నా జీవిత యాత్ర-4/పరిపాలనా విధానము - ముఖ్యమంత్రితో తలపట్లు
6
పరిపాలనా విధానము -
ముఖ్యమంత్రితో తలపట్లు
ప్రకాశంగారి దృక్పథం రాజాజీ దృక్పథంకన్న భిన్నం కావడంచేత చిల్లరమల్లరగా ఏవో సుడిగాలు లెప్పటికప్పుడు వీస్తూండేవి. రాజాజీ, ప్రకాశంగారల దృక్పదాలలోని భేదాలను పోలీసుశాఖ విషయంలో వారి అభిప్రాయాలబట్టి నిర్ణయించవచ్చు.
రాజాజీకి పోలీసుశాఖపై అమితమైన నమ్మకము. దాన్ని నమ్మకపోతే రాజ్యం నడవదని వారి దృక్పథము. కాని, ఆ దృక్పథం తప్పు చేసినప్పటికీ పోలీసు ఉద్యోగులను ఏమీ అనరాదన్నంత దూరం వెళ్ళేది. 1932 సత్యాగ్రహంలో, ఒక బహిరంగ సభలో వేదికపై నున్న మహర్షి బులుసు సాంబమూర్తిగారిని, ఆయన స్మృతి తప్పి రక్తం మడుగులో పడిపోయేంత వరకు లాటీలతో కొట్టించిన "డప్పుల సుబ్బారావు" అనే పోలీస్ ఉద్యోగికి, ఆంధ్ర కాంగ్రెసువా రందరూ అడ్డుతున్నా వినక - ఒక గౌరవస్థానం. ఇంగ్లండు ప్రయాణం రాజాజీ కల్పించారు రాజాజీ మంత్రివర్గంలోని డాక్టర్ సుబ్బరాయన్ అనే మంత్రి - కోయంబత్తూరులో ఉపన్యసిస్తున్న సమయంలో, ప్రేక్షక బాహుళ్యం హెచ్చయి, ఒకచోట అల్లరిగా ఉండగా పోలీసు జవానులు లాటీలతో ప్రజలను త్రోయడాన్ని వేదికనుంచి చూచిన ఆ మంత్రి కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పాటైన కాలంలోకూడా పోలీసు లా విధంగా ప్రవర్తించ రాదని వారిని గట్టిగా మందలించారు. పోలీసు శాఖ ఆ రోజులలో రాజాజీ చేతులలో ఉండేది. తెల్లవారేసరికి సుబ్బరాయన్ గారు చెన్నపట్నం తిరిగి వచ్చారు. పత్రికలలో ఆయన ఉపన్యాసం అంతా వేయలేదుగాని, పోలీసువారిని ఖండించిన భాగం మాత్రం పెద్ద అక్షరాలతో వేయడం జరిగింది. 8 గంటలవేళ సుబ్బరాయన్‌గారు ముఖక్షవరం చేసుకుంటుండగా రాజాజీనుంచి, ఆయనకు పోన్ వచ్చింది. రాజాజీ సుబ్బరాయన్ గారికి పరమ గురువు వంటివారు. రాజాజీ సుబ్బరాయన్‌గారితో ఫోనులో, "ఏమయ్యా! సుబ్బరాయన్! కోయంబత్తూరు మీటింగులో నిన్న సాయంత్రం పోలీసుల విషయమై నువ్వేదో చెప్పినట్లు పేపర్లో పడింది. ఏమిటిది?" అని అడగ్గా, సుబ్బరాయన్‌గారు, "అవునండి! బ్రిటిషు హయాంలో మాదిరిగానే పోలీసులు ప్రేక్షకులను లాటీలతో కొట్టడంచూచి మందలించాను. అది పేపర్లో పడవలసినంత పెద్ద విషయ మేమీ కాదు!" అన్నారు.
అది విని రాజాజీ, "సుబ్బరాయన్! నీవు ఎవరిని మందలించావో తెలుసా? పోలీసు జవానులను కాదు - పోలీసు శాఖామంత్రి అయిన రాజగోపాలాచారిని. విన్నావా?" అన్నారు.
"ఎంతమాట - ఎంతమాట!" అన్నారు సుబ్బరాయన్‌గారు. తర్వాత రాజాజీ, "పత్రికల రిపోర్టు సరి అయింది కా" దని స్టేట్ మెంటు ఇమ్మంటే, తాను కళ్ళతో చూసిందే చెప్పినట్లు సుబ్బరాయన్ అన్నారు. దానిపైన రాజాజీ, తానొక పత్రికా విలేఖరిని పంపు తున్నట్టు అతడు తెచ్చే సవరణ కాగితం మీద సుబ్బరాయన్ సంతకం చేసి పంపవలసిందన్నట్టు ఆదేశించారు.
ఆసమయంలో నేను ఏదో పనిమీద వెళ్లి సుబ్బరాయన్ గారిదగ్గర ఉండడం జరిగింది ఈ విషయాన్ని గురించి మేము ఆశ్చర్య చకితులమయి మాట్లాడుకుంటుండగానే, రాజాజీ పంపిన పత్రికావిలేఖరి వచ్చి, సవరణ కాగితాన్ని సుబ్బరాయన్ గారికిచ్చాడు."పోలీసులను నేను కోయంబత్తూరు మీటింగులో గట్టిగా మందలించా నన్న వార్తా ప్రకటనలో నిజంలేదు," అని వున్న కాగితంపైన సుబ్బరాయన్ గారు సంతకం పెట్టారు. అదిచూసి నేను నవ్వగా, "నువ్వు నవ్వితే నవ్వవయ్యా! మా గురువును నేను కాదన లే"నన్నారు సుబ్బరాయన్ గారు మందహాసం చేస్తూ.
రాజాజీ దృష్టి ఇటువంటిది. ప్రకాశం గారి దృష్టి దీనికి సరిగ్గా భిన్నమైనది.ఒకమారు పశ్చిమగోదావరి జిల్లా ఒక ముఖ్యవ్యక్తిని హత్య చేయడం జరిగింది.ఆ మరునాడు ఉదయం మెయిలులో నేను, ప్రకాశంగారు చెన్నపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతూండగా, కొందరు వచ్చి ఆ హత్య సంగతి చెప్పి, దాన్ని ఒక పెద్ద పోలీస్ ఉద్యోగి కప్పివేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పగానే, ఆయన వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కు తంతి యిచ్చి, చెన్నపట్నం వెళ్లిన తరువాత ఆ హత్యా పరిశోధననుంచి ఆ అధికారిని తప్పించి, మరొక పెద్ద ఉద్యోగికి అప్పజెప్పారు. ఇది ప్రకాశం గారి పద్ధతి.
మరికొన్ని విశేషాలు
పంచాయితీ, గ్రామ స్వరాజ్యం అన్న విషయాలపైన ప్రకాశం గారికి ఆసక్తి చాలా హెచ్చు. వారికి చాలా అధికారాలు ఇవ్వవలసిందని కూడా ఒక బిల్లు స్వయంగా తయారు చేశారు. నేను కూడా ఆ సందర్భంలో అలా ప్రచారం చేశాను.అయితే పంచాయితీలు తగాదాలకు రంగస్థలాలని, అవి చదువకొనని వారిచేతిలో ఉంటాయి గనుక, వారికి హెచ్చు అధికారాలు ఇవ్వగూడదనీ సచివాలయంలో వాదం హెచ్చడంచేత, ఆ బిల్లు కార్యరూపం ధరించలేదు. అలాగే మునిసిపల్ చైర్మన్లకు (పురపాలక సంఘ అధ్యక్షులకు) హెచ్చు అదికారాలు ఇవ్వాలని ప్రకాశంగారు తయారు చేసిన బిల్లుకూడా కార్యరూపం పొందలేదు. అసలు రెవిన్యూమంత్రికి వాటితో సంబంధ మేమిటనీ, ప్రభుత్వ కార్య నిబంధనలలో దానికి సంబంధించిన శాఖవారు తప్ప ఇతరు లీ ప్రమేయం పెట్టుకోరాదని వారు అడ్డుపెట్టారు. అందుచేత ముఖ్యమంత్రి కూడా వాటి విషయమై తూష్ణీంభావం వహించారు. పబ్లిక్ వర్క్స్ విషయంలో కూడా, పి. డబ్ల్యూ. డి. అంటే పబ్లిక్ వేస్ట్ డిపార్ట్‌మెంట్ అని నలుగురూ అనుకునే మాట సత్యమైనదే నని ప్రకాశంగారి అభిప్రాయం.
మేము ఒకమారు బుక్కరాయపట్నం వెళ్ళడం తటస్థించింది. రాయల రాజ్యంనాటి రాతితో కట్టిన పెద్ద చెరువొకటి అక్కడుంది. ప్రకాశంగారు, నేను వెళ్ళినపుడు వృద్ధులైన కొందరు రైతులు వచ్చి, కొంచెం దూరంలో ఒక కొండవాగు ఉందనీ, దాని ద్వారా ఈ చెరువు నిండేదనీ, సెటిల్మెంటు సమయంలో ఈ చెరువు నీటి వనరు గలవిగా అనేక భూములను వ్రాసి ఉన్నారనీ, అయితే ఆ వాగు పూడిపోవడం వల్ల ఈ చెరువు ఎండిపోతున్నదనీ, దాని మరమ్మత్తుకు పదివేలరూపాయలు అవుతుందనీ, కాని పి. డబ్ల్యూ. డి. వారు మరమత్తుకు లక్షల కొద్ది అవుతుందనీ, తగిన రాబడి లేనందువల్ల ఆ పని చేయం అనడం వల్ల పదిహేను, ఇరవై ఏండ్ల నుంచి పాడుపెట్టి ఉంచిన భూములను, ఎండిన చెరువునూ మాకు చూపించి గోలపెట్టారు. ప్రజలు అనుకున్న లెక్కకు, పి. డబ్ల్యూ. డి. ఇంజనీరు వేసిన లెక్కకు పదింతల వార ఉంది. దానిపైన రైతులు ఆ పని తమకు అప్పగిస్తే, తమ లెక్కకు సరిపడేటట్లు ఆ కాలువను మరమ్మతు చేసుకుంటామని కోరగా, అతి కష్టంమీద ఇంజనీరు అభ్యంతరం పెట్టనని అనుమతించాడు. అదే ఒక బ్రహ్మాండమయిన సాయంక్రింద రైతులు సంతోషించారు.
తిరిగి సంవత్సరం తర్వాత ఏం జరిగిందో చూడడానికి ప్రత్యేకంగా మేము అక్కడికి వెళ్ళాము. చెరువునిండా నీరు, ఆ నీటి కెరటా మీద ప్రతిబింబిస్తున్న సూర్యబింబం, ఆ క్రిందటి ఏడు ఎండిపోయి ఉన్న పొలాలే ఈ ఏడు సస్య సంపూర్ణమై పచ్చగా హృదయానందకరంగా కనిపించాయి. రైతులను "మీ కెంత ఖర్చయిం" దని అడిగితే, ఏ డెనిమిది వేలయిం దన్నారు. ప్రక్కన్నున్న ఇంజనీరును, "మీరు పని చేయిస్తే ఎంతవుతుందయ్యా?" అని ప్రశ్నిస్తే, తమ ఎస్టిమేటు ప్రకారం లక్షకన్న హెచ్చుకాక తప్పదని చెప్పారు. పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఏ విధంగా పబ్లిక్ వేస్ట్ డిపార్టుమెంట్‌గా పరిణమిస్తున్నదో సూచించడానికి ఇంతకన్న వేరే తార్కాణం ఏం కావాలి?
ఇది ఇలా ఉండగా ప్రకాశంగారికి ముఖ్యమంత్రితో అనేక సమయాలలో భేదాభిప్రాయాలు సహజంగా వస్తూనే ఉండేవి. బోర్డ్ ఆఫ్ రెవిన్యూలో ఒక సభ్యుడుగా శొంఠి రామమూర్తిగారిని వేయవలసిందని ప్రకాశంగారు కోరగా, ఎంత మాత్రమూ వీలులేదని రాజాజీ కొంతకాలం నిరాకరించారు. అంతకు పూర్వం సేలం జిల్లాలో మద్యనిషేద శాసనం అమలుచేసే నాటికి శొంఠి రామమూర్తిగారు అక్కడ కలెక్టరు. అక్కడ అతనిని కాదని ఒక ఇంగ్లీషు ఐ. సి. యస్. ఉద్యోగిని మద్యనిషేధం అమలుపరచడానికి నియమించారు. ఇలా ఉండేటపుడు, నేనూ రాజాజీ ఒకే మోటారుకారులో సేలం వెళ్ళడం తటస్థించింది. ఆయన ఒకప్పుడు విశాఖపట్నం వచ్చి మా యింట్లో అతిథిగా ఉండడంచేతా, శాసన సభలో ప్రశ్నోత్తర సమయాలలో ప్రకాశం గారి వంతును నేను నడిపించే విధానం బాగుందని ఆయన మెచ్చుకుంటున్నాడనే విశ్వాసంచేతా, చనువుచేతా శొంఠి రామమూర్తిగారి విషయమై ఆయనను "సేలం జిల్లాలో, సద్గుణ వంతుడయిన హిందూ ఐ. సి. యస్. ను వదిలిపెట్టి, మద్యనిషేధంలో నమ్మకంలేని ఇంగ్లీషు ఐ. సి. యస్. ఉద్యోగిని వేయడం ఏమీ బాగాలేదు. అంతే కాకుండా, బోర్డు ఆఫ్ రెవిన్యూ మెంబరుగా ఉండడానికి అర్హతగల తెలుగు ఉద్యోగిని వెనుకకు నెట్టడం ఎందుచేత జరిగింది?" అని ప్రశ్నించాను. అందుకు రాజాజీ "ఇది నీ వరకు కూడా వచ్చిందా? నువ్వు విశాఖపట్నం వాడివి. శొంఠి రామమూర్తీ విశాఖపట్నంవాడు. నువ్వు అతని విషయమై చెబితే కొంత అర్థముంది. కాని, నాకు ఇదివరకే పది పదిహేను మంది అప్పుడే సిఫార్సు చేశారు. అతడు ఒట్టి పొలిటికల ప్రోపగాండిస్ట్ (రాజకీయ దృష్టిగల ప్రచారకుడు) అటువంటి వారిని పెద్ద ఉద్యోగాలలో వేసుకుంటే నా మాట సాగుతుందా? మంత్రిమాట సాగుతుందా?" అన్నారు. రాజాజీ యీ మాటలు కనువిప్పు అయితే అర్హు డెవడైనా అణగద్రొక్క బడితే అతని విషయం ఎవరైనా ప్రభుత్వానికి చెప్పవచ్చునా? కూడదా? అన్నది మాత్రం ముఖ్యమైన ప్రశ్న. చెబితే ఉద్యోగిని, ప్రోపగాండిస్ట్ అంటారు. చెప్పకపోతే అడుగున పడిపోతాడు. ప్రకాశంగారు పట్టుపట్టడంవల్ల, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ సభ్యుల సంఖ్య హెచ్చించి, శొంఠి రామమూర్తిగారిని అందులో సభ్యునిగా నియమించక తప్పలేదు. రాజాజీకి - విద్యావిధానంలో కూడా, పాత సంప్రదాయాలపైన నూతనమైన విజ్ఞాన విధానమును రూపొందించడానికి ప్రకాశంగారు ఒక స్కీమును తయారు చేశారు. అయితే, అదికూడా రెవిన్యూకు సంబంధించకపోవడంచేత సచివాలయంవారు వెనక్కు త్రోసి వేశారు. మొదటి మంత్రివర్గం చేసిన పనులలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి - మద్యపాన నిషేద చట్టము, దానివల్ల ప్రభుత్వానికి తగ్గిపోయే రాబడిని పూరించేందుకుగాను సేల్స్‌టాక్సు విధించే శాసనము, దేవాలయాలలోనికి హరిజనులకు ప్రవేశాధికార మిచ్చిన శాసనము.
మద్యపాన నిషేధం బిల్లుకు కాంగ్రెసేతర సభ్యులనుంచి ప్రతికూలత ఉండేది. చాలా పత్రికలలో కూడా యిది జయప్రదం కానేరదనే శాసవాచకాలు రోజూ వ్రాయబడుతూండేవి. మద్యనిషేధ మన్నది ఎంత గొప్ప ఉద్యమమో అంత దురదృష్టోపహతమైనది. పాశ్చాత్య దేశాలలో కూడా ఆవేశంతో ప్రవేశపెట్టబడి, ఆశాభంగంతో ఉపసంహరింపబడడమే ఈ మద్యనిషేధ ఉద్యమపు సంక్షిప్త చరిత్ర. అదే మన దేశంలో కూడా చేస్తున్నాము. అమ్మకపు పన్ను చట్టం
ఇక, సేల్స్‌టాక్సు (అమ్మకపు పన్ను) బిల్లు విషయమై ఒక విషయం చెప్పాలి. సేల్సుటాక్సు వల్ల రెవిన్యూ అధికమవుతుంది. కానీ, ప్రకాశంగారి చేతిలోంచి రెవిన్యూకు సంబంధించిన యీ విషయం (సబ్జక్టు) ముఖ్యమంత్రిగారు తమ చేతిలోకి తీసుకోవడమే కాక, ఇందులో ఇంగ్లీషు వర్తకులకుగల సౌకర్యాలు స్వదేశవర్తకులకు కలిగించకుండా బిల్లు నడిపిస్తున్నట్టుగా కింవదంతులు బయలుదేరాయి. ప్రకాశంగారు ఒక రోజున పట్టలేక వెళ్ళి సెలక్టు మీటింగులో కూర్చున్నారు. అప్పుడు రాజాజీ చాకచక్యంగా, "ఈ బిల్లు ప్రకాశం గారు నడిపించ వలసింది. నా చేతి కప్పగించడం వల్ల నేను చేస్తున్నాను గాని," అని తొణుకు బెణుకు లేకుండా సభ్యులకు చెప్పారు. కాదనడానికి, అవుననడానికి వీలుకాని సమయం గనుక ప్రకాశంగారు ఊరుకోవలసి వచ్చింది. కాని, అప్పుడు స్వదేశ వర్తకులకు అన్యాయం జరుగ కూడదని ఆయన ఒక మారు గట్టిగా చెప్పడంవల్ల ఆ బిల్లులో భాగాలు కొంత సర్దుబాట యినాయి. అలాగే, ఋణ విమిక్తి బిల్లు విషయంలో కూడా బోర్డు ఆఫ్ రెవిన్యూవారు ప్రకాశంగారి ప్రమేయం లేకుండా ఒక బిల్లు తయారు చేస్తున్నట్టు, గవర్నరు ప్రకాశంగారితో మాట్లాడిన సందర్భంలో తెలిసింది. ఇటువంటిది ఎలా సాధ్యము? రాజాజీ ముఖ్యమంత్రి అయినపుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ విషయమై ప్రకాశంగారు రాజాజీని అడిగారట. "వాళ్ళేదో వ్రాసుకుంటారు. మనకేమి సంబంధ"మని ఆయన అన్నారట. రెవిన్యూకు చెందిన ఈ ఋణ విముక్తి శాసనాన్నీ రాజాజీయే ఉంచుకున్నారు. ఈ విషయాలు మంత్రివర్గం ఏర్పాటయిన కొద్ది కాలంలోనే జరగడంవల్ల, మంత్రి మండలిని చికాకుపరచడం ఇష్టంలేక ప్రకాశంగారు - జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనే సూత్రం నాశనమయి పోతున్నదని మాత్రం తన మినిట్లో వ్రాసి, అంతటితో ఆ విషయం చాలించుకున్నారు. ప్రకాశంగారి అభిప్రాయం ప్రకారం ఋణ విముక్తి శాసనంలో ఋణం తగ్గింపు విషయం మాత్రం ఏర్పడితే చాలదనీ, ఋణం తీర్చే విధానం పట్ల కూడా ప్రభుత్వం బాధ్యత వహించ వలెననీ ఉండేది. అయితే, అది ఫలించలేదు. ఇలాగే దేవాలయాల నిర్వహణ శాఖను రాజాజీయే నడిపించారు. దీనికితోడు, ఇంకా అనేక విషయాల లోనూ రాజాజీ సహాయకారి కాకపోవడం తటస్థించింది.
వజ్రపు గనుల లైసెన్సు
మంత్రివర్గం ఏర్పాటయిన కొంత కాలానికి గిరిధర దాస్ నారాయణ దాస్ అనే ఆయన చెన్నరాష్ట్రంలో వజ్రపు గనులు జరిపించే నిమిత్తమై లైసెన్సుకోసం చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొన్నాడు.
అప్పట్లో ఆయన స్టేటు కౌన్సిల్లో, అనగా ఇప్పుడు రాజ్యసభ అని పిలవబడేదానికి ప్రత్యామ్నాయంగా స్వాతంత్ర్యానికి పూర్వం ఉండే సభలో సభ్యుడు. ఆయన కుటుంబం అంతకు రెండు వందల సంవత్సరాల ముందు నుంచి చెన్నపట్నంలోనే నివసిస్తూండేది.
వజ్రపు గనులకు లైసెన్సు విషయంలో, గవర్నమెంటు భూములకు సంబంధించి నంతవరకు రెవిన్యూశాఖ భూమి త్రవ్వకాలకు అనుమతి యివ్వాలి. ఆ రోజులలో శొంఠి రామమూర్తిగారు చెన్నపట్నంలో కలెక్టరుగా ఉండేవారు. ఆయన వజ్రపు గనులు నడిపించడానికి తగిన ధన బలం విజ్ఞప్తిదారుకుందని ఆమోదిస్తూ సాల్వెన్సీ సర్టిఫికేటు ఇచ్చారు.
ఈ వినతి పత్రం ఆలోచనలో ఉన్న సమయంలో, రామకృష్ణ డాల్మియా అనే ఆయన ఆ వజ్రపు గనికి తనకు లైసెన్సు ఇవ్వాలని ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. బాబూ రాజేంద్రప్రసాద్‌గారి వద్దనుంచి సిఫారసుపత్ర మొకటి ఆయన ముఖ్యమంత్రిగారి పేర తెచ్చుకున్నాడు. ఆయన చెన్నపట్నం చేరేవేళకు ముఖ్యమంత్రిగారి పక్షాన మంత్రి రామనాథంగారు సెంట్రల్ స్టేషన్ ప్లాట్‌ఫారంమీద ఆయనకు స్వాగతమిచ్చాడు. ఆనాటి మద్రాస్ మెయిల్ పత్రికలో ఈ ఆహ్వానాన్ని సూచించే ఛాయా చిత్రాన్ని, "ఉత్తర హిందూస్థానపు పారిశ్రామిక వేత్త (డాల్మియా)కు చెన్నరాష్ట్ర ప్రభుత్వం స్వాగతం ఇస్తున్నది" అన్న అర్థంగల మాటలతో పెద్ద సైజు బొమ్మతోసహా అచ్చువేశారు. సచివాలయంలో అప్పటికే లైసెన్సు విషయమై నడుస్తున్న గ్రంథానికి మరొక ఉపగ్రంథం బయలుదేరింది. ఒకనాటి ఉదయం, అప్పట్లో "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" పత్రికకు సంపాదకుడుగా ఉన్న ఖాసా సుబ్బారావు ఒక మార్వాడీ పెద్ద మనిషిని వెంటబెట్టుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చి, డాల్మియా తాలూకు వజ్రపు గనుల లైసెన్స్ విజ్ఞప్తి విషయమై ప్రసంగించారు. ఈ రాష్ట్రంలోని భూగర్భంలో గల సంపద రాష్ట్రేతరులకు అప్ప జెప్పడం నా కిష్టం లేదనీ, రాష్ట్రంలో గలవారికి ధనశక్తి చాలక పోయినట్టయితే ఆ గనులను ప్రభుత్వం వారే త్రవ్వించడం జరుగుతుందనీ చెప్పి, నా అభిప్రాయంతో ప్రకాశంగారు ఏకీభవించినట్టు చెప్పాను. నాతో లాభం లేదనుకొని, ఆ పెద్ద మనిషి సుబ్బారావును ప్రకాశం గారింటికి తీసుకు వెళ్ళాడు.
డాల్మియా విజ్ఞప్తి విషయం మాటవరుసకు ప్రసంగ ధోరణిలో చెప్పినట్టు చెప్పి, అయినా అది తన కదెందు కన్నట్లు ఆ ప్రసంగం మాని, ఆ మార్వాడీ పెద్ద మనిషి - ప్రకాశంగారితో, "మీకు నిడుంగాడి బ్యాంకివారు, స్వరాజ్య ప్రెస్సుకు సంబంధించిన ఏడెనిమిదివేల రూపాయల మొత్తం చెల్లించవలసిందని నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. లోగడ, మీరు స్వాతంత్ర్య సమరంలో చేసిన త్యాగం చూసి మావంటి వారికి మీ పైన గురుభావము, భక్తి. మీకు తెలిసినా, తెలియక పోయినా మే మెప్పుడూ మిమ్మల్ని మా మనసులలో పూజిస్తుంటాము. మీరు మంత్రిగా ఉన్న ఇటువంటి సమయంలో ఆ బ్యాంకివారు నోటీసిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు," అని అంటూ తన చొక్కా జేబులోంచి కరెన్సీ నోట్ల కట్ట ఒకటితీసి, " ఈ పదివేల రూపాయలు నేను మీకు బ్యాంకి బాధ వదలగొట్టడానికి, పాద కట్నంగా ఇస్తున్నాను స్వీకరించవలసింది," అనేసరికి, భాసా సుబ్బారావుకు మతిపోయినట్లయింది. ప్రకాశంగారు అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయరు గదా! ఇదివరలో ఎన్నడూ సాయం చేయని ఆయన ఈ రోజున ఇంత సద్బుద్ధితో రావడంలో కల్మషం ఉండక తీరదని క్షణంలో గ్రహించి, "నీవు ఈ రోజునైతే ఇలాగు వచ్చావు కాని, ఇటువంటి పాడుపని ఇటుపైని తలపెట్టి చెడిపోకు వెంటనే వెళ్ళిపో," అని చెప్పేసరికి ఆ పెద్ద మనిషి తాను చెప్పవచ్చిన పని మాట మాని, మరేమీ చెప్పక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆరోజు, తర్వాత నేను, ప్రకాశంగారు కలసి కోటలో ఆఫీసుకు వెళ్లే సమయంలో త్రోవలో ఆ మార్వాడీ పెద్దమనిషి నాకు డాల్మియా విజ్ఞప్తి విషయమై చెప్పడానికి వచ్చాడని చెప్ప నారంభించేసరికి, "ఆ దుర్మార్గుణ్ణి ఎందుకు రానిచ్చావు?" అని మందలించినట్టు అన్నారు ప్రకాశంగారు. తర్వాత ఆయన నేను పైన చెప్పిన ఉదంతం పూసగ్రుచ్చినట్లు చెప్పారు. తర్వాత, నేను ఖాసా సుబ్బారావుతో "అటువంటి మార్వాడీని నువ్వెలా తీసుకొవచ్చా వయ్యా?" అని యథాలాపంగా అడిగితే, "నువ్వు కూడా రావలసిందని నాతో అంటే నేను వచ్చాను. అతని పనికి నాకు సంబంధం లేదని పక్కకు పిలిచి నీకు చెప్పాను గదా? ఎటొచ్చీ ప్రకాశంగారింటి దగ్గర అలా ప్రవర్తిస్తాడని ఊహించలేక పోయాను," అని విచార పూర్వకంగా చెప్పాడు. సచివాలయంలో ఈ వజ్రపు గని హక్కు విషయమై ప్రకాశంగారికి ముఖ్యమంత్రిగారికి చాలా వివాదం పెరిగింది. అయితే, ఆ డాల్మియా చాలా గడుసువాడు కావడంతో, ప్రకాశంగారికి తెలియకుండా గిరిధర దాస్ నారాయణ దాసుకు ఏదో వాటా ఇవ్వడానికి రహస్యంగా ఒప్పుకున్నట్టు తెలిసింది. గిరిధరదాస్, ప్రకాశంగారితో తనపైన ఒత్తిడి చాలా ఉండడంచేత తన పిటీషన్ ఉపసంహరించు కున్నట్టు చెప్పాడు. ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ సిపారసుపైన స్టేటు కౌన్సిలుకు సభ్యుడుగా వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఇలాంటి రహస్య వ్యవహారం చేసుకోవడం ప్రకాశంగారి కిష్టంలేక పోవడంతో, ఆయన విముఖులై, అతని విషయమై తర్వాత ఏ విధంగానూ కలుగచేసుకోలేదు.
సాంబమూర్తిగారి ఇంగ్లండు ప్రయాణ భంగము
1937 లో స్పీకర్ సాంబమూర్తిగారు ఇంగ్లండులోని హౌస్ ఆఫ్ కామన్స్ కార్యపద్ధతి చూచేందుకు, పార్ల మెంటరీ విధానాలూ పరిశీలించేందుకు, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయమని బ్రిటిషు ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళవలెనని అనుకున్నారు. ఈ రోజుల్లో ఇటువంటి ప్రయాణాలు అతి తరచుగా జరుగుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావలసిన మొత్తాలను అభ్యంతరం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. కాని, కాంగ్రెసు అధిష్ఠానవర్గం ప్రసక్తే ఉండదు. అయితే, 1937లో పద్ధతి వేరు. సాంబమూర్తిగారు వెళ్ళడానికి ముఖ్యమంత్రి రాజాజీ అంగీకరించి శాసన సభలో - ఆయన సుఖంగా వెళ్ళి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానం చర్చ జరిగే సమయానికి కాంగ్రెసు అధిష్ఠానవర్గం దగ్గరనుంచి రాజాజీకి ఒక లేఖ వచ్చింది. వచ్చినా, విప్పి చూసుకోలేదని తర్వాత ఆయన చెప్పారు. శాసన సభలో ఆయన, ఆయనతోబాటు ప్రతిపక్ష నాయకులు సాంబమూర్తిగారిని ప్రశంసిస్తూ జోరుగా ఉపన్యాసాలు సాగించారు. అయితే మర్నాడు పత్రికలలో సాంబమూర్తిగారు ఇంగ్లండు వెళ్ళడానికి వీలులేదని అధిష్ఠానవర్గంవారు ఆదేశించి రాజాజీకి సందేశం పంపినట్లు వార్త పడింది. తమ ఆదేశానికి అద్జిష్ఠాన వర్గంవారు ప్రధాన కారణం చూపించారు. అది: స్పీకరు పదవిలో ఉన్న వ్యక్తి పరాయి ప్రభుత్వాన్ని ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయవలసిందని యాచించడానికి వెళ్ళగూడదు! దానిపై, సాంబమూర్తిగారు ఆ పదవికి రాజీనామా ఇచ్చి వెళతా మన్నారు. అందుకు అధిష్ఠాన వర్గంవారు తమ అనుమతి లేకుండా రాజీనామా ఇచ్చి పార్టీకి ఇబ్బంది కలిగించడానికి వీలులేదన్నారు. ఇంతేకాక, కాంగ్రెసు నాయకులలో అగ్రశ్రేణిలో ఉన్న సాంబమూర్తిగారి వంటివారు యాచనకై పరప్రభుత్వ ప్రాంగణంలో పాదం మోపకూడ దన్నారు. ప్రకాశంగారు, నాతో ఈ విషయం ముచ్చటించి నపుడు, దీనికి కారణాలు వేరు అని చెప్పారు. ఆయన "మొట్ట మొదట అధిష్ఠానవర్గంవారు తమకు ఇది చెప్పక పోవడం తమ పలుకుబడికి న్యూనత అనుకున్నారు. రెండవది - ఈ 'సాంబమూర్తి' తనతో ఎవరెవరిని తీసుకు వెళుతున్నాడో వారిపేర్లు పత్రికలలో పడేలాగున ముచ్చటించాడు. ఆ వెళ్ళే వారిపైన మన చెన్నపట్నంలోనే ఒకరిద్దరికి ఇష్టంలేదు. అసలు ఈ వ్యతిరేకపు సలహా చెన్నపట్నం నుంచే బయలుదేరిందని నా నమ్మకము, అయినా తనతో వెళ్ళే వారిని తీసుకు వెళ్ళవచ్చుగాని, పత్రికలలో ప్రచురించడం ఎందుకయ్యా?" అని చలోక్తిగా అన్నారు.
ఈ ఉదంతమయిన తర్వాత సాంబమూర్తిగారు చాలా ఖిన్నులయినారు. కాని, సభా కార్యక్రమంలో అదేమీ కనపడ నివ్వలేదు.
డాక్టర్ లక్ష్మీపతిగారి కేసు
నేషనలిస్టు పాలన నడుస్తున్న రోజులలో, డాక్టర్ లక్ష్మీపతిగారు ఆరోగ్యవరంలో ఆరోగ్య కేంద్రం విస్తరింపు నిమిత్తమై ప్రభుత్వం వారి సహాయం కోరారు. అప్పటి మంత్రివర్గం నేషనలిస్టు అనుకునేవారు. ఆరోగ్యశాఖామంత్రి అయిన ముత్తయ్య మొదలియార్ అనే ఆయన ఆరోగ్యవరం వెళ్ళిచూచి, ఆ సంస్థ బాగా జరుగుతున్నట్టూ, ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నట్టూ వ్రాసి, ఏడువేల రూపాయలు మంజూరు చేశాడు.
డాక్టర్ లక్ష్మీపతి (బి. ఎ., ఎం. బి. బి. ఎస్.,) ఇంగ్లీషు డాక్టరు అయినా ఆయుర్వేదంలో గట్టి నమ్మకం కలవాడు. ఇంతేకాక, పెద్ద సంఘ సంస్కర్త. ఆయన భార్య రుక్మిణమ్మగారు సహాయ నిరాకరణోద్యమంలో పూర్ణంగా దిగి, పనిచేసిన మనిషి.
ఈ పరిస్థితులలో ముత్తయ్య మొదలియార్ గారు మంజూరుచేసిన ఆ గవర్నమెంటు ఆర్డరు డిస్పాచ్ శాఖకు వెళ్ళింది. ఆ శాఖ ఉద్యోగికి -- ఆర్డర్లను రిజిస్టరులో ఎక్కించి, అది ఎవరికి పంపాలో వారి అడ్రసు వ్రాసి స్టాంపు అంటించి పంపించడమో; ఊళ్లోనే ఉన్నవారయితే మనిషిద్వారా పంపించడమో పని. అయితే, అక్కడ డాక్టర్ లక్ష్మీపతిగారికి, ఆ ఆర్డరు పంపే విషయమై పనిచేసే డిస్పాచ్‌గుమస్తా బ్రిటిషు గవర్నమెంటుకు ప్రియుడు కాబోలు! ఆ ఆర్డరు డిస్పాచ్ చేయక, ఇంకొక కాగితంపైన పిటిషనరయిన లక్ష్మీపతిగారి భార్య అయిన రుక్మిణమ్మగారు ఉప్పు సత్యాగ్రహంచేసి అరెస్టయి జెయిలు శిక్ష పొందడంవల్ల, ఆమె భర్త అయిన లక్ష్మీపతిగారికి ప్రభుత్వం ఏడువేల రూపాయలు మంజూరు చేసే ఆర్డరును తాను పంపవచ్చునో, పంపరాదో అన్న అనుమానము కల్గి, సందేహ నివారణార్థం విజ్ఞప్తి పంపుకుంటున్నానని వ్రాసి మీదకు పంపినాడు. ఆ కాగితం హోము మంత్రివరకు ప్రయాణమై ఆ మొత్తాన్ని మంజూరు చేసిన ఆరోగ్యమంత్రితో సంబంధం లేకుండా ఆయన జారీచేసిన ఆర్డరు నిలిపివేశారు.
1937 లో మంత్రివర్గం ఏర్పాటయిన తర్వాత, 1930 లో జరిగిన యీ విషయం వ్రాస్తూ లక్ష్మీపతిగారు, ముఖ్యమంత్రి అయిన రాజాజీకి పిటీషన్ పెట్టుకున్నారు. డబ్బు విషయమై వచ్చిన ఏ కాగితమైనా ప్రప్రథమంగా త్రోసిపారవేయాలనే తన సూత్రప్రకారం ఆయన దానిని త్రోసిపుచ్చారు. ఆ నిరాకరణ అయిన తర్వాత లక్ష్మీపతిగారు జరిగింది చెప్పడానికి ప్రకాశంగారి దగ్గరకు వచ్చారు. వారి దగ్గర పిటీషన్ పుచ్చుకొని ఫైలు తెప్పించారు. నేను మీద వ్రాసిన ఉదంతం ఆ ఫైలు చదివితే తెలిసింది. ఇది శుద్ధ అన్యాయమని, లక్ష్మీపతిగారికి ఆ ఏడువేలు మంజూరు చేయాలని ప్రకాశంగారు గట్టిగా వ్రాశారు. రాజాజీ ఇదివర కొకసారి నిరాకరించడం చేత ఫైనాన్సు డిపార్టుమెంటువారు ఆ కాగితం ఆర్థికమంత్రి అయిన రాజాజీ దగ్గరకు వెళ్ళకుండా ఆ కోరికను నిరాకరించి కాగితం వెనక్కు తిరిగి పంపించేశారు. దాని మీద ప్రకాశంగారు మరీ తీవ్రంగా వ్రాశారు. నేను ఆ ఫైలు పుచ్చుకొని రాజాజీ దగ్గరికి వెళ్ళి, "ఎవరైనా డబ్బు అడిగితే ఆలోచించకుండానే నిరాకరించవలసిందని మీ ప్రథమ సూత్రం చెప్పారు. కోరినవారు పిటిషను పెట్టుకుంటే వారిలో కొంత ఆసక్తి ఉందని అనుకుని అపుడు పునరాలోచన చేయవచ్చు అని నాకు మీరు ఇదివరలో పాఠం చెప్పారు," అన్నాను. దానికి, "ఎవరి విషయమై అంటున్నా"వని ఆయన అడిగారు.
ఇది డాక్టర్ లక్ష్మీపతిగారి కేసు అన్నాను. ఎప్పుడో ఏడు సంవత్సరాలనాటి డబ్బు ఎలా ఇమ్మంటావని ప్రశ్నించారు. అపుడు ఆ కాగితాలు తీసి, "ఆ విషయంతో ఏమీ సంబంధంలేని డిస్పాచ్ గుమాస్తా పంపిన మెమోపైని రాజకీయ కారణంచేత ఆ డబ్బు ఇవ్వడం ఆపారు. ఏ రుక్మిణమ్మగారు రాజకీయ శిక్ష అనుభవించడం ఆ నాడు లక్ష్మీపతిగారికి డబ్బు మంజూరు కాకుండా చేసిందో, ఆ రుక్మిణమ్మగారే ఇప్పుడు మనకు డిప్యూటి స్పీకరు అయ్యారు గదా! అందుచేత మీ సూత్రప్రకారం మీరు పునరాలోచించవలసిం"దని చెప్పాను. డిస్పాచ్ గుమాస్తా పెట్టిన పేచీని గ్రహించి ఆయన ప్రకాశంగారితో ఏకీభవిస్తూ, ఏడువేలు లక్ష్మీపతిగారి కివ్వాలని ఒప్పుకున్నారు. కాని, యీ నిర్ణయానికి వచ్చేలోపున చాలా రాద్ధాంత సిద్ధాంతాలు ప్రకాశంగారు, రాజాజీ, డాక్టర్ లక్ష్మీపతీగార్లమద్య జరిగి, పేరు ప్రఖ్యాతులు గన్న డాక్టర్ లక్ష్మీపతిగారు రాజాజీ గుమ్మందగ్గర సత్యాగ్రహం ప్రారంభం చేసేవరకు వెళ్ళింది. కాని, ఎవరికీ ఇబ్బందిలేకుండా సత్యాగ్రహం ఆరంభించకముందే డబ్బు మంజూరు కావడంవల్ల ఆ వివాదం అంతటితో పరిష్కారమయింది.
హిందీ
ఇప్పుడు హిందీ భాష విషయంలో ప్రబలిన వ్యతిరేకాభిప్రాయాలు, 1937 లో మంత్రివర్గం ఏర్పాటయిన సందర్భంలో ఇంత తీవ్రంగా లేవు. జస్టిస్‌పార్టీ నాయకులు మాత్రమే దానికి వ్యతిరేకమైన ఆందోళన ప్రారంభించారు. దీనికి కారణం వారికి కాంగ్రెసుమీదనున్న వ్యతిరేకతయే. ధైర్యంగా అన్ని స్కూళ్ళలోను ఆనాడే హిందీ నేర్పడం ఆరంభిస్తే ఎలా ఉండేదో తెలియదు. ఎప్పుడయితే కొన్ని స్కూళ్లలో మాత్రం ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారో అప్పుడే వ్యతిరేకులకు బలము, ధైర్యము హెచ్చవడంలో ఆశ్చర్యంలేదు. పనిపాటలులేని కొందరు చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను చేరదీసి, అందులోఅనేకులకు రోజుకింత అని కొంతకూలికూడా యిచ్చి హిందీ చెప్పే స్కూళ్ళ ఆవరణల్లోకి వెళ్ళి రాళ్ళు వేయడం, అసభ్యంగా కేకలు వేయడం మొదలైన అల్లరులు చేయించడం ఆరంబించారు. శాసన సభలో జస్టిస్ పార్టీ నాయకులు వాళ్ళకు బలం చేకూర్చేవారు.
అది అక్కడితో ఆగలేదు. రాజాజీ వసతిగృహానికి చుట్టూ బాగా ముష్కరులైన పెద్దలతోబాటు, పిల్లలు అనేకులుచేరి, రాళ్ళు రువ్వి కేకలు వేయడమే పెద్ద ఉద్యమంగా సాగించారు. రాజాజీ ఉండే యిల్లు చాలా చిన్నది. ఇంటికీ, వీథికీ మధ్య పది అడుగులకన్నా తక్కువ దూరం ఉండేది. అందుచేత ఆయనకు దుర్భర మయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీథిలో ఆ చివర, ఈ చివర పోలీసులను పెట్టుకుని కాలక్షేపం చేయవలసి వచ్చింది. ప్రజలమధ్యకు వచ్చి ప్రచారం చేసి, కాబినెట్ లోని మంత్రులందరి సలహాకూడా పుచ్చుకుని, ఒక వాతావరణం కల్పించిన తరువాత, అన్ని స్కూళ్ళలోను హిందీని ప్రవేశపెట్టి ఉన్నట్లయితే - అప్పుడు కాంగ్రెసువారికున్న పలుకుబడితో మంచి వాతావరణం ఏర్పడేది. కాని, ఈ అల్లర్లవల్ల, అది ముందుకు సాగలేదు. స్కూళ్ళలో కాకపోయినా, దక్షిణ భారత హిందీ ప్రచార సభవారు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలలో వందలు, వేలు హిందీపరీక్షలు పాస్ అవుతూనే ఉన్నారు. దాక్షిణాత్యులు బ్రతక నేర్చినవారు గనుక ఈ మధ్య హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను బలపరచినట్లు కనిపించినా కేంద్రప్రభుత్వపు ఉద్యోగులకు ప్రమోషన్లు వగయిరాలకు హిందీ అవసరం గనుక వాటికి భంగంలేకుండా వారు హిందీ నేర్చుకుంటూనే ఉన్నారు.
అయినా, హిందీ ఒక గడ్డు సమస్య అయిపోయింది. భాష నేర్చుకోవాలని పెద్దలు చెప్పినంతకాలం హిందీకి ఎవరూ అడ్డురాలేదు. కాని, ఎప్పుడయితే హిందీరాకుంటే ఉద్యోగానికి భంగం వస్తుందని ప్రభుత్వంవారు అన్ననాటినుంచి హిందీపై తగని వ్యతిరేకత ప్రబలుతూ ఉంది. హిందీరానివారికి ఏ విధంగా రాజ్యపరిపాలనాదక్షత తక్కువ కాగలదు? దేశంలో ఈ విషయమై అల్లర్లు, పోలీస్ లాటీచార్జీలు, కాల్పులు అన్నీ జరిగిన తరువాత మనప్రాంతంవారు - ఇక మనకు ఇంగ్లీషు వద్దు అన్నంతవరకు, హిందీతోబాటు ఇంగ్లీషు కూడా పూర్వంలాగే రాజభాషగా ఉండాలనే శాసనంచేసిన విషయం అందరికీ గుర్తుండ వచ్చును. అయినా, కేంద్ర సర్వీసులలో హిందీపరీక్ష పాసుకాకపోతే జీతం హెచ్చింపులు, ప్రమోషన్లు నిలుపుదల అవుతాయన్న ప్రభుత్వ ప్రకటనలు, సూచనా పత్రాలు (నోటిఫికేషన్స్) ఇప్పటికీ జారీ అయి, తెలుగు ఉద్యోగస్థులు బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడో అప్పుడు ఏదో అల్లరి బయలుదేరడానికి అవకాశా లున్నాయి.
ఖద్దరు పరిశ్రమ - గ్రామ స్వరాజ్యము
చేతి వడకునూలు, చేనేతబట్ట గ్రామ స్వరాజ్యాన్ని పటిష్ఠం చేయడానికి మొదటి మెట్లు. ఇంటింటా తిరిగి రాట్నాలు పున: ప్రతిష్ఠాపన చేసి ఖద్దరు నేయించడం అనేది రాజకీయమైన స్వాతంత్ర్య సమర చిహ్నమనే బావం ఒకటి కాంగ్రెసువారికి అందరికీ ఉండేది. అందుచేత ప్రభుత్వంవారు తమ ఖర్చుపైన ఎక్కడ బట్టలు సరఫరా చేయవలసి వచ్చినా అక్కడ ఖద్దరు ఇవ్వటం మంచిదని కాంగ్రెసువారు భావించారు. అయితే, ఇది పోలీస్ డిపార్టుమెంటువారు, మిలిటరీవారు అంగీకరించ లేదు. కాని, మిగిలిన చోట్ల ఈ గుడ్డలే కొనియివ్వవచ్చు గదా! ముఖ్యంగా ఆస్పత్రులలోను, మిగిలిన శాఖలలోను సిబ్బందికి ఖద్దరుగుడ్డ లిచ్చుటకు యత్నములు జరిగినమాట వాస్తవమే. కాని, అంత పట్టుదల మంత్రులు చూపించలేదు. చూపించి నట్లయితే మూడు నాలుగేండ్లలో అన్ని విధాలయిన కార్యాలకు ఉపయోగకరమైన, నాణ్యమైన ఖద్దరు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉండేది. బట్టల మిల్లులకు ప్రభుత్వంవా రిచ్చే సదుపాయాలు, సహాయాలు, బలము మొదలైన వాటి విషయం దేశంలో సరిగా తెలియక వాటికి అయ్యే ఖర్చు ప్రజలే వహిస్తూండడం వల్ల - మిల్లుగుడ్డ హెచ్చు ఖరీదో, ఖద్దరు హెచ్చు ఖరీదో సరిగ్గా పోల్చుకోవడం చదువుకున్న వారికి కూడా కొంత కష్టము. ఇలాంటి పరిస్థితులలో ఈ రోజుదాకా కూడా ఖద్దరు వెనుకబడి ఉంది. పల్లెటూళ్ళలో, ముఖ్యంగా నాణ్యమైన ఖద్దరు తయారుచేసే ఉద్యమం అప్పట్నుంచి సాగిఉంటే - చేతిలో ఏ పనీలేని వారికి, సరిపడినంత పనిలేని వారికీ ఖద్దరు ఆర్థికంగా ఎంతైనా ఉపకరించి ఉండేది. నేటికీ, గ్రామసీమలలో ఉద్యోగ సదుపాయాలు ఎలా చేయడమనేది ఆలోచనా స్థితిలోనే ఉంది. రాళ్ళు బద్దలు కొట్టించి, మన్ను మోయించి, కూలి యిచ్చి, నిరంతరం వారిని కూలీలుగా ఉంచి పెంచడం కన్న వడుకునూలు, చేనేతబట్ట కేంద్రాలు హెచ్చు చేస్తే, వారికి కూలీ గిట్టుబాటు కావడంతో బాటు, చేతిపనులలో నైపుణ్యమూ హెచ్చయి, సంఘానికి ఆర్థికంగా బలం చేకూర్చడానికి వీలవుతుంది. కాని ప్రజలూ, ప్రభువులూ కూడా గ్రామసీమలలోని ప్రజలు సత్తువ సంపాదించడం కన్న పెద్ద పెద్ద మిల్లు యజమానులు బలపడడమే ముఖ్యమని అనుకోవడం వల్ల ఈ స్థితి కొన్నాళ్ళకు బాగా విషమించ డానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే మిల్లు యజమానుల పరమయిన మనస్తత్వంతో ఉన్న మంత్రులకుగాని, ఆర్థిక శాస్త్రవేత్తలకుగాని - దీని ప్రమాదం 1939 లోనే తెలియనప్పుడు, కాంగ్రెసుకు నైతిక ప్రాబల్యం తగ్గిన యీ రోజులలో ఇటువంటి గ్రామీణ పునర్నిర్మాణ మహోద్యమాలకు చోటెక్కడ?
"స్వరాజ్య" పత్రిక చరితార్థత
"స్వరాజ్య" పత్రిక పుట్టు పూర్వోత్తరాలు ఈ గ్రంథ పూర్వ సంపుటాలలో ఇదివరకు ప్రకాశంగారే వ్రాశారు. మంత్రివర్గం ఏర్పాటయేసరికి స్వరాజ్య పత్రిక యంత్రాల సంబంధమైన కొన్ని ఋణాలింకా మిగిలి ఉన్నవి. మంత్రిగా ఉన్నపుడు, లావాదేవీలలో పడడం ప్రకాశంగారి కిష్టంలేదు. అసలు అంతకు ముందు, ప్రొవిన్షియల్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడుగా ఉండి, పత్రికకు వాటాలు వసూలు చేయడం మంచిది కాదని డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు చాలా అభ్యంతరం పెట్టారు. [1] అటువంటి సందర్భంలో మంత్రిగా ఉండినా, స్వరాజ్య పత్రిక కంపెనీని వాలంటరీ లిక్విడేషన్ చేసేసినట్లయితే బాగుంటుందని ఆలోచించి ఆ విధంగా చేసేశారు. ఈ స్వరాజ్య పత్రిక జాతీయ నినాదాలను దేశం మూల మూలలా మారుమ్రోగించింది. పత్రికలు నడిపేవారికి నిర్భయత్వం కలిగించింది. అపమార్గంలో వెళ్లేవారికి యమదండంగా పరిణమించింది. జాతీయోద్యమ వార్తలు ఇతర పత్రికలు ప్రచురించడానికి జంకినా, సెక్యూరిటీలు ఎన్నెన్నిమాట్లు పోయినా వెనుకకు తగ్గకుండా స్వరాజ్య ప్రకటించేది. ప్రకాశం గారి సొంతడబ్బేగాక, వసూలు చేసిన వాటా ధనమే గాక, ప్రవాస భారతీయుల బాధలను గురించి ఆయన వ్రాసినది చదివిన బర్మా మలయా దేశాల భారతీయులు కేంద్ర శాసన సభ సభ్యుడుగా ఉన్న దినాలలో ఆయన అక్కడ పర్యటించి నపుడు అభిమానంతో విరాళాలుగా ఇచ్చిన లక్షలు కూడా ఈ పత్రికా నిర్వహణలో ఆహుతి అయిపోయినవి. చివరకు మిగిలింది పేరు ఒక్కటే. ఈ రోజున, ప్రకాశంగారి జీవితయాత్ర వ్రాసే సందర్భంలో. స్వరాజ్య పత్రికలు ఎక్కడైనా దొరుకుతాయా అని వెతికితే ఎక్కడా దొరకలేదు. ఆయన ఆ పత్రికలో వ్రాసే టప్పుడు, పత్రికకు హాని కలుగకుండా, ప్రభుత్వంవారేదైనా చర్య తీసుకుంటే తనపైనే సంపూర్ణమైన, వ్యక్తిగతమైన బాధ్యత తీసుకునేటట్లు - అనేక వ్యాసాలు, నిర్భయంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తన పేరుమీద వ్రాసేవారు.
ఈ పత్రికా నిర్వహణలో, సంపాదకీయ వర్గంలో ఇంతో అంతో కాలం పనిచేసిన వారిలో ఈ క్రింది ప్రముఖులు ఉన్నారు:
వారు - కె. ఎం. ఫణికర్, పోతన్ జోసెప్, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, కె. సంతానం, కోలవెన్ను రామకోటేశ్వరరావు, జి. వి. కృపానిధి, ఖాసా సుబ్బారావు మొదలైన వారు. ఇందులో చివర చెప్పిన ఇద్దరూ పత్రిక లిక్విడేషన్ అయ్యేవరకు జీతం అందినా, అందకపోయినా, దేశంమీద ఉన్న అభిమానంచేతా, ప్రకాశంగారిపై నున్న గురుభావంచేతా పత్రికను అంటిపెట్టుకుని ఉన్నారు. శాసన సభలో ప్రశ్నలకు జవాబులు
శాసన సభా కార్యక్రమం నడిపించడానికి, నామీద ప్రత్యేకమైన అభిమానముంచి, ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చే సమయంలో (అంటే ప్రతి దినం మొదటిగంట యావత్తూ) ఆయన పని నాకు అప్పజెప్పి, అవతల ఉండేవారు ప్రకాశంగారు. అలా అవతల ఉండవలసిన అగత్యం స్పీకరు సాంబమూర్తిగారివల్ల కలిగింది. ప్రకాశంగారు మొదట, ఒకటి రెండు రోజులు ప్రశ్నలకు జవాబులు చెప్పి, తర్వాతనే పార్లమెంటరీ సెక్రటరీని కాబట్టి ఆ జవాబులు నన్నే చెప్పమ న్నారు. దానిపైన సాంబమూర్తిగారు ఒక రూలింగు ఇచ్చారు. ఆ రూలింగు ప్రకారం మంత్రి గారు సభలో హాజరయిఉంటే, పార్ల మెంటరీ సెక్రటరీ ప్రశ్నలకు జవాబు చెప్పరాదు. అయితే, ప్రకాశంగారు దానికి జవాబుగా "ఇకమీద ప్రశ్నల సమయంలో నేను అవతల ఉండి, మిగిలిన కార్యక్రమం ఆరంభమయ్యేసరికి వస్తుంటాను. ప్రశ్నలకు జవాబులు పార్ల మెంటరీ సెక్రటరీయే ఇస్తుంటా" డని చెప్పి, ఆరోజు కాగితాలు నా చేతిలో ఉంచి, అవతలకు వెళ్ళారు.
ఇది ఇలా జరుగుతుండగా, అనవసరమైన ఒక చిన్న విమర్శ ఒక చిన్న వార పత్రికలో ఎవరో వ్రాశారు. అందులో, ప్రశ్నోత్తర సమయంలో ప్రకాశంగారు తప్పుకోవడమే బాగుందనీ, ఆయన పార్ల మెంటరీ సెక్రటరీయే కార్యక్రమమంతా ప్రశంసనీయంగా నడిపిస్తున్నారనే భావం ఉండి. అయితే, ఈ విషయం నేను మొదట చూడలేదు. మామూలుగా నాకు వచ్చే ప్రశ్నలకు సంబంధించిన ఫైళ్ళు ఒక రోజు నా వద్దకు రాలేదు. గుమాస్తాలు పంపడం మరచిపోయినా రేమోనని, నేను ప్రకాశంగారి యింటికి వెళ్ళాను. ప్రకాశంగా రప్పుడు భోజనం చేస్తున్నారు. కచ్చేరి గది బల్లపైన, ఒక వారపత్రికలోని వ్యాసం - మార్జినులో ప్రక్కగా ఎర్ర గీత ఉన్న దానిని నేను చూశాను. ఏదో పరిపాలనా విషయమేమోనని చూస్తే, అది ప్రశ్నోత్తరాలకు సంబంధించి నేను ఇంతకు ముందు పేర్కొన్న వ్యాసమే. ఆ కాగితం నేను తిరిగి అక్కడే ఉంచేశాను. ప్రశ్నలకు సంబంధించిన ఫైళ్ళు ఆ ప్రక్కనే ఉన్నాయి. అంతలో ప్రకాశంగారు బయటకు వచ్చారు. మామూలు పద్ధతిలో, ఆయన కారులోనే నేనూ, ఆయనా అసెంబ్లీకి బయలు దేరాము. మా ఇద్దరిలో ఎవరూ ఆ వ్యాసం ప్రసక్తి తేలేదు. కొంతదూరం పోయిన తర్వాత "ఈ రోజు ప్రశ్నలకు నేనే జవాబులు చెప్తానులే," అన్నారు ప్రకాశంగారు. నేను "సరే" అన్నాను. కారణం ఆయన చెప్పలేదు. నేను అడగలేదు. ఆ పత్రిక వ్యాసమే కారణమయి ఉంటుందని ఊహించాను. అయితే, ఇటువంటి వ్యాసంవల్ల ప్రకాశంగారి వంటి పెద్దవారు బాధపడ్తారా అని అనుకున్నాను. అలా రెండు మూడు రోజులు జరిగింది. ఆ తరువాత ప్రశ్నల ఫైళ్ళు ఆ మంత్రివర్గం ఉన్నంత వరకు నాకే వస్తూ ఉండేవి. ఒకటి మాత్రం నేను ఇక్కడ చెప్పాలి. మిగిలిన మంత్రులు తమ పార్ల మెంటరీ సెక్రటరీలకు, ప్రకాశంగారు నాకు ఇచ్చినట్లు అవకాశాలు ఇచ్చేవారు కారు. అలా ఇచ్చిన అవకాశాలను నేను సద్వినియోగ పరచినట్లే సభలో అందరూ భావించేవారు. ఈ విషయంలో, కేంద్ర లోక్‌సభ లోను, రాజ్యసభ లోను ఉన్న పద్ధతి. ఈ రాష్ట్ర శాసన సభలో పద్ధతికి భిన్నంగా ఉంటుంది. మంత్రి అక్కడే ఉన్నప్పుడు కూడా ఉప, సహాయ మంత్రులు జవాబు లివ్వడానికి అభ్యంతరంలేదు. అంతే కాదు. వారే ప్రథమంలో సచివాలయంవారు వ్రాసి నికరం చేసిన ప్రత్యుత్తరాన్ని చదువుతారు. అవసరం వచ్చినపుడు మంత్రి కూడా చేచి ప్రత్యుత్తరాన్ని విపులపరుస్తాడు. శాసన సభలో ఉపన్యాసా లిచ్చేటప్పుడు ప్రకాశంగారు మంద్ర స్వరంలో మెల్లిగా మొదలుపెట్టి తూచి తూచి మాట్లాడినా, ఉపన్యాసం గడచిన కొద్దీ వాక్యాలు వేగం అందుకుని అవసరాన్నిబట్టి ఉచ్చమైన స్వరంలోకి వెళ్ళడం జరిగేదని ఇదివరకే వివరించాను. తాను మాటాడుతున్నపుడు ఇతర సభ్యులెవరైనా విమర్శనా పూర్వకంగా ఏదైనా మధ్యలో అంటే, ఆయన దాన్ని వెంటనే అందుకుని, దాని జవాబును కూడా తన వ్యాఖ్యానంలో కలప గలిగేవారు. ఒక రోజున శాసన సభలో జమీందారీ ఎంక్వయరీపై మాట్లాడే సందర్భంలో "పెర్మనెంట్ సెటిల్మెంటు రెగ్యులేషన్లోగల భాషయొక్క అర్థం ప్రీవీ కౌన్సిల్‌వారు సరిగా గ్రహించ లేకపోయా"రని ప్రకాశంగారు అంటే, శాసనమండలి సభ్యులైన సర్ కె. వి. రెడ్డినాయుడు గారు అందుకుని, "ప్రీవీ కౌన్సిల్ వారంతా ఇంగ్లీషువారు కదా! వారి ఇంగ్లీషు వారికే బోధపడలేదంటారా?" అని ఆశ్చర్యంతో ప్రశ్నించారు. వెంటనే ప్రకాశంగారు "అంతే! రెడ్డినాయుడుగారికి తెలుగు గ్రంథాలన్నీ అర్థమయ్యాయా?" అని ప్రశ్నించారు.
రెడ్డినాయుడుగారు, ప్రకాశంగారు చిన్నప్పుడు కలసి చదువుకున్న వాళ్ళు (క్లాస్‌మేట్స్). మొత్తంపైన ఆ రెండేళ్ళున్నర మంత్రివర్గ కాలంలో ప్రకాశంగారు ఏది మాట్లాడినా, దానికి ఒక విలువ, ఒక బరువు ఉండేవి. అందుకు ఆయన త్యాగశీలత ముఖ్యకారణము.
- ↑ డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు పార్ల మెంటరీ బోర్డులోను, ఆలిండియా వర్కింగ్ కమిటీలోనూ సభ్యత్వం కలిగి ఉండి, కేంద్ర శాసన సభకు అభ్యర్థులను నిలబెట్టే సమయంలో తాను ప్రారంభించిన "శుభోదయ" పత్రికకు అభ్యర్థుల దగ్గర పెద్ద పెద్ద మొత్తాలు వాటా ధనం క్రింద వసూలు చేయడం నాకు స్వయంగా తెలుసు. అది సరిగ్గానే ఉందని ఆయన అనుకున్నారు.