నాగర సర్వస్వం/తాంబూల సంకేతములు

వికీసోర్స్ నుండి

చుట, లేక పంపుట జరిగినప్పుడు-కాముకులు ఆ వస్త్రాలను ధరించినవారు లేక పంపినవారు తమయందు మిక్కిలి ప్రేమకలవారై యున్నారని, కాషాయ వస్త్రములనుబట్టి విరక్తి చెందినారని గ్రహించాలి.

'చినిగిన వస్త్రము' వియోగమునకు సంకేతము, ఆ చినిగిన వస్త్రమే చిరుగులు దారముతో కుట్టబడినదై యున్నప్పుడు వియోగానంతర సంయోగమునకు సంకేతమైయున్నది.

అలా చినిగిన వస్త్రము ఒక్కటే ధరించబడినప్పుడు అది ధరించిన వారియొక్క స్థితిని మాత్రమే వెల్లడిస్తుంది, అలాకాక, చినిగిన వస్త్రాలను రెంటిని తెచ్చి, వాని చిరుగులనుకుట్టి రెంటిని ధరించుట—

'మనం చిరకాల వియోగ భాధను అనుభవించాము. కాని నేడు కలిసికొనే అవకాశం లభించింది. ఈ వియోగములో నేను ఎలా బాధపడ్డానో నీవుకూడ అలాగే బాధపడ్డావు. నాలాగే నీవుకూడ సంయోగానికై తహతహపడుతూన్నావు. ఇది నేను గుర్తించేను—అని ఉభయుల స్నేహాన్ని సూచించడానికి సంకేతమైయున్నది.

మిగిలిన సంకేతాలకంటె యీ వస్త్రధారణా సంకేతాలు అల్ప భావాన్ని వెల్లడిస్తూ పరిమితమైన కార్యాన్ని సానుకూలపరచేవై యున్నప్పటికి, చిరకాలానికి కలిసికొన్న ఆలుమగల మనస్సులమీద యీ సంకేతాలు తేనెజల్లులు కురిపిస్తాయి.


తాంబూల సంకేతములు

పరమ నాగరకులైనవారు వెనుకటి సంకేతాలనేకాక తాంబూల సంకేతాలనుకూడ వుపయోగిస్తారు. యీ సర్వ సంకేతాలకు ప్రియుడు లేక ప్రియురాలు పరకీయంగా ఉన్నప్పుడే ఉపయోగం అనుకొనడం పొరపాటు. ఆలుమగలుకూడ తమ మనోభావాన్ని నోటితో చెప్పడంకంటె, యీ సంకేతాలద్వారా తమ మనస్సులోనిభావాన్ని వెల్లడించి దానినిగ్రహించిన తమ నెచ్చెలియొక్క కూటమిలో మిక్కిలి ఆనందించేవారు అవుతారు.

పతి భోజనంచేసి ఎవరితోడనో మాటాడుతూ కూర్చున్నాడు. భార్య అతనికి తాంబూలం పంపింది. ఆతాంబూల నిర్మాణం విచిత్రంగా వుంది. భావస్ఫోరకంగా వున్నది. అది ఏదో ఒక సంకేతార్థాన్ని సూచిస్తూన్నట్లు వున్నది. అప్పుడు ఆ సంకేతార్ధం తెలిసికొన్న పతికి, దానిని పంపిన భార్యకు వింత ఆనందం కలగడానికి సావకాశంలేదా! అందుకే నాగరజనం తాంబూల నిర్మాణములో నైపుణ్యము కలవారై తమ మనోభావాలను వానిద్వారా వ్యక్తంచేసి ఆనందించేవారై యుంటారు.

తమలపాకులకు సున్నమురాసి వక్కలు మొదలగునవి వానియందుంచి చుట్టగా చుట్టుటలోని వైవిద్యాన్ని అనుసరించి యీతాంబూల సంకేతాలు ఏర్పడ్డాయి.

ఇలా విభిన్నములైన తాంబూల నిర్మాణములు 1 కౌశలము 2 అంకుశము 3 కందర్పము 4 పర్యంకము 5 చతురస్రము అని ప్రధానంగా ఐదురకాలుగా ఉన్నాయి. ఈ ఐదింటిని ఐదు రకాలైన భావాలకు సంకేతంగా నాగరజనం వుపయోగిస్తూంటారు.

కౌశలము:- మిక్కిలి నేర్పుగా చుట్టబడిన తాంబూలమునకు 'కౌశలము' అనిపేరు. యీ నేర్పు తమలపాకుల యీనెలు తీయుటయందు, వానికి సున్నము రాయుటయందు వానియందు వక్కలు మొ॥వి సమముగా (ఆకారమునకు రుచికికూడ) వుంచుటయందు అవి యేమాత్రము నలుగకుండ చుట్టచుట్టుటయందు నాగరులు వ్యక్తంచేస్తారు.

ఇట్టి కౌశల తాంబూలము—"నాకు నీ యందు ప్రేమయెక్కువ" అనడానికి సంకేతంగా వుపయోగింపబడుతుంది.

ఒక నాగర యువకుడు తన మేనమామ యింటికివెళ్లేడు. ఆతడు అవివాహితుడు. ఆ మేనమామవద్ద వివాహము కాదగిన సుందరియైన కన్య ఉన్నది. ఈ మేనల్లునకు ఆమెనిచ్చి వివాహంచేస్తే బాగానే ఉంటుంది. ఆ యువతికూడ యీ మేనత్తకొడుకుమీద ప్రేమలేకపోలేదు. కాని ఏవో కారణాలవల్ల ఆ వ్యవహారం పొసగిరావడంలేదు. ఈపరిస్థితులలో ఇంటికివచ్చినబావ భోజనంచేసినంతనే ఆనెరజాణఅయిన మరదలు కౌశలం వుట్టిపడే తాంబూలాన్ని నిర్మించి అతనికి అందించింది. అనగా ఓ బావా! పెద్దలు కట్నాలకనియో, కాన్కలకనియో ఏవో అభ్యంతరాలు చెపుతున్నారు. కాని యీ అభ్యంతరాల నన్నింటిని దాటి నా మనస్సు నీయందు లగ్నమైయున్నది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను'-అని చెప్పినట్లే కౌశల తాంబూలంయొక్క ఉపయోగానికి ఇది ఉదాహరణముగా చెప్పబడ్డది. ఇట్టివే అయిన భిన్నభిన్నపరిస్థితులలో ఈకౌశలతాంబూలాన్ని సాంకేతికముగా నాగరకులు వాడుతూంటారు.

అంకుశము:—వెనుక భాషా సంకేతములయందు వివరించిన అంకుశముయొక్క ఆకృతివంటి ఆకృతి ఏర్పడునట్లు నిర్మించి తాంబూలము 'అంకుశము' అనబడుతుంది. 'ప్రియాహ్వానానికి' సంకేతముగా నాగరజనం దీనిని వినియోగిస్తారు.

ఇట్టి తాంబూలము పంపబడినపుడు ఆ తాంబూలమును పంపినవారు-తమ్ము సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారని గ్రహించాలి.

కందర్పము:—తమలపాకులకు సున్నము రాసి, యీనెలుతీసి, వక్కలు మొదలగువానిని వానియందుంచి, మూడుకోణములు వచ్చునట్లు చుట్టినచో ఆ తాంబూలము కందర్పము అనబడుతుంది ఈకోణములు వచ్చుటకు తమలపాకుల చివళ్లు మిక్కిలి సాయపడతాయి.

'నేను మన్మథునిచే పీడింపబడుతున్నాను' అనడానికి యీ తాంబూలము సంకేతమై యున్నది.

చిరకాలానికి దూరదేశంనుండి వచ్చిన భర్త భోజనంచేసి తన తల్లిదండ్రులతో మాటాడుతూ కూర్చున్నాడు. రాత్రి చాలగడచింది, అయినా ఆ కబుర్లకు అంతు కనబడడంలేదు. ఇక్కడ తాను (భార్య) అతని కౌగిలికి ఎప్పుడు చేరుకొందునా అని తహతహపడుతూన్నది. అతడేవో కబుర్లలో మునిగియున్నాడు. అప్పుడు భార్య యీ "కందర్పము" అనే తాంబూలాన్ని అతని యొద్దకు పంపితే ఆమె తన మనస్సులోని భావాన్ని సుందరంగా చెప్పినది అవుతుంది.

కందర్ప తాంబూలాన్ని పంపిన భార్యవలెనే భర్తకూడ విజ్ఞుడైనవాడు ఆతాంబూలాన్ని చూచినంతనే ఆతని మనస్సులో మల్లెలు, మొల్లలు విరియబూస్తాయనడానికి తాను మన్మధసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనట్లుగా అతడు ఆనందిస్తాడనడానికి సందేహంలేదు.

పర్యంకము:—"పర్యంకము" అనగా మంచము. తమలపాకులను చక్కగా మడచి మంచముయొక్క ఆకృతిలో నిర్మించిన తాంబూలము 'పర్యంకము' అనబడుతుంది. తాంబూలానికి ఇట్టి ఆకృతివచ్చుటకు లవంగాలు మిక్కిలి తోడ్పడతాయి. తమలపాకులను చక్కగా-బల్లపరుపుగా దీర్ఘచతురముగా మడచి, వానిమీద చతురస్రముగా కత్తిరించిన లేత తమలపాకును పరచి నాలుగువైపుల యందు నాలుగు లవంగాలు గ్రుచ్చాలి. అప్పుడు దానికి మంచముయొక్క పై భాగమునంటి ఆకారం యేర్పడుతుంది. పరుపబడిన లేత తమలపాకు మంచంమీది దుప్పటివలె భాసిస్తుంది. ఇక కోళ్లు, వాని కొఱకుకూడ లవంగాలనే వినియోగించాలి. ఆ తాంబూలముయొక్క అడుగు భాగములో నాలుగువైపుల యందు నాలుగు లవంగాలను పూర్తిగాకాక కొంతవరకు గ్రుచ్చివదలితే అవి నాలుగూ మంచంయొక్క నాలుగు కోళ్ళవలె భాసిస్తాయి.

ఇట్టి యీ పర్యంక తాంబూలాన్ని నాగరజనం సంయోగాభిలాషను వ్యక్తం చేయడానికి సంకేతంగా వాడతారు.

చతురస్రము:—తమల పాకులను గుండ్రని చుట్టుగాకాక నాలుగుకోణములు వచ్చునట్లు చుట్టినచో చతురస్రము అనబడుతుంది. 'చతురస్రము' అనగా నాలుగు కోణములుకలది. అలా కోణాలు రావడానికి తమలపాకులను నాలుగింటిని చివరలు వేరువేరుగా కనబడునట్లు పరచి వానిని చక్కగా మడవడం అవసరం. ఈ తాంబూల నిర్మాణానికికూడ లవంగము తోడ్పడుతుంది.

ఈ చతురస్ర తాంబూలము—'నీవూ నేనూ కలియడానికి ఇది యెంతమాత్రమూ తగిన సమయంకాదు'–అనడానికి సంకేతమైఉన్నది. కామినీకాముకులు ఒకరినొకరు కలియడానికి తగిన సమయంకాదని సూచించడానికై యీ తాంబూలాన్ని వుపయోగిస్తారు.

యీ చతురస్ర తాంబూలమే—వక్కలు లేకుండ పంపబడితే-"నాకు నీయందు ప్రేమలేదు"—అనడానికి సంకేతమై ఉంటుంది. అట్టి తాంబూలము తనయొద్దకు వచ్చినపుడు-దానిని పంపినవారు తన్ను ప్రేమించడం లేదని గుర్తించాలి.

పై చతురస్రతాంబూలమే ఏలకులు ఎక్కువగావేసి పంపితే-'నాకు నీయందు ప్రేమ ఉన్నది, కాని మన కలయికకు ఇది తగిన సమయంకాదు'—అన్న విషయానికి సంకేతమై ఉన్నది.

విజ్ఞులైన నాగరజనం ఈ తాంబూలసంకేతలద్వారా పరస్పరం భావాలను అవగాహన చేసికొంటూ ఆనందించేవారై యుంటారు. తాంబూల సంకేతాలలో ఈఐదు మాత్రమే ప్రధానమైనవైవున్నా, ఇంకాకొన్ని అవాంతర భేదాలుకూడ వీనిలో వున్నాయి.

తమలపాకులను రెంటిని తెచ్చి వానిని ఒకదాని వీపు (అడుగు భాగము) వేరొకదాని వీపుకు తగులునట్లు (ఎడమొగము పెడమొగముగా) తలక్రిందుచేసి వానిని చుట్టగాచుట్టి, ఆ చుట్ట ఊడిపోవకుండుటకో అన్నట్లు దానిపై సన్నని నల్లదారము మెలిపెట్టి పంపినచో అది-వియోగ సూచనకు సంకేతమైయున్నది.

అట్లుకాక 'తమలపాకులను ఒకదాని ముఖము (పై భాగము) వేరొకదాని ముఖముతో అంటి యుండునటులు పరచి ఎర్రదారముతో చుట్టిపంపుట'—సంయోగమునకు సంకేతమై యున్నది.

తమలపాకులను మధ్యకు చీల్చి వానిని చుట్టి, సన్నని నల్లదారముతో ముడివేసి పంపుట'—నీకును నాకును ఇక సంబంధములేదు, నేను నిన్ను సర్వదా విడిచిపెడుతున్నాను—అనడానికి సంకేతమై ఉన్నది.

అలా మధ్యకు చీల్చిన తమలపాకులనే మిక్కిలి సన్నని ఎర్రదారముతో కుట్టి చుట్టచుట్టి పంపుట-'నా ప్రాణములు పోవుచున్నవి. ఒకసారివచ్చి నీవు నన్ను కలిసిన నిలచునేమో'–అనుటకు సంకేతముగా చెప్పబడ్డది.

'తమలపాకును ముక్కలు ముక్కలుగా చించి, ఆ ముక్కలను మరల సరిచేసి, పూర్వపు ఆకారము వచ్చునట్లు వేరొక ఆకుమీదపరచి వానియందు పోకలనువుంచి, వానిమధ్య నిండుగా కుంకుమపూవుపెట్టి, చుట్టచుట్టి, ఆ చుట్టపై సువాసనలుచిందే మంచి గంధము లేక గంధమువాసనగల అత్తరుపూసి పంపుట'-నాకు నీమీద వర్ణింపనలవికాని ప్రేమ ఉన్నదని చెప్పుటకు సంకేతముగా చెప్పబడినది.

ఈ సంకేతాలను వినియోగించడానికి ధనికులే కావాలన్న నియమంలేదు. సాధారణ గృహస్థులైన ఆలుమగలుకూడ యీ సంకేతార్థాలను గుర్తించినవారై వీనిని వినియోగిస్తే విచిత్రమైన ఆనందం మానసికంగా అనుభవింపగలుగుతారు.


పుష్పమాలా సంకేతము

తాము ధరించే పూలమాలద్వారాకూడ నాగరజనం తమ మనోభావాలను వ్యక్త పరుస్తారు. మంచివైన పూవులను తెచ్చి ఎఱ్ఱదారముతో దండగా గ్రుచ్చి (ఆ దారముకూడ సన్నగా కనబడునట్లు) ధరించుట—అధిక ప్రేమకు సంకేతమై యున్నది.

ఎఱ్ఱదారమునకు బదులు పసుపుపచ్చని దారము వినియోగించినచో—'నాకు నీ మీద ప్రేమ ఉన్నది' అని సాధారణమైన ప్రేమను సూచించుటకు సంకేతమై యున్నది.