నా జీవిత యాత్ర-1/రాజమహేంద్రవర ప్రయాణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4

రాజమహేంద్రవర ప్రయాణం

ఇంక నా భవిష్యత్తుకి కారణం అయిన రాజమహేంద్రవరాన్ని గురించి వ్రాస్తాను. అది విద్యావంతులకి నిలయమనీ, మహా పండితులకి ఆస్థానమనీ, గోదావరి బ్రహ్మాండమైనదనీ, ఆదేశం తెలిసిన వాళ్ళంతా పండితులవుతారనీ చెప్పుగుంటూ వుండేవారు. నాకు ఆ వూరు, ఎల్లా ఉంటుందో చూడాలని ఒక సంకల్పం వుండేది. నా మిత్రుడు నవులూరి రమణయ్య, నేనూ, మరి కొందరమూ కలిసి ఇళ్ళళ్ళో కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలని ఒక ప్లాను వేశాము.

ఆ కాలంలో ఒంగోలుకి కలరా వచ్చింది. మేము ఉండే చోట ఒక కేసు రావడంవల్ల భయపడి మా అమ్మగారు మమ్మల్ని ధారావారి వీధిలో ఉన్న నిమ్మగడ్డవారింట్లో పెట్టింది. పిల్లి పిల్లలిని పెట్టి ఏడు చోట్లకి తిప్పినట్లు ఆమె మాకు ఎక్కడ ఏమి ఆపత్తు వస్తుందో అని అతి భయంతో అక్కడికీ ఇక్కడికీ మారుస్తూ వుండేది. ఆ నిమ్మగడ్డ వారి ఇంట్లో కొందరు రాజమహేంద్రవరంలో చదువుకుని పండితులై వైదిక విద్యలో పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. వారింట్లో ఉండటం వల్ల నాకు రాజమహేంద్రవరం చూడాలనే కోరిక మరింత హెచ్చయింది. ఈ మానసికస్థితిలో మిడిల్‌స్కూల్ పాసయి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ వున్నాను.

అప్పటికి ఆ ఊళ్ళో ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులుగా వుండేవారు. ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయినవారు. ఆయనకి నెలకి 30 రూపాయలు జీతము. ఆయనకి నాటకాలంటే ఉండే అభిరుచిని గురించీ, అందు మూలంగా ఆయనతో నాకు కలిగిన సాహచర్యాన్ని గురించీ, ఇదివరకే వ్రాశాను. ఈనాటికీ ఆయనే నా జీవితానికి మార్గదర్శకుడు అనీ, నా అభివృద్ధికి మూలకారకుడు అనీ కృతజ్ఞతాపూర్వకంగా విశ్వసిస్తాను.

అందుచేత, ఆయన్ని గురించి కొంచెం వ్రాస్తాను. ఆయన తండ్రిగారు కొత్తపట్నంలో కరిణీకం చేస్తూ వుండేవారు. వారిది ఆది వెలమకులం. ఎప్పుడో వారి పూర్వులది బందరు కావచ్చును. కాని, హనుమంతరావునాయుడుగారి తండ్రిగారు కొత్తపట్టణంలో కరిణీకం సంపాదించారు. సామాన్యంగా గుంటూరుజిల్లాలో కరిణీకం బ్రాహ్మణుల కుటుంబాల్లోనే వుండేది. అయితే, ఆ ఊరికిమాత్రం ఇది ఈ ఆదివెలమ కుటుంబానికి ఎట్లా సంక్రమించిందో నేను చెప్పలేను. ఈ నాటికీ ఆ కరిణీకం ఇమ్మానేనివారి కుటుంబంలోనే వుంది. మెట్రిక్యులేషన్ అయి, మాష్టరీ ప్రారంభించేసరికి హనుమంతరావు నాయుడుగారికి సుమారు 25 సంవత్సరాల వయస్సుంటుంది. ఆయన లెక్కల్లో చాలా ప్రతిభావంతులని ప్రతీతి. ఆయన మెట్రిక్యులేషన్ పాసయి మెట్రిక్యులేషన్ క్లాసుకీ, దాని కింది క్లాసులకీ లెక్ఖలు చెప్పేవారు. అంతేకాకుండా యఫ్.ఏ., బి.ఏ. పరీక్షలకి చదివేవాళ్ళు కూడా ఆయన దగ్గిరికి వచ్చి లెఖ్ఖలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంగ్లీషు వ్యాకరణం మొదలయినవి చెప్పడంలో కూడా ఆయనకి మంచి పేరు వుండేది. అప్పటికే బి.ఏ. చదువుతూ ఉండిన కొండా వెంకటప్పయ్యగారిని ఆ రోజుల్లో లింగంగుంట వెంకటప్పయ్య అనేవారు. వారి ఊరు లింగంగుంట కావడమే దీనికి కారణము. కొంపల్లి కోటిలింగం, మన్నారు కృష్ణయ్య మొదలయినవారు మా నాయుడుగారి శిష్యులే. వారంతా అక్కడే మెట్రిక్యులేషన్ పాసయి లెఖ్ఖలు మొదలయిన విషయాల్లో ఆయనదగ్గిర సంశయనివారణం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆంధ్రదేశంలో అఖండ గణితశాస్త్రవేత్తగా ప్రఖ్యాతి పొందిన పాంచాలవరపు సుబ్బారావు కూడా ఆన శిష్యుడే. నాకు కేవలం అదృష్టం వల్ల ఆయన శిష్యరికం లభించింది. నేను మిడిల్ స్కూలు పరీక్ష పాసవడంతోనే నా దగ్గిర బంధువులు అంతా నన్ను ఏదైనా నౌఖరీలో ప్రవేశించమని చాలా బాధపెట్టారు. వాళ్ళు అందరూ "ఎంతకాలం మీ అమ్మగారు నీకోసం ఇల్లా పాటుపడా"లని అంటూ ఉండే వాళ్ళు. ఆ రోజుల్లో మిడిల్ స్కూలు పరీక్ష మొదటి తరగతిలో పాసవడమంటే మెట్రిక్యులేషన్ పాసవడంతో సమానమే. అందుచేతనే నాకు వాళ్ళు అల్లాంటి సలహా ఇచ్చారు. నా దృష్టి మాత్రం యిదివరలో చెప్పినట్లు పై చదువుమీదా, తరవాత, ప్లీడరీమీదా వుండేది. మా అమ్మగారు కూడా మరి రెండు సంవత్సరాలపాటు చదివితేనే మంచిదని నిశ్చయించింది. అందుచేత నేను చదవడానికే నిశ్చయించాను. ఈ చదువుకు నెలజీతం ఒక సమస్య! ఈ సమస్య పరిష్కారం చేసి నా జీవితం అభివృద్ధిలోకి తీసుకువచ్చినది హనుమంతరావునాయుడు గారే.

ఆయన మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులని వ్రాసే వున్నాను. ఆ రోజుల్లో ఆ మిషన్ స్కూలుకి మాన్లీ అనే ఆయన ప్రధానోపాధ్యాయుడుగా వుండేవాడు. ఆయన అర్హులయిన బీదవిద్యార్థులకి వేతనాలిప్పించి అనేకమంది కృతజ్ఞతకి పాత్రులయ్యారు. నాటకాల పరిచయంలో నాయందు కలిగిన అవ్యాజ కరుణ వల్ల హనుమంతరావునాయుడుగారు నన్ను ఆయన దగ్గిరికి తీసుకువెళ్ళి సిఫారసు చేశారు. దానికి ఆయన అంగీకరించారు.

దాంతో నా కష్టం గట్టెక్కింది. మిడిల్ స్కూల్లో చదివే కాలంలో కూడా హనుమంతరావు నాయుడుగారు రాత్రిళ్ళు నాకు ఇంటి దగ్గర ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. ఆనాటి విద్యావిధానంలో మిడిల్ స్కూలుకే చాలా లెఖ్ఖలు వుండేవి. హనుమంతరావునాయుడు గారి బోధనలో ఉండే విశేషం యేమిటంటే ఆయన ఒక్కసారి పాఠంలో సూత్రం చెబితే అది తలకెక్కి దానినిబట్టి అల్లాంటి కొత్త సూత్రాలు అవగాహన చేసుకునే శక్తి కలుగుతూ వుండేది.

మాన్లీ దొరగారి స్కూల్లో హనుమంతరావు నాయుడుగారి శిక్షణకింద ఐదవతరగతి చదివాను. ఐదవతరగతి అంటే మెట్రిక్యు లేషన్ కింద క్లాసు. ఈ రోజుల్లో వెనకటి అల్లరి చాలావరకు తగ్గింది. చదువుకి సంబంధించని పని అల్లా, ఒక నాటకాల గొడవే.

ఇంతలో వేసవికాలపు సెలవులు వచ్చాయి. అప్పటి హనుమంతరావు నాయుడుగారి కుటుంబస్థితి కొంచెం వ్రాస్తాను. అప్పటికి ఆయన బంధువులు అంతా రాజమహేంద్రవరంలో మంచి పదవుల్లో వున్నారు. ఆయన ఒక్కరూ మాత్రం యిక్కడ వున్నారు. 30 రూపాయల జీతంతో కుటుంబం గడవడమే కష్టము. అందులోనూ నాయుడుగారు డబ్బు లక్ష్యం లేకుండా ఖర్చుపెట్టే మనిషి. ఆయనకి అప్పటికి నలుగురు పిల్లలు వుండేవారు. ఇంకా ముసలితల్లి ఒక ఆవిడ వుండేది. ఆయన యింత సంసారమూ ఈదుతూ పైగా నాబోటి శిష్యుల భారం కూడా వహిస్తూ వుండేవారంటే, ఆదాయం చాలక అప్పుల్లో పడడంలో ఆశ్చర్యమేముంది.

ఆయన భార్య లక్ష్మమ్మగారు మహా ఇల్లాలు. ఆమె పచ్చని తాళిబొట్టు తప్ప మెళ్ళో యెప్పుడూ వేరే ఆభరణాలు యేవీ ధరించి యెరగదు. నాయుడుగారికి అప్పుల బాధ మితిమీరిన సమయంలో ఆమె వేసవికి రాజహేంద్రవరం పోయి తన బంధువుల్ని అందరినీ చూడాలని కోరింది. కొంత తర్జనభర్జన అయ్యాక నాయుడుగారు కూడా దానికి అంగీకరించారు. కాలవలు కట్టివేసిన రోజులవడం వల్ల నాటు బళ్ళమీద ప్రయాణం చెయ్యవలసివచ్చింది. వాళ్ళు అల్లా ప్రయాణానికి సంకల్పించుకున్నప్పుడు నాయుడుగారితో నాకు వుండుకున్న చనువును బట్టి చిరకాలంగా నా మనస్సులో వున్న కోరిక వెలిబుచ్చి, "నేనుకూడా రాజమహేంద్రవరం వస్తా" నని చెప్పాను. "మీ వాళ్ళు నాతో పంపడానికి అంగీకరించరు. నేను మళ్ళీ సెలవలు అయ్యాక వస్తానులే!" అని నాయుడుగారు అన్నారు.

నేను ఇంట్లో యీ సంగతి చెప్పినప్పుడు మావాళ్ళు నన్ను వెళ్ళవద్దని వారించారు. "అంతదూరం ఆయనతో వెళ్లడం యెందు"కని అన్నారు. కాని, నాకు రాజమహేంద్రవరం చూడాలని వున్నదనీ, వెళ్ళక తప్పదనీ పట్టుబట్టాను. మొండుపట్టు పట్టడం మనకి అలవాటే కనక యింట్లోవాళ్ళు విధిలేక చిట్టచివరికి అంగీకరించారు! నాయుడుగారు కూడా మా ఇంటికి వచ్చి, "అంత పట్టుదలగా ఉన్నప్పుడు పంపండి. నేను జాగ్రత్తగా తీసుకువస్తాను" అని చెప్పారు. మా అమ్మమ్మగారు "మా వాడికి భోజనం ఎల్లాగ?" అని ఆతృతగా అడిగింది. నాయుడుగారు "అతని కేమీ లోటు రానివ్వ" నని మా అమ్మమ్మగారికి ధైర్యం చెప్పారు.

నాయుడుగారు, ఆయన భార్య, నలుగురు పిల్లలు, తల్లి, నేనూ కలిసి ఆంచె బళ్ళమీద ప్రయాణం ప్రారంభించాము. అక్కడికి రాజమహేంద్రవరం 180 మైళ్ళ దూరంలో వుంది. బెజవాడ గ్రాండు ట్రంకు రోడ్డుమీద 90 మైళ్ళు, బెజవాడనించి విఝ్ఝేశ్వరం 90 మైళ్ళు. అప్పట్లో బెజవాడ నాలుగు మకాముల్లో చేరేవాళ్ళం. అప్పటికాలంలో సామాన్యంగా రాత్రిళ్ళంతా ఏ 20 మైళ్ళో నడవడమూ, పగలు సత్రాలున్నచోట మకాములు చెయ్యటమూ. ఒక ప్రయాణ పద్ధతిగా వుండేది. కావలిస్తే, మకాముల్లో బెజవాడవరకూ అంచె బళ్ళు సిద్ధంగా దొరికేవి. కాని, బెజవాడనించి రాజమహేంద్రవరం వరకూ మాత్రం బళ్ళు సులువుగా దొరికేవి కావు. దారి కూడా చాలా భయంకరంగా వుండేది. దారి పొడుగునా అరణ్యమార్గంలా కనబడేది. దానికితోడు ఎడ్లు కూడా నాసిరకం అయితే బెజవాడనించి రాజమహేంద్రవరం చేరేసరికి సుమారు 10 రోజులు పట్టేది. దారిలో ప్రతి మకాము దగ్గిరా నాయుడుగారు నాకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల ఇంట్లో భోజనం ఏర్పాటుచేసి, ఆయనా, కుటుంబమూ, అంతా వంట చేసుకునేవారు.

ఇల్లాగ రెండువారాలు ప్రయాణం చేసి విఝ్ఝేశ్వరం చేరుకున్నాము. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవరం చేరాము. ఒంగోలునించి గుంటూరు వరకు దారి పొడుగునా కొండలూ, గుట్టలూ వున్నాయి. మకాముల్లో నీటి సౌకర్యాలు లేక దేశం బొగులు బొగులు మంటూ వుండేది. ఆ రోజుల్లో కాస్త కృష్ణ సమీపించేసరికి పచ్చని నేల కనబడేది. దారిలో దొంగల భయం కూడా వుండేది. అందుచేత బళ్ళు ఒంటరిగా కదిలేవి కావు. ఆ ప్రయాణంలోనే మేము ఏలూరులో ఆగినప్పుడు నాయుడుగారు నాకు రత్నకంబళ్ళ నేత చూపించారు. అప్పుడే జాగ్రఫీ పుస్తకాలలో "ఏలూరు రత్నకంబళ్ళకి ప్రసిద్ధి" అని చదువుకున్నాము. ఆయన అది చూపించడానికి నన్ను సత్రం వెనకాలవున్న రత్నకంబళ్ళు నేసేవాళ్ళ యిళ్ళకి తీసుకువెళ్ళారు. అనేకులు - అందులో ముఖ్యంగా మహమ్మదీయులు - ఈ వృత్తి వల్ల జీవించేవారు. ఆ రోజుల్లో ఆ వ్యాపారం మంచి వృద్ధిలో వుండేది.

రాజమహేంద్రవరం చేరడానికి పడవప్రయాణం చేస్తూన్నప్పుడే నా హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆ నది వైశాల్యమూ, గాంభీర్యమూ నన్ను వివశుణ్ణి చేశాయి. రాజమహేంద్రవరంలో దిగుతూవుండగానే - ఆ రోజుల్లో ఆ పట్టణపు ఐశ్వర్యం సూచించే కలప కార్ఖానాలు, పడవలమీద దిగిన బస్తాల గుట్టలూ - కనిపించాయి. అక్కడే కొత్త పడవల నిర్మాణాలూ, పాతపడవల మరమ్మతులూ కూడా జరుగుతూ వున్నాయి. రాజమహేంద్రవరంలో దిగేసరికి మా నాయుడుగారి దగ్గర చదువుకున్న ఇతిహాసమూ, రాజరాజనరేంద్రుడి చరిత్రా, సారంగధరుడి కథా, భారతం రచించిన కవుల గాథలూ, ఇత్యాదులన్నీ స్ఫురణకి వచ్చాయి. వేసవికాలం సెలవలు గడవడం తోనే వెళ్ళిపోదామనే సంకల్పంలో ఉండడంవల్ల నాయుడుగారు నాకు ఆ ఊళ్ళోవున్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించారు.

సారంగధరుడి మెట్ట, దానిమీద కాళ్ళు నరకబడిన సారంగధరుడి శిల, చిత్రాంగి మేడ, రత్నాంగి మేడ, పావురం వాలినచోటు, మొదలైనవన్నీ చూపించారు. కోటిలింగాల క్షేత్రం దగ్గరకి తీసుకువెళ్ళి, ఆ లింగాలన్నీ చూపించారు. నేను అవన్నీ లెక్కపెట్టడం ప్రారంభించి, "కోటీ లేవేమి?" అని నాయుడుగారిని అడిగాను. ఆయన అవన్నీ ఒకప్పుడు వుండేవనీ, క్రమంగా కరిగిపోయి నదీ గర్భంలో జీర్ణమయి వుంటాయనీ చెప్పారు. మేము రాజమహేంద్రవరం చేరిన కొద్దిరోజులకి కాలవలు వదలడం వల్ల రహదారీ పడవల మీద రామచంద్రపురం, అమలాపురం, మొదలైన గ్రామాల్లో వున్న నాయుడుగారి చుట్టాల ఇళ్ళకి వెళ్ళాము. ఆ పడవప్రయాణాలు చాలా

కులాసాగా వుండేవి. ఆ ప్రయాణాల్లోనే గోదావరి మహానది విస్తీర్ణమూ, ప్రయోజనమూ బాగా అవగాహన అయ్యాయి.

అప్పట్లో రాజమహేంద్రవరం అంటే నేటి పాతపట్టణం మాత్రమే. ముఖ్యమైన భవనాలల్లా చిత్రాంగీ రత్నాంగుల మేడలే. అప్పటికీ గోదావరి గట్టు లేదు. బ్రిడ్జి అసలే లేదు. నేటి ఆర్యాపురానికంతటికీ రెండో మూడో ఇళ్ళు ఉండేవి. మిగతావన్నీ కలప అగితీలే. ఇన్నీసుపేట కొంచెమే వుండేది. గచ్చు కాలవలు లేకపోయినా డ్రెయినేజీ వగైరాలు చక్కగా వుండేవి.

నేను రాజమహేంద్రవరం చేరేసరికి అప్పట్లో కొద్దిమంది న్యాయవాదులు వుండేవారు. అప్పటికి ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు, మాతర్ల సుబ్బారావు నాయుడు, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడుగార్లు బి.ఏ, బి.ఎల్ పాసయి ప్లీడరీ చేస్తున్నారు. జిల్లా కోర్టు, మునసబు కోర్టూ ఒక పాత ఇంట్లో వుండేవి. ఏలూరు రాజ్యలక్ష్మీ నరసింహంగారు, నేతి సోమయాజులుగారు మొదలయిన వారు ప్లీడర్లు. సరిపల్లి సాంబశివరావు, గోపాలకృష్ణమ్మ, దామరాజు నాగరాజు ప్రభృతులు పట్టాలు పొందిన ప్లీడర్లు. ఇక పాండిత్య విషయంలో, అప్పటికే వీరేశలింగం, వడ్డాది సుబ్బారాయుడుగార్ల పేర్లు మోగి పోతున్నాయి. వారిద్దరికీ సాహిత్యసంబంధమైన ఈర్ష్య వుండేది. సంస్కృత పండితుల్లో కల్లూరి వెంకటరామశాస్త్రులుగారి కీర్తి బాగా వుండేది. అప్పుడు శుద్ధ గ్రాంథిక భాషలో మాట్లాడతారని పేరుపొందిన కొక్కొండ వెంకటరత్నం గారికి కూడా మంచి ప్రసిద్ధి వుండేది.

మా సెలవలు పూర్తి కావచ్చాయి. నాయుడుగారి భార్య లక్ష్మమ్మగారికి మొదటినించీ బంధువులకి సమీపంగా రాజమహేంద్రవరంలో వుండాలనే కోర్కె వుండేది. ఒంగోలులో అప్పులు పెరిగిపోవడం వల్లా, ఆ అప్పులు తీరే మార్గం కనిపించకపోవడం వల్లా ఆమె కోరిక మరింత దృఢపడింది. ఆమెకి రాజమహేంద్రవరంలోనూ రామచంద్రపురంలోనూ వుండే బంధువులంతా, "అంతదూరంలో ఏమిటా ఉద్యోగం? ఈపాటి ఉద్యోగం ఇక్కడ దొరకదా!?" అని అంటూ వుండేవారు. ఆమె బంధువులు ఇమ్మానేని లక్ష్మీకాంతరావు ప్రభృతులు పెద్ద ఉద్యోగాల్లో, గౌరవంగా కాలక్షేపం చేస్తూ వుండేవారు. ఆమె, "ఇంతమంది వుంటూండగా ఒక ఉద్యోగం అయినా దొరకదా?" అని అంటూ వుండేది. నాయుడుగారు "ఇక్కడ మనకి ఉద్యోగం ఎవరిస్తారు? అప్పుడే ఇక్కడికి ఎఫ్.ఏ.లూ, బి.ఏ.లూ తయారై వున్నారు. వీళ్ళ మధ్య మనకి ఉద్యోగం దొరుకుతుందా?" అనేవారు. ఇల్లాగ కొంత తర్జనభర్జన జరుగుతూ వుండగా ఏలూరి లక్ష్మీనరసింహంగారు థీయిస్టిక్ హైస్కూలు అనే కొత్త స్కూలు స్థాపించడానికి నిశ్చయించారు. లక్ష్మమ్మగారి బంధువులంతా ఆయనతో చెప్పి నాయుడుగారికి లెఖ్కల మాస్టరీ ఒకటి ఏర్పాటు చేయించారు. జీతం మామూలు 30 రూపాయలే.

స్కూలు తీశారు. నాయుడుగారు రాజమహేంద్రవరంలో మాస్టరీలో చేరారు. నేను ఇంటికి పోవడానికి సెలవు తీసుకున్నాను. అప్పటికి కాలవలు వదిలారు. రాజమహేంద్రవరం రేవులో పడవ ఎక్కితే బెజవాడ దాకా ఏలూరు కాలవమీదా, తరవాత కొత్తపట్టణం దాకా బకింగుహాముకాలవమీదా, ప్రయాణం చెయ్యడానికి బాగా వీలుగా వుండేది. అందుకోసమని నాకున్న నాలుగు గుడ్డలూ మూటగట్టుకుని, నేనొక్కణ్ణి వెళ్ళగలనని నాయుడుగారికి ధైర్యం చెప్పి పడవలరేవుకి బయలుదేరాను. తీరా రేవులోకి వెళ్ళేసరికి పడవలు దాటిపోయాయి. అందుచేత విధిలేక మళ్ళీ ఇంటికి వచ్చాను.

నేను తిరిగి వచ్చేసరికి నాయుడుగారు మధ్యాహ్నం విరామంలో స్కూలునించి వచ్చి నేను వెళ్ళిపోయానని చెప్పేసరికి దిగాలుపడి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుగుంటున్నారు. పక్కనున్న ఆయన బంధువుడు ఒకాయన, "బ్రాహ్మణ పిల్లవాడు, ఏదో మాటవరసకి నీతో వచ్చాడు కాని, ఎల్లకాలం నీతో వుంటాడటయ్యా వాళ్ళ వాళ్ళ నందరినీ విడిచి పెట్టి?" అని ఆయన్ని మందలించారు. కాని, నా యందుండే అవ్యాజ ప్రేమవల్ల నాయుడుగారు దు:ఖం ఆపుకోలేకపోయారు.

ఇలాంటి స్థితిలో పడవ దాటిపోయి నేను మళ్ళీ ఆయన కళ్ళ ఎదట కనిపించాను. ఆయనకి ఎక్కడలేని సంతోషమూ కలిగింది. ఆపైన కొంత సంభాషణ అయ్యాక "పోనీ నువ్వుకూడా ఇక్కడే చదువుకోరాదా?" అని అడిగారు. దానిమీద నేను, "మా వాళ్ళంతా అక్కడ వున్నారు కదా! నన్ను ఇక్కడ ఎవ్వరు చూస్తారు?" అన్నాను. దాని మీద ఆయన "అక్కడ మాత్రం ఎవ రున్నారు? మీ అమ్మగారూ, అమ్మమ్మగారూ కష్టపడవలసిందే గదా? ఇక్కడే నాతోపాటు తంటాలు పడకూడదా?" అని ఆప్యాయంగా అన్నారు.

ఒక్కక్షణం అట్టే ఆలోచించాను. నా జీవితంలో అది ఒక అపూర్వమైన ఘడియ! అదే ఈ జీవితం యావత్తూ ఇల్లాగ పరిణామం చెందడానికి మూలకారణమైన నిమిషం! "Life is a series of Accidents" అంటే జీవితమంతా "ఆకస్మిక ఘటనావళి" అనే మాటల్లో ఎంతో అర్థం వుంది. నాకు పడవే అంది, ఒంగోలు తిరిగి చేరితే జీవితం ఏమి అయి వుండేదో, ఎట్లా పరిణమించేదో పరమేశ్వరుడికే ఎరుక! నేను పడవ దాటిపోయి వెనక్కి రావడమూ నాయుడుగారికి మనస్తాపం కలిగి నన్ను తమ దగ్గర వుండమనడమూ. రెండూ కూడా దైవఘటనలే! ఒక్కక్షణం ఆలోచించి చేతులో ఉన్న బట్టలమూట అలాగే కింద పడవేసి, "మీ అభిప్రాయం అల్లా వుంటే సరే ఉండిపోతాను!" అన్నాను. వెంటనే ఆ థీయిష్టిక్ హైస్కూల్లోనే 5 వ క్లాసులో రెండో అర్ధసంవత్సరంలో చేరాను. ఆ రోజుల్లో చదువులికి దేశమంతా ఒకటే పాఠ్యవిధానం వుండడంచేత స్కూలు మారడంవల్ల చదువు కేమి ప్రతిబంధకం కలగలేదు. నాయుడుగారు నా విషయమై ఏలూరి లక్ష్మీనరసింహంగారికి శిఫారసు చేసి, 'విద్యార్థివేతనం' కూడా సంపాదించారు. ఇల్లాగ దైవికంగా రాజమహేంద్రవరంలో చదువుకి ప్రవేశించాను. ఈ సంగతి మా వాళ్ళకి ఉత్తరం వ్రాస్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. కాని, నాయుడుగారితో వుండడంవల్ల వాళ్లు మనస్సులు కొంత సమాధానపరచుకున్నారు.