Jump to content

నా జీవిత యాత్ర-1/మళ్ళీ ఇంగ్లండు ప్రయాణం

వికీసోర్స్ నుండి

13

మళ్ళీ ఇంగ్లండు ప్రయాణం

రెండవటెరము చదువుకి మళ్ళీ అక్టోబరులో బయలుదేరి లండన్ వెళ్ళాను. లండన్‌లో కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పించే ఉపన్యాసాలు శ్రద్ధగా ఆలకిస్తూ ఫైనలు పరీక్షకి తయారు అయ్యాను. అన్ని ఇన్‌లలోనూ ఈ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఉపన్యాసాలిప్పిస్తూ అందరికీ పరీక్షలు జరిపి పట్టాలిస్తారు. అంతకి పూర్వం మన దేశంలో వాలస్ పట్టాల్లాగే డిన్నర్‌లకి క్రమంగా హాజరయిన బుద్ధిమంతులకి పట్టాలు ఇచ్చేవాళ్ళు. ఈ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఏర్పడ్డాకే మనదేశంలో లా కాలేజీలు కూడా ఏర్పడ్డాయి.

ఈ కాలంలో నేను ఇంగ్లండు దేశం చాలా తిరిగాను. కాస్త వీలైనప్పు డల్లా ఒక్కొక్కదేశం ట్రిప్పు కొడుతూ ఉండేవాణ్ణి. ఇంగ్లండులో ఉన్న ముఖ్యపట్టణాలు, పరిశ్రమల స్థానాలు అన్నీ చుట్టుముట్టాను. అప్పుడే కేంబ్రిడ్జిలో సి. ఆర్. రెడ్డిగారిని కలుసుకున్నాను. ఆయన అప్పటికే చాలా తెలివైనవాడని పేరుపడ్డారు. యూనివర్సిటీలో కూడా ఆయన ప్రతిభ గణనీయంగా ఉంది. అప్పటి కప్పుడే గోఖలే గారు ఉపన్యాసాలివ్వడమూ, కొంద రాయన్ని అడ్డుప్రశ్నలు వెయ్యడమూ, మరికొంద రాయన చెప్పినదానికి హర్షించడమూ జరిగింది. సి. ఆర్. రెడ్డిగారు ఎం. ఏ. కీ, బారిష్టరు పరీక్షకీ కూడా తయారు అయ్యారు. చివరిదాకా డిన్నర్లు వగైరాలకు హాజరై పరీక్షకి మాత్రం హాజరు కాకుండా ఊరుకున్నారు. నేను ఆయన్ని కలుసుగున్నప్పుడు తెనుగు భారతం చదువుతున్నారు. నాకు తెనుగు భారతంమీద చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చారు. నేను "డిన్నర్లు అయ్యాయి కదా! బారిష్టరు పరీక్షకి హాజరై పరీక్ష ఎందుకు పూర్తి చెయ్య,"రని అడిగాను. ఆయన "గోఖలేగారు నాకు బారిష్టరు పనికి వెళ్ళవద్దని సలహాయిచ్చారు. పరీక్ష పాసై ఉంటే ఎప్పటికి అయినా ప్రాక్టీసు చెయ్యాలి అని చపలత్వం కలుగుతుంది. కాబట్టి, ఒక్కసారేదానికి తిలోదకాలు ఇచ్చాను" అన్నారు. అంత దీక్షతో ఉన్నారు ఆయనప్పుడు!

నేను ఈ కాలంలో ఇంగ్లీషు కోర్టులలో పని చాలా శ్రద్దగా గమనించాను. అప్పుడే రెండుమూడు గొప్ప కేసులుకూడా వచ్చాయి. ఒక కేసులో సర్ ఎడ్వర్డు కార్సన్ అనే ఐరిషు బారిష్టరు పనిచేశాడు. ఒక ఇంగ్లీషు యువతి ఒక జర్మన్ రాజకుమారుడిమీద తనని పెళ్ళి చేసుకుంటానని మభ్యపరచి దగా చేశాడని, వాగ్దాన భంగాని (Breach of promise) కి కేసు తెచ్చింది. ఆ కేసులో జడ్జీకూడా మొదటినించీ ఆమె పట్లనే అభిమానం చూపిస్తూ వచ్చాడు. ఆ సంగతి సర్ ఎడ్వర్డు కార్సన్ గ్రహించి కేసు మంచి నేర్పుతో నడిపించాడు. క్రాసు పరీక్షలో చాలా అమాయికంగా కనిపించే ప్రశ్నలు తగిలించి, వాటి ఆధారంతో ఆమె చాలా మాయల మారి అనీ, ఎందరో ధనవంతులికి టోపీ వేసే సమర్థురాలనీ వాదించాడు. జ్యూరీకి ఆర్గ్యుమెంటు చెపుతూ గుండె బెదురులేకుండా, "జడ్జీలు ముందుగా తమబుద్ధి కోర్టు బయట వదిలిపెట్టి వచ్చినా సాగుతుంది, కాని జ్యూరర్లు మాత్రం వివిధమైన అభిమాన దురభిమానాలూ ఉంచుకోకుండా తమ వివేకాన్ని ఉపయోగించ,"మని ఉపోద్ఘాతం చెప్పాడు. చివరకి ఆ కేసులో జ్యూరీ రెండు భాగాలు అవడంచేత కేసుపోయింది. ఆ దేశంలో బారిష్టర్లు అల్లాంటి స్వాతంత్ర్యం చూపించేవాళ్లు. జడ్జీలని లక్ష్యపెట్టకుండా క్లయింట్లకేసులు బలపరచేవాళ్ళు. ఆస్తికి సంబంధించిన ఇంకొక కేసులో కోర్టుప్రెసిడెంటు అయిన లార్డు జస్టిస్ మెల్టన్‌మీద అతని సవతికూతురు దావా తెచ్చింది. ఆ జడ్జీ తన తరపున సాక్ష్యం ఇచ్చుకున్నాడు. జడ్జీ మాట తోసివేయడం అనేది సాధారణ విషయంకాదు. - అ కేసులో ఆ కూతురు తరపున సర్ మాంటేగ్ హాజరు అయ్యాడు. అసలు కేసు క్రిందికోర్టు కింగ్సుబెంచి డివిజనులో జడ్జీపక్షం అయింది కాని, సర్ మాంటేగ్ న్యాయం విషయంలో సుప్రీం కోర్టు జడ్జీ అనే అభిమానం ఉండకూడదనీ, న్యాయం కోసం ఆయనమాట తోసివెయ్యాలనీ బహు సున్నితంగా వాదించాడు.

చివరికి కోర్టువారు ఆ జడ్జీ సాక్ష్యం తోసివేసి అతని కూతురు మాట అంగీకరించారు. దాంతో ఇంగ్లీషుపత్రికల్లో చాలా గందరగోళం చెలరేగింది. "ఒక జడ్జీ సాక్ష్యాన్ని ఇంకొక కోర్టువారు నమ్మకపోతే ఆయన రాజీనామా ఇవ్వాలి," అన్నారు. ఆ జడ్జీ అంతకన్న మొండివాడు. "అప్పీలు కోర్టు జడ్జీలు తప్పు అభిప్రాయం పడ్డారు కాని నేను అబద్దాలు చెప్పలేదు. కనక రాజీనామా ఇవ్వను" అన్నాడు. అక్కడ అల్లాంటి లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఇటువంటికేసులు ఏమన్నా వస్తే వాటికి స్వయంగా హాజరై చూస్తూ ఉండేవాణ్ణి.

ఈ కాలంలోనే మద్రాసు హైకోర్టు జడ్జీపని చేసి పించను పుచ్చుకున్న షెప్పర్డు అనే ఆయనతో నాకు పరిచయం కలిగింది. అప్పుడాయన ఇండియన్ కంట్రాక్టు ఆక్టు - అనే లా పుస్తకం మార్చి వ్రాస్తూ ఉండేవారు. ఆయన దానికి నన్ను సహాయం చెయ్యమని అడిగారు. అప్పటికే నేను సుమారు 10 ఏళ్ళు కోర్టులో ప్రాక్టీసు చేసి ఉండడంవల్ల ఆయన కోరిన పని తృప్తికరంగా చెయ్యగలిగాను. ఆయన తన పుస్తకంలో కూడా ఈ విషయం వ్రాశారు. తరవాత ఒకసారి ఆయనే నన్ను ఐసాక్ రూఫస్‌కి, (తరవాత ఇండియా వైస్రాయి లార్డు రీడింగుకి) ఎరుకపరచారు. ఐసాక్ రూపస్ అప్పట్లో పెద్ద లాయర్లలో లెఖ్ఖ. పుష్కలంగా డబ్బు సంపాదించేవాడు. ఆయన పంజాబ్ వాస్తవ్యుడూ, రంజిత్‌సింగ్ వారసుడూ అయిన దులీప్‌సింగ్ తరపున పంజాబు తిరిగి ఆయనకి ఇచ్చివెయ్యాలని గవర్నమెంటుమీద దావా వేశాడు. అది ఒక పెద్దకేసు. లార్డు రీడింగు హిందూదేశంలో ఆచార వ్యవహారాలు, వాటికి సంబంధించిన కేసులు మొదలైనవి ఏరి చెప్పడానికి ఎవరైనా ఒక భారతీయుడు తనకి సాయం కావాలని షెప్పర్డు నడిగాడు. ఆయన నన్ను అప్పగించాడు. నేను కొంతకాలం ఆ రూఫస్ ఆఫీసులో పనిచేశాను. ఆ కేసు కొంతకాలం జరిగింది. చివరికి కేవలం శాస్త్రీయ కారణాలచేత అది ఆక్టు ఆఫ్ స్టేటు కనక కేసు లేదని కొట్టివేశారు. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ సర్ రాబర్ట్ ఫిన్‌లేగారు హాజరై కేసు నడిపించారు.

సామాన్యంగా అనుకునేటట్టు బారెట్లా ఫైనల్‌పరీక్ష అంత సుళువైన విషయంకాదు. ఇంగ్లండుకి సంబంధించిన ఆస్తిపాస్తుల చట్టాలు, సివిల్ క్రిమినల్ ప్రొసీజరు, ఈక్విటీ కోర్టులకి సంబంధించిన చట్టాలు కలిపి, చాలా పెద్ద గ్రంథం ఉండేది. మన ఉన్నత విద్యలాగే మన లాయర్లకి పనికి వచ్చేది కాని, హిందూదేశానికి సంబంధించినది గాని ఏమీ ఉండేదికాదు. లాకి సంబంధించిన వరకు ఈ బారిష్టరు పరీక్షే చాలా పెద్దపరీక్ష. ప్రీవీ కౌన్సిలులో ప్రాక్టీసు చెయ్యడానికికూడా, ఇదే అర్హత. జడ్జీలకి కూడా ఇదే అర్హత. ఏది ఎల్లా ఉన్నా, హిందూ దేశస్థులకి ఈ చదువు చాలా ఖర్చుతో కూడుకున్న పని.

ఆ రోజుల్లో బారిష్టరు పరీక్షకి చదవడానికి ఏమి డిగ్రీలు అక్కర లేదు. ప్రవేశపరీక్ష అని ఒకటి ఉండేది. అందులో తృప్తికరంగా పాసయితే చేర్చుకునేవారు. బాగా ఇంగ్లీషు రానివాళ్ళు కూడా చేరి ట్యూటర్ల సహాయంతో గట్టెక్కేవారు. కాని, హిందూదేశపు చట్టాల సంగతీ, వాటి అనుభవమూ లేనివాళ్ళకి ఈ చదువు అంతా ఊకదంపులా కనిపిస్తుంది. కాని నాకూ, అప్పట్లో నా సహాధ్యాయి అయిన సర్ యస్. యన్. సర్కారుగారికీ హిందూదేశంలో లాతో అనుభవం ఉండడంవల్ల, అది అంతా చాలా సరదాగా ఉండేది. ఆయన ఇక్కడ బి. ఎల్. పాసయి, జిల్లా మునసబుపని చేస్తూ బారిష్టరుగా వచ్చారు. మేము ఉభయులమూ పస్టుక్లాసులో రావాలని కృషిచేస్తూ ఉండేవాళ్ళము. ఈ దేశంలో 10 ఏళ్ళపాటు ప్రాక్టీసుచేసి ఉండడంవల్ల ఆ చదువులోతు అంతా బాగా తెలుసుకోవడానికి వీలయింది. నేను లెక్చర్లు శ్రద్ధగా వినడమే కాకుండా, వాటికి సంబంధించిన ప్రధాన గ్రంథాలన్నీ చదివాను. నేనూ, సర్కారుగారూ కూడా సర్టిఫికేట్ ఆఫ్ ఆనరు సంపాదించాలని కృషిచేస్తూ ఉండేవాళ్ళము. అది 50 పౌనుల బహుమానము. ఈ బహుమానమూ, ఈ గౌరవమూ రావాలంటే నూటికి 75 మార్కులు పైగా రావాలి. పైగా, నోటిపరీక్ష ఒకటి ఉంటుంది. దాన్నికూడా నిగ్రహించుకుని రావాలి.

ఆయన వేరే ఇన్‌కి చెందినవాడేగాని మేము ఇద్దరమూ స్నేహంగా ఉండేవాళ్ళము. ఆయన ఈక్విటీ పేపరు ఇచ్చిన (Straughn) స్ట్రాన్‌ని చూడడానికి వెళ్ళారట. ఆయన "ప్రకాశం పేపరు అన్నిటికన్నా ఉత్తమంగా ఉంది. అతన్ని ఒకసారి చూడాలి," అన్నాడట. అ సంగతి సర్కారుగారు నాతో చెప్పిన తరవాత నేను ఆయన్ని దర్శించడానికి కనిపెట్టుకుని ఉన్నాను. కాని, ఒకరోజున ఆయనే నా గదికి వచ్చి నన్ను అభినందించి వెళ్ళిపోయినారు. ఈ రీతిగా పరీక్షలు ముగించుకున్నాను.

పరీక్షలు ముగిసేటప్పటికి నా దగ్గిర ఆర్‌బత్‌నాట్ అనే అతను స్థాపించిన బాంకులో 500 రూపాయిలు ఉన్నాయి. ఆర్‌బత్‌నాట్ అనే అతను మద్రాసు ప్రెసిడెన్సీలో పెద్ద బాంకు ఒకటి నడిపించి, చాలా మంది డబ్బు సేకరించాడు. ఆ కంపెనీ దివాలా తీయడంతోటే చాలా మంది ఉద్యోగస్థులూ, సామాన్య సంసారులూ కూడా చాలా డబ్బు పోగొట్టుకున్నారు. వి. కృష్ణస్వామయ్యరుగారి డబ్బుకూడా కొంత పోయింది. అందుచేతనే ఆయన పట్టుదల వహించి ఆర్‌బత్‌నాట్‌ని ప్రాసిక్యూటు చేయించి, ఇండియన్ బాంకు స్థాపించాడు. ఆ ఆర్‌బత్‌నాట్ కంపెనీ శాఖే లండన్‌లో మాక్‌ఫిడెన్ కంపెనీ. ఇక్కడ బాంకు దివాలా తీయడంతోటే అక్కడ కంపెనీ బోర్డు కూడా తిప్పివేశారు. మాక్‌ఫిడెన్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుచేత మన డబ్బుకి కూడా దెబ్బతగిలింది. అప్పుడు బహుమతిగా సంపాదించుకున్న 50 పౌనులే గతి అయ్యాయి. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు యూరోపు అంతా సంచారం చెయ్యాలని బుద్ధిపుట్టింది. అప్పుడు చాటపర్రులో మిత్రుడు లక్ష్మణదాసు అనే ఆయన కావలసిన డబ్బు పంపించాడు.

మద్రాసులో జడ్జీగా ఉండిన షెప్పర్డుతో నాకు పరిచయం అయిన సంగతి ఇదివరకే వ్రాశాను. ఎందుకైనా మంచిదని ఆయన్ని మద్రాసులో ఉండే జడ్జీలకి పరిచయం చేస్తూ ఉత్తరాలు ఇమ్మని అడిగాను. ఆయన లేదనలేక పోయాడు. కాని, ఉత్తరాలకి సరియైన మన్నన కలుగదేమో అనే అనుమానం ఆయన్ని బాధించింది. అప్పుడు మద్రాసులో సర్ సుబ్రహ్మణ్యయ్యరు ఒక జడ్జీ. షెప్పర్డు "ఆయన మైలాపూర్ కూటంలో వాడు. ఆయనకి నేను ఉత్తరం వ్రాస్తే మాత్ర మన్నిస్తాడా?" అన్నాడు. చివరికి అంటీ అంటని మాటలతో సర్ సుబ్రహ్మణ్యయ్యరుగారికీ, జస్టిస్ వాలస్‌కీ కూడా ఉత్తరాలు ఇచ్చాడు.

బారిష్టరు పైనల్ పరీక్షకి చదివే రోజుల్లోనే భవిష్యత్తుని గురించి కొంత ఆలోచించడం జరిగింది. బారిష్టరై మళ్ళీ రాజమహేంద్ర వరంలో ప్రాక్టీసు పెట్టడమా అనే సంశయం ప్రారంభం అయింది. చాలాకాలం అచ్చటి స్థానిక రాజకీయాల్లో కొట్టు మిట్టయిన నాకు అ ఊరంటే ప్రాణం విసిగింది. మళ్ళీ అదే ఇరుకులో పడకూడ దనిపించింది. అసలు బారిష్టరు చదువు చదివి కాస్త విశాలమైన అవరణలో బ్రదుకుదామని వెళ్ళాను. అల్లాంటప్పుడు రాజమహేంద్రవరంలో తిరిగి బారిష్టరుగా ప్రవేశించి స్థానికమైన గందరగోళాలలో పడకుండా ఉండడానికే నిశ్చయించుకున్నాను. అందుచేత ఏమైనా సరే మద్రాసులో ప్రాక్టీసు పెట్టడానికి నిశ్చయించుకుని షెప్పర్డు దగ్గిర పైన చెప్పిన ఉత్తరాలు తీసుకున్నాను. రాజమహేంద్రవరంలో ఉన్న నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు కూడా నేను తొక్కినదారి మంచిదని అంగీకరించారు.

ఈ నిశ్చయంతోనే సెకండ్‌హాండు లా పుస్తకాలు అమ్మే షాపులికి వెళ్ళి, స్వల్పంగా అడ్వాన్సు ఇచ్చి, సుమారు 10 వేల రూపాయల ఖరీదయిన అపురూపపు లా పుస్తకాలు కొన్నాను. వాటిని అన్నింటినీ సామాను ఓడలో పడవేయించి నేను పి. ఒ. బోటులో వచ్చేశాను. అయిన ఖర్చు ఎల్లాగ అయింది కనక, ఒకటవరకమైన లైబ్రరీకూడా ఉంచాలని సంకల్పించాను. నేను 1906 వ సంవత్సరం చివరికి భారత దేశం చేరుకున్నాను. కొందరు మిత్రుల దగ్గిర ఋణంచేసి లా పుస్తకాలు విడుదల చేయించాను. సకుటుంబంగా చెన్నపట్టణం చేరి కొండిచెట్టి వీథిలో 25 రూపాయిల అద్దెమీద ఒక చిన్న ఇల్లు కుదుర్చుకున్నాను. లైబ్రరీకీ, ఆఫీసుకీ మాత్రం ఒక విశాలమైన హాలు కుదుర్చుకున్నాను.