నరుడు/రెండవ భాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రెండవ భాగం

వైద్య విద్యార్థిని


బాలిక వైద్య విద్యార్థిని. మూడవ సంవత్సరం చదువుతోంది. అసలయిన యురేషియను జాతికి చెందిన ఉత్తమ వంశీకురాలు.

క్లైవు పరిపాలించిన రోజులలో ఇంగ్లండునుంచి దిగిన బ్రిటిషు యుద్ద భటులు కర్కోటకులు. వారి నాయకులు కొంచెం పెద్ద కుటుంబాల వారైనా, ఇంగ్లండులో ఎందుకూ పనికిరాక, తమ కుటుంబాలకు వేరుపురుగులుగా పరిగణింపబడి, చుట్టాల అభిమానం, వాని పలుకుబడులవల్ల హిందూ దేశానికి వెళ్ళే యుద్ద సైనికులకు నాయకులుగా వచ్చిన పిట్టపిడుగులు.

ఆ పిట్టపిడుగులకు నాయకుడు క్లైవు. క్లైవుకు కుడి భుజం మేజరు రిచ్చర్డు కార్లయిలు. మేజరు రిచ్చర్డ్ కార్లయిలు ముష్టియుద్ధంలో అందెవేసిన చేయి. ఆనాటి ఇంగ్లండులో అయిదు కౌంటీలకు ఏకైక విజయంగా బహుమానాలు పొందినవాడు. అతని పేరు అతని తలిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దగ్గిర చుట్టాలు ఎవ్వరూ ఉచ్చరించేవారు కారు.

మేజరు రిచ్చర్డ్ మందతప్పిన గొర్రెకాడు. గొర్రెల్లో చీంబోతు. విజయ విలియంరాజు కాలంనాటి నుంచీ ఇంగ్లండులో ప్రసిద్ధి కెక్కిన మధ్య కౌంటీల రైతు కామందుల కుటుంబాలకు అపఖ్యాతి తెచ్చిన నల్లగొర్రె చీంబోతు. రైతు ఖామందులు (ఇయోమెన్) ఇంగ్లీషు జాతికి వెన్నెముకలు. అలాంటి మేజరు రిచ్చర్డ్ కెఫ్తానుగా హిందూ దేశానికి వచ్చాడు. ఆర్కాటు వగయిరా యుద్ధాల్లో నిరుపమానమైన విక్రమం చూపించాడు. ఒక ఉత్తమ ముస్లిం రాజకుటుంబంలోని బాలికను పెండ్లాడి హిందూదేశంలోనే ఆస్తి సంపాదించుకొని ఉండిపోయాడు.

ఆ వంశంవారు ఉత్తమ యూరేషియన్ జాతి వారయ్యారు. ఈ వంశంలోని బాలికలు కొందరు అసలు ఇంగ్లీషు భర్తలను చేసుకొని ఇంగ్లండు కూడా వెళ్ళారు. పురుషులు హిందువులలో క్రైస్తవమతం పుచ్చుకొన్న ఉత్తమ కుటుంబాలవారి బాలికలను చేసుకొంటూ వర్తకము, ప్రభుత్వోద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు చేస్తూ మంచి చదువులు చదువుకుంటూ పేరు పొందారు.

వారికి హిందువులకన్న, ముస్లింలకన్న భారతీయ క్రైస్తవులకన్న భారతదేశం అంటే ఎక్కువ ప్రేమ. మదరాసులో వారికి పదిమేడ లున్నాయి. చాలా చోట్ల భూములు, తోటలూ ఉన్నాయి.

ఆ వంశంలో రైల్వే ఇంజనీయరు ఎడ్వర్డు కార్లయిలు గారి కుమార్తె జెన్నిఫర్ కార్లయిలు ఎంతో అందమయిన బాలిక. ఆంగ్లేయులకన్న స్వచ్ఛమైన తెలుపు కాకపోయినా జెన్నిఫర్ దేహచ్ఛాయ బంగారు సూర్యకిరణాలు హిమాలయ శృంగాలపైన ప్రసరించిన దివ్యక్షణంనాటి పరమ మధుర వర్ణం! జెన్నిఫర్ తండ్రి ఎడ్వర్డు కార్లయిలుగారు బి.యి. పరీక్షలో మొదటి తరగతిలో విజయమంది ఎం. ఎస్. ఎం రైల్వే ఇంజనీయరు అయి, ఇప్పుడు చీఫ్ ఇంజనీయరుగా వున్నారు.

జెన్నిఫర్ - ఎడ్వర్డు కార్లయిలుగారి ముగ్గురి బిడ్డలలో కడసారిది. మొదటి ఇద్దరూ మొగవారు. పెద్దకొడుకు రిచ్చర్డ్ కార్లయిలు బి.యే. కాగానే భారతీయ సైనిక దళ నాయకుడు కావడానికి నిశ్చయించుకొన్నాడు. అందుకై డెహరాడూన్ సైనిక కళాశాలలో చేరి విజయమంది ఇప్పుడు మేజరై పెషావరు శిబిరంలో ఉన్నాడు. అతడు ఉత్తరాది యూరేషియన్ బాలికతో వివాహమై ఇద్దరుబిడ్డల తండ్రి అయినాడు.

రెండవ కొమరుడు ఇరవైయొక్క సంవత్సరాల ఈడున్న రోజులలో మదరాసు లయోలా కాలేజీలో బి.ఏ.లో కృతార్థుడై ఇంగ్లండులో విద్యుత్ ఇంజనీయరు విద్య నేర్చుకోడానికి సంకల్పించారు. అతని పేరు లయెనెల్.

అతడు 1933వ సంవత్సరం మే నెలలో ఇంగ్లండు వెళ్ళే పి అండ్ కో. ఓడ 'రావల్పిండి'లో రెండవ తరగతిలో ప్రయాణం చేసే ఎల్లమందమూర్తిని కలుసుకొన్నాడు. లయొనెలకు, ఎల్లమందకు ఒకరు రాజమహేంద్రవరంలో, ఒకరు మద్రాసులో ఉన్నా మొదటినుంచీ ఎందుకో విద్యుత్ శక్తి అంటే అభిమానం పుట్టి ఇంగ్లండు వెళ్ళి ఇంజనీర్లు అవుదామని వారికి గాఢవాంఛలు గలిగినాయి. వారిద్దరూ కలిసే ఇంగ్లండు చేరినారు. లండనులోనూ ఇద్దరూ కలిసి బస కుదుర్చుకున్నారు.

నారాయణరాజుగారి సహాయంవల్ల హరిజన నిధినుండి మొట్టమొదట వేయి; తర్వాత నెలకు ఏభై రూపాయల వేతనం మూర్తికి వాగ్దానం అయింది. ఆంధ్ర జమీందారులలో ఉత్తములు శ్రీపురం జమీందారులు నెలకు ఏభై చొప్పున ఇచ్చుటకు మూడు ఏండ్లకు అయ్యే పద్దెనిమిది వందల రూపాయలు మూర్తికి యీయ వాగ్దానం చేశారు.

నారాయణరాజుగారి సహాయంవల్ల భీమవరం తాలూకాలోని ధనవంతులయిన క్షత్రియులు, తటవర్తివారు, కోరుకొల్లు కరణంగారు రెండువేల రూపాయలు వసూలుచేసి ఇచ్చినారు. ఈ మూడేళ్ళలో ఇంకొక వేయి రూపాయలు వసూలుచేసి పంపుతామని మాట యిచ్చారు.

అలా చిన్నన్నగారు ఇంగ్లండులో చదివే రోజులలో పద్దెనిమిదేళ్ళ ఈడు బాలిక జెన్నిఫర్ మదరాసు వైద్య కళాశాలలో చేరింది. కార్లయిలు వంశంలో వైద్య విశారదలైన స్త్రీలు ఎంతమందో తరతరాలనుంచి ప్రసిద్ధి పొందారు. వారు నర్సు పని నేర్చుకొని రెడ్‌క్రాసులో పనిచేస్తుండేవారు.

ఈనాడు ప్రసిద్ధవైద్యురాలయి, మదరాసు ఘోషా ఆస్పత్రికి ముఖ్యవైద్యురాలయిన మేనత్త డాక్టరు గ్రేస్ టెంపిట్టనులా ఆమెకు కూడా వైద్యురాలు కా సంకల్పించి జెన్నిఫర్ వైద్యకళాశాలలో చేరింది. డాక్టరు గ్రేస్ వారి భర్త డాక్టరు టెంపిల్టను కలకత్తా యూరోషియనులలో ఉత్తమ కుటుంబీకుడు.

జెన్నిఫర్ వైద్య కళాశాలలో మూడవతరగతి చదువుతూ అందరి బాలికలతో ఆనందంగా మెలుగుతూ, టెన్నిస్ ఆడుతూ, భారతీయ రాజకీయాలను గూర్చి,తన జాతి భవిష్యత్తుగూర్చి, ప్రపంచ రాజకీయాలుగూర్చి, వైద్య విద్య సహాయము - మానవుడు అనే అఖండ విషయాన్ని గూర్చి తన వారితోను, తోటి బాలురతోను చర్చిస్తూ ఉండేది.

జెన్నీ: యూరేషియను జాతి చివరకు గబ్బిలంలా తేలింది. భారతీయులకు ఆ జాతి అంటే గౌరవంలేదు. తమ తక్కువ కులంకన్నా అధ్వాన్నంగా చూస్తారు.

మార్థా: (దూరపుచుట్టం) అవును జెన్నీ! ఇంగ్లీషు వారు మనకీ వారికీ సంబంధమున్నట్టే ఆలోచించరు.

హెన్రీ: (మార్గాభర్త) అవును మార్థీ వాళ్ళ దృష్టిలో మన ఆడవాళ్ళు, వాళ్ళ సైనికులు భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ గాఢపురుషత్వ రాక్షసకామం తీర్చడానికి ఏర్పాటయిన, ఒక వీలయిన, ఫరవాలేని, చక్కని సేప్టివ్వాలని!

జెన్నీ: అందుకు ముందర తయారు మన యూరేషియనుజాతి ఆడముండలేగా! భారతదేశంలో, బర్మాలో, జావాలో, మలయాలో, ఇండోచైనాలో, చైనాలో, అమెరికాలో, ఆఫ్రికాలో మనజాతి ఉద్భవించి ఎక్కడా ఉత్తమస్థితి సంపాదించుకోలేక ఎన్ని నీచత్వాలు అనుభవిస్తోందో!

హెన్రీ: రెండు జాతులు కలుస్తాయి. ఈ జాతి పురుషులు ఆ జాతి స్త్రీలను వాంఛిస్తారు, ప్రేమిస్తారు. కాని నల్లజాతి వాళ్ళలో, రంగుల జాతి వాళ్ళలో పురుషులు తెల్లజాతి పురుషుల్ని ప్రేమించకూడదు. కలియకూడదు.

మార్థా: వాళ్ళ పురుషులు తమ కక్కుర్తులు రంగుల జాతి స్త్రీలతో తీర్చుకొన వచ్చును.

జెన్నీ: అవును మార్టీ! నాకు బాధ వచ్చేది ఎక్కడంటే, తమ పురుషుల పశుత్వంవల్ల దేశదేశాలలోనూ ఎవరికీ అక్కరలేని ఒక సంకరజాతి ఉద్భవిస్తే వారిని గురించి ఆ తెల్లజాతివాళ్ళు ఒక్క పిసరు ఆలోచించి వారికి తగిన మార్గం చూపిస్తేనా?

హెన్రీ: ఇందులో నాకు నచ్చింది ఒక్క ముస్లిం సంఘంవారు, ఏ జాతినయినా తమలో కలుపుకుంటారు. ఏ యింటి మిశ్రమాలయినా ఆ మహాసంఘంలో కలిసిపోతాయి. తెల్ల ముస్లింలున్నారు, బంగారు ముస్లింలున్నారు. నల్ల ముస్లింలున్నారు. చీనా ముస్లింలు, జావా ముస్లింలు, నీగ్రో ముస్లింలు భారతీయులు, ఆర్మీనియినులు వగైరా వగైరా అందరూ ఒక బ్రహ్మాండమైన సంఘం.

మార్థా: అవును హెన్రీప్రియా! కాని మన క్రైస్తవ మహాసంఘంలో హిందువులలో ఉన్నట్లు కులాలు కులాలు!!

ఈలాంటి సంభాషణలు ఆ జాతిలో కాస్త చదువుకున్నవారు ఎప్పుడూ చేసుకుంటూ వుంటారు.

వైద్య కళాశాలకు పెందలకడనే వెళ్ళవలసి వున్నది. కాబట్టి జెన్నిఫరు తెల్లవారగట్లనే లేచి, కొంచెం సేపు ఏవో ఆలోచనలతో పక్కలో దొర్లుతుంటుంది. ఆ సమయంలోనే యౌవనస్నాతయై అప్పుడే వికసించు గులాబి పూవై ఉదయించు ఉషాబాలయైన జెన్నిఫరుకు యౌవనపు గుబాళింపు కాంక్షలు ఉద్భవిస్తాయి. ఒళ్ళు జల్లుమంటుంది.

ఉప్పొంగే వక్షాలను అదుముకొని సంబాళించుకుంటుంది. ఆమె వివశ అవుతుంది. ఎవరెవరో తన్నెరిగి తనతో చనువుగా మెలిగే యువకులను తలపోసుకుంటుంది. వారితో సంపర్కము ఊహించుకుంటుంది. ఆ భావము ఆమెకు తృప్తి ఇవ్వదు. తన్ను గూర్చి విరాళి పొందే కోడెగాళ్ళు జ్ఞప్తికి వస్తారు. తన యూరేషియను జాతివాళ్ళు, తన తరగతి బాలురు, తనతో నాట్యం చేసిన తన దూరపు దగ్గర చుట్టాల; బాలురు, తన్ను దగ్గిరగా తీసుకొనేవాళ్ళు, కాంక్షతో గొంతుకు బిగుసుకుపోగా అస్పష్టస్వరంతో మాటలాడేవారు అందరూ జ్ఞాపకం వస్తారు. ఒళ్ళు వేడెక్కుతుంది. కాని ఏదో ఒక అతిదూరపు అతిదగ్గిర కోర్కె అతి స్వచ్ఛమైన వాంఛ, అవ్యక్తమైన ఆశ తన్ను ఆపుచేస్తుంది.

ఒకసారి గాఢ బాలికావాంఛ తీర్చుకున్న మాత్రాన ఆమే ఏదో యమలోకంలో పడిపోతుందని జెన్నిఫర్ నమ్మదు. కాని, ఒక స్వచ్చమైన జీవితం తన అనుభవానికి అనాఘ్రాతమై రావాలి. తానా జీవితాన్ని పొదివికొనడానికి అనాఘ్రాతమై ఉండాలి. ఈ అతి ఎత్తైన కాంక్షను అనుభవించడానికి ఎదురు చూస్తోంది.

ఆ కాంక్షాదినాల్లో, అతిచదువు దినాల్లో, రోగాలను గూర్చి తెలుసుకొనే దినాల్లో, మనస్తత్వాన్ని గూర్చి విచారణ చేసే దినాల్లో ఇంగ్లండులో లండను మహానగరంలో నివసించే లయొనెల్ దగ్గర నుండి చెల్లెలు జెన్నిఫర్‌కు ఉత్తరం వచ్చింది.

ఇదివరకే అనేక ఉత్తరాలు వచ్చినాయి. కాని ఈ ఉత్తరంలో ఒక ముఖ్య విషయం వ్రాశాడు.

భారతీయ అసోసియేట్ ఛాంబర్సు,

2వ అంతస్తు, 75వ వార్డు స్ట్రీటు సోహో

6 అక్టోబరు, 1934.

ప్రియమైన జెన్నీ!

నా కీ ఉదయం ఒక మహత్తరమైన సన్నివేశం జరిగింది. నా జీవితంలో అది ఎంతో మహత్తరమైన మార్పు తీసుకొని వచ్చేది.

మన ఇంటిపేరున్న ఒక చితికిపోయిన పెద్ద కుటుంబపు అమ్మాయి ఇక్కడ ఒక కంపెనీలో మేనేజింగ్ డైరెక్టరుకు ఆంతరంగిక కార్యదర్శిగా ఉంది. ఆ అమ్మాయికి నాకు ప్రథమ పరిచయం మేము కాపురమున్న మేడలోనే జరిగింది.

ఈ మేడలో రెండవ అంతస్తులో ఆమె చుట్టాలు ఉన్నారు. ఆమె తరచుగా ఇక్కడకు వస్తూ వుంటుంది. ఇప్పటికి మూడు నెలల క్రితం ఆమె నేను, తారసిల్లడం విచిత్రంగానే! ఆమెను నేను ఓ మోటారు బారి నుండి రక్షించాను. అక్కడనుంచి మా స్నేహం వృద్ది పొందింది. మా స్నేహం గాఢమై ప్రేమ పరిణామం పొందింది.

మా మా కుటుంబాల సంగతులు తెలుసుకోడంలో మన పూర్వీకుడయిన మేజరు అన్నగారే ఈ కుటుంబానికీ పూర్వీకుడు.

అతి సంతోషంతో ఆ పూర్వపు చుట్టరికం తలుచుకుంటూ ఎలాగో కాలక్షేపం చేస్తూ గౌరవంగా బ్రతుకుతున్న నా ప్రాణప్రియ ఎలిజబెత్ తల్లితండ్రులకడకు మేము ఇద్దరం వెళ్ళాం.

వాళ్ళు నన్నెంతో గౌరవం చేశారు. కాని నా, ఎలిజబెత్తుల వివాహానికి ఒప్పుకోలేదు. ఎలిజబెత్తు అన్నగారు బాగా విముఖుడయ్యాడు. సంపూర్ణ భారతీయుణ్ణి తన చెల్లెలు చేసుకోడానికి ఒప్పుకుంటాడట గాని, యూరేషియనును చేసుకోడానికి ఒప్పుకోడట. అక్కడనుంచి విజ్జీకి, ఆమె కుటుంబానికీ విడాకులు సంభవించినంతయింది. చివరకు పార్సెన్ (ఒక మతోద్యోగి) అయిన ఆ బాలిక తండ్రే మా వివాహానికి ఒప్పుకున్నాడు.

చెల్లీ! నేనిప్పుడు ఏడవ ఆనంద స్వర్గంలో ఉన్నాను. తండ్రిగారికి, అమ్మగారికి కూడా ఉత్తరాలు రాశాను.

కాబోయే నా మామగారిని ఒప్పించింది, మూర్తి! మూర్తి అంటే ఎవరనుకున్నావు? అంత తక్కువజాతి హిందువుడైనా, అంత పెద్దజాతి యువకుడు ఇంకోడు లేడు. అతడు అమృతం. అతడు పనిలో ఒక పెద్ద డైనమో! ఎప్పుడూ ఆలోచనే! ప్రతి విషయాన్ని గురించీ తర్కించుకుంటాడు. ఆలోచిస్తాడు. అర్ధమై, అవగాహనమై పూర్తిగా అతని మెదడు సొత్తు అయినవరకూ ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడం మానడు. ప్రతిజ్ఞచేత ప్రతిభ సంపాదించుకునే మహాతపస్వి. ఈ దేశంలో ఉన్న విద్యుచ్ఛక్తి కర్మాగారాలకు వేడ్తాడు. నన్ను తనతో లాక్కుపోతాడు. అతడు చదువుతూ నాకు వినిపిస్తాడు, నన్ను చదివిస్తాడు, నా చేత తనతోపాటు లెక్కలన్నీ చేయిస్తాడు.

ఇంక మూర్తి గుణగణాల్ని గురించి నేను వర్ణించలేను. ఎవరో షేక్సుపియరో, బెర్నార్డుషా ఓ రావాలి! అంత నీచస్థితిలో ఉన్న సంఘంలోనుంచి అలాంటి మహోత్తముడు ఎలా వచ్చాడు!

నీ కీ తపస్సుకు కారణం ఏమిటంటే, “మహాత్మాగాంధీ ముఖ్యంగా!” అంటాడు. ‘ఈనాటి కాలం రెండు" అంటాడు.

మూర్తి మా కాబోయే మామగారితో మహాత్మునిలా మాట్లాడాడు. అతని మనస్సు తిప్పినాడు. మూర్తి వేదాంతమే వేరు; గాంధీని గురించి మా యిద్దరకూ కొన్ని నెలలు వాదనలు జరిగాయి.

చేతి పరిశ్రమలు మానవకృషి అట! అవి దివ్యోన్ముఖాలట! యంత్ర పరిశ్రమ రాక్షసమట (సాటానెస్క్యు)! సైతానును మనం లోబరచుకుంటే రాక్షసత్వాన్ని బానిసగా చేసుకున్నట్లు మాత్రమట! సైతానును భగవతోన్ముఖం చేస్తే, సైతాను అప్పుడు తనలోని దేవత్వం తిరిగి పొంది మనలను కూడా దేవతా మానవులుగా మారుస్తాడట!

రష్యా బోల్షివిజము రాక్షసత్వాన్ని బానిసగా చేసుకున్నదట. ఇంగ్లండు అమెరికాలు రాక్షసత్వానికే బానిసలట. రష్యాబోల్షివిజంతో గాంధీతత్వం రంగరిస్తే ప్రపంచ సమస్యలు సిమెంటుదారులు కావుగదా, వజ్రాలదారులవుతాయట.

హిందూ సంఘంలో తామెంత నీచస్థితిలో ఉన్నారో, మనమూ, తెల్లజాతిలో అంతకన్న నీచస్థితిలో ఉన్నామట. ఆ స్థితిని తీసివేసుకునే శక్తి మనలోనే ఉందంటాడు. దానికి ముఖ్య మార్గం మనం సంపూర్ణంగా భారతీయుల మనుకోవాలట. భారతీయులు తమ అభ్యుదయం కోసం, తమ స్వాతంత్ర్యంకోసం ఏఏ మహాసంస్థలు ఉద్భవింప చేసికొని మహా పోరాటం సాగిస్తున్నారో, ఆయా సంస్థలలో మనం కూడా చేరాలట. ఇంతవరకు మనం అలా చేయటం లేదట! చెల్లీ నువ్వీ స్నేహితునితో కలుసుకు మాట్లాడి తీరాలి.

ప్రేమతో

లయొనెల్

ఈ ఉత్తరం చదువుకుంది. తన చిన్నన్న ప్రతి ఉత్తరంలోనూ ఆ బాలకుణ్ణి గురించి వ్రాస్తున్నాడు. ఏమి రకం యువకుడో అతను? అని మాత్రం ప్రశ్నించుకుంటూ ఉంటుంది జెన్నిఫర్.

2

1934 నుంచి 1937 డిశంబరు వరకు అన్నగారు లయొనెల్ ఇంగ్లండు నుంచి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. తనకూ తన ప్రియమూర్తి ఎలిజబెత్‌కు అంతకన్న, అంతకన్న ఎంత పరమాద్భుతమయిన ప్రేమో వృద్ధి అయిందట. తన చదువు వొక మోస్తరట, తన ప్రాణస్నేహితుడు మూర్తి చదువు అఖండ దీప్తితో ప్రజ్వలిస్తోందట!

పరీక్షలు కాగానే అన్నగారు రాసిన ఉత్తరంలో మూర్తి ఆ ఏడు జయమందిన వారందరిలో మొట్టమొదటి వాడుగా వచ్చాడనీ, తాను ఒక్క మొదటి తరగతిలో మాత్రం రాగలిగానని, తనకూ మూర్తికి తాతావారు తమ నగర్ కర్మాగారానికి రమ్మన్నారని, అందుకు మూర్తి ఒప్పుకోలేదనీ, తాను ఒప్పుకున్నాననీ ఉత్తరం రాశాడు.

ఆ ఉత్తరంలో మూర్తి అమెరికా వెడుతున్నాడనీ అక్కడ టెన్నెసీనది ఆనకట్టలు, అందువల్ల విద్యుచ్ఛక్తి ఉద్భవించే విషయాలను గూర్చి నేర్చుకోడానికి వెడుతున్నాడనీ వ్రాశాడు. తాను ఇంగ్లండూ, జర్మనీ, రష్యాలలో విద్యుచ్ఛక్తి విధానాలన్నీ పరీక్షించి నేర్చుకువస్తాడట. ముఖ్యంగా రష్యాలో “నీరునది” ఆనకట్ట, దానివల్ల విద్యుచ్ఛక్తి ఉద్భవించే విధానమూ ఒక సంవత్సరంపాటు నేర్చుకువస్తాడట. అందుకయ్యే ఖర్చు అంతా “తాతా” కంపెనీవారే ఇస్తున్నారు అనీ రాశాడు.

తాను ఎలిజబెత్‌ను వివాహమై, ఆమెతో కూడా రష్యా మొదలయిన దేశాలన్నీ చూస్తాడట.

అన్నగారు రాసిన ఉత్తరాలలో వర్ణింపబడిన ఆ “మూర్తి” ఎవరు చెప్మా అన్న ప్రశ్న జెన్నిఫర్ హృదయంలో ఉద్భవించింది. తన తల్లితో మూర్తిని గూర్చి చర్చించేది. తనకు అన్నగారు రెండు డజన్లు ఫోటోలు పంపించాడు. అందులో మూడు మూర్తీ తాను తీయించుకున్నవి; నాలుగు తన్ను ఒక్కణే మూర్తి వివిధ స్థలాలలో తీసినవి, రెండు అన్నగారు ప్రత్యేకంగా ఒక మంచి కంపెనీలో తీయించుకున్నవి. రెండు మూర్తి ఫోటోలు తాను తీసినవి. తానూ తన కాలేజీ విద్యార్థులూ ఆచార్యులూ అందరూ కలిసి తీయించుకున్నవి రెండు. అన్నగారు అతని ప్రియురాలు కలసి తీయించుకున్నవి మూడు. అతని ప్రియురాలు ఒకటి. ఆమె కుటుంబము బొమ్మ ఒకటి. తక్కినవి ఇతరాలు.

మూర్తి ఫోటో మాత్రం జెన్నిఫర్‌ను కొంచెం ఆకర్షించింది. ఆ అబ్బాయి చరిత్ర విచిత్రమయిందన్న ఆశ్చర్యము, ఈతని సంఘం అంత దుర్భరమయిన స్థితిలో ఉన్నదన్న కరుణ, అంత అధోగతి స్థితిలోనుండి పట్టుదలతో, అద్భుతమైన శక్తితో ఇలా పైకి వస్తున్నాడన్న గొరవమూ ఆమెకు కలిగాయి.

ఆ ఫోటోలన్నిటిబట్టీ యీ అబ్బాయి ఎలా ఉంటాడు అని ఊహించుకునేది. కారునలుపు కాకపోయినా, నలుపే! ముఖం మాత్రం విశాల ఫాలంతో, గుండ్రనితనంలోకి వచ్చే కోలతనంతో, చదరపు గడ్డంతో, స్పష్టమయిన రేఖలతో, శక్తిని సూచించే వంపులతో వీరుని ముఖాన్ని ప్రత్యక్షం చేస్తున్నది.

వైద్య విద్యార్థులకు స్త్రీ పురుష సంబంధాల విషయంలో లేనిపోని పిచ్చిపిచ్చి భావాలు లేవు. రతి అనేది భౌతికమయిన అనుభవం. అందులో ముఖ్యంగా నరముల స్పందన ఎక్కువ ఉంటుంది. ఆ నరముల ద్వారా మెదడుకు ఆనందం కలుగుతుంది. భౌతికమయిన వాంఛలకు నరాల స్పందనవల్ల ఆనందం అనుభవం మెదడుకు కలుగుతుంది.

కోపం కలుగడానికి ఇంకొక మనుష్యుడు ఎదురు ఉండాలి. అలాగే స్త్రీ పురుష సంబంధమయిన వాంఛకు స్త్రీ పురుషులొకరి కొకరు తారసిల్లాలి.

జెన్నిఫర్ కొంచెం పొట్టి, నాలుగడుగుల పది అంగుళాలుంటుంది. ఐనా పొంకం కలిగిన అవయవాలతో బంగారు తీగలా వుంటుంది.

ఆ అమ్మాయి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు చూడాలి ఆమె దేహసౌందర్యం. ఆమె అంగాల పొంకం తీగెలుసాగిన పచ్చ సంపెంగ నికుంజము, పిడికిటకు దొరికె ఆమె నడుము, కటిరేఖలలో నాతిగా విస్తరించి స్నిగ్ధమై స్విన్నమై దంతం చెక్కిన జఘన వక్రతలలో పొంగి నదిలా పాదాలకు ప్రవహించింది. ఆమె వక్షోజద్వయ కలశాలు స్వచ్చరజిత స్వప్నాలు. ఆమె మోము కొద్దిగా కోలనై పైకి వట్రువతిరిగిన తిలపుష్ప నాసికతో, చిరుగులాబీ మొగ్గ జంట వదనంతో, మాలతీ పూలగుత్తి చిబుకంతో, చిరునవ్వుతో పాల్కడలి పొంగులై సుడులుపడి, ఉషారుణ వర్ణచ్ఛవుల ప్రసరించే గండఫలకాలలో శిల్పుల కాశయ ప్రత్యక్షమే ఆ బాలిక.

ఇసుకలో నడుస్తూ సముద్ర వీచికలలోకి చొచ్చుకు వెళ్ళుతూన్న జెన్నిఫర్ కలశాంబోధి తరంగోద్భవ ఘృతాచీ బాల! ఆమె నడక అరభీరాగ కల్పన. ఆమె ఒయారము శృంగార రసావిర్భావము. ఆమె మూర్తి ధ్వన్యాలంకార యుక్త పరమ సౌందర్య కావ్యము.

ఆ బాలికను ఆశించని యువకుడు వైద్య కళాశాలలో మదరాసు నగర పథాలలో ఎవ్వరూ లేరు. తేనె, ద్రాక్ష, సారాయీ వకుళపరీమళమూ రంగరించిన సౌందర్యము ఆమె కంఠస్వరం. భారతీయ స్త్రీ కంఠంలోని కాకలీతనమూ, ఆంగ్ల స్త్రీ కంఠంలోని గంభీరతా రెండూ యమునా గంగా సంగమమయ్యాయి.

ఆ జవ్వని అజంతా గుహలలో తథాగతుని ఎదుట లాస్యమాడు మారదేవ తనయ! ఆయోష, ఎల్లోరా గుహలలో ఇంద్రసభా యుక్త శచీదేవి!

3

జెన్నిఫర్‌కు తన అన్నకు అంత సన్నిహితుడైన మూర్తిని చూడాలన్న వాంఛ కలిగింది. అన్న ఒక ఉత్తరంలో మూర్తికి జెన్నిఫర్ ఛాయాచిత్రం ఒకటి. తన కుటుంబం అంతా తీయించుకున్న ఛాయాచిత్రం ఒకటీ ఇచ్చానని వ్రాసినాడు. జెన్నిఫర్ తన అన్న పిచ్చివాడనుకొంది.

జెన్నీ! మూర్తి నీ ఛాయాచిత్రం చూస్తూ నేను పక్కన ఉన్నానన్న విషయం మరిచిపోయాడు. “ఏమిరా మా చెల్లి బొమ్మలో ఏమి విచిత్రత ఉంది?” అని ప్రశ్నించాను. మూర్తి తెల్లబోయి చిరునవ్వు నవ్వి, “మీ చెల్లి వైద్య కళాశాలలో చదువుతోంది కాదూ లయొనెల్?” అన్నాడు.

“అవును నాయనా! అందంలో మా చెల్లి ఎదుట నిలువగల బాలిక ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచమందు పందెం వేస్తే మా జెన్నీ మిస్ ప్రపంచం అయి తీరుతుంది.”

“నువ్వన్న మాటల్లో అసత్యం ఏమీలేదు. ఛాయా చిత్రమే ఈలా ఉంటే, అసలు ఆ బాలిక-”

“నీ మతి మాయమంత్రం చేస్తుంది.”

"మీ చెల్లెలు.”

“చెప్పూ -”

“మీ చెల్లెల్ని మనం ఇండియాకు వెళ్ళగానే దర్శనం చేసుకోవాలి!”

“ఈలా మా సంభాషణ జరిగింది జెన్నీ!” ఈ ఉత్తరం పదిసారులు చదువుకుంది. తర్వాత చదువులో నిమగ్నురాలయింది.

ఆ రాత్రి ఆ బాలిక కాలేజీనుంచి వచ్చి పుస్తకాల బల్ల ముందర కూర్చుంది. మనస్సు పాఠశాలమీదకు పోదు. ఏదో ఆవేదన! తనకు ఇరవై రెండేళ్ళు జరిగి ఇరవై మూడవ సంవత్సరం వచ్చింది. తాను అందంగా ఉన్నానని ప్రతి మగవాడూ భట్రాజులా పొగడుతాడు. ఈ అందం శరీర శాస్త్రపరంగా చూస్తే ఏముంది? వృక్షశాస్త్ర పరంగా మనం తినే కాయగూరలు ఏమున్నాయి? అయినా అవి సేవిస్తూంటే భోజనం ఎంత ఆనందంగా అనుభవించడం లేదు. జీవితం నిండి జీవితాన్ని అధిగమించిన ఏదో ఒక అనుభూతి మనుష్యులను కదిలించి వేస్తూ ఉంటుంది.

తన జాతి స్థితి ఏమిటి? బ్రిటిషు ప్రభుత్వం ఎంత కాలం ఈ దేశం పరిపాలిస్తూ ఉంటుందో, అంతకాలం పశు శరీర సౌందర్యం కల తనబోటి యువతులకు తెల్లసైనిక మిండగాళ్ళకు కొదువలేదు. ఆ మగ పశువులను ఆకర్షించే ఆడ పశువులుగా తన జాతి స్త్రీలు తయారై తన జాతిని ఎంత నీచగతిలోకి తీసుకువచ్చారు.

అటు ఎల్లమందమూర్తి కులం ఆడవాళ్ళు తనజాతికి తల్లులైతే, ఇంగ్లండునుండి వచ్చిన తెల్ల పశువులు తన జాతికి తండ్రులయ్యారు. ఇదేస్థితి బర్మాలో, మలయాలో, జావాలో, ఇండోచీనాలో, ఆఫ్రికాలో, సర్వదేశాల్లోనూ అటు యూరపుకూ చెందక, ఇటు ఆసియాకు చెందక అతి నీచజాతి ఓటి ఈ ప్రపంచంలో ఉద్భవించడానికి కారణం తనబోటి నీచ స్త్రీలు. ఆమె కంటివెంట అశ్రుబిందువులు జలజలా ప్రవహించినాయి.

ఈ నిర్వేదనానికి కారణం అన్నగారు వ్రాసిన ఉత్తరం! ఎల్లమందమూర్తి భారతీయ హిందువులలో అతి నీచస్థితిలో వున్న ఒక కులానికి చెందిన బాలకుడు. అతడు చదవడానికి ఎలా ఏర్పాటయింది. అతడే చదువుతున్నాడా? అతని ఊరేది? జిల్లా ఏది? అతని చదువు అతన్ని ఇంగ్లండుకు ఏలా తీసుకువెళ్ళింది. అతనికి ధనం ఎవరిస్తున్నారు?

ఈలాంటి సంగతులు తన జాతివారు ఎవ్వరూ ఆలోచించరు. తాము భారతీయులము కామనుకుంటారు. ఆంగ్లేయులు కాలేరని తమవారికే తెలుసును. తాము బానిసలము, అధోగతిలో ఉండవలసిన వారము, అసభ్యమైన మాట లేకుండా మాటలాడలేనివారం, చదువు లేనివారం. రైల్వే ఉద్యోగాలూ, మదరాసు పోలీసు సార్జంటు ఉద్యోగాలు ఇలాంటివి తప్ప తమకు ఇంకో రాజకీయాలు లేవు. ఈ హిందూ దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి, ఎన్ని మతాలున్నాయి. ఆ మతాలేమిటి, భారతదేశపు ఆర్థికస్థితి ఏమిటి? సాంఘిక వ్యవస్థ ఏమిటి? తమ వారికి ఎప్పుడన్నా పట్టిందా?

ఈ 1934 నవంబరు (మహాత్మాగాంధి చేసే మహోత్కృష్ట కార్యక్రమం ఏమన్నా తనకుగాని, తనవాళ్ళకుగాని, తనబోటి తమ జాతివారికిగాని తెలుసునా? తామంతా తెలుసుకుందామని ప్రయత్నం చేశారా?

యూరేషియన్ జాతట? ఏషియో యూరపియనులు అన్న పేరు పెట్టుకోలేదట? అది సిగ్గు, అవమానకరం! తాము వేసుకునే దుస్తులు పాశ్చాత్య దేశాలల్లో పాకీదొడ్లు ఊడ్చే కూలీలన్నా వేసుకోరే! అయినా ఆ దుస్తులు వేసుకొని ఇంగ్లండునుండి పి. అండ్. కో., నౌకమీద అప్పుడే దిగి వచ్చిన ఆంగ్లేయులులా తల ఎత్తి తిరగడం, తలంతా బొప్పెలు కట్టడం!

దేహం యూరోపియనులకున్న నిర్మలతా, స్వచ్ఛతా లేకుండా, తెల్లదంతం రంగుకడ ప్రారంభించి నల్లటికారు రంగు వరకూ ఉన్నది.

జెన్నిఫర్ తల హృదయంపైన వాలిపోయింది. వక్షోజాలు నిట్టూర్పుతో ఊపిరి పీల్చినప్పుడల్లా పైకి ఉబుకుతున్నాయి, దిగిపోతున్నాయి.

తమలో నాయకులు లేరు, తమకు సలహా చెప్పేవారు లేరు. ఎవరు తమతో మానసిక పథాల దూరాలకు పోగలవారు? తమలో డబ్బున్న ఆ స్త్రీలు ఏదో కొంచెం మర్యాదగా బ్రతుకుతారు. కాని వారు కొంచెం చదువు చదువుకోని నర్సులుగా, టైపిష్టులుగా ఇంగ్లీషు షాపులలో అమ్మకపు స్త్రీలుగా చేరుతారు.

ఆమె ఆలోచనలే ఆమెకు భయం కలిగించాయి. ఆమె హృదయంలో భరింపరాని బరువులు చేరాయి.

ఇంగ్లీషులో నెమ్మదిగా తన పియానోమీద ఏదైనా ఓ పాట వాయించుకుంటే, ఆవేదన అణిగిపోవచ్చుననుకొంది. పియానో కడకు వెళ్ళి మీటలు నొక్కింది.

“మనుజుని తలపుల కవధే లేదా?
 మనసుకు బానిసహృదయమె కాదా?
 ఎవరికి వారే ఎరుగని పథముల
 దారి వెదుకుతూ దారిని సాగుతు
 ముందుకు పోవలె ముండ్ల పొదలలో
 గండశిలలలో కర్కశ భూమిలో!
                 మనుజుని.”

4

“జెన్నిఫర్‌లో ఏదో మార్పు వచ్చింది” అని యూరేషియన్ సంఘంలో యువకులు అనేకులు అనుకొనడం ప్రారంభించారు. ఎవరితోనైనా అవసరమైనప్పుడు తప్ప మాట్లాడడం మానివేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచన. తన సంఘం విషయం ఏమి చేయదలచుకొన్నారని, సంఘ నాయకులైన 'కాల్నెల్‌గిడ్నీ' 'హానరబెల్ పెరైరా' 'సర్ ఫెర్నాండెజ్' మొదలయిన వారికి ఉత్తరాలు వ్రాసింది. తన సంఘము హరిజన సంఘంకన్నా ఎక్కువ అధోగతిలో ఉందనీ హరిజన సమస్యతో యూరేషియన్ సమస్య కూడా తీసుకుని యూరేషియన్ల స్థితి ఉత్తమమయ్యే మార్గాలు ఉపదేశించి కాంగ్రెసువారి నిర్మాణ కార్యక్రమంలో భాగం చేయించాలనిన్నీ కోరుతూ జెయిలు నుండి విడుదలైన మహాత్మునికి పెద్ద లేఖ పంపించింది.

మహాత్ముడు అప్పుడే హరిజన సమస్య విషయంలో దేశ పర్యటన ప్రారంభించాడు.

“అమ్మాయీ” నీ ఆవేదన నాకు అర్థమయింది. నీ యూరేషియన్ సంఘము అతి నీచస్థితిలోనే ఉంది. కాని హరిజన సమస్య వేరు. మీ సమస్య వేరు. మీ సంఘం కావాలని అతి నీచస్థితిలోనికి ఉరికింది. మీ నీచస్థితికి మీరే కారకులు. భారతీయ క్రైస్తవులు తమ స్థితిని తామే బాగుచేసుకుంటున్నారు. అలాగే యూరేషియను సంఘమూ తన స్థితిని తానే బాగుచేసుకోవాలి! పార్శీ సంఘమూ చిన్నదే! ఆ సంఘము ఈనాడూ, వెనకా ఎప్పుడూ ఉత్తమస్థితే ఆక్రమించుకొంటున్నది - హరిజన సంఘం అలాంటిది కాదు. ఆ సంఘం ఈనాడు అనుభవించే కడగండ్లు, ఆవేదనలు, అవమానాలు మొదలయిన వానికన్నింటికీ హిందూ సంఘంలోని ఉత్తమ కులాలవారు బాధ్యులు, అందుకని ఆ సమస్యా పరిష్కారం నా అహింసా వ్రతంలో భాగమయింది. నేనూ ఆ ఉత్తమ కులాలకు చెందిన హిందూ మతస్థుడను. కాబట్టి ఇన్ని యుగాలనుండి ఆ ఉత్తమ కులాలవారు చేసిన ఘోర పాపాలకు వారితోపాటూ నేనూ ప్రాయశ్చిత్తం సలుపుకుంటున్నాను. ఆ సంఘాన్ని తక్కిన హిందువులతోపాటు సమం చేయాలని నా దీక్ష!

“నువ్వన్నట్లు ఆ హరిజన స్త్రీలలో ఎంతోమంది మీకు తల్లులే. పాపం ఆ కల్మషరహిత చరిత్రలు తమ దుర్భర స్థితివల్ల మీ సంఘానికి తల్లులయ్యేటట్లు పాపాలు సలిపినారు. అందుకని ఉత్తమ కులాల హైందవులు మీ స్థితికి కొంత కొంత బాధ్యత వహించవలసినదే! మీ పూర్వీకులూ, మీ పూర్వీకుల తండ్రులైన ఆంగ్లేయులూ మొదలయిన పాశ్చాత్యుల మతమే మీ పూర్వీకులు తీసుకున్నారు. ఆ పాశ్చాత్యులు మీకు ఏ అభిమానం చేతనో అనేక చిల్లర సహాయాలు చేస్తున్నారు. ఆ సహాయాలు మీరు పూర్తిగా గ్రహించి.

1. సంపూర్ణంగా చదువుకోవడంవల్లనూ,

2. ఎక్కువ నైతిక ప్రవర్తన అలవరచుకోవడంవల్లనూ,

3. మీలో చాలామంది కాంగ్రెసులో చేరి, అహింసావాదులై దేశసేవ చేయడానికి సిద్ధం కావాలి. “మేము భారతీయులం కాము.” అని అనుకోవడం మానివేయాలి. మీ వాళ్ళు బ్రిటిషు దొరలు భోంచేసే బల్లదగ్గిర పడిన ఆహారపు నలుసులు తినే కుక్కలము - అని అనుకోవడం మానివెయ్యాలి..

ఈ కారణాలవల్లనూ మీ సంఘం ఉన్నతస్థితి పొంది తక్కిన భారతీయ సంఘాలతోపాటు అవుతుంది.”

మహాత్ముడు రాసిన ఉత్తరం ఒక అందమైన పెట్టెకొని అందులో పవిత్రతా భావంతో దాచుకొంది.

కాబట్టి తన యూరేషియను సంఘంలో మదరాసులో 1934 క్రిష్టమస్‌కు జరిగే ఉత్సవాలలో ఆమె పాల్గొనదలచుకోక ఎంతమంది చుట్టాలూ, స్నేహితులు, నాట్యాలకూ, విందులకూ పిలిచినా, ఆ పిలుపు నిరాకరించింది జెన్నిఫర్. ఎం. ఎస్. ఎం. రైల్వే జిల్లా ఇంజనీరుగా ఉన్న యువకుడు, విలియం ట్విన్‌హాo అనే అతడు, జెన్నిఫర్‌ను భార్యగా వాంఛిస్తున్నాడు.

ఎన్నాళ్ళనుంచో ఆ యువకుడు జెన్నిఫర్ వెంట తిరుగుతూ, ఆమెను సుముఖం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

అతడు గుంతకల్లు రైల్వే జిల్లాకు ఇంజనీరు. కేంద్ర స్థానం గుంతకల్లు. అతడు తన స్వంత పెట్టెలో పెద్ద బండిమీద రాయచూరు వరకు, చిన్న బండిమీద హిందూపురం వరకూ, ఇటు కంభం వగైరాదులన్నీ తిరుగుతూ ఉండవచ్చును.

అతడు మదరాసు ఇంజనీరింగు కళాశాలలో చదువుకొనేటప్పుడు, జెన్నిఫరును ఎప్పుడూ కలుసుకొనేవాడు. ఇద్దరూ కలిసి నాట్యం చేసేవారు. ఇద్దరూ కలిసి సినీమాలకు వెళ్ళేవారు. సముద్ర తీరాలకు వెళ్ళేవారు. “విల్లీ” జెన్నిఫర్ అందం చూచి ఆమెకు దాసానుదాసు డయ్యాడు. ఆమె అతడు తన్ను కౌగిలించుకొన్నా ఊరుకొనేది. జుట్టూ, మెడ ముద్దుపెట్టుకోనిచ్చేది. కాని కన్నులు, పెదవులు, బుగ్గలు, గొంతుక, వక్షోజాలను ముద్దు పెట్టుకోనిచ్చేది కాదు. నాట్యం చేసేటప్పుడు, వాహ్యాళిలో నడయాడేటప్పుడు జెన్నీ నడుం చుట్టూ గాఢంగా చేయి పోనిచ్చి తన పక్కకు గట్టిగా అదుముకొనేవాడు.

వాళ్ళ చుట్టాలందరూ జెన్నీ, విల్లీల వివాహం తథ్యం అని అనుకొనేవారు. విల్లీకి జెన్నీ మంచి సంబంధం, జెన్నీకి విల్లీ తగిన వరుడూ అని పెద్దలలో స్త్రీలూ, పురుషులూ ముచ్చటపడేవారు. తండ్రి మాత్రం “జెన్నీ ఇంకా చిన్న పిల్ల” అనుకుంటూ వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోదలుచుకోకుంటే, అతడు ఇంజనీరు పరీక్ష పూర్తి చేసేంత వరకూ పెళ్ళిమాట తలపెట్టవద్దు, అని ఆజ్ఞ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు. కాని ఎన్నాళ్ళు ఎదురు చూచినా, ఆ పెద్దలకెవ్వరికీ ఈ శుభ వర్తమానం తెలిసింది కాదు.

విలియమ్సు బి.యి.లో విజయం పొందాడు. తన పెద్దల ప్రాపకంవల్ల ఒక ఏడాది ఆ రైలు కంపెనీ ముఖ్య ఇంజనీయరుగా పనిచేసి ఇప్పుడు జిల్లా ఇంజనీయరయ్యాడు. ఇప్పుడాతనికి ఇరవై అయిదేళ్ళు నిండి ఆరవ ఏడు జరుగుతున్నది.

జెన్నిఫర్ వైద్యకళాశాలలో ప్రవేశించిన కొత్తలో అతణ్ణి గాఢంగా తన పెదవులను ముద్దుపెట్టుకొన నిచ్చింది! బంగారు బంతులులా ఉన్న ఆమె హృదయ కలశాలను అతడు తన హృదయానికి అదిమివేశాడు.

“జెన్నీ, మన వివాహం మాట ఏమిచేశావు? నువ్వు దేవకన్యవు. నువ్వు నడచిన పథంలో నేను నడవడానికన్నా అర్హుణ్ణికాను.అయినా ఈ భక్తుణ్ణి త్వరలో అనుగ్రహించవా?” అని విల్లీ గాఢమయిన మత్తుమాటలతో ఆమె చెవి ముద్దుపెట్టుకుంటూ అడిగాడు.

“విల్లీ నేను వైద్య కళాశాలలో చేరినానుకదా?”

“అయితే ఏమి, మన పెళ్ళి పూర్తి అయినా నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవచ్చును. నా చదువూ ఇంకా పూర్తి కాలేదుకదా?”

“అందుకనే ఏ విషయమూ నీ చదువూ, నా చదువు పూర్తి అయిన వెనుక మాట్లాడుకొందాం.”

“ఈలోగా పెళ్ళి చేసుకుందాము అని నిశ్చయించుకుందాము.” “ఆ విషయం ఇప్పుడప్పుడే నిశ్చయం చేసుకోవద్దు విల్లీ!”

“అదేమిటి?” అతని ఆశ్చర్యానికి అంతులేదు. అతని మోము వైవర్ణ్య మొందింది.

“కంగారుపడకు విల్లీ!”

“నువ్వు నన్ను ప్రేమించటం లేదా?”

“ఇంకా నేనేమి నిశ్చయానికి రాలేదు?”

“అయితే-?”

“అయితే ఎల్లా ముద్దు పెట్టుకోనిచ్చావూ?” అని ప్రశ్న! అంతేనా? ఈ ఇరవైయవ శతాబ్దంలో ముద్దులకు స్నేహార్ద్రత తప్ప ఇంకో అర్థంలేదు. అందుకనేగా ఇంతవరకు నిన్ను నా పెదవులు ముట్టనివ్వలేదు: నువ్వు ప్రస్తుతం నాకు చాలా దగ్గిర స్నేహితుడవు. ఇంక కొంచెం అయితే నా పురుషుడవే అవుతావు!”

“ఇంతేనా నీ భావం. నాకు ఆశలేనట్లే! ఎందుకు నా బ్రతుకు! నేను నీకు ఆటవస్తువును అయ్యానా జెన్నిఫర్?”

తన్ను “జెన్నీ” అని పిలవకుండా “జెన్నిఫర్” అని పిలవడం ఆమెకు అతని హృదయవేదనా, అతనిలో ఉద్భవించిన కోపమూ అర్ధమైంది.

“నామీద కోపం వచ్చిందా విల్లీ?”

“నీమీద కోపం ఎందుకూ, నామీదే నాకు కోపం!”

అతడు అతి విచారంతో వెళ్ళిపోయాడు. ఆరునెలల వరకు అతడు మళ్ళీ జెన్నిఫర్‌ను కలుసుకోలేకపోయాడు. 1935వ సంవత్సరం జూన్ నెలలో ప్రత్యేకం ఒక నెలరోజుల పాటు సెలవు పుచ్చుకుని విల్లీ మదరాసు వచ్చాడు. ఆ నెల రోజులూ అతను జెన్నీ మనస్సు కరిగించేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. కాని జెన్నీ తనచుట్టూ నిర్మించుకొన్న కోట మొదటి గుమ్మం అన్నా అతడు దాటలేక పోయాడు. ఈ మార్పుకు కారణం గాంధీజీ ఉత్తరం.

జెన్నిఫర్ అతిమర్యాద భావము ప్రవహించింది. “ఒహో!” అంటే “ఓహో” అని మారు పలికింది. చిరునవ్వు నవ్వింది. “చాలా విచారంగా ఉంది. నీతో వాహ్యాళికి రాలే” నంది, “నాకిప్పుడు సినిమాలకు వ్యవధిలేదు” అంది. “ఈ ఏటి పరీక్షలు గడ్డుపరీక్ష”లంది.

వారం రోజులు ప్రయత్నించి, నిష్ఫలుడై నిరాశ పొంది, నిట్టూర్చి విల్లీ వెళ్ళి; జెన్నిఫర్‌కన్న బాగోగులా, ప్రపంచస్థితి, జీవితంలోని నిజానిజాలు తెలుసుకొన్న “మాడలైను” కన్యను పెళ్ళి చేసుకొన్నాడు. పెళ్ళికి జెన్నిఫర్‌ను పిలిచారు. జెన్నిఫర్ అప్సరసలా వేషం వేసుకొని పెళ్ళికి వెళ్ళింది. భార్యాభర్తలకు మంచి వెలగల వెండి భోజనపు గిన్నెల సెట్టు బహుమతి ఇచ్చింది. మాడలైను అందమైనదే!

అయినా జెన్నిఫర్‌నూ మాడలైనునూ పోల్చుకుంటూ స్వర్గంలో నందనవనాన్ని పోగొట్టుకొని మదరాసులో తేనాంపేట తోటను సంపాదించుకొన్నాననుకొని ఒక నిట్టూర్పు వదలి, ఇంతే చాలుననుకొని, విల్లీ మాడ్‌ను తమ మధురమాసాన్ని గడపడానికి నీలగిరి కొండలకు తేల్చుకొని పోయాడు. 

5

జెన్నీ జీవితంలో ఇంకో అంకం కూడా గడచిపోయింది. 1936 సంవత్సరాంతానికి ఆమె వైద్యవిద్య పూర్తి అయింది. తర్వాత వచ్చే ప్రసూతి వైద్యాలయ వైద్యపు తయారు పరీక్షా పూర్తి అయింది.

జెన్నిఫర్ మదరాసు ప్రసూతి వైద్యాలయంలో గౌరవ వైద్యురాలిగా చేరింది.

కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి.

జెన్నిఫరు అన్నగారు తన భార్యతో 1938 వ సంవత్సరం మధ్యలో భారతదేశానికి వచ్చి దక్షిణ భారత రైల్వేలో ఇంజనీరుగా ప్రవేశించాడు. లయొనెల్ తిన్నగా భార్యతో మదరాసే వచ్చాడు.

అన్నా చెల్లెళ్ల ఆనందం వర్ణనాతీతమైంది. అన్నగారి ఆనందంకన్న చెల్లెలు ఆనందం ఆకాశానికే ఎగసింది.

అన్నను జెన్నిఫర్ గాఢంగా కౌగలించుకొని, “ఎన్నాళ్ళకు చూచాను అన్నా నిన్ను? నువ్వు ఎంత తెల్లపడ్డావు. అచ్చంగా ఇంగ్లీషువానిలాగే వున్నావు” అన్నది.

అన్నగారి భార్య అసలు ఇంగ్లీషు బాలిక. ఆమెను రాగానే కౌగలించుకొని ముద్దుపెట్టుకొంది. ఎలిజబెత్తు ఎంతో సాధారణంగా బ్రతికిన, ఇంగ్లీషు మధ్య వర్గపు కుటుంబానికి చెందిన పిల్ల. హైస్కూలు విద్య పూర్తియై తండ్రికే కార్యదర్శిగా ఉండేది. ధనం వాంఛించింది. ఏ బెంట్లీ కారులోనో కొన్ని వేల కాసులు ఖరీదుగల దుస్తులు వేసుకొని లండను బజారులో తిరుగుతూ ప్రతి పెద్దషాపులోను అందమైనవి, అతి విలువ కలిగినవి వస్తువులు కొనుక్కుంటూ, తనతో అందాలూ, పురుషత్వమూ వెదజల్లే పురుషుడు అపోలో దేవునిలా కూడా రాగా గులాబి పుష్పపుటాలలాంటి తన చెవికమ్మలు, గులాబిపువ్వులలాంటి తన బుగ్గలు, గులాబి మొగ్గలవంటి తన పెదవులూ ముద్దుబెడుతూ తన్ను గాఢంగా అదిమివేస్తూ, వెన్నెలలా తెల్లనై, స్నిగ్ధాలైన పొంకాలైన తన వక్షోజాలు నలిపివేసే యువకుడు, తన్ను కంగారు పెడుతూ ఉండగా తిరగాలని ఆశించేది, కలలు కనేది. ఆ ఎలిజబెత్తును ఒకనాడు లండనులో లయొనెల్ కారు ప్రమాదంనుండి రక్షించాడు.

ఆ నాటినుండి ఎలిజబెత్ జీవితం మారిపోయింది. భావాలు మారిపోయాయి. స్వప్నాలూ మారిపోయాయి. ఏది చేయకూడని పనో అదే చేసితీరడంలో ఉన్న ఆనందం, రైలు పట్టాలతనంలో లేదు. స్వచ్చమైన ఇంగ్లీషువారు భారతీయుల్ని పెళ్ళిచేసుకోవడం తప్పు. అందుకని ఎలిజబెత్తుకు ఆ పనే చేయాలన్న ఉద్రిక్త భావం కలిగింది. ఆ భావాలకు తగినట్లు తాను నిజంగా లయొనెల్‌ను ప్రేమిస్తున్నది. ఆ విధంగా ఈ వివాహం సుఖాంతంగా పరిణమించింది.

అన్నగారు భార్యతో ఉద్యోగంలో చేరినదాకా, “కానొమారా” హోటలులో మకాముపెట్టి ఉద్యోగంలో చేరగానే తిరుచునాపల్లి పోయి చార్జి పుచ్చుకున్నాడు. అక్కడ లయొనెల్‌కు రైల్వేవారి బంగళా నివాసానికి ఉన్నది. కావలసినంత మంది నౌకర్లు, చాకర్లు; ఎలిజబెత్‌కు ఆనందంగానే ఉంది. లయొనెల్ తిరుచునాపల్లి పోయి చార్జి పుచ్చుకోక మునుపు, ప్రతిరోజూ జెన్నీ అన్నగారిని కలుసుకొనేది. లయొనెల్ దంపతులు జెన్నీ ఇంటికి వచ్చేవారు - లేదా జెన్నీ కానొమేరాకు పోయేది. లయనెల్ వైద్య కళాశాలలో జెన్నీని కలుసుకొనేవాడు.

ఈలా కలుసుకొన్నప్పుడెల్లా “ఎల్లమందమూర్తి”ని గురించి సంభాషణలు వచ్చేవి.

“జెన్నీ! మూర్తి హృదయం చాలా విచిత్రమయింది. ఈ దేశంలో హిందూ సంఘంలో అతి నీచస్థితిలో ఉన్న కులాలల్లో ఒకదానిలో ఉద్భవించాడతడు!”

“అతడు చదువుకోడం ఎలా సంభవించింది?”

“అది విచిత్ర సంఘటన! భగవంతుడుంటే - ఉన్నాడని నాకు పూర్తి నమ్మకం కుదిరింది. జెన్నీ - అతడే మూర్తిని చదువుదారిలో పెట్టి ఉండాలి. ఇంక విద్యాసోపానాలు ఎక్కడం ప్రారంభించాడు.”

“అతను చదువుకి ఇంగ్లండు రావడం ఏలా సంభవించింది?”

“అలాంటి వారికైనా వస్తాయి అవకాశాలు లేదూ, లక్షాధికారులకు వస్తాయి.”

“అతడు ఇంగ్లండులో ఎలా ఉండేవాడు?”

“ఇద్దరం ఒకేసారి లండనులోని ఇంజనీరింగు కళాశాలలో చేరినాము. ఇంకేం కావాలి? ఇద్దరం తారసిల్లాము. అతడు నీటిని వదలిన చేపలా ఉన్నాడు. ఎల్లా ప్రయాణం చేసి వచ్చాడో ఏమో కాని, ఉత్సవంలో తప్పిపోయిన బాలకునిలా కంగారుపడుతూ అప్పుడే చేరి ఆఫీసు గుమాస్తాల గది ముందున్న ప్రాంగణంలో తెల్లబోతూ నిలుచున్నాడు. నేను చేయవలసిన తంతంతా నెరవేర్చి బయటకు వచ్చాను. అతడు కనబడ్డాడు. విశిష్టమయిన అతని మోము చూచి జాలి వేసింది. అతని దగ్గరకు వెళ్ళి, “ఏమండి! మీరు ఫలానా ఓడలో మొదటి తరగతిలో ప్రయాణం చేస్తున్న వారిలో వొకరు కాదా?” అని ప్రశ్నించాను.

“అవును... కాదు... ఏమిటి... ఏమిటంటే? ఓడ... అ... దే కాని మొదటి తరగతిలో కాదు, నేను ప్రయాణం చేసింది రెండవ తరగతిలోనండీ!” అన్నాడు.

“అదే అయి ఉంటుంది; నాకు జ్ఞాపకం లేదు,” అన్నాను.

“నా పేరు మూర్తి. మాది పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం గ్రామంవద్ద జక్కరం గ్రామం.

“ఇక్కడకు వచ్చారేం?”

“ఈ ఇంజనీరింగు కళాశాలలో చేరాలని వచ్చాను!”

“ఏమిటీ?”

“అవునండీ.”

“చాలా సంతోషం. మాది మదరాసు. నా పేరు లయొనెల్. నేను ఇప్పుడే చేరనాను, ఈ కళాశాలలో!”

“మీ... మీ... ది... ఈ దేశం మీ - అంటే మీరు ఈ దేశ నివాసులనుకున్నాను ”

అలా అనుకోకండి. నేనూ మీ దేశం వాణ్ణి!”

అక్కడనుండి నాకూ మూర్తికి స్నేహం ప్రారంభం అయింది. “లయెనెల్! మూర్తీ, నువ్వూ ఈ దేశంలో ఇంజనీరింగు కళాశాలలో చదువుతూ వుంటే స్నేహం చేసి ఉందువా?”

“ఏమో చెప్పలేను! దేశం వదలి పరదేశాలకు వెడితే ఏలాంటి వాడైనా మనదేశం వారితో ఎక్కువ సన్నిహిత సంబంధం కలుగుతుంది గదా జెన్నీ!”

“అవునులే; అయితే మూర్తి అక్కడ ఎలా ఉండేవాడు?”

“ఎప్పుడూ ఆలోచన! తన సంఘం అంత నికృష్ట స్థితిలో ఉండడానికి తామే కారణం అనీ, ఏనాటికైనా తామే పెద్దకులాలవారి ముక్కులు గుద్ది వారితో సమత్వం సంపాదించుకోవాలని వాదించేవాడు.”

“అంతేకాని, పైకులాలవారి వైద్య ప్రాబల్యంవల్ల తమకా హీనస్థితి వచ్చిందని వాదించేవాడు కాదా?”

“జెన్నీ, వాళ్ళ కులం వాళ్ళ స్థితి అతను వర్ణిస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది.”

“అవును లయొనెల్! మనదేశంలో బీదవాళ్ళ స్థితి భరించరానిదే!”

“మన దేశం అంటావు. ఏ దేశమయినా అంతే! ఒక్క రష్యాలో తప్ప తక్కిన అన్ని దేశాలలోను బీదవాళ్ళ స్థితి అంతే!”

“కాని ఇతర దేశాలలో బీదవాళ్ళు భాగ్యవంతులు కావచ్చును. ఈ దేశంలో హిందూమతంలో కొన్ని కులాల వారు ఎప్పటికీ పైకి వెళ్ళడానికి వీళ్ళు లేనేలేవు.”

జెన్నీ ఆలోచనా పరురాలయినది. మూర్తి! మూర్తి!! ఏ పూర్వానుబంధమో ఎవరికి తెలుస్తుంది? మూర్తి విషయం అంతా కనుక్కుని "తెలుసుకోవాలని బుద్ది కలగడమేమిటి?


★ ★ ★