నవ నవ వసంతచరణముల నాట్యములా

వికీసోర్స్ నుండి

నవ నవ వసంతచరణముల నాట్యములా

భవ దమృత లావణ్య వనస విలసనములా

మెరపులై పిలుపులై మెరసినవి! పలికినవి!


దిశల బడి పరువు లిడు శిశిరంపు టడుగులో!

తుది వీడుకొలువులో ముదుసలి నిరాశలో!

నీడలై జాడలై వెరచినవి! పరచినవి!


నా బ్రతుకు నేడు నందనచైత్రవన మౌనొ!

ప్రాభాతగగన పూర్వప్రాంగణ మ్మౌనొ!

చెర గొలగు జీవమో! మరపు విడు తేజమో!


నడక నెరుగని తేనె, ఎరక యెగురని తావి,

కయిసేసుకో లేక కలతవడు సోయగము,

పాటయై పక్షియై ఆశయై హాయియై

దెసదెసల మీరునో దివ్యపద మంటునో!


కదలు వేకువకనుల నిదుర చెదరెడు వేళ,

మాయు ప్రతితారకయు మబ్బుకల యౌ వేళ,

అలము స్వప్నము లొక్క వెలుగు రూ పౌ వేళ,

చేరితివి నా జీర్ణజీవిత ప్రాంగణద్వార మా వేళ

ఓ వసంతవిలాస మాధుర్యమా!

ఓ యుషఃకల్యాణ లావణ్యమా!


నేడు నా జీవితముకూడ నిర్జరాంగ

నా దరస్మిత మయి ప్రపంచాలు ప్రాకు!

పిలుచు నీరేడులోకాల ప్రేమకొరకు!

పరపు నా హృదయము చరాచరములకును!