పదబంధ పారిజాతము/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

పరస్పరభావవినిమయం ప్రధానలక్ష్యంగా ఏర్పడిన భాష నానాటికీ పదునుదేరుతూ వస్తుంది. అవసర మేర్పడిన ట్లెల్లా, ఆసక్తి పెంపొందినట్లెల్లా, మానవవిజ్ఞానం వికసించిన ట్లెల్లా, మనసూ మేధా నేవళం తేరిన ట్లెల్లా, మనసూ మేధా నేవళం తేలిన ట్లెల్లా భాషలో మార్పులూ, చేర్పులూ, కూర్పులూ అనంతంగా వర్ధిల్లడం అనూచానంగా వస్తున్నది.

తన మనోభావాల నన్నింటినీ తోడివారికి చెప్పుకొనగలచేవ తన భాషకు సంతరించుకొనడంలో ప్రతి మనిషీ, ప్రతి కాలంలోనూ ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో ఎంతో కొంత కృషి చేస్తూనే వుంటాడు. తత్ఫలితంగా ఒకనాటికంటె మఱొకనాడు భాషలో కొత్తమాటలూ, కొత్త మాటలతేటలూ, మాటలు కొత్తవి కానప్పుడు వానికే కొంగ్రొత్త భావచ్చాయలూ ఏర్పడుతూ వస్తున్నవి.

సామాన్యంగా విడివిడిగా పొడి మాటలుగా ఉన్నవే. అపూర్వసమ్మేళనంతో - ఆ మాటలకు విడివిడిగా వేనికీ లేని ఏదో ఒక అపూర్వభావవ్యక్తీకరణకు మూలములై - విశిష్ట పదబంధాలుగా భాషలో నిలిచిపోతున్నవి.

వానినే పదబంధము లనీ, నుడికారము లనీ, పలుకు బడు లనీ, జాతీయము లనీ పేర్కొంటూ ఉంటాము. ఇవే కవితాలతాంకుర ప్రథమాలవాలా లనీ విజ్ఞులు భావిస్తారు.

మాటకు 'కళ్ళలో కారం పోసుకొను' అన్న పలుకుబడి తీసుకుందాం. ఇందులో మూడు మాటల చేరికవాని విడివిడి అర్థాలకు వేనికీ చెందని అసూయాగ్రస్తతను వెలనాడుతున్నది.

'కాస్త పచ్చగా కనిపిస్తే సరి అది కళ్ళలో కారం పోసుకుంటుంది. పై వాక్యం ఎక్కడో ఏ మహావిద్వాంసుడో, మహా కవో ఉపయోగించే అపూర్వభాషావిశేషం కాదు. మీరూ, మేమూ ప్రతి పల్లెపట్టునా, ప్రతి రచ్చపట్టునా ఏనాడు పడితే ఆనాడు వినే అవకాశ మున్నదే - వింటున్నదే - ఆ మాట.

అంటే, తనలోని ఏదో ఒక విశిష్టమూ ఉజ్జ్వలమూ తీవ్రమూ అయిన భావాన్ని వినిపించుటకూ, ఎదుటివారి మనసున సూటిగా అంతగానూ నాటునట్లు చేయుటకూ ప్రయత్నించుటలో ఇలాంటి విశిష్టపదబంధాలను ప్రతి తెనుగు తల్లీ, తండ్రీ, పిల్లలూ సృష్టిస్తూనే వున్నారు. తత్ఫలితంగానే అనేకం భాషలో ప్రవేశిస్తున్నవి.

పై వాక్యాన్ని అలాగే మఱొకభాషలో ఏ పదానికి ఆ పదాని కున్న అర్థమూ, వాక్యంలో కారకం అవీ చూచి, వ్యాకరణయుక్తంగా అర్థం చెప్పి, అలాగే అనువదిస్తే ఆ నిర్దిష్ట మైనభావం ఛస్తే రాదు.

అందుకనే అది నుడికారము, తెనుగునుడులలోని ఒకానొక విశిష్టపదబంధవైచిత్రి అనుకుంటాన

ఇది తెనుగులోనే కాదు. ప్రతిభాషలోనూ వున్నదే. మన కిక్కడ ప్రసక్తం తెనుగు గనుక తెనుగసంగతే అనుకుంటున్నాము.

'ఒళ్ళంతా జెఱ్ఱులు ప్రాకిన ట్లున్న'దన్నప్పుడు మనకు తోచే భావస్ఫూర్తి కవి గ్రహించే తా నా మాటల వేటకు దిగి మఱింత వాటంగా చెప్పడం ఆరంభించాడు. అందుకే ఇవి కవితాలతాంకురానికి ఆలవాలము లనుట.

ఇలాంటి నుడికారాలు అనేకవిధాలుగా వున్నవి.

కొన్ని మనిషిఅవయవాలపై ఏర్పడినవి. నెత్తిన నోరుపెట్టుకుని చెప్పడం మొదలు, కాలికి బలపం కట్టుకొని తిరగడం దాకా ప్రతి అవయవంపైనా ఎన్నో కొన్ని నుడికారాలు ఏర్పడినవి. అలాగే మనం నిత్యం చూస్తున్న పశుపక్ష్యాదుల నుండి కొన్ని ఏర్పడినవి. గోడమీది పిల్లి, దీపంముందు బల్లి మొదలు, కోతికి కొబ్బరికాయ చిక్కినట్లూ, కుక్కలు కాట్లాడుకున్నట్లూ మొదలు, కాలు ద్రవ్వడం, గర్జించడం మొదలు, దున్నమీద వాన కురిసినట్లు వఱకూ అనేకం ఇలా వచ్చినవి.

తాము గమనిస్తున్న పరిసర ప్రకృతి ప్రభావ పరిజ్ఞానం నుంచీ ఎన్నో వచ్చినవి. ఇసుక వేస్తే రాలనంత జనం మొదలు సూదిమొన మోపడానికి వీలు లేకుండా వఱకూ, వర్షం వెలసినట్లుగా సద్దు మణగడం మొదలు కుండపోతగా కురవడందాకా ఇవి ఉన్నవి.
అఱచేత్తిరేకలు కనిపిస్తున్న వనుటతో వేకువ నతను ముచ్చటగా చెప్తాడు. కాదారి మాదారి ప్రొద్దని చీకటిని సూచిస్తాడు. ఎంత గొప్పకవి మనిషి!

ఇలా ఏర్పడిన నుడికారాలు కాక, కేవలం ఊది చెప్పుటకూ, నొక్కి వక్కాణించుటకూ కొన్ని జంటపదాలను తను సృష్టించుకున్నాడు. ఒకప్పు డామాటను కాస్త అందంగా అనడంవఱకే అయినా సరే అనువదించుకున్నాడు.

నగా నట్రా, పురుగూ పుట్రా, సుళువూ ఒళువూ: ఇలా ఎన్నెన్నో వెలసినవి. పరువు అన్నా, ప్రతిష్ఠ అన్నా ఒకటే. అయితే నేం? పరువూ ప్రతిష్ఠా ఉన్న కుటుంబం అనుటలో ఒక విలక్షణపదబంధం ఏర్పడినది.

ఇలాంటివి కాక శబ్దపల్లవక్రియ లెన్నో విశిష్ట విలక్షణస్ఫూర్తితో నుడికారాలలో చేరినవి.

చన్నిచ్చుట చన్ను నిచ్చుట కాదు;కొండ చేయుట కొండను చేయుట కాదు; పీట పెట్టుట పీటను పెట్టుట కాదు. సరే. నోరు చేయుట నోరును చేయుట అని తెనుగు వా డనుకోగలడా?

అట్లే కయ్యము పొడుచుట, అప్పు పొడుచుట, ఆన పొడుచుట మొదలగువానిలోని పొడుచుట ఆ విశిష్టపద సంయతితో స్ఫురింపజేసే అర్థం. కలది వానితో చేరినప్పుడే అవుతుంది.

మిన్ను దన్నుటలో, తల దన్నుటలో, జిగి తన్నుటలో తన్నుట మన మామూలు తన్నుట కాదు. చెట్లు వట్టు, తిప్పలు వట్టు, కొండలు పట్టు వగైరాలు అవొక విశిష్ట భావద్యోతకాలు.

అట్లే అవసర మిచ్చుట, పూజ యిచ్చుట, చెఱయిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట, మొల యిచ్చుట, దళమిచ్చుట ఇత్యాదులు. ఎన్నిరకాల రీతులనో అపూర్వపద విశిష్టసాన్నిహిత్యంతో యూ యిచ్చు అర్థ మిస్తున్నది.

చెఱపట్టుట చెఱను పట్టుట కాదు కదా! కొమ్ములు సూపుట కొమ్ములను చూపుట కాదు కదా.

ఇలా అనేకంగా వున్నవి.

మఱి కేవలం ధ్వన్యనుకరణాలై వచ్చినవి చాలానే కలవు. కొఱకొఱ లాడు, మెఱమెఱ లాడు, పటపట పండ్లు కొఱకు, చిటపట వాన కురియు ఇలాంటివి.

అర్థవైలక్షణ్యం లేకున్నా ఒకే రూపంలో ఉండే కనుముక్కుతీరు, అరిషడ్వర్గాల వంటివి కొన్ని.

ఇవన్నిటినీ చేర్చి నుడికారాల నిఘంటువును వేఱుగా తయారు చేయవలెన్నన్న సంకల్పం కేవలం గ్రంథస్థమైన వానిని ఒకచో చేర్చుటకే కాక, అసలు గ్రంథస్థం కానివీ, నిఘంటువుల కెక్కనివీ వందలూ వేలూ ఉండిపోగా వానిని చేర్చుటకూ అయి ఉన్నది.

ఆంగ్లాది ఇతరభాషలలో కోశనిర్మాతలు ఆ యా ప్రధానపదాల క్రిందనే, ఆ పదం కొలికిపూసగా ఏర్పడిన సుడికారాల నన్నిటినీ విశేషార్థవివరణలతోపాటు ఇస్తూ వస్తారు.

మన కోశాలలో సూర్యారాయాంధ్ర నిఘంటువు (జన్యపదాలు), వావిళ్ళ నిఘంటువు కొన్నిటిని ఇవ్వవలె నని ప్రయత్నించినా ఆ పని సమగ్రం కాలేదు. అసలు కేవలం వాడుకలో ఉన్నవి ఎక్కుటా వారి ఉద్దేశం కాదు. మఱి శబ్ద పల్లవక్రియలను ఆ పదబంధంలోనుండి తప్పించి ముందుపదానికి అర్థం మార్చి వ్రాసి యిచ్చుటతో నుడికారపు వడుపే తెలియరాకుండా పోయినది.

చన్ని చ్చుట అన్నది అలా ఒకటిగా కాక, చన్ను అనుమాటకు స్తన్యము అన్న అర్థం కూడా ఉన్న దని వ్రాసి, ఆ ప్రయోగ మిచ్చీ ప్రయోజనం తక్కువ. చన్నుకు స్తన్యమన్నది చన్ని చ్చుటలో తప్పా వ్యస్తంగా ఎన్నడూ రాదు. అలాంటప్పుడు ఆ మాటకు ఆ అర్థమూ ఉన్న దనుట ఎలా? విభిన్న పదాల కలయికతో అవలా విశిష్టార్థాలలో ఏర్పడిన మాటలు.

ఈ విషయం శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు 'సాహిత్యసమీక్ష' లో విపులంగా చర్చించినారు.

అట్లని ఏవీ కోశాలలో చేర లేదని కాదు. బ్రౌణ్యం మొదలు, వావిళ్ళదాకా ఎన్నో చేరినవి. కొన్ని ఏపదం క్రిందనో ప్రయోగాలలో ముక్కు మొగం తెలియకుండా కూర్చున్నవి. కొన్ని విడివిడిపోయి వేరు కాపురాలు పెట్టినవి.

మఱి అలా కాక నుడికారాలను వేఱుగా, అకారాదిగా సంగ్రథనం చేయడానికి తొట్టతొలిసారి ప్రయత్నించినవారు శ్రీ నాళం కృష్ణారావుగారు. 'తెలుగు జాతీయములు' అను పేర వా రొకగ్రంథం రెండు సంపుటాలలో ప్రచురించారు.

అందులో కేవలం రెండువేల చిల్లర పదబంధాలు మాత్రమే చేరినవి. అయినా వారి కృషి ప్రప్రథమం, ప్రముఖం.

ఇలా అటూ చెటూ చెదరి ఉన్న వే కాక మొత్తం వాడుకలో ఉన్నవీ, వాడుకలోనూ గ్రంథాలలోనూ కూడా ఉన్నవీ, గ్రంథాలలో మాత్రమే మిగిలి వాడుకలో మాయమయినవీ అన్నీ-పై వర్గా లన్నింటికి చెందినవానిని ఒక చోట చేర్చవలె నని ఆంధ్రసాహిత్యఅకాడమీ మహా సంకల్పం చేసి, మాకు పని అప్పగించినది. ఇదొక మహాసముద్రమథనంవంటిపని. మనవాఙ్మయం అనంతం. అందులో అచ్చయినవీ, అచ్చు కానివీ, అపపాఠాలతో అచ్చయినవీ, అసమగ్రంగా వెలువడినవీ, అంతు తెలియనివీ, అంతు పట్టనివీ ఎన్నో గ్రంథా లున్నవి.

ఇక కోశాదులలో సంగ్రథిత మైనవానిని ఈ దృష్టితో వేఱు చేసి సరిచూచుకుంటున్నప్పుడు అర్థాలు సరికొత్తగా చూచుకొని నిర్ణయించుకొనవలసిన అవసరమూ ఏర్పడినది. కొన్ని వాడుకలో ఏ మూలో ఒకమూల నునిర్దిష్టమూ సుస్పష్టమూ అయిన అర్థంలో ఉండగా, ఆ వాడుక వినక చెప్పిన సుదూరార్థాలూ అవీ సరిచేసుకొనకా తప్ప లేదు. పైగా పాఠాలను కొన్ని చోట్ల సరిదిద్దుకొంటే తప్ప కుదరని పట్టులూ చాలానే కనిపించినవి.

ఇలా ఈపని సువిస్తృత మై పోయినది. అందువల్ల కొంత పరిశ్రమ ఎక్కు వైనా తప్ప దని సరికొత్తగా ప్రధాన గ్రంథసంచయా న్నంతటినీ నన్నయనుండీ నేటి కవులలో తెనుగు నుడికారపు సొంపులు నింపుకున్న పలువురు రచయితల గ్రంథాలదాకా చూడవలసి వచ్చినది.

అట్లని ప్రతిగ్రంథం చూడడం సాధ్యమా? ప్రాచీన గ్రంథసంచయంవఱకూ, దాదాపు ఏ యుగంలో నైనా సరే ప్రధానగ్రంథాల నన్నిటినీ పరిశీలించడం జరిగినా, నేటి వానిమాట అలా చెప్ప వీలు లేదు కదా !

మఱి వాడుకలో మాత్రమే ఉన్నవాని సంగతి ఏమని చెప్పగలం? అవెన్నో ఎటు పడితే అటు సాగ రాగాధాలలో కలిసిపోయిన మంచి ముత్యాలలా చిప్పల పొత్తిట దాగి ఉన్నవే! అవెట్లా ఎన్నని పైకి తేగలం?

అయినా సాహసించినాము. విన్నన్ని, విన్నవా రుపయోగించగా విన్నన్ని, విని వ్రాసినవారు వ్రాయగా చూచినన్ని-ఇలా చాలవఱకు సేకరించినాము.

తొలుత ఏదో యింతే కదా అనుకున్న కృషి తలకు మించిన బరు వైనది. అయినా పూనికతో పాఠాలమొదలు, అర్థాలమొదలు, వాని ప్రయోగాల మొదలు, వాని వాడకం మొదలు అన్నిటినీ పరిశీలించి ఒకకొలికికి తేగలిగినాము.

ప్రతి పదబంధానికీ అర్థం వివరణం, ప్రయోగం దాదాపు ఇచ్చినాము. ప్రయోగంతోపాటు నేడూ వాడుకలో ఉన్నప్పుడు మేమే ఆ నుడికారం ఉపయోగంచేతీరును తెల్పుతూ అర్థం స్ఫురింపజేసే వాక్యాన్ని చేర్చినాము. కేవలం గ్రంథస్థమే అయినప్పుడు ప్రయోగమే ఇచ్చినాము. కేవలం వాడుకలోనే మేము వినిన దైనప్పుడు వాడుకలోని వాక్య మొకటి మాత్రమే ఇచ్చి వున్నాము. జంటపదాలను ధ్వన్యనుకరణాలను సూచించాము.

మఱొక - మనభాషలో మాత్రమే ఉన్న - ఇబ్బంది చెప్పక తప్పదు. ఆంగ్లంలో మఱి ఏ పదబంధంలో నైనా ఆ మాట మాటగానే ఉండి పోతుంది. మన కలా కాదు. కన్ను - కంటిలో రూపం మారుతుంది కదా. అట్లే కన్ను బహువచనంలో కన్నులు, కనులు, కండ్లు, కళ్ళు ఇలా నాలుగు రూపాలలోనూ వినవస్తుంది. మఱి అన్నిటా అవెలా ఇవ్వడం? చాలవఱకు ప్రధానంగా అన్ని రూపాలలో కానవచ్చేవి కొన్ని యిచ్చినా, మిగతవి ఒక రూపంలో ఆ అక్షరంక్రింద కానరాక పోతే మఱొకఅక్షరం క్రిందిరూపంలో ఉంటుంది. అన్నీ అన్నిరూపాలలో ఇస్తే అనవసర గ్రంథవిస్తరణం అవుతుం దనీ ఒకభయం.

ఇక ఎన్నడూ రగడగానే ఉండి ముగబడని బండి ఱాలూ రేఫలూ ఉండనే ఉన్నవి. ఇదొక పెద్ద సమస్య. అయినా నేటి వాడుకలోనూ చాలవఱకు వ్రాతలోనూ పాటింపనిది. అందుకని రెండిటా కొన్ని యిచ్చాము. కొన్ని ఏదో ఒకటి క్రింద ఇచ్చాము. యథార్థానికి మేము ఈ ప్రత్యేకపదబంధంలోని రేఫం - శకట రేఫమా? సాధు రేఫమా? అని సిద్ధాంతరాద్ధాంతాలకు దిగ లేదు. దిగితే మాకాలం దానికే సరిపోయేది. అది ప్రస్తుతనిఘంటువునకు ప్రయోజనకారి కాదు. అలాంటిదే మన అరసున్న పరుసదనం. ఇందులో మేము ప్రధానపదబంధసూచికలో గాని, మా వివరణంలో గాని, మా వాక్యాలలో గాని అరసున్నలు అసలు ఉపయోగించ లేదు. ప్రయోగాలలో మటుకు ఉన్న వున్నట్టు ఉంచాము.

నిజమే! అర్థం విభేదింపజేసే అరసున్నలూ వున్నవి. అయినా అవి ప్రయోగాలలో ఎలాగూ ఉన్నవి. వాడుకలో నే డెలాగూ అంతరించినవి. అందుకని ఈ పద్ధతిని మే మనుసరించాము.

వివరణలో సాధ్య మయినంత ఆ పదబంధ మెలా ఏర్పడిందీ మాకు తెలిసిందాకా వ్రాశాము. బొత్తిగా తెలియని కొన్నిటికీ ఆ మాట ఒప్పుకునే అర్థం చెప్పాము. ఇంకా తేలనివీ, ఆలోచించవలసి ఉన్నవీ అలా అని తెలివిడి చేశాము.

వివరణంలో కేవలం ఇంతదాకా వచ్చిన కోశాలలోని అర్థాలను అలా పరిగ్రహించక కొత్తగా చెప్పినవీ చాలానే ఉన్నవి. వానికి తగిన ఉపపత్తి ప్రతిచోటా చెప్పడం సాధ్యంకాక పోయి ఉండవచ్చు. వీ లున్న చోట వ్రాశాము. మా మట్టుకు మాకు తగినంత ఉపపత్తు లున్నప్పుడే ఇలా విభిన్నార్థం వ్రాశాము.

ఇవన్నిటినీ ఇక్కడ వివరించడం అసాధ్యం. అదొక గ్రంథం అవుతుంది. అ దిక్కడ అవసరమూ కాదు.

ఆ! అన్నట్లు వివరణాదు లన్నీ వ్యావహారికంలోనే ఉన్నవి. అందుకు ఉపపత్తు లీనాడు చెప్పవలెనా?

శక్తివంచన లేకుండా ఒక సంవత్స రానికి పైగా మేము చేసిన కృషి ఈనాడు మీ ముం దున్నది. అయితే, ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేయక తప్పదు. భాషామహాసముద్రం గడవ నీదినా మని చెప్పడం ఎవ్వరి తరం?

అందులో నుడికారాలవంటివి వాడుకలోనే ఎన్నిఉన్నవో లెక్కపెట్టి చక్క బెట్టినా మనడం చుక్కలను లెక్కించినా మనుట వంటిదే. అయినా చుక్కల లెక్క అంచనా వేస్తూనే ఉన్నారు. అలాగే మేమూ వేశాము! ఇది సర్వసమగ్రమూ, స్వయంసంపూర్ణమూ అని చెప్పడం లేదు. అలా ఒక్క విడతలో బయట పడవేసే వీలున్న పని కా దిది.

ఇది చూచినవారు తా మిందులో చేర లే దని తోచిన వానిని దయతో తెలియజేస్తే వినమ్రుల మై స్వీకరిస్తాము.

ఇదొకరి పని కాదు. భాషాసేవ పరమావధిగా మేం చేయగలిగినది చేశాము. ఇలాగే ఇంకా మేము వెలికి తీసుకొని రాగలవానినీ, తర్వాత తెలిస్తే వానినీ, మిగత పై వారు తెలిపేవానిని అన్నిటినీ ద్వితీయ ముద్రణంలో చేరుస్తాము.

అలా ఒకటి రెండు ముద్రణా లై తే కాని, ఒక రకమైన సమగ్రత రాదు. - అప్పటి కైనా వస్తే మాట !

ఏమైనా మా యీ కృషిని ఆంధ్రవిద్వల్లోకమూ, సహృదయజగత్తూ, జిజ్ఞాసువులూ తప్పక సానుభూతితో అర్థం చేసుకొనగల రనీ, అంచనా వేసుకొనగల రనీ, అభినందించగల రనీ ఆశిస్తున్నాము.

ఈ మహాప్రయత్నంలో ఎందరో మాకు తోడ్పడినారు.

ప్రాచీనాధునిక గ్రంథసంచయంలోనుండి కొన్ని కావ్యాదులను చదివి వానిలో ఉన్న వానిని వేఱుగా ఎత్తి వ్రాసి యిచ్చుటలో మాకు తోడ్పడిన మిత్రులు వీరు. శ్రీగన్నవరపు సుబ్బరామయ్య; శ్రీ బులుసు వెంకటరమణయ్య; శ్రీ రావూరి దొరస్వామి శర్మ; శ్రీ తిరుమల రామచంద్ర; శ్రీ జాస్తి జగన్నాథం; శ్రీ యామిజాల పద్మనాభస్వామి.

అట్లే నుడికారాలు, సామెతలు వగైరాల సేకరణలో ప్రభుత్వనియమితు లై కృషి చేసిన శ్రీ సంపత్ రాఘవాచార్యులు తాము వ్రాసి ఉంచినవానిని మాకు పంపారు.

వా రందఱికీ కృతజ్ఞులము.

మే మిందులో ఉదహరించిన గ్రంథాలే కాక ఇం కెన్నో పరిశీలించాము. ఏదో ఒకదానినుండి ప్రయోగ మిస్తే సరిపోవును గనుక, చదివినవానిలోఎక్కువపాలు పదులూ ఇరవైలుగా ఉన్న గ్రంథా లన్నిటా ఇవి పున:పునరా వృత్తములు గనుక ఇలా అగుట తప్ప లేదు.

అచ్చులో మే మనుసరించిన పద్ధతి యిది. ప్రధాన మైన నుడికారం పెద్ద అక్షరాలలో ఇచ్చి, అంతకంటె చిన్న దానిలో మా వివరణం యిచ్చాము. ప్రయోగం - అది గ్రంథంలోని దైతే ఆ ఆశ్వాసపద్యాది సంఖ్యనో, పుట సంఖ్యనో ఇచ్చి - చిన్న అక్షరాలలో ఇచ్చాము. మా వాడుకలోని వాక్యమూ అంతే.

ఇది సులువుగా చూచుకొనుటకు వీ లవుతుం దని మా ఆశ. అక్షరక్రమం అందఱివలెనే అనుసరించాము.

ఈ అచ్చు విషయంలో ఎంతో ఓపిక చూపి, ఎన్ని మార్చినా, చేర్చినా ఒక్క మాట అనక మాతో సహకరించిన 'ఫ్రీడం ప్రెస్‌' వారిని అభినందించి తీరాలి.

ఎంత కన్నులో కన్ను పెట్టి చూచినా ఏమూలో అచ్చుతప్పో, రెండుమా ర్లొకపదం పడుటో, వాడుకమాట క్రింద 'వా'. జారిపోవుటో, అక్షరక్రమంలో ఏ నాలుగో అక్షరమో క్రమం తప్పుటో - ఇలాంటి చిన్న పొరపాట్లు జరిగినా జరిగి ఉండవచ్చు.

ఏమైనా ఈ కృషిని మన్నించి, అభిమానించి, ఏమైనా సలహా లిస్తే తప్పక స్వీకరించగలము.

నుడికారాల నిట్లా పెద్దయెత్తున నిఘంటురూపంలో సంగ్రథించుటలో మే మెంతవఱకు చరితార్థుల మైనామో అందుకు సహృదయులే ప్రమాణం. ఏ కొంతవఱకు మే మిందులో కృతకృత్యుల మైనా మా కృషి ధన్య మనే భావిస్తాము.


సంపాదకవర్గం.