నా జీవిత యాత్ర-1/ఆనాటి రాజమహేంద్రవరం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5

ఆనాటి రాజమహేంద్రవరం

ఆకాలంలో రాజమహేంద్రవరంలో విద్యాసంస్థల్ని గురించీ, విద్యావిధానాన్ని గురించీ విపులంగా వ్రాస్తాను. ఉత్తరోత్తరా ఈ విద్యావిధానం మన జాతినెలా నిర్వీర్యం చేసిందో తెలుసుకోవాలంటే ఆనాటి మన జాతీయ విద్యావిధానమూ, దాన్ని ఇంగ్లీషు స్కూళ్ళువచ్చి ధ్వంసం చేసిన విధమూ, అందువల్ల మనజాతి అవిద్యలో ములిగి పోవడమూ కూడా బాగా అవగాహన చేసుకోవాలి. ఈ నూతన విద్యావిధానానికి దాసుడైన నాబోటివాడి వర్ణన ఆ విషయంలో మరీ సమంజసంగా ఉంటుందను కుంటాను.

నేను నాయుడు పేట చేరేటప్పటికి దేశంలో ఇంగ్లీషు చదువు ప్రారంభమై ఏ పది సంవత్సరాలో అయివుంటుంది. ఇంగ్లీషువాళ్ళు ఈ దేశం పూర్తిగా స్వాధీనం చేసుకున్న తరవాత, "ఈ దేశంలో ఏ విద్యాపద్ధతి అమలులో పెట్టాలా?" అని తర్కించారు. చివరకి మెకాలే సలహామీద ఈ దేశంలో ఇంగ్లీషు చదువు స్థాపించడానికి నిర్ణయించారు. ఆనాటి పాలకుల విద్యాదర్శనం - ఆనాడన్న మాటేమిటి! ఈనాటి వరకూ కూడా అదే ఆదర్శం! - తమ పరిపాలనకి కావలసిన గుమాస్తాలనీ, దుబాషీలనీ తయారు చెయ్యడమే! అందుకోసమనే వాళ్ళు ఆ పని పైనించి ప్రారంభించారు. ముందు కాలేజీలు స్థాపించారు. వాటికి శాఖలుగా హైస్కూళ్ళు నడిపించారు. వాటికి ఉపశాఖలుగా ఇంగ్లీషు ఆదర్శాలతో నిండిన గ్రాంటుస్కూళ్లు స్థాపించారు. అంతకి పూర్వం వాటి స్థానంలో వుండే వీథిబళ్ళు ఎత్తివేశారు.

మన జాతీయమైన వీథిపాఠశాలల్లో నాలుగేళ్ళపాటు చదువుకుంటే వ్రాతా, చదువూ రావడమే కాకుండా, భారత భాగవతాది గ్రంథ పఠనానికి పునాది పడడమూ, మంచి లౌకికజ్ఞానం కలగడమూ కూడా జరిగేవి. ఈ గ్రాంటుబళ్ళు వచ్చి ఆ విధానం మార్చివేశాయి. మాట వరసకి, మా నాయనగారు ఏ పెద్దబళ్ళళ్ళోనూ చదవలేదు. ఏ డిగ్రీలు సర్టిఫికెట్టులూ పొందలేదు. జీతం ఎనిమిదిరూపాయలైనా. అప్పట్లో ఆయన ఆ చదువుతోటే ఎనిమిది ఊళ్ళపైన రెవిన్యూ అధికారు చేసి జీవనం చెయ్యగలిగారు. ఆ చదువు ఉపాధికి మార్గంగా ఉండేది. మా నాయనగారు చిన్ననాడు చదువుకున్న భారత భాగవతాలు నిరంతరమూ పారాయణ చేస్తూ, తమ ఆత్మోద్ధరణకి కృషి చేస్తూ వుండేవారు. మా అమ్మమ్మగారు, పెద్దత్తగారు ఎక్కువ చదువుకోకపోయినా, భారత భాగవత రామాయణాదికథలు యావత్తూ కంఠస్థంగా నేర్చుకుని, మమ్మల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని అవన్నీ ఉపదేశం చేసేవారు. ఆ విద్యా విధానపు ఆదర్శం జాతీయమైనది; విశాలమైనది. ఈ నూతన విద్యకి ఆదర్శం నౌఖరీ, ధనసంపాదనా, స్వార్థమూనూ.

ఎప్పుడైతే మిడిల్‌స్కూళ్ళ చదువు పూర్తిచేసినవాళ్లూ, మెట్రిక్యులేషన్ పాసైనవాళ్లూ కూడా పెద్దపెద్ద ఉద్యోగస్థులై అమితంగా ధన సంపాదనలో పడ్డారో, అప్పుడే దేశంలో విద్యాదర్శాలు క్షీణించాయి. ఆంగ్లేయ పాలకులు కూడా తమ రాజ్యానికి వేళ్ళు పారించడానికి మన దేశీయ సంస్థల నన్నింటినీ క్రమక్రమంగా పెకలించారు. ఆ రోజుల్లో పంచాయతీ పద్ధతిని న్యాయ నిర్ణయం చేసుకోవడం అమలులో ఉండేది. ఆ పద్ధతి తొలగించి కోర్టుల పద్ధతి స్థాపించారు. దాంతో కాని మన పతనం ప్రారంభంకాదు. ఆ కోర్టులకీ జడ్జీలూ, వకీళ్ళూ కావాలి గదా! అందుకోసం ముందుగా ఆంగ్లేయ పాలకులు మన సంఘంలో వుండే పెద్దల్ని ఏరి, వాళ్ళకి పెద్దపెద్ద పదవులుఅంటగట్టారు. క్రమంగా కొంచెం చదువు - అంటే ఏ మిడిల్‌స్కూలు చదువో - చదువుకుంటే జిల్లా మునసబీ అయ్యేది. అందుచేత దేశంలో వివేకవంతు లనబడే వాళ్ళ దృష్టి అటు మళ్ళింది. జనం ఇంగ్లీషు చదువులికి తియ్య నీటికి చేప లెక్కినట్లు ఎక్కారు. క్రమంగా మెట్రిక్యులేషను పాసయిన వాళ్ళ సంఖ్యా, ఎఫ్. ఏ. ల సంఖ్యా, బి. ఏ. ల సంఖ్యా పెరిగింది. దాంతో పాలకులు ప్లీడరీలకీ, నౌకరీలకీ అర్హతలు ఏర్పరిచారు. అప్పట్లో ఈ చదువుల్లోకి వెళ్ళినవాళ్ళంతా ఉద్యోగస్థులై ధనార్జన బాగా చెయ్యడం వల్ల దేశస్థుల వ్యామోహం అటు తిరిగింది. అది : సుమారుగా ఆ కాలపు స్థితి.

నేను రాజమహేంద్రవరం చేరేసరికి మనదేశంలో రాజ మహేంద్రవరంలో గవర్నమెంటు కళాశాల, బందరులో మిషన్ కళాశాల మాత్రం వున్నాయి. ఈ కాలేజీలలో చదవడానికి జనం కావాలి గనక, ప్రభుత్వం ప్రైవేటు హైస్కూళ్ళకి ఎన్నిటికో ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పటి మాదిరిగా ఈ స్కూళ్ళమీద లేనిపోని నిషేధాలు ఏమీ వుండేవి కావు. విద్యాధికులు కొందరు చేరి హైస్కూళ్ళు స్థాపించడానికి అవకాశం వుండేది. పైగా, కిరస్తానీ మిషనరీలు కూడా ఆ పనికే పూనుకున్నారు. ఒంగోలు, ఏలూరు, బెజవాడల్లాంటి పట్టణాల్లో ఇల్లాంటి మిషన్ స్కూళ్ళు అనేకం నడపబడుతూ వుండేవి.

రాజమహేంద్రవరంలో అప్పటికి - అనగా 1886 సంవత్సరానికి - మిషన్ హైస్కూలు, థీయిస్టిక్ హైస్కూలు, ఇన్నీసుపేట హైస్కూలు, మరాటా హైస్కూలు అని నాలుగు ప్రైవేటు హైస్కూళ్ళు ఉండేవి. కొత్తగా పాసయిన బి.ఏ.లు యఫ్.ఏ.లు వీటిలో ఉపాధ్యాయులుగా చేరి పనిచేస్తూ వుండేవారు. అప్పట్లో న్యాయవాది పనే గొప్పగా వుండేది. కొందరు పరీక్షకి చదువుకునే లోపుగా కొంతకాలం మాస్టరీ ఉద్యోగం చేస్తూ వుండేవారు. ముత్తుస్వామయ్యరు అనే ఆయన మార్కెట్టుకి ఎదురుగా వున్న మారాటా హైస్కూలు నిర్వహిస్తూ వుండేవారు. ఇన్నీసుపేట హైస్కూలుకి అప్పుడు వేదం వెంకటాచలం అనే ఆయన హెడ్మాస్టరుగా వుండేవారు. మా థీయిస్టిక్ హైస్కూలుకి అప్పుడే బి.ఏ. పాసయిన శ్రీ పి.వి. శివకుమారస్వామి శాస్త్రిగారు ప్రధానోపాధ్యాయులు. తరవాత ఆయన మనదేశంలో కల్లా గొప్ప విద్యావేత్తగా ప్రఖ్యాతి పొందారు. సైదాపేట కాలేజి ప్రిన్సుపలు పనిచేసి విరమించారు. ఈ మధ్యనే కీర్తి శేషులయ్యారు. రామానుజాచారి అనే ఆయన కూడా మాస్టరుగా వుండేవారు. ఆ తరవాత ఆయన డిప్యూటీకలెక్టరు కూడా అయ్యారు. ఆ రోజుల్లో వీరేశలింగం పంతులుగారు కాలేజీలో తెలుగుపండితులుగా ఉండేవారు. 1886 లో నేను థీయిస్టిక్ హైస్కూలులో శివకుమారస్వామి శాస్త్రిగారి ప్రధానాధ్యాపకత్వం కింద, 5 వ క్లాసు చదివాను. ఆ రోజుల్లో హనుమంతరావు నాయుడుగారు నేనంటే ఎంతో ఆప్యాయంగా వుండేవారు. 1886 లో కమిటీ ఆధ్వర్యంకింద వుండే ఇన్నీసుపేటహైస్కూలు, ఏలూరి లక్ష్మీ నరసింహంగారు స్థాపించిన థీయిస్టిక్ హైస్కూలూ కలిసిపోయాయి. ఇన్నీసుపేట హైస్కూలు కమిటీవాళ్లు స్కూలు, ఆధ్వర్యవమూ కూడా ఏలూరి లక్ష్మీనరసింహంగారికే అప్పచెప్పారు. అల్లా ఏకమైన ఆ స్కూల్లో మెట్రిక్యులేషన్ చదివాను. ఆ స్కూలు మొదట కాలేజీదగ్గిర వుండే పూరి ఇంట్లో వుండేది. తరవాత అక్కడినించి నాళంవారి సత్రానికి ఎదురుగా వున్న చిత్రపు నరసింహారావుగారి ఇంట్లోకి మార్చబడింది. ఆ స్కూలుకి వేదం వెంకటాచలంగారు ప్రథానోపాధ్యాయులుగా వుండేవారు.