నా జీవిత యాత్ర-4/1937 లో శాసన సభ ఎన్నికలు

వికీసోర్స్ నుండి

1

1937 లో శాసన సభ ఎన్నికలు

మొదటి కాంగ్రెసు మంత్రివర్గం గురించి, అనగా - 1937 జూలై పద్నాలుగవ తేదీ లగాయితూ 1939 సెప్టంబరు వరకూ రాజాజీ ఆధ్వర్యాన నడచిన ఉమ్మడి చెన్నరాష్ట్ర రాజకీయాలను గురించి సరిగా అవగాహన చేసికొనేటందుకు 1937 ఫిబ్రవరిలో జరిగిన జనరల్ ఎన్నికల విషయమై కొంత చెప్పవలసి ఉంది.

1921 లో కాంగ్రెసువారు ప్రకటించిన శాసన సభా బహిష్కార సూత్రంలో 1923 ఫిబ్రవరినుంచి క్రమంగా మార్పు వచ్చిన విషయం పాఠకులకు విదితమే. 1934 లో గాంధీజీ కాంగ్రెసు మూలసభ్యత్వం నుంచి విరమించుకోవడం, ఆ సంవత్సరం కేంద్ర శాసన సభ ఎన్నికలలో కాంగ్రెసు పాల్గొని ఎన్నో రాష్ట్రాలలో అఖండ విజయం సాధించి కేంద్ర శాసన సభలో ప్రధానమైన ప్రతిపక్షంగా ఏర్పాటు కావడంకూడా పాఠకులకు తెలిసినవే. ఈ కారణంచేత కాంగ్రెసువారి దృష్టి శాసన సభలపైన గట్టిగా పడింది. ఇంతేకాక, 1927 మొదలు 1930 వరకు, తర్వాత 1934 నుండి అప్పటివరకు శాసన సభా కార్యక్రమంలో ప్రతిపక్షంగా కాంగ్రెసు నాయకులు చూపిస్తూ వచ్చిన చురుకుదనాన్ని బట్టికూడా స్వరాజ్య సంపాదనకు శాసన సభలు ప్రధాన ద్వారాలన్న అభిప్రాయం అందరికీ కలిగింది.

ఇలా ఉండగా, 2 - 8 - 1935 వ తేదీన ఇంగ్లీషు పార్ల మెంటులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్లు, ఆక్టుక్రింద పాస్ అయి ఉండెను. ఈ ఆక్టుక్రింద, కేంద్ర ప్రభుత్వంలో, ప్రజలకు ఏవిధమైన అధికారమూ సంక్రమించక పోయినా, రాష్ట్రాలకు ఏర్పాటు చేసిన విషయాలలో మాత్రం కొంత స్వాతంత్ర్యం ఇవ్వబడింది. (దీనికే ఆ రోజులలో రాష్ట్రీయ స్వపరిపాలన [ప్రొవిన్షియల్ అటానమీ] అనే నిర్వచనం ఉండేది.) ఈ కారణాలవల్ల ఆ ఆక్టుక్రింద జరగబోయే ఎన్నికలలో కాంగ్రెసువారు పాల్గొని జయం సాధించవలెనన్న నిశ్చయం ఒకటి అందరి పెద్దలకూ ఏర్పడింది. ఎటువచ్చీ ఎన్నికలలో గెల్చిన తర్వాత మంత్రి పదవులను స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై మాత్రం కొంత సందేహం కలిగింది. ప్రకాశంగారు, సాంబమూర్తి గారు, నేను మొదలైనవారం మంత్రి పదవులను అవకాశ మున్నచోట తప్పక కాంగ్రెసువారు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంలో ఉండేవాళ్ళము. పై స్థాయిలో జవహర్‌లాల్ నెహ్రూ, మన ఆంధ్రస్థాయిలో డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు మొదలైనవారు ఎన్నికలలో పాల్గొనవచ్చు గాని, మంత్రి పదవులను స్వీకరింపరాదన్న అభిప్రాయంలో ఉండేవారు. దీనికి కారణం - పూర్వ కాలంలో మోస్తరుగా మంత్రి పదవి, బ్రిటిష్ గవర్నమెంటువారు ఇచ్చేదనీ, అది మనం స్వీకరిస్తే ధర్మంక్రింద స్వీకరించి నట్టవుతుందనీ వారు భావించడమే.

నేను లక్నోలో 1936 లో జరిగిన ఏ. ఐ. సి. సి. సమావేశంలో ఉత్తరార్దమందు, మంత్రిపదవి స్వీకరించక కేవలం ప్రతిపక్షంగా కూర్చుని ఉన్నట్లయితే, - ఏ సమయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే మంత్రివర్గంతో సహకరించాలో, ఎప్పుడు సిద్ధాంతానికి వ్యతిరేకంగా తప్పటడుగు వేయవలసివస్తుందో తెలియక కాంగ్రెసు పార్టీవారు కలవరపడే స్థితిలో ఉండడమేకాక, వారి దృష్టి చెడిపోయే అవకాశం ఉంటుందనీ, బలం ఉండి ప్రతిపక్షంలో కూర్చునట్లయితే సముద్రం ఒడ్డున ఇసుకపైన పంట పండించడానికి ప్రయత్నించే విధంగా వృథా ప్రయాస అవుతందనీ; అందుకు తార్కాణంగా 1927 మొదలు 1930 వరకు చెన్నరాష్ట్ర శాసన సభలో కాంగ్రెసువారు చేసిన అవకతవక లన్నిటినీ ఉదహరించి ఏ. ఐ. సి. సి. సభ్యుల మనస్సులను పదవీ స్వీకరణమే మంచి దనేటట్లు మార్చడం జరిగింది. అయినా, అది రాబోయే డిసెంబరులో కాంగ్రెసు సాంవత్సరిక సభలో అంగీకారం పొందవలసి ఉండినది. ఈ లాగుననే, ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఆంధ్ర మహాసభలలో కూడా ఒక నిర్ణయానికి రాగలిగితిమి. ఆ కారణంచేత ఆంధ్రప్రాంతంలో ఎన్నికల వాతావరణం జయసూచకంగానే ఉండినది.

ప్రకాశంగారు లోగడవలెనే రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా ఉండేవారు. చెన్నరాష్ట్రం ఉమ్మడిరాష్ట్రం కావడంచేత ఆంధ్ర, తమిళ, కేరళ, కర్నాటక భాగాలన్నిటిపైనా యాజమాన్యం గల ఒక ప్రత్యేక ఎన్నికల సంఘాన్ని నాలుగు రాష్ట్రాల కాంగ్రెసు అధ్యక్షులతో ఏర్పాటు చేయడమైనది. ఈ ప్రత్యేక సంఘానికి ఒక్క చెన్నపట్టణ నియోజక వర్గాల విషయంలోనే బాధ్యత ఉండినది. రాష్ట్రంలోగల ఇతర ప్రాంతాలలో రాష్ట్రసంఘంవారి ఏర్పాట్ల ప్రకారమే అభ్యర్థులను నిర్ణయించుకోవడం జరిగింది.

ప్రకాశంగారి అభ్యర్థిత్వము

1907 లో బారిష్టరు వృత్తి నారంభించినది మొదలు అప్పటి వరకు - అంటే ముఫ్పై సంవత్సరాలుగా ప్రకాశంగారు చెన్ననగర నివాసి కావడంచేత, ఆయన చెన్నపట్టణానికి ఏర్పటైన నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉండగలరని మా అందరి ఊహ. అలాగే నియోజక వర్గంలోని నగరవాసులూ ఊహించారు. అయితే ప్రత్యేక సంఘంలో తమిళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన సత్యమూర్తి అనే ఆయన మొదటినుండీ తెలుగువారికి చెన్నపట్నంలో ఏవిధమైన పలుకుబడీ ఉండకూడదని ఒక గట్టి అభిప్రాయం గలవారు. అందుచేత, ప్రకాశంగారు గోదావరి జిల్లా నియోజక వర్గంలోంచి వస్తే బాగుంటుందని ఆయన ప్రకాశంగారి పేరు చెన్నపట్నం నియోజక వర్గం అభ్యర్థుల జాబితానుంచి తప్పించారు. ప్రకాశంగారు ఇది తెలిసి "ఇలా ఎందుకు జరిగిం"దని అడిగితే, బాబు రాజేంద్రప్రసాద్‌గారి కోరికపై ఇలా చేయడమైందని సత్యమూర్తిగా రన్నారు. అది కేవలం అభూత కల్పనగా ఉందని ప్రకాశంగారికీ, మాకూ కూడా తోచి, రాజన్‌బాబుగారిని ఈ విషయమై అడిగాము. వారు దాంతో తమకు ఏ విధమైన ప్రసక్తీ లేనట్టు చెప్పారు. అయినప్పటికీ, ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయమై నియోజక వర్గంలో అభ్యంతరాలు ఉన్నాయనీ, దాని తుది నిర్ణయం కేంద్ర కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డువారికి వదిలి వేయాలని ఆ ప్రత్యేక కమిటీవారు తీర్మానించుకొన్నారు. రాష్ట్రం అంతా అభ్యర్థుల్ని నిలబెట్టే అధికారం, పలుకుబడీ కలిగిన ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయంలోనే అనుమానం ఏర్పడిన పరిస్థితి కలిగింది. రాజకీయాలలో ఇటువంటి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి.

అప్పటికి కొన్ని సంవత్సరాల ముందునుంచి రాజాజీ రాజకీయాలలో అట్టే జోక్యం కలుగచేసుకోకుండా, దూరంగా ఉండేవారు. 1936 లో జరిగిన లక్నో ఏ. ఐ. సి. సి. సమావేశంలో ఎలక్షన్‌లో కాంగ్రెసువారు పాల్గొని మంత్రివర్గాలు ఏర్పాటు చేయాలని నేను వాదించి ఉపన్యసించినపుడు ఆయన సభానంతరం నన్ను చాలా ప్రశంసించారు. అది దూరంగా ఉన్న పెద్దలు చేసిన ఆశీర్వాదపూర్వక ప్రశంసగా భావించారు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలలోకి తిరిగివచ్చే అభిప్రాయం ఉన్నట్టు ఆ నాడు ఎవ్వరమూ గ్రహించలేక పోయాము. ఇప్పుడు అభ్యర్థులను నిర్ణయించే సమయంలో ఆయన ఇతరులకు తెలియకుండానే హెచ్చు జోక్యం కలిగించుకోవడం జరిగింది. వల్లభభాయి పటేలుగారు కేంద్ర పార్లమెంటరీ బోర్డు తరపున ఆంధ్ర, తమిళ, కేరళ, కర్నాటక అభ్యర్థుల జాబితాలను పరిశీలించి, చెన్నపట్నం విషయం మాత్రం - అంటే ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయం అంతా బొంబాయిలో నిర్ణయిస్తానని, అక్కడికి రావలసిందని ప్రకాశంగారిని కోరారు. వల్లభభాయి పటేల గారు బయలుదేరిన బండిలోనే రాజాజీ కూడా కూచుని వెళ్ళడం తటస్థించింది. ఆ బండిలోనే ప్రకాశంగారు వేరుగా మరోపెట్టెలో కూచున్నారు. ఆ రైలు చెన్నపట్నం స్టేషను నుండి బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు - రాజాజీ, పటేలు కూచున్న బండి ఎక్కడానికి తొందరగా వెతుక్కుంటూ వచ్చారు. ఆ కంపార్టుమెంటులోకి ఎక్కగానే రాజాజీ దేశభక్తుని అతి గౌరవంగా లోపలికి పిల్చి, పటేలుగారి పక్కన కూచోమన్నారు. ఇతర ప్రసంగాలు చేయటానికి వ్యవధి లేకపోవడంచేత పటేలుగారు ప్రకాశంగారి అభ్యర్థిత్వ విషయమై ప్రశ్నించారు. వెంకటప్పయ్యగారు "ప్రకాశంగారు లేకుండా శాసన సభ ఎలా ఉండగలదు." అని తిరిగి ప్రశ్నించగా, రాజాజీ అసంతుష్టితో కొంచెం దూరంగా జరిగారు.

వెంకటప్పయ్యగారికి ప్రకాశంగారంటే పడనందున, ఆయన ప్రకాశంగారిని అభ్యర్థిగా నిర్ణయించ కూడదని తప్పక చెప్పగలరన్న అభిప్రాయంతో వెంకటప్పయ్యగారికి ప్రత్యేకంగా కబురంపి రాజాజీ రైల్వేస్టేషన్‌కి రప్పించారు. కాని, ఆయనకు ఆశాభంగం కలిగింది. వెంకయప్పయ్య గారు పెద్దవారు గనుక ఆ విధంగా తమ అభిప్రాయం తెలిపారు. ఆయనను ఏమనడానికి తోచక, "సరే, మీరు వచ్చిన పని అయింది. రైలు బయలుదేరుతూంది. మీరు వెళ్ళండి." అని వారిని పంపివేశారు.

ట్రెయిన్ రేణిగుంటకు వెళ్ళేసరికి శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారు రాజాజీ, పటేలు కూచున్న బండి ఎక్కడని అడుగుతూ ప్లాట్‌ఫారంలో అటూ ఇటూ తిరుగుతూ వెతుక్కుంటూ వచ్చారు. మొదట్లో ప్రకాశంగారి ముఖం ఆయనకు కనిపించింది. "ఏమయ్యా, అంత తొందరగా అటు ఇటు చూస్తున్నా?"వని ప్రకాశంగారు అయ్యంగార్ని అడిగారు. పటేలు గారిని కల్సుకోవాలని రాజాజీ తంతి యిచ్చినట్లూ, అందువల్ల ఆయనకోసం వచ్చినట్టూ అయ్యంగారు చెప్పారు. అప్పటికి అయ్యంగారు కేంద్ర శాసన సభలో సభ్యుడు. పటేలు కూచున్న కంపార్టుమెంటు ఎటున్నదో అయ్యంగారికి ప్రకాశంగారు చేత్తో చూపించారు. అయ్యంగారు అక్కడికి వెళ్ళేసరికి పటేలు అయ్యంగారికి ప్రత్యుద్ధానం చేసి ప్రక్కన కూచోమన్నాడు.

ఇక్కడ కూడా ఇతర ప్రసంగాలకు వ్యవధి లేనందువల్ల పటేలుగారు తటాలున అయ్యంగారిని "ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయమై ఏమిటి మీ అభిప్రాయం?" అని అడిగారు. అయ్యంగారు దానికి జవాబుగా, "ఇటువంటి ప్రశ్న మీ మనసులో ఎలా ఉద్భవించింది? ఆయన లేకున్నట్టయితే శాసనసభ ఎలా ఉండగలదు?" అన్నారు.

ఆ మాటలు వినేసరికి రాజాజీకి బ్రహ్మాండమైన ఆగ్రహం వేసి, "సరే లేవయ్యా! ఆ దివాలా కోరుతో నువ్వు కాపురం చేయవయ్యా!" అని మందలించి కూచున్న స్థలంనుంచి లేచిపోయారు. రైలు టైముకూడా అయిపోయింది. అయ్యంగారు దిగిపోయారు. రైలు కదిలింది.

బొంబాయి వెళ్ళాక పటేలుగారున్నూ, వర్కింగు కమిటీవారున్నూ మొదట అనుకున్నట్లే ప్రకాశంగారిని చెన్నపట్టణానికి ఏర్పాటయిన నియోజక వర్గంలోనే స్థిరపరిచారు. ఇది ఆ ఎన్నికలో మొదటి ఘట్టం.

జమీందారులతో పోరాటాలు

దేశంలో కాంగ్రెసువారియెడల అభిమానం పెల్లుబికి పోయింది. విశాఖపట్నం జిల్లా బొబ్బిలి నియోజక వర్గంలో ఇప్పుడు రాష్ట్రపతిగారయిన గిరిగారిని కాంగ్రెసు అభ్యర్థిగా నిర్ణయించడమైంది. అప్పటికి గిరిగారు కేంద్ర శాసన సభలో సభ్యులుగా ఉండేవారు. బొబ్బిలిలో ఈయన ప్రత్యర్థి బొబ్బిలి రాజావారే. ఆయన అపుడు చెన్నరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఎన్నికల సందర్భంగా నెహ్రూగారు మన రాష్ట్రానికి రావడం సంభవించింది. ప్రకాశంగారూ, ఆయనా కలసి బొబ్బిలికి ఎన్నికల ప్రచారంకోసం వెళ్ళారు. తీరా వెళ్ళేసరికి బొబ్బిలి రాజావారు బొబ్బిలిలో లేరు. నెహ్రూగారు స్థానిక కాంగ్రెసువారు ఏర్పాటుచేసిన సభాస్థలానికి చేరేసరికి, డప్పులు - వాయించుకుంటూ కొంతమంది, కేకలువేస్తూ కొందరూ నాలుగువైపుల తిరగడం ఆరంభించారు. ఆయన మాట్లాడడానికి ప్రారంభించేసరికి డప్పులు చేసేగోల చాలదని ఒక ఏనుగుకూడా నడిపించుకుంటూ ఒక మావటివాడు ప్రేక్షకుల గుంపులోకి వచ్చాడు. సభలో గగ్గోలు బయలుదేరింది. ఇదేమిటని నెహ్రూగారు అడగగా, స్థానిక కాంగ్రెసు నాయకులు, "ఈ ఊళ్ళో కాంగ్రెసు మీటింగులు జరగకూడదని రాజావారి మను షులు ఇలా అల్లర్లు చేయిస్తూండడం మామూలే," అని చెప్పారు. ఎదురుగుండా దూరంగా ఉన్నవారంతా రాజావారి మనుషులు అని కొందరిని చూపించారు. ఈ లోపున డప్పుల చప్పుళ్ళు, ఏనుగు తమ మధ్యలో నడవడంచేత ప్రేక్షకులు చేసే గోల, కేకలు హెచ్చయినాయి. ఏనుగు నెహ్రూగారికి కొంచెం దగ్గరపడింది. ఆవేశంతో నెహ్రూగారు దాని తొండంపైకి ఎగరబోయారు. అప్పుడు , అంతవరకూ నిర్లిప్తంగా దూరంగావున్న పోలీస్‌వారు కొంతమందీ, రాజుగారి మనుషులు కొంతమందీ వచ్చి ఆ ఏనుగును ప్రక్కకు మళ్ళించగా, వారూ వారి అనుయాయులూ గోల చేసుకుంటూ, డప్పులతో వెళ్ళిపోయారు. తర్వాత సభలో వేరే అల్లరి ఏమీ జరగలేదు.

ఈలాగే మరికొన్ని రోజులయినాక, అదే స్థలానికి ప్రకాశంగారు, శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఎన్నికల ప్రచారంకొరకు వెళ్ళటం తటస్థించింది. అప్పుడుకూడా ఏనుగుతప్ప మిగిలిన అల్లరంతా రాజావారి మనుషులు చేశారు. అయినప్పటికీ, ప్రజా బాహుళ్యం హెచ్చు అవడంవల్ల, కాంగ్రెసు నాయకులపట్ల వారి అనురాగప్రేమలు హెచ్చవడంవల్ల సభకు అంతరాయం కలగలేదు. ప్రత్యర్థి అయినవారు కూపస్థ మండూకంలా తామే గొప్పవారమని, తాము తప్ప వేరే లోకం లేదని అనుకోవడం చాలా పొరబాటని సరోజినీ నాయుడుగారు మందలించారు. ఆ ఎన్నికలలో గిరిగారు గెలిచారు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రకాశంగారు ఆంధ్రప్రాంతంలో అన్ని జిల్లాలలోనూ నిర్విరామంగా ప్రచారం చేశారు. దీనికి ఫలితంగా కాంగ్రెసుకి అఖండ విజయం కలిగింది. రెండు స్థానాలుమాత్రం పోయినవి. ఒకటి చల్లపల్లి జమీందారు జస్టిస్‌పార్టీ అభ్యర్థిగా గెలుచుకున్నది; రెండవది నరసాపురంలో జస్టిస్‌పార్టీ నాయుడుగారు గెలుచుకున్నది. ఈ రెండుచోట్ల కాంగ్రెసు అభ్యర్థులు నిర్దుష్టమయిన దేశసేవా పరాయణులే అయినప్పటికీ ఓటమి కలిగింది.[1]

ఎన్నికలలో విజయం : అనంతరము

పైన చెప్పిన రెండు స్థానాలు తప్ప మిగినిన స్థానాలన్నీ కాంగ్రెసు వశమయినాయి. ముస్లింలీగ్‌ వారి ప్రత్యేకస్థానాలు మాత్రం కాంగ్రెసువారికి వశం కాలేదు. ఆ సభలోని మొత్తం 215 స్థానాలలో 160 కాంగ్రెసువారికి లభించినాయి.

ఆంధ్రప్రాంతంలోనుంచి ఎన్నికయిన సభ్యులు యావన్మంది చెన్నపట్నంలో 'దేశోద్దారక' కాశీనాథుని నాగేశ్వరరావుగారి యింట్లో సమావేశమయారు. అందరూకూడా ప్రకాశంగారు తప్పకుండా ముఖ్యమంత్రి కాగలరన్న దృఢమయిన అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఆ అభిప్రాయం వారి అభిమానాన్ని పురస్కరించుకొని తెచ్చుకొన్నట్టిదే గాని వాస్తవానికి కొంచెం దూరమయినట్టు తర్వాత జరిగిన ఉదంతాలు తేల్చినవి. రాష్ట్ర కాంగ్రెసులో కొంతమంది పెద్దలకు ప్రకాశంగారంటే పడదన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ, ఒక తెలుగు నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో భేదాభిప్రాయాల ప్రభావం వ్యతిరేకంగా వుండదని ఒక వెర్రి ఊహ అందరి మనస్సుల్లోనూ వుండేది. "ఇంతకు, పోటీకి ఎదురుగా వున్న వారెవరు? ఏడు సంవత్సరాల క్రితం చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహం చేసి, బ్రిటిషు తుపాకీలకు ఎదురుగా నిలబడ్డవారెవరు? చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహానికి తగిన వాతావరణం లేదని బ్రిటిషు తుపాకీలకు భయపడి తమిళ నాయకులందరూ దక్షిణప్రాంతంలో వున్న వేదారణ్యానికి పోలేదా? జనరల్ ఎన్నికలలో నిలబడి కష్టపడేందుకు ఇష్టంలేక యూనివర్శిటీకి ప్రత్యేకంగా ఇచ్చిన స్థానంలో వచ్చినవారా ఇప్పుడు తగుదుమని ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని అనుకునేవారు?" - అని ఈ విధంగా మనవాళ్లలో వాదోపవాదాలు బయలుదేరాయి. "అసలు గాంధీగారి కిష్టంలేని ప్రకాశంగారు ముఖ్యమంత్రి కావాలని మనమంటే తమిళులు ఎందుకు ఒప్పుకుంటారయ్యా?" అని వాళ్లతో బాటు ఆలో చిస్తున్న తెలుగు నాయకులుకూడా ఒకరిద్దరు లేకపోలేదు. అందుచేత, ప్రకాశంగారు తప్పక ముఖ్యమంత్రి కాగలరు అన్న మొదటిభావం ఓ రెండు సూర్యాస్తమయాలు గడచేసరికి మెత్తబడి, పలుచబడి, నీరయి పోయింది.

నాయకుని ఎన్నుకోవలసిన దినం వచ్చింది. దానికి క్రితం రాత్రి తెలుగు సభ్యులు యావన్మంది మరొకమారు నాగేశ్వరరావుగారి మేడపైన సమావేశమై - ప్రకాశంగారు తప్పక పోటీచేయాలని కొందరూ, పోటీ చేసినట్లయితే గెలుపు అనుమానమని కొందరూ, అసలు తగాదాలు లేకుండా సామరస్యంగా ఏదో ఏర్పాటయితే బాగుంటుందని మరికొంత మంది (వీరంతా పెద్దలే) వివిధములయిన అభిప్రాయాలు వ్యక్తపరచి, తుది నిర్ణయం ప్రకాశంగారికి వదలివేశారు.

ప్రకాశంగారు తమ మనస్సులోని ఊహ ఎవరికీ చెప్పలేదు. ఏమి చెప్పగలరు? ఆంధ్రరాష్ట్రంలో వున్న ఇద్దరు పెద్దనాయకులే వై మనస్యం చూపించినట్టు తోచిన వేళ, ఏం మాట్లాడడానికీ వీలులేదు కదా! ఏది మాట్లాడినా కార్యం మరింత చెడిపోతుంది. మొత్తంమీద ఆ విధంగా ఆంధ్రులు ఆ రాత్రి ఒక అభిప్రాయానికి రాలేకపోవటం విచారకర మయిన విషయము. తెలుగువారి త్యాగధనమూ, పలుకుబడీ - భారతీయ రాజకీయాలలో అవరోహణ చేయడానికి ఆ రాత్రి కల్గిన సందిగ్ధావస్థే మొదటి మెట్టు.

మరునాడు ప్రకాశంగారే నాయకుని ఎన్నుకునే సభలో స్వయంగా రాజాజీ చెన్నరాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ నాయకుడుగా ఉండాలనే ప్రతిపాదన అనుమానంలేని గొతుకకతో చేశారు. సభలో ఉన్నవారు యావన్మందీ సంతోషించారు. కొన్ని సంవత్సరాల తరువాత తెలిసిన విషయం ఏమంటే - అది ప్రకాశంగారు, సాంబమూర్తిగారు మొదలైన ఒకరిద్దరు కలసి చేసుకున్న నిర్ణయమని, అది పరిస్థితుల వాస్తవికతపై ఆధారపడినదనీ తెలిసింది. అప్పుడు ప్రకాశంగారిని ఉపనాయకునిగా (డిప్యూటి లీడర్‌గా) రాజాజీ ప్రతిపాదిస్తారని ప్రకాశం, సాంబమూర్తి గారలు రాజాజీతో అదివరలో అనుకున్న సంగతి. అయితే, రాజాజీ మాత్రం, లేచి యిద్దరు డిప్యూటీ లీడర్లు వుండాలనీ, వారు - ప్రకాశం గారున్ను, వేదరత్నం పిళ్లైగారున్ను అని ఆ ఇద్దరిపేర్లు ప్రతిపాదించారు. సహజంగానే యీ రెండుపేర్లూ ఆమోదింపబడినాయి. అప్పటి నంచి సభ్యులలో ఆవేశం కొంత చల్లబడింది.

  1. గెలిచిన జస్టిస్‌పార్టీ వారిద్దరూకూడా వారి ఎత్తుగడలు మార్చుకొని, తరువాత కాంగ్రెసులో చేరి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినాక కాంగ్రెసుపార్టీ పక్షాన మంత్రులైనారు