నా జీవిత యాత్ర-1/ప్రస్తావన

వికీసోర్స్ నుండి

ప్రస్తావన

రాష్ట్రపతి డాక్టర్ వరాహగిరి వెంకటగిరి

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు ఒక్క వ్యక్తి కాదు; అర్ధ శతాభ్దికి పైగా ఆంధ్ర రాజకీయ ప్రజాహిత జీవన రంగంలో ఆయన ఒక మహా సంస్థ. ఆయన వ్యక్తిత్వం మహా గోపుర శిఖరోన్నతం. ఆయన జీవిత గాథ బహుముఖ ప్రకాశం గలది; బహురస సంపన్నమైనది. బొడ్డున మాణిక్యం పెట్టుకొని పుట్టిన భాగ్యశాలి కారు ఆయన. అతి సామాన్య స్థితి - కాదు, నిరుపేద దశ -లో నుండి ఎదిగి ఎదిగి మహద్వైభవ శృంగాన్ని అందుకొన్న అతిసత్త్వుడాయన. ఉజ్జ్వల దేశ భక్తి, నిరుపమ త్యాగశీలం, అన్నింటికన్న ముఖ్యంగా ఆయన అక్షయ శక్తి, స్వభావ సౌష్టవం....ఆయన విజయ హేతువులు. ప్రకాశం గారు నాకు మరీ సన్నిహితులు; మన స్వాతంత్ర్య సమర చరిత్రలో అతిక్లిష్ట దశలో అయన నాయకత్వాన ఆయనకు అత్యంత సన్నిహితుడనై పనిచేసే భాగ్యం నాకు కలిగింది. అటువంటి ఆప్తుని గురించి వ్రాయటం కష్టం. ఆ రోజులు తలుచుకుంటే, వాస్తవంగా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ సంరంభాలు, ఆ సంచలనాలు, ఆ సంఘటనలు ఇప్పటికీ నాకు అపరిమితమైన ఆనందం, ఉత్సాహం కలిగిస్తాయి.

నాకు పదేళ్ళు వచ్చిన నాటినుంచి ప్రకాశంగారిని ఎరుగుదును. మా నాయనగారు, ప్రకాశంగారు సమకాలికులు, ఆజీవ మిత్రులు, ఇద్దరూ న్యాయవాద వృత్తిలో ప్రముఖులు. గాంధి మహాత్ముని నాయకత్వాన సాగుతున్న స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించక పూర్వం ప్రకాశం పంతులుగారు మద్రాసులో ప్రముఖ న్యాయవాదిగా ప్రాక్టీసుచేస్తూ అమి తంగా ఆర్జిస్తూ ఉండేవారు. చిరకాలం మా నాయనగారు, ప్రకాశంగారూ ప్రక్క ప్రక్కనే ప్రవహిస్తూన్న రెండు నదుల్లాగ సారవంతమైన మన తెలుగు నేలను ఫలవంతం చేశారు. ఇద్దరూ ఇంచుమించు ఏకకాలంలో జన్మించారు. ఒకే కళాశాలలో - రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్‌లో - ప్రిన్‌స్పాల్ మెట్ కాఫ్ గారి వద్ద చదువుకున్నారు. 1891 సుమారులో ఇద్దరూ ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్ పరీక్షకు చదివి, గంజాం, గోదావరి జిల్లా కోర్టులలో ప్రాక్టీసు చేశారు. 1927-29 లో ఇద్దరూ మాన్యులైన పండిత మోతీలాల్ నెహ్రూగారి నాయకత్వాన మన దేశంలో నాటి పెద్దలంతా ఉన్న స్వరాజ్య పార్టీ పక్షాన కేంద్ర శాసన సభకు ఎన్నిక అయ్యారు. 1937 --39లలో ఇద్దరూ మద్రాసు శాసన సభా కాంగ్రేసు పక్షంలో ప్రకాశం గారు శాసన సభలోను, మా నాయనగారు శాసన మండలిలోను --సభ్యులుగా ఉండేవారు. ఈ సమయంలోనే నేను అనేక పర్యాయాలు ఆ మహా మానవుణ్ణి దర్శించగలిగాను. జీవితం పొడుగునా నేను ప్రకాశంగారిని మాననీయులైన మా తండ్రిగారితో సమానులుగానే చూసుకున్నాను. ఆయన విజ్ఞానము, ఆయన జీవితానుభవము నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయనీ, పదేళ్ళ పసితనం నించీ నేను ఆయనను మన మహా నాయకులలో ఒకరుగా భావిస్తూ, ప్రజా సేవారంగంలో ఆయన కార్యక్రమాలను అమితాసక్తితో గమనిస్తూ ఎంతో లాభం పొందానని చెప్పుకుంటున్నాను.

ప్రకాశంగారు రాజకీయాలలో ప్రవేశించక పూర్వం గొప్ప సంఘ సంస్కరణవాది. మన సంఘంలోని మూఢాచారాలను, కుల, వర్గ, వర్ణ విభేదాలను రూపు మాపడంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. పందొమ్మిదవ శతాబ్దిలో భారతదేశంలో అవతరించిన మహా పురుషులలో ఆయన ఒకరు. అమృతసర్‌లో దారుణ హత్యాకాండ జరిగిన తరువాత గాంధి మహాత్ముడు సహాయనిరాకరణోద్యమం ప్రారంభించిన మీదట, సైమన్ కమీషను భారతదేశం వచ్చినప్పుడు మద్రాసులో పెద్దగా ఆందోళన జరిపారు. ప్రకాశంగారు 144 వ సెక్షను ధిక్కరించి నప్పుడు, బ్రిటిష్ సైనికులు తుపాకులు చూపి ఆయనను సవాల్‌చేయగా, వెంటనే ప్రకాశంగారు తన ఎదురు రొమ్ము చూపి, 'కాల్చుకో'మని ఎదురు సవాల్ చేశారు. దాంతో, ఆ సైనికులు స్తబ్దులై నిలబడిపోయి, ప్రకాశంగారిని ముందుకు పోనిచ్చారు. ఈ నిర్భయతే, ఈ గుండెలు దీసిన బంటు తనమే ప్రకాశంగారి 'ఆంధ్ర కేసరి' బిరుదుకు కారణమయింది. ఆయన దక్షిణ భారత నాయకాగ్రణి అయారు.

మొదట మంత్రిగాను, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముఖ్య మంత్రిగాను ప్రకాశంగారు గురుతర నూతన బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినప్పుడు, ఆయన ఇంకా ఎత్తుగా పెరిగి, అత్యంత సమర్థులు, ప్రజానురంజకులు అయిన కాంగ్రెస్ మంత్రులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి చెన్నరాష్ట్రంలో రాజాజీ మంత్రి వర్గంలో ప్రకాశంగారు, నేనూ మంత్రులం. 1946 లో మరల కాంగ్రెస్ మంత్రి వర్గాలు ఏర్పడినప్పుడు నేను ముఖ్య మంత్రిగా ఉంటే రాష్ట్రానికి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదనే ఒక అభిప్రాయం వ్యక్తమయింది. నేను ఎంత త్యాగమైనా చేసి ప్రకాశంగారి నాయకత్వాన్నే బలపరుస్తాననీ, ఆయన కోరితే తప్ప నేను ముఖ్య మంత్రిత్వం స్వీకరించననీ, నేను ముఖ్య మంత్రిని కావాలని సూచించిన నాయకులందరికీ ఒక విధమైన కృతజ్ఞతా పూర్వక నమ్ర భావంతో స్పష్టంగా చెప్పాను. అ మాట నిలబెట్టుకుని, నాకు కొన్ని ప్రమాదాలు, కష్టాలూ ఎదురైనా చెదరిపోకుండా నిలబడి, ప్రకాశంగారు నాటి ఉమ్మడి చెన్నరాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నిక అవడానికి సాయపడ్డాను. అయితే, ఆ మంత్రివర్గం ఒక్క సంవత్సరంకన్న నిలవలేక పోయింది. తమ నాయకత్వంలో రెండవస్థానం నాది అని ఎప్పుడూ ప్రకాశంగారి విశ్వాసం. అ విశ్వాన్ని నిలుపుకోవడానికి నేను నా శక్తివంచన లేకుండా పనిచేస్తూ, ఆయన ఆశయాలను, ప్రభుత్వం నడపడంలో ఆయన విథానాలను బలపరుస్తూ ఉండేవాణ్ణి. వాస్తవంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ పిత అయిన ఆ మహానాయకునిపట్ల ఈ విధంగా, గాఢ కృతజ్ఞతాభావంతో నా ఋణం తీర్చుకున్నాననే సంతృప్తి నాకు ఉంది.

ప్రకాశంగారు ఎప్పుడూ దూరదృష్టిగల ప్రజానాయకుడు. సామాన్య ప్రజల సౌకర్యాలు, శ్రేయస్సు ఆయన నిరంతర ధ్యేయాలు. అందుకే, ప్రకాశంగారిపట్ల ఆయన జీవితం పొడుగునా ప్రజలు అపారమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించడంలో ఆశ్చర్యమేమి లేదు.

ప్రకాశంగారు తమ జీవిత కాలంలోనే భారత స్వాతంత్ర్యం సిద్ధించడం, సర్వతంత్ర స్వతంత్ర గణతంత్రంగా ప్రకటించటం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ప్రాప్తించటం-అన్నీ స్వయంగా చూసి, ఏళ్ళు నిండిన పండు వయస్సులో , పరిపూర్ణ గౌరవాలతో పరమపదించారు.

ప్రకాశంగారి నిర్భీకత, నిస్వార్థ త్యాగశీలం ఎప్పటికన్న ఎక్కువగా ఈనాడు మన దేశీయులకు అవశ్యక సుగుణాలు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర తరతరాలుగా మన యువజనులకు ఉత్తేజం కలిగించగల దనటంలో నా కేవిధమైన సందేహం లేదు.

రాష్ట్రపతి భవన్
6-7-1972
(సం) వి. వి. గిరి
భారత రాష్ట్రపతి