నా జీవిత యాత్ర-1/మునిసిపల్ రాజకీయాలు

వికీసోర్స్ నుండి

8

మునిసిపల్ రాజకీయాలు

నేను స్వతంత్రంగా కాలక్షేపం చేస్తూ రెండు చేతులా డబ్బు సంపాదిస్తూ వుండి, ఆనాటి రాజమహేంద్రవరం మునిసిపల్ రాజకీయాల్లో పడ్డాను. రాజమహేంద్రవరం మునిసిపాలిటీ ఆంధ్రదేశంలో కల్లా పురాతనమైన మునిసిపాలిటీ. దానికి సుమారు 50, 60 వేల రూపాయల ఆదాయం వుండేది. నేను రాజమహేంద్రవరం చదువుకోసం వచ్చే రోజులకే మునిసిపల్ రాజకీయాలు బాగా జోరుగా వుండేవి. అప్పటికి ఏలూరి లక్ష్మీనరసింహంగారు మునిసిపల్ ఛైర్మన్ గా వుండేవారని ఇదివరకే వ్రాశాను. ఆయనకి పూర్వం వుద్యోగులు-అంటే కాలేజీ ప్రొఫెసర్లు, రెవిన్యూ వుద్యోగులు ఛైర్మన్లుగా వుండేవారు. ఏలూరి లక్ష్మీనరసింహంగారే మొదటి నానఫీషియల్ ఛైర్మన్. మునిసిపాలిటీలో ఆయన కిరీటంలేని రాజులాగ చలామణీ అయ్యాడు అప్పటికే సుబ్బారావు పంతులుగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, నేతి సోమయాజులుగారు మొదలైనవారు పురప్రముఖులై, ఏలూరి లక్ష్మీనరసింహంగారిని ఓడించడానికి అవకాశం వచ్చినపుడల్లా ఏదో విధంగా ప్రయత్నిస్తూనే వుండేవారు. ఆయనమీద ఏవో రకరకాల పన్నాగాలు పన్నేవారు. సుబ్బారావు పంతులుగారు ప్రసిద్ధ రాజకీయ నాయకులై ఆ తరవాత 'ఆంధ్రభీష్మ' బిరుదం పొందగలిగినారు; కాని, అప్పట్లో స్థానిక రాజకీయాల్లో బహులౌక్యులు. తమరు వెనకాల వుండి తమ ముఖ్యశిష్యులచేత తమాషాగా నాటక మాడించేవారు. ఆయనకి అదొక విలాసం. ఇతరుల మీద బహు నేర్పుగా దెబ్బలు తీస్తూ వుండేవారు. కాని, ఏలూరి లక్ష్మీనరసింహంగారు మాత్రం లొంగేవారు కారు. మెరక వీథి తెలగాలు షాహుకార్లు కొందఱూ ఆయనకి పట్టుగా వుండి సుబ్బారావుపంతులు ప్రభృతులు చేసే ఎత్తులు అన్నీ భగ్నం చేసేవారు.

లక్ష్మీనరసింహంగారి మీద రకరకాల నిందలు పడ్డాయి. ఆయనకి స్త్రీ లోలత్వం వుండేది. కాని ప్రజల సొమ్ము స్వవినియోగం చేసుకునే మనిషి మాత్రం కాడు. కాని చాలాకాలానికి సుబ్బారావుపంతులు ప్రభృతులు ఆయనమీద ఎత్తిన దండయాత్రలకి లొంగిపోయాడు. సుబ్బారావుపంతులు ప్రభృతులకి వీరేశలింగం పంతులుగారు, ఆయన వివేకవర్ధనీ పత్రిక కూడా తోడయ్యాయి. ఏలూరి లక్ష్మీనరసింహంగారి మీద ఆ పత్రికలో వ్యంగ్యంగా అనేక చిత్రమైన కథలు వ్రాసేవారు. దానిమీద లక్ష్మీనరసింహంగారు, పరువునష్టం దావా వేశారు. ఆ దావాలో జస్టిఫికేషన్ ప్లీ పెట్టి లక్ష్మీనరసింహంగారిని అనేక సాక్ష్యాలతోటీ, సంపన్నాలతోటీ బాగా అల్లరి పెట్టారు. అందుచేత ఆయన నిస్పృహ చెంది ఈ రాజకీయాల్లో నిడమర్తి దుర్గయ్య గారిని తన స్థానే ప్రవేశ పెట్టారు.

దుర్గయ్యగారు చాలాకాలం ఛైర్మన్ గా వున్నారు. ఈ మునిసిపల్ వ్యవహారాల్లో రాయపూడి సుబ్బారాయుడు అనే వైశ్యప్రముఖుడు ఒకాయన చాలా ఎన్నికలో వాడు. ఆయన ఆట్టే చదువుకున్నవాడు కాడు. కాని, మునిసిపల్ వ్యవహారాల్లో అందెవేసిన చెయ్యి. ఎవరు మునిసిపల్ కౌన్సిలర్ కావాలన్నా, ఛైర్మన్ కావాలన్నా ఆయన సహాయం లేకపోతే అది అసంభవమే! ఆయన చాలా ప్రతిభావంతుడనే చెప్పాలి. దుర్గయ్యగారు ఆయన సహాయంతోనే చాలాకాలం ఛైర్మన్ చేశారు. ఏలూరి లక్ష్మీనరసింహంగారు కూడా దుర్గయ్య గారికి అండగా నిలిచి పనిచేశారు. సుబ్బారావు పంతులుగారు, నేతి సోమయాజులుగారు మొదలయినవారు కౌన్సిల్లోకి రావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు కాని, జయించలేకపోయారు. చివరికి ప్రభుత్వపు ప్రాపంకం వల్ల సోమయాజులు, సుబ్బారావు పంతులుగార్లు నామినేటెడ్ సభ్యులుగా ప్రవేశించారు. కాని, దుర్గయ్యగారికి వుండిన మెజారిటీ వల్ల వాళ్ళమాట సాగేది కాదు. వాళ్ళు చివరికి విసిగి వేసారి రాజీనామాలు ఇచ్చివేశారు.

ఈ వ్యవహారాలలో రాయపూడి సుబ్బారాయుడు బొమ్మల్ని ఎక్కించి దింపించేంత ప్రతిభాశాలి అని వ్రాశాను. అతనికి మునసబు కోర్టులో చాలా దావాలు వుండేవి. రంగమన్నారు కాలంలో అతను నాకు క్లయింటు అయ్యాడు. అప్పటికి ఆయనకీ దుర్గయ్యగారికీ ఏవో అంతశ్శీతలాలు బయలుదేరాయి. బయలుదేరడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! ఛైర్మన్ పదవికి సహాయం చేశారు కనక, పరిపాలనలో కొంచెం లోతుగా జోక్యం చేసుకునేవాడు. దుర్గయ్యగారి వంటి స్వతంత్రుడు దానికి అంగీకరించకపోతే సహజంగా తగాదా వచ్చేది. కనక, ఆ రాయపూడి సుబ్బారాయుడి దృష్టి నామీద పడింది. అప్పట్లో నాకు ఎల్లాగైనా బి.ఏ. పూర్తిచేసి ఫస్టుగ్రేడు పాసుకావాలని వుండేది. హనుమంతరావు నాయుడిగారి సలహాపైని బి.ఏ. పార్టుగా పాసు కావడానికి సంకల్పించుకుని ముందు తెలుగుకి హాజరై పాసయ్యాను. కాని , ఈ మునిసిపల్ వ్యవహారాల్లో పడి ఆ చదువుకి స్వస్తి చెప్పవలసివచ్చింది.

ఆ కాలంలో మునిసిపాలిటీకి ప్రతి సంవత్సరంమూ ఎన్నికలు జరుగుతూ వుండేవి. ఖాళీ అయిన ప్రతిస్థానంలోనూ మనుష్యుల్ని కూర్చుకుని ఛైర్మన్ ఎన్నిక వచ్చేసరికి బలాబలాలు తేల్చుకుంటూ వుండేవాళ్ళు. సుబ్బారాయుడు ప్రభృతుల ప్రోత్సాహం మీద నేను ఎన్నికలకి నిలిచినప్పుడు దుర్గయ్యగారు నన్ను రాకుండా చెయ్యడానికి ప్రయత్నించేవారు. నేను అతి శ్రమపడి అన్ని ఏర్పాట్లూ చేసుకునేసరికి, ఆఖరురోజు రాత్రి ఆయన తన ఛైర్మన్ పలుకుబడి అంతా ఉపయోగించి వోటర్లని తిప్పివేసేవాడు. నేను మొట్టమొదట ఏ వార్డుకి నిలబడ్డానో జ్ఞాపకం లేదు కాని 1896లో ఎన్నికలకి నిలబడినట్లు గుర్తు. కాని, అప్పుడు ఓడిపోయాను.

మళ్ళీ 97, 98 సంవత్సరాల్లో బై ఎలక్షన్లలో అభ్యర్థిగా వున్నాను. దుర్గయ్య గారు మొత్తం మూడుసార్లూ కూడా నన్ను ఓడించారు. నేను ఏవో ఎన్నికల పిటీషన్లు వగైరాలు పెడుతూ వుండేవాణ్ణి. వాటిని అన్నిటినీ దుర్గయ్యగారు ఎదురుకుంటూ వుండేవారు. దుర్గయ్యగారు మొత్తం మీద చాలా ప్రతిభావంతులు. మేథావులు, సరస్వతంత్రులు. నైతికోన్నతీ, పరిపాలనాశక్తీ, ధైర్యస్థైర్యాలు వున్నవారు. మరి ఒకరు అయితే సుబ్బారావు పంతులుగారి ఎత్తుల్లో పడి పల్టీలు కొట్టవల సినవారే! ఆయన పరిపాలనలో కూడా చాలా హుందాతనం చూపించారు. ఆనాటి పార్టీ కక్ష లెంత తీవ్రంగా వెళ్ళా యంటే-ప్రతికక్షులు చివరకి దుర్గయ్యగారి మీద కూడా అక్రమమైన ఆరోపణలు చేసేవారు చివరికి దుర్గయ్యగారు నాకు ప్రతికక్షిగా పనిచేసినా ఆయన ధైర్యమూ, సమర్థతా మొదలయిన సుగుణాలు చూస్తే నాకు ఆయనయందు అభిమానం ఉండేది.

నేను 1898లో కాబోలు మండవిల్లి సుబ్బారావుగారిమీద పోటీచేసి ఓడిపోయాను. అప్పుడు ఛైర్మన్ పదవి పలుకుబడి అంతా వినియోగించి, వోటర్లని తిప్పివేసి నా ఎన్నికకి భంగం కలిగించారు కనక, ఎన్నిక రద్దు చెయ్యవలసిందని సబ్ కలెక్టరుకి పిటీషన్ పెట్టాను. దాని మీద సబ్ కలెక్టరు దుర్గయ్యగారికి నోటీసు పంపించి, కోర్టుకి రప్పించి, కుర్చీమీద కుర్చోబెట్టాడు. అప్పుడు నేను ఆ సబ్ కలెక్టరుతో "ఏమండీ! నేను ఆ పెద్దమనిషి మీద నేరం ఆరోపిస్తే, మీరు ఆయనకి కుర్చో ఇచ్చి కూర్చోబెట్టి, నన్ను దోషారోపణ చెయ్యమనడం ఏమి సబబుగా ఉంది?" అని అడిగాను. అందుమీద సబ్ కలెక్టరు దుర్గయ్యగారికేసి చూసి, "దీనికి మీరు ఏమంటారు?" అన్నాడు. ఆపైన దుర్గయ్యగారు నిర్భయంగా "నేను కాన్వాసు చేసినమాట నిజమే! ఆ పెద్దమనిషి కౌన్సిల్లోకి రావటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, రాకుండా చెయ్యడానికి వోటర్ని అయిన నాకూ అంత హక్కుంది," అని వాదించారు. నేను ప్రతివాదన చెప్పినా, ఆయన చెప్పిన సాహసపద్ధతికి చాలా సంతోషించాను.

సబ్ కలెక్టరు ఏమీ కలగజేసుకోలేదు. ఆఖరికి నన్ను 1899లో నాలుగవవార్డులో కౌన్సిలరుగా ఎన్నుకున్నారు. దుర్గయ్యగారిని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిన సుబ్బారావుపంతులుగారు కూడా కొంచెం సంతోషించారు. నేను కౌన్సిలర్ని అయినప్పటినించీ ప్రతి సంవత్సరమూ వచ్చిన బై ఎలక్షన్లలో పోటీలు పెట్టి దుర్గయ్యగారి మనుష్యులన్ని ఓడించాను. క్రమంగా రెండేళ్ళలో దుర్గయ్యగారి పార్టీమనుష్యుల్ని అందర్నీ ఓడించి, రాయపూడి సుబ్బారాయుడూ నేనూ మా మనుష్యుల్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టగలిగాము.

1901వ సంవత్సరంలో దుర్గయ్యగారి ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. అప్పుడు స్నేహితు లంతా నన్ను ప్రోత్సాహం చేశారు. సుబ్బారావు పంతులుగారు దుర్గయ్యగారి పార్టీని ఓడించినంతవరకూ ఆంతర్యంలో సంతోషించేవారే కాని, నేను ఛైర్మన్ అవుతానంటే ఎంతమాత్రమూ ఇష్టపడేవారు కారు. ఆయన స్వత: నేను స్వతంత్రుణ్ణి అనీ, తమ చెప్పు చేతలలో ఉండననీ నిశ్చయించుకుని వ్యతిరేకంగా పనిచేశారు.

అప్పటికి నా ప్రాక్టీసు బాగానే వుండేది. చిన్నప్పుడు నా సహాధ్యాయీ, హనుమంతరావు నాయుడుగారి మేనల్లుడూ అయిన పిళ్ళారిసెట్టి నారాయణరావు బి.ఎ., బి.ఎల్. పాసయి హైకోర్టు వకీలు అయ్యాడు. మేము వుభయులమూ రిజిష్టర్డు పార్ట్నర్ షిప్ ఏర్పాటుచేసుకుని జాయింటు ప్రాక్టీసు ప్రారంభించాము. సెంట్రల్ మార్కెట్టుకి ఎదురుగా వున్న కోకా వెంకటేశ్వరరావుగారి ఇంట్లో మా ప్రాక్టీసు. జిల్లా కోర్టు పని అతనూ, మిగతా పని నేనూ చూసుకుంటూ వుండేవాళ్ళము. మా తమ్ముడు శ్రీరాములు బి.ఏ. పాసయి ఫస్టుగ్రేడుకి చదువుకుంటున్నాడు. అతను ఫస్టుగ్రేడు పాసయ్యాకా కొద్దికాలం నా దగ్గరే ప్రాక్టీసు చేశాడు.

ఆ సమయంలోనే కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నిక జరిగింది. మునిసిపల్ కౌన్సిలర్లు అంతా వోటర్లు. ఆరోజుల్లో అప్పుడే ఇంగ్లండు వెళ్ళి వచ్చిన కోలాచలం వెంకట్రావుగారికీ, సుబ్బారావు పంతులుగారు ఏర్పాటుచేసిన కృత్తివెంటి పేర్రాజుగారికీ పోటీ జరిగింది. కోలాచలం వెంకట్రావు అంతవరకూ బళ్ళారిలో ఫస్టుగ్రేడు ప్లీడరుగా వుండేవారు.

అల్లాంటప్పుడు "ఛైర్మన్ ఎవ్వరా?" అనే తర్జనభర్జన వచ్చింది. కొందరు దుర్గయ్యగారినే మళ్ళీ వుండమని అడిగారు. కాని, ఆయన తనకి మెజారిటీ లేనపపుడు అలాగ వుండడం సబబు కాదని చెప్పి నిర్మొహమాటంగా తప్పుకున్నారు. అందులోనూ, ఆయన ఘనత ఎక్కడ వుందంటే-ఒకసారి తప్పుకున్నాక మరి ఆ పని చేస్తున్నవాడికి ఇంక అడ్డుపుల్ల వెయ్యకుండా వుండడంలోనే! చేసినన్నాళ్ళూ ఆయన చేశారు. ఇంక బలం లేనప్పుడు మెల్లిగా తప్పుకుని ఎదటివాడికి పూర్తి అయిన అవకాశం ఇచ్చివేశారు. నిజానికి ప్రజాస్వామ్య సంస్థలలో ఇలాంటి పద్ధతి అవలంబించడం చాలా ప్రశంసనీయమైన విషయము.

దుర్గయ్యగారు, తరవాత నామీద పిటీషన్లు వగైరాలు ఇచ్చిన రోజులలో కాని, లేనిపోని కేసులు పెట్టే కాలంలోగానీ, ఎప్పుడూ ఏవిధమయిన జోక్యమూ కలిగించు కోలేదు. అందుకు ఆయన అంటే నాకు చాలా గౌరవం.

దుర్గయ్యగారు వుండనప్పుడు మళ్ళీ ఏలూరి లక్ష్మీనరసింహంగారు ఛైర్మన్ పనికి తయారయ్యారు. "నేను కదా దుర్గయ్యగారికి ఇంతకాలం సహాయం చేశాను ఆయన ఉండకపోతే, మళ్ళీ నేనెందుకుండకూడదు!" అని ఆయన వాదన. కాని నేను ఆయనతో, "మీ మీద ఎన్నో కేసులు ఇదివరకే వ్యాపించి వున్నాయి. పైగా, మీకు చాలామంది శత్రువులు ఏర్పడ్డారు; మీరు నాకు చిన్నప్పుడు అధ్యాపకులు కూడాను. ఆ గౌరవం చేత మీరు తప్పుకోవడం చాలామంచిందండి!" అని సలహా ఇచ్చాను. ఆయనకి మనస్సులో కొంచెం కష్టం కలిగింది. కాని, ఎదట కాదనలేకపోయారు. అయితే, నా సలహా మాత్రం రుచించలేదు. అయినా తమకి నా సహాయం లేనిదే ఆ పదవి లభించే అవకాశం లేదని కూడా గ్రహించారు.

అందుచేత, ఒక పెద్ద ఎత్తు ఎత్తారు. లక్ష్మీనరసింహంగారు కూడా ఎత్తు పైయెత్తు వెయ్యడంలో సుబ్బారావుపంతులుగారికి తీసిపోయేవారు కారు. నెమ్మదిగా స్థానిక సబ్ కలెక్టరు యల్.వి.యస్.రైస్ అనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఛైర్మన్ పదవికి అభ్యర్థిగా తయారుచేశారు. రైస్ ప్రభుత్వోద్యోగి కనక వుద్యోగులతా వోట్లు ఇస్తారనీ, వర్తకులు మొదలైనవాళ్ళు వ్యతిరేకంగా వుండరనీ, నాబోటి ప్లీడరులు కూడా సబ్ కలెక్టరుకి వ్యతిరేకంగా పనిచెయ్యలేరని, అందుచేత విజయం నిశ్చయమనీ చెప్పి బాగా పురి ఎక్కించారు. ప్రభుత్వోద్యోగంతోబాటు ప్రజల ప్రాతినిధ్యం కూడా లభిస్తే ఆయనకి ఎక్కువ గౌరవంగా వుంటుందని హెచ్చరిక చేశారు. దాంతో రైస్ బోల్తా కొట్టాడు. కాబోలంటే కాబోలనుకుని కాన్వాసింగు ప్రారంభించాడు.

అప్పటికి దుర్గయ్యగారి ఛైర్మన్ గిరీ టైము అయిపోవడం చేత సబ్ కలెక్టరే తాత్కాలికాధ్యక్షుడు, రైస్ నా అభిప్రాయం కనుక్కోవడానికి మునిసిపల్ సెక్రటరీ దామరాజు బసవరాజుని నా దగ్గరకి పంపించాడు. ఆయనవచ్చి నన్నడిగినప్పుడు నేను నిర్మొహమాటంగా "నా వోటివ్వను సరిగదా! నా కంఠంలో ప్రాణం వున్నంతవరకూ ఆయన కాకుండా సర్వశక్తులూ వినియోగిస్తాను. ఇది వుద్యోగులు కాని వాళ్ళ కోసం ఏర్పడిన పదవి అయివుండగా, తను ఇందులోకి రావడం అప్రశస్తమని నా మాటగా చెప్పండి!" అని చెప్పాను. బహుశ: ఆయన ఆ మాటలు రైస్ తో చెప్పేవుంటాడు.

ఇక మాఛైర్మన్ అభ్యర్థి నిర్ణయంలో నా విషయం మొదట చర్చకి వచ్చింది. నా వయస్సు అప్పటికి సుమారు 27, 28 సంవత్సరాలు మాత్రమే. నాకు అంత చిన్న వయస్సులో ఛైర్మన్ పదవికి తొందరపడకూడదనిపించింది. దాంతోపాటు నా కిప్పుడు స్ఫురణకు రాని ఎన్నో కారణాలు తోడయ్యాయి.

అప్పటికి కొద్దికాలం కిందట మోచర్ల రామచంద్రరావు పంతులుగారు (తరవాత సర్) బి.ఏ., బి.ఎల్. పాసయి సుబ్బారావు పంతులుగారి దగ్గిర జూనియర్ గా ప్రవేశించారు. ఆయన అక్షరాలా పంతులుగారి శిష్యుడే. వేషంలో కూడా సరీగా అల్లాగే వుండేవాడు. ఆఖరికి చేతికర్ర కూడా అల్లాగే పట్టుకునేవాడు. సుబ్బారావు పంతులుగారి పలుకుబడి వల్ల ఆయన కూడా మునిసిపాలిటీలో నామినేటెడ్ కౌన్సిలర్ గా చేరారు. మేము ఆయన్ని ఛైర్మన్ గా పెట్టడానికి సంకల్పించాము. ఈ నిశ్చయం ఏలూరి లక్ష్మీనరసింహంగారికి మరింత కష్టం కలిగించింది. వాస్తవానికి లక్ష్మీ నరసింహంగారికీ సుబ్బారావుపంతులుగారికే పార్టీ. లక్ష్మీనరసింహం గారికి నేను వుండడమో, లేక ఆయన ఉండడమో అంతేగాని తనకి ప్రత్యక్ష ప్రతికక్షి అయిన పంతులుగారి శిష్యుణ్ణి ఈ పదవి కెక్కించడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. లక్ష్మీనరసింహంగారు ఆ కారణంచేత కూడా రైసుని బాగా ఎగసనతోశారు.

రైసు కాన్వాసింగు చాలా బలమైనది. అప్పటికి ఇన్ కంటాక్సు అధికారం సబ్ కలెక్టరుదే కనక, ఆలపాటి భాస్కరరామయ్యగారు, మారడుగుల వెంకటరత్నంగారు మొదలయిన వైశ్యసభ్యులంతా కేవలమూ భయంచేత రైసుకి అనుకూలంగా మెత్తబడ్డారు. రైస్ నామినేషను, మోచర్ల నామినేషను కలెక్టరు దగ్గిర దాఖ లయ్యాయి. ఎప్పడైతే బసవరాజు గారు నా దగ్గిరికి వచ్చి రైస్ ఆలోచన నాతో చెప్పారో, ఎప్పుడైతే షాహుకార్లు మెత్తబడు తున్నారో అప్పడే నేను రామచంద్రరావు పంతులుగారితో జాగ్రత్తగా పుండమనీ, ఒకసారి రైస్ ని చూడ మనీ చెప్పాను. దానిమీద రామచంద్రరావుగారు ఆయన్ని చూడడానికి ఇంటికి వెళ్ళగా రైస్ ఆయన్ని చూడనని కబురు పంపించాడు. రామచంద్ర రావుగారు నిస్పృహతో తిరిగి వెనక్కి వచ్చేశారు. మరి రెండు రోజులకి మునిసిపల్ కౌన్సిలు మీటింగు జరిగింది. ఆ మీటింగుకి మా పార్టీ పూర్తిగా హాజరై మునిపిపల్ కంట్రాక్టు వ్యవహారాలని గురించి కొన్ని విషయాలు సేకరించి, వాటినన్నిటినీ ఒక సీలు వేసిన కవరులో పెట్టి, రైస్ ని ప్రశ్నలు వెయ్యడం లంకించుకుంది: మేము ఓవర్సీరుని పిలిపించి సమాధానాలు చెప్పించమన్నాము! చాలావరకు చర్చ అయ్యాక రైస్ నన్ను ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడమని కోరారు. నేను సరేనని ఆ మర్నారు రైస్ ఇంటికి వెళ్లాను. ఆయనకి ఛైర్మన్ అభ్యర్ధిత్వాన్ని గురించి గట్టిగా చెప్పొను. "రిప్పన్ ప్రభువు చేసిన ఈ మునిసిపల్ ఆక్టు ఉద్దేశం ఉద్యోగస్థులు పరిపాలన చెయ్యడం కాదనీ, తను పోటీ చెయ్యకూడదనీ, ఇదంతా ఏలూరి లక్ష్మీనరసింహం గారి ప్రోత్సాహమనీ, 'కాదు కూడదని' నిలబడితే మా పార్టీ బలంగా నిలబడి ఓడిస్తామనీ చెప్పాను. రైస్ విషయం అంతా సమగ్రంగా గ్రహించి, “ప్రకాశంగారూ! నేను ఏలూరి లక్ష్మీనరసింహంగారి మాయ మంత్రంలో పడను. రేపు రామచంద్రరావుగారిని ఒకసారి పంపించండి! కలెక్టరుకి నా నామినేషన్ ఉపసంహరించుకునే ఉత్తరం వ్రాసి ఇస్తాను," అన్నాడు.

మర్నాడు రామచంద్రరావు ఆయనదగ్గిరికి వెళ్ళి, ఉత్తరం తీసుకున్నాడు. రామచంద్రరావుపంతులుగారు పోటీ లేకుండా చైర్మన్ అయ్యారు.

రామచంద్రరావు పంతులుగారు సుబ్బారావుపంతులుగారి వరవడి దాటనివాడని ఇదివరకే వ్రాశాను. ఆయన ఆ జన్మాంతమూ వదలని అ తలపాగా, ఆ నడికట్టూ, ఆ బుజంమీదా కర్రా, నాకు ఇప్పటికీ కూడా కళ్ళకి కట్టినట్టున్నాయి. ఆయన సహజంగా శుద్ధ మితవాది. దానికితోడు న్యాపతివారి గురుత్వం. రామచంద్రరావుగారి దినచర్య ఆశ్చర్యంగా వుండేది. తెల్లవారి లేస్తూనే ఆయన కర్ర బుజాన వేసుకుని ముందు గ్రామమునసబు కోటీశ్వరరావుగారిని పలకరించి వెళ్ళేవాడు. తరవాత తాసిల్దార్ ఇంటిమీదుగా వెళ్ళి, ఆయన్ని పలకరించేవాడు. ఒకసారీ సబ్ కలెక్టరు శిరస్తాదారు రామభద్రుడుగారిని పలకరించేవాడు. మొత్తంమీద ఉద్యోగస్థుల ప్రాపకంకోసం తికమకలు పడుతూ వుండేవాడు.

రామచంద్రరావుగారు ఛైర్మన్ అయిన తరవాత ప్రజల అసంతృప్తికీ, ఆగ్రహానికీ పాత్రులు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆయన పరిపాలనలో ఎక్కువగా ఉద్యోగస్థుల సలహాలు అనుసరించే పోయేవారు. కాని, ప్రజల అవసరాలు అవగాహన చేసుకుని సంతృప్తి పరచలేకపోయేవారు. ప్రతి విషయమూ ముందు కలెక్టరుతో సంప్రదించి ఆయనకి ఇష్టమైతేనే ముందు అడుగు వేసేవారుగాని, ప్రజల అవసరం గ్రహించలేక పోయేవారు. రైస్ పార్టీవాళ్ళు నిస్పృహ చెంది, 'ఆ పక్షంలో రైన్ నే పెట్టుకో లేకపోయామా" అని నాతో చెప్పేవారు. ఆయన ఏ విధమైన కొత్తపద్ధతులూ ప్రవేశపెట్టలేకపోయారు. చివరికి ప్రజలకీ, ఆయనకీ కూడా ఆవిషయంలో విసుగు కలిగింది. ఇల్లా వుండగా, ఆప్పట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కి తెలుగుజిల్లా కొక స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి ఆ రోజులోనే ఇంగ్లండునించి తిరిగివచ్చి బళ్ళారిలో ప్లీడరీ చేస్తున్న కోలాచలం వెంకట్రావుగారు పోటీ చేశారు. కాకినాడలో ప్లీడరీ చేస్తూన్న కృత్తివెంటి పేర్రాజుగారు కూడా ఆ స్థానానికి నిలబడ్డారు. ఆయన సుబ్బారావు పంతులుగారి అభ్యర్థి. కోలాచలం వెంకట్రావుగారు అప్పుడే విదేశాలనించి తిరిగి వచ్చారని వ్రాశాను.

ఆ కాలంలో అల్లాంటి మనుష్యుల మీద మోజు ఎక్కువగా వుండడంచేత నే నాయనకి అనుకూలంగా పనిచేయడానికి నిశ్చయించాను. అందుచేత సుబ్బారావు పంతులుగారికి నామీద విపరీతమైన ఆగ్రహం కలిగింది. కృత్తివెంటి పేర్రాజుగారు నాకు కొద్దో గొప్పో బంధువర్గంలో వాడైనప్పటికీ, నేను రాజమహేంద్రపరంలోనే కాకుండా ఇతర గ్రామాలకి కూడా వెళ్ళి, వెంకట్రావుగారి తరఫున ప్రచారం చేశాను. వెంకట్రావు గారు గెలిచారు. క్పత్తివెంటి పేర్రాజుగారు ఓడిపోవడంతోనే సుబ్బారావు పంతులుగారు నన్ను ఏవిధంగానూ కూడాపైకి రానియ్యనని శపథం పట్టారు.

రామచంద్రరావుగారు రెండు సంవత్సరాలు మునిసిపాలిటీని పరిపాలించారు. ఆ తరవాత మళ్ళీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ములుకుట్ల అచ్యుతరామయ్యగారు కౌన్సిల్లో ప్రవేశించారు. 1901 వ సంవత్సరంలో చైర్మన్ ఎన్నిక. అప్పుడు కౌన్సిలులో మార్కు హంటరు మెంబరు.

పి. టి. శ్రీనివాసయ్యంగారి తమ్ముడైన ఆరామదయ్యంగారు కూడా ఒక సభ్యుడు. ఆయన ఆలపాటి భాస్కర రామయ్యగారితో కలిపి కలప వ్యాపారం చేస్తూ, మొట్టమొదట రంపపు కోతమిల్లు పెట్టి నడిపించాడు, ఆయన నా పార్టీకి సంబంధించినవాడే. అంతవరకూ సుబ్బారావుపంతులుగారి వెనక వుండి ఓడిపోతూవచ్చిన కనపర్తి శ్రీరాములుగారు మా పార్టీ లో చేరి, నాతోబాటు కొన్సిలర్ అయ్యారు. రాయపూడి సుబ్బారాయుడు సంగతి చెప్పనే అక్కరలేదు కదా! నామినేటెడ్ సభ్యుల్లో కూడా చాలామంది నాకు సహాయకులుగా వుండేవారు. పిళ్ళారిసెట్టి నారాయణరావు నాయుడుగారు కూడా కౌన్సిలరయ్యారు.

కౌన్సిల్లో బజులుల్లా సాహేబు సోదరుడు అజుముల్లా అని ఒక అతనువుండేవాడు. అతను అసిస్టెంటు ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్సుగా పనిచేస్తూ వుండేవాడు. చాలా స్వతంత్రుడు. ఈ నాటి నామినేటడ్ మనుషుల్లాగ ఒట్టి డిటోగాడు కాడు. వెనక రైస్ రామచంద్రరావుగారిమీద పోటీ చెయ్యదలుచుకున్నప్పుడు కూడా అతను ఉద్యోగేతరుల తరపునే నిలబడ్డాడు.

మొత్తంమీద మా పార్టీ చాలా బలంగానే వుండింది. మోచర్ల రామచంద్రరావుగారు తమంతట తామే తప్పుకున్నారు. మా పార్టీ వారంతా నన్ను అభ్యర్థిగా నిర్ణయించారు. సుబ్బారావుపంతులుగారు నా మీద తీవ్రమైన కక్ష కట్టారని ఇదివరకే వ్రాశాను. ఆయన నేను ఛైర్మన్ కాకూడదని బ్రహ్మాండంగా పట్టుపట్టారు. అప్పట్లో ఉద్యోగస్థులంతా ఆయన పక్షాన్ని వుండేవారు. ఆ రోజుల్లో హెమ్నెట్ అనే ఆంగ్లో ఇండియన్ జిల్లాజడ్జీగా వుండేవాడు. ఆయన ఉద్యోగస్థు లందరితోటి నా మీద ఏవేవో చెప్పేవాడు. వాళ్ళకి నామీద బాగా అనిష్టం కలిగేటట్లు చేసేవాడు.

అయితే ఎన్నికలు సమీపించేసరికి, మార్కుహంటరు మొదలయిన ఉద్యోగస్థు లంతా నాకు అనుకూలం అయ్యారు. అప్పుడు సుబ్బారావుపంతులుగారు ములుకుట్ల అచ్యుతరామయ్యగారిని లేవదీశారు. పంతులుగారు చివరిదాకా నాకు సహాయం చేస్తానన్న సబ్‌కలెక్టరు విస్‌నీ, హంటర్‌నీ కూడా, జిల్లాజడ్జీచేత చెప్పించి, నాకు ప్రతికూలంగా తయారు చేశారు. ఇన్‌కంటాక్సు బూచిని చూపించి, నాకు అనుకూలంగా వుండే వైశ్య ప్రముఖుల్ని కూడా బెదిరించడానికి ప్రయత్నించారు. రాయపూడి సుబ్బారాయుడు అప్పులతో బాధపడుతూ వుండేవాడు. అతనికి అప్పు ఇస్తామని కూడా ఆశపెట్టారు. కాని, పని జరగలేదు. నన్ను ఓడించగలమనే ధైర్యంతో బ్యాలటుకూడా పెట్టించారు. కాని, చివరికి ఎంత చేసినా అసలు మార్కుహంటరు సబ్‌కలెక్టరు మీటింగుకి రానేలేదు. ఏమైతేనేమి! అత్యధిక సంఖ్యాకులచేత నేను ఎన్నుకోబాడ్డాను. అచ్యుతరామయ్యకి రెండో మూడో వోట్లు వచ్చినట్లు జ్ఞాపకం. ఎన్నిక అయిన తరవాత అచ్యుతరామయ్య ఏదో ఎలెక్షన్ పిటీషన్ దాఖలు చేశాడు. అందులో అతను తప్ప రెండోవాడెవడూ దస్కతు పెట్టలేదు. అప్పటినించీ సుబ్బారావుపంతులు ప్రభృతులు నా ఎన్నిక గెజెట్ కాకుండా చేయించడానికి ఎంత ప్రయత్నం చెయ్యాలో అంతా చేశారు. చాలా ఆశ్చర్యకరములూ, అపూర్వములూ అయిన పద్ధతులన్నీ అవలంభించారు. నాకు వయస్సు తక్కువనీ, ఆస్తి లేదనీ, మునిసిపల్ సొమ్ము దుర్వినియోగం చేస్తాననీ, మనుష్యుల్ని హడలు గొట్టేస్తాననీ, చాలా స్వతంత్రుణ్ణి అనీ, గవర్నమెంటుకి వ్యతిరేకుణ్ణి అనీ వ్రాసి పిటీషన్లు ఇచ్చారు. కలెక్టరుతో చాడీలు చెప్పారు. హేమ్నెట్‌ ద్వారా మునిసిపాలిటీల మెంబరైన ఫోర్‌బ్సుతో అనేకమైన చాడీలు చెప్పారు. అచ్యుతరామయ్య, కె. వి. రెడ్డినాయుడుగార్ల దొంగసంతకాలతో ఆకాశరామన్న అర్జీలు ఇప్పించారు. నేను కోలాచలం వెంకట్రావుగారి ఎన్నికసందర్బంలో కాసులు పంచిపెట్టి సభ్యుల్ని మోసం చేశానన్నారు.

ఈ విధంగా నేను ప్రజా ప్రతినిధులచేత ఎన్నుకోబడ్డ ఎన్నిక మూడు మాసాలపాటు గెజెట్ కాకుండా చెయ్యగలిగారు. ఆ రోజుల్లో ఎన్నిక గెజెట్ కాకపోతే ఛైర్మన్ చార్జీ పుచ్చుకోవడానికి వీలులేదు. నేను "ఎవరెన్ని చేస్తేమాత్రం ఏముంది? క్రమంగా జరిగిన ఎన్నిక ఎవరు రద్దు చేస్తా,"రనే మామూలు ధీమాతో వుండేవాణ్ణి.

ఇంతలో గవర్నరు ఆంప్టల్ రాజమహేంద్రవరం వచ్చాడు. అప్పుడు తాత్కాలికంగా ఛైర్మన్ అయిన విప్ తన అధికారం కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారికి ఇచ్చి ఆయనచేత కౌన్సిలు అడ్రస్ చదివించాడు. గవర్నరు వచ్చినప్పుడు నన్ను ఛైర్మన్ ఎలెక్టుగా కూడా పరిచయం చెయ్యలేదు. తరవాత, నామీద గవర్నమెంటుకి పంపబడిన పిటీషన్లు అన్నీ విచారణకి వచ్చాయి. సామాన్యంగా ఈ పిటీషన్లు గవర్నమెంటుమెంబరు కలెక్టరుకీ, కలెక్టరు సబ్‌కలెక్టరుకీ, ఆయన తహసిల్దారుకీ, అతను గ్రామమునసబుకీ పంపించి, ఆచోకీ తియ్యడం మామూలు. నేను ఏమైనాసరే దీని అంతం కనుక్కోవాలని అనుకున్నాను.

ఈ సందర్భంలో సుబ్బారావు పంతులుగారు స్వయంగా కదలడమే కాకుండా డిసెంబరులో హేమ్నెట్‌ని పోర్‌బ్సుదగ్గిరికి పంపించారు. అప్పుడు సబ్‌కలెక్టరు విస్, అతను నా స్వతంత్రపు పోకడలకి కొంత కటకట పడినా అసలు పిటీషనులలో బలం లేదని తెలుసుకున్నాడు. గవర్నమెంటుకి పంపబడిన పిటీషన్ విచారణకి వచ్చిన ప్పుడు దస్కద్దారులు తప్పితే మరో మనిషి ఎవడూ కనబడలేదు.

ములుకుట్ల అచ్యుతరామయ్యగారు ఉల్లితోటలో వుండే అకుసూరి రంగారావు నాయుడుగారి దగ్గిరికి వెళ్ళి ఆయన ప్రమత్తులై వుండగా వట్టి తెల్లకాగితంమీద దస్కత్ చేయించారు. ఆ సంగతి తెలిసి వెంటనే కలెక్టరుకి టెలిగ్రాము ఇప్పించాను. అధికారం కోసమూ, దానికి సంబంధించిన కక్ష సాధించడానికీ, ఎంత విద్యావంతు లైనా ఏరీతిగా పతనమవుతారో తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. చివరికి కలెక్టరు కూడా పిటీషన్లలో సంగతులు ఋజువు కాలేదనీ, అయినప్పటికీ తన వాకబువల్ల నేను ప్రభుత్వానికి చాలా ప్రతికూలుడననీ, స్వతంత్రుడననీ తెలిసిందనీ, అందుచేత గెజెట్ చెయ్యకూడదనీ వ్రాసి పంపించాడు.

ఈలోగా నేను మద్రాసులో పోర్‌బ్సుని చూశాను. ఆయన దర్శనం అవడమే బ్రహ్మాండం అయింది. పది పదిహేను రోజులు ఇంటికి వెడితే ఇంట్లో ఉండగానే ఇంటిదగ్గిర లేరని జవాబు వచ్చేది. చివరికి నాకు ప్రాణం విసిగింది. కార్డు వెనకాల "15 రోజులనించి రోజూ దర్శనం కోసం ప్రయత్నిస్తున్నాననీ, దర్శనం ఇచ్చేదీ, లేనిదీ నిర్దిష్టంగా తెలియపరచమనీ" వ్రాసి పంపించాను. దానిమీద అతను "ఉపేక్ష మన్నించమనీ, ఆ సాయంత్రమే కూనూరు పోవడానికి సామాను సర్దుకుంటున్నాననీ, తిరిగి మద్రాసు వచ్చాక తప్పక చూస్తాననీ," బదులు వ్రాశాడు.

ఆయన కూనూరునించి తిరిగి వచ్చాక నే నాయన్ని చూశాను. అది డిసెంబరునెలలో అని నా జ్ఞాపకం. సుబ్బారావు పంతులుగారి ప్రోత్సాహం పైని హేమ్నెట్ కూడా, డిసెంబరులో ప్రత్యేకంగా కూనూరు వెళ్ళింది. ఆ కాలంలోనే అనుకుంటాను. హేమ్నెటూ, ఫోర్ప్సూ పెరంబూరువరకూ కలిసే ప్రయాణం కలిసే ప్రయాణం చేశారనీ, ఆ లోగా ఈ విషయమే మాట్లాడుకున్నారనీ నాకు తెలిసింది. ఉభయులూ కూనూరులో కూడా ఈ విషయమే ప్రస్తావన చేసుకున్నట్లు ఫోర్‌బ్సు వేసిన ప్రశ్నలనిబట్టి నాకు బాగా నిర్దారణ అయింది. ఫోర్‌బ్సు మద్రాసు చేరాక నే నాయన్ని చూశాను. ఇంతకాల మయ్యాక నాకు జ్ఞాపకం వున్నంతవరకూ మా సంభాషణ వివరిస్తాను.

ఆయన నన్ను, "మీకు ఇల్లు లేదుట కదా!" అని అడిగాడు. నేను "లేదు - చైర్మన్ పనికి ఇల్లు ఎందుకుండాలి? రాజమహేంద్రవరానికి ఫ్రొఫెసర్ వుద్యోగం చెయ్యడానికి వచ్చిన ప్రతి అలాయిదా మనిషీ ఛైర్మన్ ఉద్యోగం చెయ్యగా నేనెందుకు చెయ్యకూడదూ? ఇంటి సంగ తెందుకు?" అని అడిగాను. దాంతో ఆయన తెల్లబోయాడు. తరవాత నేను రాజమహేంద్రవరం పరిస్థితులన్నీ వివరించాను. "రిప్పన్‌ప్రభువు పరిపాలన ప్రజలవశం చెయ్యడానికి మునిసిపల్‌చట్టం నిర్మిస్తే, పరిపాలనకి సంబంధంలేని కారణాలు పెట్టుగుని గెజెట్ చెయ్యకుండా వుండడం ఎక్కడైనా ఉందా? ఇల్లాంటి దారుణం ఎప్పుడైనా విన్నారా?" అని అడిగాను. ఆ తరవాత, "జీతం భత్యం లేని ఈ పనికి యింత అభ్యంతరం ఏమిటి?" అని కూడా అడిగాను. దానికి ఆయన సమాధానం చెప్పకనే, "నాకు వచ్చిన పిటీషన్ సంగతి మీకు ఎల్లా తెలిసింది?" అన్నాడు. నేను "మీ పిటీషన్ సంగతి రాజమండ్రిలో వున్న ముసలమ్మ లంతా నడిబజారుల్లో చెప్పుకుంటున్నా,"రని చెప్పాను. ఆయన 'ఎందుచేత?' అని అడిగాడు. "ఊరికల్లా ప్రథమ పౌరుడైన వ్యక్తిమీద ఈర్ష్యాళువులు వ్రాసే కాగితం విచారణ చెయ్యడానికి మామూలు ఉద్యోగస్థులకి పంపితే తెలియక ఏమి అవుతుంది! నా అర్హతని గురించి రిపోర్టు చెయ్యడం గ్రామమునసబా?" అని అడిగాను.

అందుకు ఆయన ఉలక్కుండా పలక్కుండా ఊరుకున్నాడు. ఆపైన కోలాచలం వెంకట్రావు ఎన్నికల్లో కాసుల సంగతి అడిగాడు. నేను దానికి కూడా తగిన జవాబు చెప్పి, "నా యిష్టంవచ్చిన అభ్యర్థికి పనిచెయ్యడంలో తప్పేమిటి?" అని అడిగాను. చివరికి, "ఆకుకీ పోకకీ అందని కబుర్లమీద ఆధారపడి, న్యాయపరీక్షకి నిలబడని కథలు ఆధారంచేసుకుని, శాస్త్రోక్తంగా జరిగిన ఎన్నిక రద్దుచెయ్యడానికి మీకు ఏమి అధికారం ఉన్న?" దని అడిగాను. ఆ సంభాషణలో ఉభయులమూ చురుగ్గానే మాట్లాడుకున్నాము. చివరికి ఆయన, "సరే జాగ్రత్తగా చూస్తా" నన్నాడు.

ఆ తరవాత గవర్నరుగా ఉన్న ఆంస్టర్‌ని కూడా చూశాను. ఆయనతో విషయాలన్నీ చెప్పాను. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి "ప్రకాశంగారూ! మీరు చెప్పిన విషయాల్నిబట్టి చూస్తే, నా ప్రభుత్వం మీ ఎన్నిక రద్దుచేసేటంత గుడ్డిగా వుండదు అనుకుంటాను. అయినా, అది నాకు సంబంధించినదీ, నేను కలగజేసుకునేదీ కాదు. ఫోర్‌బ్సు జాగ్రత్తగానే చూస్తా డనుకుంటాను. అయినా, అంతగా విషమిస్తే చూద్దాం లెండి!" అన్నాడు.

ఈలోగానే రాజమహేంద్రవరంలో పంతులుగారి వర్గం నా ఎన్నిక రద్దయిపోయిం దని పుకారు పుట్టించారు.

ఫోర్బ్సు వెంటనే కాగితాలు తెప్పించి, కలెక్టరు రిపోర్టు చూసి, నాతో మాట్లాడిన మాటలు మనస్సులో వుంచుకుని, వెంటనే ఇల్లాగ ఆర్డరు పాస్ చేశాడు. "He is certainly a troublesome man. But we cannot avoid him. Gazette his name." దాని మీద నా పేరు గెజెట్ అయి నేను ఛార్జీ పుచ్చుకున్నాను.

ఈ ఛైర్మన్ ఎన్నిక అయిన తరవాత సుబ్బారావుపంతులుగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, సోమయాజులుగారు మొదలయినవాళ్లు నామీద మరింత పట్టుదల వహించారు. కాని, మునిసిపల్ వ్యవహారాల్లో నాజోలికి రాలేకపోయేవారు. నేను మునిసిపల్ పని శక్తివంచన లేకుండా జాగ్రత్తగా చేసేవాణ్ణి. పొద్దున్నే 6 గంటలకే గుఱ్ఱంమీద బయలుదేరి ఊరు నాలుగుమూలలూ తిరిగి చూసేవాణ్ణి. అప్పటి కింత ఊరులేదు సరిగదా, దాని కనుగుణంగానే ఉద్యోగస్థులు కూడా ఎంతోమంది వుండేవారు కారు. అప్పటికి గోదావరికి కట్టలేదు. అయినా, జనం స్నానపు రేవులు పాడు చెయ్యకుండా కొంతకాలం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించాను. గట్టు నా కాలంలో పడకపోయినా, గోదావరికి ఒక గట్టు వుండాలనీ, దాన్ని సొగసుగా వుంచాలనీ ఒక అభిప్రాయం ప్రచారంచేసి ఆ సిద్ధాంతాన్ని కూడా అంగీకరింపచేశాను. మునిసిపల్ పరిపాలన కొంతకాలం ఎవ్వరి పేచీ లేకుండా సాగిపోయింది.

కాని, కొంతకాలానికి రాయపూడి సుబ్బారాయుడుకీ, నాకూ కంట్రాక్టుల విషయంలో తగాదా వచ్చింది. అతను చిరకాలంనించి ఈ కౌన్సిల్లో వుండి, ఎన్నికలలో కిందా మీదా పడుతూ వుండడంచేత, కొందరి యెడల ప్రత్యేకాభిమానం చూపించేవాడు. నా కా సంబంధాలేమీ లేకుండా ఒక పద్ధతిని పోకపోతే కష్టంగా వుండేది. అంతేకాదు, అతను చెప్పినట్లల్లా చెయ్యకపోతే అతనికి బాధగా వుండేది. అతను "దుర్గయ్యగారిని ఒదులుకుని, నిన్ను తెచ్చిపెట్టుకున్నందుకా ఈ గొడవ అంతా?" అంటూ బాధపడేవాడు. నేను నిర్మొహమాటంగా, "అబ్బాయి! నువ్వు చేసిన సహాయానికి సంతోషమే, కాని ఈ నాలుగు రోజులూ నా స్వాతంత్ర్యానికి భంగం రాకుండా నన్ను ఈ వుద్యోగం చెయ్యనియ్యి!" అని చెప్పాను.

ఇల్లా వుండగా, ప్రతికక్షులు నాకు ఛైర్మన్ ఎలక్షనులో సహాయం చేసిన వాళ్ళమీద ఏదో ఒక తంటా తెచ్చి కక్ష సాధించడానికి పూనుకున్నారు. ఆరాముదయ్యంగారు నా పార్టీలో నాకు బాగా సహాయంగా వుండేవాడు. ఆయన ఆలపాటి భాస్కర రామయ్యగారితో వ్యాపారం చేసి విడిపోయేటప్పుడు సామానులు పంచుకుని పట్టుకుపోవడంలో రెండు తీగెలకట్టలు కూడా పట్టుకు వెళ్ళాడు. అందుకని కక్షకట్టి ఆయనమీద దొంగతనం నేరం ఆరోపించారు. ఆ కేసులో ఫిర్యాదీ తరపున అచ్యుత రామయ్యగారు, ముద్దాయి తరపున నేను వాదించాము. మేజస్ట్రీటు జిళ్ళేళ్ళ కృష్ణారావు పంతులుగారు. ఆయన దేవాంతకపు మేజస్ట్రీటు, ఈ కేసు సుమారు ఐదారు నెలలు విచారించాడు. ఈ విషయంలో ఆరాముదయ్యంగారి అన్నగారు పి. టి. శ్రీనివాసయ్యంగారు కూడా ఎంతో ఆత్రతగా వుండేవాడు. కృష్ణారావుపంతులుగారి ధోరణిని పట్టి ఆయన వాలకం కనిపెట్టాను. ఆయన ఆరాముదయ్యంగారికి శిక్షవేసే ధోరణిలో పడ్డాడు. ఏమి బలం లేని కేసు మోపు చెయ్యడానికి మేజస్ట్రీటు చెయ్యగలిగిన సహాయం అంతా చేశాడు. చివరికి, 120 పేజీల జడ్జిమెంటు వ్రాసి, ఒకనాటి మధ్యాహ్నం 11 గంటలవేళ 6 నెలలు శిక్ష విధించాడు.

ఆ తీర్పు అంతా వెంటనే కోర్టులో చదవమని పిటీషన్‌పెట్టి, ఆయన చదువుతూ వుంటే నోట్సు వ్రాసుకోమని ఒక జూనియర్ వకీలుకి అప్పచెప్పి, తిన్నగా నా ఫీటన్‌మీద సబ్‌కలెక్టర్ విస్ దగ్గిరికివెళ్ళాను. ఈ కేసు సమాచారం అంతా ఆయనతో చెప్పి, నాకు సహాయం చేసిన పక్షంమీద కక్ష కట్టి, భాస్కర రామయ్యగారిని ప్రోత్సహించి అచ్యుతరామయ్య ప్రభృతులచేత కేసు పెట్టించారని నచ్చజెప్పి, అప్పీలు దాఖలుచేసి బెయిలు అడిగాను. "జడ్జిమెంటు కాపీలు వగైరాలు లేకుండా ఎట్లాగా?" అని ఆయన సంకోచించారు. కాని, నా కోరిక పైని బెయిలు ఇచ్చి గుమస్తాచేత పంపిస్తానన్నారు. అల్లాగ కాదనీ, ఆ బెయిలు ఆర్డరు స్వయంగా పట్టుకుని వెళ్ళడ్డానికే నేను వచ్చాననీ చెప్పిన మీదట. ఆయన గుమాస్తాని పిలిచి, బెయిలు ఆర్డరు వ్రాయించి నాచేతికి ఇచ్చారు. వెంటనే రెండు దౌడుల్లో కోర్టులోకి వచ్చాను.

నేను వచ్చేసరికి మేజస్ట్రీటు ఇంకా తీర్పు చదువుతూనే వున్నాడు. అచ్యుతరామయ్య ప్రభృతులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఆ తీర్పు చదవడం పూర్తి కావడంతోనే నేను దొర ఆర్డరు మేజస్ట్రీటు ఎదట పెట్టేసరికి మేజస్ట్రీటు, ప్లీడర్లు, పార్టీలు అంతా కూడా స్థబ్దులై పోయారు. అప్పటికి ఆరాముదయ్యంగారు జైలుముఖం చూడకుండా తప్పించగలిగాము. తరవాత విస్ దగ్గిర జడ్జిమెంటు కాఫీకి ఫైలు చేశాము. అతను కాకినాడలో కేసు విచారించాడు. కేసు చూస్తూండగానే అది పార్టీ కక్షలచేత వచ్చిన వ్యవహారం అని గ్రహించి, అప్పీలెంటు తరపున నేను మాట్లాడకుండానే, ఎదట పార్టీతరపున హాజరైన బారిష్టర్ బర్టం రాఘవయ్యగారిని, "క్రింది కోర్టు తీర్పు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పమని" అడిగాడు. ఆయన సమాధానం విని కింది కోర్టు తీర్పు రద్దు చేశాడు. అంతటితో ఆ కేసుముగిసింది.

అక్కడినించి నా ప్రతికూల పక్షంవారు తమ ఆయుధాలు ఇంక తిన్నగా నామీదే ప్రయోగించడానికి పూనుకున్నారు. రాజమహేంద్రవరంలో కాకి కృష్ణమూర్తి అనే ఒక వైశ్యప్రముఖుడు ఉండేవాడు. 10, 12 ఏళ్ళ వయస్సు వున్న అతని కుమారుడు తోటిపిల్లలతో గోదావరికి స్నానానికి వెళ్ళి, ఏ కారణంచేతనో కాలుజారి, నీటిలో పడి చనిపోయాడు. ఆ పిల్లవాణ్ణి పెరుమాళ్ళ రంగయ్య అనే అతని బంధువు కొందరు హంతకుల్ని ఏర్పాటుచేసి చంపించాడని ఒక కేసు వచ్చింది. ఆ పెరుమాళ్ళ రంగయ్యకూడా అప్పటికి రాజమహేంద్రవరం లక్షాధికారుల్లో లెఖ్ఖ. అతను అప్పటికి చాలాకాలం క్రితంనించీ నాక్లయంటు. మునిసిపల్ ప్రతికక్షులు ఆ పెరుమాళ్ళ రంగయ్యకి నేను సలహా ఇచ్చాననే ఆరోపణచేసి, నన్ను ఆ కేసులో ఇరికించాలని బ్రహ్మ ప్రయత్నం చేశారు. అప్పుడే పిఠాపురంవారి కేసులో పనిచేస్తూ ఉన్న మద్రాసు వకీలు వి. కృష్ణస్వామయ్యరుగారు రాజమహేంద్రవరం వచ్చారు.

ఆయన ఒకరోజున క్లబ్బులో సుబ్బారావు పంతులుగారు మొదలయిన వాళ్ళంతా ఉండగా, "ప్రకాశం కుర్రవాడు. సెకండుగ్రేడు ప్లీడరు. హేమాహేమీలైన మిమ్మల్ని అందరినీ ఓడించి ఛైర్మన్ అయ్యాడు. మీ ప్రతిభ ఇంతేనా!" అని హేళన చేశాడు. అందుచేత వాళ్ళ పట్టుదల మరింత హెచ్చయింది. ఆ కారణంవల్ల నన్ను ఎల్లాగైనా ఈ హత్యకేసులో ఇరికించాలని సంకల్పించారు. ముఖ్యంగా పెద్దాడ సాంబశివరావు, ములుకుట్ల అచ్యుతరామయ్యగార్లు బహిరంగంగా దీనికి పూనుకున్నారు. దీంట్లో పంతులుగారిసలహా, వెంకటరెడ్డిగారి ఎరుకా కూడా లేకపోలేదు. మొదటి పెద్దలిద్దరూ ఇద్దరు వడ్రంగి కుర్రవాళ్ళని తయారుచేసి వాళ్ళచేత హత్యజరిగిన క్రితం రోజుని 11 గంటలకి కోర్టుకి వస్తూ ఉంటే నాళంవారి సత్రంసమీపంలో పెరుమాళ్ళ రంగయ్య నాకు ఎదురుపడ్డాడనీ, అక్కడ నా డాకార్టుఆపి అతనితో మాట్లాడాననీ, ఆ మాట్లాడడంలో చనిపోయిన కుర్రవాడి అనంతరం కాని తనకి ఆస్తికి హక్కులేదని సలహా ఇచ్చాననీ ఒక పెద్ద కథ అల్లారు. సాంబశివరావు, అచ్యుతరామయ్యగార్లు ఆ కుర్రవాళ్ళని స్వయంగా మేజస్ట్రీటు జిళ్లేళ్ళ కృష్ణారావు పంతులుగారి దగ్గిరికి తీసుకుపోయి వాళ్ళచేత అఫిడవిట్ ఇప్పించారు. ఆరాముదయ్యంగారి కేసు సందర్బంలో విస్ దొరతో తన్ను గురించి ఏదో చెప్పానని ఆయనకి అనుమానం ఉండడంచేత నా మీద కొంచెం గుర్రుగా ఉండేవాడు. ఆ ప్రమాణ పత్రిక ముఖం చూస్తేనే నమ్మడానికి వీలులేని స్థితిలో ఉండడంవల్ల, స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు సరియైన చర్య తీసుకుంటారో తీసుకోరో అని డిస్ట్రిక్టు సూపరింటెండెంటు దగ్గిరికి వెళ్ళారు.

అప్పుడు డి. యస్. పి. సి. బి. కన్నింగుహాం అనుకుంటాను. ఆయనకి కూడా ఈ అభూతకల్పన ఆశ్చర్యంగా తోచి, రాజమహేంద్రవరం వచ్చి సబ్‌కలెక్టరు విస్‌తో సంప్రతించాడు. విస్ చిరాకుపడి "ఏమిటీ? ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నంచేసి ఓడిపోయారా? ఇప్పుడిక అతన్ని ఉరితీయించడానికి ప్రయత్నిస్తున్నారా?" అన్నాడు. ఆపైన ఆ కథ అసంభవమనీ, నా శత్రువుల అభూతకల్పన అనీ, నా ప్రస్తావన లేకుండా కేసు ఇన్‌క్వయిరీ చెయ్యమనీ సలహా చెప్పాడు. నా దగ్గిరికి పోయి స్టేటుమెంటుకూడా తీసుకోమన్నాడు. కన్నింగ్‌హామ్ మా యింటికి వచ్చి ఈ సంగతులన్నీ అడిగాడు. నేను మొదటినించీ ఉన్నదంతా పూసగుచ్చినట్లు చెప్పాను. వీరంతా మునిసిపల్ వ్యవహారాలలో నాకు శత్రువు లయినదీ, ఆ శత్రుత్వం కారణంచేత కక్ష సాధిస్తున్నదీ అంతా సవిస్తరంగా చెప్పినతరవాత అతను పూర్తిగా తృప్తిపడి నన్ను ఇంక్వయిరీలోనించి తప్పించివేశాడు.

ఈ సందర్భంలో నా మిత్రుడైన కందుకూరి వెంకటరత్నం విషయంలో కూడా నాస్నేహితులు కొందరు బాధపడ్డారు. ఆ కుర్రవాడి శవం పంచాయతీ చేసే సందర్భంలో కందుకూరి వెంకటరత్నం కూడా పంచాయితీదారు. అప్పుడు ఈ పెరుమాళ్ళ రంగయ్య అతన్ని హత్యచేయించి ఉంటాడేమో అనే కథ వచ్చి నప్పుడు యాథాలాపంగా రంగయ్య ఆ క్రితం రాత్రి ప్రకాశం ఇంటికి వచ్చాడని అన్నాడు. ఆ క్రితం రాత్రి 8, 9, గంటలకి నేనూ, వెంకటరత్నమూ, ఇంకా కొందరు స్నేహితులూ కుర్చీలు వేసుకుని మా ఇంటిముందర కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండగా రంగయ్య వచ్చినమాట వాస్తవమే. క్లయింట్లు రాత్రిళ్ళు వచ్చి మాట్లాడి పోవడంలో విశేష మేముంది? ప్రాక్టీసు వృద్ధి చేసుకోవా లని కష్టపడే ప్రతీ ప్లీడరూ, క్లయింట్లతో రాత్రిళ్ళు నిదానంగా మాట్లాడుకోవడం సహజమే కదా. ఈ సామాన్య విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి, నా శత్రువులు నామీదికి దూకదలచినపుడు, నా స్నేహితులు కొందరు వెంకటరత్నం దగ్గిరికి వెళ్ళి, "నువ్వు అన్న ఆ మాటలవల్ల ప్రకాశానికి ఆపత్తు వచ్చేటట్టువుంది. పోనీ, నువ్వు ఆ విషయం చెప్పకుండా ఉండకూడదా?" అని సలహా యిచ్చారు. అతను, "ఒకసారి నేను చెప్పిన తరవాత - అందులోనూ ఆ సంగతి నిజమైనప్పుడు - నేనెందుకు కా దనాలి?" అన్నాడు. దానికి స్నేహితులు బాధపడ్డారు. కాని, అప్పుడూ ఇప్పుడూ కూడా "వెంకటరత్నం మాటే సరి అయినది" అని నా అభిప్రాయం.

తరవాత పోలీసులు పెరుమాళ్ళ రంగయ్యమీద కేసు పెట్టారు. ఆ కేసులో మేజస్ట్రీటుకోర్టులో నేనే పని చేశాను. కేసు సెషన్సుకి వెళ్ళింది. అప్పుడు నాయందు సుముఖుడు కాని హేమ్నెట్‌దొరే జిల్లా జడ్జీ. ఆ కారణంచేత కూడా నా శత్రువులు నన్నందులో ఇరికించడానికి ఉబలాట పడ్డారు. నేను సెషన్సు విచారణకి మద్రాసునించి బారిష్టర్ జాన్ ఆడమ్సుని తీసుకుని వచ్చాను. సహజంగా కేసులో ఏమీ బలంలేక పోవడంచేత, ఆ జడ్జీ రంగయ్యని నిర్దోషిగా నిర్ణయించి ఒదిలివేశాడు. అంతటితో శత్రువులు పన్నిన మరొక ఉచ్చునించి బయటపడ్డాను. ఒక్కొక్కప్పుడు జీతం భత్యంలేని ఈ స్వల్పాధికారాలకోసం ఎందుకింత శత్రుత్వం వచ్చిందా అనే విషయం ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా వుంటుంది.

ఈ గంద్రగోళా లెట్లా వున్నా మునిసిపల్ పరిపాలన యథా రీతిగా జరుగుతూనే వుంది. మొదటిసంవత్సరం పరిపాలనా నివేదికలో పరిపాలన సంతృప్తికరంగానే వున్నదని గవర్నమెంటు వ్రాసింది. ఈ హత్యకేసు సందర్భంలో పోలీసుల హడావిడి చూసి నాతో భాగస్థుడుగా ఉండిన పిళ్ళారిసెట్టి నారాయణరావు భయపడిపోయాడు. తరవాత, అతన్ని మా పార్టీ తరపున మునిసిపల్ కౌన్సిలరుగా కూడా చేశాము. చివరికి అతనికి కూడా ధైర్యం చెప్పవలసివచ్చేది.

ప్రతి కక్షుల ప్రయత్నాలు ఇంతటితో ఆగలేదు. నా పార్టీలో నాకు బలంగా వుండే ఏలూరి లక్ష్మీనరసింహంగారిమీద మళ్ళీ ఒక కేసు బయలుదేరదీశారు. ఆ రోజుల్లో రాగి బంగారం చేస్తామనే మంత్రగాళ్ళు, వాళ్ళ మాయల్లో పడే అమాయికులూ వుంటూండేవాళ్ళు. శనివారపు పేట ఎస్టేటులోకి ఇల్లాంటి మంత్రగాడొకడు సిద్ధమై, రాగి బంగారం చెయ్యడానికి పూనుకున్నాడు. ఒక గదిలో దేవతని పెట్టి, ఇంట్లో వుండే బంగారమూ, జవాహరీ అంతా ఆ దేవతకి అలంకరించి పూజచెయ్యాలని చెప్పి బంగారం అంతా సేకరించాడు. నాలుగురోజులు జపం అయ్యాక ఆ బంగారం అంతా మూటకట్టుకుని, రాత్రికి రాత్రి ప్రయాణమై మాయమైపోయాడు. ఆ బంగారంలో కొన్ని వస్తువులు ఏలూరి లక్ష్మీనరసింహంగారి ఇంటికి దగ్గరగా ఉన్న, ఆయన స్నేహితుడైన ఒక మహమ్మదీయుడి దగ్గిరికి చేరాయి. అతను పెద్ద గడ్డంతో భయంకరంగా వుండేవాడు. ఆ మహమ్మదీయుడు బజారులో ఆ జవాహరీ అమ్ముతూ వుండగా షరాబులు కొనడానికి కొంచెం సంకోచించారు. వెంటనే పోలీసులు వచ్చి ఆ మహమ్మదీయుణ్ణి పట్టుకున్నారు.

అందుమీద ఏలూరి లక్ష్మీనరసింహంగారు ఆ జవాహరీ ఆ సాహేబుదే నని మేజస్ట్రీటుదగ్గిర స్టేటుమెంటు ఇచ్చారు. పోలీసులు ఆ స్టేటుమెంటు విశ్వసించకుండా ఆ అమ్మకం ఆపుజేశారు. ఈ లోగా పోలీసులు ఆ జవాహరీని గురించి ప్రకటన చెయ్యగా శనివారపుపేటవారు వచ్చి ఆజవాహరీ పోల్చుకున్నారు. వెంటనే పోలీసులు ఏలూరి లక్ష్మీనరసింహంగారిమీద, సాహేబుమీద కేసుపెట్టారు. ఏలూరి లక్ష్మీనరసింహంగారి నేరం అంతా ఆయన "జవాహరీ సాహెబుదే" అని చెప్పడం. ఆయన తెలిసే చెప్పారో, లేక ఆశ్రిత పక్షపాతంచేతనే చెప్పారో నిర్ణయించడం కష్టం. దానికితోడు స్థానికంగా లక్ష్మీనరసింహంగారిమీద వుండే కక్షలు కూడా కలిశాయి.

విచారణ సబ్‌కలెక్టరు ఎదట. లక్ష్మీనరసింహంగారి తరపున నేను హాజరయ్యాను. ముద్దాయి స్థానికంగా చాలా ప్రముఖులనీ, ఇక్కడ ఈ కేసు జరగకూడదనీ, మరి ఒక జిల్లాకి ట్రాన్సుఫరు చెయ్యమనీ పిటీషను పెట్టాను. ఆ పిటీషను కొట్టివేశారు. అందుమీద ట్రాన్సుఫరుకోసం హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో డాక్టరు స్వామినాథన్ గారిని ప్లీడరుగా ఏర్పాటుచేశాను. స్వామినాథన్‌గారు బారిష్టరు పాసయి కొద్దికాలం కిందటే ప్రాక్టీసు పెట్టారు. కేసు హైకోర్టులో డేవిస్ బెంచి దగ్గిరికి వచ్చింది.

ఆ డేవిస్ లావుగా వుండేవాడు. చాలా భీకరంగా మాట్లాడుతూ వుండేవాడు. కేసు చూస్తూనే "No points to argueː case dismissed" అన్నాడు. స్వామినాథన్‌గారు నోరు విప్పనైనా విప్పలేదు. నాకు చాలా చిరాకు కలిగింది. కోర్టులోనే స్వామినాథన్‌గారిమీద పడి, "ఇదేమి బారిష్టరీ అండీ! కేసు ఆర్గ్యుమెంటు చెప్పకుండానే డిస్మిస్ చేస్తే, మాట్లాడక ఊరుకున్నారు!" అని కేకలు వేశాను. ఆయన "ప్రకాశంగారూ! రాత్రి మా యింటికి భోజనానికి రండి! మీతో మాట్లాడాలి," అన్నారు.

రాత్రి భోజనానికి వెళ్ళాను. డాక్టరు స్వామినాథన్‌గారు బ్రాహ్మణులే కాని, అప్పటికే ఒక బట్లరుచేత వండించుకుని తింటూ వుండేవారు. ఆయన చాలా జాగ్రత్త మనిషి. బహు క్లుప్తంగా ఖర్చుపెట్టుకుంటూ డబ్బు కూడబెట్టేవారు. ఆయన నన్నెంతో ఆప్యాయంగా ఆదరించి, "ప్రకాశంగారు! మీలో మంచి చురుకుతనమూ, ధైర్యమూ కనిపిస్తున్నాయి. మీరుఎందుకు బారిష్టరు కాకూడదు?" అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది! "నేను సెకండు గ్రేడు ప్లీడర్‌ని. బీదవాణ్ణి. నాకేమిటి! వేలకువేలు ఖర్చయే బారిష్టరీ ఏమిటి? నాకు అది ఎల్లాగ లభ్య మౌతుంది!" అన్నాను. అందుమీద ఆయన వేలకి వేలు అవసరం లేదనీ, ఆరువేల రూపాయలతో కోర్సు అంతా పూర్తిచెయ్యవచ్చుననీ, నేను నెలకి ఆరు పౌనులతో కాలక్షేపం చేశాననీ చెప్పారు. నేను, "అది అంత సుళువై, ఐదారువేల రూపాయలలో అయితే ప్రయత్నం చేస్తా" నని చెప్పాను.

వాస్తవానికి ఆ సంభాషణే నా జీవితాన్ని ముందుకి తోయగలిగిన విశేష ఘట్టం. నేను రాజమహేంద్రవరంలో సెకండుగ్రేడు ప్లీడరుగా పనిచేస్తూ శత్రువుల్ని నిర్జించుకుంటూ అప్పటికి తృప్తికరమైన జీవితం గడుపుతూ వున్నా, నాకుమాత్రం ఆ స్థానం ఇరుకుగా కనిపించేది. విశాలమైన ఆవరణలో విచ్చలవిడిగా సంచారం చేసే మనస్తత్వం కావడంచేత, ఈ ఆలోచన నాకు బాగా తల కెక్కింది. వెంటనే రాజమహేంద్రవరం వచ్చివేసి నా మిత్రులైన కంచుమర్తి రామచంద్రరావు గారితో, నాకూ స్వామినాథన్‌గారికీ జరిగిన సంభాషణ అంతాచెప్పాను. ఆయన అప్పుడే సగం ఖర్చుపెట్టుకోడానికి అంగీకరించి ప్రోత్సహించారు. నాకు మిత్రులూ, చాటపర్రు వాస్తవ్యులూ అయిన మాగంటి లక్ష్మణదాసుగారికి కబురు పంపించగా, ఆయన వచ్చి మిగిలిన మూడువేలూ ఇవ్వడానికి అంగీకరించారు. నేను డబ్బు సర్దుబాటు కావడంతోనే ఇంగ్లండు వెళ్ళిపోవడానికి నిశ్చయం చేశాను.

ఇంక ఇక్కడ ఏలూరి లక్ష్మీనరసింహంగారి కేసు మిగిలి వుంది. కొంత కేసు విస్ దగ్గిర జరిగింది. ఆ కేసు క్రాస్ పరీక్షలో మునిసిపల్ కక్షలు వగైరాలన్నీ చాలావరకు రుజువు చేశాను. అ తరవార మళ్ళీ హైకోర్టుకి ట్రాన్సుఫరు పెట్టాను. కొంత సాక్ష్యం రుజువుమీద జాన్ ఆడమ్సునిపెట్టి వాదిస్తే ట్రాన్సుఫరుకి ఆర్డరు పాసయింది. ఆ కేసు విశాఖపట్నానికి ట్రాన్సుఫరు చేశారు. విశాఖపట్నంలో కూడా నేనే కేసు నడిపించి లక్ష్మీనరసింహం గారిమీద కేసు లేకుండా తప్పించి వేశాను.