పండితారాధ్యచరిత్ర/పుటలు128-129

వికీసోర్స్ నుండి

తమ్ములు చినగురవప్ప, సిద్ధవీరయ్య, నమశ్శివాయ, కాళహస్తి అనే వారికిని కూడా హరిదీక్ష నిచ్చినాడు.

పోచిరాజు వీరకవి

ఇతడు ‘విభూతిరుద్రాక్షమాహాత్మ్యము’ అనే ద్విపదకావ్యమునకు కర్త. గ్రంథారంభములో శ్రీపతి పండితేంద్రుని తలచినాడు. “శ్రీపతి పండితుడు కౌశికగోత్రజుడు. నాగలింగారాధ్యుని పుత్త్రుడు. మహాదేవుని పౌత్త్రుడు” అని కవి చెప్పినాడు. కవి ఉద్దేశించిన యీ శ్రీపతి పండితత్రయములో ఒక డనడానికి సందేహము లేదు. ఇతనిని గురించి

“అనుదిన శివసపర్యాసక్తుపేర
అభియుక్తి వీరశైవాచారుపేర శుభకరోద్యద్గుణశోభితుపేర
విజయవాటీ పురవిభుకృపాలబ్ధ నిజమహత్త్వౌదార్యవనిర్ణయుపేర
పటుశమీశాఖా నిబద్ధవస్త్రాంత ఘటిత వైశ్వానరకల్పనుపేర”

శ్రీపతి పండితునిపేర తనగ్రంథమును రచించినానని కవి చెప్పినమాటలను గమనించవలెను.

కవి తనవంశక్రమము నిట్లు చెప్పుకొన్నాడు — శాండిల్యగోత్రజుడు, ఆపస్తంబసూత్రుడు, ఈవనిపురవాసుడు, వీరభద్రభక్తుడు అయిన భద్రనమంత్రికిన్ని ఎల్లాంబకున్ను వీరయామాత్యుడు పుత్త్రుడు. అతనికిన్ని కొండమాంబకున్ను వీరభద్రుడు, భద్రుడు అని యిద్దరుకొడుకులు పుట్టినారు. వారిలో వీరభద్రునికిన్ని మూర్తిమాంబకున్ను వీరకవి తనయుడు. ఇతడు రచించిన గ్రంథము విషయము బ్రహ్మోత్తరఖండమునుంచి గ్రహించబడినదట.

ఈవని వీరభద్రకవి

ఇతడు శ్రీపతిపండితారాధ్యుని వంశమువాడ నని చెప్పుకొన్నాడు. శ్రీపతిపండితుడు విజయవాటీపుర విదితసంచారుడు. కృష్ణవేణీతీరకేళీవిహారుడు, ఇంద్రకీలాఖ్య పర్వతముఖ్య నవ్యశృంగాలోకన విలోలకుడు, నాగలింగారాధ్యపౌత్త్రుడు, శ్రీమహాదేవుని పుణ్యతనూజుడు అని కవి వర్ణించినాడు. పోచిరాజు వీరకవి కూడా శ్రీపతిపండితునిగురించి ఇదేరీతిగా చెప్పినాడు.

వీరభద్రకవి బ్రహ్మోత్తరఖండములోని సోమవారమాహాత్మ్యకథను ‘సీమంతినీకథ’ అనే పేర ద్విపదకావ్యముగా రచించినాడు.

శంభుసద్గురుడున్ను లింగాంబయున్ను తన తల్లిదండ్రులని చెప్పుకొన్నాడు. అతనికిన్ని, ఈవనిపురనివాసియే అయిన పోచిరాజు వీరకవికిన్ని ఏమయినా సంబంధమున్నదేమో తెలియదు.

దోనూరు కోనేరునాథుడు

ఇతడు శ్రీవత్సగోత్రుడు. అశ్వలాయనసూత్రుడు, దోనూరు నాగయమంత్రి కొడుకు. ఇతడు బాలభాగవతమును శక 1469 ప్లవంగనామసంవత్సరములో (క్రీ.శ. 1543) రచించినట్లు గ్రంథములో తెలిపినాడు. గ్రంథ మార్వీటి తిమ్మభూపాలుని మూడో కొడుకయిన చిన్న తిమ్మభూపాలుని కగ్రజుడు తిరుమలభూపాలుని కంకితము చేయబడినది.

సోమవంశాంబుధిసోముడు, ఆపస్తంబసూత్రుడు, ఆత్రేయ గోత్రుడు అయిన బుక్కరాజుకు రామభూపతి తిమ్మరాజు ప్రపౌ