Jump to content

పంచతంత్రము (దూబగుంట నారాయణ)/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

వేంకటనాథకవి

ఇమ్మహాకవి పంచతంత్రమును బద్యకావ్యమునుగా రచించి మిగులఁ గీర్తిని జేకొన్న మహనీయుడు. ఇతనియింటి పేరు బైచరాజువారు. ఇతనితాతతాత బైచభూపాలుఁడు. ఇందుచేతనే యీతని కీయింటిపేరు గల్గెనని తోఁచుచున్నది. ఇవ్విషయమునే పంచతంత్రమున,

"ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుఁడు బైచనృపాలుఁ డద్ధరి
శ్రీరమణీమనోహరుని తీవ్రయశస్స్రుతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్."

ఈబెచరాజుకుమారుఁడు తిరురులధరణీనాథుఁడు. ఇతనికుమారుఁడు వీరభద్రరాజు. ఇతనికిఁ బుత్రు లిరువురు. లింగభూపాలుఁడు, పర్వతరాజు. ఈపర్వతరాజునకుఁ బుట్టిన మువ్వురుకుమారులో నగ్రజుఁడే యీవేంకటనాథమహాకవి. ఇక్కారణముననే యీతనిఁ బర్వతరాజకుమారవేంకటనాథుఁ డనియు నందురు. పై పద్యమునుబట్టియే యీతఁడు క్షత్రియకులావతంసుఁడని తెల్లమగుచున్నది. ఈకవీశ్వరుఁడు తన్నుగుఱించి,

‘‘అసహాయసరసకవితా, రసికుఁడ వేంకటధరావరప్రభుఁడ గుణ
ప్రసవప్రకాండమదవ, ద్భసలాయితవిద్వదఖిలబంధువ్రజుఁడన్."

అని తనపాండిత్యగరిమంబును బేరుకొనియున్నాఁడు.

కవికాలము, దేశము నిర్ణయించుటలో గొప్పచిక్కు గలదు. పూర్వపుఁగవులు తమగ్రంథములలోఁ దమకాలమును దేశమును జక్కఁగాఁ జెప్పుకొనువారు కారు. అట్లు చెప్పియుండినచోఁ బీఠికాలేఖకుల యూహలకును జర్చలకును నెడము లేకుండెడిది. ఐనను నీతనికాలమును గుఱించి 'బ్రౌన్ దొరవారు' తరునిఘంటువునందు క్రీ॥శ॥ 1500 సంవత్సరప్రాంతమువాఁడని వ్రాసి యున్నారు. కాఁబట్టి యీకాలమునకుఁ బ్రమాణేతరము లగుపడువఱ కియ్యదియే యని నిర్ధారణ చేయక తప్పదు. ఇదియునున్గాక వేంకటనాథుఁడు దాను బూర్వకవులను స్తుతించుచు,

"హృదయ బ్రహ్మరథం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు
త్సదనాస్థానికిఁ దెత్తు మానసనభస్సంచారిఁ గావింతు హృ
ద్విదితక్షీరసముద్రఖేలనమునం దేలింతు నుత్కృష్టవ
స్తుదులం బ్రాజ్ఞుల దిక్కయజ్వ నమరేశు న్సోము శ్రీనాథునిన్.”

అని శ్రీనాథుని పేర్కొనియుండుటచే నీతఁడు 1450-వ సంవత్సరమునకుఁ బూర్వపువాఁడు కాఁడని స్పష్ట మగుచున్నది. మఱియును నీతఁడు తన జ్యేష్ఠపితృవ్యునిఁ గూర్చి చెప్పుచు, 'కుమారలింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు' అని చెప్పియున్నందునఁ గవి హిందువులకును మహమ్మదీయులకును యుద్ధములు జరుగుచున్న సమయంబున నుండు నని యేర్పడుచున్నది.

ఇతఁడు కవులందఱివలెనే దనకుఁ బ్రబంధరచనాకాలంబున భగవంతుఁడు స్వప్నంబున సాక్షాత్కరించినట్లు చెప్పియున్నాఁడు. ఇయ్యది పూర్వకాలంబునుండి యాచారముగ వచ్చుచున్నది. ఇందలి సత్యాసత్యంబు లప్పరమేశ్వరుఁడే యెఱుంగు.

ఈతఁడు తనకృతియగు నీపంచతంత్రంబును స్వప్నంబున సాక్షాత్కరించిన హరిహరదేవున కంకిత మిచ్చినాఁడు. తద్విషయంబును, నాహరిహరనాథునియందలి భక్తిపారవశ్యంబును,

"ఏ చనవు గలదు హరిహర, సాచిద్యము నొంద నన్యజనులకు మది నా
లోచింపఁ దిక్కయజ్వకు, నాచనసోమునకు మరియు నాకుం దప్పన్."

అని చక్కఁగ వక్కాణించెను. ఇక్కారణంబుననే యీతఁడు నెల్లూరిమండలనివాసిగా నుండనోపునని యూహింపవలసి యున్నది. కవి తా నేగుండలమువాఁ డైన నేమి యెందుఁ బుట్టిన నేమి యెందుఁ గిట్టిన నేమి యెందు జీవనంబు గడపిన నేమి తనపాండిత్యముచేఁ గీర్తిని గడించినఁ జాలును.

కవితామాధుర్యంబుచే శిరంబు లూపించినఁ జాలు. అతఁడు భారతభూమి నలంకరించిన వాఁడే యగు. ఈవిషయ మింతటితో విరమించి యితనికవిత్వముయొక్క ఫక్కిని గుఱించి కొంచె మాలోచింపవలయును.

ఇతనికవిత్వములో లక్షణవిరుద్ధములగు ప్రయోగము లున్నవనియు, నందుచేతనే లక్షణకర్త లుదాహరణముగా నీతనికృతిఁ గొనకపోయి రనియు నందురు. ఈలక్షణవిరుద్ధప్రయోగము లెల్లగ్రంథంబులయందును గన్పడుచున్నని కాని యవి కొందఱియదృష్టంబుఁ బట్టి సాధువులుగను గొందఱిదౌర్భాగ్యముంబట్టి యసాధువులుగను సాధింపఁబడుచున్నవి. ఇతఁ డీపంచతంత్రంబును సంస్కృతమునకు భాషాంతరీకరణమువలెఁ గాక ప్రబంధశైలిలో వ్రాసినాఁడు. కవిత్వ మెట్లుండవలయునో యీతఁడే యీ పంచతంత్రమున,

"ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢము గాక ద్రావిడీ
స్తనగతిఁ దేట గాక యరచాటగు నాంధ్రవభూటిచొక్కపుం
జనుగవఁ బోలి తేటయును జాటుతనంబరు లేకయుండఁ జె
ప్పిన యదె పో కవిత్వ మనిపించు పగిం చటుగాక యుండినన్."

అనుపద్యముచేఁ జెప్పి యున్నాఁడు. తిలకింపుఁడీ!

కావ్యంబున నొక్కొక్కఁ డొక్కయిక్క నరయుచుండును. 'భిన్నరుచి ర్హి లోకః' అనునట్లు లోకంబునఁ బలువురు పలువిధంబు లగు రుచులు గలిగియుందుకు. దీనినే యీ వేంకటనాథుఁడు,

సీ.

"ఒకఁ డలంకారంబునకు వేడుక వహించు నొకఁడు వార్తాసమృద్ధికిఁ జెలంగు
నొకఁడు శబ్దస్ఫూర్తులకు మాయురే యను నొకఁ డర్థసృష్టికి నుత్సహించు
నొకఁడు రసాభోగతకు మస్తముఁ గదల్బు నొకఁ డుపమానచర్చికకు నలరు
నొకఁడు పదప్రౌఢిమకు నిచ్చలో మెచ్చు నొళఁడు జాతిశ్లాఘ కుబ్బుచుండుఁ


తే.

గామి చందానఁ దలవరి కరణి బధిరు, వలె దరిద్రునిగతి వాది పరిదిఁ గనక
కారు చాడ్పునఁ బరగు వైఖరిఁ గుజాతి, జాడ నిందఱి ముదలింపఁ జాలు టెట్లు.”

అని చాటియున్నాఁడు. 'అవిదితగుణాపి సత్కవిభణితిః కర్ణేషు వమతి మధుధారామ్' అన్నట్లు చవిఁ గొనుఁ డీపద్యమునందలి మాధుర్యము!

ఎట్టివానికృతియందును దప్పులుండక పోవు. ఉండినంతనే వానికృతికిఁగాని యాతనికిఁ గాని కళంక మాపాదింపరాదు. గుణపరీక్షణము చేయవలయుఁ గదా? రసపుష్టిఁ గనుగొనవలయుఁ గదా? దీనినే యీతఁడు,

"ఒప్పులు గలకృతిలో నొక, తప్పున్నను గడమ గాదు దానికిఁ గళలం
జొప్పడు శశికిఁ గళంకము, కప్పేర్పడి యేమి నిందఁ గావించె నొకో."

అని వక్కాణించె.

ఇతఁడు కృతిని రాజుల కిచ్చునభిప్రాయమందు విముఖుఁడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామమూర్తి కంకితమిచ్చి కీర్తిఁ గాంచిన బమ్మెర పోతనామాత్యునియనువునను, బీఠికాపురీకుక్కుటేశ్వరున కర్పించి తనకృతుల వాసి నొందిన కూచిమంచి తిమ్మకవివడువునను, మఱియు భగవదర్పణ మొనరించిన మహాకవులజాడ ననుసరించియే యీతఁడును రాజాంకితమునుగుఱించి,

"అతికుటుంబరక్షణాపేక్షఁ బ్రాల్మాలి, కృతులు మూఢభూమిపతుల కిచ్చి
చచ్చి నిరయమునకుఁ జనుకంటె హరిహరా, ర్పణముఁ జేసి సుగతిఁ బడయరాదె."

అని ఘోషించి యున్నాడు, చూచితిరే యీతని దైవభక్తి!!!

ఈపంచతంత్రమునే దూబగుంట నారాయణామాత్యుండును దెనిఁగించె. పద్యములలో భావసామ్య ముండకమానదు. కథ యొకటియే కదా? నారాయణామాత్యుఁడు సులభశైలిని వ్రాసినాఁడు. కాని యందుసైతము లక్షణవిశుద్ధములగు ప్రయోగములు లేకపోలేదు. వేంకటనాథుఁడుమాత్రము తాను గవిత్వ మెట్లుండవలయునని యొప్పఁజెప్పెనో యా చొప్పుఁ దప్పించక తగినచోటులం దనువయిన వర్ణనములను జేర్చి రచించినాఁడు. ప్రబంధమునం దుండఁదగిన వర్ణనములన్నియు నెట్టకేలకుఁ గల్పించి రసపోషణముఁ జేసి వాసిఁ గాంచినాఁడు. ఐనను లక్షణవిరుద్ధములగు ప్రయోగము లందందుఁ జూపట్టుచున్నవి. వానినెల్ల నిట వ్రాయఁబూనలేదు. 'ఱోటి కొక్కపాట, నోటి కొక్కమాట 'యనుసామెత మనకుఁ జిరపరిచితంబు కాదే. అట్లే సామాన్యముగఁ బాఠభేదముచే లక్షణవిరుద్ధములగు ప్రయోగములును గలిగియుండునని యూహింపవచ్చును. ఈదోషములను గృతికర్తనెత్తిపై వైచుట ధర్మమార్గమని యేరైన నెన్నఁబూనుకొనరని నానమ్మకము.

హంసవింశతికర్తయగు అయ్యలరాజు నారాయణామాత్యునివలె నీతఁడును స్వభావవర్ణనములం గడునేర్పున నలవరించి యున్నాఁడు. కొన్నింటి నీక్రింద నుదాహరించెద. గ్రంథమునందే తిలకింపనగు నని పాఠకమహాశయుల వేఁడెద.

స్వభావవర్ణనములు

పుట

పద్యము

వేసంగి

58

577

గొల్లచాన

59

586

హేమంతము

69

677

వేఁట

99

196

చోరుఁడు

122

199

సిద్ధుఁడు

151

101

వనము

196

522

ఇట్టి వెన్నియేని కాననగు. ఉదాహరింపఁ బూనిన గ్రంథమంతయు నెన్నవలసి యుండును.

ఈతఁడు శబ్దాలంకారంబులఁ గూర్చుటయందు మిక్కిలిప్రియుఁడు. అందం దనేకపద్యములఁ గాననగు. అయినను గొన్నింటిని దెలిపెద.

శబ్దాలంకారములు

పుట

పద్యము

6

100

17

123

87

70

69

676

114

119

140

380

ఈ గ్రంథము నీతులకుఁ బుట్టినిల్లని వేఱ చెప్పనేల? నీతులను బొందుపఱచి వ్రాసిన పద్యములఁ గొన్నింటి నుదాహరింప మన స్సువ్విళ్లూరుచున్నది. కాంచుఁ డీకవిమహిమము!

"పురుషవిశేషలీల విరిబోఁడియు వాలు విపంచి శాస్త్రమున్
దురగము వాణియు న్నరుఁడు దొడ్డతనంబు వహింతు రట్ల కా
పురుషవిశేషలీల విరిబోఁడియు వాలు విపంచి శాస్త్రముం
దురగము వాణియు న్నరుఁడు దొడ్డతనంబు వహింప రుర్వరన్."

ప్రథమాశ్వాసము

"గజ మంటినట్ల యడఁచు, న్భుజగము మూర్కొనినయట్ల పొరిగొను ధరణీ
భుజుఁడు నగినట్ల చంపుం, గుజనుఁడు మన్నించునట్ల కొను బ్రాణంబుల్."

మనుజుఁ డెన్నండును స్వతంత్రుడు కాడు. భగవంతుం డేయేకాలమున నెట్టి త్రిప్పులం ద్రిప్పునో యట్లు తప్పక యనుభవింపవలయు ననుట కీమహాకవి యెట్లు కథాంశములను వాగ్రుచ్చెనో కనుఁగొనుఁడు.

సీ.

"ఘనరూపనిధి యనంగునకా యనంగత్వ? ముచితమే బలి కహివ్యూహవసతి?
పాండునందనునకా బహుకాలవనవాస? మిభపురాధిపునకా యేటిచొరవ?
యదుకులాధ్యక్షునకా శాపమరణంబు? జాహ్నవీసుతునకా శస్త్రశయ్య?
నలరాజుకా మహానసపాకభజనంబు? నహుషునకా ఘోరనాగమూర్తి?


తే.

మఱి త్రిశంకునకా పచ్చిమాలతనము?, ద్రుపదనందనకా రాచతొత్తుపాటు?
మనుజుఁ డెవ్వఁడు కర్మస్వతంత్రుఁ డరయఁ, నీశ్వరుఁడు గాక సమకూర్ప నిట్టిపనులు."

ఇందుఁగల యైతిహ్యముల నెట్లు జతకూర్చెనో.

ఇట్లే నీతులుగల పద్యములును, గంఠపాఠము జేసి పలుమారులు ప్రస్తావనావశంబునఁ జదువుకొనఁదగిన పద్యము లనేకము లున్నవి. అక్కడక్కడఁ బన్యములలో సామెతలనుగూడ నిమిడించి యున్నాఁడు. భాషయందుఁ బాండిత్యము లోకమునఁ గలిగింపవలెనన్న సామాన్యముగఁ బ్రచారములో నున్నమాటలనే యుపయోగించుచు గ్రంథములను వ్రాయుట యుచిత మనువారికెల్లరకు వందనసహస్రంబులు. గ్రొత్తపదంబులును సమాసచాతుర్యంబులును, నలంకారవిశేషంబులును భాష కలంకారప్రాయంబు లని యెన్ని గ్రంథజాలంబులను రచించి మహాకవిపండితులు లోకంబున భాషను బోషింతురుగాక యని నాయూహ.

ఇం దెందైన లోపంబు లుండక మానవు. 'ప్రమాదో ధీమతా మపి' యనువాక్యంబును దమమనంబున నిడి పరిశీలించి దోషంబులఁ బోఁ ద్రోచి గుణగణంబుల గ్రహింతు రని భాషాభిమానుల నెల్లరను వేఁడుచున్నాఁడను.

ఇట్లు విన్నవించు,
పండితాఖండలమండలపాదసేవకుఁడు,
కావ్యతీర్థ. కవిభూషణ జనమంచి వేంకటసుబ్రహ్మణ్యశర్మ,
సహాయాంధ్రపండితుఁడు, మునిసిపల్ హైస్కూలు, కడప.