Jump to content

నీలాసుందరీపరిణయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

క.

సిరుల నిరవొందుగట్టుల
దొరకూరిమిపట్టిఁ గూడి తోరపుహొయలం
దిరమగునెమ్మిం జెలఁగుచు
సరిమీఱినవన్నెకాఁడ! జగములఱేఁడా!

1


తే.

విను నిరాబారిఱేండ్ల కవ్వెట్టచెవుల
తపసిరాయఁడు దనదుడెందంపుఁదమ్మిఁ
గ్రమ్ముకొనువేడ్క నవ్వలి కతయుఁ జాల
నెలమి నెఱిఁగింపఁగాఁ బూని యిట్టులనియె.

2

బ్రాహ్మణుఁడు నందునితో వివాహవార్తను మాటాడుట

ఉ.

బల్లిదులార! నందుఁ డనుప న్మును వెళ్ళినజన్నిగట్టు వ్రే
పల్లెకు సంతసంబు మదిఁ బర్వఁగఁ గ్రమ్మఱఁ బోయి వేగయా
గొల్లకొలంపుఁబాల్కడలిక్రొన్నెలఁ గన్గొని వానికెంతయుం
దెల్లమి గాఁగ నిట్లనుచుఁ దెల్పఁదొడంగెను నేర్పుపెంపునన్.

3


క.

ఒడయండ! నీదుపంపునఁ
గడువడిఁ జని నీమఱందిఁ గనుఁగొని యతఁ డ
య్యెడ నిడుపూజల నెంతయు
నడరఁగఁ గైకొని కరంబు నర్మిలి మీఱన్.

4


ఆ.

అతనిసేమ మెల్ల నరసినపిదప మీ
సేమ మతని కెఱుఁగఁ జెప్పి మేలి

రతనములఁ దనర్చు రవణమ్ములును బట్టుఁ
బుట్టములను మిగులఁ బుడుకు లంది.

5


క.

వచ్చునెడం దనకన్నియఁ
దెచ్చి యతం డెదుట నిలిపి దీనికి నెన యై
మెచ్చు గను పెండ్లికొడుకును
నిచ్చలముగఁ దెల్పుమనుచు నెఱిఁ బల్కుటయున్.

6


తే.

నీకు మేనల్లుఁ డగువెన్నునికి నొసంగు
చాన నని పల్క నతఁ డంత సంతసిల్ల
వేయిదెఱఁగుల మీ కిది విన్నవించి
కర్జ మొనగూర్పుమని కోర్కి గదురఁ బల్కె.

7


క.

కుందనపుబొమ్మ పోలిక
నందంబుల కెల్ల నిక్కయగునమ్ముద్దుం
గెందలిరుఁబోఁడి బెండిలిఁ
బొందుగ నొనగూర్పు పసిడిపుట్టము దొరకున్.

8


తే.

తడయఁ బనిలేదు మేల్పని తగినచోటఁ
దగిన నొనరింపు మనుచుఁ బెద్దలు గడంగి
యాడుచుందురు గావున నతనితోడ
వియ్యమందంగఁ దగుఁ జుమ్ము వేయు నేల?

9


క.

అని బాఁపనయ్య యిత్తెఱఁ
గున నేర్పున విన్నవింప గొల్లలఱేఁ డ
ప్పని కియ్యకొని కరంబును
దనమదిఁ గడలేనివేడ్కఁ దనరుచు నుండెన్.

10

కృష్ణునికి బ్రాహ్మణుఁడు నీలను వర్ణించి తెల్పుట

తే.

పాఱుఁ డపుడెదఁ గడుఁబెంపుమీఱ నెలమి
నాలకాపరికడకు డాయంగఁజేరి
సంతసంబున నతనితో నంత కంత
కింపు దళుకొత్త మెల్లన నిట్టు లనియె.

11


సీ.

విను సామి! నీతండ్రిపనుపున నీమామ
            యగుకుంభకునియింటి కరుగుదెంచి
యతనిసేమంబెల్ల నారసి మీసేమ
            మెలమితో నతనికిఁ దెలియఁ జెప్పి
యమ్మేటి యిడుమానికమ్ములు సొమ్ములు
            వలువలుఁ గైకొని వచ్చునెడను
దనముద్దుఁబట్టి నీలను దోడితెచ్చి యెం
            తయు నెమ్మి దీనికిఁ దగిన పెండ్లి


తే.

కొడుకుఁ దెల్పు మటంచు నన్ గూర్మి నడిగి
మిమ్ముఁ జెప్పిన నతఁ డపు డెమ్మె నలరి
నందునకు మీకు నెఱిఁగించి పొందుమీఱ
నయ్య! యిప్పని యొడగూర్చు మనుచు వేఁడె.

12


తే.

జాను మీఱినచానయు మేనమామ
కూఁతురును లేఁతపరువంపుగుబ్బెతయును
నెవరు కదిసిన దగుటను నీకు దాని
కోర్కు లివురొత్తఁ దవులుకోఁ గూడు నొడయ.

13


క.

ఆకన్నియసోయగ మో
రాకాసులసూడ! పాఁపరాకొమ్మలయం

దేకడ నరసిన లేదు సు
మీ కడమ యిం కేల తెల్ప మీకడ మఱియున్.

14


ఆ.

చామమోముగోము చందమామను గెల్వఁ
జాలు మేలుతేనెజాలుఁ బోలుఁ
గలికికులుకుఁబలుకు లలవెలందుక గొన
బారనారు తేఁటిబారుఁ గేరు.

15


ఉ.

చిందము చందమామ సుడి సింగము రిక్కలు నువ్వుఁబువ్వుమేల్
చెందొద లద్దముల్ చివుర చిల్వ మొగు ల్తరఁగల్దొనల్నన
ల్కుందన మంచబోదలును గుబ్బలులు న్మగఱాలతిన్నలుం
బొందుగఁ గూర్చి యమ్మెఱుఁగుఁబోఁడిని నల్వ యొనర్పఁబోలుఁబో.

16


సీ.

అడుగులు చెందొవలారుతుమ్మెదబారు
            కన్నులు వాలికగండుమీలు
కుత్తుక చిందంబు గుబ్బలు జక్కవ
            ల్నెమ్మోము విరిదమ్మినెఱులు నాఁచు
నగవులు నురువులు నడలు రాయంచలు
            స్రుక్కులు తరఁగలు పొక్కిలి సుడి
మీఁగాళ్ళు తాఁబేళ్ళు మెఱుఁగుఁజేతులు తూండ్లు
            చెన్నారుపిఱుఁదులు దిన్నియలును


తే.

గాఁగ ననయంబుఁ బలుసోయగంపుఁగొలఁకు
నాఁగ నలువొందు నయ్యెలనాఁగబాగుఁ
బొగడ నలవియె పలుకులపొలఁతి కైనఁ
జిలువదొరకైన మఱియు నన్నలువకయిన.

17

ఆ.

కెంపుఁ బెం పడంప సొం పగువాతెఱ
మిన్నుఁ జెన్ను నెన్నుఁ గన్నెనడుము
మీల నేలఁ జాలు వాలుఁగన్నుంగవ
తేఁటిదాటు మీటు బోటికురులు.

18


చ.

పలుకులఁ దేనె లూరు మెయి బంగరునిగ్గులు దేఱుఁ జూపులం
దళుకులు మీఱుఁ జెక్కులను దద్దయు ముద్దులు గాఱు మోమున
న్వల పలరారుఁ గ్రొమ్మొగలువన్నియఁ గేరును గొప్పు తీ రహా!
చిలుకలకొల్కిసౌరు నెఱిఁ జెప్పఁగ నల్వకునైనఁ దీరునే?

19


సీ.

ఎలనాఁగతుఱుమున కెనగాక తుమ్మెద
            కొదమకూటువులు పల్వొదలు దూఱెఁ
జానవేనలితోడ సరిగాక యొడలిచూ
            పులదొరరతనముల్ పూరిఁ గఱచె
ననఁబోఁడినునుఁగొప్పునకు దీటుగాక ని
            చ్చలును జీఁకటులు మూలలను డాఁగెఁ
గడుముద్దుగుమ్మక్రొమ్ముడితోడ దొర గాక
            తొలుమబ్బుతుటుములు మలలఁ బట్టెఁ


తే.

జూపఱకుఁ గొలఁదికి మీఱుసొంపు నింపుఁ
బెంపుఁగలయలచెలిచెలువంపునెఱుల
గుంపునకు జోకగాక నిద్దంపునాఁచు
జొంపములు నీటఁ బడుఁ గడుఁదెంపుచేసి.

20


తే.

మగువమొగమున కెన గాక మిగులఁ బొగిలి
తొగలచెలికాఁడు పదియాఱుతునియ లయ్యె

సిరుల కిర వగునెత్తమ్మివిరి దలంకి
యొయ్య నొయ్యన వేమాఱు వ్రయ్య లయ్యె.

21


తే.

పగడము మంకెనవిరియును
జిగురాకును దొండపండుఁ జెందిరమును సొం
పగతమ్మి కెంపుగుంపును
ముగుదనిగారంపుఁదొగరుమోవికి దొరయే?

22


ఉ.

పట్టకముందె క్రొన్ననలబంతులు గందును గోరు నాటఁగ
న్గట్టిగ నుండుఁ గొండలును గైకొన నబ్బక పోవు జక్కవల్
పట్టుగ రాసినం గరఁగి పారెడు మేలిపసిండిగిండ్లు నిం
కెట్టుగ నీడనం బొసఁగు నింతిమిటారపుగుబ్బదోయికిన్.

23


క.

కొండలమెండును మారెటి
పండులసోయగము జక్కవలకూడిక పూఁ
జెండులపసయును బంగరు
కుండలమెఱుఁగు న్వెలందిగుబ్బల కడఁగున్.

24


తే.

అలరుపొక్కిటపొన్నపూవలన వెడలి
కులుకుఁజన్గుబ్బతమ్మిమొగ్గలకు సాగు
జమిలిముక్కాలికొదమపెంజాలనంగ
నలరుఁబోఁడికి మెఱుఁగారునారు దనరు.

25


ఉ.

దానిపిఱుందునందమును దానిమిటారపుటారుసౌరునున్
దానివెడందపెందుఱుము దానిచొకారపుగబ్బిగుబ్బలున్
దానిజగానిగారమును దానియొయారపుఁదళ్కుఁజూపులున్
దానిమొగంబుఁ గన్న జడదారులకైన విరాళ మెత్తదే?

26


సీ.

వలపులదీవి కెందలిరుజొంపముమావి
            మరునిపూఁదూపుచేమంతిబంతి

యన్నులతలమిన్న యాణిముత్తెపుఁగ్రోవ
            పండువెన్నెల నిగ్గుబలుకుఁజిలుక
కపురంపుబరణి నిల్కడఁ గన్న క్రొమ్మించు
            పగడపుఁదీవ మేల్పసిఁడిబొమ్మ
కొదమరాయంచ కుల్కుమిటారి వన్నెల
            గని చొకారపుమానికములమూట


తే.

యాముటేనుఁగుగున్న యొయ్యారములకుఁ
దీరుకస్తురిలప్ప సొంపారుపికిలి
చెండు నాఁగఁ దనర్చి యచ్చెరువుమీఱఁ
దద్దయుఁ జెలంగుఁజుమ్మ యమ్ముద్దుగుమ్మ.

27


మ.

పలుకు ల్వేయు నిఁకేల యాచెలువ యాబంగారుకీల్బొమ్మ యా
కులుకుంబాయపుఁగల్కి యావలఁతి యాగొజ్జెంగపూబంతి యా
యలరుంబోఁడులమిన్న యాముగుద యాయందంపురాచిల్క యా
వలపుంగప్రపుదీవి యామగువ యావాల్గంటి నీకే తగున్.

28


తే.

చక్కఁదనమును గొనమును జవ్వనంబు
మక్కువయుఁ బ్రోడతనమును నిక్కువంబుఁ
దాలిమియుఁ గల్గునిల్లాలి నేలువాని
కారయఁగ వేల్పురాచప్రో ల్గోర నేల?

29


చ.

చెలువుఁడ! నీయెడం జెవులు చీఁదఱఁ జెందఁగఁ బెక్కులాగులం
బలుకఁగ నేల? యాతలిరుఁబాయపుటన్నులమిన్నచెల్మి నీ
కలవడెనేని మేలిపదియాఱవవన్నెపసిండితోడ వే
ల్పులదొరమానికంపురవఁ బొందుగఁ గూర్చినచంద మౌఁజుమీ.

30

తే.

ప్రోడలై చూడఁ దగుగొల్లపూవుఁబోండ్ల
చెలిమి గలదని దానిపైఁ దలఁపుమాన
వలదుసుమి! మంచిపనసపండులమెసంగు
జాణలకు మావిపండులు చవియ కావె?

31


తే.

కమ్మవిల్కానిచేతిపూఁగొమ్మ ముద్దు
గుమ్మ నిద్దంపుజాళువాబొమ్మ వలపు
గ్రమ్మనిమ్మగుకపురంపుదిమ్మ సుమ్ము
కొమ్మ నెమ్మె దలిర్పఁ గైకొమ్మ లెమ్మ.

32

నీలయందలి వలపును గృష్ణుఁడు విప్రునితోఁ జెప్పుట

క.

అని పంటవలఁతిజేజే
వినిపించిన నాలకించి వ్రేతలమేల్వాఁ
డెనలేనికోర్కు లెదలో
ననలెత్తఁగ నతనిఁ జూచి నగుచుం బలికెన్.

33


ఉ.

ముందొకకర్జ మూని చని ముద్దులగుమ్మ నొకర్తు నక్కడం
బొందిక సేసి రాసిరులు పూన్చుచు వేమఱు వీనుదోయికి
న్విందొనరించి తౌ మిగుల నేర్పున నోబలునేలవేల్ప! మే
ల్పొందఁగ మీకుఁ జెల్లుఁగద పొల్పుగ మేల్పను లెల్లఁ గూర్పఁగన్.

34


క.

చెన్నొదవెడునన్నవలాఁ
గన్నారం గన్ను లలరఁ గన్గొనియెడు మే
లెన్నఁడు గల్గునొకో యని
యెన్నెదఁ జుమ్మయ్య మిగుల నెదలో నెపుడున్.

35

సీ.

కలికినెమ్మోముజాబిలిరంగు లొదవక
            చెలువంపుఁగనుఁదొవల్ చెలఁగుటెట్లు?
సకియనుంగెమ్మెవిచక్కెర ల్జుఱ్ఱక
            వలకాఁక పెనుదప్పి వదలుటెట్లు?
లెలనాఁగబిగికవుంగిలిజోడుఁ దొడుగక
            యెద నంటుబలుతూపు లెడలుటెట్లు?
కొమ్మసింగారంపుఁగొలఁకునం దేలక
            బలువిరాలపుఁవెట్ట దొలఁగుటెట్లు?


తే.

మెలఁతుకలమిన్ననిద్దంపు మేల్పసిండి
గలుగకుండిన మదిలోన గాట మగుచు
నిచ్చలును హెచ్చుకలఁక నిప్పచ్చరంబు
విడుచుటెటులింకఁ బరికింపఁ బుడమివేల్ప!

36


తే.

కులుకుఁబాయంపుముద్దులగుమ్మ గలుగు
సొగసుకానికిఁ దెఱగంటిచిగురుబోండ్లుఁ
బులుఁగురాచేడియలును జక్కువెలందు
కలును వీనులకంటిచెల్వలు నిఁకేల?

37


క.

కన్నియలా గంతయు నిటు
విన్నప్పటినుండి తలఁపు వేఱొకపనిపైఁ
జెన్నలర దెన్ని తెఱఁగుల
నన్నెలఁతుకఁ గూర్మిఁ బెండ్లియాడెదఁ జుమ్మీ.

38


తే.

జాళువాబొమ్మకెన యనఁజాలు వాలుఁ
గంటి నన్నన్న! కన్నులఁ గంటినేని
వలవకున్నను నీకు మేల్వలువలిత్తు
నేలవేలుప! యిఁక వేయునేల? వినుము.

39

చ.

అని తెలిదమ్మికంటి మదినంటి పెనంగొనుకూర్మి నాడినం
గనుఁగొని జన్నిగట్లతలకట్టపు డెంతయు నుబ్బి సామి! నీ
కనికర మింత నాపయినిఁ గల్గినఁ జాలుఁ గొఱంత యేమియం
చును వెరవొప్ప నిట్టులనుచుం బొగడంగఁ దొడంగె నద్దొరన్.

40

కృష్ణుని విప్రుఁడు పొగడుట

దండకం.

సిరిమగఁడ! నిన్నుం దిరంబొప్ప నప్పాఁపఱేఁ డట్టి రాయంచవార్వంబుజోదైన నోరార నగ్గింపలే రన్నచోఁ బిన్న లెట్లెన్నఁగాఁ జాలువా? రెన్న నోయన్న! మున్గూళరాకాసిబల్కూటువ ల్మోవఁగాలేక పెన్ వ్రేగునన్ లోఁగు నమ్మన్నుఁబూఁబోడికై ప్రోవులై కూడి జేజేదొరల్ వేఁడఁగా వేడబం బొప్ప నివ్వేసమిట్లూని తౌ నీవు గావించు చెయ్వు ల్నెఱిం బూని వాక్రువ్వ నెవ్వారికిం దీరు? మున్మీనుమే నూని మున్నీరు సొత్తించి ప్రాఁబల్కుముచ్చి న్వడి న్వ్రచ్చి నెత్తమ్మిపూఁజూలి నుబ్బింపవా? పెంపు రాణింపఁ దొల్వేల్పులు న్వేల్పులం గూడి పాలేఱు వేత్రచ్చుచో మేటితామేటిమై యెత్తి మవ్వంపుఁగవ్వంబుగ ట్టేపున న్వీఁపునందాల్పవా? నేలయెల్లం దగంగొంచుఁ బెంజిల్వరాటెంకికిం బాఱునాజాళువాకంటిరేద్రిమ్మరిన్ జన్నపుంబందివై క్రుమ్మవా? కన్నపట్టిన్ లలిం బట్టి కాఱించునవ్వేల్పుసూటేలికం జక్కఁగా నుక్కుఁగంబంబునం బుట్టి చక్కాడవా? గుజ్జురూపూని మూఁడంజల న్ముజ్జగంబుల్ గరంబొప్ప నాఁకట్టి చాగంపుబల్రక్కసుం గ్రిందికిం ద్రొక్కవా? గండ్రగొడ్డంట ముయ్యేడుమాఱుల్ కడుందిట్టవై గట్టిగా

నేలఱేండ్లం బడంగొట్టవా? గోతికై కోఁతు లాయెల్గులుం గొల్వఁగా నుప్పుసంద్రంబుఁ బూఁదోఁటకాల్వన్వలెన్ దాఁటి చాల్పుందలల్గల్గురాకాసిఁ బోకార్పవా? దుక్కివాల్ పూని పేరుక్కునన్ రేఁగవా? మ్రాఁకులోఁ దూఱి తొల్వేల్పుఁబూఁబోండ్ల బల్నోము లొక్కుమ్మడిన్ బన్న మొందింపవా? దొడ్డగుఱ్ఱంబుపై నెక్కి యుప్పొంగుచుం దుల్వరాపౌఁజులం దీర్పవా? దేవరా! నీవెకా వేలుపుంబెద్దవై తద్దయు న్నేర్పుతో నిజ్జగం బెల్లఁ బుట్టించి వెన్నుండ వై నిచ్చలు న్మచ్చికంబ్రోచి యామీఁద ముక్కంటివై తీర్తు వెల్లప్పుడు న్నీ మెయి న్నల్వగ్రుడ్డుంగము ల్మేడిపండ్లువ్వలెం బ్రోవులైయుండు నీబూటకుం బెవ్వరున్నేటుగా నారయన్లేరుగా? నిన్నుఁ బేర్కొన్నఁ గన్గొన్న నీబల్లిదంపుంగతల్ విన్న దోసంబులెల్ల న్వెసం బాయు నీమెట్టకెందామరం బుట్టి చెన్నారుమిన్నేటినీ రింత మై సోఁకఁ బున్నెంబు లెన్నేనియుం గల్గు నిన్బత్తితోఁ గొల్వఁగా లేకటాటోటులై పెక్కురిల్లాండ్రునుం బండ్లునుం బుత్తడుల్ మేడలు న్మాడలుం గోకలున్ రూకలున్ గొఱ్ఱెలు న్బఱ్ఱెలున్ మేడలు న్గోడలుం జూచి వేసారకే కాఁపురంబు ల్దిరం బంచు డెందంబుల న్నమ్మి తారూరకే మేలులంబాసి యామీఁదట న్దుంతబాబావజీరుండు గాఱింప మీఱన్ దొసంగుల్ వెసంబొంద వారిం దగం జూచి బిట్టేడ్చుచందంబులన్ రోసి యి ల్వాసి తారెల్ల చెయ్వు ల్విడంగోసి కారాకులు న్దుంపలు న్మెక్కి లోఁ జొక్కుచుం బ్రాఁతపల్కుం గొనల్సారెకుం గాంచి మే ల్దెల్వితో తోనివెల్గుం గనుంగొంచు

వేమాఱు మైసోల్ని రాబారులెల్లన్దిటం బొప్పనిన్ గానఁగా నేర రెవ్వారికిం గీడు గావింపఁగానోడి యేకోర్కులు న్వీడి నీపైఁ దలం పెప్పుడు న్నిల్పి లోఁ దాల్మి దైవాఱఁగాఁ జెయ్వులేమైన నీ కప్పనంబంచుఁ బూఁట ల్వడిం ద్రోచు నాబల్లిదు ల్నీకు విందుల్గదా! నీవు కూర్మిం గనుంగొన్నచోఁ గాక నే నిన్నుఁ గొండాడఁగా నెంతవాఁడ న్నిజం బొప్ప నన్నల్వవు న్నీవె వెన్నుండవు న్నీవె ముక్కంటివి న్నీవె జాబిల్లివిం బ్రొద్దవు న్గాడ్పవు న్నీవె ప్రాఁబల్కులు న్నీవె గట్టుంగముల్ మ్రాకులు న్వాఁకలు న్నీవె కా నెంచి ని న్బత్తి నే ప్రొద్దునుం గొల్చెదన్.

41


తే.

అనుచుఁ గైవార మొనరించు నవ్వలంతి
మన్ను వేలుపుమేల్బంతి మదికి మీఱ
వేడ్క లొనగూర్చి పనిచి యవ్వెన్నముచ్చు
చెలువచెలువంబె పలుమఱుఁ దలఁచుచుండె.

42

కాలనేమికొడుకు లాఁబోతులై పుట్టి జగములను గాసిఁ బెట్టుట

సీ.

అంతట మిథిలలో నలకుంభకునియింట
            మును కాలనేమికి ననుఁగుఁగొడుకు
లగుతుల్వరక్కసు లాఱునొక్కరు దొడ్డ
            యాఁబోతు లై పుట్టి రచ్చెరువుగ
జుట్టువాల్దాలుపుసూడు లెంతయుఁ గ్రొవ్వి
            యెనలేనిలావున నెల్లకడల
మెలఁగుచు ససినెల్ల మేయుచుఁ గోడలు
            వెలుగులు పెండెము ల్విఱుగఁద్రొక్కి

తే.

దొడ్డిపట్టుల నిల్వక త్రోవ నెవరి
నెదిరికొమ్ములఁ గ్రుమ్ముచుఁ గదిసి కోడె
తఱపులను బొడ్చుచును వడిఁ దవిలి ఱంకె
లిడుచుఁ బొగరెక్కి యుక్కున నడరి రెలమి.

43


క.

బెబ్బులులనైన మార్కొను
నబ్బురపుం జేవ గలిగి యాసతగిబ్బల్
నిబ్బరముగ నాఁడెంపుం
గుబ్బలు లిటు లయ్యె నేమొకో యన నలరున్.

44

ఆఁబోతులయుపద్రవమును బ్రజలు రాజుతోఁ జెప్పుట

క.

చెలరేఁగి యిట్టు లెల్లెడఁ
గలయం ద్రిమ్మరుచుఁ జాల గాసి యొనర్పం
దలఁకి పజ లెల్ల నపు డ
గ్గల మగుకడగండ్లఁ జిక్కి గములై సరగన్.

45


తే.

పనసపండులు దబ్బపం డ్లనఁటిపండు
లీడపండులు టెంకాయ లిప్పపూలు
చెఱకుఁగోలలు దేనియ ల్తఱుచుగాను
గొనుచుఁ బఱతెంచి రెకిమీనికొలువునకును.

46


తే.

అరిగి మెల్లన గవనికాపరులచేత
నేలకకుఁ దమరాకడ యెఱుఁగ జెప్పి
యతనియానతిఁ గైకొని వెతలు మఱచి
నగుచు నందఱు గొబ్బున నగరుసొచ్చి.

47


సీ.

మగమానికములక్రొన్నిగనికల్ దులకింప
            బలుతమ్మికెంపుమే ల్పసలు నింప

రేరాచఱాచాయ క్రేవల నలరంగఁ
            బులుఁగుఱాపచ్చరంగులు పొసంగఁ
గఱిరతనంపుఁ జొక్కపుసిరు ల్దళుకొత్తఁ
            బగడంపుగుంపు కెంజిగి యొనర్పఁ
దెలిక్రొత్తముత్తియంబులడా ల్దువాళింప
            వెలుఁగురాఱాహొరంగులు వెలుంగ


తే.

మఱియుఁ బే రగునాఁడెంపుమానికంపు
గముల నిద్దంపునన్నియ ల్గడలుకొనఁగ
నందముల కెల్ల నున్కిప ట్టనఁగఁ జాలు
మేలిపని నొప్పుజాళువామేడలోన.

48


తే.

దొరలు మన్నీలు చెలులు బందుగులు జెట్లు
బంట్లు కబ్బంపుఁగూర్పరు ల్పాళెగాండ్రు
గడనచేడియ లూడిగల్ గాణ లొజ్జ
బాఁపనయ్యలు దీర్పరుల్ బలసి కొలువ.

49


సీ.

బంగారుఁదగటుదుప్పటిచెఱంగులరంగు
            మేచాయ కొకక్రొత్తమెఱుఁగు చూప
బలుముత్తియపుఁజౌకటులడాలు నిద్దంపు
            బవిరిగడ్డముమీఁదఁ జవుకళింప
బూపవెన్నెలఱేనిఁ బోలునెన్నొసలిపై
            జిలుఁగుఁగస్తురిబొట్టు చెలువు మీఱ
సొగసుగా విరిసరుల్ చుట్టి గట్టిగ నిడ్డ
            సిగ పెంపనాఁడెంపు సిరుల నీన


తే.

గొప్పరతనంపుఁబలకము ల్గొలుసులుంగ
రములు మురువులు సింగార మమరఁబూని

వేడ్క లిగురొత్త రెండవ వేల్పుఱేని
కరణి గొలువున్నదొరఁ బొడగాంచి యపుడు.

50


తే.

తమరు గొని చన్నసరకు లెంతయునుబత్తి
నప్పనము సేసి మిగుల జోహారు లొసఁగి
కేల్గవలు మోడ్చుకొని యొకక్రేవ నిలిచి
యెదలఁ గొంకుచు వా క్రుచ్చి రిట్టు లనుచు.

51


క.

దేవర! నీ వీపజలను
బ్రోవగ నిన్నాళ్ళదాఁకఁ బొదలుచు మేమున్
ఠీవి దలిర్పఁగ నెదలో
నేవెఱపును లేక యుంటి మెడలనికడిమిన్.

52


క.

ఇప్పుడు నిదె యచ్చెరువై
చెప్పంగా రానిదొడ్డ చే టొనగూడెం
దప్పక యాలింపుము నీ
విప్పట్టునఁ గినుక లేక యెలమి దలిర్పన్.

53


ఉ.

గొల్లలనాయఁడై పరఁగు కుంభకుమంద న దేమివింతయో
కల్లరిగిబ్బ లేడు పొడ గట్టి పజం గడు గాసిఁ బెట్టుచుం
గొల్లగ నెల్లపైరులను గొంకును జంకును లేక మేయఁగాఁ
దల్లడ మంది వచ్చితిమి తద్దయు మీకిది దెల్పుకోరికన్.

54


క.

గిబ్బ లవి కాఁపువారల
గొబ్బున నొకముద్దఁ జేసికొని మ్రింగుఁజుమీ
దబ్బఱలుగఁ జూడకు మో
యబ్బా బెబ్బులులకైన నటు జంకుదుమే?

55


క.

చలపొడిచి ఱంకె లిడుచును
జలుమఱు ముంగాళ్ళఁ ద్రవ్వి బలువిడిఁ బసికాఁ

పులఁ గ్రుమ్మివిడుచుఁ బైకొని
పొలమంతయు నవియె యగుచుఁ బొగరు సెలంగన్.

56


తే.

ఆకుఁదోఁటలు నుగ్గాడి యరఁటితోఁట
లెల్ల మల్లడిగొనఁ ద్రొక్కి యుల్లికంద
పసుపుఁదోఁటలు జంగిలి కసవుబీళ్ళు
చెఱకుఁదోఁటలు పండినచేలుఁ దీర్చె.

57


క.

ఓరాయఁడ యీయంగద
కోరువలే కిటకు వచ్చె నూళ్ళన్నియు మే
మూరక దబ్బఱలాడఁగ
నేరము నూఱార్లకయిన నీయాన సుమీ.

58

ఆఁబోతులఁ బట్టింపు మని రాజు కుంభకున కాజ్ఞాపించుట

చ.

అన విని నెలఱేఁడు వెఱఁగందుచు వారల నూఱడించి యి
ప్పని సవరింతుఁ బొండనుచుఁ బంపి యెదం గడుఁగిన్క మీఱ గొ
ల్లని బిలిపించి నీవు పదిలంబుగఁ గోడెలఁ బట్టకున్న నా
మునఁ దనరారుచున్ మొదలుముట్టఁగ మేయును బైరులన్నియున్.

59


క.

గట్టిగ నీ విఁక వానిం
జట్టింపుము గాక యున్నఁ బంటింపక పెం
గట్టడవి కయిన వెడలం
గొట్టింపుము చేయవేనిఁ గొఱగాదు సుమీ.

60


క.

బలుసిరి గలుగుట కొరులం
గలఁచుట యెవ్వారి కయినఁ గటకట తగునే?
బలిమి గలవాఁడ వగునీ
కలగిబ్బలఁ బట్టరాదె యాఱడి మేలే?

61

తే.

అనుచు నొడయఁడు నుడివిన విని యతండు
తలఁకి యోతండ్రి యాకోడియలను బట్టి
గట్టిచేసెద నిఁక నింత కసరవలవ
దంచుఁ గడు వేఁడుకొని యింటి కరిగె నపుడు.

62

ఆఁబోతులను బట్టం బూని గొల్లలు భంగపడుట

క.

తనచుట్టంబుల నందఱ
బనివడ రావించి ఱేనిపలుకులు దెలియన్
వినిపించి గిబ్బలను గొ
బ్బునఁ బట్టఁగవలయు నంచుఁ బురికొల్పుటయున్.

63


తే.

గొల్ల లెల్లను బెల్లుగ వల్లియలును
బల్లిదపులంజెపలువులు మొల్లముగను
బూని యమ్మేటిపొగరుటాఁబోతుతుటుము
బలిమి మెఱయంగ డాకొని పట్టఁ దొడఁగి.

64


క.

వలత్రాళ్ళు వైచి యయ్యెడఁ
బలుమాఱును దఱిమి యురులు వన్ని కడున్ దొ
డ్డలు నాఁగి మోది యోదం
బులు ద్రవ్వియుఁ బెక్కుచందములఁ బెనఁగునెడన్.

65


సీ.

వలపగ్గములు ద్రెంచి కలఁబడఁ గొందఱ
            బొఱ్ఱలు వ్రయ్యంగఁ బొడిచి పొడిచి
యెగసి చెంగుల దాఁటి పొగరునఁ గొందఱ
            డొక్కలు నలియంగఁ ద్రొక్కి త్రొక్కి
తొడరి పట్టఁగఁ బోవఁ దొడఁగినఁ గొందఱఁ
            దలల నెత్తురు లుర్లఁ దాఁచి తాఁచి

కెరలి పేరెమువాఱి యురవడిఁ గొందఱఁ
            దుమురుగాఁ బుడమిపైఁ ద్రోచి త్రోచి


తే.

గబ్బితనమున హెచ్చి య గ్గిబ్బకదుపు
నిబ్బరంబుగఁ బట్టంగ నబ్బకున్న
జబ్బుపడి యందఱును గడు నబ్బురముగ
బొబ్బ లిడుకొంచుఁ బాఱిరిఁ ప్రోలిదరికి.

66


క.

అటువలె బలియురు పెక్కం
డ్రటమటమైఁ జన్న విన్న నగుచున్ మిగులన్
దిటము చెడి గొల్లనాయఁడు
కటకటఁ బడి యింక నెద్ది కర్జం బనుచున్.

67

ఆఁబోతులం బట్టినవానికి నీల నిచ్చునట్లు కుంభకుఁడు చాటించుట

తే.

కొంతతడ వెంతయును మదిఁ గుంది యొడయఁ
డేమి గావించునో యిఁక నెట్టు లతని
మ్రోలఁ దెల్పుదు నీయాముటాలపోతుఁ
బిండు నెవ్వాఁడు గెల్వఁగలండు పూని.

68


తే.

తడయఁ బనియేమి మినుసిగదయ్య మింక
నెట్టు గావింపనున్నాఁడొ యెవ్వఁ డెఱుఁగు
నబ్బురం బొప్ప నిత్తఱి నహహ యెట్టి
కీడునకుఁ బుట్టెనో యిట్టిగిబ్బ లేడు.

69


క.

అని యెందు వెరవు దోఁపక
పనివడి యిక్కోడియలను బట్టఁగఁ గలజా
ణని కిచ్చెద నీకన్నియ
నని యెల్లెడలందుఁ జాట ననిచెన్ సరగన్.

70

తండ్రి చాటించుటను విని నీల చింతించుట

క.

అటులఁ దనతండ్రి చాటిం
చుట చెలికత్తియలవలనఁ జొప్పడ విని మి
క్కువ మగువంతలఁ గుందుచు
దిట వింతయు లేక నీల దిగు లెదఁ బొదువన్.

71


ఉ.

అక్కట! తండ్రియేల మరునయ్యకుఁ బెండ్లి యొనర్తునంచుఁ బె
న్మక్కువనుండుచోఁ దెఱఁగుమాలినటక్కరియాలపోతులి
ట్లెక్కడనుండు కల్గె? నిపు డెవ్వరు నెవ్వగఁ దీర్చువార ల
మ్మక్క! హుళిక్కియాసననయంబు మది న్వెతఁ జెందనాయెఁగా.

72


క.

ఇత్తెఱఁ గంతయు నిపుడా
పుత్తడిదువ్వలువతాలుపున కెవ్వారల్
బత్తి నెఱిఁగించి యెదలోఁ
దత్తఱ మంతయును దీర్పఁ దగియెడువారల్?

73


తే.

వెన్నుఁ డాట వీనుల విన్నయపుడె
వచ్చునో లేక యీపని కిచ్చ యిడఁడొ
వచ్చి గిబ్బలఁ గూల్చునో వానివలన
వీఁగి యేఁగునొ యిఁక నెద్ది వెరవు గలదు?

74


తే.

సోఁకుమూఁకలగొంగ యిచ్చోటి కెమ్మె
లూర గొబ్బున వేంచేయ కుండెనేనిఁ
జెల్లబో యింక నెటువంటి చెనఁటిగొల్ల
చెట్టఁబట్టం దయ్యంబుఁ జేయునొక్కొ.

75


సీ.

దట్టంపుమిన్వాఁకతరఁగచాల్పునఁ దేలు
            తెలిపుల్గు బురదగోతులకుఁ జనునె?

పుడుకుమ్రాన్వలితావిపువ్వుఁదేనియ లాను
            మగతేఁటి తుమ్మకొమ్మలకుఁ జనునె?
తొలుమొగుళ్ళిడుచిన్కు లెలమిఁ గ్రోల్వానకో
            యిల బలుమంచుసోనలకుఁ జనునె?
పరువంపుఁ గ్రొమ్మావిపండు లేపున మెక్కు
            చిలుక గాటపుటుమ్మెతలకుఁ జనునె?


తే.

పక్కిరాజక్కిదొరచెల్మిఁ జక్కఁ గోరి
చొక్కుచుండెడుడెంద మమ్మక్క యొక్క
తులువమానిసితోడఁ బొందునకు నిచ్చ
యిడఁగఁ జూచునె తలఁప నెయ్యెడలనైన?

76


తే.

పుడమిలోపల మగవాఁడు పూని తనకుఁ
గోర్కి యగుకల్వకంటిఁ గైకొనుచునుండు
నహహ! తమమది కిచ్చయౌనట్లు మెలఁగఁ
గన్నియల కేమిటికి బల్మి గలుగదయ్యె?

77


సీ.

వ్రేపల్లెనుండి మున్నేపుతో నిచటికి
            నేలవేలుపుఁబెద్ద యేల వచ్చె?
వచ్చి మచ్చికమీఱ హెచ్చుగా హొంబట్టు
            సాలుదాలుపుఁగత లేల తెలిపెఁ?
దెలిపినఁ దండ్రి యచ్చెలువున కీజవ
            రాలి నిచ్చెద నని యేల పలికెఁ?
బలికినమాట యేర్పాటుగా విని తన
            యెదఁ గూర్మి యతనిపై నేల పొడమెఁ?


తే.

బొడమెఁగాకేమి పొగరుటాఁబోతు లేడు
నిత్తెఱంగున దొడ్డిలో నేల కలిగెఁ

గలుగుటకు నేలఱేఁడేల కాఁకసేసె?
నయ్యయో! దయ్యము నిఁకేమి యనఁగఁ గలదు?

78


తే.

చిలుకవార్వంపుమేటివజీరుఁ గేరు
నాలకాపరిసోయగం బనువుమీఱఁ
దలఁచినపుడేమొకాని డెందమున దిగులు
పాయఁగానేర దిఁక నేమి సేయుదాన?

79


క.

ఇప్పని దలిదండ్రులకుం
జెప్పఁగవలె నంచుఁ దలఁప సిబ్బితి మిగులన్
ముప్పిరిగొనుచుం బైపయిఁ
గప్ప నొరులచాటువారు గారే కన్నెల్?

80


చ.

వలనుగ మేలుగీళ్ళు గుడువం దగువారని నమ్మి యెంతయుం
జెలిమి దలిర్ప నిత్తెఱఁగుఁ జెప్పఁగఁ జూచిన సారెసారెకుం
గిలకిలలాడుచు న్మిగులఁగేకలు గొట్టుదు రింతె కాని చి
క్కులు సడలించి మేలుపనిఁ గూర్పఁగ నేర్తురె రాచనెచ్చెలుల్?

81


తే.

అలర వలమురితాలుపుచెలిమి తనకుఁ
గలుగకుండిన వేఱొకతులువ నింక
వలవ నెవరేమి చేసినఁ దలఁక నంచు
నంతకంతకు నగ్గలం బైనతమిని.

82

నీల మన్మథావస్థలం బడుట

సీ.

కనుదోయికెలఁకులఁ గ్రమ్ముపెన్నీటిజా
            ల్బలితంపుగబ్బిగుబ్బలను ముంప
సుడివోనివేఁడినిట్టూర్పుగాడుపుల బ
            ల్వడలఁ గెంజిగిమోవి వాడువాఱ

వెడవిలుకాఁడు బల్విడి నించుపూవంప
            జల్లుపెల్లున మేను దల్లడిల్ల
దట్టంపువలపులఁ దమి బెండుకొని సారె
            సారెకు గుండియ జల్లనంగఁ


తే.

దాళఁజాలక మదిలోనఁ దగులుబాళిఁ
గూలి సోలుచుఁ జాల విరాళిఁ దేలి
తేలి నెచ్చెలిబారుఁ బోఁదోలి మేలి
పూలపానుపుపై వ్రాలి వాలుఁగంటి.

83


క.

ఉసురసు రనుచుం బొరలును
గసరును బస దఱిఁగి వెసను గడగడ వడఁకు
న్విసువున బుసవెట్టును వె
క్కస మగు వలరాచసెగలఁ గ్రాఁగుచు మఱియున్.

84


సీ.

తలయూఁచుఁ దనలోనఁ దాన నవ్వుఁ గలంగుఁ
            గలవరించును బయల్ గౌఁగిలించుఁబిలువ
బిలువకే పలుకుఁ గన్నులు మూయుఁ జెక్కిట
            గైసేర్చు బెదరు నల్గడలు వెదకు
వలిగాడ్పు దూఱు నంచలఁ దోలు దయ్యంబుఁ
            దిట్టు మైతొడవులఁ దీసి వైచు
బోటులఁ గసరు గొబ్బున లేచి చిల్కల
            నడుచుఁ బల్మఱుఁ గొప్పు విడిచి ముడుచు


తే.

నళుకుఁ జిడిముడిపడి సొమ్మసిలు దిటమ్ము
లేక కన్నీరు నించు సళించు నోకి
లించుఁ బిమ్మట గొను దత్తఱించుఁ జాల
నలరువిలుదాల్పుతండ్రిపైఁ దలఁపు నిలిపి.

85

చెలికత్తెలు నీలకు బుద్ధులు చెప్పుట

క.

అట్టియెడఁ జెలిమికత్తియ
లట్టియలుగఁ గూడి చేడియం గని యని రీ
బెట్టిదపువగలఁ బొగులుచుఁ
గట్టా నీ విట్లు డయ్యఁగాఁ దగునె చెలీ!

86


తే.

కన్నియవుగాని ప్రోడవు గావు నీవు
పువ్వుఁబోఁడిరొ సిగ్గెల్లఁ బోవ నడిచి
బలుదొసంగులఁ బొరలఁగఁ బాడె నీకు
నించుకేనియు మదిలోన నెంచ వకట!

87


సీ.

అద్దంబు గని తద్ద నిద్దంపుఁగస్తురి
            ముద్దునెన్నొసలిపై దిద్దవేమి?
కుప్పలై కప్పున నొప్పారుపెన్నెఱు
            లింపుగా దువ్వి పాటింపవేమి?
యెమ్మె నిమ్ముగ మానికమ్ములసొమ్ము లం
            దమ్ముగా నెమ్మేనఁ దాల్పవేమి?
పెట్టెఁ బెట్టినయట్టిజట్టిమీఱినపట్టుఁ
            బుట్టముల్ మట్టుఁగాఁ గట్టవేమి?


తే.

కోరి యోరిమి నోరెంబు గుడువవేమి?
తొడర వలిదావివిరిసరుల్ ముడువవేమి?
నునుపుదళుకొత్తఁ బలుకులు నుడువవేమి?
చామ! నీకిది యెటువంటిజాడ చెపుమ?

88


క.

పలుతెఱఁగులఁ గలఁగుచు నిటు
వలెఁ గొదుకఁగ నేల? లాఁతివారమె నీకుం?

దలఁపునఁ గలపనియెల్లను
దెలుపవె మాతోడఁ బలికి దిటముగఁ గలికీ!

89


క.

తగులమునఁ దగిలి నీ వీ
పగిది న్భిగి తఱిఁగి రేయుఁ బవలు న్మిగుల
న్వగలం బొగులఁగఁ దగవా?
మగువా! నగువారి నెట్లు మదిఁ దలఁపవయో!

90


సీ.

చిలుకబోదల మచ్చికలు చేసి ముద్దులు
            చిలుకఁ బద్దియములు చెప్పరాదె?
తెలిపిట్టగమిఁ జేరఁదీసి తద్దయు బుద్ధి
            దెలిసి మెల్లన నడల్ దీర్పరాదె?
నెమ్మికూటువుల గాటమ్ముగాఁ గూరిచి
            నెమ్మితో నాటలు నేర్పరాదె?
బట్టికాఁడుల నింపు పుట్టునట్టుగఁ గేలఁ
            బట్టి పాటలఁ గఱపంగరాదె?


తే.

చెలఁగి పూఁదీవియలఁ బ్రోది సేయరాదె?
మేలిరతనంపువీణియ మీటరాదె?
నలువుగా నెచ్చెలులఁ గూడి నవ్వరాదె?
కలికి! నీడెందమునఁ జిక్కునులుకుమాని.

91


చ.

కులుకుచుఁ జేరి యాటలకుఁ గూరిమినెచ్చెలు లెచ్చరించినం
బలుకవదేమి? యేమఱక పజ్జల నిల్చినయూడిగంపుటిం
తులఁ గని తద్దయుం గినుకతో నదలించెదవేమి వేమఱుం
జిలుకలకొల్కి! నీవెడఁగుఁజిన్నియ లెన్నఁగఁ గ్రొత్తలిత్తఱిన్.

92


క.

లేమా! నీవెత మానుప
లేమా మోమోటమున సళింపఁగ డేపుని

లే? మాఱుమాట యొసఁగుము
వేమాఱును దలఁక నేల వేదుఱు మీఱన్?

93


తే.

బేల! యీబేరజపుఁదనం బేల? యింక
నాన యింతయు మదిలోన నానఁబోక
నిచ్చలం బొప్ప మాతోడ నిచ్చయైన
దెల్ల నెఱిఁగింపు మెంతయుఁ దెల్లముగను.

94


క.

అని యనుఁగుంజెలు లిత్తెఱఁ
గునఁ బల్కిన నాలకించి కోమలి మిగులం
దనడెందంబునఁ గోరిక
లినుమడియై నెగడ వారి కిట్లని పలికెన్.

95

చెలికత్తెలతో నీల తనతలఁపుఁ దెల్పుట

తే.

వినుఁడు చెలులార! నామాట నెనరుమీఱఁ
దలఁపులోవార లౌ మీకు దాఁపనేల?
డెంద మంతయుఁ గఱివేల్పునందుఁ దగిలి
మరలఁగానేర దిఁక నెద్దివెరవు చెపుఁడ.

96


ఉ.

చక్కెరవింటిజోదు నెకసక్కెములాడఁగఁ జాలుపక్కిరా
జక్కివజీరుచెల్వు చెవిఁ జక్కఁగ నాటిననాఁటనుండి య
మ్మక్క! యదేమొ కాని యెద నంటినకూరిమి యంతకంతకున్
వెక్కసమై పెనంగొనుచు వేమఱుఁ బాయ దిఁకేమి సేయుదున్?

97


ఆ.

మిన్నజన్నిగట్టుగ్రొన్నెల వెన్నుని
చెన్నుమీఱ నప్పు డెన్న మున్న
విన్నకతన నెపుడుఁ గన్నులఁ గట్టిన
ట్లున్న దెడము లేక యన్నులార!

98

తే.

తప్పులెన్నక మొదలినేస్తంబుఁ దలఁచి
యిప్పు డిప్పని యొనగూర్చుఁ డొప్పుమీఱ
మీర లొనరించునట్టియమ్మేలు మఱచు
దానఁ గానుజుఁడీ యెందు జాణలార!

99


క.

అనుచుఁ గడలేనియంగద
గనఁబడ నప్పడఁతి వేఁడికన్నీ రొలుకం
దనతెఱఁ గెఱిఁగించిన విని
యనుగుంజెలు లెల్ల దాని కని రిట్లనుచున్.

100

చెలికత్తెలు నీల నెగ్గులాడుట

క.

కన్నియరొ! యంతపని కయి
వన్నెయు వాసియును దఱిఁగి వగచెద వకటా!
నిన్నేమి యనఁగ గల? మీ
మున్నరికలు వినుట లేదు మున్నెచ్చోటన్.

101


క.

లిబ్బులచెలిపెనిమిటిపై
నబ్బురపున్వలపు నిలిపి యలమట మీఱన్
సిబ్బితి విడిచెదు నీకున్
గబ్బితనం బిట్టు లేల కలిగెనె పొలఁతీ!

102


చ.

కడఁక యొకింత లేనివలకాఁకలఁ గ్రాఁగుదు లోగి ఱాఁగవై
చిడిముడిపాటుతోఁ జెలులఁ జెంతలఁ జేరఁగ నీక తద్దయున్
గడుసుఁదనంబుఁ బూని సరిగన్నియ లందఱు నవ్వ నయ్యయో
యడఁకువ లి యిప్పగిది నాడఁగఁ జెల్లునె ముద్దుఁగన్నెకున్?

103


సీ.

తెలిదమ్మికంటి యిప్పలుకు విన్నంతనే
            కడలేని వేడ్క నిక్కడకు వచ్చు

వచ్చి యచ్చెరువుగా రెచ్చి పాఱెడుగిబ్బ
            పిండు నొక్కుమ్మడిఁ జెండివైచు
వైచి పెంగూర్మి చొప్పడ నెన్నఁగారాని
            పేర్మితో ని న్నిందుఁ బెండ్లియాడు
నాడి నాఁడెపుఁబైఁడియందలంబున నిల్పు
            కొని తనపల్లియ కొనర నరుగు


తే.

నరిగి రతనంపు మేటియుప్పరిగలోనఁ
జెలువు మీఱినగొజ్జెఁగసెజ్జమీఁదఁ
బలుదెఱంగుల వలరాచపనుల నిన్ను
మెఱయఁ గరగించు నమ్ముమీ మెఱుఁగుఁబోఁడి.

104


క.

ముద్దులపట్టివి నీకీ
గద్దఱిచందముల మెలఁగఁగా రాదు సుమీ
తద్దయుఁ బెద్దలఁ దలఁపక
ముద్దియ నీ కింత డెందమున వెత యున్నే?

105


ఆ.

కొలఁదిలేనివేడుకల మును పెంచిన
యంచచిలుకగముల నలుకమీఱఁ
చొడర నడిచి పాఱఁదోలెద వివియేమి
తప్పు సేసె నిపుడు తలిరుఁబోఁడి.

106


తే.

అతివ! యెన్నఁడు మామాట కడుగుదాఁట
కుండుదానవు నేఁడేమి యొండుదెఱఁగు
పూని మాటికి నుడువంగరానికినుక
సేసెదవు నేర మెద్ది మాచెంతఁ జెపుమ.

107


క.

ఎలనాఁగరొ! నీకోరిక
వలనుగఁ జేకూరె నింతవలవంతయుఁ దా

నిలుచును మాపైఁ బలుమఱు
నలుక కడు న్నిగుడ నెగ్గులాడకు మింకన్.

108


వ.

అనిన విని ముద్దియ తద్దయుం బ్రొద్దూరకుండి యన్నెచ్చెలిపిండునకు వెండియు నిట్లనియె.

109

నీల చెలికత్తెలపైన నలిగి మాటలాడుట

ఉ.

మమ్ముర మైనబల్వెతల మున్గుచునుండెడుదానిచుట్టునుం
గ్రమ్మి పడంతులార! కొఱగాములు వేమఱు నెంచ సాగినా
రమ్మకచెల్ల! యల్ల చిగురాకుఁగటారికడిందిజోదుపూ
వమ్ములబారి కోర్వఁదరమా పెఱమాటలు వేయు నేటికిన్?

110


క.

కడనుండి పెక్కుమాటలు
నుడువంగా వచ్చుఁగాక నూల్కొనియెడుపల్
కడగండ్లఁ బడఁగ వచ్చునె?
విడువక యెవ్వారికైన వెలఁదుకలారా!

111


క.

అకటా! బెడిదపువలపుల
సెకలం బడి వ్రేఁగుదానిఁ జేపట్టఁగనొ
ల్లక యిటువలె నెంతురె ని
ప్పుకలపయిన్నేయి చల్లుపోలిక మీఱన్?

112


తే.

వినుఁడు నామాట లిపుడు మీవీనులలర
సైఁపకుండిన నింతియ చాలుఁగాని
యింకనేమియుఁ గొఱగానియెగ్గులాడఁ
బోకుఁడీ మీకు మ్రొక్కెద బోటులార.

113


ఉ.

కూరిమిబోటులంచు మిముఁ గొండగ నచ్చుచు నున్నచో నయో
నేరము లెన్నుచు న్మిగుల నెవ్వగలం గలఁగించి సారెకుం

గేరెద రింతెగాని మదికిం గడు నెమ్మి దలిర్ప నేర్పుతోఁ
గోరినకోర్కి మీఱ సమకూర్చఁగఁ జాలుదురే యొకింతయున్.

114


ఉ.

చక్కఁదనంబు జవ్వనము జాణతనంబు గొనంబు దేజుఁ బెం
పెక్కినయుక్కునున్ సిరియు నిమ్ముగఁ గల్గి చెలంగుచున్న యా
రక్కసిగొంగపైఁ గడుఁదిరంబుగ నిల్పినడెంద మింకఁ దాఁ
డక్కరి నొక్కనిం గవయుట న్నెఱిఁ గోరునె మాట లేటికిన్?

115


క.

మీమాట సేయదని యిం
కేమియు నుల్లమున నలుక లిడఁబోవక మీ
గీములకుఁ బొండు గొబ్బున
వేమాఱును గేలు మొగిచి వేఁడెద మిమ్మున్.

116


చ.

గొనకొని మీయెడన నెఱయఁ గూఱిమి డెందములోనికస్తిమం
తనమునఁ దెల్ప నేరుపులె తద్దయుఁ జూపితి నింతె యందఱున్
వినియెడునట్లుగా నిఁకను వేమఱు నామున నవ్వుకొంచు నో
యనుఁగవెలందులార! మము నాఱడిఁ బెట్టకుఁ డమ్మ వేఁడెదన్.

117


వ.

అని యిత్తెఱంగునఁ నమ్మెఱుంగుఁబోఁడి బిత్తరించుచుం గ్రొత్తవలవంతలఁ దత్తఱించుచుఁ బుత్తడిదువ్వలువదాలుపు పయినత్తినబత్తిం జెలికత్తియలమొత్తంబుల నొత్తియాడుచు నీడులేనికోర్కుల నువ్విళ్ళూరుచుండెనని నిరాబారిసింగంబులకు గతయెఱింగించుజడదారి వినిపించిన వార లతని నవ్వలికతయుఁ దెలుపుమని వేఁడిన.

118

మ.

మలసూడగ్గి జముండు రక్కసుఁడు నీర్మైతాల్పురాగాడ్పుజ
క్కులఱేండ్లు న్విసదారితాలుపును బల్కుంబోటిగేస్తుండుఁ బు
ల్గులరాడాల్దొరయు న్మొదల్గలుగువేల్పు ల్గొల్వ నవ్వెండిగు
బ్బలిపైనుండి జగంబులేలుబలువేల్పా! గట్టువిల్దాలుపా!

119


తే.

కడలిదొన పాఁపనారియుఁ బుడమితేరు
గట్టువిల్లును దొలిపల్కుగమిగుఱాలుఁ
బులుఁగుడాల్వేల్పుములిఁకియుఁ బూని కడిమి
మెఱయఁ దిగప్రోళ్ళుగూల్చినమేటివేల్ప.

120


మాలిని.

కదలనిబలుతేరున్ గాడుపున్ మేయుపేరుం
గుదు రగుతలయేఱుం గొండపై మేల్బిడారుం
గొదుకక పలుమాఱుం గోరికల్ గూర్చుతీరుం
బొదలెడిమెయిసౌరుం బూని యొప్పారుమేటీ!

121


గద్యము.

ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్త్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయప్రణీతం బైననీలాసుందరీపరిణయం బను నచ్చతెనుఁగుఁ బ్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.