Jump to content

నా జీవిత యాత్ర-1/యూరపు సంచారం

వికీసోర్స్ నుండి

15

యూరపు సంచారం

నేను మిత్రుల సహాయం పొంది యూరపులో సంచారం చేశాను. రాకపోకల్లో పారిస్ ఇదివరకే చూశాను. ఇంక హాలండు, డెన్మార్కు, స్విట్జర్లండు, స్వీడన్, ఇటలీ, గ్రీసు, జర్మనీదేశాలు ఆఖరున చుట్ట పెట్టాను. డెన్మార్కు వ్యవసాయపు దేశం. అక్కడి వ్యవసాయపు పద్ధతులు చాలా ఆకర్షకంగా ఉంటాయి. స్విట్జర్లాండ్‌లో అప్పుడు ముఖ్యమైన పరిశ్రమ లన్నీ గృహపరిశ్రమలు గానే నడపబడుతూ ఉండేవి. నేను ఇటలీలో విసూవియస్ పొంగుతూ ఉన్నప్పుడు చూశాను. ఇంకా నేపుల్సు, పై సాటరు మొదలయిన అపురూపపు ప్రదేశా లన్నీ చూశాను. థెర్మాపోలిఫ్ కనుమ కూడా చూశాను. ఇవన్నీ చూసిన తరవాత జర్మనీ వెళ్ళాను. ఈనాడు ప్రపంచ చరిత్రలో ప్రముఖస్థానం అలంకరించిన జర్మనీనిగురించి కొంచెం వ్రాస్తాను. మిగిలిన దేశాల్లో రెండురోజులో, మూడురోజులో మాత్రమే ఉన్నాను. కాని జర్మనీలో 15 రోజులున్నాను.

బారిష్టరు చదువుకి పోవడానికి ముందే నాకు లూయీఖూన్ తొట్టి వైద్యంలో నమ్మకం కుదిరింది. ఆ వైద్యం అలవాటు చేసుకున్నాను. ఆ ఖూన్‌ని స్వయంగా చూడా లని కూడా నాకు అభిలాష. అందుచేత జర్మనీ వెడుతూనే ఆయన ఉంటూన్న లిప్‌జిగ్ వెళ్ళాను. అప్పుడు నాదగ్గిర ఒక చిన్న చేతిపెట్టి మాత్రం ఉంది. రైలు దిగడంతోటే ఒక మనిషి నా పెట్టి పట్టుకుని చక్కాపోవడం ప్రారంబించాడు. వాడికి నా భాష అర్థం కాదు. అందుచేత చివరికి నా భాష తెలిసే మనిషి దొరికేవరకూ వాడి వెనకాల పడి పోవలసివచ్చింది. నేను లిప్‌జిగ్‌లో ఖూన్ యింట్లోనే మొదట మకాం చేశాను. అప్పటికి ఆయన ఆస్పత్రి ఏదో కారణంచేత కట్టివేశారు. ఇంట్లోనే వైద్యం చేస్తూ ఉన్నాడాయన. ఆయనతోపాటే నాకూ కొన్ని ఉడక వేసిన కాయగూరలు ఫలహారం పెట్టాడు. తరవాత నేను సెయింట్ పీటర్సుబర్గ్ అనే పెద్ద హోటల్లో మకాంచేసి, రెండురోజులు ఆయనదగ్గిర ఉండి, నాకు అభిమాన విషయమైన తొట్టి వైద్యాన్నిగురించి వివిధమైన చర్చలు సాగించి సంగతులు అన్నీ తెలుసుకున్నాను. ఆయన ముఖవర్చస్సు పరీక్షించి మనిషి మానసిక తత్వాన్ని తెలియచేసే వా డని వాడుక. నేనుకూడా దానికి రెండు సావరనులు యిచ్చాను. ఆయన నా నెత్తిని చెయ్య్యిపెట్టి ఏమో చెప్పాడు. కాని నాకు భాష రాకపోవడంచేత అది ఏమీ తెలియలేదు. రెండు పౌనులు మాత్ర ఊడాయి.

జర్మనీలో మొదటివారం అయ్యేసరికి నాకు పోలీసుల దగ్గిరనించి నోటీసు వచ్చింది. విదేశీయులు ఆ దేశంలో వారం రోజుల కంటె ఎక్కువ ఉంటే పోలీసు వాళ్ళకి రిపోర్టు చేసుకుని వాళ్ళ అనుమతి పొందాలి. అ ప్రకారంగా నేను అనుమతి పొందాను. ఈ రోజున ప్రపంచా న్నంతటినీ సంక్షోభపరుస్తూన్న జర్మనీనిగురించి నాకు కలిగిన మొదటి అభిప్రాయం వ్రాస్తాను. జర్మనీ శుద్ధ మిలిటరీదేశం. మిలిటరీ అధికారులకి అక్కడ జరిగే గౌరవం అపారం. ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా పెద్ద మిలిటరీ అధికారులు వస్తూంటే, వారిదగ్గిర వుండే డంకాలు మోగిస్తూ వుండేవారు. ఆ డంకా బజాయించేసరికి బాటలమీద నడిచే జనం అంతా పక్కకి ఒత్తిగిలి వాళ్ళకి దారి యివ్వవలసిందే. "భూ గర్భంలో మిలిటరీ కోర్టులు ఉన్నాయనీ, ఒకసారి వాటిలోకి వెడితే వెళ్ళినవాడు మళ్ళీ వస్తాడో, రాడో సందేహం!" అనీ భయంకరంగా చెప్పుకుంటూ ఉండేవారు. ఎంత మిలిటరీ అధికారం ఉన్నా, ప్రజలలో సుహృద్భావం చాలా హెచ్చు. వాళ్ళు ఇతర దేశీయులు - అందులోనూ భాష తెలియనివాళ్ళు - అంటే ఎక్కువ ఆదరమూ, మర్యాదా చూపిస్తారు. నేను రెండుసార్లు దారి తప్పితే నన్ను సరియైన చోటికి తీసుకువెళ్ళి దిగవిడిచారు.

అప్పటికి యూరపులో ఉండే అన్ని జాతులవాళ్ళకన్నా జర్మనులు మంచి భోజనప్రియులు. వారి హోటళ్ళు మంచిదర్జాగా ఉండేవి. ఇంగ్లీషు హోటల్లోలాగ కాకుండా లెఖ్ఖపెట్టడానికి వీలులేనన్ని వంటకాలు ఉండేవి. నేను మొదటిసారి ఇంగ్లండులో ఉన్నప్పుడు శుద్ధ శాకహారిగా ఉండి, ఇంగ్లండులో కూడా శాకాహారజీవనము సాధ్యం అని పూర్వాచార పరాయణులైన నా బంధువులకీ, స్నేహితులకీ కూడా నచ్చజెప్పగలిగాను. కాని, రెండోసారి ఇంగ్లండు వెళ్ళినప్పుడు ఆ ఆచారం ఐచ్చికంగానే సడలించాను. అందుచేతనే అక్కడ ఒక్క చేపలకి సంబంధించిన వంటకాలే నా ఎదట పెట్టారు. అవి 124 రకాలు ఉన్నాయి. నేను జర్మన్ యూనివర్సిటిల్లో ముఖ్యంగా సైన్సు లేబరేటరీలు చూడా లని అనుకున్నాను. కాని నాకు అనుమతి దొరక లేదు. నేను విద్యార్థిననీ, కేవలం చూడాలనే ఆకాంక్ష గలవాణ్ణి మాత్రమే అనీ చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగలేదు. చివరికి లండన్ టెలిగ్రాము యిచ్చి నా సంగతి కనుక్కుని అ తరవాతే నాకు అనుజ్ఞ యిచ్చారు.