Jump to content

ధనుర్విద్యావిలాసము (22-23పుటలు)

వికీసోర్స్ నుండి
వ.

మహారాజకులశిఖామణీ! చిత్తగింపుమా! యట్టి జగదేకధనుర్ధరుండగు
రఘుకులతిలకుఁడు స్వప్నంబున సాక్షాత్కరించుట నరిష్టపరిహారం
బును, నితోధికసామ్రాజ్యలక్ష్మీవిభవాతిశయంబును గలుగు.
వెండియు నమ్మహాత్ముండు పనిచినకైవడి పద్యకావ్యంబుగా
“ధనుర్విద్యావిలాసంబు” సంఘటించి యద్దేవునకు సమర్పణంబు
గావింపుము. యుష్మద్ధనుర్విద్యాపరిశ్రమంబునకు నిది ఫలంబుగా
మా మనంబునఁ దోచుచున్నయది యనినం బృహష్టాంతరంగుం
డగుచు నజ్జనపాలతిలకుండు.

77


మ.

ననురామానుజపాదపద్మయుగళీనవ్యావ్యయధ్యానపా
వనహృద్భాగవతావతంసపదసేవాసక్తచిత్తున్ మరు
త్తనయారాధనలబ్ధచారుకవితాధారున్ సదారూఢభా
వను నాస్థానకవిన్ నిజాశ్రితునిఁ బిల్వబంచి పల్కెన్ దయన్.

78


క.

శ్రీరామభద్రుపనుపున
ధారాళంబై తనర్చు ధనురాగమ మి
ద్ధారుణిఁ గావ్య మొనర్పఁగ
నారంభించితి భవత్సహాయము కలిమిన్.

79


వ.

వెండియుఁ గోదండదీక్షాగురుండగు రఘుపతి కటాక్షంబునం జేసి
సద్గురులాభంబున నిద్ధనుశ్శాస్త్రంబు మాకు నధీతంబయ్యె, తల్లక్ష
ణంబులు శాస్త్రసమ్మతంబులుగా నుపన్యసించెద, నీవను దత్తత్ప్ర
కారంబు లధికరించి గద్యపద్యాత్మకంబుగాఁ గావ్యంబు రచియింపు;
మక్కావ్యంబు మత్కులదైవంబగు నీవని కోదండరామునకు నంకి
తంబు గావించి యద్దేవునికరుణాకటాక్షవీక్షణంబుల నాయురారో
గ్యపుత్రపౌత్రాతిశయసంపత్పరంపరాభ్యుదయంబులం గృతార్థుం
డ నయ్యెద వని పలికి మఱియును.

80


క.

పాత్రుఁడవై మైత్రేయస
గోత్రుఁడవై నారసింహ గురువర్యునకున్
బుత్రుఁడవై వెలయుదు వి
ద్ధాత్రిన్ మాపనుపు సేయఁదగుఁ గృష్ణకవీ.

81


క.

అని యాన తియ్య నేఁ జ
య్యన జనితామాదరసమయాంతఃకరణం
బున నట్లకాక యని ప
ల్కిన విభుఁ డానందకందళితహృదయుండై.

82


వ.

తాంబూలజాంబూనదాంబరాభరణంబుల నన్ను బహుమానితుం
గావించినం గృతార్థుండనై యిద్ధనుర్విద్యావిలాసంబునకుం గృతి
పతియగు రఘుపతి గుణకీర్తనంబు గావించెద.

83


సీ.

ఏదయాపరమూర్తి యింద్రాదు లర్థింప
        నర్కాన్వయంబున నవతరించె
నేదేవదేవుండు వైదేహిఁ బెండ్లియై
        పరశురామునిఁ బోర భంగపరచె,
నేవీరవర్యుండు రావణాదులఁ ద్రుంచి
        రహి నయోధ్యానగరంబు సేరె,
నేమహాభాగుండు భామినీసహితుఁడై
        పట్టాభిషేకవైభవము గాంచె,


తే.

నాఘనుఁ డెసంగు మందారహారహీర
గాంగడిండీరకర్పూరగంధసార
రాజధరరాజతాచలరాజభుజగ
రాజసితకీర్తి కోదండరామమూర్తి.

84


శా.

ఆరామప్రభుఁ డీవనీపురమునం దర్చాస్వరూపంబునన్
శ్రీరాజిల్లగ జానకీసహితుఁడై కృష్ణానదీతీరమం
దారూఢిన్ విలసిల్లుచుం దిరుపతి క్ష్మాధీశ్వరుండున్ మదిన్
గోరం గోరిక లిచ్చుచుం గనఁదగున్ గోదండరామాకృతిన్.

85