నారదుని పూర్వజన్మవృత్తాంతము తరువాయి భాగము

వికీసోర్స్ నుండి

మ. వినుమీ సృష్టి లయంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా

మినియై పోయెడిఁ బోవఁగాఁ గలుగుఁ జూ మీఁదం బున: సృష్టి యం

దు నిరూఢ స్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్

ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా ! (1-127)


వ. అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు ని:శ్వాసంబునుగా నొప్పి సర్వ నియామకంబైన మహాభూతంబు వలికి యూరకున్న, నేనును మస్తకంబు వంచి మ్రొక్కి, తత్‌కరుణకు సంతసించి, మదంబు దిగనాడి, మత్సరంబు విడిచి, కామంబు జయించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబులు వెడలనడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠియింపుచుఁ బరమభద్రంబులైన తచ్చరిత్రంబులఁ జింతింపుచు, నిరంతర సంతుష్టుండనై (కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంత:కరణంబు తోడ విషయ విరక్తుండనై) కాలమున కెదురుసూచుచు, భూమిం దిరుగుచు నుండ నంతఁ గొంత కాలంబునకు మెఱుము మెఱసిన తెఱంగున మృత్యువు తోఁచినం బంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి, హరికృపావశంబున శుద్ధసత్త్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితిని. అంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున (శయనించు) నారాయణమూర్తియందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మని:శ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితిని. అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు చనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మ ప్రాణంబుల వలన మరీచిముఖ్యులగు మునులు, నేనును జనియించితిమి. అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబులయందు మహావిష్ణుని యనిగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తయై బ్రహ్మాభిరంజకంబులైన సప్తస్వరంబులును దమయంతన మ్రోయుచున్న యీ వీణాలాప రతిం జేసి నారాయణ కథాగానంబు సేయుచుఁ జరియింపుచుండుదు. (1-128)


ఆ.వె. తీర్థపాదుఁడైన దేవుండు విష్ణుండు, తన చరిత్ర మేను దవిలి పాడఁ

జీరఁబడ్డవాని చెలువున నేతెంచి, ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు.(1-129)


కం. వినుమీ సంసారంబను, వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే

దనఁ బొందెడువానికి వి, ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా ! (1-130)


చం. యమనియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యుఁ గామ రో

షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ

గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క

ర్మముల రహస్యమెల్ల మునిమండన ! చెప్పితి నీవు కోరినన్. (1-131)


వ. ఇట్లు భగవంతుండగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు యదృచ్ఛామార్గంబున జనియె నని సూతుండిట్లనియె.(1-132)


వ. వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుందగీతములు జగములకున్

జేయించుఁ జెవుల పండువు, మాయించు నఘాళి ; నిట్టి మతి మఱి గలఁడే ! (1-133)


వ. అని నారదుం గొనియాడిన సూతుం జూచి "నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుండేమి సేసె" నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె. బ్రహ్మనదియైన సరస్వతి పశ్చిమ తీరంబున ఋషులకు సత్రకర్మ వర్ధనంబై బదరీ తరుషండ మండితంబై (శమ్యాప్రాసంబని) ప్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు. అందు జలంబులు వార్చి కూర్చుండి వ్యాసుండు తన మదిం దిరంబు చేసికొని భక్తియుక్తంబైన చిత్తంబునం బరిపూర్ణుండైన యీశ్వరుం గాంచి యీశ్వరాధీన మాయావృతంబైన జీవుని సంసారంబు గని జీవుండు మాయచేత మోహితుండై గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచుం ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు నయ్యనర్థంబునకు నారాయణ భక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియును నిశ్చయించి, (1-134)


మ. అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా

ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ

క్తి విశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరంబైన భా

గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగన్. (1-135)


వ. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె నని చెప్పిన విని శౌనకుండు, "నిర్వాణ తత్పరుండును సర్వోపేక్షకుండు నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె ?"ననవుడు సూతుం డిట్లనియె. (1-136)


కం. ధీరులు నిరపేక్షులు నా, త్మారాములు నైన మునులు హరిభజనము ని

ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టివాఁడు నవ్యచరిత్రా ! (1-137)


కం. హరిగుణ వర్ణన రతుఁడై, హరితత్పరుఁడైన బాదరాయణి శుభ త

త్పరతం బఠించెఁ ద్రిజగద్, వరమంగళమైన భాగవత నిగమంబున్. (1-138)


కం. నిగమంబులు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను, నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా ! (1-139)