నా జీవిత యాత్ర-1/మైలాపూరు మేధావులు

వికీసోర్స్ నుండి

14

మైలాపూరు మేధావులు

అప్పట్లో మైలాపూర్ వకీళ్ళ ప్రభ బాగా వెలిగిపోతూ ఉంది. భాష్యం అయ్యంగారు మద్రాసుబారుకి నాయకుడు. సర్ సుబ్రహ్మణ్యయ్యరు జడ్జీ. పి. ఆర్. సుందరయ్యరు పెద్ద వకీలుగా పేరుపడ్డాడు. ఇక కృష్ణస్వామయ్యరు అట్టహాసానికి పరిమితేలేదు. అప్పటికి బారిష్టర్ల కి ప్రాక్టీసు, పలుకుబడి కూడా తగ్గాయి. జాన్ ఆడమ్సు, న్యూజంటు గ్రాంటు, పెర్సీ గ్రాంటు, బ్రాన్సన్, వెడ్డర్ బర్ను మొదలైనవాళ్ళు కొద్దిమంది గుట్టుగా కాలక్షేపం చేస్తూవచ్చారు. సుప్రసిద్ధుడైన నార్జన్ అప్పటికే క్రిమినలులో బాగా పెద్దపేరు సంపాదించుకున్నారు. అల్లాంటి వాడికి క్రిమినలులో పనేలేదు. అప్పటికి మైలాపూరులో ఉన్న ఈ ప్రముఖులూ, ఎగ్మూరులో ఉన్న టి. వి. శేషగిరయ్యరు, శంకరన్‌నాయరు ప్రభృతులూ రెండు ముఠాలుగా ఉండి పోటీలు పడుతూ ఉన్నట్లు అనుకునేవారు. వీళ్ళమధ్యచేరి ప్రాక్టీసు పెట్టడం అంటే చాలా సాహసం అని మిత్రులు అనేవారు. కాని నాకు, "మొదటినించీ లా విషయంలో ఒక విధంగా సమగ్రమైన కృషిచేసి ఉన్నాంగదా! దానికి తగిన శ్రమతీసుకుంటే ఎందుకు అభివృద్ధిలోకి రామూ?" అని ఒక విశ్వాసం! షెప్పర్డు ఇచ్చిన పరిచయం ఉత్తరం పట్టుకుని, సర్. సుబ్రహ్మణ్యయ్యరు దగ్గిరికి వెళ్ళి దర్శనం చేశాను. ఆయన నన్ను ఎగాదిగా చూసి ఇక్కడ బారిష్టర్లకి ఏమీ ప్రయోజనం ఉన్నట్టు లేదని పెదవి చప్పరించాడు. చివరికి షెప్పర్డు అనుమానించినట్లే చేశాడు. తరవాత వాలస్‌ని చూశాను. ఆయన నన్ను ఆదరణతో పరిశీలించి "ప్రకాశం గారు! బారిష్టర్లకి ఇక్కడ చోటు ఉన్నట్టు కనిపించదు. ఈ మైలాపూరు వకీళ్ళముందు వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళ పలుకుబడీ, ఆర్భాటమూ చాలా హెచ్చు. ఆ కృష్ణస్వామయ్యరుని చూడండి! కోర్టుకి నాలు గుర్రాల బండిలో వస్తాడు! వాళ్ళతో మీరు ఏమి వేగ గలుగుతారు!" అని అన్నాడు. ఆపైన "మీరు ఏమైనా ధనవంతులా?" అని అడిగాడు. నేను 'బీదవాణ్ణే' అని చెప్పిన మీదట, ఆయన "మీరు ఎక్కడయినా ఒక చిన్న పట్టణంలో ప్రాక్టీసు చెయ్యండి. చూడండి! మైలాపూర్ దాటి కాగలేక పి. సి. లోబో మళ్ళీ మధుర చేరుకున్నాడు!" అని నిరుత్సాహ పరిచాడు. అందుమీద నేను కొంచెం ధైర్యం తెచ్చుకుని "అయ్యా, మీదేశం వెళ్ళి ఈ బారిష్టరీ చదివి వచ్చిన తరవాత కూడా నేను ఎక్కడ ప్రాక్టీసు పెట్టాలో నిర్ణయించుకో లేకపోతే నా చదువు వృథాయే! నేను ఇక్కడే ప్రాక్టీసు పెడతాను. అది నా నిశ్చయం! నాకేమి ఆర్భాటాలు అక్కరలేదు! అదిగో హైకోర్టు కెదురుగా అక్కడే 25 రూపాయలు అద్దె ఇచ్చి ఒక చిన్న ఇంట్లో ఉంటాను. నాకు పని ఎందుకు రాదో చూస్తాను!" అని చెప్పివచ్చాను.

అప్పట్లో మైలాపూరులోని దాక్షిణాత్య మేధావుల ప్రతిభని గురించి కొంచెం విస్తరిస్తాను. భాష్యంఅయ్యంగారు అడ్వొకేటు జనరల్. ఆయన అప్పటికే కొంచెం పెద్దవాడు అయ్యాడు. చాలా స్వతంత్రుడు. తనకేసు తగిన శాస్త్రాధారలతో నిదానంగానూ, విపులంగానూ జడ్జీ ఎదట పెట్టగలిగేవాడు. బారులోనూ, బెంచిమీదకూడా మంచి గౌరవానికి పాత్రుడు అవుతూ వుండేవాడు. లాలో మంచి పండితుడు. ఒక సారి ఒక తుందుడుకు జడ్జీ ఆయన ఆర్గ్యుమెంటు చెప్పబోతూ ఉంటే అడుగడుక్కీ అడ్డు తగిలాడు. వెంటనే ఆయన చేతులో ఉన్న పుస్త కాన్ని బల్లమీద వేసి, "చెప్పదలచుకున్న విషయం సమగ్రంగా చెప్పనియ్యకపోతే ఏం చెయ్యాలి?" అన్నాడు. ఆ ప్రతీకారంతో జడ్జీ చల్లబడ్డాడు.

ఇంక వి. కృష్ణస్వామయ్యరుగారి తరహా దీనికి పూర్తిగా వ్యతిరేకం. కృష్ణస్వామయ్యరుగారు నాకు లా కాలేజీలో ప్రొపెసరు. ఆయనకి న్యాయశాస్త్రంలో ప్రవేశం అమోఘం! అందుచేత గబాగబా తనకేసు విస్తరించేవాడు. ఎదటివాడిని మాట్లాడనిచ్చేవాడు కాడు. చూడడానికి మంచి దర్జాగా ఉండేవాడు. ఎదటివాడు ఏదైనా ఒక మాటంటే దానికి నాల్గుమాటలతో జవాబు చెపితేకాని ఆయనకి తృప్తి ఉండేదికాదు. పి. ఆర్. సుందరయ్యరు మంచి మేధావి. ఎదటివాడు నొవ్వకుండా తనకేసు సుస్పష్టంగా చెప్పగలిగేవాడు. ఇప్పటి సర్ పి. యస్. శివస్వామయ్యరుగారుకూడా అప్పటికి సీనియర్లలో వాడే. లాలో చాలా పండితులైనా, కేసు చెప్పడంలో ఈ ప్రజ్ఞావంతులకి అందేవాడుకాడు.

ఇక తెలుగులాయర్ల సంగతి కొంచెం వ్రాస్తాను. వేపా రామేశం (ఇప్పుడు సర్), పురాణం నాగభూషణం, రంగావఝ్ఝుల నాగభూషణం, యల్లెపద్ది వెంకట్రామశాస్త్రిగార్లు ఏదో మర్యాదగా కాలక్షేపం చేస్తూఉండేవారు. వాళ్ళు ఎవ్వరూకూడా దాక్షిణాత్య న్యాయవాదుల ధాటికి నిలబడలేని స్థితిలోనే ఉండేవారు. నేను రాజమహేంద్రవరంలో ప్లీడరుగా ఉండి, పెద్దకేసులు హైకోర్టుకి పట్టుకువచ్చి, వీరిని సలహా చేస్తే ఏ అయ్యర్‌కో, ఏ అయ్యంగారికో - లేకపోతే క్రిమినల్ కే సయితే ఏ ఆడమ్సుకో - అప్పచెప్పి వారిదగ్గిర సహాయకులుగా పనిచేస్తూ ఉండేవారు. అందుచేతనే ఆంధ్రదేశంలో జమీందారీలు ఎన్ని ఉన్నా, వాటి తాలూకు పెద్దకేసు లన్ని అరవప్లీడర్ల చేతుల్లోనే ఉండేవి. భాష్యంఅయ్యంగారు, కృష్ణస్చామయ్యరుగారు మొదలయిన పేరుకెక్కిన వకీళ్ళ ఐశ్వర్యం అంతా ఈ జమీందారుల వల్ల సంపాదించినదే. ఆ కాలంలో మదరాసులో ప్లీడరీ స్థితి ఇది.