపుచరణాసక్తు లైన
భూసురవర్యు లెప్పుడు సప్పురమున

నఖిలాగమజ్ఞులు ననఘులు నూర్ధ్వ
శిఖులు నిజాశ్రమోచితకృత్యపరులు
నై సప్తశతసంఖ్య నలరియుండుదురు
వీసమంతకునైన విధి లెక్కగొనరు
అందునఁ గలిదోషహరణంబు సేయ
నిందిరాసఖుఁ డైన హేమాంబరుండు
లోకరక్షణవృత్తిలోలప్రతిజ్ఞఁ
జేకొని నిరతంబుఁ జెన్నొందియుండు
ననిశంబు యాగభాగాసక్తి నచట
ననిమిషుల్ సకుటుంబులై వసింపుదురు
తమచతురాననత్వముఁ బోల దనుచుఁ
దమిఁ జతురాననత్వము సడ్డఁగొనరు
తృణముగా మేరువుఁ దిట్టంగఁగలరు
తృణము మేరువుగాఁగ దీపింపఁగలరు
చలన మొందనియట్టిచక్రిసంసక్తి
[3]గలిగి యద్విజనాయకత్వంబు నొంది
యొప్పుదు రెల్లప్పు డుర్వీసురేంద్రు
లప్పురి నాపావనాత్ములలోన
సకల వేదాంతవిశారదుం డైన
యొకవిప్రవరుకాంతయుదరంబునందు

జిష్ణుతారను మార్గశీర్షంబునందు
వైష్ణవాన్వయభవ్యవసధిచంద్రుండు
వనమాలికామోదవహ మైనయట్టి
వనమాలికాంశంబు వచ్చి జన్మించి
ధారుణిమైన సాధారణవిప్ర
నారాయణుండను నామంబుఁ దాల్చి
జననిగర్భములోనె సకలంబు నెఱిఁగి
జననుతుం డగు పరాశరమౌని వోలె
మాతగర్భములోనె [4]మహిమతో లోక
మాతనెమ్మోముదామరతేఁటులైన
యారంగపతికరుణాపాంగతతులఁ
జేరంగఁ గలుగుటఁ జేసి భాసిల్లి
సర్వసర్వంసహాచక్రంబులోన
సర్వజ్ఞమూర్తినా జరగి నానాఁటఁ
బెరుఁగుచునుండెడు పిన్నప్రాయమున
నరసి గురుండు నిజాగమోక్తమున
నయమార్గమున మౌనినాళీకవిష్ణు
నయనంబునకు నుపనయంబు సేసి
వనజాక్షుతో నొప్పు వసుదేవుకరణి
ఘనమోద మాత్మలోఁ గడలొత్తనుండె

వెనుకొని తనలోన విజ్ఞానలతిక
ననలొత్త శ్రీవిప్రనారాయణుండు
కంసారిపాదపంకజభక్తిఁ జెంది
సంసారసారం బసారం బటంచు
శ్రీరంగపతిసేవ సేయుచుఁ గన్ను
లారంగ నతనిసోయగముఁ గన్గొనుచు
నతనికింకరులతో ననిశంబుఁ గూడి
యతనికైంకర్యంబు లాత్మఁ గోరుచును
గరిమవైష్ణవగృహాంగణముల ముక్తి
కరవృత్తి యగు మాధుకరవృత్తిఁ జెంది
ఘననీలతనునకే కైంకర్య మిష్ట
మని యెంచి యొకయుపాయముఁ గాంచి యతఁడు
శ్రీరంగధాముపశ్చిమభాగసీమఁ
జేరువఁ గావేరిచెంత నెల్లపుడు
నలరుచు శ్రీమకుటాంతరీపాఖ్య
గలిగినయొకదీవి గాంచి యచ్చోట
నుద్యాన మొక్కటి యొనరింతు ననుచు
నుద్యుక్తుఁ డగుచు నయ్యుర్విభాగమునఁ
జిల్లరములు చెట్టుచేమలు నఱకి
కల్లగా వైచి నల్గడఁ బాదుపఱచి

నినుపుగాఁ గావేరినీరుగా రెమునఁ
దనివార నెత్తి యంతట [5]జేడవెట్టి
యులిపచ్చియైయుండ నొకయింతయూరి
పలకెక్కి గుగ్గిలపదునుగానిచ్చి
పరువడి గుద్దలిపార సొంపార
నిరుచాలువడఁ ద్రవ్వి యిరునాటు వైచి
కాలువ లొనరించి గనిమలు దీర్చి
చా లేర్పరించి యాచాయ నంతంతఁ
బాదులు సవరించి పైరులు సావి
[6]పోదులు నొరివి నేర్పున నాటుకొలిపి
యాయెడ నీరాన నలరుపూబొదల
డాయఁ జెంగల్వయోడలు పొందుపఱచి
కాపాడి గూడులుగట్టి శైత్యంబు
పైపైనఁ గావింపఁ బ్రబలి నానాఁటఁ
బొన్నలు బొగడలు బొండుమల్లియలు
గన్నెరుల్ కలుగొట్టు కాంచనంబులును
మల్లెలు కురువేరు మరువంబు పచ్చ
మొల్లలు నారదంబులు గొజ్జగులును
బారిజాతములు సంపంగులు తులసి
గోరంటలును గేతకులు నశోకములు

మొదలైనభూరుహంబులు పుష్పలతలు
పదివేలతెరఁగులఁ బ్రబలిచూపట్టి
యొక్కకైవడి [7]లాకలాత్తి తలిర్చి
పక్కొమ్మ లిడి పాదుపడి చెట్టుగట్టి
యలరుచు నొకటి సహస్రమై పెరిఁగి
చలిమీఱి శాఖోపశాఖలై నెగడి
వెడవెడ తూణంబు వెడలినయట్టి
నెడవిల్తుమిట్టల వింతలై యొప్ప
మొనచూపి ననలొత్తుమొగడులం దనరి
మినుకుదేఁటులతోడ మేకులు చేసి
యీనినగతి నాకు నిగురుబక్కొమ్మ
గానరాకుండ నల్గడ విఱ్ఱవీఁగి
[8]వరిబండ్లనాఁ గనవచ్చు బొమ్మనఁగ
నెరతావి దిక్కుల నిండి వాసింపఁ
గ్రిక్కిరియుచుఁ బుష్పగిరులచందమున
నొక్కెడం బూచె నయ్యుర్వీజతతులు
ఆమౌనిశీతాంశుఁ డంతరంగమున
నామోదవార్షి నోలాడి యంతటను
దనపెట్టుపైరులు తనకన్ను లెదుట
ననిచెఁ గా యనుచు నానందించునడుమ

సొరిది మరందంబుసోనలు గురియు
సురపొన్ననీడ భాసురముగా నొకటి
సవరగా నడుమను జవికె గావించి
[9]బవరిగా దట్టంపుఁబందిలి వెట్టి
యినుఁ డుదయించునయ్యెడ మేలుకాంచి
తనయనుష్ఠానంబుఁ దప్పక తీర్చి
మనురాజ మైనట్టిమంత్ర మెన్నుచును
ఘనమైన పూవులకరడి గీలించి
యరిగి యవ్వనములో నందంద తిరిగి
యరవిరు లైయున్న యట్టిసూనములు
ననిచి గోదుమగింజ ననలొత్తుతులసి
దినదినంబును గోసితెచ్చి వేర్వేఱఁ
జినుగకుండఁగ నీరు చిలికించి తొలఁచి
పనుపడఁ గదళికాపత్త్రముల్ పఱచి
యందుమై వేర్వేఱ నావిరు లునిచి
పొందుగా మునుమున్నె పోఁజినయట్టి
నార చెన్నార సన్నంబుగాఁ జీరి
చేరువఁ దా సుఖాసీనుఁడైయుండి
బొటవ్రేల దర్జనిం బూవులు రెండు
నటన గీలించి లో నార సంధించి

తొడిమతోఁ దొడిమ పొందుపడంగఁ జుట్టి
మిడివ్రేళ్ళ నందుమై మెణకుగా వైచి
యెడనెడం దులసి నయ్యెడ నరవిరులు
గడుసొంపుమీఱంగఁ గట్టి మాలికలు
బొందులు తావడంబులు వింతవింత
కందుకంబులు నొప్పుగా సవరించి
పూవులు సజ్జలోఁ బొసఁ గంగఁ బెట్టి
తావివోనకయుండ దళముల మూసి
అది తనముంగేల నమరియుండంగ
నదటున కుత్తరీయము ముసుం గిడుచు
[10]గనియరుపూచాయ గలనీరుకావి
గనుపట్టుశాటి మీగాళ్లతో నొరయ
వినుతిమై ద్రావిడ వేదంబు చదివి
కొనుచు వైష్ణవు లెదుర్కొనినంతలోనె
యడుగుల వ్రాలి శ్రీహరిభక్తి మేన
వడియంగ నాయోగివరు డేగుదెంచి
శ్రీరంగనగరంబు చేరంగవచ్చి
యారంగపతిఁ గన్నులారంగఁ జూచి
నుతియించి శౌరి మనోవీధి నిలిపి
యతనిదామోదరాహ్వయము సార్థముగ

[11]నాపాదలంబులై యలర దామంబు
లాపంకజాక్షున కర్పించి భక్తి
దనరఁ దీర్థప్రసాదము లన్వయించి
ఘనతరవైష్ణవాగారంబులందుఁ
గరము వేడుక మాధుకరముఁ గైకొనుచు
సరగున నిజనివాసం బైనయట్టి
తనచేయు నవ్వనస్థలి కేగుచెంచి
తనరెడుపర్ణసద్మంబు సొత్తెంచి
యుతరంగమున రంగాధీశ్వరునకు
నంతట నలపవిత్రాన్న మర్చించి
భుజియించి కైంకర్యముల ప్రొద్దుఁ గడపి
రజనియు దినము నారామంబులోనె
కడపుచు నతని కైంకర్యంబు దినము
నెడపడకుండఁ దా నీరీతిఁ జేయఁ
బంకజభవుఁడును పాకశాసనుఁడు
శంకరాదులు నెంతె సవరించుపూజ
సామాన్య మనుచు మెచ్చనియట్టివేలు
పామౌనివరుపూజ కాత్మలో మెచ్చి
తనదులీలావినోదము చూపవలసి
యనుపమలావణ్యయచ్చర నోర్తుఁ

దలఁప నేతెంచి పాదములకు నెఱఁగి
పలుమఱు వినుతించి పలుక నీక్షించి
సరసిజనేత్రుఁ డచ్చరతోడఁ బలికె
ధరణిఁ గావేరి కుత్తరభాగసీమ
విలసిల్లు వర్ణజ్ఞవిఖ్యాతదేవ
నిలయ మొక్కటి యొప్పు నిఖిలసన్నుతము
భూదేవరాజాదిభూషితం బైన
యాదేవదేవునియాశ్రమాంతమునఁ
జతురనర్తకవంశజాతనై జగతి
నతిలోకసుందరి వై యుండు మింకఁ
గౌతుకం బొకటి యేఁ గావింతు ననిన
నాతలోదరియుఁ దదాజ్ఞ వాటించి
యరిగి వర్ణజ్ఞాహ్వయమున నింపొందు
నరవిందనేత్రున కావాస మైన
పురమున నర్తకపుత్త్రియై పొడమె
మరుఁ డేర్చిపట్టినమార్దణం బనఁగఁ
దనదువర్ణాశ్రమ ధర్మముల్ చూపి
మునులవర్ణాశ్రమములు చూఱఁగొనుచు
జను లాత్మఁ జొక్కి మెచ్చఁగ దేవదేవి
యనఁగ జగన్మోహనాంగియై పొదలె

నొఱపైన జడవిరహుల వెన్నుతరటు
కొఱనవ్వు వరభుజంగులగుండెదిగులు
కరములు పల్లవకంఠపాశములు
గురుకుచంబులు కాముకులరొమ్మువసులు
కడతొడల్ పాంధులకట్టుకంబంబు
లడుగులు విటహృదయముల శల్యములు
ననఁగ బిటారిసోయగములతోడఁ
గనుపట్టుచుండునంగంబులు గలిగి
రతి కళాప్రౌఢి భారతి కళాప్రౌఢి
నతిశయింపుచు యౌవనారూఢ యగుచు
నొఱపులకుప్పయో యొప్పులగనియొ
మెఱుఁగులదిన్నయో మేలిమిచాలొ
నటనలదీమమో నయముల ప్రోవొ
బటువులపిండొ శోభనకదంబంబొ
యని లోకములు గొనియాడంగ మేన
ననలొత్త నెరజవ్వనము [12]కైలువారఁ
బాటఁ దుంబురుని వాక్ప్రౌఢిమ వాణి
నాట రంభాదుల నణకించు మఱియు
నక్కజంబగు దానియందుంబుఁ జూచి
చొక్కకుండుట యెట్లు సురనాథుఁ డైన

ఈపేజీ రెండవసారి వచ్చినది. ఈపేజీ రెండవసారివచ్చినది.

మలయుసొంపుల దానిమాటలు విన్న
వలవకుండుట యెట్లు వలరాయఁ డైన
దానిఁ బైకొనెనేని తామరచూలి
యైన గౌరీనాథుఁ డైన లోఁ జిక్కి
లోఁగక తేనియలోఁ బడినట్టి
యీఁగలచందాన నెడఁబాయఁగలరె
యట్టిసొంపులు గల యలదేవదేవి
నెట్టనఁ దనవిద్యనేర్పులు నెఱపి
ధరలోన నొరులకుం దరములుకాని
సురతాణిచే [13]నిలు చూఱలుగొనుచు
నరసార్వభౌము నానందింపఁజేసి
యరుదైనసగమురాజ్యంబుఁ గైకొనుచు
గరినాథుఁ జొక్కించి కటహకుంభీంద్ర
వరమణిభూషణావళులు గైకొనుచు
గౌళ నేపాళ బంగాళ పాంచాల
చోళేంద్రముఖుల రాజులఁ జొక్కఁజేసి
తనకు నై జంపుబందాయిలం జేసి
కొని లోకములు దన్నుఁ గొనియాడనుండి
యొకనాఁడు నిచుళేంద్రు నుర్వీశచంద్రు
నకలంకగుణధాముఁ డగు సార్వభౌముఁ

బొడఁగని తనదునేర్పులు పచారించి
యెడపక నతనిచే నీరానియీవిఁ
గైకొందు ననుచు నాకమలాయతాక్షి
జోకగాఁ గమ్మకస్తురినలుం గిడుచు
జాతిగొజ్జగినీట జలకంబు లాడి
రీతిగా నొకవింతరేఖ చూపట్ట
వలిపెచెంగావిపావడరం గొకింత
వెలిమించు నెరివట్టు వెలివట్టు గట్టి
జవ్వాదిపద నిచ్చి చంద్రకాంతంపు
దువ్వెనఁ గొమరార దువ్వి నెన్నడుమఁ
బాపట యొసపరిబాగుగాఁ దీర్చి
చూపట్టుకొ ప్పొకించుకజాఱఁ దురిమి
తెలిమించు నాణిముతైపుజేర్ల తోడఁ
బొలుపొందుపచ్చలబొ ట్టొనరించి
విటుల మన్మథుఁడేయు విరిమొగ్గతూపు
నటన గుమ్మడిగింజనామంబుఁ దీర్చి
బవరిముత్యములఁ జొప్పడి పూర్ణచంద్రు
ఠవణించు విమలతాటంకముల్ దాల్చి
మొగపుదీఁగెకు చెంత ముత్తెపుబలుకు
జిగిమీఱ మణులమించినతాళి వెట్టి

పుంజాలదండదాపున నేవళంబు
రంజిల్ల బణ్ణసరంబు గీలించి
ముంగైమురువుల కిమ్ములఁ గంకణముల
చెంగట ముత్యంపుఁజేకట్లు పూని
తళుకుమించినసందిదండలమీద
నెలవంకతాయెతుల్ నెరివుట్టఁ గట్టి
తిరుగుటుంగరముపూదియ లాన వామ
కరమున ముద్దుటుంగరము గీలించి
పడమటిపన్నీటఁ బద నిచ్చి చెంప
కడల కస్తూరిరేఖలువారఁ బూసి
పొలింపఁ దగు మొగపులతోడ దెసలు
డాలించుమణులయొడ్డాణంబుఁ బెట్టి
యొరయుకుచ్చిలమీఁద నొకయింత జాఱ
మురువైనబిల్లలమొలనూ లమర్చి
మరునిపట్టంపుసామజనిగళంబు
కరణి శోభిల్ల డాకాల నంచలను
సింగారముగ మీలఁ జేర్చినమించు
బంగారుసరపణి బాగుగా నునిచి
గణికాశిరోమణి ఘనబిరుదాంక
మణినూపురము వింతమహిమగాఁ జేర్చి

తనజోడుకోడె యై తనుఁబాయలేని
తనయగ్రసంభవ తన మున్నె నడవ
నీడుజోడై తను [14]నెసకొల్పఁ జాలు
చేడియల్ తనుఁజుట్టి సేవించి నడువ
నిచుళకు నరిగి యానృపకులోత్తంసు
నిచుళేంద్రుఁ బొడఁగాంచి నేర్పున నపుడు
రాణించురాగవర్ణములతోఁగూడ
వీణానువిద్యాప్రవీణతఁ జూపి
తక్కినకళలయందలి నేర్పు నెఱపి
సొక్కించి వలపులసోనఁ జిక్కించి
యారాజుచేత సప్తాంగంబుఁ గొనుచు
శ్రీరంగనగరంబుచెంతనే మగుడి
చనుచుండి చైత్రవైశాఖంబులందు
మినుకైన రోహిణీమృగశీర్షములను
మిక్కిలివేండ్రమై మెకములతలలు
ప్రక్కలౌఁ బొమ్మనువడి నెండఁ గాయ
గూడారములబండి గొల్లెనగొడగు
నీడలలోనెల్ల నిలువరాకుండ
వడచల్లునెరయెండ వాతెఱ లెండ
నిడుసోగకన్నుల నెరికెంపుచూప

విరిదేనియలు కమ్మివిరిమీఁదఁ బొదలు
కరణి లేఁజెమట మొగంబుపైఁ బొడమ
నీయెండవడఁ దీర్ప నెలదోఁట యొకటి
యీయండ లేదొకో యింతులారనుచుఁ
దలపోఁత సేయు నత్తఱిసొంపుమీఱ
నలరుదేనియ నోలలాడి యందంద
పూచినగొజ్జంగిపొదరిండ్లు దూరి
యేచినయలులకు నింపు వుట్టించి
తలిరుజొంపముల నెత్తములమై వెడలి
కొలకొలకొలకుల గేడించికొనుచుఁ
గలువల నొరసి చెంగల్వలఁ జెనఁకి
చలిమీఱి తొవలతోఁ జయ్యాటమాడి
వనజపంక్తులమీఁద వడిఁ బల్లటీలు
కొనుచుఁ గుందములమై గునిసియాడుచును
ననసోనగురియుపొన్నలనీడ వెడలి
గొనబుమించినకేతకుల దండవట్టి
ననతివేగమి నట్టినడిచాయఁ జొచ్చి
కనుపట్టుపన్నీటికాలువ దాఁటి
మగుడి గందంపుఁ గొమ్మలతోడఁ గలిసి
పొగడపుప్పొడి గందపొడిఁ దొప్పదోఁగి

నారాయణునికరుణాదృష్టి వోలెఁ
జారుసౌరభశైత్య సౌభాగ్య మొదవ
వలరాజు గురుఁడు నీవలకులోఁ జేయఁ
గలవాని నిచ్చోటఁ గంటి రమ్మనుచు
నద నెన్ని తనుఁ బిల్వనంపినరీతిఁ
గొదమతెమ్మెర లెదుర్కొన సేదదేరి
యాదేవదేవి తదామోదమునకు
మోదించి పరిమళములజాడ నరిగి
నాగ చాంపేయ పున్నాగ జంబీర
పూగ కేసర కుంద పూగ మందార
సాల నారంగ రసాల బంధూక
కోల కుద్దాల తక్కోల ఖర్జూర
కరకచందనశుభాకరకదంబాది
ధరణీజములతోడఁ దనరుచు నెదుట
నందనవనముచందంబు పులస్త్య
నందనవనముచందంబు గేలించు
సౌరభంబుల విందు సలుపు శ్రీవిప్ర
నారాయణోపవనంబు డాయంగ
నరుదెంచి పూదేనియలకాల్వ దాఁటి
విరివొడినెత్తంబువెడచాయ వెడలి

మలగొన్న సంపంగిమ్రాకులు గడచి
చలిమించు పుష్పమంజరుల వీడ్కొనుచుఁ
బొదలినగొజ్జంగిపొదరిండ్లు దూరి
ముదమున వనమధ్యమునకు నేతెంచి
పన్నీటియివముకప్రముమీఁదిచలువ
వెన్నెలలో సీతు వెడనవ్వికొనుచు
మట్టమై తలిరుజొంపములలో నొక్క
పుట్టమై లో నెండ పొడవడకుండఁ
దలిరించి కడు నివతాళించు నొక్క
యెలమావిక్రిందటి కేతెంచి నిలిచి
యాచల్లగాలియు నాతోఁటసొబగు
చూచి హా యని సొక్కుచును దేవదేవి
యనుఁగుఁజేడియలెల్ల నందంద కొలువఁ
దనయగ్రజాత నత్తఱిఁ జూచి పలికె
నోయక్క కంటివే యొకయెంతవింత
యీయెడ విరహులయెదలు బిట్టగల
జలజాస్త్రుఁ డడిదముల్ జళిపించినట్లు
చిలుపగాలికి మావిచిగురు లల్లాడె
నమలనానాప్రసూనార్ఘ్యసంతతుల
రమణీయవివిధమరందపాద్యములఁ

దలకొన్నభృంగనాదస్వాగతముల
నెలమివాటిల మన కీపాదపంబు
లాతిథ్య మొసఁగెడి నదె చూడఁ గదవె
యోతలోదరి యింక నొకవింత వినవె
పంకజాస్త్రునివెన్ను బలమైనవిరుల
సుంకులు రాలు నీసోమరిగాలి
చుట్టాలసురభియై సురభిసంతతుల
నెట్టనఁ గొనివచ్చి నేఁ డిచ్చె మనకు
నవపల్లవోష్ఠి సూనవిరళహాస
ప్రవిమలపుష్పపరాగాంగరాగ
కలకంఠనాద సంకలితాబ్జవదన
యలికులనిభవేణి యగువనలక్ష్మి
మనలపై నెంతప్రేమము సేసె నిపుడు
వనములో మనయెండవడయెల్లఁ దీర్చె
నని పలుకుచు నున్న యాదేవదేవిఁ
గనుఁగొని పలికె నగ్రజ నేర్పు మెఱసి
సారంగముఖపక్షిసమితి వేఁటాడి
శ్రీరంగవిభుఁడు విచ్చేయునవ్వేళ
నతని సేదలుదేర్చు నారామమునకు
నతులితం బగుజగదభిరామమునకు

మనబడలిక లెంత మన మన నెంత
యని తనతోడ నిట్లన దేవదేవి
తమకుఁ జేరువఁ దపోధామవిస్ఫూర్తిఁ
గమలాప్తబింబంబుగతి నొప్పువాని
బాలేందుచాయలఁ బదిరెండువగల
డాలించునూర్ధ్వపుండ్రంబులవాని
గాత్రంబుమై నొప్పుగలుగువైడూర్య
సూత్రంబుగతి బ్రహ్మసూత్రంబువాని
నొప్పుచందురుని రాహువు డాసినట్లు
కప్పారు నిడువాలుగడ్డంబువాని
మొలకొత్తుముత్తెంపుమోసులకరణిఁ
దళుకొత్తుశుభ్రదంతంబులవానిఁ
దవిలి మల్లియచాలుతావికై కదిసి
బవరిఁ జుట్టినయట్టిభ్రమరాళికరణి
సవరనితులసిపూసలదండతోడఁ
గవగూడి హరినీలకాంతి గేలించు
తమ్మిపూసలపేరు తనకు నైజంపు
సొమ్ముగా సవరించి చూపట్టువాని
నదనగావేరితోయంబులఁ గాల్వ
మొదలబంటిని ముంచి ముంచి పోయుచును

దడయకవచ్చి గుద్దలిఁ గొనితొంటి
మడవ మార్పుచు మాఱుమడవఁ దీర్పుచును
ద్రవ్వంగవలయుచోఁ ద్రవ్వి యందంద
పువ్వుఁజెట్టుల కెల్ల బ్రోదిసేయుచును
ఆరామకృత్యంబు లాచరింపుచును
జీరికిం దము లెక్కసేయనివాని
శౌరికైంకర్యసంసక్తు శ్రీవిప్ర
నారాయణునిఁ గాంచి నగుచు నిట్లనియె
నక్కక్క చూడవె యలవాఁడు మనల
దిక్కుఁ గన్గొన డెంతతెంపరిఁ వీఁడు
మీఱుజవ్వనము క్రొమ్మిసిమితో నిల్పు
నూఱుబండెడిని గన్నులఁదన్నుఁజూడ
నొగి యతీశ్వరుపోల్కి నుట్టులతోడఁ
దెగఁగోసికొన్నాఁడొ తెగువతో మున్నె
నలినశరుండైన ననుఁ జూచెనేని
నిలువునఁ గరఁగడే నీరుచందమున
నిటవచ్చి మనము దా నెంతసేపాయెఁ
గటకటా! యొకమాటు కన్నులఁ జూచి
యెందుండి వచ్చితి రేమని యనఁడు
మందుఁడో జడుఁడొ సోమరియొ హెగ్గడియొ

యన విని శ్రీరా మయని కేలు చెవుల
నొనరంగ సవరించి యోసి పో వినవె
వీరివారలఁ బల్కువిధమునఁ బెద్ద
వారల ని ట్లనవచ్చునే నీకు
మందుండు జడుఁడు సోమరియు హెగ్గడియు
నిం దుండునే? యున్న నిట్టితేజుంబు
గలుగునే? కమలసంగముఁగోరుతేఁటి
యిలలోన నుమ్మెత్త కేల యాసించు
రంగేశకైంకర్యరతుఁ డైనయాతఁ
డంగనారతిఁ గోరునా యెందునైన
నని పలుకుచునున్నయక్కతో మగుడ
ననియె గద్దింపుచు నాదేవదేవి
గాలియే కుడుపుగాఁ గైకొని కాలు
నేలమోపక సూది నిలిచియున్నట్టి
శాండిల్యుఁ డలపరాశరుఁడు కౌశికుఁడు
నుండిరే యింతుల నొనఁగూడఁ కిలను
ఉప్పు నీరును జొచ్చియున్నట్టిమనుజుఁ
డప్పరో లోనుగా కతఁ డేల యుండుఁ
గలవి లేనివి కొన్ని గడియించి వట్టి
బలిమి చూపుచు లేనిపౌరుషం బెన్ని

కొనల కెక్కించెదు గోఁచిబాపనిని
అనుడుఁ గోపించి యిట్లనియె సోదరికి
సోదరీ! వినవె యీయోగినాయకుని
నీదైనరూపంబు నెఱపి చొక్కించి
వలపులు పచరించి వలపించితేని
దొలఁగక యేను నీతొత్తు నయ్యెదను
అనుమాట లాలించి యాదేవదేవి
యనియె సంతసమున నాయక్కతోడ
మఱవకే యీమాట మఱవకే నీవు
మఱచిన నేనేల మఱవనిచ్చెదను
అలివేణి నానేర్పు లన్నియుఁ జూపి
వలపించి వీని నావలలకు లోను
జేసెద నారీతిఁ జేయకయున్న
దాసి నయ్యెద నీకుఁ దరళాక్ష్మి యనుచు
ననుఁగుజేడియలతో నగ్రజం బురికిఁ
బనిచి తా నొక పాదపమునీడ నిలిచి
తొలుతఁ బెట్టినయట్టితొడవులుఁ బట్టు
వలువయు సడలించి వనములో నొక్క
యేకాంతమైయున్నయెడ డాఁచి యప్పు
డాకాంత యొకయుపాయము విచారించి

గన్నేరుపూచాయ గల నీరుకావి
వన్నియపుట్టంబు వదులుగాఁ గట్టి
మిడుగుల నొరయ నామీఁదఁ బింజయల
మడిచారుచెరివియామై నేర్పుతోడ
బిగిచన్నుఁగవమీఁదఁ బెరయఁ బయ్యెదయు
దిగిచి నెన్నడుమున దిండుగాఁ జుట్టి
నడిముక్కు నొరయంగ నామంబు వెట్టి
నడుమ హారిద్రచూర్ణపురేఖఁ దీర్చి
వరుసగాఁ దిరుమణివడములు వైచి
పరమవైష్ణవ ముట్టిపడఁగఁ జూపట్టి
వైకుంఠపురినుండి వచ్చెనో యనఁగఁ
గాక వైరాగ్య మీగతి నిల్చె ననఁగఁ
జని తోఁటలో నున్న జగతీసురేంద్రుఁ
గని యాననము వంచి కరములు మోడ్చి
కొదుకుచు నొదుగుచు గోలచందమునఁ
బదము లెంతయుఁ దొట్రుపడఁగ నందంద
నిలిచి మ్రాకులపొంత నిక్కంపుభయము
గలిగినదానిసంగతి వడంకుచును
దోరంపుఁగన్నులఁ దొరఁగెడు బాష్ప
ధారలు చెక్కుటద్దములమై నిగుడ

నెదురేగునమ్మౌని కెదురేగి యతని
పదపంకజములపైఁ బడి దైన్యపడుచుఁ
దొడిబడ రెండుచేతులఁ బదాబ్జములు
విడువక వడి వెక్కి వెక్కి యేడ్చుచును
నర్తకీగ్రామణి నలిఁ గ్రుక్కి క్రుక్కి
యార్తి రెట్టింపంగ నాయోగి కనియె
నోయార్తరక్షక ! యోకృపాచంద్ర !
యోయాదిగురునాథ ! యోమునినాధ !
రంగనాయకపాదరాజీవలోల
భృంగ ! యభంగనిర్జితదోషకరణ !
పాథోధికన్యకాపతిభక్త ! యోగి
నాథ! యనాథను నను గావు మనుచు
మాటిమాటికిఁ బల్కు మట మాయలాఁడి
మాటలు నిజమని మది విచారించి
కరుణాపయోరాశి గాన నయ్యోగి
తరుణి లే లె మ్మని తనకేల నెత్తి
యెందుండివచ్చితి వేది నీనామ
మిందుబింబానన యేకారణమున
నిటకువచ్చితివి నా కెఱిఁగింపు మనినఁ
దటుకునఁ బాణిపద్మంబుల మొగిచి

యీతఱిఁ జిక్కెఁ బో యితఁ డంచుఁ జుప్ప
నాతికైవడి యెలనాతి యిట్లనియె
నేమని మీతోడ నే విన్నవింతు
నేమని నానామ మిపుడు సెప్పెదను
ఐనను మీయాజ్ఞ యది మీఱరాదు
గాన నావచ్చినక్రమ మేర్పరింతుఁ
బోడిమి నిలఁ బుట్టుపుట్టువులందు
నాఁడుపుట్టువు హీన మందులోపలను
గంజనందనుఁ డతికష్ట మైనట్టి
లంజపుట్టువున నీలాగున నన్నుఁ
బుట్టించె నారోఁతపుట్టువఁ బుట్టి
యట్టె నే గడియించు నతిహీనధనము
తనతల్లి దాఁచి యాధనమెల్ల పిసిఁడి
తనమున నిలదేవతలకు విప్రులకుఁ
జీమంత యిడక తెచ్చినకాసు లెల్ల
వేమాఱు డాపంగ వేసరి యేను
బడయంగవచ్చు నాపసి డిచే నేమి
పడయంగవచ్చు వెంబరవిత్త! యనుచు
రోసి యాతల్లిదండ్రులపొందు వీడఁ
గోసి చంచలకామగుణకవాటంబు

మూసి నీపదపద్మములు వచ్చి డాసి
దాసి నయ్యెద నని తలపోసి యిపుడు
పనివిని మౌనీంద్ర! భవదీయపాద
వనజముల్ శరణని వచ్చితి నేను
నెరవుగాఁ దలఁపులో నిడక వేవేగఁ
గరుణించి యొకయూడిగంబుఁ గల్పించి
పనిగొను మింక నీపంచనే కాచి
కొని యివ్వనముఁ గాచికొను చునుండెదను
భర్తవు సకలసంపదలకు నాత్మ
కర్తవు నీవ యోకరుణాంబురాశి!
యన విని మోదించి యామాయలాఁడి
యనుమాట లెల్లఁ దథ్యములేయటంచు
మౌనినాథుఁడు తనమదిలోన వార
మీనలోచన సధర్మిణిగా నెఱింగి
కనకచేలాంగునికైంకర్యమునకు
ననుకూల మగుసహాయము గల్గె ననుచు
ననిశంబు నారామ నారామమునకుఁ
బెనుపొందఁ గావలివెట్టి తా నరిగి
యలరంగధాముఁ డంతంతఁ జిత్తమునఁ
నలరంగ దామంబు లర్పించి మగుడి

చనుదెంచి తెచ్చుభైక్ష్యము మనోవీథిఁ
బనుపడ శ్రీరంగపతికి నర్పించి
మును దా భుజించి ప్రమోదంబుతోడఁ
దనప్రసాదము మెలంతకుఁ బ్రసాదించి
యగపడి కావేరియంబుపూరంబు
మొగవాళమునఁ గుంభమున ముంచి ముంచి
యెడపడకుండ నీరెత్త [15]నానీట
వడి మడమలు చిందు వందు గాకుండఁ
గుసుమమంజరులసోఁకున కోర్వలేని
కుసుమకోమలి వాడిగుద్దలిఁ బూని
నిడుదవాయిగఁ జేసి నీకు నిండార
మడవ గప్పుచు దండ మడవ విప్పుచును
దనసేయుసేద్య ముంతయుఁ బరవంబు
కొని తానె సేయ నెక్కొను గూర్శితోడ
నీరీతి యోగీంద్రుఁ డింతితోఁ గూడ
నారామకృత్యంబు లాచరించుచును
నెలమిమైఁ బగలెల్ల నిట్లుండి రేయి
యెలనాఁగ యొకపొదరింటిలో నుండఁ
జనుదెంచి తనపర్ణ శాలలోనుండి
దినదినంబును దేవదేవునిసేవ

యకలంకమానసుం డై చేసికొనుచు
నొకయేఁడు గడపె నయ్యువిదతోఁ గూడి
యంత నాకాంత యేకాంతంబునందుఁ
జింతించి తనలోన శ్రీరంగవిభుని
దూరి పూఁబొదరిల్లు దూరి డెందమునఁ
గూరినవగపుతోఁ గుందుచుఁ బలికె
నిచ్చోటి కుండుండి యేల వచ్చితిని
వచ్చితింబో యిటువంటిగొంటరిని
గనుఁగొంటి నేలకో కనుఁగొన్నత్రోవఁ
జనక యీగతి కొనసాగనిప్రతిన
సేసితి నేలకో శ్రీరంగరంగ
నాసరివారిలో నగుబాటు గాఁగ
నని కనుమూయంగ నారంగవిభుఁడు
సనుదెంచి వెఱవ కోసారంగనేత్ర
యెల్లి యీప్రొద్దున కెల్ల నీమనసుఁ
జల్లఁజేసెద నని చనిన మేల్కాంచి
యరుదంది డెందంబునందు సొంపంది
యరవిందసమనేత్ర యారాత్రిఁ గడపి
మఱునాఁడు వనములో మౌనితోఁ దొంటి
తెఱఁగునఁ గూడి వర్తింపుచున్నంత

గగనయాంత్రికుఁడు లాగపుబంతి డాఁచు
పగిది భానుఁడు గ్రుంకెఁ బశ్చిమాంబుధిని
తెర [16]నరమొఱఁగి నర్తింపుచునున్న
యరవిందనయనలయందంబు దోఁప
నెఱయ మించులతోడ నీరాళ్ళగొంది
మెఱచెం దళుక్కన మేఘంబుచెంతఁ
గాముకహృదయపుష్కరము నిండారఁ
గామాంధకారంబు గప్పినపగిది
గగన మొక్కింతయుఁ గానరాకుండ
మొగులు గార్క్రమ్ముచు ముంచె నల్గడల
ముంచి నల్గడ నల్లముసురుగాఁబట్టి
మించులతోఁగూడ మేళమై పొదలి
విటపాగ్రములు వెడవెడఁగ నల్లాడఁ
జిటిపోటిచినుకులుచినుక నవ్వేళ
నాకులమీఁద నీ రానక జాఱి
కోకమైఁ బడ వడంకుచు నొదుగుచును
నులికి యాపొదరింట నుండరాకున్నఁ
దలఁకుచు వెడలి యాతన్వంగి వంగి
బలుపువ్వుగుత్తులబరు వానలేక
నలపుష్పలత యసియాడుచందమునఁ

జన్నుగొండలవ్రేఁగు సైరింపలేక
చిన్నారికౌఁదీఁగ జివ్వాడుచుండ
జవులిఁ జూపట్టెడు శంపాళికేలి
దివియ లై తనమున్నె తెరువు చూపఁగను
గనుచూపుమించులు కారుమించులును
బెనఁగొన్నఁ దెలియక బెగడొందికొనుచు
తనకొప్పుమొగులునా దట్టంపుమొగులు
నెనసిన వివరించి యెఱుఁగంగ లేక
యల్లనల్లన వచ్చి యామహాయోగి
వల్లభుసదనంబువాకిటియెదుట
దళము లొండొంటితోఁ దార్కొని మిగుల
దళమైన యొకచలదళముక్రిందటికిఁ
జనుదెంచి మరుఖడ్గశాఖయపోలెఁ
దనరుచు నామ్రానిదండ నిల్చుటయు
వలిపిరిగాలితో వలి మీఱి మీఱి
బలువిడి వాన యంపాజాల మైన
యలజడిచేతఁ బాయనియీదగాలి
యలజడిచేతఁ దా నందఁద వణఁకి
యే రావికిందట నీరీతి నుండ
నేరా విచారింప విభరాజవరద !

యని రంగవిభునకు నంతరంగమున
ననలొత్తుభక్తి సన్నతిఁ జేయుచున్న
నప్పు డాపర్లశాలాంతరసీమ
నొప్పుచుం బవళించియున్న యాయోగి
యలవిమీఱిన యమ్మహావృష్టి యిపుడు
[17]వెలిచెనో వెలవదో వివరింతు ననుచు
మసకలక ద్వారసీమకు వచ్చి హస్త
కిసలయాగ్రమున వాకిలి యూఁది నిక్కి
జలదికీర్ణము నాకసముఁ దొంగి చూచి
యలరావిక్రిందటియలివేణిఁ జూచి
తొలుత నభ్రంబునఁ దుళగించుమించె
యిల వ్రాలెనో కాక యిది యది యైన
దండనె చలనమొందక రూపుతోడ
నుండునే యనుచు ని ట్లొకకొంతతడవు
తలపోసి తలపోసి తరళాక్షి ! యనుచుఁ
బలుకరింపుచు నిజభావంబుఁ గాంచి
జక్కవకవ వెక్కసపు[18] వలవాడి
ముక్కుల నొత్తినమురువు దీపింపఁ
బనుపడ నులిపచ్చిపయ్యెదకొంగు
మొనలనానినకుచముల నొప్పుదాని

మీఱినచింత నెమ్మెయి విలోకించి
తేరి కన్గొని దేవదేవిగా నెఱిఁగి
కటకటా! వానచేఁ గడునొచ్చె దీని
నిటకు రమ్మందునో యేల యివ్వేళ
నేకాంతమునవ చ్చి యెలనాఁగ లున్న
నేకాంతులకుఁ గూడునే యని తలఁచి
యీద యేగతి మాను నే దయమాలి
యీదెస నుండంగ నిగురుబోణికిని
అని యీశ్వరప్రేరితాత్ముఁ డై దుఱియు
ననబోఁడిఁ గని విప్రనారాయణుండు
తడయనేటికి రమ్ము తరళాయతాక్షి
జడియక మాపర్ణశాలలోపలికి
నన విని యిదియసం దనుచు నాచక్కి
మును దాఁచియున్నసొమ్ములు సంబరమును
గొనుచు వేవేగ నక్కుటిలకుంతలయుఁ
జనుదెంచి యాపర్ణశాలలోఁ జొచ్చి
యలిబలంబులు వచ్చి యతనితో మున్నె
యెలగోలు సేసిన యింపు దీపింపఁ
దల తడియార్చుచందము దోఁప మౌని
కులనాధు సోఁకంగఁ గ్రోమ్ముడి విడిచి

జాడించి సీమంతసరణు లేర్పడఁగఁ
గూడదువ్వుచు జారుకొప్పు గీలించి
జోఁకగాఁగనయంబుఁ జొనిపి మై మొగలి
రేఁకు బాగున కొంగురింగు వోఁ జెరివి
[19]పాలిండు లఱఁగానుపడ నొకవింత
లీలఁ బయ్యెదకొంగు లేజాఱవైచి
చికిలిచేసినమారుచేకత్తి వోలె
నకలంకమణిభూషణాన్విత యగుచుఁ
గొమలునిక్కఁగ నేయుకుసుమాస్త్ర మనఁగ
బొమలు నిక్కఁగ నొరపులచూపు జూడ
నినుపైనచూపువెన్నెలసోగ సోఁక
ఘనమౌని హృచ్చంద్రకాంతంబు కరఁగ
మౌని వయ్యారిదీమపుఁజూపువలకు
లోనయ్యె ననుచు నాలోలాక్షి కదిసి
యిదియె సందని యెలుఁగెత్తి తేనియల
చిగురుప ల్చెవులలోఁ జిలుక నిట్లనియె
నెడపక వనములో నిందాఁక దిరిగి
బడలితి రొక్కింత పదము లొత్తుదునె?
యనుచు నూరులమీఁది కామౌనిపాద
వనజముల్ కరపల్లవముల రాఁ దిగిచి

యొత్తి కన్నులమీఁద నొత్తి డెందమున
నొత్తి మత్తిలి పల్కె నోమౌనిచంద్ర!
కొండగా నినుఁ జూచికొని వచ్చి యిచట
నుండఁగా ననుఁ జూచి యొక్కనాఁ డైనఁ
బడుచ రమ్మని కేలుపట్టి లాలించి
యొడబాటు గావించి యొకమాఱు హితవు
నెరవుసేయక చెప్ప వీరీతి గలదె?
హరిహరీ! యిఁకనైన నానతి మ్మనినఁ
గమలాస్త్రుమౌర్విటంకారంబుపగిది
సమకొన్న తేఁటులఝంకార మెసఁగ
ననతేనియలవాన నాని యింపూని
చనుదెంచె నొయ్యనఁ జలిగాలికొదమ
రాగంబుతో నంతరంగము రంగ
భోగి ప్రేరేప నప్పుడు మౌనివరుఁడు
నలుగడఁ జొరనేయు నళినాస్త్రుపువ్వు
ములుకులు వెలికింత మునుపుచందమున
నలమోహనాంగి చే యంటుటవలన
నిలువెల్లఁ బులకింప నెన రామతింప
హరి కుబ్జ మున్ను నెయ్యంబునం గలయు
కరణి నాలేమ నంగజకేలిఁ దేల్చె

రతి[20] వేదశిక్షకు రతిరాజు తరటు
[21]గతి వేణి యొప్పు నక్కలకంఠకంఠి
వనములు[22] గాఢభావజకేలిఁ గొన్ని
దినము లచ్చోట వర్తించినమీఁద
నారామ తనకోర్కె యలరంగ విప్ర
నారాయణుని యోగినాయకోత్తముని
మునుపు విభాండక మునిపుత్త్రుఁ దోడి
కొనిపోయినట్లు తోకొని యేగుదెంచి
తనయగ్రజాతముందర నిల్ప ననుజఁ
గని మోహనాంగి దిగ్గన వెఱఁగంది
యవునౌనె నీ వాడినట్టి యీప్రతిన
యవగడం బగుమాట లవి నీకె చెల్లు
నోకొమ్మ! నీదుమా టొకటి సేఁ తొకటి
కాకుండ పంతంబుఁ గడతేర్చికొంటి
వాకొని వేయును వర్ణింప నేల
నీకు నీవే సరి నిఖలంబులోన
నీదెస మఱి నేర్పు లెన్న నేమిటికి
నీదెపో నేర్పైననేర్పు తన్వంగి!
యిలలోన నేము నీయిందఱలొన
మెలఁతరూపులఁ బొడమితి మింతెకాక

నీవంటిచతురత నీవంటిసొబగు
నీవంటినేర్పు లెన్నిన మాకుఁ గలవె?
మానినీమణులలో మఱియును నాట
దానవైనను నీన తలిరాకుబోఁడి
మఱియును నీవ పో మఱియును నీవ
మఱియును నీవ ముమ్మాటికి ననుచు
నెన్ని కౌఁగిటఁ జేర్చి యింతి నామాట
లన్నియు నోర్చుకొ మ్మని గారవింపఁ
దనచెల్మికత్తియల్ తనుఁ బెక్కుగతులఁ
గొనియాడ నావారకుటిలకుంతలయు
నలభూసురేంద్రుతో ననయంబు బత్తి
గలిగినదానిసంగతిఁ గొన్నినాళు
లెనసియుండఁగఁ జూచి యితరు లాసన్నఁ
గని [23]యప్పనముగ నొక్కనిపాలఁ జిక్కి
తగువైనమగువలం దగులుట రోఁత
తగదని విటులు రాఁ దడిసినకతన
వెచ్చసచ్చములకు వెడవెడ యైన
నచ్చపలాక్షిలో యనుఁగు వోనిడిచి
వసుధలోపల వారవనితలవలపు
పసిఁడితోడిద, కాదె? భావింప మఱియు

నెన్న నేటికి లంజ కిలలోనఁ గ్రొత్త
మిన్న లిచ్చినవాఁడె మీనకేతనుఁడు
ఈనియామరుఁడైన హీనవిగ్రహుఁడు
గాన యాముని యున్నగతి యెల్ల నెఱిఁగి
యీఁబుచ్చుకొనకుండు టెఱిఁగి యీపడుపుఁ
బూఁబోఁడి మదిఁ దలపోసి యే వీని
సడి నొంద కేరీతిఁ జయ్యన నిల్లు
వెడలఁగొట్టఁగ నెద్ది వెఱ వని తలఁప
నల్లన నది గని యాదేవదేవి
తల్లి పల్లవబాహుతాడితవదన
మంకుదిమ్మరి మటమాయలబండి
డొంకువోయినటక టొంకుసంకటము
విటుల నిచ్చలుఁ గాఁచి వేఁచుటవలన
విటకంటకిఖ్యాతి వెలసినగబ్బి.
యెప్పుడు తనయింటి కేగువారలకుఁ
దప్పుబాసలు సేసి తప్పినకతన
వెలికురికినపండ్లు ! వ్రేలాడుచండ్లు
కుళుపవట్టినమేను కోఁతిమొగంబు
తప్పకన్నును బట్టతల గూనివీఁపు
పుప్పిగోళ్లును నీచవోయినకాళ్ళు

చీమకండ్లును మొండిచెవి బుఱ్ఱముక్కు
గాముఁ బోలినరూపు గలిగి యందంద
వెరగైనతనమాట వినినంతలోనె
పొరుగిండ్లకుక్కలు బోరున మొరఁగఁ
జిలుముచాయలపండ్ల చెడ్డకంపునకుఁ
దలఁకి చుట్టామడ దయ్యాలు బెదరఁ
గడుఁగోప మెసఁగ రోఁకలి మూఁపుమీద
నిడుకొని దుడి దుడి నేతెంచి పలికె
నో వెఱ్ఱిబిడ్డ! నీ కుచితమే యిట్లు
నీవంటిలంజెల నీవు గన్గొనవె
తాటోటుమాటల తక్కరిగొంటు
తాటదమ్మని నమ్మఁ దగునె యోయమ్మ
కొఱమాలి యున్నవే గొంగబాపనికి
మరు లేల కొంటివే మటమాయలాడి!
గారాబువెన్నెల గలనాఁడె యల్లో
నేరేళ్ళు గాకయోనీలాహివేణి!
బ్రదుకెల్ల ముదిమిచేఁ బడకుండ నాఁడె
ముదిసినఁ గోరయౌనె ముంజ లంజెయును
వయసునం గడియింపవలయుఁగా కరుగ
వయసు రమ్మనినను వచ్చునే మగుడి

యిచ్చట నొక్కకా సిచ్చెనో వీస
మిచ్చెనో వీఁడు దా నింటిలోఁ గలవి
తిని పులిబోఁతుపొందికనున్న లెక్క
గొన వింటిలోపల గుండ్రించుకొనుచు
నేనాఁటిలంజియ లింటిలో వెరఁజి
యేనాఁటిమగలకు నెదురువెట్టుదురు?
ఎలయించి ప్రియులకు నింపు పుట్టించి
కలకాలమును జేతఁ గలకాసు లెల్ల
వలిపించి వెరఁజుకోవలయును, గాలి
గలనాఁడె తూర్పెత్తఁగాఁ దగుఁగాక
యిన్నాళ్ళు నోర్చితి నిఁక వాని వదలి
యున్న నామాటలో నుండు కాదేని
పూని నీబుద్ధులఁ బోయితివేని
వాని నిన్నును బట్టి వడి నంటఁగట్టి
చంపి చాఁగరగొని సదమదం బాడి
కొంప నుండకయుండఁ గొట్టి తోలుదును
అని వెండియును దన్ను నదలించి కినుకఁ
గనుఁగొని వేయుసంగతుల సాదించి
జనని వేసారంగ సారంగనయన
తనలోనె తాను చింతన సేయుచుండెఁ

దనపట్టి [24]శాంతియంతయు మట్టుపెట్టి
కనలుచు నావిటకంటకి యపుడు
చేరి యాచెంత భాసిల్లెడు విప్ర
నారాయణునిమీఁద నడతెంచి కదిసి
కడిఁదికోటికి గంట గట్టి నిచ్చలును
బడసి గడించు నాబంగారుకుండ
మక్కువ నెలయించి మాఱు లేకుండఁ
దక్కక మందులు తల కెక్కఁజేసి
యోరోరి నాబిడ్డ యో జెల్లఁ జెఱచి
తీరీతివెఱ పొకయిం తైన లేక
క్రొత్త లిచ్చెదొ పుచ్చుకొనియెదో వట్టి
రిత్తమాటలు నీవు రెంటనుం బస్తు
లోరి నీ వొకచిన్న మొసఁగవు లంజ
వారిసొమ్ములు దిన వారి కేమగును
వీఁగనిమృత్యువు వెస నన్నుఁ జూచి
లోఁగుఁ దామరపాకులోనీరు వోలె
నలజముఁ డైన నాయందంబుఁ జూచి
తలకు నొక్కింతయుఁ దలఁకవు నీవు
మడియఁ గొట్టుదునొ దిమ్మరితాటదమ్మ
వెడలెదో మాయిల్లు వేవేగ ననుచు

బెగడొంది తనుఁ జూచి బీరువో నున్న
జగతీసురేంద్రుహస్తముఁ బట్టి తిగిచి
నిడుసాగిలఁగ నెట్లు నెట్లు వడంగ
మెడ వట్టి ద్రొబ్బి గామిడితొండ యనుచుఁ
దలుపు బిగ్గన మూసి తడయక గడియ
బలువుగా నిడి వెలుపలిమౌనిఁ గూర్చి
మగుడివచ్చిన సిగ్గుమాలుతు ననుచు
జగఱాఁగ ముదుసలి సాదింపుచుండె
నంత నామునినాథుఁ డంతరంగమున
నెంతయుఁ జింతించి యే పెల్లఁ దక్కి
జగడించునలబేరజమునకు నోడి
పొగులుచు నిలు సొచ్చి పోవంగలేక
పలుదెఱంగుల మేలుపడి చిక్కియున్న
పొలఁతిపొందులు డించి పోవంగ లేక
వకవకలై యింత వ్రతముఁ దక్కినను
సుకము దక్కకపోయెఁ జూచితే యనుచు
ఖిన్నుఁడై వారివాకిట నున్నపంచ
తిన్నెపై నొదికిలి దేవుఁడా యనుచుఁ
దలక్రిందఁ జే యిడి తనలోనతానె
తలపోయుచుండె నంతట వెన్నుచాయఁ

జిలుకముక్కులచాయ జేవుఱింపంగ
ఫలితాస్తనగచూతపరిపక్వఫలము
ఇల వ్రాలెనో యన నినుఁ డస్తమించె
నులుకనిమతులతో యోగీంద్రవరులు
హరిపదధ్యానామృతాహారలహరి
నరగన్ను లిడినసోయగము దీపింప
విరిదామరలు వెడవెడఁ గన్ను మొగిచె
గరువంబు దక్కె జక్కవమొత్తమునకుఁ
గుముదినుల్ చంద్రుఁ గన్గొనుచంద మెసఁగెఁ
గుముదముల్ విరియ గ్రక్కున తేఁటు లెసఁగె
నగి కోపమునఁ గాలనరసింహమూర్తి
గగనహిరణ్యవక్షము విదారింపఁ
దొరఁగురక్తంబునాఁ దులగించుసంజ
నరుణాంశువల్లిక లలరె నభ్రమున
నలరాత్రికోమలియౌఁదలఁ గలువ
చెలికాఁడు వెట్టినసేసబ్రా లనఁగఁ
దెలిమించుమించులు దీండ్రింప నభ్ర
తలమునఁ జూపట్టెఁ దారాగణంబు
లున్నతోన్నత మైన యుదయశైలమునఁ
జెన్నొందు నమృతంపుసెలబుగ్గ యనఁగ

నలకాముకులహృదయములలో మంట
వెలిమించె నన నొప్పె విధుమండలంబు
వేదన గలమౌనివిరహార్తిలతకు
బ్రోది సేసినరీతిఁ బొదలెఁ జంద్రికలు
రంగనాయకుఁ డొనరంగ నాయంగ
రంగవైభవముల రాజసం బెసఁగ
నప్పు డేకాంతపాయస మారగించి
చొప్పడుముత్యాలసొంపు దీపించి
క్షీరతరంగంబుచె న్నగ్గలించి
హారపుంజంబుచాయలఁ గ్రిందుపఱచి
కపురంబు చవచపఁగా నాడి మంచు
రపణంబు విడియించు రమణఁ జెన్నొందు
నహిరాజశయనంబునందు నిందిరయు
మహియు నీళయును బ్రేమము దయల్వాఱఁ
గెమ్మోవి దలిరాకు గేలించుకేలి
దమ్ములఁ బాదపద్మంబు లొత్తంగ
నొప్పుగా నొకవింతయొయ్యార మొదవఁ
గప్పినహేమాంశుకంబు చూపట్ట
జడిగొన్న ముత్తెంపు జల్లి [25]గింట్లెముల
[26]విడియంబు డాపలఁ బెంపొందుచుండఁ

జెంగావితలిరులజిగి మించు నొక్క
కెంగేలు మస్తంబుక్రింద నమర్చి
యకలంకకంకణోదంచితం బైన
యొకకేలు జానువు నొరయంగఁ జాఁచి
పవళించి యారంగభర్త కెమ్మోవి
చివురుమై వెన్నెలజిగితేటరవలు
మలయ నకారణమందస్మితంబు
సలుప నచ్చెరు వంది జగదేకమాత
రంగనాథునిపాద రాజీవయుగళి
బంగారుపాలిండ్లపై నొత్తుకొనుచుఁ
బగటున నీవేళఁ బనిలేనిపనికి
నగ నేల చెపుమ పన్నగరాజశయన !
నావుఁడు మిగుల మన్ననతోడ దేవ
దేవుఁ డాయిందిరాదేవి నీక్షించి
యారయ నొండు గా దబ్జాక్షి విప్ర
నారాయణుం డను నాదుభక్తుండు
వెనుకొన్నభక్తితో వేసట [27] లేక
యనిశంబు సూనంబు లర్పించుచుండు
నతఁ డొకగణికకు నాసక్తుఁ డగుచు
మితమున వారి కేమియు నీనికతన

ననురాగశూన్య యై యాలేమతల్లి
చెనఁటి నిరాకరించిన చిన్నఁబోయి
విడిచిపోవఁగలేక వెలయాలిపంచ
నడుకుచు నొదుగంగ నవ్వితి నిప్పు
డనుఁడు శ్రీరంగనాయకునకుఁ బద్మ
వినత యై వినుతి గావించి యి ట్లనియె
వనజాక్ష మీపాదవనజంబు పేరు
కొనినఁ బాపము లెల్లఁ గుందుఁ జేసేత
నీదాసుఁ డైన యీనిర్మలాత్మునకు
నీదెస వాటిల్లు టేమికారణము
మట్టుమీఱనయాగమము లెన్నలేని
యిట్టినీమాయకు నితఁడు లక్ష్యంబె
రవిదీప్తి నంధకారము సోఁకు టెట్లు
భవదీయభక్తుని బాప మే లంటుఁ
గనికరింపవు నీది గాదె యాకీర్తి
తనయునిసెగ్గెంబు తండ్రిది గాదె
పనుపడ నే విన్నపము సేయకున్న
ననఘశరణ్య నీ కతనిపైఁ గరుణ
లేదె యెంతైనఁ దల్లికి లేనిముద్దు
దాదికిఁ గలదె యోధవళాక్ష యింక

ననుఁ జూచి వాని మన్ననఁ జేసి నీదు
తనయునిపై నింద తరలింపవలయు
నన విని రంగేశుఁ డరవిందసదనఁ
గనుఁగొని పలికె నోకలకంఠకంఠి!
యతఁడు మహాయోగి యతనికి దుష్ట
రతిరక్తి గలదె యారసిచూచితేని
అతఁడు మల్లీలార్థ మై రాగవశుని
గతిఁ జెందియున్నాఁడు గాని యామౌని
తలఁప నేఁ గృష్ణావతారంబునందు
నలరుబోణులఁ గూడి యట్లయుండితిని
దుద నాకు రాగ మందుల నింత కలదె?
యది నీ వెఱుంగవె యాత్మ భావింప
నలినాస్య వివరింప నా కెంతశక్తి
గల దంతశక్తియుఁ గలదు నిత్యులకు
నతఁడు మద్వనమాలికాంశంబు గాన
నతనికి దోష మింతైననుం గలదె
హితమతి నే మోక్ష మిచ్చెద నన్న
నతఁ డీయఁగలఁ డేరికైన మోక్షంబు
నతులితం బైనట్టి యతనిపూజకును
బ్రతి యేమి సేయుదు భావించి యింక

నైన నీమాట నా కది ద్రోయరాదు
గాన నే నట్టులే గావింతు ననుచు
దనుఁ జూడ భక్తవత్సలుఁడుగావునను
వనజాక్షుఁ డిదిసేయవచ్చు రా దనక
మిసమిస మనుమీనుమీసంబుఁ దెగడు
పసిఁడివన్నియముంజిపచ్చనిగోఁచి
సోలిగోఁచుల నొప్పుచూపుదండంబు
కేలికమండలు కృష్ణాజినంబు
చిన్నారుతిరుమణి శిఖయు జన్నిదము
సన్నంపుగాటుక చారులపంచ
గొనబైనకుడివ్రేలికొడియుంగరంబు
పనుపడ మిగులంగఁ బటువైనవటువు
రూపంబు దాల్చి యర్కుని గేలిగొనుచు
నాపొంత థళథళమనుమించు లొదవు
నలవిభీషణుఁడు ము న్నర్పించినట్టి
దళమైనహేమపాత్రంబు కెంగేలఁ
గైకొని వచ్చి లోఁగక దేవదేవి
వాకిట నిలిచి కవాటంబు మీటి
గడియదీయుఁడు పని గలదు నావుఁడును
గడుగోపమున విటకంటకి పలికె

వలదన్న నేటికి వచ్చెద వింక
పొలసువైవఁగ నిదె పో పొమ్ము కొండఁ
దల నెత్తుకొన నీకుఁ దరమె యిం తేలఁ
తొలఁగరా యీమోరతోఁపు లేమిటికి
సటలు చూపకుము చచ్చనమాట లేల
మటమాయలాడ ముమ్మాటికి నీవు
బుద్దులు కలిగి నేర్పులు చూపవలదు
ప్రొద్దున నెందైనఁ బోకుండి తేని
గాసి నా కేలిరోఁకలిపెట్టులెల్ల
నీసొమ్మె యన నవ్వి నీరజోదరుఁడు
నమ్మ రేటికి మీరు నను మీకు నిచ్చి
రమ్మని విప్రనారాయణుం డనిచెఁ
గనకపాత్రం బిదే కాంతోపయంతుఁ
డనువాఁడ పరుఁడఁ గా నతనిశిష్యుఁడను
మఱియున్నజగజోగమాటలు మాని
తెఱవ వే చనుదెంచి తెఱవవే గడియ
యనవుఁడు బంగార మనుమాట చెవుల
విని బత్తి గలదానివిధమున నప్పు
డలదేవదేవి యొయ్యనవచ్చి తల్లి
వలదన్న వినక కవాటంబుఁ దెఱచి

తపనబింబప్రభఁ దలపింపుచున్న
తపనీయపాత్రంబు దాల్చినవానిఁ
గని తోడుకొనిపోయి కన్నులఁ గప్పి
కొనుచు లోనింటిలోఁ గూర్చుండఁబెట్టి
గారవింపఁగ విటకంటకి యపుడు
చేరి యెంతయు సంతసింపుచుఁ బలికె
వినవయ్య యోదేవవిప్రపుంగవుఁడ
పనివడి నీచేత బంగారుగిన్నె
యిప్పు డంపకయున్న నింతలో నేమి
దప్పె మాకిది గుఱుతా తానెకాక
యింతకాలము నొకయింటిలోపలనె
యింతయునఱ లేక యెనసియుండితిమి
మక్కువఁ దలపోయ మాలోనఁ దాను
నొక్కఁడై యుండు వేఱొక్కఁడు గాఁడు
కొమరుప్రాయము దొరఁకొని కూడి మాడి
మమతఁ బాయకయున్న మందెమేలమున
నలసి వేసరి యాడినట్టిమాటలకుఁ
దలఁపున నెరపుగాఁ దలఁప నేమిటికిఁ
జెల్లఁబో యెగ్గెల సేసె నొక్కెడను
దల్లిబిడ్డలకుసైతము రాదె వాదు

ఏ నెఱుంగకయున్న యీపాపజాతి
తానైన నీ కిది తగుఁ దగ దనక
యర్మిలి నే ప్రొద్దు నాతనిమనసు
మర్మమెఱింగి యీమాయపుబిడ్డ
యీరీతి నవ్వుల కితఁ డోపఁ డనుచుఁ
జేరి తా నొకమాటు చెప్పకపోయెఁ
జనవున నొకకొన్ని చచ్చనమాట
లని సరసము లాడినంతలోపలనె
యది సందుగాఁ గొని యరిగె మీయొజ్జ
యిదియు మానితి మయ్య యింతటినుండి
యింతవేగిరకాని నెఱుఁగము తనదు
పంతమంతయుఁ జెల్లె పదివేలు వచ్చె
నందుల కనుట కా దయ్య మాపడుచుఁ
గొందలపడుచు లో గుబ్బతిల్లుచును
బగఁగొని లోన నప్పటినుండి సొంపు
డిగి కంట కంట పుట్టెడునీళ్లు కార
[28]మమ్ము నిందాక రంభారూళ్ళు సేసి
లెమ్మన్న లేవక లీల నా కింక
నతనితోడిదె లోక మని కూడు నీళ్లు
మతిఁదలంపక నేలమై శయనించు

నెపమాత్ర నీమాట నెఱిఁ జెవి సోఁక
నిపుడు దా వాకిటి కేతెంచెనయ్య
కనకంబు చూచి తక్కరిమాట లాడె
నని తలంపకు తన కప్పటినుండి
చెడుగుకోపం బింతసేసెఁగా యనుచు
గడుపులోఁ జెయివెట్టికలఁచిన ట్లగుచు
నిలువ సయింపదు నిలిచినచోటఁ
దలఁపులో వెత జెప్పఁ దరము గా దనుచుఁ
గనుదోయి బులుముచుఁ గడలఁ గన్నీరు
కొనవ్రేల మీటి డగ్గుత్తిక వెట్టి
కొంతధైర్యముఁ దెచ్చుకొన్నది యగుచుఁ
గాంతోపయంతనుం గనుఁగొని పలికె
నీచేత నిపుడు గిన్నియ యందుకొన్నఁ
జూచువారలు మనసున నాడకున్న
నీసున నిందున కెంతగావించె
గాసించి యిది యెంతకష్టురా లనరె
నెట్టన నేము గిన్నెయ యిప్పు డిట్టె
పట్టకుండిన నెగ్గుఁ బట్టు మీయొజ్జ
యెవ్విధమునఁ జూడ నెందుఁ బోవచ్చు
నెవ్వరితో సడ్డ యే లయ్వె తనదు

మనసువచ్చినఁ జాలు మాకేమి యనుచుఁ
గనకపాత్రము గేలఁ గైకొని మఱియుఁ
దత్తరపడుచున్న తనబిడ్డప్రాణ
మెత్తుకోవలసిన నిపుడె ర మ్మనుచు
మక్కువ వేమాఱు మామాఱు గాఁగ
మ్రొక్కి తోకొనిరమ్ము మొకబంగ మెడయ
ననవుఁడు మిగులంగ నయ్యాదివటువు
తనలోన నవ్వుచుఁ దడయ కేతెంచి
యిమ్ములవారివాకిటితిన్నెమీఁదఁ
జిమ్మచీకటిలోనఁ జింతింపుచున్న
యామౌనిఁ గాంచి యొయ్యనఁ జెంతఁ జేరి
ప్రేమమైఁ జెయివేసి పిలిచి యిట్లనియె
వీరెవ్వ రని చూచి వివరించి విప్ర
నారాయణుఁడ విప్రనారాయణుండ
నిట నేల యున్నాఁడ వీదేవదేవి
విటకంటకియు నిన్ను వేయుభంగులను
వెనుకొని యూరెల్ల వెదకి కానమిని
ననుఁ బంపి రెచట నున్నాఁడవో యనుచు
వేవేగ నచటికి విచ్చేయుమయ్య
నావుఁడు విని విప్రనారాయణుండు

చెవులలో నమృతంబు చిలికినట్లైనఁ
జివురుగైదువుజోదుచేబారిఁ జిక్కి
వడి లేచివచ్చి యవ్వటువు డెందమునఁ
గడువేడ్కఁ జేర్చి యక్కజమందికొనుచు
నీ వెవ్వ రోతండ్రి! నీవు నాపాలి
దైవంబ వగు రంగధారుణీపతివొ
కాకున్న నొరుల కీకరుణ నామీఁదఁ
జేకూరు టెట్లు చర్చించిచూచినను
అని సంతసించిన నతని వారింటి
కనిచియంతటిమీఁద నారంగవిభుఁడు
సరగున నిజనివాసమున కేతెంచి
యురగేంద్రశాయి యై యుండె నంతటను
అలతల్లితోఁ గూడ నాదేవదేవి
యెలమిసేయుచు మౌని కెదు రేగుదెంచి
పసనిగద్దియపీఁటపై నుంచి మంచి
పసిడితంబుగ నీటఁ బాదము ల్గడిగి
నిడిసోగచంద్రికనిగ్గు లల్లార్చు
దడిపంబుపావడఁ దడివాయ నొత్తి
మేలిమిపన్నీట మెదిచి కస్తూరి
డాలుగా మైని వాటంబుగా సలఁది

జవ్వాదిపసచేసి సంపంగివిరులుఁ
గ్రొవ్వాడిమొగలిరేకులుఁ జాలఁ దురిమి
పలుచనిపన్నీటిపదనికప్రమునఁ
గులికినభాగాలు కొమరుగా నొసఁగి
వెలఁది వెన్నెలసోఁగవేఁగెంబు లాడ
దుళగించు బొమ్మంచుదుప్పటిఁ గప్పి
యెనసినప్రేమమై నెప్పటికంటే
నినుమడించిసభక్తి నిరువురుం గూడి
సరసకళావిలాసములచే; జొక్కి
మరుకేళిఁ దేలి నెమ్మది నుండి రంత
గగనాంబురాశి బుగ్గలు పుట్టి యడగు
పగిది తారలు పలపల గ్రుంకఁ దొడఁగె
సహజాంధకారకాష్టంబుల నేర్చు
మిహిరాగ్నిఁ బొడమినమిణుఁగురో యనఁగఁ
జొక్కమై వేగురుచుక్క చూపట్టెఁ
గుక్కుటకూటంబు కోవన నార్చె
లలిమీఱి విరహిజాలము నెలయి౦చు
[29]నిల యించువిలుక్కాఁడు వేటు చాలించెఁ
బ్రియమార మరుకేళి బిగిసినప్రియుల
ప్రియురాండ్ర కౌగిళ్ళబిగువులు సడలె

వలపలియెడదండ వలపులకొండ
సలల గేడించి గొజ్జఁగుల వేడించి
పొలయుతుమ్మెదలపుప్పొడిజాద[30] రాడి
చలువపూనీట వసంతంబు చల్లి
కెలనఁ దామరలఁ జక్కిలిగింతఁ బెట్టి
కలువలనోళ్ల నొక్కట ముద్రవెట్టి
జక్కవకవల రేజగడంబుఁ దీర్చి
మక్కువ నంచకొమ్మల మేలుకొల్పి
యలరువిల్కానియాహవకేళి నలయు
కలికిపూఁబోణులగబ్బినిబ్బరపు
సిబ్బెంపుఁబొడలరఁ జిలి పసనైన
గుబ్బగుబ్బలుల మైఁ గుప్పించుకొనుచు
రసికులయెదలను రాగంబుఁ జెంద
విసరె నొయ్యన నరవిరినాలిగాలి
యలఘు ప్రభాతచైత్రాగమవేళఁ
దొలుత నాకసపుమోదుగ పూచె ననఁగ
విమలన భోద్యానవీధి చిగిర్చె
రమణీయసాంధ్యానురాగంబు లెసఁగె
శ్రుతిలతాంతంబునఁ జూపట్టుఫలము
గతి నంధకారతస్కరుఁడు భాస్కరుఁడు

నెనయుకెంజాయల నెలమించు లొదవఁ
గనుపట్టెఁ దొలుచాయఁ గడు సొంపుమీఱి
కాలమృగేంద్రంబు గనలి యాపూర్వ
శైలేభకుంభముల్ జదియఁగొట్టుటయు
నెనయురక్తమున బిట్టెగయుమౌక్తికము
ననువున నుదయించె సంబుజాపుండు
కైరవంబులదాయఁ గని తమరతుల
కైరవంబులు డాయ నరిగెఁ జక్రములు
అపుడు శ్రీపాంచరాత్రాగమశాస్త్ర
నిపుణుడు శ్రీరంగనిలయార్చకుండు
మిడుగుల నొఱయుచు మించుబింజియల
బెడఁగుల నెరులు గాన్పించుదోవతియు
నుత్తరీయంబుగా నొకకొంత వైచి
గుత్తంబునడుమ చుంగులువార బిగిసి
పొసఁగఁజుట్టినయట్టిపొత్తిచీరయును
బసమించు సన్నపుఁబట్టెనామములు
మలయునూరుపులకు మాటుగాననుల
జెలువారఁ జుట్టినజిలుఁగుబాగయును
వ్రేలువీనులు దర్భవ్రేలియుంగరము
నీలాహిపిల్లవన్నియ[31]పిల్లసికయు

వెలఁదిజన్నిదములు వేదమంత్రములు
నలవడఁ బ్రొద్దుది క్కరసికన్గొనుచుఁ
దాలంబు చేతితోఁ దగిలినకుంచ
కోలయుంగరము చేకొనఁ గీలుకొలిపి
చనుదెంచి గారుడ స్తంభంబుచక్కి
ఘనభక్తిమై నమస్కారంబు చేసి
రంగమంటపముచేరంగ నేతెంచి
రంగేశునిలయాంతరద్వారసీమ
నిలిచియుండెడువేళ నీలంపుమణులఁ
బొలుచుతామరపెద్దపూసలపేర్లు
వలనొప్పుతిరుమణివడములు వైచి
బలువుగాఁ దిరుమణు ల్పదిరెండు దీర్చి
గట్టిగా శంఖచక్రములు నామమును
బెట్టినపరుఁజుముప్పిడిఁ గేలఁ బూని
యనులు వోఁ జుట్టిన యరవడుపాగ
గనుపట్ట నొకకొండికాఁడు ముందరును
గొంటరిపాషండకులముపెఁ గనలి
గంటవైచినరీతి గంట నాదింప
రుచికళాశుంభచ్చిరోవేష్టనంబు
ప్రచురంపువెన్నెలపట్టుపచ్చడము

మనతరం బైనట్టికపిరాజముద్ర
మొనసిచూపట్టెడుముద్దుటుంగరము
కావిశాటులు గల్గి కాలదండంబు
చేవ యడంచి మించినత్రిదండంబు
విదళితాసురమతవిజయధ్వజంబు
చదురున శిష్యుహస్తమునఁ జెన్నొంద
నిఖిలేశుఁ డగురంగనిలయకోవెలకు
నఖిలంబునకుఁ గర్త యగు పెద్దజియ్య
చనుదెంచి లచ్చనల్ సరవిమైఁ జూడ
మునినాథుననుమతంబున నంబి యపుడు
బీగంబుచేయిచే బీగముల్ దెఱచి
లాగుగాఁ గుంచెకోలను లోన నిడిన
బలువైనగడియలు వాపి భేళాన
తలుపులు దెఱచి యత్తఱి లోని కరిగి
పంచబేరములకుఁ బ్రణుతిఁ గావించి
పంచపాత్రములఁ దప్పక విలోకించి
యందులో నడుమ గొప్పగుగిన్నెఁ గాన
కందంద వణఁకుచు నాత్మఁ గుందుచును
బరిచారజనము లోపలను వెల్పలను
జరియించువారి నిష్టంబైనవారి

నడిగి కానక నంబు లరు దందికొనుచు
వడఁకుచు నయ్యతీశ్వరునిసన్నిధికి
నేతెంచి పదముల కెరఁగి యాకార్య
మాతని కెఱిగింప నక్కజం బంది
సభయుఁ డై వేగ మచ్చటియధికారి
సభికులం దక్కినస్థానంబువారి
రావించి శ్రీరంగరమణునిసొమ్ము
పోవు టెట్లని మనంబునఁ గోప మెసఁగ
బహుపురాణములఁ జొప్పడుదేవదేవు
మహిమ లెఱింగిన మతిమంతులార!
విహితమే యీమాట విన మీకు గర్భ
గృహములోఁ బెట్టినగిన్నె లే దనుచుఁ
బోయెఁ బొ మ్మనుచు నంబులు తారు గొన్ని
మాయల మముఁ గనుమాటి యీరీతిఁ
గల్లలు పచరించి కడపట మనల
బెల్లించి యిదిదక్కఁ బెనఁగఁజూచెదరు
ఎందుఁ బోవచ్చుఁ దా మెఱుఁగ కీసొమ్ము
నందువారలు దాఁచునట్టివారలును
దాము గా కిబ్బంగిఁ దమకన్నుఁ బ్రామి
హేమపాత్రము గొన నెవ్వ రోపుదురు

మున్ను నీకరణి సొమ్ములును వస్తువులు
నెన్ని గైకొనినారొ యీనంబు లనుచు
గసిమస హరిసొమ్ము గలకాలమెల్ల
మెసఁగి లేదనిన స్వామిద్రోహులార!
యొట్టినసొమ్మెల్ల నొడచూఱఁ గాఁగఁ
బట్టి లేదను సర్వభక్షకులార!
యనుచు నంబులదిక్కు నందఱదిక్కుఁ
గనుఁగొని యొక్కటఁ గలయంగనాడి
యిమ్మెయి నను నేలు నిందిరావిభుని
సొమ్ము వోవంగ నేఁ జూడలేఁ ననుచు
గన్నీరు గాఱ గద్గదకంఠుఁ డగుచుఁ
బన్నిన దైన్య మేర్పడఁగఁ బల్కుచును
మున్నుగా మొలనున్న ముమ్మాలకావి
పిన్నలి వడి మెడం బెనచితగిల్చి
కడువాడి యేకాంగి కత్తిఁ దెమల్చి
యడలుచు మెడఁ బూనునంతలోపలనె
నంబులు నచటిస్థానంబులవారుఁ
బంబినభీతిఁ జేపట్టి గొబ్బునను
బిన్నలిఁ దప్పించి పెనఁకువఁ గేల
నున్నటికైదువు నొడిసి కైకొనుచు

నేవెరవులకుఁ దా మింద ఱుండంగ
దేవర యిటు సేయఁ దివుర నేమిటికి
నని యధికారి యయ్యతిని లాలించి
కనలుచుఁ దనదుచెంగటిభృత్యసమితిఁ
బిలిచి నంబుల నడ్డపెట్టి యాసొమ్ము
నిలిచిననిలువున నేఁడు గైకొనుఁడు
అన విని యర్చకు లాముద్రకర్త
కనిరి యేలయ్య యన్యాయంబు నీకు
దుష్టుల మైన యందులకు నీయెదుట
దృష్టిశోధన మమ్ముఁ దెలిసికొమ్మయ్య
యాయెడ మేము చీమంత యోడినను
సేయింపు శూద్రులఁ జేయించు నాజ్ఞ
యనవుఁ డయ్యధికారి యాత్మఁ జింతించి
యనియె వారికి నిశ్చయంబుగా మీర
లచ్చు లైనది ముచ్చు లైనది దెలిసి
చెచ్చెఱ నన్నియుఁ జెప్పెదఁ గాని
యటనుండుఁ డని వారి నాఁకఁ బెట్టించె
నిట విటకంటికియింటిలో మెలఁగు
మటమాయలాడి ద్రిమ్మరిగబ్బితొత్తు
వటరయై చంచలవాణినాఁ బరఁగు

నావేళ నదియొక్క టక్కఱ గలిగి
దైవవశంబునం దదనుజ్ఞ వడసి
నల్లపూసలపేరు నల గినకోక
వెల్లనై గడిగొన్నవిచ్చుటాకులును
గొప్పున కందని కుఱుచవెంట్రుకలు
కప్పారురా వొడికప్పుబల్వరుస
కొమరుమించిన బండిగురిగింజతావ
డములు నిట్టుకపవడంపుఁ జేకట్లు
పిత్తడికడియముల్ పికిలిపూదండ
మొత్తంబు లగు నల్లముదుకగాజులను
లక్కతాయెతులు తెల్లనితగరంపు
ముక్కర సీసపుముద్దుటుంగరము
కాకిబేగడబొట్టు కంచుమట్టియలు
కైకడసంకుటుంగరమునుం గలిగి
జగఱాఁగ యై కూడ సందిట నిఱికి
మొగము జొత్తిల బొమముడివెట్ట కొనుచు
సణగుల నేలికెసాని లోలోనే
గొణిగి తిట్టుచుఁ బలుగొఱికి వేసరుచు
శ్రీరంగనగరంబుచేర నేతెంచి
యారంగవిభునగరాంతంబుఁ జొచ్చి

యెదురుగా నల్లంత నెవ్వరిం గన్నఁ
బదపడిపాడుచు బయల నవ్వుచును
బలుదొర లెదురుగాఁ బరతేరఁ దెరువు
దొలఁగక గొందులు తొంగిచూచుచును
నరమురి సన్యాసి నైన లెక్కిడక
నొరయుచుఁ బొమ్మన్న నుదిరిపల్కుచును
మఱిసహస్రస్తంభమంటపంబునకు
నఱిముఱి నేతెంచి యచ్చోట నిలిచి
యిడుమకట్టున వేఁడియెండలో మిగుల
జడియ వీఁపులమీఁదఁ జాపరా లెత్తి
పొగడదండలు వైచి పోనీక యెదుట
బెగడఁ దిట్టుచు నడ్డపెట్టినవారి
నరసి యిదేమొకో యని యధికారి
పరిచారజనులఁ దప్పక విలోకింని
పనివడి వీరి కీపా టేల వచ్చె
నని వారు సేయు నయ్యపరాధ మెఱిఁగి
యందులో మొగ మెఱుకైయున్నవాని
ముందర నిలిచి నెమ్మోము వీక్షించి
కిలకిల నగి కేలు కేలునం బట్టి
లలిమీఱి పలికె నుల్లాసంబుతోడ

నీగిన్నెకై వీరి నీపాటువఱప
నాగిన్నె తెలియంగ నది యెంతకలదొ?
యనవుఁడు బంటువాఁ డది దొడ్డసొమ్ము
చనుము నీ కిట్టిప్రసంగ మేమిటికి
నిప్పు డాగిన్నెయ యీపాటి యనుచుఁ
జెప్పి ననేమి యార్చెదవొ తీర్చెదవొ
చాలుఁ బొ మ్మనినఁ జంచలవాణి పలికె
నేలరా మీగిన్నె లిటువంటి విపుడు
వేయైనఁ ద్రాసున వేసి తూఁచినను
మాయక్క గిన్నెకు మఱి సరియగునె
యడిగినంతటిలోన నది గొండసేసి
నిడుసాగిలం బెట్టి నీల్గ నేమిటికి
ననవుఁడు చెంతవారపు డాలకించి
విని దానిచూటలు వెలుచుకో ననిరి
యోగులదాసి నీయొడలిసొ మ్మెల్లఁ
బ్రోగుగా రూకెత్తుపుత్తడి లేదు
నీవున్నసౌరెకా నీయక్క సౌరు?
పోవె యీపోలనిబొంకు లేమిటికి
నివ్వసుంధరలోన నిటువంటి గిన్నె
యెవ్వరు మీకిచ్చి రెందుండి వచ్చె

నన విని కోపించి యాబేలవరవుఁ
డనియెను మాయక్క యలఁతియే తలఁప
నిచ్చవచ్చినవార లింటికి వచ్చి
యిచ్చిరి వారు మీ కెవ్వరై రేమి
యుదిరి మాయక్కఁ జూపోపక మీరు
పదివేలు న ననేలఁ బందలా రనుచుఁ
జనుదానిమాటలచందంబు చూచి
యనుమానపడి వేగ నద రంటఁబట్టి
కట్టి తోకొని యధికారిముందరను
బెట్టి యవ్విధముఁ జెప్పిన సంతసించి
యప్పు డాయధికారి యాదాసి డాసి
చెప్పవే వెఱవక చెప్పవే యనుచుఁ
దలఁ జెయవెట్టి డెందము భీతిఁ దెలిసి
చలపట్టి యడుగఁ జంచలవాణి యపుడు
వడవడ వడఁకుచు వాతెఱ మిగులఁ
దడుపుచు మాటలు దడఁబాటు గొనఁగ
నీరీతి నేమియు నెఱుఁగ నీరేయి
నేరేడుబండువన్నియమేనితోడఁ
బలుచని యొకచిన్న బాపనివడుగు
బలిమిమై నిటిలోపలి కేగుదెంచి

యుదిరి బంగరుగిన్నెయొక్కటి దెచ్చి
యది వల దనఁగ మాయక్క చేతికిని
యిచ్చి తాఁ గ్రమ్మర నేగెను డాఁప
నిచ్చెనో తుదిఁ దక్క నిచ్చెనో యెఱుఁగ
నని మ్రొక్కి బాష్పంబు లడరించుదాని
గనుఁగొని యయ్యధికారి లాలించి
కట్టల్క నెండలోఁ గమలంగ నడ్డ
పెట్టిన నయ్యెడ్డపెట్టు చాలించి
రావించి నంబుల రాగిల్లఁ బలికి
కావికట్టణములు గరిమమై నొసఁగి
తాలిమి నిరుమేలఁ దనుఁ గొల్చియున్న
కాలకింకరభయంకరులఁ గింకరుల
దెసఁ గనుఁగొని దేవదేవిచేనున్న
యసరుసాయకుతండ్రిహైమపాత్రంబు
చేకొని దాని కిచ్చినవాని దాని
వేకట్టికొనిరండు వెఱ పింతలేక
యని నియోగించిన యాభృత్యసమితి
యనిలవేగంబున నలపురంబునకుఁ
బఱతెంచి యొక్కనిఁ బట్టంగఁ బదువు
రఱముఱి దానియి ల్లటు చుట్టుముట్టి

ఘల్లుఘల్లన గిలుకలతోడి గుదియ
లల్లనల్లన భూమి యదర నూఁదుచును
లోఁగక కొంద ఱాలోనికిం జొచ్చి
తూఁగుటుయ్యలహంసతూలికమీఁదఁ
బవళించియున్న శ్రీపతికుమారకుని
సవరనిచరణాంబుజము లొత్తుచున్న
చకితకురంగాక్షిఁ జంద్రబింబాస్యఁ
బికవాణి మదనునిబిరుదువారువము
నడయాడుక్రొమ్మించుననదేవదేవి
జడవట్టి కుదిచి భూస్థలి వ్రాల నీడ్చి
తలగడనున్న నిద్దపుఁబైడిగిన్నెఁ
గలయంగ వీక్షించి కైకొని పిదప
నుయ్యాలపైనున్న యోగీంద్రు మున్ను
[32]పయ్యాడి కరువలిపట్టి దానవులు
పట్టబంధించినపగిది బాహువులు
పట్టి యాతఁడు గట్టుపంచెచేఁ గట్టి
పురిలోన నీసరిపూఁబోఁడు లెల్ల
దొర వని నినుఁ జెప్పుదురుగదె యెపుడు
నట్టి నీవేల రంగప్పనిగిన్నె
యెట్టు గైకొంటివే యీదొంగచేతఁ

గొల్లఁగా భువి రాచకొడుకులసొమ్ము
లెల్లను గైకొంటి విలుచూఱఁగాఁగ
నందునం దనివోక యాస పెద్దగుడు
నిందున కొడిగట్టితే యంచుఁ బలికి
గందంపుగొమ్మలఁ గాలాహి చుట్టు
చందంబునను గరజలజాతయుగళిఁ
బెడమరలఁగఁ బట్టి బిగియించి కుదిచి
నిడుదతుమ్మెదకప్పునెఱివేణిఁ గట్టి
మిగిలినజడ కేలి మెయి[33]నిండనూలు
సొగపున నిరుమూడుచుట్టులుసుట్టి
యోరి! సజ్జనుమాడ్కినున్నాఁడ విప్పు
డేరీతి లాగించి తీపైఁడిగిన్నె
గడుస! నీకెటునంటి కనుమాయ గలదొ
జడియక పద్మజశంకరాదులకుఁ
దలచూపరాని శ్రీధరునగరంబు
నలవోకఁ జొచ్చితి వౌరౌర దొంగ
నీమేన నిండార నెనయునామములు
నామము ల్గావు కన్నపుఁగత్తు లరయ
నన విని “నీలీలలా? రంగ! యనుచు
ననియె వారలతోడ నామౌనివిభుఁడు

వినరయ్య నీతికోవిదులార రంగ
జననాథుసొమ్ము వంచనచేసి యేను
దెచ్చినవాఁడనో దేవదేవికిని
ఇచ్చినవాఁడనో యేలయ్య నన్ను
విడువుండ యనుమాట వినునంతలోనె
కడుఁగోపమున విటకంటకి వచ్చి
యెట్టెట్టురా యోరి యీనడురేయి
నెట్టన శిష్యుచే నీ వంపలేదె?
యంపలే దని కల్లలాడెడుప్రాణ
మింపని బొంకె దిట్లేలరా యనుచుఁ
గెరలి వెన్నెలలు గ్రక్కెడుచకోరముల
కరణి లోచనములఁ గ్రమ్మునశ్రువులు
చెక్కుటద్దములపైఁ జింది క్రిక్కిఱిసి
కక్కసం బగుచనుగవమీఁద నురలఁ
దల వంచి సిగ్గునం దనతోడ మగుడఁ
బలుకనేరక దుఃఖపడుచున్నకూఁతుఁ
గనుఁగొని వరదలై కన్నీరు జాఱ
నెనయఁ గౌఁగిటఁ జేర్చి యిట్లని పలికె
అప్పుడే వీడు దొంగని యేను జాటి
చెప్పిన నామాటఁ జెవిఁ బెట్టవైతి

పనిఁబూని తాము చంపము తాడు చంపె
ననియెడు వీండ్ర నోయమ్మ నమ్ముదురె
ముందర నీరీతి ముదిమాట లాడి
యెందఱఁ జెఱపెనో యీకొంపచెఱుపు
గాళ నేపాళ బుంగాళ పాంచాళ
చోళాదిరాజన్యసుతులు నిచ్చలును
గైలాగు సవరింపఁ గైకొనుచేతు
లీలాగు కట్లకు నెట్లోర్చునమ్మ
చెలువలు నేర్పుమైఁ జిక్కెడలింప
బలిమిఁ బట్టకుమని పాటించివేణి
నదయులై తలవరు లదరంటఁ బట్టి
కుదియింప నెట్లోర్చుకొంటివే కూన!
కెందలిరాకుసోఁకినయంతలోనె
కందెడుమేను కర్కశపాణు లిపుడు
తొడిబడ మెడవట్టి ద్రొబ్బంగ నెంత
యడలుచు [34]నేగెదో యమ్మ! నాగుమ్మ!
యందఱు నిటకు రమ్మని గారవింపఁ
జెందనిసభలకుఁ జెల్లఁ బో నేఁడు
కట్టిడిదొంగని గాపించి విఱచి
కట్టికొంపోవ నేగతి నేగె దమ్మ!

యని బిడ్డఁ గౌఁగిట నలమి పోనీక
మునుకొనిదుఃఖించు [35]ముదియ నీక్షించి
రావె దొంగలనంపి రాత్రి వేవేగ
దేవదేవునిసొమ్ము దెప్పించునపుడు
నవ్వను బిమ్మట నగరివా రెఱిఁగి
యివ్విధిం బట్టిన నేడ్వనా? ఱాఁగ!
కృపవుట్ట బిడ్డఁ గౌగిటఁ జేర్చి చేర్చి
యిపుడుసెప్పెడుబుద్దు లెటఁబోయె నప్పు
డని తిట్టి పొమ్మన్న నంతటఁ బోక
తనకూఁతువెనువెంటఁ దగిలి నాపోవ
నొక్కట వడిఁ [36]దలాయొకపెట్టుపెట్టి
కుక్కఁగొట్టినయట్లు కొట్టి చీకొట్టి
తలవరు లప్పు డంతటఁ బోకయున్న
దొలఁగంగ నిల వ్రాల ద్రొబ్బి నవ్వుచును
ఆకోమలాంగితో నామౌనివరుని
దోకొనిపోవుచోఁ ద్రోవ నున్నట్టి
చెలువలు మగలుఁ జర్చించి లోలోనె
తలపోసి పలికి రాదట వారిఁజూచి
తనవేఁడితేజ మంతయు డాఁచి పుడమిఁ
జనుదెంచుసూర్యునిసరణి నున్నాఁడు

తలకొని నడికందుఁ దరలించి డిగని
కళలతోఁ జంద్రునికరణి నున్నాఁడు
ఇతఁడు దొంగిలునటే యితఁడు యోగీంద్రు
గతి నున్నవాఁ డేమికర్మమో కాని
దీనిఁ జూచిన సానఁదీసినమరుని
చేనున్ననారంజిచెలువుఁ జూపెడిని
కన్నియ తుది నెండకన్నును నీడ
కన్ను నెఱుంగనికమ్మపూఁబోఁడి
గోలచూచినరాచకూఁతురువంటి
దీలాగు కట్లకు నెట్లోర్చె నమ్మ
కష్టపువిధి గాక కడపట దీని
దృష్టించి చూచిన దృష్టిదాఁకెడిని
గడపటఁ దమసేయుకష్టవర్తనకు
నొడఁబడకున్న నీయురుపుణ్యనిధుల
కోవఁజాలనివార లొక్కొక్కనింద
పైవైవ నీదెస పాటిల్లెఁ గాని
వీరు దొంగలు కారు వివరింప ననుచుఁ
జేరి యేబాసైన సేయంగవచ్చు
గందు తెల్లంబుగాఁ గానక యొరుల
నిందింపవచ్చునే నిర్ణిమిత్తంబ

యనువారు కొందఱు నటఁ దోఁచినట్ల
యనువారు నైయుండి రప్పుడు భటులు
వారిఁ దోకొనిపోయి వనజాక్షుగిన్నె
యారయరాదాయె నని [37]యాత్మలోన
నందంద చింతించు నయ్యధికారి
ముందర నిడి కేలుమొగిచిన నతఁడు
గాసించి వీరి నిక్కడ నాకునేన
చేసేతఁ బట్టి శిక్షించితినేని
ఈజాడ తన కేల యెఱిఁగింప వనుచు
రాజు విన్నను నపరాధంబు వచ్చు
నని వారివారిచే నగపడినట్టి
కనకపాత్రంబు దిగ్గనఁ గొనిపోయి
రుచిరసింహాసనారూఢుఁ డైయున్న
నిచుళేంద్రుఁ డగుచోళనృపతిముందరను
ఇరువుర నిడి మ్రొక్కి యీకార్య మెల్ల
నిరవొంద నెఱిఁగించె నెఱిఁగించుటయును
విని భూవరుండు సవిస్మయుం డగుచుఁ
గనలి వారలదెసఁ గాంచి యిట్లనియె
నారంగపతికి ద్రోహముసేసినపుడు
చేరివీరల నాజ్ఞసేయుటే తగవ

యైన న్యాయంబున న్యాయంబుఁ దెలిసి
కాని మిమ్మిట నాజ్ఞఁ గావింపఁ దగదు
హెచ్చినకడఁక రంగేశ్వరునగరు
సొచ్చినచందంబు చొచ్చి యీగిన్నె
తెచ్చినబాగును దెగువమై మీకు
వచ్చినలాగును వలవ దున్నట్టె
రవళిసేయక, పదరక, యొక్కరొకరె
వివరంబుగా మాకు వివరింపుఁ డనిన
దిట్టయై యాదేవదేవి దా వీణె
ముట్టి నాదించినమురువు దీపింపఁ
జుక్కలతో నొప్పుసోముచందమునఁ
బిక్కటిల్లెడు బాష్పబిందుపూరముల
నొప్పెడియాననం బొకయింత యెత్తి
యప్పు డిట్లనియె దైన్యము పాదుకొనఁగ
ఓసార్వభౌమ! లోకోన్నతచరిత!
నాసేయునేర మంతయు విన్నవింతు
నవధరింపుము పరా కది చిత్తగించి
వివరంబుగా నాదువిన్నపం బిపుడు
మునుపు [38]దేవరపాదములు గాంచి మగుడ
ననిపించుకొని పోవునపుడు మార్గమున

నొకతోఁటలో నితఁ డున్న మాయక్క
వెకలియై తనుఁ జూచి వెగ్గంబు లాడి
లలితంబు లైనవిలాసముల్ చూపి
వలపింపఁ గలవె యీవటువేషధారి
నని యని పంతంబు లాడునాయక్కఁ
గనుఁగొని యేనును గండగర్వమునఁ
గడనున్న గొడ్డలిఁ గాలిమీఁదటికిఁ
దొడిఁబడవైచుకోఁ దొడరినయట్టు
లారీతిఁ జేసెద నని చలపట్టి
మారీచువంటియీమాయావిఁ దగిలి
పిలిచి తోకొనిపోయి పెరిమె మాయింట
నెలమిమై నుంటి మనేకకాలంబు
కనలి మాయమ్మ యొకానొకనాఁడు
తనమీఁ దవేసరి తనుదిట్టుకొనిన
నది తన్నుఁ దిటైఁ బొమ్మని యెగ్గు గాఁగ
మదిఁబెట్టుకొని తమమై మచ్చరమున
నేచందమున నెటకేగెనో యేగి
తెచ్చి యీగిన్నెయందిచ్చి వెండియును
దారాకశిష్యుచేఁ దనయింటికనుప
నారయ బంగారమని యడియాస

నూని నే మందిన యొక్కదోషంబె
కాని యొండెఱుఁగము కడపట నొకటి
మును[39] పారుఁ డీగిన్నెమ్రుచ్చిలి తెచ్చె
నని యేనెఱుంగ రంగప్పయే యెఱుఁగుఁ
గడముట్ట నిది లెస్సగా విచారించి
చెడుగునైనను నాజ్ఞ సేయింపు మనుచు
నాదట నాదిమధ్యావసానములు
మేదినీశ్వరుని కిమ్మెయి నెఱింగింప
వసుమతీశ్వరుఁడు క్రేవల నున్నగిన్నె
దెసఁజూచి యాయింతిదెసఁ జూచి వగచి
మౌనీంద్రుకడఁ జూచి మాకుఁ దెల్లముగ
దీనిమాటలలోనితెఱఁగెల్లఁ దెలిసె
నీవుచెప్పెడిమాట నిక్కంబు చెప్పు
మావిప్ర! యనుఁడు సమ్మౌనివల్లభుఁడు
దిచ్చరియగునట్టి దీనిమాటలకు
వచ్చె నానిలువెల్ల వళుకులపుట్ట
తానాడినటువలె తనుయింటికడకు
నేను వచ్చుటయును నెనసియుండుటయుఁ
గలదు తానును దనుఁగన్నతల్లియును
వెలిమీఱఁ దమయిల్లు వెడలఁగొట్టుటయు

నకటకటా! యంచు నడలుచు నరిగి
యొకపంచ తిన్నెపై నొదిగియున్నంత
నారాత్రిఁ దముదామెయనురక్తి గలుగు
వారికైవడిఁ గైతవబ్రహ్మచారిఁ
బనిచి రమ్మని పిల్వఁబంచిన మగుడి
చనుటయె కాని యాజలజాక్షుసొమ్ముఁ
దెచ్చుట లేదు నేఁ దెచ్చి వీరలకు
నిచ్చుట లేదు రంగేశుఁడే యెఱుఁగు
ననవిని యాబోటి యద్దిరా! రేయిఁ
బనివడి నీవనుపవె శిష్యుచేతఁ
బూని యీసభలోన బొంకుటకాక
యానలు గొన్నియే యనిన నాతపసి
చెనఁటిరో! యెక్కడిశిష్యుండు లేని
యనుచరుం గల్పించి యాడ నేమిటికి
నని వితర్కింపంగ నవనీశ్వరుండు
గని వారికలహంబు కలయవారించి
మత్తుండు కామినీమదదృష్టిచలిత
చిత్తుండుఁ గాన నాక్షితిపుఁ డజ్ఞతను
దనకొల్వులోనివిద్వాంసులు నృపులు
వినుచు నచ్చెరువంద వివరించిపలికె

నెంతైన నితఁ డింక నిదిదొంగిలింప
నెంతటియది చూడ నితఁ డెంతవాఁడొ
వచ్చిపోయెడువారు వలయునర్థములు
తెచ్చి యేమిచ్చినఁ దేతెమ్మటంచుఁ
గోరి వేవేగఁ గైకొనుటెల్ల లంజ
వారికిఁ దగవె యేవలనఁ జూచినను
వీరిమాటలబాగు వింటిరే మీర
లేరివంకది నేర మెన్నిచూచినను
బూఁచి యీమాటలఁ బోలింపఁ దనకుఁ
దోఁచినగతిఁ జెప్పుదును వినుఁ డనుచు
నీతలోదరి వడు విచ్చినాఁ డనియె
నీతఁడు తను వడువే పిల్చె ననియెఁ
దలపోయ వడువుచందం బిరువురును
గలుగంగఁ జెప్పిరి గతి విచారింప
రీతిగా బ్రహ్మచారియె యేల యితనిఁ
దోతేర వీరింటితొత్తులు లేరె?
యొంటిమై సవరేయి నోడక వీరి
యింటికి వడువు రా నేమికారణము
అన్నతాదొంగిలి యది పోలబొంక
కున్నమై నపరాధ మొదవెడు ననుచుఁ

బులిమినం దెలియదే భూసురుమాట
[40]పొలుపుబొంకుగఁ దలంపున మీకు లేదె?
యని విప్రవరుని దొంగగనిశ్చయించి
వనజాక్షిమైఁ దప్పు వారించి కరుణ
విడువుఁడ యని కట్లు విడిపించి దాని
కుడుగర లొసఁగ నయ్యుడురాజవదన
బళిరె! నాయేలిక! బాపురే! భూధ
వులశిరోమణి! తగవులచక్రవర్తి!
దొంగనినంత కట్టుఁడు కొట్టుఁ డనక
సంగతి కల్ల నిజంబు లేర్పఱచి
యీరీతి మన్నింప నిది నీకె చెల్లు
నో రాజదేవేంద్ర! యుర్వీశచంద్ర!
యనవిని భూపాలుఁ డాపైఁడిగిన్నెఁ
గొనిపోయి శ్రీరంగకువలయేశునకు
నర్పింపు మని యప్పు డారంగవిభుని
తీర్పరిం బిలిచి చేతికి నిచ్చి కనలి
యీచోరునకు నాజ్ఞ యేది శాస్త్రంబు
చూచి సేయింపుఁ డచ్చుగ మీ రటంచుఁ
దెలియ విద్వాంసులదిక్కు వీక్షించి
పలికిన పలుకులోపలనే యభ్రమునఁ

దమ్మికెంగేలు గదాపాణితలము
క్రొమ్మించు కెందమ్మి గుంపులనీన
వలనొప్పు పదియాఱువన్నెలదట్టి
ధళధళల్ దశదిగింతంబులం బొదువ
డాలైన మకరకుండల చకచకలు
[41]వాలుఁజెక్కులను దువాళముల్సేయఁ
బూసిన సిరిగందవొడిబుగబుగలు
డాసి పంకజభవాండము చోడుముట్ట
మిండతుమ్మెదలకామెతలుగావించు
దండినెమ్మేనిచెంతల గోండ్లిచూప
నెలమించుదీవల నెలయించుమేని
చెలువ యురోవీథిఁ జెన్నగ్గలింప
నురుతరకౌస్తుభద్యుతిపల్లవములు
దొరసి వక్షోవీథిఁ దుళగింపుచుండ
నెమ్మోముదామర నెరయునెత్తావి
కమ్మకస్తురితిలకపుఁదేఁటి గ్రోల
రంగనాథుఁడు తనరంగ విహంగ
[42]పుంగవు నెక్కి వేల్పులు గొల్వ వచ్చి

యతులితగతి జను లరుదంది చూడ
నతనికిం బ్రత్యక్ష మయ్యె నవ్వేళ
మును నైనతేయుసమ్ముఖమునంచెగడి
యనిరుద్దబంధంబు లరిగినపగిది
ననవిల్తుతండ్రిముందర నిల్చినంతఁ
దనుదానె యూడె నత్తపసిబంధములు
జనులెల్లఁ జూచి యాశ్చర్యంబు నంద
వనజాక్షుఁ డాయోగివరుఁ జేరఁ బిలిచి
భక్తిమోక్షంబున భవరోగపాశ
ముక్తుని లాలించుమురుపున నతని
గారవింపుచుఁ జోళకాంతునిఁ జేరి
యోరి! నీ కిటుసేయ నుచితమే తలఁప
నీగతి నిల నటియించినవాఁడ
నీగిన్నె వీరల కిచ్చినవాఁడ
నేను నీవెవ్వండ వితఁడు నాబిడ్డఁ
డేను గూర్చినధనం బితనిది గాదె?
చేకొని లంజ కిచ్చినయట్టిసొమ్ము
కైకొందునే యేను గడు నీతిదక్కి
వారి కిచ్చినసొమ్ము వారికే యొసఁగి
నారీతి సయ్యోగినాథు నాతనయుఁ

దలపోయు మనుచు నాతాపసోత్తముని
తలఁపునెత్తమ్మి నత్తఱిఁ బ్రవేశించి
తలయూఁచు నమ్మహీధవుఁడు డెందమునఁ
దలకొని భీతితోఁ దనవారుఁ దాను
నఱిముఱి సాష్టాంగ మతనికి నెరఁగి
యెఱుఁగక సేసితి నీతప్పిదంబు
కావవే శ్రీరంగకాంతుండ వీవ
కావవే నను నేలు కరుణాంబురాశి
నీవ శ్రీరంగేశునిజకుమారుఁడవు
దేవర సుతుఁడ నైతిని యే నటంచు
నావేళ నతని సింహాసనారూఢుఁ
గావించి తత్పాదకమలము ల్గడిగి
తనపట్టమహిషులుఁ దాను నందంద
ఘనభక్తిమై నూడిగంబులు సేసి
యోజపెంపున వివిధోపచారములఁ
బూజించి యాయోగిపుంగవుం గొలిచి
యాసక్తిఁ జతరంతయానావరోహుఁ
జేసి కైసేసి విచిత్రవైఖరులఁ
బటహభేరీతూర్యపణవాదివాద్య
చటులఘోషంబులు జగమెల్ల నిండ

భజనఁ జూపట్టు నాపల్లకికొమ్ము
భుజమున నిడుకొని పురవీథులందు
మెరయింప నప్పౌరమీనలోచనలు
పరమైన యపరంజిపళ్ళెరంబులను
ఘనసార దీపముల్ కడువింత లెసఁగ
నొనరించి యారతు లొసఁగ నచ్చరలు
దేవకామినులు భూదేవకామినులు
సేవించి దీవించి సేసప్రా లిడఁగ
నీరీతి పురమెల్ల నేగింప మగుడి
ధారుణీవిభుఁడు సద్మమున కేతెంచె
నారాజుమై నప్పు డామౌనిరాజు
చారుకృపామృతాసారంబు నించి
యతని వీడ్కొని రంగహర్మ్యసన్నిధికి
నతివేగమునఁ బోయి యవనతుం డగుచు
దనసేయునట్టికృత్యము నీచమైన
ఘనతరభోగ్యంబు గాఁగఁ జేకొన్న
యీసర్వసులభుని నిందిరానాథు
వాసుదేవునిఁ దండ్రి వాత్సల్యజలధి
యేమని వినుతింతు నిభరాజవరద!
నీమహామహిమ వర్ణింప శక్యంబె?

యని వినుతింప రంగాధినాయకుఁడు
మునినాథుఁ జూచి ప్రమోదించి పలికెఁ
దనయ! నీవరసుమధామకైంకర్య
మునకు మెచ్చితి వరముల నభీష్టముల
నడుగు మటన్న నీదగుభక్తజనుల
యడుగుదమ్ములరేణు వనుపేరు నాకు
దయసేయుమా శాశ్వతంబుగా ననిన
దయసేసియారంగధవుఁ డట్ల యొసఁగి
తనసేయు గోపకాంతావిహారంబు
వినుతించువారి కెవ్విధి ఫలం బొదవు
నారీతి సౌభాగ్య మబ్బు నీచరిత
ధారుణి నొకమాఱు దలఁచువారలతు
నని యానతిచ్చిన నదియాది గాఁగ
జననుతుం డగుమౌని జనవరేణ్యునకుఁ
బనుపడ భువిలోన భక్తాంఘ్రిరేణుఁ
డనుపేరు విలసిల్లె నమ్మహాయోగి
పరమవైష్ణవనుతపదపద్ముఁ డయ్యు
హరిభక్తపద[43] పద్మ మాత్మఁ గోరుచును
బరమవిరక్తుఁడై పద్మజముఖ్య
సురశిరోన్యస్త విస్ఫురితాంఘ్రి యగుచు

పరసమృద్ధి వహించి భవము లడంచి
హరిభర్త తాఁ గాంత ననుచు భావించి
తనతోటిగతి సుమధామకైంకర్య
మొనరించుకొనుచు సర్వోన్నతుం డగుచుఁ
దావనమాలికాత్మజుఁ డైనకతన
నావనమాలికి నంకితంబుగను
లాలితవేదజాలప్రసూనముల
మాలిక గాఁగ శ్రీమాలిక యనెడు
కృతియును బ్రాబోధకీఖ్యాతి దనరు
కృతియును సవరించి కృతకృత్యుఁ డగుచు
నిరతంబు హరిపదాన్వితచిత్తుఁ డగుచు
బరమయోగానందభరితుఁ డైయుండె
నాదేవదేవి రంగాధీశ్వరుండు
భూదేవబాలురూపున దూతకరణిఁ
దనయింటి కేతెంచి తనజాతినీతి
యునికిఁ గన్గొనక సర్వోత్తరుం డయ్యు
మునివరేణ్యునికతమువ నిట్టిభాగ్య
మనువొందెఁ దనకని యాత్మ నుప్పొంగి
పరమయోగీంద్రుకృపాదృష్టివలనఁ
బరమవిరక్తయై భవముక్త యగుచుఁ

దనసకలోత్పత్తి ధవళాక్షుఁ డొసఁగు
కనకపాత్రంబునం గైకొనివచ్చి
శ్రీరంగవిభుని కర్పించి తత్పాద
నీరజభావననిరతయై యుండెఁ
బరమపావన మైన భక్తాంఘ్రిరేణు
చరితంబు భక్తి నిచ్చలు నెన్వరేని
వినిన వ్రాసినఁ జదివినను వాక్రుచ్చి
నను వారి కెపుడు వైష్ణవులసత్కృపయు
హరికృపామృతము. ననంతమై పొంగి
పరిపూర్ణమై యుండుఁ బ్రతిలేక యనుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
యతిలోకమతికి శేషాచలరాజ
పతికి సర్వోముఖ్యభక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళ[44]పాకాన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మ మండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ

సదనావధూలబ్ధసరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృతమైన పరమయోగివిలాసకృతిని
యతులితంబుగఁ జతుర్థాశ్వాస మయ్యె.


____________
  1. యనుచు
  2. వాసిని
  3. గలిగియు
  4. మమత
  5. జాడ
  6. ప్రోదుల నెఱిఁగి.
  7. లోక
  8. వరలిపండ్లనంగ
  9. సవరణ పందిలిఁ జక్కగాఁ జేసి
  10. గనమరు
  11. నాపాదమాదిగానలర
  12. దయివాఱ
  13. నిట్లు
  14. నెనలొల్పఁజాలు
  15. నానాఁట
  16. మోరనరిగి
  17. వెలిసెనో వెలియదో
  18. వలపాటి
  19. పాలిండ్లరం గానుపడ
  20. వేగ
  21. గతి వేగ నొప్పు
  22. నీడ
  23. యెప్పసంబు నొక్కనివల
  24. సేఁత
  25. గెఁటొరలఁ
  26. బిడియంబు
  27. లేద
  28. బమ్మెరదాఁక దుంభాభూళిచేసి
  29. నెలయంచువిలుకాఁడు నెట్టనఁ జనియెఁ
  30. రాళి
  31. బిళ్ల
  32. పయ్యాట
  33. దండ
  34. నోగదె
  35. ముద్ది
  36. దలనొక
  37. యాత్రపడుచు
  38. మీమన్ననములు
  39. చోరు
  40. పొలనువైవగ తలంపున మీకు లేవె?
  41. పాలుచెక్కుల మరువాళముల్ సేయ
  42. పుంగవనాయకాద్భుతవాహుఁ డగుచు
  43. తీర్థ
  44. పాకన్నయార్య