పంచతంత్రి
మడికి సింగనార్యుఁడు తన “సకలనీతిసమ్మతమునఁ” బంచతంత్రములోనివని కొన్నిపద్యముల నుదాహరించియుండుటవలన, నిప్పటి కుపలభ్యమానము లగుచున్న చంపూరూపములగు పంచతంత్రములకన్న ముందే, ఒక పంచతంత్ర ముండియున్నట్లు తెలియుచున్నది. కాని, అది నామమాత్రావశిష్టము. కృతికర్త పేరు కూడా తెలియదు.
చ.
చెలువుగ దుష్కరంపుఁబని సేసియుఁ జేసితి నాక క్రూరతం
బలుమఱు వ్రేసినం గడవఁబల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక పల్కుచొప్పిదము తథ్యముగాఁ దగఁ బల్కిమోసలన్
బిలువక వేచియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్ని భంగులన్.
3.45
శా.
నానాశాస్త్రవిశారదుండు నయనానందాంగుఁడున్ సత్కుల
స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్శుద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడును నిశ్చింతుండునై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని చెప్పన్వచ్చు నుర్వీస్థలిన్.
3.28
చ.
అరయఁగ శబ్దశాస్త్రము లనంతము లాయువు కొంచె మందులోఁ
గరము ఘనంబు విఘ్నములు గావున సారము పట్టు టొప్పగున్
బరఁగ నసారము ల్విడిచి పాలును నీరును నేర్పరించి నే
ర్పరుదుగఁ బాలు పుచ్చుకొను నంచతెఱంగున భూవరాగ్రణీ.
38
క.
పెక్కేల నీతిశాస్త్రముఁ
దక్కక నెవ్వండు సదువు ధర నెవ్వఁడు పెం
పెక్కఁగ నిము నాతఁడు దాఁ
జిక్కఁడు సురపతికి నైన సిద్ధం బెందున్.
43
గీ.
చుట్టువాఱ వెలుగు గట్టిగా నిడికొని
యున్వారిఁ గడిఁది యోర్పు టనిన
నురుతరంపు దుర్గ మొకటి ప్రవేశించి
బలసికొనినపిదప గెలువ వశమె.
52
ఆ.
తారతప్పుసేయఁ దగుశిక్ష చేసిన
నుర్విపతులఁ గొంద ఱొప్పదండ్రు
అది వివేకమగునె వదన మొప్పకయున్న
దర్పణంబుమీఁదఁ దప్పుగలదె.
91
క.
ఉత్తమయానములును ఘన
విత్తములును రత్నధాన్యవితతులు నయసం
పత్తినిఁ బ్రజఁ బాలింపక
యెత్తెఱఁగునఁ గలుగు ధారుణీశుల కరయన్.
101
ఆ.
ఫలము కాససేయు పతిగాక నీతితో
భూమిప్రజల నరసి ప్రోవవలయు
నీరు ప్రోదిపెట్టు నెఱిమాలకరివాఁడు
పువ్వుఁదీగ లరసి ప్రోచినట్లు.
102
ఆ.
బంధుహీనతకును బరమబాంధవమును
నేత్రహీనులకును నేత్రములును
గన్న తల్లిదండ్రు లన్నను రాజులె
కాక ప్రజల కొరులు గలరె యుర్వి.
112
గీ.
చాలఁ దస్కరాదిసాహసకర్ముల
బాధఁ బొరయకుండఁ బ్రజల నెల్లఁ
గావఁ బ్రోవ నృపుల కాక వారలకును
దలఁచిచూడ నొరులు గలరె యుర్వి.
115
క.
లోకంబులకును మే లగు
భూకాంతుఁడు మిగులవృద్ధిఁ బొందుచునుండన్
లోకంబునకు గీ డగు
భూకాంతుఁడు మిగులఁగీడు పొందుచునుండన్.
116
ఆ.
ఉర్వి ప్రజలఁ బీడ లొనరించెనేనియు
వారిభూరిశోకవహ్నిఁ దగిలి
రాజు సిరియుఁ గులముఁ బ్రాణంబు నొక్కట
నీఱుచేసి కాని నేర దధిప.
117
ఆ.
పరులవలన గాసి పడకుండఁ దనప్రజఁ
బూని యరసి ప్రోవలేని రాజు
రాజు గాఁడు వాఁడు రాజరూపంబున
జగతిఁ బుట్టినట్టి జముఁడు గాని.
118
ఆ.
పగఱవలనిబాధ పడకుండ రక్షించు
రాజు లేని చోట మనుజు లోజ లేక
పొలసిపోదు రబ్ధిపూరంబులోపల
నావికుండు లేని నావపగిది.
119
చ.
బలియుఁడు నీతిమార్గపరిపాలుఁడు భూపతి
గాకయుండినన్
దలపఁగఁ గర్ణధారరహితం బగునావయుఁ బోలె నుండు ని
య్యిలఁ బ్రజ గాన నట్టి ధరణీశుఁడు పెన్నిధి భిన్నమై నయ
క్కలమునుబోలె వేగమె తెగన్ విడువందగు నెన్నిభంగులన్.
120
క.
పాడి గలపతి వసుంధర
వేడుకఁ బరభూమిప్రజయు వెలయఁగనెక్కున్
బాడి చెడ నడుచుపతి ధర
పాడుగఁ జెడిపోవుఁ బ్రాఁతప్రజయైన వడిన్.
121
ఆ.
ప్రజ నజంబుఁబోలెఁ బట్టి విత్తమునకై
తగిలి చంపెనేని దానఁదృప్తి
యణఁగ దొక్క మాటి కగుఁగాని ధారుణీ
శునకు మఱియు వలయుననిన లేదు.
125
క.
విను గోపాలనిక్రియఁ గాఁ
పనుధేనువుచేత విత్త మనుదుగ్ధంబుల్
గొనవలయు నిత్య మొయ్యొ
య్యన ఫలరోషాధికముల నవనీశునకున్.
126
క.
తనభూమి నొయ్యనొయ్యన
జనపతి యొకకొలఁదితో రసాయనభాతిన్
జను నుభవింప ననిశము
విను మది కడు మీఱెనేని విషమగుఁ బిదపన్.
137
క.
మండలమున నాలుకచవు
లొండొకభోగంబు లెఱుఁగ కొగిఁ జట్మరులై
యుండెడి కలుభృత్యులఁ బతి
భండాగారంబు గాఁపు పంపఁగవలయున్.
138
క.
భాతిగ నిస్పృహులైన కి
రాతులు గొల్లలును భోగరతి లేక ధృతిం
గాతురు పెఱవారలు దా
వేతురు విత్తాపహరము వెలయఁగ మదిలోన్.
139
క.
పరిజనులు సుమతులైనను
ధరణీశుఁడు కుమతి యయ్యుఁ దాప యయిచనున్
బరిజనులు కుమతులైనను
ధరణీశుఁడు సుమతియైనఁ దా వెలయఁ డిలన్.
171
క.
సమబలుఁడును మర్మజ్ఞుఁడు
సమరాజ్యసమన్వితుండు సదృశోద్యముఁడున్
సమధనుఁ డైనభటుం బతి
సమయింపండేని తాన సమయు నతనిచేన్.
175
గీ.
ఎవ్వఁడభ్యంతరస్థుల నెడులచేసి
మిగుల లాతుఁ జేరంగఁ దిగుచుఁదగిలి
వాఁడు వారలచేఁ జెడు వలను దప్పి
యలుక గృధ్రముఁ డను రాజునట్ల పొలియు.
181
ఆ.
దీనికొఱకుఁ గాదె తివిరవంశజులైన
నేలికొంద్రు రాజు లేల యనిన
మానుగాఁగ నాదిమధ్యావసానముల్
వార లొక్కరీతివారు గాన.
182
ఆ.
ఎవ్వఁడొద్ద నుండ నేపార సితపక్ష
చంద్రకళయుఁబోలె సంతతంబు
వెలయ రాజ్యలక్ష్మి వృద్ధిఁ బొందుచునుండు
నతఁడ [మంత్రివర్యుఁ]డవనిపునకు.
183
గీ.
వ్యయము నార్జవంబు దయయు హింసయు బొంకు
నిజముఁ దియ్యఁదనము నిష్ఠురంబుఁ
బలువు రిష్టజనులు గలిగి యారయఁ బణ్య
రమణివోలె నుండు రాజనీతి.
189
క.
అధిపతి యెవ్వని దోరపు
టధికారము మీఁదఁ బొట్టు నతఁ డుర్వరలో
నధమకులజాతుఁ డైనను
నధికుం డగు నుతుల కెల్ల నాకర మగుచున్.
208
క.
దుష్టైన నృపతి పరిజన
శిష్టతచే సేవ్యుఁ డవును శిష్టుం డయ్యున్
దుష్టపరిజనము గూడినఁ
గష్టుం డగు సర్పకలితఘనశాఖగతిన్.
209
ఆ.
అధికుఁ డైనవాని నతినీచతరమైన
యట్టిపదవిఁ దెచ్చిపెట్టు టెల్ల
వర్ణనీయమైన వరశిరోరత్నంబు
కాలఁ గట్టినట్లు కాదె తలఁప.
210
చ.
తగనిపదంబునం దిడునదక్షత రాజున కుండుఁ గాక యా
జగమున నీతిమంతుఁ డనఁ జాలినసేవకుఁ డుండకుండునే
తగరముమీఁదఁ దెచ్చి నిరతం బగురత్నముఁ గీలుకొల్పఁగా
వగచునె రత్న మట్టిపనివానిది దోషము గాక యారయన్.
211
ఆ.
ఎచటనుండి లేఖ యేతెంచెనేని య
నాదరంబు సేయు టనుచితంబు
సంధివిగ్రహాదిసకలకార్యంబులు
తెలియుటెల్ల లేఖవలనఁ గాదె.
212
క.
ద్వారములను నాయుధహయ
వారణనిలయములయందు వసుతంత్రవ్యా
పారములందును హితులను
భారకులను నిపుణమతులఁ బనిగొనవలయున్.
213
ఆ.
ఎవ్వరైన దోష మేమి చేసిన నొప్ప
భూవరునకుఁ జెప్పఁ బోలుఁగాక
యోజఁ దక్కిపోయి రా జట్ల చేసిన
కోరి చెప్పఁగలదె యేరికైన.
232
క.
ఇలఁ గఠినంబులు విషమం
బులు గంటకమార్గసహితములు నై యోగి ని
మ్ములఁ జెందరాక పర్వత
ములపోలిక నుండుఁ గష్టభూపతుల సుతుల్.
233
ఆ.
దేవమంత్రవిప్రతీర్థదైవజ్ఞస
ద్వైద్యగురులయందు వసుధమీఁద
నెంత విశ్వసించి రంతయు సిద్ధియౌ
నెంత విశ్వసింప రంత గాదు.
319
క.
పోఁడిమిఁ బౌరోహిత్యం
బేఁడును మాఠాధిపత్య మింపెసఁగంగా
మూఁడుదినంబులు చేసిన
వాఁడు సుమీ ఘోరనరకవాసుఁడు మీఁదన్.
326
క.
జాతకయాత్రాప్రశ్న
ఖ్యాతఫలగ్రంథగణితగణచతురధిక
స్ఫీతశతచక్రనిపుణ
జ్యౌతిషికులు గలుగవలయు నవనీశునకున్.
329
క.
ప్రతికూలవేళ లెఱుఁగుచుఁ
బ్రతికృతరాశ్యాదు లెఱిఁగి పతిరాశిఫల
జ్ఞత యొరు లెరుంగకుండఁగ
సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్.
330
సీ.
వాన లెక్కువతక్కువలు గాఁగఁ గురియుట
చిలుకలు మిడుతలు నెలుకపిండు
నాదిగా సస్యోపహతికారణంబులు
గలుగుట తవులును గఱవు రాక
మనుజు లొండొరులతో మత్సరంబునఁ బోరు
టధికమై సర్పంబు లాదిగాఁగఁ
గ్రూరజంతువు లతిఘోషంబు వెట్టుట
గాలియుఁ జిచ్చు లగ్గములగుట
ఆ.
భూతములు పిశాచములు రేఁగి పట్టుట
యల్పకారణముల నైనచావు
గలుగుటయును నాపదలు వీనిదైవజ్ఞుఁ
డగు పురోహితుండు నడఁపబోవు.
331
క.
సన్నుతి వడయఁగఁ దివిరిన
యోన్నతి నుచ్చాసనమున నునిచి ధనంబుల్
మన్నించి యిచ్చి నృపతులుఁ
విన్నపము పనేమి యండ్రు విద్వాంసునకున్.
332
ఆ.
చటులసింహశరభశార్దూలగజముల
వశ్య మొందఁ జేయ వచ్చు ననిన
నరయ మిగులఁ దజ్ఞు లగువారకునెల్ల
నవనిపతులు వశ్యు లగుట యెంత.
333
శా.
నానాశాస్త్రవిచక్షణుండు నయనానందాంగుఁడున్ సత్కుల
స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్సిద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడగు నిశ్చింతుండు నై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని తల్పన్ వచ్చు నుర్వీస్థలిన్.
339
ఉ.
కొందఱు చెప్పినంతయును గూర్ప వచింతురు చిల్కపోలికన్
కొందఱు మూఁగుభంగి నొనగూడఁదలంచి వచింపనేర రిం
పొందఁ దలంచిన ట్లవల నొప్ప వచింతురు కొంద ఱుర్విలో
నెందును సత్కవీంద్రుగతి నీక్రియ మర్త్యులు మూఁడుచందముల్.
346
క.
పసదన మెఱింగి చారుఁడు
వెసతో నేతెంచుఁ గాన వేమాఱును నా
పసదనమును జీతంబును
బొసఁగిన క్రియ నిడఁగవలయు భూపతివృత్తిన్.
392
ఆ.
చరులు లేనిరాజు పరులచే నాపదఁ
జెందు ననుట యేమిచిత్ర మరయ
భక్తి సేయునట్టి ప్రజలైన నెఱుగమి
సూచి మోసపుచ్చ జూతురనిన.
393
ఆ.
ఉర్విపతులవలన నొకయుపద్రవ మైన
నపుడు పెట్టకున్న నైన భటులు
తగిలి తన్మహీశుఁ దమ జీవనంబుల
హానిఁ గోరి కెలుచు రనుదినంబు.
416
ఉ.
ఏపునఁ గూడి పూర్వమున నేలినవానినయొండెఁ దక్కొరున్
భూపతిఁ జేయుటొండెఁ దలపోతురు రాజులనొండె నొండొరున్
బ్రాపుగఁ జేసి రాఁదలఁచి ప్రాణము లీ వడిఁ గారణంబుగా
రాపొనరింపఁగాఁ దగదు రాజు భటావళి నెల్లకాలమున్.
417
చ.
అఱమి రణంబునం బడిన యాతని సంతతిఁ బ్రోవఁడేని చే
కుఱు నట జీవితంబు గొని ఘోరరణంబున నోడి వచ్చినన్
బఱవకయుండె నేని జనపాలుని దిక్కున నంత వేడ్కయున్
వెఱవును జెడ్డ బ్రాణములు వెఱ్ఱులె యీ ననిలోన సేవకుల్.
418
క.
ఏలిక పనిచినఁ గీడౌ
మే లౌ నది భటుఁడు సేయ మెయికొనఁ డేనిన్
వాలాయము విడువనె తగు
నాలరి యగు భటునిఁ దలఁప నయ్యేలికకున్.
419
ఆ.
అఖిలసంపదలకు నావాసముగఁ జేసి
నట్టిదాత కొడరు పుట్టినపుడు
దరణి నేభటుండు తనప్రాణములు దాఁచు
నతఁడు నరకమునకు నరుగు వేగ.
425
ఆ.
యోగులకును లేదు యాగముల్ సేసిన
వారలకును లేదు వసుధమీఁదఁ
బతికి హితవు గాఁగఁ బ్రాణంబు విడనోపు
నలఘుసేవకులకుఁ గలుగు సుగతి.
430
క.
దురమునఁ జచ్చినఁ జయ్యనఁ
బరమందుం బ్రతికెనేని బహుసుఖకీర్తుల్
దొరకును గావున రెండును
నరుదులు సిద్ధించు శూరు లగువారలకున్.
431
క.
కడునభ్యంతరవర్తిం
బుడమీశుకుఁ గాఁగఁ ప్రాణములు విడిచిన నీ
క్కడ నురుతరకీర్తియు న
క్కడ మఱి సాయుజంయపదము గల్గు ధ్రువంబై.
432
ఆ.
కోరి తనధనంబుకొఱకును విప్రుల
కొఱకు సతులకొఱకు గోగణంబు
కొఱకు నని యొనర్చి నెఱయు నెవ్వఁడు ప్రాణ
మిచ్చు నతఁడు ముక్తి కీశ్వరుండు.
433
క.
తనయేలిక కగు చుట్టము
తనచుట్టను తననిజేశుదాయయ మిగులన్
దనదాయయు ననుతలఁపున
మను నెవ్వఁడు వాఁడు ప్రియుఁడు మనుజేశునకున్.
434
చ.
చెలువుగ దుష్కరంపుఁబని చేసితి నొక్కెడ నాక క్రూరతన్
బలుమఱుఁ జేసిన న్గడవఁబల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక పల్కు టొప్పిదము తథ్యముగాఁ దగఁ బల్కి లోపలం
బిలువక వచ్చియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్నిభంగులన్.
435
క.
మానవనాథున కగు భయ
హానులు మదిఁ దానె యెఱిఁగి యతిరభసమునన్
వానికి నెవ్వం డడ్డము
నై నిలిచినవాఁడు మాన్యుఁడగు రాజునకున్.
436
ఆ.
అన్యదేశ మెల్ల నాత్మదేశంబ కాఁ
దలఁచువాఁడు నెపుడు దలఁకు లేక
రణము సేఁత యెల్లరాజ్యంబుసేఁతగాఁ
దలఁచువాఁడుఁ బ్రియుఁడు ధరణిపునకు.
437
క.
మానుగఁ బతి వనిచినఁ దను
చే నిది గా దనక వేగఁ జేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిన భృత్యుల్.
438
క.
ఏయేలిక సేవింపఁగ
బాయక యేభృత్యులకును బహుదుఃఖము కా
నాయేలిక దూరమునన
నాయతమతి విడువవలయు నాభృత్యులకున్.
440
క.
ధనవంతుఁడు సత్కులజుఁడు
ననుపమతరవిక్రముండు నైనను ధరలో
ననభిజ్ఞుఁడైన భూపతి
ననుమానము లేదు విడుతు రరయఁగ భృత్యుల్.
441
క.
వలచేయును డాచేయును
బొలుపుగ రత్నంబు గాజుపూసయు సరిగాఁ
దలఁచు నృపు నొద్ద నుండినఁ
జులుకన యగుఁ దప్ప దెంతశూరుండైనన్.
442
క.
అకుటిలు లగు తనభృత్యుల
కొకయాపద ముట్టినప్పు డుడుపక యేయే
లిక యూరకుండు నాయే
లిక ముక్తికి మిగుల నెడ గలిగియుండుఁ దుదిన్.
444
క.
పలికిన జీతముఁ గెడపిన
బలవంతునినైన విడుచుఁ బరివారము దాఁ
బొలు పెఱుఁగని యేలిక నిల
ఫలహీనకుజంబు విడుచు పక్షులఁబోలెన్.
445
ఆ.
వల్లకాట నిడినవానికిఁ జెప్పెడి
వారు గలరె యెంతవారికైన
నట్ల పెట్టలేని యవనిపాలకునొద్దఁ
బట్టియుండ రెపుడు పరిజనములు.
449
ఆ.
ఆయుధముల నెపుడు నలజడిఁ బెట్టక
చిత్రకథలు కొన్ని చెప్పికొనుచు
నుండు భటులు గలుగు నుర్వీశ్వరులలక్ష్ము
లహితు లనుభవింతు రండ్రు బుధులు.
452
క.
కలిమియును భూరిబలమును
గలయంతకు భటుఁడు భటుఁడు గాఁడు దలంపన్
గలిమియును భూరిబలమును
గలిగిన మఱి భటుఁడు భటుఁడు గాఁ డేపతికిన్.
454
క.
అవనీశుల వేల్పులలో
నవనిపులు విశేష మతిశుభాశుభములు దా
నవనిపు లిప్పుడ సూపుదు
రవి వేల్పులు సూపఁజాల రాజన్మమునన్.
459
క.
కడుహితులకు నహితులకును
వడిమేలును గీడుఁ జేయవలసినవారల్
పుడమిపులఁ గొలువవలయును
గడు పెవ్వడుఁ బ్రోచుకొనఁడె కరటక చెపుమా.
460
క.
దుర్వేషియు నకులీనుఁడు
గర్వియుఁ గడుదుర్జనాగ్రగణ్యుం డైనన్
సర్వత్ర వాఁడు పూజ్యుఁడె
యుర్వీశ్వరు మిగులఁ జేరి యుండినఁ జాలున్.
467
క.
శ్రీయుతు లగు నరనాథులఁ
బాయక సేవింపకుండు పాపాత్ములకున్
వేయేల తిరియఁజేఁతయె
ప్రాయశ్చిత్తంబు సుమ్ము పరికింపంగన్.
468
క.
వెలిగొడుగులు చామరములు
బలువాజులు నందలములు భద్రేభంబుల్
వెలసిన భూనాథుని కృప
గలవారికిఁ గాక యెందుఁ గలవే ధరణిన్.
469
క.
బలుగొఱడువోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్.
470
ఆ.
మాన్యతయును గడు నమాన్యతయును మఱి
సరియె కాఁ దలంచు నరులు పిదప
నుగ్రమూర్తు లైన యుర్వీశ్వరులకును
మిగులఁ దారె మాన్యు లగుదు రెపుడు.
471
క.
క్షితిపతికి మిగులఁ బ్రియులును
హితులును నగువారి నాశ్రయింపఁగవలయున్
సతతము వారల యాజ్ఞకు
నతిఁ గడవక యుండవలయు నతిమతిమంతుల్.
472
క.
ఘనసేవకయుతులకు నఘ
మును పుణ్యములును విశేషములు గానివి దాఁ
గొనుఁగొన భూశయలఘుభో
జనముఁ గృశత్వంబు బ్రహ్మచర్యము సమముల్.
473
ఆ.
సేవకుండు గోరి సిగ్గఱి వ్యాధిక
ష్టములు ధనముకొఱకు సంతతంబు
నధిపు నొద్దఁ బడిన యట్ల ధర్మమునకుఁ
బడియెనేని సుగతిఁ బడయరాదె.
474
క.
సురచిరగుణవంతుం డగు
ధరణీశుఁడు పేదయైనఁ దగు సేవింపన్
నెరయఁగ నొకానొకప్పటి
కరుదుగ మేలొందుఁగాన నాయనవలనన్.
475
క.
వలయుపను లెఱిఁగి చేయుచుఁ
బలికినఁ బని యేమి యనుచుఁ బాయక నీతిన్
గొలువఁగ నేర్చిన యాతఁడె
తలపోయఁగ మిగులఁ బ్రియుఁడు ధరణీశునకున్.
476
క.
మన సెఱిఁగి నడవనేర్చిన
మనుజశను లైన మాటమాత్రములోనన్
దనవశ్యు లగుదు రనినను
మనుజేశ్వరుఁ డనఁగ నెంత మది నూహింపన్.
477
క.
జనపతి కృపఁ బడసిన ధన
మనయము దగువ్యయము చేసి యంచితవస్త్రా
ద్యనుపమవస్తువు లొసఁగిన
మన మలర ధరించినతఁడు మాన్యతఁ బొందున్.
479
ఆ.
ద్యూతమెల్ల జముని దూతయుగా ధనం
బెల్ల హాలాహలము, నింతు లెల్ల
ఘోరతరములైన కారాగృహములుగఁ
దలచు నతఁడు ప్రియుఁడు ధరణిపునకు.
484
క.
పొసఁగిన సేవకు నెఱుఁగని
వసుధేశ్వరుఁ డెంత దొడ్డవాఁ డైన నొగిన్
గుసుమఫలభరిత మైనను
వెస జిల్లెడు విడిచినట్ల విడువఁగ వలయున్.
491
క.
సేవ యెఱుంగని రాజును
సేవింపరు బుధులు గాక సేవించినఁ ద
త్సేవ యది చౌటఁ బెట్టిన
యావిత్తునుబోలె వ్యర్థమై చెడిపోవున్.
492
క.
ఇల నవివేకనృపాలునిఁ
జెలు వందగఁ గోరి సేవ సేయుట లెల్లన్
దలపోయఁ జౌటినేలను
విలసిల్లిన బీజ మిడిన విధము దలంపన్.
493
ఆ.
భైక్షమైన మేలు భారోపజీవితం
బైన మేలు కానలోన నుండు
టైన మేలు గాని యవివేకనృపుఁ గొల్చి
పొరయులక్ష్ము లొప్ప వరసి చూడ.
494
చ.
ఇల వ్యసనుండు క్షుద్రుఁడును నెంతయు మూర్ఖుఁడు నైనయట్టి భూ
తలపతిఁ జేరఁగూడ దది తప్పగుఁ దొల్లియు నిట్టిరాజు నిం
పలరఁగ సేవఁ జేసికొని న్యాయము నాసపడంగఁ బోవుచున్
బెలుచన నేరమిన్ శకడి భృత్యువులందఱుఁ జేటు నొందరే.
497
క.
విను సర్వభక్షుఁడగు వి
ప్రుని ననుకూలతయుఁ గాని పొలఁతిని మిగులం
దన కెనయని సఖు లెల్లం
దును గరుణయె చేయు నృపునిఁ దొఱఁగఁగవలయున్.
498
ఆ.
ఎట్టిభృత్యుఁడైన నేలిక కించుక
తప్పు సేసెనేని తలఁప మద్య
బిందుమాత్రమునన పెరుగు బ్రాహ్మణ్యంబు
సెడినయట్ల వాఁడు సెడుట నిజము.
500
క.
జనపతికి నేను మాన్యుఁడ
నని యెవ్వఁ డహంకరించు నాతఁడు లోక
మ్మునఁ జరణంబులు రెండై
వినుము విషాణములు లేని వృషభముఁ బోలున్.
505
చ.
ఇల గుణహీను లెంతయు మహీశుసమీపగులైనవారు ని
ర్మలగుణయుక్తులం గని యమాన్యత సేయుదు రేల వారు వా
రలయెదుర న్వెలింగెడి తరంబులు గామిని గాన నేల రా
త్రులవలె మించు నే మిగులఁ దోయజబంధునిమ్రోల దీపముల్.
506
గీ.
సేవకాళి యన్యసేవకులను రాజు
చాలఁ బెద్దసేఁత సైపఁజాల
రరయ నొక్కమగనియాండ్రు దా రయ్యును
సవఁతి జూచి సవతి సైపఁగలదె.
507
క.
తనపదము ద్రోప నెవ్వఁడు
గొను నాతఁడు తనకు నిపుడు గొనకొని వారిం
దునుమాడుఁ దనకుఁ జయ్యన
నెనయనివాఁ డెంత దనకు హితుఁడై యున్నన్.
508
క.
అరయఁగ జీవన్మృతు లే
గురు నిర్ధనికుండు నరసికుఁడు మూర్ఖుఁడు భూ
వరసేవకుఁడు ప్రవాసియుఁ
బరఁగుఁ బరాశరతనూజు పలు కిది ధరణిన్.
509
క.
రాజాధికారపురుషుని
పై జయముండునటె మృత్యుపాశము లుండున్
నైజమునఁ బట్టి పలు కే
యోజమెయిం జెప్పమతియె యోగ్యుం డైనన్.
510
క.
తమబ్రతుకు తమకుఁ గడువిర
సము చింతకుఁ బొత్తు మానసంబు పరాధీ
నము లైశ్వర్యంబులు స
ర్వము సేవకు లెవ్వ రరయ వారల కెల్లన్.
511
సీ.
ఒనరఁ గపాలంబు నుపహారసంధియు
సంతానసంధియు సంగతంబుఁ
జాల నుపన్యాససంధియుఁ బ్రతికార
సంధియు సంయోగసంధితంబు
బురుషాంతరాదృష్టనరనామకమ్ములు
నాదిష్టకంబు నాత్మామిషంబు
పరిక్రయవిగ్రహబంధురోపగ్రహ
సంధులు నుచ్ఛిన్నసంధికంబు
ఆ.
ననుపమపరదూషణాంచితస్కంధోప
నేయసంధు లనఁగ నిశ్చితముగ
షోడషప్రకారసునిశితసంధివి
ధాన మెఱుఁగవలయు ధరణిపునకు.
512
గీ.
బలిమి సమసంధియైనఁ గపాలసంధి
యర్థదానముచే నుపహారసంధి
దారికాదాన మీగి సంతానసంధి
చాలమైత్రిపూర్వక మది సంగడంబు.
513
ఉ.
దండమునందకాని యహితక్షితినాథులు గారు సాధ్యు లం
చుండుదు రెందునుం గలదె యూరకె యాకులచప్పు డైనఁ బె
ట్టుండక పాఱునీచులను వొయ్యన సామముతోడఁ దెచ్చి యు
ద్దండతఁ బట్టి యుద్ధతుల దారుణవృత్తి వధించివైవరే.
577
క.
సామంబుఁ బోల నౌషధ
మీమహి నెక్కడిది రిపుమహీశులఁ జంపన్
దామర వెస నశియింపదె
హేమంతసమయమునందు హిమపాతమునన్.
578
ఆ.
వనము నేర్చుచోట వహ్నిమూలంబులు
దివ్వఁ గాల్పలేదు తీవ్ర మయ్యు
మృదువుఁదనువయైన యుదకప్రవాహంబు
వేళ్ళతోడఁ గూడఁ బెకలఁద్రోచు.
579
క.
తనయర్థముఁ బ్రాణంబును
ఘనరిపుచేఁ బోవుచుండఁ గలిగినఁ దా నా
తనిశరణుఁ జొచ్చియైనను
గొనకొని యారెండు నిల్పుకొనవలయు వెసన్.
580
ఆ.
అరయ పాయమునన యగుకార్యములకును
దండముల నొనర్ప దలఁప రరులు
జగతిఁ బైత్యశమము శర్కర నగుచుండఁ
జేతిపొళ్ళకాయచింత యేల.
581
ఆ.
సామమునన మిగుల సకలకార్యంబులుఁ
బోలఁ జేయవలయు నేల యనిన
బేర్చి సామమున నొనర్చు కార్యము తుది
హానిఁ బొందనేర దండ్రుకాన.
582
క.
సామమునను దక్కఁగ రు
గ్గమానలశత్రుఘనతగా దీప్తులయం
దేమిటను బాసి చన దరి
భూమీపతిసంతమసత బుద్ధిఁ దలంపన్.
583
క.
ఈమహిశుమీఁద సుజన
స్తోమములఁ బోలె ...శుద్ధములై యా (?)
సామమునఁ జేయుకార్యము
లేమిట మఱి వికృతిఁ బొంద వెన్నఁడు నరయన్.
584
క.
ఇన్నిటికంటెను దా మును
మున్ను నిగూఢప్రకారమున దండమునన్
బన్ని మఱి సామముఖమున
సన్నాహము సేయవలయు శౌర్యోన్నతుఁడై.
585
క.
అతులితబలనృపుఁ డైనను
నతిరయమున భేదసాధ్యుఁ డగుఁ గావున నీ
క్షితిజయముఁ గోరినను భూ
పతి భేదము సేయవలయుఁ బాయక యతనిన్.
612
గీ.
ధరణి నవిరోధకృన్మంత్పతంత్రతతులు
గడు సువృత్తసుహృద్వ్యక్తికంబు లయ్యు
సరయ నించుక లోభేద మగుటఁ జేసి
బంధనప్రాప్తములు గావె పాయ కెపుడు.
613
ఆ.
సామదానములఁ బ్రశాంతిఁ బొందని శత్రు
నందు వలయుభేద మొందఁజేయ
భేదమునన యెట్టి పృథుసత్త్వుఁ డైనను
బొల్లయై నశించిపోవుఁ గాన.
614
క.
బలముల గిరులను గపటం
బులచెలుముల భిన్నమంత్రములఁ గార్యములన్
లలినొక్కశబ్దమాత్రన
పెలుచన కడుఁగాతరుండు భేదం బొందున్.
615
క.
వాయువు దూఱని చోటును
దోయజబాంధవుని రశ్మి దూఱని చోటున్
ధీయుతులబుద్ధి దూఱు ని
రాయాసంబును గార్య మగుఁ దుద్బుద్ధిన్.
718
క.
ధారుణి నెయ్యది యైన వి
చారము వెలిగాఁగఁ దొడరి సాహసకృత్యం
బూరక యెవ్వఁడు చేయును
నారయ వాఁ డొందు నపజయంబును నెపుడున్.
719
క.
ఆతతరథకరితురగప
దాతిసమూహములచేత దారుణశస్త్ర
వ్రాతముచేత నసాధ్యము
లై తక్కినయవియు బుద్ధి కగు సాధ్యంబుల్.
720
క.
హితులును బటుశాస్త్రజ్ఞులు
నతిచతురులు నమలమతులు నగువారియస
మ్మతమునఁ జేసిన కార్యము
హితములు గానేర వందు రెన్నఁడు పిదపన్.
721
క.
తెలిపి యుపాయాపాయం
బులవలనను బెద్దకాలమునకును మఱిరాఁ
గలమేలును గీడును మన
సుల కప్పుడె తోఁప బుధులు సూపుదు రరయన్.
722
క.
తనకంటెను ధీమంతుని
యనుమతమునఁ జేయవలయు నలవడ నరుఁ డే
పనులైన నట్టిపనులని
కనుఁగొన మఱి హాని రావు కావున జగతిన్.
723
ఉ.
అప్పటికిన్ వినన్ విషములైనను మీఁదను దామసంబుగాఁ
జెప్పెడివారుఁ జెప్ప విని చేయఁగనోపెడువారుఁ బెద్దయుం
జెప్పఁగ లేరు విలసిల్లుప్రియంబుల నంతకంత నె
ల్లప్పుడుఁ జెప్పువారలు ననంతమురాకలఁ జెప్పనేటికిన్.
730
ఆ.
అర్థిఁ దీపు లైన యాహారములు గొను
టయును దెరువు నడచుటయును నిద్ర
నొందుటయును గార్య మూహించుటయుఁ జాల
నిక్క మొక్కరునకు నీతి గాదు.
732
క.
ఎనయ శుభాశుభఫలమున
కనయము విశ్రమముఁ బ్రోపు నగు మిత్రుండై
వనజజుఁ డిట్లు సృజించు నె
యనుపమమిత్రాక్షద్వయ మను నమృతమున్.
739
క.
మిత్రుం డర్థముఁ బ్రాణక
ళత్రములకు సిగ్గు మదిఁ దలంపక మును నా
మిత్రుండు మాట మాత్రమె
మిత్రత్వము దలఁచిచూడ మిత్రనిధానా.
740
క.
చెలువార మిత్రసంపద
గలవారి కసాధ్య మొకఁడు గల దనఁ గలదే
తలఁప నిది గాన పురుషుఁడు
చెలుములు సజ్జనులతోడఁ జేయఁగవలయున్.
741
క.
కుడుచుట కుడువఁగఁబెట్టుట
యడిగిన నిడు టడిగికొనుట యంతఃస్థం బే
ర్పడ నెఱుఁగుట యెఱిఁగించుట
కడుమైత్రికి లక్షణములు గనుగొన నాఱన్.
742
క.
పెనులేమియైన విడువమి
యును గుహ్యము సెప్పుటయును నొకయాపద పొం
దినయప్పు డడ్డుపడుటయు
మనమునఁ దలపోయఁ బరమమైత్రికి ఫలముల్.
743
ఆ.
ఒకతల్లి కొప్ప నుదయంబుఁ బొందిన
బాంధవంబుకంటె బహుగుణముల
వసుధ నెన్ని చూడ వాగ్జాతబాంధవం
బధిక మండ్రు చూవె యార్యులెల్ల.
744
ఆ.
ఆతురమున కైన యాతఁడె చుట్టంబు
నరసి ప్రోవఁజాలు నతఁడు తండ్రి
అరయ నమ్మ మెలఁగు నతఁడె మిత్రుఁడు తన
మదికిఁ బ్రియము సేయు నదియె తల్లి.
745
క.
ఆపదలు వచ్చి పొందిన
నోపికమైఁ బరఁగు మిత్రుఁ డొక్కఁడె తక్కన్
బ్రా పగుదు రున్నవారను
నీపలుకు వినంగఁ జెవుల కింపిద మగునే.
746
క.
పరిపూర్ణుఁ డయ్యుఁ బురుషుఁడు
పరమసుహృత్తులన యాసపడవలయు మదిన్
బరిపూర్ణుఁ డయ్యు నంబుధి
పరగఁగ శశిపొడుపు నాసపడఁడే యెపుడున్.
747
ఆ.
ఎవ్వఁడైన నొక్క యెడరు పుట్టినయప్పు
డైనవాఁడె మిత్రుఁ డరసిచూడ
నేచియున్న యప్పు డెవ్వారు నేటికి
శత్రుఁ డైన నపుడు మిత్రుఁ డగును.
748
ఆ.
అధికశోక మొదవి యానంద మైనను
నిష్టజనునిఁ జూచు నెప్పు డెవ్వఁ
డతని కెల్ల దుఃఖ మది క్రొత్తయేకాని
మాననేర దెట్టివారి కైన.
749
ఆ.
అర్థి నేలికకును నఱలేని సఖునకు
వలయు నంగనకును వరభటునకుఁ
జెప్పవలయు మఱుగు సేయక యెట్లైన
మాను నెట్టి దుఃఖ మైనఁ బిదప.
750
క.
చెలిచుట్టంబు లడంగిన
నొలసినతఱి బుద్ధిమంతుఁ డొకమార్గమునన్
దొలఁగింపకున్న నాతఁడు
బలుపాపము నొందు మనువు పలు కిది మొదలన్.
752
క.
పని వడియ తానె వచ్చినఁ
గనుకొని పెడమొగము వెట్టు కష్టుని గేహం
బునకు మఱి పోవు మర్త్యుం
డెనయఁగ శృంగములు లేని యె ద్దనఁగఁదగున్.
753
క.
గొనమొండె దోసమొండెను
నొనరం గని రెంటియందు నొక్కఁడు సేయన్
గనఁజాలని నరునింటికిఁ
జనుగంటెను నొండురోఁత జగమునఁ గలదే.
754
ఆ.
ఉల్ల మెఱుఁగనీని కల్లరితోఁ జేయు
మైత్రికంటె మేలు మర్కటంబు
తోడనైనఁ బాముతోనైనఁ బెబ్బులి
తోన చేయవచ్చుఁగాని తుదకు.
755
ఉ.
శ్రీగలవానిఁ బేదయుఁ బ్రసిద్ధపతివ్రతఁ జెడ్డయింతియున్
జాగిని వజ్రలోభియు సుజాతి విజాతియు ధర్మనిర్మలో
ద్యోగిని బాపకర్ముఁడును నొప్పెడువానిఁ గురూపుఁడున్ విశే
షాగమవేది మూర్ఖుఁ జెడనాడుచు నుండుట నీతినైజముల్.
765
క.
ధనమును సైన్యము మిక్కిలి
తనకుం గలయపుడ వలయు దండోద్యోగం
బొనరింప నట్ల సేనా
ధనబలునకుఁ గలుగు సకలధాత్రీతలమున్.
768
క.
తనసత్త్వము రిపుసత్త్వము
మనమునఁ దర్కించి శత్రుమర్మజ్ఞులుఁ దా
నును జెనకఁ జనిన విజయ
మ్మును నరు దిట తనదుదేశమును గోల్పోవున్.
782
ఆ.
ఒనర ఘనునిఁ జంపు నుత్సాహశక్తిసం
పన్నుఁ డైనవాఁడు సన్నమైనఁ
గడఁగి యలఁతియైన కంఠీరవం బేచి
దొడ్డయైనగజముఁ ద్రుంచినట్లు.
786
చ.
అతులబలాఢ్యుఁ డైననరుఁ డాఱడిదేశము కేఁగియున్ స్వదే
శముననపోలె నొప్పి మను శాతనఖంబులశక్తియై యర
ణ్యములకు నేఁగినం దివిరి యచ్చటిసింహము కుంభికుంభమాం
సమ తినుఁగాక యాఁకొనిన చక్కటిఁ బూరికి నఱ్ఱు సాదునే.
787
ఉ.
దైవవశంబునం గలుగు దండ మవగ్రహతీవ్రరోగపీ
డావలి యెట్టి దేశమునైనను గాలబలాపకృష్టమై
కేవల మట్టివేళఁ బరికించుచు నల్పకుఁ డేల దండయా
త్రావిదుఁ డైన గెల్వఁడె యరణ్యసురక్షిత దేశమేనియున్.
788
క.
తనచేతఁగాని కా దను
పనికిం బ్రతినిధిగ నన్యుఁ బనిచిననుం దీ
రునె యౌషధంబుమా ఱిది
యని మూల్యం బిడిన రోగ మరుగుట గలదే.
789
మ.
ఘనబాహాబలుఁ డైన శాత్రవునిపైఁ
గార్తిక్యచైత్రంబులన్
జను టొప్పు న్మఱిదాడివోవ నెపుడైన న్మేలు శత్రుండు దా
ననయంబునన్ వ్యసనం బొకంటఁ బడ యుద్ధాసక్తిమై నున్కిఁదా
వినునే నత్తఱి భేదమందు హతుఁ గావింపన్ దగున్ జయ్యనన్.
792
చ.
నగరము లంక దుర్గము ఘనం బన నొప్పు త్రికూటశైల మ
య్యగడిత వార్ధి యోధులు సురారులు శ్రీలు కుబేరుపెన్నిధుల్
నెగడిన నీతిశాస్త్రములు నిచ్చలుఁ జెప్పెడివాఁడు శుక్రుఁ డీ
జగమున నట్టి రావణుఁడుఁ జచ్చెన కాక మనంగ నేర్చెనే.
883
మ.
చెలువం బేది యరణ్యవాసగతులై శ్రీరాముఁడున్ బాండవే
యులు చేబొందిరి వృష్టివీరు లురుదైత్యుం డైన లంకేశుఁడుం
గలఁగె న్మర్త్యులచే నలంగె నలుఁ డీకష్టంపురాజ్యంబుకై
తలపోయం గడుదుఃఖహేతు విది వ్యర్థం బొప్ప దాసింపఁగన్.
884
క.
ఆరాజ్యమునకు రాజులు
ధారుణిలోఁ దండ్రి నన్నఁ దమ్ముని సుతులన్
దారు వధింతురు గావున
దూరమునన యడఁగి చూచి తొలఁగఁగవలయున్.
885
ఉ.
మానుగ శత్రునైన నభిమానము సేయక
చొచ్చివాఁడు దన్
హీనము గాఁగఁ బల్కిన సహించుచుఁ బ్రాజ్ఞుఁడు శక్తియుక్తియున్
గానఁబడంగనీక పొసఁగం ధృతిపెంపును గప్పికొంచు నిం
పూనఁగ వారి గెల్వవలయుం దనకార్యము లైనయంతకున్.
894
క.
బలవంతునైన నాతని
బలమది మానవుల మిగులఁ బ్రకటింపమియుం
దలఁప శమీకాష్ఠములోఁ
గలదను ననలంబువోలెఁ గైకొన రెందున్.
898
క.
బలమును గుణమును శీలముఁ
జలమును సత్త్వంబు సాహసంబును ధృతియున్
గలుగని పురుషుని నవనీ
స్థలిలోపలఁ దృణము గాఁగఁ దలఁతురు మనుజుల్.
899
ఆ.
తలఁచి చూడ రిపుఁడు తనకంటె ఘనుఁడైనఁ
దనరఁ దన్ను దాఁచికొనఁగవలయు
వానికంటె ఘనుఁడు తానైన మరి శర
జ్జలజరిపుఁడుబొలె వెలుఁగవలయు.
901
క.
కోపించి రిపుఁడు రిపునకు
రూపింపక తొలఁగు టతనిఁ ద్రుంచుటమీఁదన్
ఏపారగ్రుంగి సింహం బేపున
మదగజముఁ జంప నెగసినమాడ్కిన్.
902
క.
చేరువకు భూరిబలుఁ డగు
వైరిమహీనాథుఁ డెత్తివచ్చిన నైనం
ధీరత యప్పుడ డింపని
భూరమణుని కాడొకండు వొందకయుండున్.
903
క.
పగతుప్రతాపము గనుగొని
మగటిమి దెగఁదునిమి పుచ్చు మనుజేశుఁడు దాఁ
దగరపుఁదొడవునుబోలెను
జగమునఁ బూజ్యుండు గాక చను నెల్లెడలన్.
904
ఆ.
పగఱపయి నొకండు పాటించి నడవంగ
వెఱచి తనదునెలవు విడుచు నెవ్వఁ
డతని కారణమున నతనిఁ గాంచిన తల్లి
వంధ్య యనఁగఁబడు ధ్రువంబుసుమ్ము.
905
క.
హీనునకు ఘనునిచేఁ గీ
డైనను దేజంబు సమదహస్తికి నగముల్
మానుఁగఁ గోరాడం దగ
గాని యగుం గొమ్మలేమి యది యొచ్చెంబే.
906
ఆ.
హీనుఁ డధికుచేత నీల్గుట యొచ్చెమే
మహితయశము కాక మదముకొఱకు
గండతటము ద్రొక్కి గజకర్ణహతిఁ దేఁటి
యీల్గెనేని యొచ్చె మేమి గల్గు.
907
క.
ఘనమును గడుహీనంబును
ననఁగలదె కరీంద్రుఁ డెంత హరి యెంతి కరిన్
దునుమాడును హరిశాబము
ఘనమేటికి మనసు పెద్ద గలవారలకున్.
908
క.
నిర్విషము చేసి పడగన్
దర్వీకరములకుఁ జూప దా కావున దో
ర్గర్వంబులేనివానికి
నుర్విం బెను విషయమైన నొక్కటి వలయున్.
909
క.
కపటపులేఖలఁ బంపియు
విపులార్థచయంబు లెపుడు వెదఁజల్లియుఁ ద
ద్రిపుపక్షముఖ్యపురుషులఁ
గుపితుల దమసొమ్ముచేసికొనఁదగు వేగన్.
910
క.
ఘనుఁ డెత్తి వచ్చి విడిసిన
తన కోటయె హీనుఁ డెలమి తగుసుహృదుల రాఁ
బనిచిన యుక్తం బగువా
రును దానును దోల నదియుఁ గ్రొవ్వియ చచ్చున్.
912
మ.
తనకున్ గెల్వఁగరానిపక్షమున వే తా వైరిఁ బోకార్చఁగా
ఘనశత్రుం దలపెట్టఁగావలయు వేగం బొప్ప నీతిజ్ఞుఁ డె
ట్లనినన్ వాఁడును బోరఁగా నిహతుఁ డౌ నట్లైన నప్పిమ్మటన్
దనవైరంబు నడంగదయ్యె దొడలుండన్ ......కున్ సైన్యముల్.
913
ఆ.
ఒలియుఁ డగుశత్రుచేతనఁ బలియుఁ డనఁగఁ
బేర్చుశత్రునిఁ బచ్చి వైపింపవలయు
మూలనాశంబుగాఁ దన్ను మోవకుండఁ
బెలుచ ములుముంటఁ బుచ్చి వైపించినట్లు.
914
క.
పొగడఁదగుసహజసత్త్వుం
డగు నెవ్వఁడు వాఁడు వొలియఁ డహితులచేతన్
జగతిమణిదీపశిఖ కడు
నిగుడుం గా కడఁగిపోవునే పెనుగాలిన్.
915
చ.
విను మును నీతియుం గలదు వేయును నేటికి దర్ప మేర్పడన్
అని యొనరింపఁ గావలయు నారగ నుత్తమునందు సామమున్
బెనుపఁగ శూరునందుఁ గడుభేదము నల్పునియందు దానమున్
విను సమునందుఁ బౌరుషము నేర్పునఁ జేసిన జాల మే లగున్.
917
చ.
హరుమెడ నున్నసర్పము గణాధిపునెల్క గ్రసింపఁజూచు న
య్యురగము ద్రుంప షణ్ముఖమయూరము సూచు గజాస్యుఁ జంప నా
గిరిసుతవాహనం బయిన కేసరి చూచు నటేల యిమ్మహే
శ్వరుపరివార మిట్లనినఁ గన్గొన నన్యులు మాననేర్తురే.
924
క.
నెఱబిరు దొకండు నిలిచిన
బిఱుకులు నఱుముదురు వాని బిరుసున కని సు
క్కఱి యొకఁడు విఱిగెనేనియుఁ
బఱిపఱియై సేనయెల్ల భంగము నొందున్.
928
ఆ.
సింహవృత్తిఁ దాల్చి చేకొనవలయుఁ దా
సద్వివేకనృపతి శత్రులక్ష్మి
నధికదుర్వినీత లగు కామినులఁ గచ
గ్రహణ మమరఁ జేసి కవసినట్లు.
939
క.
ధీయుతులమాట లప్పుడ
సేయక మోహమునఁ దడవు సేయునతఁడు దా
నాయెడ దా శేరకుగతి
వేయును జెప్పంగ నేల వేగమె పొలియున్.
958
ఉ.
గండతలంబులం బెలుచఁ గ్రమ్ములసన్మదవారికై యశుల్
పిం డరుదెంచి యంటి కడుఁ బ్రేమబలాయతమూర్తు లయ్యు వే
దండవిభు ల్సహించి తమదర్పము సూపక చూచినట్ల హీ
నుం డగువాని కల్గునె ఘనుండు దలంప ధరాతలంబునన్.
962
క.
కులగిరులు పెఱుకు సత్త్వము
గల పురుషుఁడు తృణముఁ బెఱుకఁగడఁగునె మదిలోఁ
దలపోయ నట్లపోలెను బలహీనున
కరుగఁజొరఁడు ప్రబలుం డెపుడున్.
963
ఆ.
అరుల బలుని నబలుఁ డనిలోన నలిగినఁ
జేట కాని యొకటిఁ జేయలేఁడు
సనగగింజ పెటిలి చనుఁగాక మంగలం
బనియఁ జేయఁగలదె యరయ నెందు.
964
గీ.
వఱలుమైత్రివివాహోత్సవమ్ము సేయ
సిరులు నెఱుకలు సమమైన పురుషు లెవ్వ
రరయ వారికిఁ దమలోన నమరుఁగాని
మునులకును నీచులకుఁ బొందు గలుగదెందు.
965
గీ.
కదియ నోరికి దళమైన కడియ కాని
వెగ్గలము గొన గ్రుడ్డులు వెలికి నుఱుకు
కాన యభియాతిజయకాముఁ డైనవాఁడు
చేత నయ్యెడుపని గాని చేయవలదు.
966
ఆ.
ఎదిరివాని సత్త్వ మెఱుఁగక పైఁబడి
సీయదగదు గాక చేసెనేని
నతఁడు గీడువొందు నల టిట్టిభముచేత
నబ్ధి గీడు వొంది నట్ల వోలె.
967
క.
మ్రుచ్చిలుటయుఁ బాతకముగ
మ్రుచ్చిలమియు ధర్మముగను మున్నుపదేశం
బిచ్చిరి పూర్వమునీంద్రులు
మ్రుచ్చిలకుండునది యెరుల మొల్లములు జనుల్.
968
క.
ధనమునకు బ్రాణ మమ్ములు
ధనమునకేఁ బ్రాణ మీగి దలఁప జనులకున్
ధనమది ప్రాణుల ప్రాణము
ధరహారిత ప్రాణహారితకుఁ దక్కువయే.
969
క.
ప్రాణిదయఁ జేసి చోరుని
ప్రాణములకుఁ దెగని భూమిపతి కాజ్ఞలచేఁ
బ్రాణులనేకులు విగత
ప్రాణులుగాఁ జూచునది కృపాభావమొకో.
970
క.
ఖలునొకని జంపమియె సా
ధులఁ బలువురఁ జంపినట్ల దొర కొనినను గ్రో
ల్పులిఁ జంపసునికి చాలదె
చలమున గోసమితి వేఱ చంపఁగ నేలా.
971
క.
భూవరుఁడు కూర్మి గలిగినఁ
బ్రోవందగు జనవుగలిగి భూప్రజకహితో
ద్భావియగు మ్రుచ్చు గావం
గా వచ్చినవాని మ్రుచ్చుగాఁ దలఁపఁ దగున్.
972
ఆ.
అబలుఁ డైనఁ జిక్కఁ డతిబలుచేతను
నెదిరి కెపుడు మర్మ మీనివాఁడు
మర్మ మిచ్చెనేని మదియెంత బలవంతుఁ
డైనఁ జిక్కునొక్క యబలు చేత.
973
ఆ.
దేవగురుని బోలు ధీమంతుఁ డైనను
వేగ మొరుల వలదు విశ్వసింప
విమల యశము సుఖము విత్తంబు వృద్ధియు
వర్ణనీయ జయము పడయువాఁడు.
974
క.
అమరులకైనను విశ్వా
సము వెలిగాఁ జెఱుపరాదు శత్రులవిశ్వా
సముననకాదే దితి గ
ర్భము శక్రుఁడు సొచ్చివ్రచ్చి పాఱఁగవైచెన్.
975
ఆ.
పగతుఁడైన నపుడు భయమంది యింటికి
నేఁగు దెంచునప్పుడెవ్వఁ డతనిఁ
జులుకఁ జంపఁజూచు సొలవక తత్పాత
కంబు బ్రహ్మఘాతుకంబు సమము.
976
క.
పలుకులు తేనియతేటలు
దలపడి మును చేసికొను మతంబున శత్రున్
జలము గొని చెఱుపఁగడుఁదగు
నలసితిమిది మిగుల కఠిన మనక నయాఢ్యున్.
977
క.
తనకార్యం బగునంతకు
గొనగొని తాఁగానియట్ల కూడి మతిం గీ
డొనరింపవలయుఁ బరునికి
వనమునఁ జతురకుఁడు వోవె వలనేర్పడఁగన్.
978
ఆ.
నయము మీఱవాక్కు నవనీతసదృశంబు
మానసంబు ఱాసమంబు చేసి
కొని చరింపవలయు ననయంబు దనశత్రు
కుల మడంచు నంతకును నెఱింగి.
979
క.
నమ్మకచేసిననైనను
నమ్మంగావలవ దహితు నయమార్గజ్ఞుల్
నమ్మించెననుచు వృత్రుఁడు
నమ్మిక దాఁ బొలిసె నాకనాయకుచేతన్.
980
ఆ.
దేవగురుని బోలు ధీమంతుఁడైనను
నమ్మవలవ దహితు నమ్మవల
దతులయశము మిగుల నాయువువృద్ధియు
భూరిసౌఖ్యములును గోరువారు.
981
క.
అలఁతియగు తెఱపిగనినను
నలవడ భేదించి చొచ్చునల్లన పిదపన్
జెలువుగని చెఱుచు శత్రుఁడు
పొలుపగు వృక్షమును వారిపూరముపోలెన్.
982
క.
గురుమత మెవ్వరి నమ్మమి
పరమాప్తుల గూడి సేత భార్గవుమత మి
ద్ధర విష్ణుశర్మ మతమిది
గురుదిరమతి సేనదీర్చుకొని యరిఁదగులన్.
983
క.
మునుమున్ను ప్రీతితోడన్
జని లోపలఁ డొచ్చి పిదప సకలంబునుఁ జై
కొనుదాన శత్రుఁ డల్లన
చనుబో జారాంగనలకు జారుఁడు పోలెన్.
984
ఆ.
ఎదిరి వాని కులము హృదయంబు బలమును
ముట్ట నెఱిగి కొనక మున్ను మున్ను
చెలిమి సేయఁ జనదు చేసిననొప్పదీ
పలుకు దేవగురుని పలుకు సుమ్ము.
985
గీ.
జగతిలోపల వేదపారగుల చేత
బ్రహ్మహత్యాది దుస్తరపాపములకుఁ
దలఁచిచూడంగ నిష్కృతిఁ గలుగుగాని
వినుము నిష్కృతియనఁ గృతఘ్నునికి లేదు.
986
క.
విను మెవ్వఁడేని తనుని
చ్చిన వానికిఁ బిదపఁ గీడు సేయునతఁడు స
చ్చినయప్పు డతని మాంసము
గని కాకము నైన రోయుఁ గబళింపంగన్.
987
ఆ.
యానపానభోజనాసనశయనంబు
లందు రంధ్ర మొక్కటైనఁ దెలియఁ
గనిననైనఁ జొచ్చి కడతేర్చు నదిగాన
వైరియొద్దివాని వలదు నమ్మ.
988