పంచతంత్రము (దూబగుంట నారాయణ)/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచతంత్రము

సుహృల్లాభము

క.

శ్రీ రమణీమణిహారవి, హారాంకితబాహుమధ్య యానతి వైరి
క్ష్మారమణభరణకరుణా, పారంగత తమ్మవిభునిబసవకుమారా.

1


వ.

అవధరింపు మక్కుమారులు సుహృల్లాభం బనియెడుద్వితీయతంత్రం బెఱిగింపు
మనిన విష్ణుశర్మ యిట్లనియె.

2


గీ.

సాధనంబులు నర్థసంచయము లేక, బుద్ధిమంతులు తమలోనఁ బొందు చేసి
వలయుకార్యంబు లొనరింపఁ దలఁతు రెందుఁ గాక కచ్ఛప మృగ మూషికములరీతి.

3


వ.

అది యెట్లంటేని.

4


సీ.

మహికి నలంకారమండనం బై యొప్పు, మహిలాపురప్రాంతగహనభూమిఁ
బొలుపొందుశాల్మలీభూజంబుపై లఘు, పతనుఁ డన్ వాయసపతి వసించు
నమ్మహీజముక్రింది కంతట లుబ్ధకుఁ, డరుగుదెంచినఁ గాక మాత్మఁ దలఁకి
దండధరప్రతిముండు వీఁ డిచటికి, నేమి కారణమున నేఁగుదెంచె


గీ.

నుండఁ గొఱగాదు దుర్జనుఁ డున్నచోట,నట్టు గాకయు నా కింటి కరుగవలయు
నిచటఁ బ్రొద్దయ్యె నిలువంగ నేల యనుచుఁ, జూచుచుండంగ నాచెట్టుచుట్టుఁ దిరుగ.

5


క.

వల వైచి క్రింద ధ్యానం, బలికి నిగూఢంబు గాఁగ నవ్వలిపొదలో
దల దూఱిచి దృఢదృష్టిం, దొలఁగక కనుఁగొనుచు నుండ దూరమునందున్.

6


క.

కనుఁగొని చిత్రగ్రీవుం, డనఁ బరఁగకపోతభర్త యాధాన్యములం
దిన మనసు పెట్టి తనబల, మును దానును వాలి జాలమునఁ దగులుటయున్.

7


వ.

ఇట్లు కాలపాశబద్ధుండునుంబోలెఁ జిత్రగ్రీవుండు సపరివారంబుగా నవ్వలం
దగులువడినం జూచి ప్రహరోత్కర్షంబునం బొదలి లుబ్ధకుండు కదియం జను
నంతకుమున్న చిత్రగ్రీవుం డనుచరవర్గంబున కిట్లనియె.

8


సీ.

ఉదరాగ్నిబాధల నొడ లెఱుంగమిఁ జేసి, తడఁబడఁ బడితి మిందఱము వలను
మనకు నాపద దీర్ప మఱి యెవ్వ రున్నారు వెలయ నేఁ జెప్పెడు వెరవు వినుఁడు
పురుడించి మన మొక్కపూఁపున వల యెత్తి, గగనభాగమునకు నెగసి చనిన
నిప్పు డీయొప్పమి దప్పు నవ్వలఁ బోవ, వల పాయుటకు నొండువలను గలుగు

గీ.

ననిన నట్లకాక యనుచుఁ గపోతంబు, లద్భుతంబు గాఁగ నాకసమున
కడరి వలను గొనుచు నరిగెఁ గ్రవ్యాదుండు, దుఃఖితుండు విస్మితుండు నగుచు.

9


వ.

తనలో నిట్లని విచారించె.

10


చ.

వలఁ బడి చిక్కుటొండె వల వ్రచ్చుకపోవుటయొండెఁ గాక ప
క్షులు వల గొంచు భారమునకుం దలఁ కొందక యంబరంబునన్
గలఁగక పాఱు టిట్లు వెనుకం గనుఁగొన్నది లేదు చిత్ర మీ
పులుఁగులు నేల వ్రాలఁ గని పోయి హరించెద నంచుఁ జూడఁగన్.

11


వ.

ఆసమయంబున శాల్మలీవృక్షగతం బగువాయసం బధికక్షుత్పిపాసాపరవశంబై
యుండియు నయ్యాశ్చర్యంబు చూచువేడుక నాకపోతంబుల వెనుకం బఱచు
లుబ్ధకుండునుఁ గపోతంబులచెంత భూతలగతుండై యతిత్వరితగమనం
బునం బఱచి యవియు దృష్టిగోచరంబులు గాక దూరం బరిగిన నిట్టూర్పు నిగిడిం
చుచు నిజనివాసంబునకుం జనియె నట చని చని చిత్రగ్రీవుం డనుచరవర్గంబున
కిట్లనియె.

12


క.

నాచెలికాఁడు హిరణ్యకుఁ, డీచేరువ నుండు నెపుడు నిటఁ దా మనపైఁ
దోఁచినదుర్దశ మాన్సన్, జూచు నతఁడు నన్నుఁ దెలియఁ జూచినమాత్రన్.

13


వ.

అనఁ గపోతంబు లట్లకాక యని హిరణ్యకుం డనుమూషికంబుబిలంబు గదియ
డిగ్గినఁ జిత్రగ్రీవుండు తనవదనంబు బిలద్వారంబునం జొనిపి హిరణ్యకా నేను
నీసఖుఁడఁ జిత్రగ్రీవుండ న న్నెఱుంగవలయు ననినఁ దద్వచనంబు లాకర్ణించి
సంభ్రమంబున బిలంబు వెడలి పరిగతుం డగు చెలికాని నత్యాదరంబునఁ గౌఁగి
లించుకొని దుఃఖితుం డై యిట్లనియె.

14


క.

మిగుల వివేకివి నీకుం, దగ నెగ్గులు చేసెనే విధాతృం డనినన్
నగుచును జిత్రగ్రీవుఁడు, తగునే యెఱిఁగియును నడుగఁ దత్వజ్ఞనిధీ.

15


వ.

ఎఱింగియు న న్నడిగితివి గాన విను మని యిట్లనియె.

16


ఉ.

ఎచ్చట నేనిమి త్తమున నేపని యెవ్వనివంక నెప్పు డౌ
నచ్చట నానిమిత్తమున నాపని యాతనివంక నప్పుడౌ
నచ్చుగ మర్త్యకోటికి శుభాశుభనిర్మితకర్మజాలముల్
దెచ్చి విధాత కాలముంగతిం గదియించుఁ దలంక నేటికిన్.

17


వ.

అనిన విని హిరణ్యకుండు విచారింపక పలికితిం గాని నీ చెప్పినట్ల యగుం దప్ప దని
యిట్లనియె.

18

గీ.

నూటపదియోజనంబులపాటి నెగసి, యవనిఁ బక్షులు పొడగాంచు నామిషంబు
కాలసంప్రాప్త మైనచోఁ గానలేవు, పాశబంధంబు లేమి చెప్పంగవలయు.

19


క.

గ్రహపీడ చంద్రసూర్యుల, కహిగజవిహగముల కుగ్ర మగు బంధనముల్
బహుమతికి దరిద్రత్వము, విహితంబుగఁ జేసినట్టివిధి నేమందున్.

20


చ.

అరుదుగఁ జేరరానిగహనాబ్ధులఁ గ్రుమ్మరు నాఖగాండజో
త్కరములుఁ జిక్కుఁ బెన్వలలఁ గానవు దుర్నయసచ్చరిత్రవి
స్ఫురణముఁ దెల్వి స్థానబలమున్ మఱి యెయ్యది యౌఁ గదా క్రియా
పరుఁ డవుచున్ గ్రహించు విధి ప్రాణుల దవ్వులఁ గేలు సాఁచుచున్.

21


చ.

ఒరులకుఁ గీడు సేయక పరోపకృతిం జరియించుసజ్జనుం
బొరిఁ బొరిఁ బొందు నాపదలు భూరిసుఖం బగు దోషకారికిన్
సరవి యెఱింగి చేయఁడు నిజంబుగఁ జూచి విధాత పూర్వజ
న్మరచితపుణ్యపాపములమార్గనిరూఢతఁ గాని నెచ్చెలీ.

22


వ.

అని యిట్లు హిరణ్యకుండు పలికి తనమిత్రుం డగుచిత్రగ్రీవున్ బంధనిర్ముక్తుం జేయం
దలంచి కదిసినం జూచి చిత్రగ్రీవుం డిట్లనియె.

23


క.

పరిజనబంధచ్ఛేదము, వెరవునఁ గావించి పిదప విడిపింపు ననున్
బరివారము నరయనినృప, వరునకు నెక్కడిది రాజ్యవైభవ మెందున్.

24


వ.

అని యిట్లు పలికినచిత్రగ్రీవువచనంబులకుఁ బ్రియం బంది హిరణ్యకుం డిట్లనియె.

25


క.

నీనిర్మలగుణసంపద, నీనడవడి నీక యొప్పు నినుఁ గొనియాడం
గా నాకు శక్య మగునే, భూనుతగుణ నిన్నుఁ బోల్పఁ బురుషుఁడు గలఁడే.

26


గీ.

వాలి భూలోక మంతయు నేలఁ జాలు, నధికపుణ్యుండ వని కొనియాడి యతని
పరిజనంబుల నిర్బంధభార ముడిపి, పిదపఁ దత్స్వామి విడిచి సంప్రీతితోడ.

27


గీ.

విందు పెట్టి యనుప వేడ్క నాతఁడు వోవ, నాసాహిరణ్యకుండు నరుగఁ జూచి
లలి నెఱింగి యపుడు లఘుపతనుం డను, వాయసంబు గదిసి వాని కనియె.

28


గీ.

ఓహిరణ్యక సఖుని ని ట్లూఱడించి, బంధనిర్ముక్తునిఁగఁ జేసి పంపఁ జూచి
సౌఖ్యకర మైననీతోడిసఖ్యమునకుఁ, గాంక్ష చేసితి న న్నట్ల గారవింపు.

29


గీ.

శాల్మలీవృక్షగతుఁడనై సంచరింతుఁ, బ్రీతి లఘుపతనుం డనుపేరువాఁడఁ
గాకు లెల్లను నాభృత్యగణము గాఁగఁ, బనులు గొందును సామ్రాజ్యపదవి నొంది.

30


వ.

అనిన హిరణ్యకుం డతనితోడ నీకును నాకును మైత్రి యెట్లు గూడ నేర్చు విను
మని యిట్లనియె.

31

గీ.

ఎవరి కెవ్వరి కేభంగి నెట్లు పొసఁగు, నట్టివారికి మైత్రి దా నమరుఁ గాక
నాశరీరంబు నీకు నన్నంబు నీవు, భోక్త వటు గానఁ జెలిమికిఁ బొందు గాదు.

32


వ.

 అనిన విని లఘుపతనుం డిట్లనియె.

33


క.

నీదేహము నా కశనము, గా దో పుణ్యాత్మ యిట్టికష్టుఁడ నే
మ్మేదినిఁ జిత్రగ్రీవుని, నీదగు సఖ్యంబువోలె నెఱపుము నెమ్మిన్.

34


క.

రోయక నిను భక్షించిన, నాయాఁకలి దీఱఁ జాలునా యనుమానం
బీయెడ వల దిటు చేకొన, నాయము నన్నుం గపోతనాయకు భంగిన్.

35


క.

ఎందును దిర్యగ్జంతువు, లందును దగు సమయనిశ్చయంబును హితముం
బొందుపడుట దృష్టం బిది, వింద వయినవినుఁ గపోతవిభునిం జూడన్.

36


వ.

అని లఘుపతనుండు మఱియు నిట్లనియె.

37


ఉ.

ఓర్వక దుర్జనుండు కఠినోక్తుల సజ్జనుఁ బల్కె నేని ని
గ్గర్వుఁడు గాని యాతఁడు విచారము నొందఁ డొకింతయేని తా
నౌర్వశిఖిం గలంగనిమహాబ్ధిజలంబు తృణాగ్ని వైచినన్
దుర్వహదుఃఖభార మయి తోడనె తాపముఁ బొంద నేర్చునే.

38


వ.

అనిన హిరణ్యకుం డిట్లనియె.

39


గీ.

చపలమతివి నీవు చాల నమ్మినవారి, నెలమిఁ బ్రోచుశక్తి యెట్లు గలుగుఁ
జంచలుండు చెఱుచు సకలకార్యంబులు, గాన నీకు నాకుఁ గాదు పొందు.

40


వ.

అనిన లఘుపతనుం డిట్లనియె.

41


ఉ.

ఏ నటువంటివాఁడ నని యీవిరసోక్తులు పల్క నేటికిన్
మానుము లోనిశంక బహుమానపురస్సర మైనమిత్త్రసం
ధాన మవశ్యకార్యముగఁ దత్పరతం దగఁ జేయు నాయెడం
గాని గుణంబు లెన్నకు మొకానొకవేళను నోహిరణ్యకా.

42


వ.

అనిన నతం డిట్లనియె.

43


గీ.

నీకు నాకును శాత్రవనియతధర్మ, మైననడవడి వర్తిల్లు నాత్మయందుఁ
గల్మషము లేని మైత్త్రి దాఁ గలుగు టెట్టు, గానఁ జెప్పంగ నదియు యుక్తంబు గాదు.

44


గీ.

బుద్ధిమంతుఁ డైన పురుషుండు దనశత్రు, హితుఁ డటంచుఁ జేర నిచ్చి చెడును
దప్తజలముచేతఁ దడిసినయగ్ని దా, హీన మగుచు శమితమైన కరణి.

45


వ.

అని మఱియును.

46


క.

విను శక్య మైన కార్యము, చనుఁ జేయ నశక్య మైనఁ జనునే చేయన్
వననిధిపై శకటంబును, నొనరంగా మిట్టనేల నోడయుఁ జనునే.

47

చ.

మిగుల హితుండు నావలన మేలునుఁ బొందె నితండు నాయెడం
దెగఁ డని ధూర్తు నమ్మి చెడుఁ దెల్లమి సజ్జనశబ్దమాత్రమే
నెగడును గాని యిప్పు డవనిన్ సుజనుం డనువానిఁ గాన ని
మ్ముగ ధనలేశమాత్రమున మోహనిబద్ధము లోక మంతయున్.

48


ఉ.

చాలఁగ నిష్టుఁ డంచు నను శౌర్యమహోద్యమకార్యజాలముల్
మేలుగఁ జేయు నంచును సమీపము పాయక యుండు నట్టి దు
శ్ళీలుని వర్తనం బెఱిఁగి చేరఁగ నిచ్చినఁ జేటు వచ్చు మ
ర్త్యాలికి నంకమధ్యభుజగాంకితసుప్తునిఁ బోల్ప బిట్టుగన్.

49


క.

సనిదానంబున శత్రుఁడు, ననుకూలత లేనినిజకులాంగనమనువున్
వినయంబు లేని మనుజుల, మనుగడ యాసన్నకాలమరణము లెందున్.

50


క.

కర్కశరిపునెడఁ దొలఁగక, మార్కొనఁ దగు సంధి చేసి మఱి కదిసినచోఁ
దార్కొను నతనికి మృత్యువు, కర్కటి గర్భంబు చేతఁ గ్రాఁగినభంగిన్.

51


క.

ఏదోషంబులు నతనికి, నాదిం జేయుటయ కల్గ దని క్రూరాత్ముం
గాదు గదియంగఁ బలుకఁ బ్ప, మాదము మతిమంతు లైనమనుజుల కెల్లన్.

52


వ.

అని యిట్లు హిరణ్యకుండు పలికిన లఘుపతనుం డిట్లనియె.

53


క.

నీనీతివాక్యపద్ధతు, లే నన్నియు వింటి నీకు నిష్టునిఁగా న
న్నీ నెఱిఁ గైకొనకుండిన, నే నశనము దొఱఁగి దేహ మిచ్చట విడుతున్.

54


వ.

అని మఱియును.

55


చ.

కరఁగిన నెల్లలోహములు గ్రక్కునఁ గూడు నిమిత్తమాత్రమై
జరగుటఁ జేసి పక్షిమృగసంతతి గూడు భయంబు లోభమున్
బరఁగుటఁ జేసి మూర్ఖు సులభంబుగఁ గూడు గుణాఢ్యు లైన స
త్పురుషులు సూచినంతటనె పొం దొనరింతురు పో హిరణ్యకా.

56


గీ.

మంటికడవఁబోలె మఱి దుర్జనస్నేహ, మధికశీఘ్రముననె హత్తు విరియుఁ
గనకకలశభాతి గలసజ్జనస్నేహ, మొదవుఁ బగులఁ బడక పదిల మగును.

57


వ.

అని యిట్లు లఘుపతనుండు పలికిన హిరణ్యకుం డిట్లనియె.

58


క.

నే నీకు నెంత చెప్పినఁ, గానిమ్మన కెల్లభంగిఁ గావలె ననుచుం
బూనితి నాయెడ మైత్త్రికి, నేనుం దగ నియ్యకొంటి నెంతయు వేడ్కన్.

59


మ.

ఉపకారం బొకవంకఁ జేయుటయుఁ దా నూహింప సన్మైత్త్రియే
యపకారం బొకవంకఁ జేయుటయుఁ దా నబ్భంగి శత్రుత్వమే

నెప మొక్కింతయు లేనివర్తనము లున్మేషింప మేల్గీళ్ల న
చ్చపువాత్సల్యము ద్వేషముం గలుగుటల్ సౌహార్దశత్రుత్వముల్.

60


వ.

అనుచు నివ్విధంబున నన్యోన్యసంభాషణంబుల నత్యంతస్నేహంబులు నిగుడ నఖమాం
సంబులుం బోలి దుర్భేద్యంబు లగునంతఃకరణంబులం గలసి కూడి మెలంగు నంత
హిరణ్యకుండు తనగృహంబున స్వేచ్ఛావిహారం బొసంగి లఘుపతను వీడ్కొల్పిన
నతండునుం దనమందిరంబునకుం జని యప్పుటప్పటికి మహాగహనంబునకుం బోయి
సింహశరభశార్దూలాదులచేతం జచ్చినమృగంబులమాంసంబులు దెచ్చి హిరణ్యకునకుఁ బె
ట్టి తాను నుపయోగించుచున్నఁ గొంతకాలంబునకు నొక్కనాఁడు హిరణ్యకుం జూ
చి లఘుపతనుఁ డిట్లనియె.

61


ఉ.

ఉండితి నీకడన్ విడువ నోపక యివ్విపినంబులోన నేఁ
డొండొకకాన కేఁగవలయున్ ననుఁ బంపుము చక్రవాకకా
రండవరాజహంసబకరాజవిహారవిరాజమాన మై
యుండు సరోవరం బచట నుండును నా చెలికాఁడు నిచ్చలున్.

62


ఉ.

ఆతఁడు మిత్త్రమందరసమాఖ్యమునం బొగ డొందుకచ్ఛపం
బీతఱి నేను బోవఁ బ్రియ మేర్పడ వేగమె తెచ్చి పెట్టు నా
నాతనువర్ణమీనముల నాదు శరీరము వృద్ధిఁ బొందు ప్రే
మాతిశయంబు గానఁబడునట్లుగఁ బాయఁగ రానిచుట్టమై.

63


వ.

అనిన విని హిరణ్యకుం డిట్లనియె.

64


గీ.

నిన్నుఁ బాసి నిలువ నేర నీతోడన, వత్తుఁ గొంచుఁ బొమ్ము వాయసేంద్ర
ప్రాప్త మైనదుఃఖభరము దేశాంతర, గమనుఁ డైనఁ గాని క్రాఁగ దెందు.

65


వ.

అని పలుక లఘుపతనం డదరిపడి నాతోడ నిన్నిదినంబు లెన్నఁడుం జెప్పవు సుఃఖ
ప్రాప్తి యగుటకుఁ గతం బేమి యని యడిగిన హిరణ్యకుండు నాతెఱంగంతయు
నచ్చటఁ దేటపడ వివరింపం దెలియుదువు గాని నన్నుఁ దోడ్కొని పొమ్మనిన నతం
డట్ల కాక యని చంచూపుటంబునం గబళించి గగనభాగంబున నమ్మూషికంబుఁ
గొని చని వాయసంబు దాను ము న్నరుగ నుద్యోగించినసరోవరతీరంబునఁ బెట్టి నిలి
చినసమయంబున.

66


ఉ.

ఎన్నఁడు రానిచుట్ట మిదె యిచ్చటికిం జనుదెంచె భాగ్యసం
పన్నుఁడ నైతి నంచు జలమధ్యము వెల్వడి యర్హసత్క్రియల్
గ్రన్నన నాచరించి చెలికానిఁ గనుంగొని కూర్మనాథుఁ డో
యన్న మహాత్మ మూషికము నారసి యెచ్చటనుండి తెచ్చితో.

67

వ.

అనిన మిత్త్రమందరునకు లఘుపతనుం డిట్లనియె.

68


చ.

ఇతఁడు హిరణ్యకుం డనఁగ నిమ్మహి మూషికభర్త నాకు సం
తతమును నెయ్యుఁడై తిరుగు దైవకృతంబునఁ దీవ్రదుర్దశన్
ధృతి చెడి నిల్వలేక చనుదెంచెను నీపొడ గాన నీతనిన్
జతురభవద్వచోవిభవసంపద శోకము మాన్పు నాకుఁగాన్.

69


గీ.

విను సహస్రముఖముల వేలు పొండెఁ, దెలిసి నాలుగుముఖములదేవుఁ డొండె
సురగురుం డొండె నితనివిశుద్ధగుణము, లెన్న నోపుదు రున్నవా రెన్నలేరు.

70


గీ.

చెలిమి గలకాల మెల్లను జెఱుప కునికి, క్రోధ మాప్రొద్దె శీఘ్రంబె కూడి విడుట
యీగి నిస్సంగుఁడునుబోలె నిచ్చి చనుట, యివి మహాత్ములగుణములై యెన్నఁబడును.

71


వ.

అని మఱియుఁ జిత్రగ్రీవోపాఖ్యానంలు మొదలుకొని హిరణ్యకునిగుణకథనంబు
లమ్మహాత్తుమునికిం దేటపడం జెప్పి నాకంటె నీ వితని నీకు నిష్టసఖునింగాఁ బరిగ్ర
హింపు మని యతని కప్పగించిన నాశ్చర్యచిత్తుండై మిశ్రమందరుండు హిరణ్యకున
కిట్లనియె.

72


గీ.

అనఘ యింతదూర మనక నిర్జన మైన, వనము చొచ్చి నన్నుఁ గనుట కిచట
నేమికార్య మనిన నెఱిఁగింతు విను మని, యతఁడు చెప్పఁ దొడఁగె నతనితోడ.

73


సీ.

ఒకయూరిలోపల నొర పైన మఠ మెప్పు, నందుఁ జూడాకర్ణుఁ డనఁగఁ బరఁగు
సన్న్యాసి బ్రాహ్మణసదనంబులకుఁ జని, యెత్తినభిక్షతో నేఁగుదెంచి
మఠములోనికిఁ దెచ్చి మానుగా భుజియించి, శేషాన్న మొకపాత్రఁ జిందకుండ
నచ్చోట నిడి నిద్ర నందిన నాతని, ప్రియసఖుం డగుబృహస్ఫిగుఁడు వచ్చి


గీ.

నిద్ర దెలిపి యతని నెఱయ నే వినుచుండఁ, బుణ్యకథలచేతఁ బ్రొద్దు గడప
వినుచు నతఁడు నన్ను వెఱపించుకొఱకు నై, గిలుక లున్న వెదురు కేలఁ బట్టి.

74


గీ.

అప్పటప్పటి కాకోల చప్పుడించి, నన్నుఁ దనభిక్షపాత్రయం నాటఁ జూడఁ
గథలు చెప్పెడునాతండు గనలు నిగుడ, నేమి చెప్పితి నిందాఁక నేమి వింటి.

75


వ.

ఏకాగ్రచిత్తుండవు గామికిఁ గతం బేమి యనినఁ జూడాకర్ణుం డాబృహస్ఫిగున కిట్ల
నియె నాచిత్తంబు నీవు చెప్పెడుకథలమీఁద సావధానంబు గామి నిజంబు
నీవు నక్కథ యెట్లొ యెఱింగితి వదె యొక్కమూషికంబు నామఠంబున వసియించి
నాభిక్షాపాత్రంబునం గలయన్నం బొక్కింత గన్నుమూసినసమయంబున నంతయుఁ
దిని పోవ నేనును నమ్మూషికాపకారంబునకు నీమఠంబు విడిచి పోవం గలవాఁడనై
యున్నవాఁడ ననిన బృహస్ఫిగుం డిట్లనియె నీమఠంబున వసియంచినమూషికం

బొకటియొ బహుమూషకంబు లున్నవో యనినఁ బెక్కు లే వొక్కటియే యనిన నతం
డొకమూషికం బీమఠంబున వసియించుటకుఁ గారణంబు గలుగవలయు నెట్లంటేని.

76


గీ.

శాండలీమాత యనునట్టిచంద్రవదన, నువ్వుఁబప్పుకు సరి చేరునువ్వు లడుగ
నెఱయ విప్రుండు కారణ మెఱిఁగినట్లు, మూషికం బున్నకారణమును నెఱుంగు.

77


వ.

అనిన నత్తెఱం గెఱింగింపు మనినఁ జూడాకర్ణునకు బృహస్ఫిగుం డిట్లనియె.

78


మ.

విను మే నొక్కధరామరేంద్రుగృహ మ న్వేషించి భిక్షింపఁ గాఁ
జని యున్నంతట నింటిబ్రాహ్మణుఁడు విస్పష్టంబుగా నింతితో
వనజాతాయతనేత్ర రేపటియమావాస్య న్మహీదేవభో
జనకార్యంబున కేమి గూర్చితివి వాత్సల్యంబునం జెప్పుమా.

79


వ.

అనిన బ్రాహ్మణి దనపురుషు నీక్షించి యిట్లనియె.

80


క.

తన నేర్పుకొలఁదిఁ బురుషుం డనువున ద్రవ్యములు గూర్చి యవి దెచ్చినచో
వనితలు పాకక్రియలకు, నొనరింతురు నీవు దేక యున్నవె చెపుమా.

81


వ.

అనిన నమ్మహీదేవుం డమ్మగువం గోపించి యిట్లనియె.

82


క.

తగుసంచయంబు వలయుం, దగ దతిసంచయము సేయుతలఁ పెవ్వరికిన్
మృగధూర్తం బతికాంక్షను, మగువా మును వింటిచేత ముడియుట వినవే.

83


చ.

అనుటయుఁ గాంత తత్కథ ప్రియంబునఁ జెప్పుఁ డనంగ బ్రాహ్మణుం
డనియెఁ గిరాతుఁ డొక్కఁడు గృహంబుననుండి ఫలోపజీవి యౌ
టను వనభూమి కేఁగి యొకఠావున నొక్కమృగంబుఁ జంపి చే
కొని చనుదెంచుచోఁ గనియెఁ గోలము నీలకుభృద్విశాలమున్.

84


వ.

కనుంగొని యాత్మగతంబున.

85


క.

ఇది నాకు దైవ మిచ్చిన, యది యని తనమూఁపువేఁట నటు పెట్టి శిత
ప్రదరంబు దొడిగి యేసిన, నది వాని వధించి తాను నవ్వలఁ ద్రెళ్లెన్.

86


క.

అంత నొకనక్క యామిష, చింతం జరియించుచుండి చేరువఁ గని య
త్యంతముదంబునఁ బొంగుచు, నెంతయు భాగ్యమున నబ్బె నిది నా కనుచున్.

87


గీ.

దాఁటు నూలపెట్టుఁ దలఁకు దిక్కులు సూఁచుఁ, దోఁక నులుచుఁ గడియఁ దొడఁగుఁ దొలఁగు
మోఁది చేర నరుగు మూక్కొనుఁ దార్కొనుఁ, గాలు ద్రవ్వు నిసుము కలయఁ జల్లు.

88


వ.

ఇవ్విధంబున ననేకప్రకారంబుల నాదద్రుకనామధేయం జగుమృగధూర్తంబు
పెన్నిధానంబుఁ గన్న పేదయుంబోలె నత్యంతసంతుష్టాంతరంగంబునఁ దనలో
నిట్లని వితర్కించె.

89


గీ.

బోయ నొకనాఁడు భక్షింతు భూరిమృగము, సూకరంబును రెన్నాళ్లక్షుధకు విడుతుఁ
బట్టి యూరక యివి గంటి పెట్ట నేల, నేఁటి కీనారి దగు వేయు నేటి కనుచు.

90

ఉ.

గ్రక్కునఁ జేరి నక్క తమకంబునఁ జచ్చినబోయయొద్ద ము
న్నెక్కిడియున్న వింటిగుణ మిమ్ముగఁ దాఁ గొఱుకంగ దానికొ
మ్మక్కునఁ దాఁకి తీవ్రముగ నవ్వల వెళ్లినఁ గూలెఁ గావునన్
మిక్కిలి లోభి యైనతఁడు మీఁదటికార్యముఁ గాన నేర్చునే.

91


క.

మిక్కిలిగఁ గూడఁబెట్టక, తక్కక ధనసంచయంబు తగుమాత్రముగా
జొక్కముగఁ జేయకుండిన, నక్కాంతకు బ్రతుకు గలదె యంబుజనేత్రా.

92


క.

అనునతనిమాట కాసతి, వినయంబునఁ బలికె నేను వెఱ్ఱినె కాలం
బునఁ దిలతండులముల దాఁ, చినదానం బులగ మేను జేసెద ననుచున్.

93


ఉ.

ఆమరునాఁడు రేపకడ నాతిల లెల్లను దంచి ముంగిటన్
దామరసాక్షి యెండ నిడి తా గృహకృత్యము దీర్చుచున్నచో
నేమఱియున్న నయ్యెడకు నేపునఁ గుక్కుట మేఁగుదెంచి యు
ద్దామత నువ్వు లచ్చటఁ బదంబులఁ జల్లిన విప్రుఁ డిట్లనున్.

94


క.

విను కామాంధకి యాతిల, లనయము గొఱగావు బ్రాహ్మణార్థముకొఱకున్
గొనిపోయి మార్చి తెమ్మని, పనిచినఁ జని పొరుగంటింట భాషించుతఱిన్.

95


గీ.

ఇంటిగృహమేధి యచటికి నేఁగుదెంచి, యేమి బేరము నాడెద వింతి యనిన
నువ్వుఁబప్పు నా కిచ్చి నే నువ్వు లీయ, మాటలాడెద ననిన నామాట కతఁడు.

96


క.

చేనువ్వులకుం గడిగిన, యీనువ్వుల నిచ్చువార లెందును గలరే
మానిని దీనికిఁ గత మే, దేనిం గలుగంగవలయు నిమ్ముగఁ దలపన్.

97


వ.

అనుమాట లంతకమున్న భిక్షాన్నంబునకున్ బోయి నేను వింటి నిమ్మూషికం
బును గారణంబు లేక యొంటి నిచ్చట వసియింప నేర దని బృహస్ఫిగుండు చూడా
కర్ణునకుఁ జెప్పిన నతండు.

98


క.

తనభిక్షాన్న మశంకం, గని నిచ్చలు నొంటి నరిగి గర్వోద్రేకం
బున నొలసి మీఁ దెఱుంగక, తినియెడియా కారణంబు తెలిసినవాఁడై.

99


గీ.

పాఁడికొయ్యను నాయున్నవలను క్రొచ్చి, పెద్దకాలంబునను గూడఁబెట్టినట్టి,
ప్రోదిధన మెల్లఁ గన్గొని పుచ్చుకొనియెఁ, గఠినహృదయుఁ డై యతఁ డదిగాన నేను.

100


క.

ధనహీనుఁ డైననాకుం, దనుశక్తియుఁ బౌరుషంబుఁ దఱగినకతనన్
విను మాహారముమాత్రం, బును దొరకించుటకు వెరవు పుట్టక యున్నన్.

101


వ.

అయ్యతీశ్వరునిభిక్షాపాత్రం బెట్టకేలకుఁ గదల్చు నన్ను గనుంగొని యదల్చు
చూడాకర్ణుం గాంచి.

102

క.

ఘనధన మంతయుఁ గైకొ, న్నను భిక్షాపాత్ర దివియ నడయాడుచు నే
నును నల్లనల్ల వెనుకకుఁ, జనఁ దొడఁగఁగ భిక్షుకుండు చతురత ననియెన్.

103


క.

ధనవంతుఁడె బలవంతుఁడు, ధనవంతుఁడె యోగ్యుఁ డరయఁ దా నధికం బ
య్యును ధనహీనత నెలు కిది, తనజాతిం గూడెఁ బాపతాపముపేర్మిన్.

104


వ.

అని మఱియును.

105


ఉ.

భూరిదరిద్రుఁడున్ మిగుల బుద్ధివిహీనుఁడు నైనమానవున్
జేరవు మంచికార్యములు చెప్పఁగ నేటికి వాని దైవసం
సారముఁ జెప్పఁ జూపఁగ నసార మగున్ దలపోసి చూడ ని
స్సారపుమండువేసవిని సన్నపువాహిను లింకుకైవడిన్.

106


క.

కలవాఁడె చెలులు చుట్టలు, కలవాఁ డగు నతఁడు బుద్ధి గలవాఁడు నగున్
లలి నతఁడె లోకపూజ్యుఁడు, బలవంతుఁడు నతఁడె వంశపావనుఁ డెందున్.

107


క.

పరదేశమె నిజదేశము, పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్
ధరణి నసాధ్యం బెయ్యది, పరమార్ధము ధనము సూవె ప్రజలకు నెల్లన్.

108


క.

కులసతి రోయును జుట్టం, బులు వాయుదు రొరులు కష్టపుంబలుకుల ని
మ్ముల నాడఁదొడఁగుచుందురు, కలియుగమున ద్రవ్యహీనుఁ గలకాలంబున్.

109


క.

మృతి నొందినజను నైనను, హితు లెల్లను డాయుదురు మహీస్థలిలోనన్
మతిఁ దలఁపఁ బేదఁ జేరరు, బతిమాలిన నైన సఖులు బంధులు నెపుడున్.

110


ఉ.

చుట్టము లేని దేశమును సూనుఁడు లేనినికేతనంబునున్
జెట్టతనంబు మూర్ఖజనచిత్తము శూన్యము లంతకంటె నే
పట్టున నెల్లవారు గనుపట్టక హీనదశం జరించుచో
నెట్టన సర్వశూన్యుఁ డని నిందితుఁ డయ్యె దరిద్రుఁ డెంతయున్.

111


చ.

అమరు నిరాకులేంద్రియము లన్నియు నప్రతిమానబుద్ధియున్
బ్రముదితవాక్యపద్ధతియుఁ బాయక తొల్లిటివే మనుష్యుఁ డ
ర్థముఁ బెడఁబాసెనేనియును దప్పదు మున్నిటినామ మైనఁ జి
త్రము క్షణమాత్ర రూపు వికృతం బగు వానికి ఘోరభంగి యై.

112


వ.

అది నిమిత్తంబుగా నే నచ్చట నుండ నొల్లక యొండొక్కచోటికిం బోదుఁగా
కేమి నే నొక్కని నడుగంజాల నెట్లనిన నడిగెడువాఁడు జీవన్మృతుం డట్టివాని
తెఱంగు విను మని యిట్లనియె.

113


చ.

వడువఁగఁ దొట్రుపా టొదవు నాలుక యాడదు మాటలాడఁగాఁ
దొడఁగిన నీరెలుంగు వడుఁ దొల్లిటిపొంకము డొంకి దేహమున్

వడఁకు భయంబు గ్రమ్మి దురవస్థలఁ దల్లడ మందు వేఁడుచోఁ
జెడు గగు నర్థికిన్ మరణచిహ్నము లన్నియుఁ దోచు నారయన్.

114


గీ.

అర్థహీనుఁ డై యుండెడునంతకంటె, వహ్నిలోపలఁ దగ మేను వైచు టొప్పు
యాచకుఁడు వేఁడ నీలేనియధమలోభి, జన్మ మేటికి వానిసంసార మేల.

115


సీ.

వఱలు దారిద్య్రంబువలన సిగ్గు జనించు, సిగ్గున సత్యంబు శిథిల మవును
సత్యహీనుఁడు తిరస్కారదూషితుఁ డగుఁ, బరిభవయుక్తి నన్నరుఁడు బెగడు
బెగడినవాఁడు నెవ్వగలచే దురటిల్లు, నధికదుఃఖితుబుద్ధి యడఁగిపోవు
బుద్ధిహీనుండును బొడ వడంగును వేగఁ, బొడ వడంగినఁ గీర్తి యడఁగు ధాత్రి


గీ.

నట్లు గావున నిర్ధనుం డైనవాఁడు, బహువిధంబులు నీ చెప్పఁబడినయట్టి
యాపదల కెల్ల మూలమై యార్తిఁ బొందు, నెవ్విధంబున నతఁ డెన్న నీడు గాఁడు.

116


వ.

అని మఱియు హిరణ్యకుండు.

117


చ.

పరఁగ నసత్యవాక్యములు పల్కుటకంటెన మౌనవృత్తి మే
లరుదుగ నన్యభామఁ గదయం జనుకంటె నపుంసకత్వవి
స్ఫురణము మేలు కొండియము పూనుటకంటెను జావు మే లగున్
బరధనకాంతుకంటె సులభం బగుభిక్షమ మేలు చూడఁగన్.

118


చ.

చెడు నభిమాన మార్యునకు సేవకతంబున సాంద్రచంద్రికన్
జెడుఁ దమ మంతయున్ దెవులుచేఁ జెడుఁ జక్కఁదనంబు పాపముల్
చెడు హరిశంభుకీర్తనముచే శతసౌమ్యగుణంబు లైననున్
జెడు నొరు వేఁడఁబోవుటకుఁ జేరినయర్థికి నెల్లభంగులన్.

119


వ.

కావున నొక్కరి నడిగిన వారు పెట్టుట కష్టం బగుట నెవ్విధంబున బ్రతుక నేర్తు
నెవ్విధంబున మృత్యుముఖద్వారంబు దొలఁగుదుఁ జిరప్రవాసియుఁ బరాన్నభోజి
యుఁ బరగృహవాసియు నయినమానవుండు బ్రతికియుఁ జచ్చినవానితో సమానుండు
వాడు జీవితుండై యుండుటకంటె మృతుం డగుటయె మే లని విచారించియును
ధనాపేక్ష నయ్యతీశ్వరుం గఱవ నిగ్రహించి కదిసిన న న్నెఱిఁగి బృహస్ఫిగుండు
కృతాంతదండంబువోని ప్రచండదండంబున నన్ను దండించిన సాభిలాషంబున సంతో
షంబు లేనినన్ను నాత్మద్రోహిఁ గా నెఱింగితి నెట్లంటేని.

120


గీ.

నిత్యసంతోషవంతుఁ డై నెగడువాని, కన్నిచోటుల సంపద లానియుండుఁ
జెప్పు లిడికొన్న కాళ్ల కీక్షితితలంబు, తోలు గప్పినచందమై తోఁచునట్లు.

121


వ.

అని మఱియును.

122

శా.

సంతోషామృతతృప్తి నూఁదినమదిన్ శాంతాత్తు లైనట్టిని
శ్చింతుల్ గాంతురు నిత్యసౌఖ్యమహిమల్ సిద్ధంబు సాపేక్ష న
త్యంతక్లేశగతాగతభ్రమణదుర్వ్యాపారమోహాకుల
స్వాంతు ల్గానఁగ నేర రవ్విధము లేశంబున్ వృథాయాసతన్.

123


గీ.

ఆశ మిగులంగఁ గల్గినయన్నరునకుఁ, గదల నూఱామడయు దవ్వు గాక యుండు
నిత్యసంతోషి యైనట్టినిర్మలునకు, ధనము చేపడ్డ నందు నాదరము లేదు.

124


వ.

అట్లు గావున నర్థవంతుండును వివేకియు నయ్యెనేనియుం గాంచనరత్నసాంగత్య
సామ్యంబు సంధిల్లు లోకదృష్టాంతంబును వినంబడియుండు నెట్లంటేని.

125


ఉత్సాహ.

భూతదయకు మిగులఁ గల్గుపుణ్యమున్ బ్రభూతరో
గాతురంబు గాక దేహ మమరుకంటె సౌఖ్యమున్
బ్రీతికపట మింత లేని పేర్మికంటె స్నేహమున్
భౌతి నిర్ణయించుకంటెఁ బండితత్వ మున్నదే.

126


వ.

అది నిమిత్తంబు నాకుఁ బుట్టినవిచారంబుకతంబున భవదంతికంబునకుం జనుదెంచితి
ననిన విని మిత్రమందరుం డిట్లనియె.

127


క.

సురనరకిన్నరపన్నగ, గరుడాసురపక్షిపశుమృగంబులు లోనై
పరఁగిన లోకత్రయమునుఁ, బరువడి నాహారముఁ గొనుఁ బగిలిటిలోనన్.

128


క.

కావున నాహారార్థము, కావింపఁడు నింద్య మైనకార్యము ప్రాజ్ఞుం
డీవును పరోపకార, ప్రావీణ్యముమై ప్రయాసపడు టొప్పుఁ గదా.

129


ఉ.

మానవుఁ డంత ధర్మవిధిమార్గ మెఱుంగఁగ లేనికేవల
జ్ఞానియెయేని లేదు ఫలసంపద నీతికిఁ బాసి యుద్యమ
శ్రీ నెఱయంగ లేనినరుఁ జెందినమంచిగుణంబు గల్గినన్
గానఁగ రాక పోవు మఱి 'కార్యము రాదు మనోవిహీనతన్.

130


గీ.

అచ్చుపడ నీతిశాస్త్రంబు వచ్చెనేనిఁ, బొరి నిరుద్యోగి ఫలసిద్ధిఁ బొందలేఁడు
తెల్ల మంధుండు కరమున దీపముండె, నేని యచటిపదార్థంబుఁ గానలేఁడు.

131


వ.

అని చెప్పి మఱియును.

132


సీ.

ఒకవేళ దాత యాచకవృత్తిమై నుండు, యాచకుం డొకవేళ నగును దాత
యొకవేళ శాత్రవనికరంబు భంజించు, నొకవేళ నిలువక యోడి పాఱు
నొకవేళ సంపద నుప్పొంగుఁ బైపయి, నొకవేళఁ గడు లేమి నొంది యుండు
నొకవేళఁ బుత్త్రమిత్త్రకళత్రయుతుఁ డగు, నొకవేళ నొక్కఁడు నొదిగి యుండు

గీ.

హెచ్చుదగ్గులు తఱుచుగా నెల్లయెడల, నెవ్వరికి నైనఁ గలుగుచో నివ్విధమున
భాగ్యవంతుఁడు కొనసాగి బ్రతికి యుండు, ధాత్రి నదిగాన భాగ్యప్రధాన మరయ.

133


వ.

కావున దేశకాలంబుల తెఱం గెఱుఁగునది.

134


క.

వనమునఁ బుట్టినకాకము, లనయము భక్షింపఁ దనకు నాఁకలి చెడదే
విను మును స్వోదరపోషణ, మున కెవ్వఁడు కష్టవృత్తి మొనసెం జెపుమా.

135


వ.

అని యిట్లు హిరణ్యకు నూఱడించి యిట్లనియె.

136


సీ.

అవివేకి శాస్త్రంబు లభ్యసించినయేని, నతఁడు మూఢుఁడు గాని ప్రతిభ లేదు
చదివినశాస్త్రంబు సకలార్థము నెఱింగి, యవ్విధంబును దాను నాచరించి
యడిగినవారికి నర్ధంబు దెలియంగ, వివరించునతఁడు వివేకి గాన
నివ్విధంబునకును దృష్టాంత మైన, యర్థంబు నొప్పంగ నుదాహరింతుఁ


గీ.

దెవులు గొన్నట్టివానికిఁ దివిరి మందు, చేసి సేవింప నొసఁగక చేత నిడిన
మాన నేర్చునె రోగంబు మదిఁ దలంపఁ, జదువు పనిలేదు భాగ్యంబు చాలకున్న.

137


క.

నెలవులు దప్పిన మిగులం, బలుచన నఖదంతకేశమానవులపనుల్
తలపోసి బుద్ధిమంతులు, దొలఁగరు తమతావు లెంతదుర్దశ నైనన్.

138


వ.

అని పలికి మిత్త్రమందరుం డవ్విధం బల్పవిచారికార్యం బార్యుల తెఱంగు విను మని
యిట్లనియె.

139


చ.

ఇరువుల రాయి డైనఁ దగునిక్కలు చూచుచుఁ బోయిపోయి కే
సరులు గజంబులున్ సుజనసంఘము నెమ్మది నుండుఁ జాల దు
స్తర మగుకాలము వ్వెడలఁజాలక తెంకిన యుండి డస్సి యు
ర్వరమృగకాకకాపురుషవర్గము దుర్గతి పొందు నెంతయున్.

140


సీ.

ధీరుండును వివేకదీపితుండును నైన, ప్రభునకుఁ బరదేశభయము లేదు
నిజభుజవిక్రమోన్నిద్రభద్రశ్రీల, నాత్మీయులును దాను ననుభవించు
నెట్లన్న విను సింహ మేప్రొద్దు వసియించు, నడవిఁ గా కొండొకయడవి నైన
నల్పజంతువులందు నాత్మీయపౌరుషో, ద్యుక్తికి సమకొని యుక్తి మెఱసి


గీ.

కులిశసన్నిభనఖముఖాంకుశవిభిన్న, మదభరాభీలకుంభికుంభప్రకీర్ణ
మాంసరక్తానుభవమోదమానసమునఁ, బొదలుచుండును నెంతొ యెప్పిదము గాగ.

141


గీ.

అమర మండూకములు పల్వలమును బకు, లరసి కాసారమును జేర నరుగుకరణి
నధికధనములు సత్సహాయములుఁ దివిరి, ధరణి నుద్యోగిఁ బ్రాపించుఁ దమకుఁ దామ.

142


వ.

అవ్విధం బెట్టిదనిన.

143

చ.

వఱపున మేను లెండఁ దమవారియెడం బెడఁబాసి జీవముం
దొఱఁగి ధరిత్రి డింది యతిదుర్దశఁ గాలము వేచి యుండఁగా
నుఱ వగువాన ద్రోణముల నొయ్యన నూల్కొన మున్నువోలె నే
డ్తెఱఁ గనుపట్టుభేకవితతిం గని యుత్సవ మొప్పఁ జేయఁగన్.

144


వ.

అని చెప్పి వెండియు.

145


శా.

ఆలస్యంబును గామినీజనరతివ్యాసక్తియున్ జన్మభూ
లోలత్వంబును రోగమున్ ఘనభయోల్లోభంబు సంతోషమున్
బోలంగా నివి యాఱు నెప్పుడు జగత్పూజ్యప్రతాపోదయ
శ్రీలం జెందఁగ విఘ్నకారణములై చెల్లున్ ధరామండలిన్.

146


వ.

కావున నివి యాఱుగుణంబులు పరిహరించిన పురుషుం బ్రదీప్త
సంపదలు ప్రాప్తించుఁ
బ్రాప్తంబు లైనసుఖదుఃఖంబులవలన మోదఖేదంబులం బొరయకుండునది.

147


గీ.

చక్రపరివర్తనమువోలె జనుల కెల్ల, సౌఖ్యదుఃఖంబు లెడనెడ సంభవించు
వానిఁ గైకొని యాత్మవిజ్ఞానమహిమ, బుధులు మోదఖేదంబులఁ బొరయ రెందు.

148


సీ.

వర్ధితోత్సాహుఁ డై వలయుకార్యములందు, దీర్ఘసూత్రుఁడు కాక తెలివి గలిగి
పనులఁ బ్రగల్భుఁడై బహుకార్యములతఱి, విసువ కేమిట నతివ్యసని గాక
మిగుల శూరుండైన మే లెఱుంగుట గల్గి, దృఢచిత్తుఁడై సమస్థిరత లొదవ
మితసత్యభాషణోన్మేషంబు సంధిల్లఁ, బుణ్యకర్మములపై బుద్ధి నిలిపి


గీ.

యుండు పురుషునిగుణములయోజ తెలిసి, యింటి కెడపక తనుఁదానె యేఁగుదెంచి
సంచలింపక తాఁ బ్రతాపించి మించి, యంచితంబుగఁ గమల సేవించు నెపుడు.

149


క.

ఉద్యోగరహితు నలసుని, నుద్యత్సాహసవిహీను నొల్లదు సిరి సం
పద్యోగుఁ గొల్వఁ జేరదు, చోద్యముగా వృద్ధుఁ దరుణి చూడనిభంగిన్.

150


వ.

కావున నీకు ద్రవ్యసంపత్తి గలుగుకున్నను బుద్ధిసముత్సాహంబు గలుగుటంజేసి
బ్రతుకంగలవాఁడ వని పలికి వెండియు.

151


చ.

ఘనుఁ డొకవేళ లేమిఁ గడుఁ గందినఁ జుల్కదనంబు గాదు హీ
ననరుని కొక్కచోటను ధనం బొడగూడిన దొడ్డవాఁడు గాఁ
డనయము హేమమాలికల నందముగాఁ గయిచేసిరేనియున్
శునకము విక్రమస్ఫురణసొంపున సింహముఁ బోల నేర్చునే.

152


సీ.

శౌర్యసముత్సాహధైర్యసారంబులఁ, బురుడు చెప్పఁగ రాని పురుషవరుఁడు
జలనిధి గోష్పదస్వల్పమాత్రంబుగా, నమరాద్రి వల్మీకసమము గాఁగఁ

దలఁచు నహీనసత్త్వప్రతాపోజ్జ్వలు, నగరిలో నవనిధానములతోడ
సంతతసంతోషితాంతరంగంబున, శ్రీదేవి నిశ్చలస్థితి వహించు


గీ.

నట్టిపుణ్యులు తఱుచుగాఁ బుట్ట రవనిఁ, బుట్టిరేనియు సుజనసంపూజ్యు లగుచు
నెన్నికకు నెక్కు నూట వెయ్యింట నొకఁడు, గర్భనిర్భాగ్యు లెందఱో కలుగ నేల.

153


క.

అమరాద్రిపొడవు పాతా, ళములోఁతు మహాబ్ధివిరివి లఘుతరములుగాఁ
దమచిత్తంబునఁ దలఁపుదు, రమరఁగ నుద్యోగవంతు లైనమహాత్ముల్.

154


వ.

అనిన హిరణ్యకుండు మిత్త్రమందరున కిట్లనియె ననఘా నీవు చెప్పినహితవచనంబు
లాకర్ణించుటంజేసి నాచిత్తంబునం గలకలంక యంతయుఁ దీఱె నని మఱియును.

155


మ.

ధనవంతుండవు నిన్ను గర్వ మిసుమంతం జేర దిబ్భంగి నే
నను నర్థోత్కరనాశదైన్యమును మేనం జెందనీ నెప్పుడున్
మనుజుం డొక్కెడఁ బాటులం బడుట సామ్రాజ్యంబు గైకొంటనుం
గనుఁ దా నేర్పరిచేతికందుకమురేఖన్ బెక్కుచందంబులన్.

156


మ.

ఖలసంసర్గము యౌవనాభ్యుదయమున్ గాంతాజనస్నేహమున్
జలదచ్ఛాయయు ద్రవ్యసంపదయు నైజం బల్పకాలోపభో
గ్యలసత్సౌఖ్యకరంబు లంచు నివి వేడ్కన్ మెచ్చ రార్యుల్ మదిన్
విలసత్స్థానసమాధినిర్మలగుణావిర్భూతచేతస్కు లై.

157


క.

అది గాన నర్థహానికి, హృదయంబునఁ దలఁక నించుకేనియు నను నిం
పొదవఁగ బోధించిననీ, సదమలవాక్యములు ననుఁ బ్రశాంతునిఁ జేసెన్.

158


వ.

అనిన మిత్త్రమందరుండు హిరణ్యకున కిట్లనియె.

159


ఉ.

తోడనె యర్థసంపదలతోఁ బ్రభవించినవాఁడు లేఁ డొడం
గూడినద్రవ్య మెల్ల ననుకూలముగా శతహాయనంబులన్
వేడుకలారఁగా ననుభవించినవాఁడును లేఁడు గాన నే
నోడను బూర్వసంచితము యోగ్యమె నాకును నెల్లవారికిన్.

160


ఉ.

దానముకంటె వేఱొకనిధానము లేదు ముదంబుకంటె నిం
పైనధనంబు లేదు కొనియాడెడుశీలముకంటె భూషణం
బేనెఱి లే దరోగమున నింపగుదేహముకంటె లాభమున్
గానఁగ నెందు లే దనఘ గౌరవబుద్ధిఁ దలంచి చూచినన్.

161


క.

పెక్కులు పలుకం బని లే, దెక్కడికిం బోవ వలవ దేనును నీవున్
దక్కక కూడుక యుండుద, మిక్కడ నతిసౌఖ్యవృత్తి నింపెసలారన్.

162


వ.

అనిన హిరణ్యకుం డిట్లనియె.

163

గీ.

మిత్త్రమందర నీసుచరిత్రమహిమ, మఖిలజనులకుఁ గొనియాడ నాస్పదంబు
గాన నాకును సంతోషకరము గాదె, నిన్నుఁ గనుగొన్న నాభాగ్య మెన్న నేల.

164


ఉ.

ఉన్నతుఁ డైనమానవున కొక్కయెడన్ గడుఁ గీడు వొందినన్
సన్నపువాఁడు దీర్చుటకు శక్తుఁడె యంతటివాఁడు వాఁడు గా
కన్నునఁ బంకమగ్న మగునట్టిగజేంద్రుని నెత్త నేనుఁగుల్
పన్నుగ నోపుఁ గాక మృగపంక్తులు హీనము లంత కోపునే.

165


ఉ.

దేవబలాఢ్యుఁ డైనతఁడు ధీరమతుల్ కొనియాడ నొక్కచో
దైవిక మైనకీడు దనుఁ దాఁకిన నోర్చి సమస్తకార్యసం
భావితబుద్ధిమైఁ బ్రకృతిబాంధవు లాపదఁ బొంది వచ్చినన్
జేవ దలిర్ప వారలకుఁ జెందినదుఃఖము మాన్చు నెయ్యుఁడై.

166


చ.

పరువడి నెల్లనాఁడు బుధబాంధవకోటి నుతింప నుండువాఁ
డరుదుగఁ దన్నుఁ జేరుశరణార్థుల నర్థులఁ జింతితార్థసం
భరితులఁ జేయువాఁడు కులపావనుఁడై పెనుపొందువాఁడు పో
పురుషవరేణ్యుఁ డాయమరపూజ్యుఁడు కారణజన్ముఁ డీమహిన్.

167


వ.

అని మఱియును.

168


ఉ.

మారుతముల్ వనంబులను మానుగ షట్పదపంక్తి పువ్వులన్
హారవిహారిచారుకలహంసము లంబులఁ బక్షు లంబరా
ధారము గోరినట్లు ప్రమదంబుగ నేనును నిన్నుఁ జూడఁగాఁ
కారణ మౌటఁజేసి ఫలకాంక్షలఁ జేరితి మివ్విధంబునన్.

169


వ.

అని యిట్లు మిత్త్రమందరలఘుపతనహిరణ్యకులు తమలోపల సంభాషణంబులఁ
బ్రొద్దుపుచ్చుసమయంబున.

170


క.

సారంగ మొకటి మృగయుని, బారిం బొరిఁ దప్పి బెదరి భయవిహ్వలతన్
గూరి పఱతెంచినంతటఁ, జేరువఁ బొడగాంచి వారు చిడిముడిపడుచున్.

171


వ.

మిత్త్రమందరలఘుపతనహిరణ్యకులు మృగంబు తీవ్రగమనంబు చూచి వెఱచుచుఁ
గనికనింబఱచి రందు లఘుపతనం డచ్చేరువ నొక్కమహీరుహం బెక్కి భయంబు
దక్కి నిక్కి చూచి యామృగంబుపజ్జఁ దక్కినక్రూరమృగవ్యాధబాధలు లేకుండ
నిరీక్షించి మిత్త్రమందరహిరణ్యకులం బేర్కొని వెఱవక రం డని పిలిచిన నయ్యిరు
వురు వృక్షంబుపొంతకుం జనుదెంచి నితాంతభయభ్రాంతుండును గంపితశరీరుం
డును నగుచిత్రాంగదుం డనుమృగసత్తము నాలోకించి వారలలో మిత్త్రమందరుం
డమందానందకందళితహృదయారవిందుం డగుచు నామృగంబున కిట్లనియె.

172

ఉ.

ఎచ్చటినుండి వచ్చి తిది యేమి మృగోత్తమ నీమదిన్ భయం
బచ్చుపడంగ నున్నయది యవ్వల నెంతటికార్య మయ్యె నీ
వచ్చుట పెద్ద లెల్ల నిట వచ్చుట గావున నన్నపానముల్
పుచ్చుక మానివాసమునఁ బొంది వనంబు నలంకరింపవే.

173


వ.

అనిన విని చిత్రాంగుం డిట్లనియె.

174


గీ.

వెంట విడువక లుబ్ధకవీరుఁ డొకఁడు, సారెకును వచ్చి నామీఁదఁ జలముకొన్న
నచట నుండక వచ్చితి నిచట మీకు, విందనై యన్న నామిత్త్రమందరుండు.

175


క.

మాకంటె నీకుఁ జుట్టము, లీకాననమందుఁ గలుగ రిది నీయిలుగాఁ
గైకొని నిలువుము నీ వనఁ, జేకొని బహుకాల మధివసించినపిదపన్.

176


ఉ.

అంగద నొక్కనాఁడు ప్రియ మారఁగ మేతకు దూర మేఁగి చి
త్రాంగుఁడు రాక చిక్కుటయు నిర్మిలి నిద్దఱుఁ జింత నొంద న
య్యింగిత మాత్మలో నెఱిఁగి యేపున వాయన మేఁగి కాంచె క్షీ
ణాంగుని వాగురీనియమితాంఘ్రిని నాహరిణేంద్రు నొక్కచోన్.

177


క.

కని లఘుపతనుఁడు డగ్గఱి, మునుకొని కన్నీరు దొరుఁగ మోహభ్రాంతిన్
దనమేను దుఃఖవహ్నిన్, గనలఁగ నిట్లనియెఁ బరమకారుణ్యమునన్.

178


ఉ.

ఒక్కని వేఁడఁ బోవు మఱియొక్కనిచేటున కియ్యకోవు వే
రొక్కనిసొమ్ము కాసపడ నొల్లవు మాలవిధాత నిర్దయుం
డక్కట నీరునుం దృణము నాని మహోగ్రవనాంతరంబునన్
మ్రక్కెడునీకు నిట్టియవమానము మానము దప్పఁ జేసెనే.

179


వ.

అని మఱియు ననేకప్రకారంబుల నమ్మృగంబు నుద్దేశించి వగచుచు వాయసపతి
వెండియు నిట్లనియె.

180


క.

ఈవంక కేల వచ్చితి, నేవెరవునఁ దగులు వడితి వింకిట మనకున్
గావలయుకర్జ మెయ్యది, నావుడు నాతనికి హరిణనాథుం డనియెన్.

181


గీ.

అనఘ వేఁటకాని కగపడ్డననుఁ గావ, నీకుఁ గడింది వాఁడు రాకమున్న
చని హిరణ్యకునకు సకలంబు నెఱిఁగించి, తొడుకు రమ్ము పలుకు లుడిగి వేగ.

182


వ.

అనినం గానిమ్మని లఘుపతనుం డుడువీథి కెగసి యతిత్వరితగతిం జని మిత్త్రమందర
హిరణ్యకులకుఁ జిత్రాంగుం డురిఁ బడుట తేటపడం జెప్పి హిరణ్యకుం దోడ్కొని
పోయినం జిత్రాంగునిం జూచి హిరణ్యకుం డిట్లనియె.

183


క.

మతిమంతుఁ డైననీ వి, ట్లితరునిక్రియఁ దగులువడితి వీదుర్దశకుం
గత మేమి యనిన నాతం, డతనికి నిట్లనియెఁ జంచలాత్ముం డగుచున్.

184

క.

మాటాడఁదగదు మన మి, చ్చోటను లుబ్ధకుఁడు వచ్చి చూడకము న్నీ
పాటం దగిలినయురుల, న్వీటిం బుచ్చంగఁ దగు ననింద్యచరిత్రా.

185


వ.

అనుటయు హిరణ్యకుండు.

186


గీ.

నీకు శుభము గోరి నీసమీపమునకు వచ్చినాఁడఁ గాన వలదు భయము
చెప్పు మన్న నపుడు చిత్రాంగుఁ డిట్లను, నాహిరణ్యకునకు నర్థితోడ.

187


క.

మును మోసపోయి యప్పుడు, కనుగానక తగులుపడితిఁ గడవఁగఁ వశమే
మనుజుండు దైవకృతముల, ననుటయు నది యెట్టి దనిన నాతని కనియెన్.

188


ఉ.

ఎంతటివారి కైన మహి నింతటివార మనంగ రాదు మా
కింతటిబుద్ధిమంతులకు నింత లవస్థ లనంగ రాదు జ
న్మాంతరకర్మవాసనలయందు శుభాశుభముల్ గ్రహంబులన్
వింతలె బుద్ధిమంతులు వివేకమునం బరికించి చూచినన్.

189


వ.

కావున నిందులకుం జింత వలవ దాకర్ణింపుము.

190


సీ.

తల్లిగర్భమున నాఱునెల లైన నుదయించి, యొకనాఁడు మూఁకయై యున్నయట్టి
చుట్టపుజాతిలో నిలం బగువేడ్క నుల్లాస మెసఁగ నే నున్నవేళ
నచటికి వేఁటకాఁ డరుగుదెంచినఁ జూచి, బెదరి మావా రెల్లఁ జెదరుటయును
గొండికవాఁడనై కూడి పాఱెడునట్టి, జవసత్త్వములు నాకుఁ జాలకున్న


గీ.

ముట్టఁ బఱతెంచి ననుగూడ ముట్టి పట్టి, బెట్టిదంబుగ నాకేలు చుట్టికట్టి
పట్టి కృప పుట్టి చంపక వాఁడు నన్నుఁ, జూచి తను నేలుభూపాలసుతున కిచ్చె.

191


ఉ.

ఇచ్చిన నన్నుఁ బుచ్చుకొని యెంతయు వేడుక లుల్లసిల్ల నా
కిచ్చగుమేపు నీరు ప్రియ మేర్పడఁ గట్టడ చేసి గారవం
బచ్చుపడంగ నంతిపురమంగనలున్ బరివారముం గడున్
మచ్చికఁ బుత్త్రభావమున మన్ననఁ బెంపఁగ వృద్ధిఁ బొందితిన్.

192


వ.

ఇవ్విధంబునఁ బెద్దకాలం బుండి యొక్కనాఁ డక్కుమారుండు పవ్వళించినగృహం
బున కనతిదూరంబునఁ గట్టెదుర నేను విశ్రమార్ధినై శయనించి యున్నసమయంబున
నతినిబీడనీలవలాహకస్ఫారాంధకారప్రద్యోతమానవిద్యుల్లతావితానంబును వాతవిధూ
తవర్షజలబిందుసందోహవిజృంభితగర్జాడంబరంబును నైననిశాసమయంబు నాకుఁ బరి
తోషంబుఁ జేయ నట్టిసంతోషపారవశ్యంబునం గెలను పరికింప నెఱుంగక మనుష్య
భాషణంబుల నెలుం గెత్తి యిట్లంటి.

193


గీ.

చినుకుతోఁ గూడికొని గాలి చెలఁగఁ జూచి, దాఁట గట్టుచు మృగములు దాఁటుచుండ
వెఱను మావారివెనుక నేఁ బఱచునట్టి, భాగ్యసంపద యెన్నఁ డేర్పడునొ నాకు.

194

సీ.

అనుచున్నసమయంబునందు నంతకమున్న, యాచమనార్థమై యరుగుదెంచి
భూపాలసుతుఁడు సమీపస్థుఁడై యుండి, పోల నవ్వాక్యంబు లాలకించి
దిక్కులు పరికించి యెక్కడ నెవ్వారు, మెలఁగుచందము లేమి తెలిసి యప్పు
డీమృగంబునఁ బుట్టె నిట్టియుత్పాతంబు, లొడల మహాభూత ముండఁ బోలు


గీ.

ననుచు భ్రమనొంది తా మూర్ఛ మునిగి యుండ, నతనిజనకుండు తెలవాఱ నరుగుదెంచి
కారణం బేమి యని పెద్దవారి నడుగ, నందు దైవజ్ఞుఁ డిట్లనె నతనితోడ.

195


గీ.

జంతుపరిభాష దమలోన జరుగుచుండుఁ, గాని మానుషభాషణక్రమము వినము
కారణము దీని కేమైనఁ గలుగ నోపుఁ, గలుగుఁ గాకేమి మీకింక వలదు భయము.

196


క.

అని యతనిదేహ మెల్లను, దనకరముల నిమిరి బహువిధంబుల మంత్రిం
చినఁ బూర్వభంగి నృపసుతుఁ, డనయము బడలికలు తీఱి యిరిగినపిదపన్.

197


వ.

అమ్మహీశ్వరుండు నన్నుఁ జుఱచుఱఁ జూచి తనకింకరుల కిట్లనియె.

198


క.

అఱజాతిజఁతు విచ్చట, వెఱపించుచు నుండవలదు విపినంబునకున్
దఱముఁ డని ముదల వెట్టిన, నఱిముఱి ననుచరులు వెడల నడిచిరి నన్నున్.

199


క.

నాఁ డట్లు వడితి నమ్మెయి, నేఁ డి ట్లురిబారిఁ బడితి నీచపువిధి నె
వ్వాఁడైన గెలువఁగలఁడే, పోఁడిమి గలనీతిమార్గమున నేభంగిన్.

200


వ.

అని యిట్లు చిత్రాంగుండు పలుకునంత నచ్చట మత్త్రిమందరుం డాత్మగతంబున
లఘుపతనహిరణ్యకు లరిగి తడ వయ్యె నక్కారణంబు దెలియునంతకు నే నెట్లు
గుండియ పట్టి యుండ నేర్తు నని యప్పుడ కదలి హిరణ్యకుండు చనినజాడం దడ
య కయ్యెడకుం బోయిన హిరణ్యకుం డిట్లనియె.

201


గీ.

మిత్త్రమందర నీవు మామీఁదిభక్తి, నిచటి కేతెంచు టిది మాకు హితము గాదు
వేఁటకాఁ డిప్పు డేతెంచువేళ యయ్యె, వాని కగపడ కేము పోవంగఁగలము.

202


క.

ఉదకంబులోన నైనన్, గొదగొని పాఱంగఁ గలవు కుంభినిమీఁదన్
గదలంగ నేర వడిగెడు, నది గావున నీవు వచ్చు టనుచిత మెందున్.

203


వ.

అనుటయు మిత్త్రమందరుం డతని కిట్లనియె.

204


క.

మతిమంతుఁడు గుణవంతుఁడు, హితుఁడును నైనట్టిసఖుని నెవ్వరుఁ బాయన్
ధృతి నిలుపలేరు పాసియు, నతఁ డొకచోఁ గాలు వొంద కలఁతం బొందన్.

205


వ.

అని మఱియును.

206


చ.

సురుచిరనిర్మలాత్ముఁ డగుచుట్టమునందును శీలవృత్తిపేరి
పరు దగుసాధ్వియందును బ్రయాస మెఱింగినపుత్రునందునున్
బురుషుఁడు దుఃఖ మంతయును బోవఁగఁ ద్రోచి యచింతతో నిరం
తరసుఖసంగతిన్ మెఱయుఁ దా మనుచుండెడునంతకాలమున్.

207

వ.

అని పలుకుచున్న యవసరంబున.

208


క.

యమదూతవోలె నచటికి, సమదగతిన్ వేఁటకాఁడు చనుదేరంగాఁ
దెమలక హిరణ్యకుం డురిఁ, దుమురుగఁ దెగఁ గొఱికి బొక్కఁ దూఱం బాఱెన్.

209


క.

చిత్రాంగుఁ డుఱికి పఱచెన్, జిత్రత లఘుపతనుఁ డెగసె శీఘ్రతఁ జంచ
ద్గాత్రస్థూలతఁ గదలెడు, మాత్రంబున బోయ మిత్త్రమందరుఁ గనియెన్.

210


క.

కని దానిఁ బట్టి త్రాటం, గొని యనువునఁ గట్టి వింటికొప్పునఁ దగిలిం
చి నిజమనోరథభంగం, బున కాత్మం దలరి వాఁడు బుద్ధిం దలఁచెన్.

211


క.

వలఁ జిక్కక చనె మృగ మ, వ్వలఁ జిక్కును దాసరయ్య వలననిజాలిం
దలరంగ నేల నేఁ డీ, కొలఁదియె కూరయ్యె ననుచుఁ గొనిపోవుతటిన్.

212


క.

మృగమును గాకము నెలుకయుఁ, దెగపడి కచ్ఛపము పోక తేటపడిన నె
వ్వగలం బొగిలెడువానికి, మొగ తప్పక కార్య మెఱిఁగి మూషిక మనియెన్.

213


క.

వగ పధికరోగమూలము, వగపునఁ గార్యంబు వచ్చువల నెఱుఁగం డి
మ్ముగ వగ పనర్థమూలము, వగపున శాత్రవభయంబు వచ్చున్ నొచ్చున్.

214


క.

కడ లేనిదుఃఖవార్ధిం, గడచితిఁ దొల్లియును నేఁడుఁ గడతముగా కి
ప్పుడు దైవ మేల మనలన్, జెడఁ జూచును దీని కేల చింతం బొందన్.

215


క.

తగుమిత్త్రుఁడు భాగ్యాధికుఁ, డగువానికిఁ గాని దొరకఁ డాపద యైనన్
దిగ విడువక రక్షించును, సుగుణాఢ్యుం డుత్తముండు చుట్టం బైనన్.

216


గీ.

తల్లియందును దనుఁ గన్న తండ్రియందు, నాలియందును సుతసోదరాలియందు
నెంతసంతోష మగు నగు నంతకంటె, మేలిసౌఖ్యంబు నరునకు మిత్త్రునందు.

217


చ.

తమతమకర్మవాసనలఁ దాఁకు శుభాశుభకర్మజాలముల్
క్రమమున మర్త్యకోటి కటుగాన విపద్దశ లెల్లఁ బెక్కుజ
న్మములవి గూడి తన్ను నలమంబడి యిప్పటిపుట్టునందు దై
వము ప్రతికూల మైన వగవం బనిలేదు వివేకహీనతన్.

218


గీ.

కడఁగి దేహి నపాయంబు గాచి యుండుఁ, గదియుకూటమిఁ బాయుట గాచి యుండుఁ
గలిమిఁ బెడబాప లేమియుఁ గాచియుండు, నస్థిరం బది సంసార మనుట నిజము.

219


ఉ.

ఆరయ నాయుధక్షతమునందున మేనికిఁ బాటుగల్గు నా
హారము లేక యున్న నుదరాగ్ని శరీరము నేర్చు నాపదం
గూరిన వైరమున్ దఱు చగున్ దమలో నొకసందు గల్గినన్
జేరు ననర్థకోటి నిరసించినఁ బోవని దేహధారికిన్.

220

ఉ.

భీకరశాత్రవస్ఫురదభేద్యభయంబును దీవ్రదుఃఖమున్
వే కడతేర్పఁ జాలుటకు నేర్చి ముదంబున కాలవాలమై
చేకొని కాచు నాత్మసఖు సిద్ధము మిత్త్రసమాఖ్యరత్న మన్
శ్రీకరవర్ణయుగ్మము సృజించినయున్నతపుణ్యుఁ డెవ్వఁడో.

221


వ.

అని యిట్లు తన ప్రాణసఖుం డైనమిత్త్రమందకుండు దగులువడి పోవుటకుఁ
బరితాపాంతఃకరణుం డగుచు హిరణ్యకుండు చిత్రాంగలఘుపతనుల నాలో
కించి యిట్లనియె.

222


క.

వడి నడవి గడచి లుబ్ధకుఁ డెడదవ్వుగఁ జనియెనేని నెంతటివారున్
విడిపింపలేరు మనసఖుఁ, దడయక దీనికిఁ బ్రచింత దలఁపఁగవలదే.

223


వ.

అనినఁ జిత్రాంగలఘుపతను లాహిరణ్యకున కిట్లనిరి.

224


ఉ.

ముట్టినయాపదన్ భయము ముంచి మనంబుఁ గలంపఁ గార్యసం
ఘట్టన గానలేక చెలికానిఁ దలంచుచు దుఃఖవార్ధిలోఁ
దొట్టుచుఁ బొక్కుచుండ మఱి తోఁపవు మీఁదటియుక్తు లేమియున్
జుట్టమ వైననీశరణు చొచ్చితి మెయ్యది బుద్ధి చెప్పవే.

225


క.

పొడవును జక్కఁదనంబును, గడువల మైనట్టియొడలు గలిగియుఁ గలవే
జడబుద్ధి యయ్యె నేనియుఁ, బుడుకకుఁ గొఱ గాదు వానిపుట్టు వదేలా.

226


క.

మాకందఱకు నశక్యం, బై కానంబడినబుద్ధి నధికుఁడ వగుటన్
నీ కింతప్రియము చెప్పెద, మేకార్యము చేయువార మెఱిఁగింపు దయన్.

227


వ.

అని ప్రార్ధించిన హిరణ్యకుండు నాకుం జేయ నవశ్యకర్తవ్యం బైనకార్యంబునకు
మీ రింతప్రియంబు చెప్ప నేల యని పలికి యొక్కంత చింతించి నిశ్చితకార్యుం డగుచుఁ
జిత్రాంగలఘుపతనులం జూచి మీరు వేఁటకానికిఁ దలకడచి పోవువా రనియును
బోయి చేయంగలయుపాయం బిద్ది యనియును దానును నింతనంతఁ జని కూడ
ముట్టి పట్టినపని తుదముట్టఁ జేయువాఁడ ననియునుం గఱపి పంచిన నయ్యిరువురం
జని రవ్విధం బెట్టిదనిన.

228


చ.

మెఱసి మహాజవంబునను మేఘపథంబునఁ బాఱ వాయసం
బెఱుఁగక యుండఁ బల్లమున నీఱముచాటునఁ బోయె నమ్మృగం
బఱిముఱి నింతనంతఁ గదియం జనుదెంచెను మూషికంబు నే
డ్తెఱ మిగులంగ నయ్యెఱుకుఁ దెంపుమెయిం గెలువం దలంచుచున్.

229


క.

త్వరితముగ వేఁటకానికి, సరిగడచి మృగంబు వాయసంబును దూరం
బరుగుచును వాఁడు పోయెడు, తెరువున నొకమడువుదరి నతిస్ధిరబుద్ధిన్.

230

గీ.

లోఁతు లేనినీటిలోను జిత్రాంగుండు, సాఁగబడుచుఁ గాళ్లఁ జాచికొనుచుఁ
గన్ను లమర మూసి కనకుండఁ జచ్చిన, వాఁడువోలె నుండె వాయసమును.

231


క.

తల యెత్తి చంచుపుటమునఁ, బలుమాఱును బొడిచి తినెడిభావము దోఁపన్
దలకొనునంతట రెంటిన్, దళుకొత్తెడువేడ్క నెఱుకు దవ్వులఁ గాంచెన్.

232


గీ.

కాంచి మేను పెంచి కడు నాత్మ హర్షించి, కమఠయుక్త మైనకార్ముకంబు
వెడఁగుబుద్ధితోడఁ గడు దవ్వునను బెట్టి, యతఁడు మృగముఁ చేరునవసరమున.

233


క.

కను గలిగి యింత నంతం, జనుదెంచి హిరణ్యకుండు సంతస మెసఁగన్
దనమిత్త్రు మిత్త్రమందరు, తనుబంధం బపుడు గొఱికెఁ దత్క్షణ మాత్రన్.

234


క.

వడివడి జలమధ్యమునకుఁ, గడువేగం గమఠ మేఁగె గ్రక్కున బొక్కన్
బడె నెలుక వానిఁ బొడగని, వడిఁ గాకము నెగసె మృగముఁ బాఱెన్ దవులన్.

235


గీ.

ఆస గొలిపి పోయె నక్కట నన్ను నీ, చెనఁటిమృగ మటంచు సిగ్గుపడుచుఁ
దిరిగి చూచె నపుడు త్రెంచుక పోయిన, కచ్ఛపంబు లేనికార్ముకంబు.

236


క.

అందుకొని వెచ్చ నూర్చుచు, మందిరమున కూర కెట్లు మరలుదు ననుచున్
మందప్రయాణమునఁ దన, సుందరి యేమనునొ యనుచు స్రుక్కుచుఁ జనియెన్.

237


వ.

ఇవ్విధంబున లుబ్ధకుండు విఫలమనోరథుండై కడుదూరంబు వోవుట నిరీ
క్షించి లఘుపతనుండు తోడిమువ్వురం గూర్చుకొని నిజనివాసంబునకుం జను
దెంచి పూర్వప్రకారంబున నన్యోన్యమిత్త్రభావంబునఁ జిరతరసౌఖ్యంబులం
బ్రవర్తిల్లి రనిన.

238


ఉ.

గండధనంజయాంక బలగర్వితవైరిమదాంధకారమా
ర్తాండ కుమారమన్మథ బుధప్రకరామరభూజ వైభవా
ఖండల విద్విషత్కమలగంధగజేంద్ర విరోధివాహినీ
మండలదావపావక నమజ్జనరక్షణ దుష్టశిక్షణా.

239


వనమ.

మన్నెకులభార్గవకుమారమకరాంకా, సన్నుతమహోగ్రపటుసంక్షోజయాంకా
కిన్నరమరప్రకరగీతసితకీర్తీ, పన్నగవరాభరణభక్తియుతమూర్తీ.

240


తోదక.

దానధనాధిప ధర్మపరాత్మా, మానసుయోధన మంత్రివిచారా
భానుతకీర్తివిభూషితదేహా, భానుసమానవిభాసితదేహా.

241

గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ
నారాయణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బనుమహాకావ్యంబు
నందు సుహృల్లాభం బనునది ద్వితీయాశ్వాసము.