నెంతదాన నీకు దొల్లె వలచితి దానికేమి

వికీసోర్స్ నుండి

రేకు: 0438-2 సౌరాష్ట్రం సం: 12-224

పల్లవి: నే ననఁగా నెంతదాన నీకుఁ దొల్లె వలచితి
దానికేమి రక్షించఁగఁ దగ నీకే భారము
చ 1: యిమ్ముల నేమీ నేరని యెట్టి ముద్దరాలై నా
కమ్మి నీతో మాటాడితే కలికి యౌను
పమ్మి యప్పటి నెంతటి పంతగత్తె యైనాను
తెమ్మగా నీతో మాటాడితే నేలో నౌను
చ 2: చెలరేఁగి యెటువంటి సిగ్గరిది యైనాను
నలి నీ యెదుట నుంటే నవ్వులాఁడౌను
మలసి గుణము గల మానాపతి యైనాను
కలసి నిన్నుఁగూడితే గయ్యాళి యౌను
చ 3: యెన్ని చందముల మరి యేమీ నేరని దైనాను
నన్న లా చాయల నాడే జాణకత్తౌను
యిన్నిటా శ్రీ వేంకటేశ యేనమేలుమంగను
మన్నించి నన్నేలితివి మంచి తనమౌను